22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

మహా ప్రభువుల్లారా.....మా బ్రతుకులు మాకొదిలెయ్యండి..




చాలా కాలం తరువాత మరలా పాపికొండలకు వెళ్ళాం.ఒక సారి  వెళ్ళిన వారు వీలు కుదిరితే చాలు వెళ్ళాలనుకునేటట్లు  చేయగల అద్భుత ప్రకృతి సౌందర్యానికి మచ్చుతునక వంటిది ఆ యాత్ర. పెళ్ళి కాకముందు కొద్దిపాటి స్నేహితులతో పుల్లలను రవాణా చేసే లాంచీలో నా మొదటి యాత్ర జరిగింది.ఆ తరువాత చాలా మందితో నాలుగైదు సార్లు ఆ యాత్రకు వెళ్ళాను. ఒక్కక్కటి ఒక్క మధుర జ్ణాపకం. దీనిలో ముఖ్య మైనది కొద్ది మంది స్నేహితులు ..కుటుంబ సభ్యులతో 1997 భోగి రోజున మేము చేసిన ప్రయాణం. అది యే మాత్రం హడావుడి లేకుండా పూర్తిగా మా నియంత్రణలో జరిగిన యాత్ర.ప్రత్యేకించి ఏవో కొన్ని ప్రదేశాలు కాక మొత్తం గోదావరి తీరాంలోని అందాలను ఆశ్వాదించాలంటే  ఆ మాత్రం సమయం తీసుకోవాలని ఇప్పుడు అర్ధమవుతోంది.ప్రతి సంవత్సరం నీటి ప్రవాహం వలన గోదావరి తీరంలో కొత్త అందాలు ఏర్పడుతూ ఉంటాయి.
కాబట్టి ముందే ఫలానా  ప్రదేశం మాత్రమే బాగుంటుందని చెప్పడం కష్టం.కాబట్టి మేము ఆ ట్రిప్ లో ఎక్కడ అందంగా కనిపిస్తే అక్కడ ఆగిపొయ్యే వాళ్ళం. కొత్తగా వేసిన మట్టి మేట మీద పరుచుకున్న పచ్చిక తివాచీలు మనసుకు కలిగించే ఆనందం మనసున్న వాళ్ళకు వర్ణనాతీతంగానే ఉంటుంది.మరీ ముఖ్యంగా ఒక కొత్తగా ఏర్పడ్డ మట్టి దిబ్బ పక్కనే ఆగి రోటి పచ్చడి చేసుకుని..సాంబారుతో భోజనం చేసిన అనుభవం ఆ యాత్రలో మాతో పాలు పంచుకున్న వారెవరూ మరిచి పోలేరు.ఒక్కొక్క సారి మరొక అనుభవం ఎదురైతే గాని అంతకు ముందున్న అనుభవం తాలూకు గొప్పతనం కానీ.. 
 లోటుపాట్లు కానీ అర్ధం కాదు.



