" టంగ్......టంగ్..... సెంటర్ లో పాపిడీల బండి వాడు గంట వాయిస్తూ...కస్టమర్ ల కోసం చూస్తున్నాడు. నాకు అక్కడే వేచి చూడ వలసిన పని వుంది కాబట్టి పైగా వేరే పని కూడా లేదు కాబట్టి ఆ బండి వంక మరో సారి చూసాను. ఎవరో కస్టమర్ బండి దగ్గర బేరమాడు తున్నాడు. అప్పుడు గమనించాను ఆ చిన్న ప్రాణిని....బండి వాడి కొడుకే అయ్యుంటాడు. ఆ కస్టమర్ ముఖంలోకి తండ్రి ముఖం లోకి మార్చి మార్చి చూస్తున్నాడు. ఆ కస్టమర్ కొంటాడా ...లేదా అనే ఆదుర్దా..ఆ ముఖంలో కనబడుతోంది . ఆ కస్టమర్ మరీ గీచి గీచి బెరమాడుతున్నట్లున్నాడు. ఈ కుర్రాడుకూడా వాళ్ళ నాన్న మాటలకు సపోర్ట్ ఇవ్వడానికి హడావుడి పడిపోతున్నాడు. మొత్తానికి బేరం కుదిరింది. వాళ్ళనాన్న పాపిడీ తూచేసరికి పేపర్ చింపి పాక్ చేయడానికి రెడీ గా ఉన్నాడు. ముఖంలో తృప్తి తాలూకు చాయలు ...నాకుకూడా ఎందుకో తృప్తి అనిపించింది....
ఇంకొకటి చూద్దాం....
పూరి - అహ్మదాబాద్ ట్రైన్ ఖుర్దా రోడ్ స్టేషన్ లో ఆగి ఉంది. అక్కడ ఆ బండి ఎక్కువ టైం ఆగుతుంది. నా సీట్ ఎదురుగాఎవరో..ఒరియా దంపతులు మద్య లో వాళ్ళ అబ్బాయి అనుకుంటా.....కూర్చున్నారు.....ఆ తల్లి కొడుకు తల నిమురుతూ ఏదో చెబుతోంది. ఆ ప్రాంతం నుండి గుజరాత్ పని చేయడానికి చాలా మంది వెళ్తూ వుంటారు...ఆ రోజు ఆకుర్రాడి ముఖం లోకి చూస్తూ ఉండిపోయ్యాను .....బహుశా పండ్రెండు లేదా ఇంకొక్క సంవత్సరం అటూ ఇటూ గా ఉంటాడు. బలవంతాన కళ్ళనీళ్ళు ఆపుకుంటున్నాడని సులువుగా అర్ధం అయిపోతుంది. తల్లి చెబుతున్న దానికల్లా తల ఊపుతున్నాడు. ఆ తల్లి తల నిమరడం ఆపడం లేదు. ఒక్క సారి అమ్మ వొళ్లోకి తల ఆనించాడు. ట్రైన్ విజిల్ వేసింది. ఎవరో బంధువు బహుశా దగ్గరి వాడే అయ్యుంటాడు. బండ్లోకి వచ్చి ఆ అబ్బాయిని చేయి పట్టుకుని నెమ్మదిగా తల్లినుండివిడదీశాడు. ఆ అబ్బాయి అమ్మ ముఖం లోకే చూస్తూ బండి దిగాడు. కిటికీ దగ్గర ఆగాడు. బండి బయలు దేరింది. బండి కనుమరుగయ్యేంత వరకు చేయి ఊపుతూనే వున్నాడు. ఎక్కడికో పనికి వెళ్తూ పిల్లలని చదువుల నిమిత్తం స్వంత ఊళ్లలో బంధువుల దగ్గర వదిలి వెళ్ళడంలో వున్న బాధ ఆనాటి దృశ్యం నాకెప్పుడూ గుర్తు తెస్తూ వుంటుంది. కుటుంబం ఆంతా ఒక చోట కలసి వుండగలగడమే ఆ నిరుపేదలకు పెద్ద లగ్జరీ.
ఇంకొకటి కూడా చూద్దాం ….
