25, నవంబర్ 2013, సోమవారం

నిర్జన వారధి గానే వదిలేద్దామా



                        “అసలు ఈ పుస్తకం ఎందుకు చదవాలి?”అనే ప్రశ్న తోనే మనం ప్రారంభిద్దాం. అసలు పుస్తకాలే చదివేవాళ్ళు కరువైపోతున్న ఈ రోజుల్లో ఈ పుస్తకాన్ని ఎంత మంది చదువుతారో తెలియదు. అసలీ పుస్తకాన్ని ఎందుకు చదవాలి ?

                             దానికి ఒక్కటే సమాధానం. ఒక ఉదాత్త చరిత్రను ......మానవీయతను దర్శింఛి మీకు తెలియకుండానే మీ కళ్ళలో నుండి అది ఆనందమో .....దుఖమో తెలియని స్థితిలో కారుతున్న నీళ్ళను కూడా పట్టించుకోలేని అనుభూతిని మీరు కోరుకుంటే ఈ పుస్తకాన్ని చదివి తీరవలసిందే . సమాజ పరిణామం ఆగదు. కానీ ఆ రోజుల్లో మాకు దొరికింది ......ఈనాటి యువకులకి దొరకనిది ఒక్కటే ......“ఉత్తేజం”. భిన్న ఆలోచనలే లేని చోట నిజమైన  ఘర్షణ ఉండే అవకాశమే లేదు. భిన్న ఆలోచనల.....సిద్దాంతాల ఘర్షణ ఉన్న సమాజం లో పుట్టేదే నిజమైన ఉత్తేజం తప్ప మిగిలినదంతా రాజు గారి భార్యలు .....ఉంపుడుగత్తెల ఆంతరంగిక పోరాటమే తప్ప మరేమీ కాదు.

                               స్వాతంత్ర్య పోరాటానికి ఒక బాలిక గా ఉన్నప్పుడే అంతగా ఎందుకు స్పందించాలి.... నిజంగా ఆమెకు జన్మనిచ్చిన తలిదండ్రుల పెంపకం ఎంత గొప్పది....బాల్య వితంతువుకి వివాహం చేసినా  ఆమెను పోరాట మార్గంలోకి అనుమతించిన ఆ మహనీయులకి .....నారాయణ కాలేజ్ గాని..... చైతన్య కాలేజ్ గానీ ఇంటర్నల్ గా పెట్టే పరీక్షలలో మార్కులు తక్కువ రాగానే గాభరా పడిపోయే ఈ నాటి తలిదండ్రుల మైన మాకూ ఎంత తేడా .......

                               గూండాలను తరిమి తరిమి కొట్టిన ఆ మహనీయురాలి జ్ఞాపకాలలోని విజయవాడ ను కుల రక్కసి కరాళ నృత్యంచేస్తున్న నేటి విజయవాడ ను పోల్చి చూస్తే చాలు మన రాజకీయ పార్టీలు .....మీడియా... ప్రజలను ముందుకు తీసుకు వెళ్తున్నాయో ....వెనుకకు తీసుకు వెళ్తున్నాయో చెప్పడానికి . అసలు అభ్యుదయం  అంటే ఏమిటో తిరోగమనం అంటే ఏమిటో తెలియకుండా పిల్లలను పెంచేస్తున్న మాకూ ....తన తరువాతి రెండు తరాలవారిలో  కూడా అత్యున్నత చైతన్యం నింప గలిగిన ఆ నిత్య యౌవ్వనరాలు తో పోలిస్తే మేమేప్పుడో వృద్దులమై పోయాం. వోట్లు రాల్చగలిగే గూండాల ...ఫాక్షనిస్టుల విగ్రహాల మాటున జాతీయ నాయకుల విగ్రహాలు దాక్కుంటుంటే  చూసి కూడా టీవీ రియల్ కోసం....ఆఫీస్ టైం కోసం .....పిల్లల కాలేజ్ టైం అయిపోతుందని ........క్రికెట్ మ్యాచ్ చూడడం కోసం పరుగులు తీస్తున్నాం . ఆ తరువాత కూడా ఇంకా టైం ఉందనుకుంటే ముందుగానే టికెట్స్ రిజర్వు చేయించుకుని తిరుపతి ...షిర్డీ యాత్రలకు వెళ్తాం తప్ప .....పరలోక సుఖాలకు కర్చీఫ్ వేసుకుంటాం తప్ప......ఎంతో అవసరమైతే తప్ప వోటు వేయడానికి కూడా బయటకు రాలేము. ఎలా వస్తాం..... రోడ్ మీద మెత్తగా జారిపోయే కార్లను కలర్ టీవీలో అందులోనూ పక్కన మాంచి అమ్మాయి కూర్చుంటే డ్రైవ్ చేస్తుంటే ఉండే మజా ను చూపిస్తుంటే ఆనందంగా కలలలోకి జారిపోతూ బ్రతికేస్తున్నాం. ఎప్పుడో విద్యార్ధి దశలో “వీరులార.....వీరులార.....ఎర్రజెండ....యోధులార .....” అని పాడుకున్న రోజులు జ్ఞాపకానికి కూడా రాకుండా జాగ్రత్త పడుతున్నాం.