మా యాత్ర జరిగిన కొద్ది సంవత్సరాలకు ఒక రైల్వే అత్యున్నతాధికారిని అదే యాత్రకు తీసుకుని వెళ్ళడం జరిగింది.ఇరిగేషన్ శాఖ వారి హై స్పీడ్ బోట్ లో ఆయన స్థాయికి తగ్గట్ట్లు గా జరిగిన ఏర్పాట్ల మధ్య వెళ్ళడం సహజంగానే ఎవరికైనా సరే ఆనందాన్నివ్వాలి. కానీ నేను అంతకు ముందు జరిపిన యాత్రతో పోలిస్తే ఇది ఏ ఆనందాన్నీ ఈయలేదు.అత్యాధునికమైన బోట్....నోరూరించే వంటకాలు...ప్రతీదీ స్పెషలే.కానీ ఎందుకో తెలియని వెలితి.  ఉన్నతాధికారి చాలా మంచివాడే ...ఏ మాత్రం ఆధిక్య ధోరణి లేని వాడే. ఆలోచిస్తే  నాకనిపించిందేమిటంటే  ఏ వేగంతో వెళ్తే ఆ గోదావరి తీర అందాలను అశ్వాదించగలుగుతామో అంతకు చాలా మించిన వేగంతో ఆ బోటు లో ప్రయాణం చేయడం ప్రధాన కారణం గా నాకు అనిపించింది.అవసరానికి మించిన వేగంతో వెళ్ళినప్పుడు తీర ప్రాంతమంతా పచ్చగా అలికేసినట్లుగా అనిపించింది.మొక్కజొన్న చెట్టు మొత్తం మీద పచ్చగానే ఉంటుంది. కానీ దాని ఆకులు ..కాండం..కంకి...అన్నీ వేరు వేరు పచ్చని రంగులు.ప్రకౄతి లోని ఆనందాన్ని ఆశ్వాదించాలంటే ఇవన్నీ వేరు వేరుగా చూడగలిగేంత దృష్టి,,సమయం కేటాయించవలసిందే.నా యీ ఉన్నతాధికారితో జరిపిన యాత్ర ముగిసిన తరువాత ..యీ యాత్రల మధ్యా ఉండే భిన్నత్వం,సారూప్యత జీవితానికి కూడా చాలా అన్వయిస్తాయనిపిస్తోంది.  

నేను చెప్పే వ్యక్తుల ఫొటోలు కోకొల్లలు గా దొరుకుతాయి కాబట్టి నెను ప్రత్యేకించి ఫొటో వేయడం లేదు.మొదటి యాత్ర తప్పనిసరై ఆ పుల్లల మోపుల మధ్య కూర్చుని ఎవరో చెప్పారు కాబట్టి బాగుంటుందో లేదో   పూర్తిగా తెలియని ప్రాంతానికి ఆ ఇంజన్ హోరులో పుల్లల మోపుల మధ్య చుట్ట పొగ వాసన మధ్య అలా ప్రయాణం చేసేసాం.మొత్తానికి కొంత మందికి పూర్తిగా ఇష్టం లేనప్పటికీ... సహజత్వానికి దగ్గరగా ఉన్నప్పటికీ ఎక్కువగా ఎంజాయ్ చేయలేకపొయ్యాం.ఆలోచించగా  నాకనిపించినదేమిటంటే అన్ని అసౌకర్యాల మధ్య బోట్ మీద నియంత్రణ మనది కాదు. ఒక వేళ ఎక్కడైనా మంచి ప్రదెశం కనబడినా కూడా ఆపగలిగే సదుపాయం లేదు.కాబట్టి ఆ ప్రయాణాన్ని సహజంగానే ఎవరూ ఇష్టపడరు.ఇక మిగిలినవి రెండు ట్రిప్స్.  వీటిని పోల్చవచ్చు.రెండిటిలోనూ  ప్రయాణీకులకు స్వాతంత్ర్యం వుంది.బహుశా  ఇదొక్కటే సామ్యం ఉన్న అంశం.మిగిలినవాటిలో ఉన్న భిన్నత్వాన్ని అన్వేషించడమే ఇప్పుదు నేను చేస్తున్న పని.

