25 సంవత్సరాల
క్రితం “శివ “ సినిమా రిలీజ్ అయ్యింది. కలెక్షన్స్ లో ఆ రోజుల్లో చరిత్ర కూడా
సృష్టించింది. అలా అని అదేదో గొప్ప చిత్రం అయితే కాదు. అప్పటి వరకూ వచ్చిన
ఫార్ములా చిత్రాలకు కాస్త భిన్నంగా టేకింగ్ ఉంటుంది ..అంతే. అప్పటి వరకూ వచ్చిన
సినిమాలలో విలన్ ని ఏడు తరాల ముందు వరకూ తిట్టి ఆ తరువాత తనేం చేయబోతున్నాడో కూడా
ఉపన్యాసం ఇచ్చి గాని హీరో ఫైట్ మొదలు పెట్టడు. ఈ సినిమాలో ఒక్క డైలాగ్ కూడా
లేకుండానే సైకిల్ చైన్ తెంపి హీరో చప్పట్లు కొట్టించుకుంటాడు.
విలన్ ని సినిమా
సగభాగానికే హీరో బలహీనుడై పోతాడు . అంతకు ముందు విలన్ నాలుగైదు కారుల్లో మందీ
మార్బలంతో తిరుగుతున్నప్పుడు హప్తాలు ,చందాలు ...బలవంతంగా వసూలు చేసి దర్జా
వెలగపెట్టిన విలన్ మీద మనకు పీకల దాకా కోపం వస్తుంది కానీ ,అలాగే తిరుగుతున్న
హీరోని చూసైతే సగటు ప్రేక్షకులెవ్వరికీ కోపం రాదు. ఎందుకంటే పురాణ వ్యాఖ్యానాలు ,
పఠనం మన ఆలోచనా తీరు మీద చూపే ప్రభావ ఫలితమే అది. “ఫలానా వ్యక్తి తప్పులు చేయడు ...లేదా
తప్పొప్పులకి అతీతుడు” అనే భావజాలం లో కొట్టుకుని పోతున్న సమాజం లో ఉన్నవారికి
ఇవన్నీ సహజమే. ఒక వీధి కావొచ్చు ,నగరం కావొచ్చు ...ఒక వ్యక్తి వలన నిరంతరం
బాధననుభవిస్తున్నప్పుడు అతగాడిని ప్రజలే మూకుమ్మడి గా ఎదుర్కొనడమనేది( దానికి
సహజంగా ఎవరో ఒకరు నాయకత్వం వహిస్తారు ) సరైన మార్గంగా చూపించాలి అలాగే ఆ ప్రజాకంటకుడు
అంతమైన తరువాత అతగాడు బ్రతికిన విధానాన్ని కూడా రూపుమాపడమనేది అత్యంత ప్రధానమైన విషయం.
అంతేగాని ఎవరో ఒకరిని ఆ స్థానం లో ప్రతిష్ఠించడమనేది ప్రజాస్వామ్యం మీద నమ్మకం
ఉన్న వారెవరూ హర్షించరు.
ఇంత ఉపోద్ఘాతానికి
గల కారణం దగ్గరికి వస్తాను. నేను చిన్న
ట్రైనింగ్ ప్రోగ్రాం కోసం 5 రోజులు లక్నో లో గడిపాను. కొత్త ప్రాంతం కాబట్టి అక్కడ
గల దర్శనీయ ప్రాంతాల గురించి ఎంక్వైరీ
చేస్తే మొదటగా పదిమందీ అంబేత్కర్ పార్క్ సజెస్ట్ చేయడం జరిగింది.
అక్కడ ఆయన
విగ్రహాలు ,ఫోటోలు ఉన్న మాట వాస్తవమే కాని బయట చూస్తే వందల కొద్దీ ఏనుగుల
విగ్రహాలు. అక్కడున్న సెక్యూరిటీ వాళ్లనడిగితే ఇంచుమించు 700 ఉండవచ్చునని
చెప్పారు. ప్రతి ఏనుగూ ఖరీదైన పాలరాతితో చేయబడిందే. పార్క్ ని అందంగా
తయారుచేయడానికి ఆ ఒక్క జంతువే ఎందుకు దొరికిందో నాకైతే కాదు ఎవరకీ అర్ధం కాదు. ఇంకొచెం
ముందుకు నడిస్తే రెండు పెద్ద పెద్ద స్మారక మందిరాలున్నాయ్.