తండ్రి వేరే చోట ,కొడుకు వేరే చోట పని చేస్తుంటారు . కష్టజీవులు …రెక్కాడితే గానీ డొక్కాడని వాళ్ళు…..మధ్యాహ్నం అవుతుంది …..కడుపు నక నక లాడుతుంది ….ఇద్దరూ కలసికుంటారు ….ఏదో కాంప్లెక్స్ లో ఏ మెట్ల కిందనో ఇంత చోటు చూసుకొని భోజనం కేరిఎర్ లు ఆత్రుతగా విప్పుతారు . కొడుకు వెళ్లి తాగడానికి ఏ వాచ్ మాన్ నో బ్రతిమాలి కొంచెం నీళ్ళు సంపాదిస్తాడు . ఇదంతా ఊహా జనితం కాదు …నేనొక కాంప్లెక్స్ లో చాలా సార్లు చూడడం జరిగింది . ఆ అబ్బాయి భోజనం చేసే పద్దతి చూస్తుంటే ముచ్చట వేసేది . ఎంత ఆత్రుతగా ఇష్టంగా తినేవాడంటే..మా ఇళ్ళల్లో చాలా పిల్లలు కోడి కెలికి నట్లు తిని వదిలేయడం గుర్తుకు వస్తుంది . తిన్న తరువాత మొత్తం గిన్నెలన్నీ పక్కనే ఉన్న కుళాయి దగ్గరకు వెళ్లి శుభ్రంగా కడిగేస్తాడు . సంచిలో సర్ది తండ్రికి ఇచ్చేస్తాడు . తండ్రి సైకిల్ ఎక్కిన తరువాత మరలా పని లోకి దిగిపోతాడు . …
ఇలా చిన్న వయసులోనే కష్టపడుతూ బాధ్యతలను పంచుకొనే వాడే అన్ని స్థాయిల లోనూ ఆ పని చేస్తాడని నేననుకుంటాను .కానీ వారిలో వుండే ఆ నైజాన్ని కూడా స్వార్ధపరులు సమాజం లో తెలివిగా ఎలా వాడుకుంటారో ఇదేపేజీ లో తరువాత చర్చిస్తాను.
మనం వేరే కోణం చూద్దాం …..
ఒక కార్పోరేట్ కాలేజీ కి వెళ్ళండి ….అది ఇంటర్మీడియట్ కావొచ్చు ….లేదా …..ఇంజనీరింగ్ కాలేజీ అయినా కావొచ్చు . మొదట కార్పోరేట్ ఇంటర్మీడియట్ కాలేజీ లు చూద్దాం . అందమైన ఎలివేషన్ ఉన్న బిల్డింగ్స్ .చక్కటి రిసెప్షన్ హాల్ . చాలా వరకూ ఎయిర్ కండిషన్ అయి వుంటాయి . రిసీవింగ్ …..అబ్బో …… అక్కడ చదివిన వాళ్ళు ఎవడైనా ఎప్పుడైనా ఒక్క సారైనా టెస్ట్ ట్యూబ్ పట్టు కున్నాడేమో అడగండి . కనీసం ఎవడైనా ప్లే గ్రౌండ్ (కాలేజీ కి సంబందించినది ) లోకి అడుగు పెట్టారేమో …అడగండి…అన్నిటికీ ఒకటే సమాధానం …అది నేను చెప్పనవసరం లేదు .ఇక ఇంట్లో ఎలా ఉంటుందంటే ….” చూడు బాబూ …..వీధి చివర కూరగాయల బండి వాడి దగ్గర ఫ్రెష్ ఆకు కూరలు ఏవైనా తెచ్చిపెడుదూ…” అని తల్లిని అడగ్గానే ఎగ్గొట్టటానికి వంద వంకలు రెడీ గా వుంటాయి . ఒక వేళ క్రికెట్ మ్యాచ్ వస్తే మాత్రం మొత్తం చూసేసి …లేట్ గా లేచి తల్లిని వీళ్ళు హడావుడి పెట్టె తీరు చూడండి. అంటేవీడి ఆనందం కోసం లేట్ గా లేచి అందుకు కోల్పోయిన సమయాన్ని తల్లి నుండి కొట్టేస్తున్నాదన్న మాట......మనిషి లోస్వార్ధం తాలూకు బీజాలు పడేది సరిగ్గా ఇక్కడే....అదే సమిస్తి వ్యవస్థ తాలూకు ఆలోచనలు వుంటే వాడు తన ఆనందంకోసం అమ్మ మీద అదనపు భారాన్ని మోపడు.ఇలా పెరిగిన వాళ్ళు భవిష్యత్తులో..ఐ.ఐ.టీ లు ఐ.ఐ.ఎం లో చదవొచ్చు కానీ వాళ్ళు వాళ్ళకే తప్ప కుటుంబానికీ ..సమాజానికీ ఏ మాత్రం ఉపయోగ పడరన్న విషయం ఎంత మందికితెలుసన్నది మీ ఊహకే వదిలేస్తాను. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గురించి ఇప్పుడున్న పిల్లలకు ఏ అవగాహనాఉండదు కాబట్టి సమిష్టి తత్త్వం స్వతసిద్దంగా రాదు. కానీ మనం అలవాటు చేయాలి. ఇది మన అవసరమే...
సరే మనం ఇక పెద్ద కుర్రాళ్ళ దగ్గరకు వద్దాం....