నిప్పు రాజేయడం అనేది మానవ సమాజం లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో....వూహించాలంటే ముందు నిప్పు లేని సమాజం ఎలా ఉండేదో వూహించగలగాలి.అలాగే కోర్కెలు ఉండని సమాజాన్ని...మనుషులను వూహించడమే కష్టం.కోర్కెలూ..కలలూ లేకపోతే అభివృద్దే ఉండదనడంలో ఎవరికీ ఆక్షేపణ ఉండదు.యీ సందర్భంలో నన్ను యీ మధ్య అత్యంత ప్రభావితం చేసిన ఒక పుస్తకాన్ని గుర్తుకు తెచ్చుకోడం అత్యంత ఆవశ్యకం.   ఆయన ముందు మాటలో చెప్పినట్లుగా శ్రీ వీరేంద్రనాధ్ అనువాదం ("ఇడ్లి,వడ,ఆకాశం ") చూసి ముందు నేను కూడా ఆశ్చర్య పొయ్యాను. కానీ వ్యాపారంలో నైతికత్వం అనే కొత్త కోణం తెలిసింది. సమాజానికి ఏ విధమైన నష్టం కలగజేయకుండా కూడా వ్యాపారం లో ఎలా విజయవంతం కావచ్చో చెప్పదమే కాకుండా మన జీవిత  విధానం కూడా ఎలా ఉంటే బాగుంటుందో అంతర్లీనంగా మనకు ప్రభోదిస్తుంది. నాకు ఆర్ధికంగా కలసి వచ్చినప్పుడు చాలా కాలం క్రితం నికాన్ ఎస్.ఎల్.ఆర్. కెమేరా కొన్నాను. అది నిజంగా నా అబిరుచి కోసం కొన్నదే. కానీ మా సన్నిహితుల్లో చాలా మందికి అది తీపి గుర్తులు మిగిల్చాయి.అదే విధంగా మా బంధువుల్లో చాలా మందికి కూడా కలిసి వచ్చి నప్పుడు ఇంట్లోకి బంగారం..బట్టలు కొనుక్కొనే వారు.నాకది పాక్షికంగా మాత్రమే నచ్చేది.ఒక్క ఒక్క సారి అదే మాట వాళ్ళతో అంటే ..."నీకు ఫోటోగ్రఫీ  అంటే ఇష్టం కాబట్టి కెమేరా కొన్నావు...మాకు బంగారం ఇష్టం కాబట్టి ఇది కొన్నాం అనే వారు. ఆ వాదనలో ఎక్కడో లోపం ఉన్నట్లు తెలిసినా కూడా నేను అదేమిటో చెప్పలేక పొయ్యేవాడిని.కానీ ఆ పుస్తకం చదివిన తరువాత జవాబు స్పష్టంగా  చెప్పగలుగుతున్నాను. 

"నాకున్న  ఈ కోర్కె వలన నాకు ఖచ్చితంగా  ఆనందం వస్తుంది...దానితో పాటు నాతో ఉన్న అందరికీ కూడా ఆనందాన్ని మిగులుస్తుంది.కానీ మీకున్న బంగారం మీద వ్యామోహం (యీ ఆర్గ్యుమెంట్ ఎక్కువగా మాకున్న స్త్రీ బంధుగణం తోనే వచ్చేది) నీకు తప్ప ఎవరికీ ఉపయోగపడదు.పైగా అది ఒక సారి సంపాదించడం మొదలు పెడితే ఆ వ్యామోహం మరింత పెరుగుతూనే ఉంటుంది" 

కోర్కెలు అవసరాలకు దగ్గరగా ఉన్నప్పుడు జీవితంలో అనవసరమైన పరుగులకు తద్వారా వచ్చే ఆయాసాలకు ఆస్కారమివ్వని విధంగా మన జీవన  యానం ఉంటే గోదావరి తీరమంత పచ్చగా . .విశాలంగా మన జీవితం కనిపిస్తుంది.నేను మూడవ సారి వెళ్ళినప్పుడు కూడా తీరమంతా పచ్చగానే కనిపించింది.కానీ పైన చెప్పినట్లు  మొక్క జొన్న మొక్కంతా ఒక రంగులోనే ఉన్నట్లు గా జీవితంలూఎని నాలుగైదు రంగులు మాత్రమే గుర్తించగలుగుతామేమో. ఇంకొక ముక్యమైన విషయం ఏమిటంటే నెమ్మదిగా వెళ్ళినప్పుడు ఆగాలనుకున్న చోట  ఆగే సౌకర్యమొక్కటే కాదు ఆగాలనుకున్నప్పుడల్లా ఆగొచ్చు. దానికి పెద్దగా ముందస్తు ప్లానింగ్ అవసరం ఉండదు.స్పీడ్ గా వెళ్ళేటప్పుడు ఆ సౌకర్యం ఉండదు. 