                                కానీ ఈ పుస్తకం మరొక్క సారి మాకొక మార్గం చూపించింది. తన జీవితం మరొకరికి భారం కాకుండా ఆ మహనీయురాలు ఎలా జాగ్రత్త పడిందో చూసిన తరువాత ఇప్పుడు మేము నడుపుతున్న పడవను ఇప్పుడున్న పరిమితులలోనే ఒక తీరానికి చేర్చిన తరువాత మరలా మేము ఏ బాట పట్టాలో తెలిపింది . ఆ మహా తల్లిని నిర్జన వారధిగా మిగలనీయం.

                                 అటువంటి అమ్మమ్మ దొరికిన అనూరాధ ధన్యురాలైతే .....ఈ పుస్తకాన్ని బయటకు తీసుకు రావడానికి కృషి చేసిన అనురాధ (చిన్ని) తో  పరిచయం ఉన్న మేమంతా ధన్యులం.

20, నవంబర్ 2013, బుధవారం

క్రీడా రాజకీయాలు ..... రాజకీయ క్రీడలు

                      చాలా కాలానికి ఒక ఆలోచన రేకెత్తించే వార్త. మామూలుగా ఐతే అది పెద్ద వార్తగా అనిపించదు . కానీ కాస్త లోతుల్లోకి వెళ్తే మాత్రం అది వార్తే . ఒక్క సారి ఈ రోజు ఈనాడు లోని 14 వ పేజీ లో ఎడమ వైపున ఉన్న "సచిన్ అలా .... "అన్న వార్త ఒక్క సారి చూడండి . నిజంగా ఐతే అది వార్త కాదు .... ఒక ఆటగాడి పరిచయం .
                    అనిల్ గౌరవ్ అనే మరుగున పడిపోయిన ఆటగాడి వ్యదార్ధ గాధ మనసున్న మనుషులకెవరికైనా మనసు చివుక్కుమనేలా చేస్తుంది . అతగాడు అన్న ఒక్క మాట అర్ధం చేసుకోగలిగితే భారత దేశ ప్రస్తుత సమాజ పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు . "ముఖ్యంగా అతనికి మంచి కుటుంబ నేపధ్యం ఉంది " అన్న అతడి మాటలో ఉన్న ఆర్తి ఈ వార్త చదివిన ఎంతమందిని కదిలించిందో నాకు సరిగ్గా తెలియదు కానీ నాకైతే అతడు సమాజాన్ని విప్పి చూపించాడనిపించింది. మనకుండే సామాజిక నేపద్యాలు ...... మన రాజకీయాభిప్రాయాలు ..... మన ఆచరణలు ...... వీటి బట్టి రాజ్యం యొక్క ప్రతి స్పందన ఉంటుందన్న విషయం చాలా మందికి అర్ధం కాదు . ఒక జేబుదొంగ గానీ ..... సైకిల్ దొంగ గానీ కనీసం ఒక ఎస్సై తో కూడా ఎక్కువ సేపు మాట్లాడే అదృష్టం పొంద లేడు.
                      