నేను ఇంజనీరింగ్ డిప్లొమా చేసేటప్పుడు ఒక రోజు అనుకోకుండా గోడ మీద ఒక స్లోగన్ చూసాను. "ఉద్యోగం అయినా చూపండి లేకుంటే జైలు లో అయినా పెట్టండి " అని ..అదే విషయం మీద ఒక తారీఖున ఊరేగింపు ఉన్నది ...పాల్గొని జయప్రదం చేయండి...అని క్రింద రాసి ఉంది. నేను నలుగురు స్నేహితులతో కలసి ఆ ఊరేగింపు లో పాల్గానడానికి వెళ్తే మేము కాకుండా ఇంకొక ఇరవై మంది దాకా మాత్రమె ఉన్నారు. మమ్మల్ని రోడ్ మీద ఎదురైన మా క్లాసు మేట్స్ పిచ్చోళ్ళను చూసినట్లు చూసారు కానీ మేము పెద్దగా ఫీలవ్వలేదు. అది ఆరంభంగా తరువాత మేము ఆ దారిలో ఎదిగిన చరిత్ర వేరొక చోట రాస్తాను కానీ ఇక్కడ నేను చెప్పదలచుకున్న విషయం ఏమిటంటే ఆనాడు నిరుద్యోగ భూతం సమాజాన్ని పట్టి పీడిస్తోంది. నేను కూడా అప్పటికైతే కాబోయే పీడితుడనే. నా అవసరం నన్ను ఒక ఉద్యమం వైపు లాక్కొని వెళ్ళింది. ఒక సారి పోరాడడం అలవాటయ్యింది కాబట్టి జీవితంలో విశ్వాసంతో ముందుకు పోగాలిగాను. ఇప్పుడు మనకు సమస్యలు లేవా....? బోలెడన్ని....మరి యువత ఏం చేస్తోంది..? ఆనందంగా సమయం వృధా చేయకుండా సెల్ ఫోన్ లో చాటింగ్ లు చేసుకుంటున్నారు. క్రికెట్ చూస్తున్నారు. అసలు వీళ్ళకేం కావాలో వీళ్ళకు తెలుస్తుందా....ఈ సందర్భం లోనే మా ఫ్లాట్ కు వినాయక చవితి చందాకు వచ్చిన పది మంది కుర్రాళ్ళతో నా సంభాషణ ఇక్కడ రాస్తున్నాను. "మీరంతా ఏం చేస్తుంటారు?"
" అందరం స్టూడెంట్స్ మే సర్ "
" వసూలు చేసిన చందాతో ఏం చేస్తారు?"
" అందమైన టెంట్ వేసి వినాయకుడిని నిలబెడతాం...ప్రోగ్రాం లు పెడతాం '
"ఏం ప్రోగ్రాం లు "
"లేటెస్ట్ సినిమాలు వేయిడ్డామనుకున్తున్నాం సార్ "
"......"
"........."
"మీరంతా మరొక పది మందితో వస్తే మనమంతా ఒక్క సారి కార్పోరేషన్ ఆఫీస్ కు వెళ్లి మాస్టర్ ప్లాన్ ప్రకారం పొడిగించవలసిన మన రోడ్ ను ఎందుకు పొడిగించడం లేదో...గట్టిగా అడుగుదాం..."
"........."
" అదేమిటి .....మనం చేసే పని మంచిదేగా "
" మా పేరెంట్స్ కు చెప్పాలండీ...."
" చెప్పండి"
" ఒప్పుకోరు సార్"
ఆ తరువాత జరిగిన సంభ్హాషణ ఆంతా ఇక్కడ రాయడం వృధాయే .....
కానీ ఇప్పుడు యూత్ ఇలా తయారవ్వడానికి కారణం ఏమిటి ? ఎవరిని తప్పు పడదాం..?" ఉద్యమాల్లో పాల్గొనిబాగుపడిందేవ్వరూ లేదు " అని స్థిరపడిపోయిన మన భావజాలమా...కొంత వరకూ నిజమే అనుకుందాం ...కానీ ఆఉద్యమాలన్నీ ఎవరో ఒకరు నడిపేవే కాబట్టి ఆ యా రాజకీయ పార్టీలదే తప్పవుతుందా..? ఇది కూడా కొంత వరకూనిజమే అనుకుందాం. మరి మనం ఆయా పార్టీ ల వాళ్ళను ఎందుకు నిలదీయం?.....ఎందుకంటే మనం సిద్దాంతాల కంటేఎక్కువగా వ్యక్తులకు విలువ ఇచ్చేస్తాం. రెండు ప్రాంతాల లోను (ఆంధ్ర & తెలంగాణా) వోట్స్ కోసం ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇరు ప్రాంతాల ప్రజలకూ ఏవేవో వాగ్దానాలిచ్చేస్తాయి ( అన్నిదానాలలో కెల్లా సులువైన దానం...వాగ్దానం కాబట్టి) నిజంగా ఉద్యమాలు వచ్చేసరికి ఆ యా పార్టీ ల లోని నాయకులే ప్రాంతాల వారీ చీలి పోయి ఈ ఉద్యమాలకు కూడానాయకత్వం వహించడానికి సిద్దమై పోతున్నారు.ఈ రెండు పార్టీ ల లోని అది నాయకులు మాత్రం ఒక్కల్లే. అంటే ఒకేరాష్ట్రం లోని రెండు ప్రాంతాల లోని ప్రజలు ఏవేవో కారణాల వలన తగువులాడుకుంటుంటే ఆ యా ప్రాంత ప్రజల తరుపున ఆ పార్టీ ల లోని నాయకులే ఒకరి మీద ఒకరు తొడలు చరిచేసు కుంటుంటే....ఆ అది నాయకులు "భలే....భలే.....జనంవెర్రి వెధవలు " అని ఆనందంగా చూస్తుంటే కామోసు అనుకొని మనమంతా నిమ్మకు నీరెత్తినట్టుగా క్రికెట్ స్కోరు కనుక్కుంటూ...టీవీల్లో ప్రోగ్రామ్స్ చూసుకుంటూ కులాసాగా కాలం గడిపెస్తున్నాం. ఇంత ఉదాసీనత తో తలిదండ్రులు ఉంటున్నప్పుడు పిల్లలకు దారి ఎవరు చూపిస్తారు?