"మీరు చెప్పినదంతా నిజమే.....మేము కూడా నెమ్మదిగానే జీవనయానం సాగిస్తాం...అవకాశం చూపండి" అని చాలా మంది యువకులు వేసే ప్రశ్నకు  నా దగ్గర కూడా సమాధానం లేదు. యీ ప్రక్క ఫోటోలో కనబడుతున్న టైలర్ గారు గత పది సంవత్సరాలుగా మాకు తెలుసు..మా ఇంట్లో అవసరమైన బట్టలు ఆయనే కుడతారు.విశాఖపట్టణం లాసన్స్ బే కాలనీ  లో ఒక వీధిలో చిన్న పెట్టెలాంటి షాప్ లో ఒక చిన్న ఫాన్ పెట్టుకుని ఎఫ్.ఎం.రేడియోలో పాటలు వింటూ బట్టలు కుడుతూ ఉంటారు.మనకు చెప్పిన టైం కు వెళ్ళే సరికి మన బట్టలన్నీ ఇస్త్రీ చేయబడి పేక్ చేయబడి ఉంటాయి.నేను  చూస్తున్నప్పటి  నుండీ ఆయన అదే గదిలో బట్టలు కుట్టుకుంటున్నారు.ఆయనలాగే  ఆనందంగా ఉండే వారు పరిస్థితులు మారక పోతే.రెడీమేడ్ లు మార్కెట్ ను ఆక్రమించేసరికి యీయన గిరాకీలు తగ్గిపొయ్యాయి.ఆయన కుటుంబ భృతికి ఢోకా  లేనప్పిటికీ ఆయన వృత్తి ఆయన సంతానానికి నమ్మదగినిదిగా అనిపించలేదు. అది నిజం కూడా కావొచ్చు.అందుకని ఆయన కుమార్తె ఉచిత ఇంజనీరింగ్ కాలేజ్  సీట్ కోసం ఒక ప్రైవేట్ ఇ ంజనీరింగ్ కాలేజ్ లో చేరింది.పాపం చాలా మందికి తెలియనట్లే వాళ్ళకు కూడా దేశ...రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి..తద్వారా పెరిగే ఉద్యోగావకాశాల గురించి తెలియదు.అవి రెండూ సున్నా  నుండి దిగువకు వెళ్ళిపొయ్యాయని...ఇప్పుడున్న అభివృద్ది అంతా సేవారంగాలనుండి వచ్చిందేనని చాలామంది చదువుకున్న వాళ్ళకు కూడా తెలియక ఏవేవో మాట్లాడేస్తుంటారు) తెలిసినా కూడా చేయగలిగింది ఏమీ లేదు కూడా.ఏ చదువుకి కూడా కాస్త కూడా ఉద్యోగ భద్రత లేదు.మొన్న మొన్న బట్టలు కుట్టించుకుందామని  ఆయన షాప్ కి వెళ్ళగా అది మూసి ఉంది.జరిగినదేమిటంటే పాపం ఆయన అనుకోకుండా స్లిప్ అయ్యాడు. దాని ఫలితంగా సరైన పండగ సీజన్ లో బెడ్ రెస్ట్. అమ్మాయి ఫైనల్ యియర్ కు వచ్చింది. ఫీజులు ప్రభుత్వం కట్టినా కూడా పైఖర్చులకు చేసిన అప్పు 50000 రూపాయలు అలాగే ఉంది. పాపం ఆయన శ్రీమతి ఈ విషయాలన్నీ చెప్పి చదువవగానే అమ్మాయికి  ఎక్కడైనా ఉద్యోగం చూడమని అడిగింది. ఒక్కటే చెప్పగలిగాను.

"ప్రయత్నిస్తానమ్మా....కానీ అంతవరకూ ఖాళీగా ఉండకుండకుండా ఇంతకు ముందులాగే నాన్న గారికి సహాయపడమనండి" 

నేననుకోవడం ఏమిటంటే పరుగెట్టి పాలు తాగే వాళ్ళకు  నిలబడి నీళ్ళు తాగే వాళ్ళకూ వాళ్ళ వాళ్ళ రీతుల్లో బ్రతికే అవకాశాలు ఉండాలి.గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన యువకులు యీ నాటికీ సింపుల్ జీవితాన్నే ఇష్టపడతారు.మందుతాగడం లాంటిది ఎక్కువైతే అయ్యుండొచ్చు...కానీ సుఖం అన్న పదానికి వాళ్ళకున్న నిర్వచనం మా రెండవ ప్రయాణానికి దగ్గరగా ఉంటుంది. సమాజానికి దూరంగా   ఉండి ఆనందం అనుభవించే మానసిక దౌర్భల్యానికి వారింకా దూరంగానే ఉన్నట్లు గా కనిపిస్తోంది.