                   ఒక వ్యక్తి  విప్లవ కవిత్వం రాయడం తప్ప వేరే నేరం చేయక పోవచ్చు ..... కానీ నీకు  జైలు లో న్యూస్ పేపర్ కూడా దొరకక పోవచ్చు . అతడి   భావజాలం అందరికీ ఆమోద యోగ్యం కాక పోవచ్చు ..... కానీ అతడికీ .... వేల కోట్ల కుంభకోణాల ఆరోపణల మీద విచారణ కోసం జైల్లో పెట్టబడిన రాజకీయ నాయకుడికి జైల్లో లభించే సౌకర్యాలు .... హక్కులు పరిశీలించి చూస్తే చాలా విషయాలు అర్ధం చేసుకోవచ్చు . అంతే కాదు విచారణ పూర్తి చేసుకుని నిరపరాధి క్రింద బయటకు రాకముందే అన్ని రాజకీయ పక్షాల నాయకులు మహామహులైన కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు కూడా అటువంటి నేపధ్యం ఉన్న నాయకులను కలవడం కోసం తమ విలువైన సమయాన్ని చక్కగా ఖర్చు పెట్ట గలుగుతారు. కానీ తాము పూర్తిగా ఏకం కావడం మూలంగా భారత రాజకీయాలలో వచ్చే మార్పుల గురించి ఏ విధమైనా చర్చా జరపడానికి సుముఖలవ్వరు . ఇంత అధ్వాన్న పరిస్థితులలో కూడా సోషలిస్ట్ శక్తుల ఏకీకరణకు ఏ మాత్రం కృషి చేయని కమ్యూనిస్ట్ పార్టీల నాయకుల వైఖరే భారత ప్రజల పట్ల జరుగుతున్న అతి పెద్ద రాజకీయ కుట్ర అని నా అభిప్రాయం . ప్రస్తుతం ఉన్న యువకులకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ సిద్దాంతం అంటూ ఒకటుంది అని తెలిసే లోగా ఈ పార్టీలు కనుమరుగు కాకూడదని కోరుకుంటున్నాను .

                          కనీసం భారత రత్న ఇచ్చే విషయంలో ఒక మంచి చర్చ జరుగుతోంది . నిజంగా సచిన్ మన క్రీడా రంగపు ఆణిముత్యం కావచ్చు ..... కానీ ముందున్న ఆణి ముత్యాలను వదిలేద్దామా ...... అంతే కాకుండా క్రీడా రంగపు రాజకీయాలన్నిటి మీదా ఒక ఆరోగ్యకరమైన చర్చ జరిగితే బాగుంటుంది . కేవలం క్రికెట్ ఒక్కటే మన జాతీయ క్రీడగా ఎందుకు మారుతోంది .... లాంటి విషయాలను అనిల్ గౌరవ్ మాటల నేపద్యంతో ఆలోచించాలి

6, నవంబర్ 2013, బుధవారం

రూపం మార్చిన కానిబాల్స్

" నిజంగానే కానిబాల్స్ (మానవులని తినే మనుష్య జాతి )ఈ రోజుల్లో ఉన్నారంటావా ..?"

"ఉండొచ్చేమో ... "

"నిజంగానే అండమాన్ నికోబార్ దీవుల్లోని sentinels కానిబాల్సే నంటావా ?

"అవ్వొచ్చు .... "

"మరి .... మనకు ఇంత సమీపంలోనే కానిబాల్స్ ఉంటే వాళ్ళను సంస్కరించవలసిన అవసరం లేదా ... ?"

"ఏం చేస్తే బాగుంటుంది ?"

"ఏదోలా వాళ్ళ భాష వచ్చిన వాళ్ళను పట్టుకుని వాళ్ళు చేస్తుంది ఎంత ఘోరమైన పనో అర్ధం అయ్యేలా చెప్పొచ్చు .."

"వాళ్ళు మారతారా .. ?"

"కనీసం ప్రయత్నం చెయ్యాలిగా .."

"ప్రయోజనం ఉండదు "

"మరీ అంత ఖచ్చితంగా చెబుతున్నావ్ "

"తెలుసు కాబట్టి .... "

"ఎలా ..... ?"

"వాళ్ళ నాగరికతలో బయట మానవులను తినడం ... సహజమైన విషయం గా భావిస్తారు కాబట్టి "

"మరీ అంత దారుణంగా ... "

"నీ నాగరికత .... నా నాగరికతలకు అది దారుణం కావచ్చు .... కానీ వాళ్లకు కాదు ... అంతే .... "

"ఒక వేళ మన లాంటి వాళ్ళం ప్రయత్నం చేస్తే ....?"