సెల్ ఫోన్ యొక్క మితిమీరిన వాడకం వలన వచ్చే ఆరోగ్య సమస్య లనే మనం పట్టించుకొంటున్నాం కానీ అది మానసికంగా చూపుతున్న పరిణామాల గురించి మనం చాలా తక్కువగా ఆలోచిస్తున్నాం. నలుగురితో కూడితేనే కాని మానసికోల్లాసం పొందలేని స్థితి నుండి యువత ఒక సెల్ ఫోన్ తోనో లేక ఒక్కడూ ఒక గదిలో కూర్చుని హాయిగా కంప్యూటర్ ముందు కూర్చుని గేమ్స్ ఆడుతూనో లేక ఏదో చాటింగ్ తోనో అంటే ఆ నలుగురి అవసరం లేకుండానే గడిపి వేయగలుగుతున్నాడు. అంటే వీడి ఆలోచనలకు వీడే మహారాజు. ఘర్షణ ,ఖండన ఉండవు. వాడిదైన ఏకాంత ప్రపంచంలో వాడు బ్రతుకుతూ ఉంటాడు. పైగా వీళ్ళ చదువుకి ఆటంక మవుతుందని మనం వీళ్ళని గదిలో చక్కగా బందిస్తాం. ఒంటరిగా కూర్చున్న వాడి ఆలోచనలు ఎటు వైపు వెల్తాయో అన్న విషయం మనం యెంత మంది పట్టించుకుంటున్నాం.వాడి ప్రపంచంలో ఫైల్యూర్ ఎరగని వాడు నిజ జీవితంలో ఏ ఓటమినీ తట్టుకోలేక పోతున్నాడనీ, ఓటమి యొక్క పర్యవసానాలు వేరే వేరే రూపాలలో అంటే అమ్మాయిల ముఖం మీద ఆసిడ్ పోయడం ....దగ్గరనుండి తెలుగుజాతి వెలుగులు..యుగ కర్తలు...వైతాళికులు...మహా మానవతా వాదులు ...త్యాగధనులైన వారి విగ్రహాలను నేలమట్టం చేయాలన్న కిరాతక మైన ఆలోచనలకు బీజాలు మనమే వేస్తున్నామని యెంత మంది తలిదండ్రులకు తెలుస్తుంది?ఆసిడ్ పోసిన వాళ్ళంతా కంప్యూటర్ గేమ్స్ ఆడే వాళ్ళు కాక పోవచ్చు కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ అలసటకు గురి చేయని ఏ గేమైనా గేమ్ కింద లెక్క రాదు.