యూ.ఎస్. లోనో ..హై టెక్  సిటీ లోనో మాంచి ఉద్యోగాలు చేసుకుంటూ అలాంటి పార్టనర్ ను పెళ్ళి చేసుకుని  ఒక డీలక్స్  అపార్ట్మెంట్...మాంచి స్పోర్ట్స్ కారు..లాంటివన్నీ ఇన్స్టాల్మెంట్స్ మీద సమకూర్చుకుని...ఇంకా ఏమైనా సేవింగ్స్ ఉంటే దానిని ఎక్కడి రియల్ ఎస్టేట్ లో పెడితే లాభాదాయకంగా ఉంటుందో ఇద్దరూ కూర్చుని తెగ చర్చించేసుకుంటూ మధ్య మధ్య లో తాము సమాజంలోనే ఉన్నామని గుర్తు చేసుకుంటానికి గెట్  టుగదర్ లాంటి పార్టీలకు వెళ్ళి తాము కూడా ఆనందంగానే ఉన్నామని తమను నమ్మించుకోడానికి ....అవసరమైతే నాలుగు రకాల పక్షి అరుపులు అరిచే జీవితాన్ని ఆనందించే వాళ్ళూ ఉన్నారు.అలాగే పైన చెప్పిన మా టైలర్ గారిలా ఆనందంగా బ్రతికే  అనేక మందీ ఉన్నారు. ఎవరి జీవితం ఆనందం అనేది చర్చనీయాంశం చేస్తే మాత్రం పరిష్కారానికి పడిగట్టుగా "ప్రశాంతత" ను వాడక తప్పదు.ఇక్కడ కూడా మరొక్క విషయం చెప్పక తప్పదు. కాలేజ్ రోజుల్లో నన్ను ఒక్క నిముషం కూడా ప్రశాంతంగా ఉండని వాడిగా చూసే వారు. మరీ సీనియర్లం అయిన  తరువాత ఎన్నెన్నో గొడవలు.అన్యాయాన్ని  భరించే ఓపిక  ఉండేది కాదు.తిరగబడడమే....కాబట్టి అవన్నీ ప్రశాంతతకు సహకరించేవాటి క్రిందే లెక్క వేయాలి.ఎందుకంటే అలా కొంతమంది చేస్తేనే ఎంతో మంది అభాగ్యులకు ప్రశాంతత ఉంటుందని అందరికీ తెలుసు కాబట్టి.ఒక విషయం నీకు అన్యాయం అనిపించినప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాడితేనే మనసుకు ప్రశాంతత ఉంటుందనేది అందరికీ అనుభవమే.నాకు అనిపించేది ఏమిటంటే కేవలం వార్ధక్యం మీద పడ్డ వాళ్ళే చుట్టూ ఉన్న సమస్యల పట్ల స్పందించలేరు. దీనినే తిరగేసి అలోచిస్తే సమస్యలకు వ్యతిరేకంగా...కనీసం గళమెత్తగలిగిన ప్రతివాడూ యువకుడే.బైక్ తో రోడ్ మీద మెలికలు తిప్పుకుంటూ డ్రైవ్ చేసి నేను యువకుడడనని ఆనంద  పడితే మాత్రం వాడంత మూర్ఖుడు లేనట్లే.  యుక్త వయసు వచ్చిన తెలివైన అమ్మాయిలు..తగిన యువకులను మాత్రమే ప్రేమించగలగాలని ..అంతేగాని యువకుల్లా కనబడే వారినిజాగ్రత్తగా పసిగట్టమని....నా మనవి. 