"నిన్ను చక్కగా డీప్ ఫ్రై చేసుకుని మరీ తినేస్తారు .."

" ఛీ ... "
"ఏంటి ఫ్రైయ్యా ... బాగానే ఉండొచ్చు "

" ఆపు బాబూ వాంతోచ్చేలా ఉంది ..."

"వాళ్లకు రుచికరమైన ఆహారం .... నీకు వాంతి తెప్పిస్తోంది ..... "

"అలా కాదు .... చైతన్యం కలిగిన ప్రాణిని తినే బదులు సహజంగా ఈ అడవిలో దొరికే పళ్ళు .. తేనె తినొచ్చు కదా ... ఎవరికీ బాధ ఉండదు .... వాళ్ళ జిహ్వ కోసం తోటి మనిషిని ..... "

"నయం ..... ఈ నీతులన్నీ నాకు చెప్పావు ..... కాబట్టి సరిపోయింది ..... "

"అంటే ...... "

"తోటి మానవులని నీ స్వార్ధం కోసం హింసించ కూడదు ..... ప్రజల ఆస్తులు  అన్యాయంగా దోచుకోకూడదు ... అధికారం ఉంది కదా అని ప్రభుత్వ భూములను నీ తాబేదార్లకు ధారాదత్తం చేయకూడదు ..... చట్టాలను అంత విస్రుంఖలంగా అతిక్రమించకూడదు ...... నీ అధికార దాహానికి ప్రజల మధ్య చిచ్చు పెట్ట కూడదు ..... లాంటి నీతులు ఏ ఫ్యాక్షనిస్ట్ కుటుంబంలో పుట్టి ..... ఆ నాగరికతనే నిలువెల్లా ఒంటపట్టించుకున్న నాయకుడికెవరికైనా చెప్పావనుకో ... అసలే సామాన్య మానవుడివి ..... వాడు నిన్ను ఎలా అయినా తినేస్తాడు ..... వాడి చుట్టూ తిరిగే తోడేళ్ళు వాడు తినగా మిగిలింది పీక్కుని తినడానికి రెడీ గా వాడి చుట్టూ చేరి ఉంటున్నాయి ..... జాగ్రత్త ... "

"అంటే కానిబాల్స్ కోసం అండమాన్ నికోబార్ వెళ్ళనక్కరలేదన్న మాట ..... "


(డాక్టర్ జె . పీ . లాంటి మచ్చ లేని మనిషి నిన్న విశాఖపట్నం లో తనకు  తెలిసిన కొన్ని గతం లోని  విషయాలను బయట పెట్టినందుకు ....శాస్త్రీయంగా సమాధానం చెప్పలేని  తోడేళ్ళ నిజమైన ప్రేలాపన ..... భాష .. విన్న తరువాత ..... తట్టుకోలేక .....)

4, నవంబర్ 2013, సోమవారం

ఉగ్రవాద బీజాలు ....... ఎక్కడనుండి ..... ఎవరి వలన .....

మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న గారు పెద్ద R.S.S. లీడర్ నాన్నా ..... మా వాడు వాళ్ళ స్నేహితుడి కుటుంబం గురించి చెబుతున్నాడు .