పైగా ఇదంతా వాళ్ళ భవిష్యత్తు కోసమేనని మనకు మనమే ఆత్మవంచన చేసుకుంటాం. అసలు ఆనందం అంటే ఏమిటని మనం ఎప్పుడైనా ఆలోచించ గలుగుతున్నామా..... మనకే చాలా మందికి తెలియదు. టీవీ లు చూస్తున్నాం కాబట్టి మనకు తెలిసినదల్లా మాంచి బంగళా....మంచి కారు..ఇంకా...ఇంకా....( త్రీ ఈడియత్స్ దర్శక నిర్మాతలకు క్షమాపణలతో )
పొలం వెళ్లి పశువులకు చిట్టు-ఉలవలు కానీ తౌడు-కడుగు పెట్టి వాటి ముఖం లోకి చూడండి.....యెంత ఆనందంగా ..చూస్తాయో. అలవాటు చేస్తే చిన్న చిన్న విషయాలు యెంత ఆనందం కలిగిస్తాయో మనం ఎప్పుడూ గమనించం....పిల్లలకు చెప్పం....ఒక్కొక్క మంచి పుస్తకం గురించి రోజుల తరబడి చెప్పొచ్చు....ఒక్క మన తెలుగు సాహిత్యం లోనే ఎన్నెన్ని ఆణి ముత్యాలు...అవన్నిటి గురించి చెప్పాలంటే మనం కూడా కష్టపడాలి.....అమ్మో...సరే వదిలేద్దాం....కనీసం వాళ్ళ ఆలోచనలైనా మనం గమనిస్తామా...యేవో మనకు తెలిసిన చెత్తంతా వాళ్లకు ఇంజెక్ట్ చేసేస్తాం. చాలా వరకూ ఒక కన్ఫ్యూస్డ్ మైండ్ తయారు చేస్తాం. కొన్ని ఉదాహరణలు చూద్దాం...దేవుడు సర్వాంతర్యామి అని మనమే చెబుతాం ...తిరుపతి క్యూ లో గంటల తరబడి మనమే నించుంటాం. కుల వ్యవస్థ అర్ధం లేనిదంటూనే కులం వాళ్ళ పిక్నిక్ లకు మాత్రమె వెళ్తాం. ఆఖరికి గుడిలో ఉన్న క్యూ లో కూడా లైన్ తప్పి ముందుకు పోయే అవకాశం కోసం చూస్తాం.ఇక్కడ ఒక చిన్న సంగతి చెప్తాను.మాకు తెలిసిన లెక్చరర్ ఒకాయన ఏదో అవసరం వచ్చి "ప్రతి నెల తిరుపతి వచ్చి వెంకటేశ్వర స్వామి ని దర్శించు కుంటానని మొక్కుకున్నాడు. మొత్తానికి ఆయన కోరిక నెరవేరింది . కాబట్టి ఆయన ఏమి చేసే వాడంటే నెల ఆఖరి రోజున ఒక సారి దర్శనం చేసుకుని మరుసటి రోజే అంటే తదుపరి నెల మొదటి రోజున దర్శనం చేసేసుకుని నెల కొక సారి దర్శనం అనే మొక్కుబడి తీర్చేసే వాడు. తాను నమ్మిన దేవుడికే నామాలు పెట్టగల ఈ వింత వికృత మనస్థితి అవకాశ వాదానికి పరాకాష్ట లా కనిపించినా ఈ విధమైన ఆలోచనా విధానమే మన సమాజానికి ప్రస్తుతం మార్గ దర్సకమని చెప్పడంలో నాకెలాంటి సందేహమూ లేదు.
అందుకే ఏనాడో గుళ్ళలోనూ ... మఠాల లోనూ పెరిగిపోతున్న అవకాశ వాదాల నుండి ప్రజలను రక్షించడం కోసం " దేవుడు మనుషుల్లోనే ఉంటాడు " అని ప్రకటించి జీవితాంతం చెట్టుకింద నిద్రించిన షిర్డీ సాయిబాబా లాంటి మహానుభావుడికి కూడా మనం ఒక గుడి కట్టేసి ....ఆయన విగ్రహానికి హారతి ఇచ్చేసి ...అనేక చోట్ల ఆయన విగ్రహానికి క్షీరాభి షేకం చేసేస్తూ .....సంస్కృతంలో మంత్రాలు తయారు చేసేసి మన పూజారులు చదివేస్తుంటే మనం భక్తి శ్రద్దలతో పూజాదికాలు నిర్వర్తించేస్తున్నాం. దీనిని బట్టి మనం ఎవరివైనా విప్లవాత్మక మైన ...లేదా మహోన్నత మానవతా వాద సిద్దాంతాలను జనం పట్టించు కోకుండా చేయాలంటే వారికొక గుడి కట్టి పడేసి....లేదా వారి విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేయించేస్తే చాలు. లేదంటే మహాత్ముడి విగ్రహాలకు...అంబేత్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకం ..ఏమిటి? అదృష్టం ఏమిటంటే మార్క్స్ .ఎంగెల్స్ లు అక్కడెక్కడో పుట్టి బ్రతికి పొయ్యారు.
ఒక విషయాన్ని చూస్తె చాలా సామాన్యంగానే కనబడొచ్చు గానీ పలాయన వాదం ఉదాసెంత రాజ్యమేలుతున్న మనసమాజంలో మన పవిత్ర దేవాలయాల పాత్ర చూద్దాం. డబ్బు ఉంటె అడ్డ దారిలో దేవుడి దర్శనం లభ్యమవుతోంది. ( దానికి చట్ట బద్దత వున్నా కూడా క్యూలో ఉన్న వేల మందిని వెనుకకు నెట్టి డబ్బుతోనో ...వీ.వీ, ఐ. పీ. పేరు తోనోముందుకు పోయి దర్శనం చేసుకోవడం నా దృష్టిలో ఐతే అడ్డ దారి కిందే లెక్క) అంటే నీవు ఏ అడ్డ దారిలోనో డబ్బుసంపాదించేసుకొని అందులో కొంత డబ్బు ఈ దర్శనాల కోసం ఖర్చు పెట్టేసి ..లేదా ఏ కళ్యాణ మహోత్సవాలోజరిపించేస్తే.....నీవు చేసిన పాపాలన్నిటినీ ...ఈ విధంగా సంపాదించిన పుణ్యం తో బాలన్సు చేసేస్తే నీ దగ్గర మిగిలినడబ్బుకి ఇక ఏ పాపం అంట దన్న మాటేగా......ఆహా యెంత పరిమళ భరితమైన సాంస్క్రుతిక...ఆధ్యాత్మిక వాతావరణంలో జీవిస్తున్నాం.....