ఆ మందిరాల వైభవం
గురించి నేను మాటల్లో చెప్పలేను కాబట్టి కొన్ని నేను ఫోటో లు ఇక్కడ జత
చేస్తున్నాను. ఒక స్మారక మందిరంలో దూరాం. సెంటర్ లో నాలుగు వైపులా చూస్తున్న 4
మాయావతి విగ్రహాలు. చుట్టూ ఉన్న మునుల ,బుద్ద విగ్రహాలు. విగ్రహం ఎత్తు 30 అడుగులు
ఉండవచ్చు. అదే విధంగా పక్క మందిరంలో కాన్షీరాం గారిది. ఆ తరువాత బయటకు వచ్చాం. బయట
ఒక పెద్ద వేదిక .
వేదిక రెండు పక్కలా వారివే 70 అడుగుల విగ్రహాలు. ఆ తరువాత
తెలిసిందేమిటంటే ఇటువంటి పార్కులు 5 లేదా 6 పైనే ఉన్నాయని. ఇంతకూ ఒక్క అంబేత్కర్
పార్క్ లో సెక్యూరిటీ ఏర్పాట్లు గురించి అడిగాం. మొత్తం 8 కంపెనీల సైన్యం 24 గంటలూ
కాపలా కాస్తున్నారు. వారు కాకుండా తుడవడానికి 700 మంది పని చేస్తున్నారు. మరి
మొత్తం పార్క్ ల సంగతి వేరే సంగతి. మరి పార్క్ లు దర్శించడానికి ఎంత మంది
వస్తారన్నది నవ్వు తెప్పించే విషయం.
ఇక్కడ నాకు
కొన్ని ధర్మ సందేహాలున్నాయ్.
1. తను అధికారం
లోకి రాగానే తన విగ్రహాలనే నగరమంతా నింపేసిన రాజకీయ నాయకుడెవరైనా ఉన్నారా?
2. పార్క్ లు
చాలా మంది కట్టి ఉంటారు కాని ఒకే జంతువు శిల్పాలతో మొత్తం పార్క్ లను నింపే అంత
మూర్ఖత్వం మెచ్చుకోతగిందేనా ?
3 . ఎవరెవరు ఎలా
పాలించేరో ఆ చరిత్ర కాస్త పక్కన పెడితే వారికి పూర్తి ప్రత్యామ్నాయం చూపే
సిద్దాంతంతో ముందుకు వచ్చిన నాయకురాలు చూపే ప్రత్యామ్నాయం ఇదేనా ?ఆధిపత్య
సంస్కృతికి ప్రత్యామ్నాయం వేరొకరి ఆధిపత్యమా లేక మొత్తం ఆధిపత్య సంస్కృతి లేకుండా
చేయడమా ? అసలు దీని కోసమే “శివ “ సినిమాను ఉదహరించాను.
4.ఒక వేళ ఇది
తప్పయితే ఆ సిద్దాంతాన్ని సమర్ధించే వారు ఈ విధమైన చర్యలను విమర్శించారా ?
5. సిద్దాంత బలం
పెద్దగా లేకపోయినప్పటికీ కేవలం ప్రజా శ్రేయస్సు పట్ల నిజాయితీ ఉన్న వారైనా కొన్ని
విషయాలను ఆలోచించి ఉండే వారు. అసలు లక్నో వంటి నగరం యొక్క గుండె కాయ వంటి
ప్రాంతంలో కొన్ని వందల ఎకరాలను కేవలం పాలరాతి మందిరాల కోసం అదికూడా తాజ్ మహల్ నిర్మాణానికి
మించిన ఖర్చుతో చేయడం ఎంతవరకూ సమంజసం? పచ్చని చెట్టు లేని కేవలం పాలరాతి ఎడారి కోసం.
6. కొద్దిపాటి
విజ్ఞత ఉన్న ఏ నాయకుడైనా సరే ఈ మార్కెట్ ఎకానమీ రోజుల్లో కనీసం ఆలోచించే విషయం
ఏమిటంటే ఏ ప్రాజెక్ట్ మీదైనా పెట్టుబడి పెడుతున్నప్పుడు తిరిగి వచ్చేదెంత ?ఎన్ని
రోజుల్లో ? (Return on investment).మరి ఈ పార్కుల మీద ఈ నాటికీ అవుతున్న ఖర్చు ,
ఆదాయాలను పోల్చి చూస్తే ఎవరికైనా గుండె గుభేల్ మనడం ఖాయం.
7. కనీసం తను
నమ్మిన సిద్దాంత వ్యాప్తికైనా ఈ విధమైన పార్కులు ఏ విధంగా సహకరిస్తాయో ఆవిడ కే
తెలియాలి.