సీమాంధ్ర లో R.S.S. లో ఉన్న వాళ్ళంతా కాస్త అగ్ర కులాల వారే నని నా నమ్మకం . కేవలం ఇది నా నమ్మకం మాత్రమే కాబట్టి దయుంచి దీంట్లో తప్పొప్పులు వెదకొద్దని మనవి . కానీ మా వాడి మాటల ద్వారా తెలిసిందేమిటంటే వాళ్ళ స్నేహితుడిది వెనుకబడిన కులాల జాబితాల్లో ఉన్న కులం . ఈ విషయం కూడా తరువాత తెలిసింది .  సరే ఎవరిష్టం వాళ్ళది కాబట్టి ఈ విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు . ఒక రోజు నేను మా వాడిని ఏదో ప్రాజెక్ట్ చేయవలసిన పని కోసం వాళ్ళ స్నేహితుడి ఇంటికి తీసుకెళ్ల వలసి వచ్చింది . సరిగ్గా అదే సమయానికి వాళ్ళింటి సమీపం లోని మసీదు లో నమాజ్ .... దాని తరువాత ఏదో ఉపన్యాసం ప్రారంభమయ్యాయి. దాని సౌండ్ ఎన్ని decibels ఉంటుందో తెలియదు కానీ ఖచ్చితంగా కొద్ది నిముషాలు అక్కడే ఉంటే  నా తలలో నరాలు బద్దలవ్వడం ఖాయమన్న ఫీలింగ్ వచ్చేసింది . నాకప్పుడు అనిపించింది ..... ఆ ఏరియా లో ఉన్న ఏ హిందువైనా కూడా (నిజానికి ముసల్మానులు కూడా అది భరించడం కష్టమే ) ఆ సౌండ్ ఆపడానికి ఏ పనైనా చేస్తాడు .

మొన్న దసరా కి మా రాజవోలు వెళ్లాను .  ఆ ఊరంతటికీ ఒకడే టైలర్ . అతడు నా క్లాస్ మేట్  కూడా . ఈ నాటికీ అలా బట్టలు కుట్టుకుంటూ కుటుంబ భారం మోస్తున్నాడు . బట్టలు కుట్టించవలసి వచ్చి మా శ్రీమతి తనకు ఫోన్ చేసింది . 

"అయ్యో ...పాపమ్ అమీర్ కు వంట్లో బాగుండ లేదంట .... లేవడం లేదంట "
ఫోన్ పెట్టేసి చెప్పింది . ఒక సారి ఊరు  కూడా తిరిగినట్లుంటుందని చెప్పులు వేసుకుని అమీర్ ఇంటి వైపుగా బయలు దేరాను . అతడి ఇంటి చుట్టూ మూడు దేవీ నవరాత్రి పందిళ్ళు . మూడు మైకుల్లోనూ మూడు పాటలు . సౌండ్ గురించి చెప్పనక్కర లేదు . నన్ను చూడగానే పడుకుని ఉన్న అమీర్ లేచి కూర్చున్నాడు .
"ఎలా ఉంది .. ?"
"పెద్దగా నలతేమీ లేదు ప్రసాదూ .... కానీ బట్టల కుట్టడానికి మిషన్ ఎక్కలేనంత గోల .... నరాల్లోనుండి పైకి తన్నుతున్నహోరు  .... కంప్లైంట్ ఇచ్చి వీళ్ళందరి తో గొడవ పెట్టుకోలేను . మిషన్ ఎక్కి 10 రోజులయ్యింది . మొన్నటి వరకూ వినాయక చవితి పందిళ్ళు .... నీవు చెప్పు ప్రసాదూ ... ఇదంతా భక్తి కోసమే నంటావా ..... "
వేరే విషయాలు మాట్లాడి ఇంటి వైపుకి తిరిగాను .
అక్కడుండ గానే ఆదివారం వచ్చింది .
"మరీ ఇంత గోలా ..... "
"ఏం చెయ్యమంటారు  అన్నయ్య గారూ .... ఏదైనా గట్టిగా అంటే గొడవలని భయపడుతున్నాం ...... పిల్లలు ప్రశాంతంగా  చదువుకోలేక పోతున్నారు "
మా బావమరిది భార్య వాపోయింది .
ఆలోచిస్తే నవ్వొచ్చింది . నగరం లోనే రాత్రి 12 గంటల తరువాత పది మంది కూడా లేని పిల్ల కాయలు కొన్ని వేల మందికి నిద్ర లేకుండా ఊరేగింపులు చేసేస్తున్నారు .

సమాజంలో ఉన్న మూడు నాలుగు మతాల వారు తోటి వారికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తుంటే కంట్రోల్ చేయవలసింది ఎవరు ... ?
కావాలని చేస్తున్న ఈ ఉపేక్ష వెనుక పాలక వర్గాల కుట్ర నగ్నంగా కనపడ్డం లేదా ? ఇటువంటి ఉపేక్ష వలన కాదా .... మొత్తం సమాజం భారీ ఉపద్రవాల బారిన పడింది . టెర్రరిజానికి బీజాలు పడేది ఇక్కడనుండి కాదా .......