ఒకప్పుడు మా ఎదురుగా ఉండే అపార్ట్మెంట్ లో అప్పుడే వ్యాపారం లో పాకి వస్తున్న కుటుంబం వుండేది. చాలా చక్కగా కలుపుగోలుగానే వుండే వారు. ఒక రోజు షాప్ కట్టి వస్తూ ఆయన ఒక రోడ్ ఆక్సిడెంట్ లో మరణించారు. కారణం చాలా సింపుల్ . బైక్ మీద వెళ్తున్న ఇద్దరు కుర్రాళ్ళు చాలా రాష్ గా రోడ్ క్రాస్ చేసినప్పుడు ఈయన సడన్ గా బ్రేక్స్ అప్లయ్ చేయవలసి వచ్చింది. వెనుగ్గా వస్తున్న ఆటో కంట్రోల్ చేసుకోలేక ఈయనను గుద్దేయడం జరిగింది. పాపం ఆయన పక్కనున్న రాళ్ళ గుట్ట మీద పాడడం తలకు తగిలిన గాయం వలన ఆయన చనిపోవడం జరిగింది. ఆ తరువాత ఆ కుటుంబం పడిన పాట్లు ......ఒకడు హీరోఇజం చూపించుకోనడానికి ఎన్నుకున్న మార్గం వలన ఒక కుటుంబం వీధిన పడింది. అసలు ఈ హీరోఇజం చూపించుకొనే అవసరం ....అలవాటు ...ఎక్కడ నుండి వస్తున్నాయ్. రెండు ..మూడు సంవత్సరాల వ్యవధి లో మొత్తం కాలేజీ వ్యవస్థనే అపహాస్యం చేసిన సినిమాలు వస్తుంటే మనం ఆనందంగా చూస్తూనే ఉంటాం. పది మంది కలిస్తేనే ఏదైనా సాధించగలం .....ఒక్కడిగా ఏదీ సాధ్యం కాదు....సమాజానికి కావలిసింది పదిమందినీ కలుపుకొని ...మంచి కోసం పాటుబడే వాళ్ళే తప్ప హీరోఇజం కోసం మంచి పనులు చేసే వాళ్ళు కాదని వివరించే సినిమాలు మచ్చుకైనా ఉంటున్నాయా? ( కొంత కాలం క్రితం రిలీజ్ ఐన " గోదావరి" లాంటి ఆణిముత్యం తప్ప). పోనీ ఇళ్లలోనైనా దీని గురించి గట్టిగా పిల్లలకు వివరిస్తామా.....లేదు ...ఎందుకంటె ఒక్క సారి మన పురాణాలను చూడండి. సాధించిన ఘన కార్యాలన్నీ ఒకరిద్దరి బాణాలతోనో ...పరాక్రమంతోనో .... సాధించినట్లుగానే ఉంటుంది..కనీసం రామాయణం లో వానరాలు నిర్మించిన "రామ సేతు" ఉంది గాని తరువాత వచ్చిన భారతం లో సామాన్య జనం యొక్క ప్రస్తావన ఇంచుమించు కనబడదు.... అందువల్లే ..మనకు ఒక రక మైన ఉదాసీన వైఖరి అలవాటై పోయింది. సమాజానికి హాని కలిగించే పని ఏదైనా మన కళ్ళ బడినా మనం వెంటనే స్పందించం. ఇలా స్పందించని విషయాన్ని చాలా సినిమాల్లో చూపించారు కానీ ఆ విధమైన ఉదాసీనత సమాజం లో ప్రబలి పోడానికి వెనుక ఉన్న సాంస్క్రుతిక, చారిత్రక కారణాలనే మరింతగా విశ్లేషించాలి.ఈ ఉదాసీనత వల్లనే రెండు లక్షల కోట్ల రూపాయల నల్లదనం ఒక్క స్విస్ బాంకుల్లో మూలుగుతోందన్న విషయం గుర్తిస్తే మంచిది.