8. బెంగాల్ లో
జ్యోతిబసు , త్రిపుర లో మాణిక్ సర్కార్ ఇంతకంటే
ఎక్కువ కాలమే అధికారం లో ఉన్నారు కానీ
వారు కట్టుకున్న స్మారక మందిరాల దాఖలాలైతే లేవు.
9. ఒక
సిద్దాంతంతో ముందుకు వెళుతున్న వారు అధికారం లోకి రాగానే వారి భవిష్యత్ ప్రణాళిక
లను సులభంగానే visuvalize చేసుకోగలుగుతారు. మరి ఆవిడ visuvalaization లో పాలరాతి
స్మారక మందిరాలు ఉన్నాయంటే ఆమె ఆధిపత్య ప్రత్యామ్నాయ సంస్కృతికి వారసురాలా ?
ఆధిపత్య సంస్కృతికి వారసురాలా ?
10. నాకు తెలిసినంతవరకైతే
యెంత ప్రజారంజకంగా పాలించిన కమ్యూనిస్ట్ యోదులకైనా ఆయన మరణాంతరం నిర్మించిన స్మారక
మందిరాలున్నాయి కాని ఆయన జీవిత కాలంలో ఆయనే స్వయంగా నిర్మించుకున్న స్మారక
మందిరాలైతే లేవు. ఒక వేళ నిర్మించుకోవాలనుకున్నా కూడా ఆయా పార్టీల సభ్యులు విమర్శించకుండా
ఉంటారని మాత్రం భావించలేను. మరి ఈ భారీ నిర్మాణాలను మిగిలిన సభ్యులు విమర్సించలేక
పోవడానికి గల కారణాలు నాకైతే అర్ధం కాలేదు.
11. విచిత్రమైన
విషయం ఏమిటంటే ఈమె సమర్ధకులు కాని,ఈమె పార్టీ సమర్ధకులు కాని ఈ నాడు ఆంద్రరాష్ట్ర
కమ్యూనిస్ట్ పార్టీలలో ఉండే అగ్రకుల ఆధిపత్య ధోరణి గురించి నిరంతరం
ప్రస్తావిస్తూనే ఉంటారు.
12. ముఖ్యమైన
విషయం ఏమిటంటే మనం నమ్మిన తాత్విక ,రాజకీయ
సిద్దాంతాలు మన వ్యక్తిగత జీవితం మీద
అనివార్యంగా ప్రభావం
చూపుతాయి. ఒకవేళ చూపలేదంటే ఆ సిద్దాంతం అయినా బలహీనమైనదై
ఉండాలి లేదా నీవు ఆ సిద్దాంత తాత్వికత ను పూర్తిగా స్వీకరించక పోయి ఉండాలి. శ్రామిక
వర్గ పార్టీలో పని చేస్తున్న వ్యక్తి “ఆడి” కారు మీద చెయ్యి వేసి ఫోటో దిగి దానిని
తన profile pic గా పెట్టుకున్నాడనుకోండి అతగాడికి సోషలిస్ట్ సామాజిక జీవితంలోని
సౌందర్యం ,ఆవశ్యకత అర్ధం కాలేదని అవగతం చేసుకోవచ్చు. గోదావరి సినిమాలో ఆఖరి
సన్నివేశం లో దొరికిన చిన్న చిన్న ఆఫర్ లతో హీరో ,హీరోయిన్ లు ఆనందపడి ఒకరినొకరు
హత్తుకుని నడిచే సన్నివేశం , ఎర్ర జెండాలను చూపించిన సినిమాల లోని చైతన్యం కంటే ఉన్నత చైతన్యం కల సన్నివేశం.
ఇలా ఒక్కొక్క
టర్మ్ గాని ,రెండు టర్మ్ లు కాని పదవుల్లో ఉన్న వాళ్ళు తమ తమ విగ్రహాల కోసం వందల
వందల ఎకరాలు కేటాయించుకుంటూ పొతే జనాలకు ఏమ్మిగులుస్తారో నాకైతే తెలియదు. పార్టీ శ్రేణులలో
దార్సనికతకు ప్రాధాన్యమీయకుండా కేవలం నినాదాలకు , ప్రజాకర్షక విధానాలకు ప్రాధాన్యమిస్తూ
పొతే ఆ పార్టీ పోయేది ఖాయం కాకపొతే ఈ లోపులో రాష్ట్రం గాని దేశం గాని ములగడం ఖాయం.
“అగ్ర వర్ణాల వారు
చేస్తే తప్పు లేదు కాని మేం చేస్తే తప్పా ?” అని ఎవరైనా ప్రశ్నిస్తే నా దగ్గర
సమాధానం లేదు.