ఇప్పటికైనా యువతరం మరీ లోతులకు కాక పోయినప్పటికీ ఫై పై న చూసినా కనబడే వాస్తవాలు గ్రహించడం మంచిది. మన తెలివి తేటలను ముందు మన కోసం వాడుకొందాం.మనం అంటే ఈ సమస్త ప్రజానీకం. ఉదాసేనత ఈ సమాజానికి భయంకరమైన శాపంగా మారితే మరికొంత మందికి వరమై కూర్చుంది. కొన్ని చిన్న చిన్న ఉదాహరణలు చెబుతాను. పోటీ పరీక్షలు ముమ్మరంగా ఉండే ఈ సీజన్లో అనేక ప్రార్ధనా మందిరాలలో భయంకరమైన ధ్వనితో మైక్ లో ప్రార్ధనలు వినిపిస్తున్నారు...ఏ మతం వారికీ కోపం లేకుండా అన్ని ప్రార్ధనా మందిరాలలో మైక్ నిషేధించడానికి మనం ఎప్పుడైనా ప్రయత్నాలు చేస్తామా...? భక్తీ అనేది మనసుకి సంబదించిన విషయం. దానికి ఇంత హంగామా ఎందుకో నాకేమీ అర్ధం కాదు. అసలు దీని వలనే చాలా వరకూ మత కలహాలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు? ఈ మధ్యనే కట్టిన మందిరం రోడ్ వెడల్పు చేయడానికి అడ్డం వస్తుంది. దానిని చాలా సుళువుగా అక్కడ నుండి తీసి పక్కన వేరొకటి నిర్మించొచ్చు. కానీ చేయరు....సంవత్సరాల తరబడి ఆ రోడ్ అలా పడి ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏమిటంటే సర్వే చేసే సమయంలోనే ఇటువంటివన్నీ గుర్తించి ముందునుండీ కొన్ని చర్యలు చేపట్టొచ్చు......కానీ చేయరు. సింపుల్ గా " ప్రజల మనో భావాలు దెబ్బతింటాయి.." అనే ఒకే ఒక్క కారణం అధికార గణం చెబుతూ ఉంటుంది. నిజం చెప్పాలంటే ప్రజలను మతం పేరుతొ ..కులం పేరుతొ...ఎక్స్ ప్లోయిట్ చేసే వాళ్ళ మనోభావాలు దెబ్బ తింటాయి కానీ ప్రజలు వారి దైనందిన జీవితంలో ఏర్పడే చిన్న చిన్న సౌకర్యాలకే ప్రాధాన్యత యిస్తారు. .... ఇవన్నీ ప్రభుత్వం లో ఉన్న వారికి తెలియదా? అన్నీ తెలిసి ఎందుకు ఈ ఉపేక్ష ?
ఈ మద్యనే వచ్చిన ఒక చక్కటి చిత్రం "గమ్యం " లో గాలి శీను అనే పాత్రతో దర్శకుడు ఒక డైలాగ్ చెప్పిస్తాడు "జనం రెండు రకాలు బాసూ...ఒకళ్ళు దొబ్బే వాళ్ళు ...ఇంకొకళ్ళు దొబ్బిచ్చికొనే వాళ్ళు" . ఇది మాత్రం అక్షర సత్యం అని నాకనిపిస్తుంది. ఒక్క సారి మనం వివరంగా చూద్దాం.
పై పేరాల్లో ( బ్లూ కలర్ తో ఉన్నది) ఒక సారి చూడండి. కొంత మంది సమాజం లో కొంత ఉత్సుక్తత తో ఉంటుంటారు. ఏదో ఒకటి చేయాలన్న తపన ఎంతో కొంత ఉంటుంది. కానీ ఏమి చేయాలన్న దాని మీద స్పష్టత ఉండదు. ఉదాహరణకు శ్రావ్యంగా పాడే కళ, స్వరం..ఉన్న యువకుడిని ఉదాహరణగా తీసుకొందాం. అతడికి ఏదోలా తన కళ ను ప్రదర్సించాలన్న తపన ఉంటుంది. కానీ అతడు అవకాశం బట్టి ఏదో గుడి లో భజన సమాజం లో అయినా చేరిపోతాడు.....లేదా.."ఏం బ్రతుకులు మనయి రో ..." అని చైతన్య గీతాలు పాడే వాడి గా అయినా ఉండొచ్చు. అతడి దృష్టిలో రెండూ పాటలే...ఇప్పుడు జరుగుతున్న దేమిటంటే ఇటువంటి ఉత్సుక్తత ఉన్న వారిని ఇంచుమించుగా ఆ దోబ్బే( ఈ తరగతిని రాజకీయ దళారులు అని కానీ మరీ బాగోదనుకుంటే..రాజకీయ నాయకులు అని కానీ అనొచ్చు ) వారే పట్టుకొని చక్కగా వాడు కో గలుగుతున్నారు. వీళ్ళను కొంచెం నాయకులుగా గుర్తించే సరికి విచక్షణ కాస్తా చచ్చి పోతుంది. చావక పోయినా ఆ దొబ్బే వర్గం ఎలాగూ చంపేస్తుంది. వీళ్ళను కుల నాయకులుగా ....మత నాయకులుగా తీర్చి దిద్ది ...వాళ్ళ నాయకత్వాన్ని మరింతగా ఎస్టాబ్లిష్ చేయడం కోసం వారి చేత అవసరం లేని జాతరలు..సంబరాలు ( రోడ్డంతా బ్లాక్ చేసినా సరే ) చేయిస్తూ ఉంటారు. ఇదంతా అర్ధం చేసుకొని ... ఆలోచించ గలిగే మేధావులికి గడప దాటే సమయం చిక్కదు. ఈ రాజకీయ దళారులే అధికార వర్గంగా మారి కొంత మంది తెలివైన వారిని ఉపయోగించు కొని భయంకరమైన స్కేం లలో వేల...లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి అతి కొద్ది భాగాన్ని మాత్రం వోట్లు కొనడానికి ఉపయోగిస్తూ చట్టాలకు అతీతంగా బ్రతుకుతున్నారు. ఇదంతా మన ఉదాసేనత ఫలితమే..కాలేజ్ కుర్రాళ్ళ ను ఒక్క సారి ప్రధాన రాజకీయ పార్టీ ల మధ్య ఉండే సైద్దాంతిక తేడా ల గురించి అడగండి. తొంభై శాతం మంది నోరెళ్ళ పెట్టడమే చేస్తారు. అది కూడా కరెక్టే ...ఎందుకంటే వాటి మధ్య మౌలికంగా పెద్ద తేడా ఏమీ ఉండదు. ఎక్కువ మంది దొబ్బే వర్గం నుండి వచ్చి అటూ ఇటూ గెంతుతూ ఉంటారు. ఆ వర్గానికి సంబందించిన పనులు ఎప్పుడూ ఆగవు. కొంచెం తెలివి తేటలతో మన ప్రధాన కోస్తా జిల్లాల లోనే ప్రధాన రాజకీయ పార్టీ ల నాయకుల మద్య బంధుత్వాల ను చూడండి. దొబ్బిచ్చు కొనే మనం యెంత వెర్రి వెధవలమో గమనించండి. ఈ మధ్యనే ఆంధ్రా విశ్వ విద్యాలయం విద్యార్ధులు చాలా మంది ఆయాచితంగా ముందుకు వచ్చి లోకసత్తా పార్టీ కి ప్రచారం చేయడం చూసాక ఈ కుళ్ళు శుభ్రం చేయడం ప్రారంభమైందేమో అనిపిస్తోంది.
చాలా మంది యువకులు ఈ మధ్య "చేగువేరా " బొమ్మ ఉండే టీ షర్ట్ లు వేస్తున్నారు.. దయుంచి ఆయన గురించి క్షుణ్ణంగా తెలుసుకోమని నా మనవి. ఎక్కడో అర్జెంటీనా లో పుట్టిన ఈ డాక్టర్ పుట్టుకతోనే ఆస్మా వ్యాధి పీడితుడై ఉండి కూడా మెక్సికో లో విప్లవకారులతో కలసి అత్యంత సాహసంతో అనేక సార్లు చావు తప్పించుకొని క్యూబాలో విప్లవాన్ని విజయవంతం చేసి ఆ దేశపు ప్రధాన మంత్రి గా పని చేస్తూ ......ఒక్క క్యూబానే కాదు మొత్తం లాటిన్ అమెరికాను విముక్తం చేయాలనే ఉద్దేశంతో మరలా తుపాకీ చేత బట్టి బొలీవియా లో అమెరికన్ సైనికుల చేత దారుణంగా కాల్చి వేయబడ్డ మహోన్నత వ్యక్తీ ఆయన . ఆయన స్టైల్ నుండి కాదు ఆయన భావాల నుండి స్ఫూర్తి పొందండి.
ఒక్క సారి ఆరుద్ర రాసిన "గోరంత దీపం....కొండంత వెలుగు " పాటను పూర్తిగా వినండి. చెడు ముందు మన మనసుల్లో నుండి తరిమేయండి. ఆ తరువాత ప్రతి ఒక్కరూ ఒక్కక్క చేగువేరా లా తయారవ్వండి. పాత....చెత్త .....కుల ..మత.....చాందస....స్వార్ధ పూరిత .........భావాలన్నిటినీ వేళ్ళతో పెకలించి వేయండి. ఒక్కక్కడు ఒక్కొక్క డైనమైట్ లా పేలి ఈ చెత్త నిర్మాణా లన్నిటినీ కూకటి వేళ్ళతో లాగేయ్యండి. విడి విడి గా హోండా కార్ల గురించి.....బీచ్ లో నో ..మాదాపూర్ లోనో ఉన్న విల్లాల గురించి కాక అందరూ కలసి సమస్త ప్రకృతి లో ఉన్న సర్వ జీవులతోను కూడా కలసి .....ఇంత ఆనందంగా మానవ జాతి జీవించ గలగొచ్చు అనే ఆలోచనను మనందరి లోనూ కలిగించిన .... కెమెరూన్ అద్భుత సృష్టి అవతార్ లాంటి కలలు కందాం.....కాదు....కాదు నిజం చేద్దాం.