అలాగే పైన చెప్పిన టైలర్ గారి లాంటి వాళ్ళు యీ దేశంలో కోట్ల మంది ఉన్నారు. మేమంతా ఆ కోవలోని వాళ్ళమే.పప్పు చారు...దోసకాయ పచ్చడి తో తిన్నా మా అందరికీ ప్రవాహం లోని ప్రతి మలుపు లోని ఆనందమూ కావాలి. అన్ని రంగులూ ...వాటి కలయికా..విడిపోత ...కావాలి.అంతే గాని ఎప్పుడు ప్రారంభమైనదో...ఎప్పుడు పూర్తైపోయినదో తెలియని ప్రయాణం మాకొద్దు. పగలంతా ...వారం దినాలు పొలాల్లో...పరిశ్రమల్లో.. ..విద్యాలయాలలో...చెమటోడ్చి  కష్టపడతాం.మాకు పైన చెప్పిన పాటి తిండి...కాస్తంత వినోదం...రోగమొస్తే చూసే హాస్పిటల్..మా రాబోయే తరాలకు కష్టపడే గుణం ఉంటే చాలు.. యీమాత్రం జీవితం  ఉంటుందులే అనే భద్రత కల్పించండిచాలు అదే పదివేలు.... ఇప్పుడు రాజ్యమేలుతున్న దొరలందరికీ మొరపెట్టుకుంటున్నా. ..మిగిలినవన్నీ మీరే తీసుకొని అనుభవించండి. మా పొలాలకి కాస్తంత నీళ్ళిప్పించండి..మా పిల్లలు చదువుకొనేందుకు కాస్తంత కరెంట్ ఇప్పించండి. మిగిలినదంతా మీ ఏ.సీ. లకు సరదాలకు వాడుకోండి. మా భూము లాక్కొని నోట్లో మట్టి గొట్టొద్దు.చేతనైతే మేము మా పల్లెల్లో కాస్తంత తృప్తిగా బ్రతికేటట్లుగా చేయండి.

అలాగే తలిదండ్రులకీ ఒక చిన్న విన్నపం.ఉన్నత విద్యాలయాలన్నీ జ్ఞాన భండారాలు. దానిని ఉపయోగించుకొని మన పిల్లలని యువకులుగానూ   తయారు చేయొచ్చు...అలాగే ముసలి వాళ్ళు గా కూడా చేసి వదలొచ్చు.

7 కామెంట్‌లు:

  1. //...మిగిలినవన్నీ మీరే తీసుకొని అనుభవించండి. మా పొలాలకి కాస్తంత నీళ్ళిప్పించండి..మా పిల్లలు చదువుకొనేందుకు కాస్తంత కరెంట్ ఇప్పించండి. మిగిలినదంతా మీ ఏ.సీ. లకు సరదాలకు వాడుకోండి. మా భూము లాక్కొని నోట్లో మట్టి గొట్టొద్దు.చేతనైతే మేము మా పల్లెల్లో కాస్తంత తృప్తిగా బ్రతికేటట్లుగా చేయండి.//
    చాలా బాగుంది సర్ , ముఖ్యంగా చివరి లైన్లు .
    ఏం చెప్పాలో తెలియడం లేదు.

    రిప్లయితొలగించండి
  2. baagundi.....grameenaa abhivruddi ante chetlu kottesi polaalani plots chesi vyaapaara stalaalugaa marche abhivruddi gaa maarindi kaanee,soukaryaalu,jeevanopaadhi.....anevi lekundaa poyaayi,alochiste konni vruttulu kanumarugoutunnayi,ee naayakula tikka cheshtala valla nera pravrutti perugu tondi...pch....ento ee jeevana prayaanam


    Narsimha

    రిప్లయితొలగించండి
  3. prathi manishiki korikalu vundatam sahajam...kakpothe korikalu manalni jayisthe vaati venaka parigeduthune jeevitham lo alisipothamo ledha parugu aapi vivekam tho adugulu vesthu korikalane jayisthamo ane dhani mana anadam adharapadi vuntundhani chakkani vudhaharana tho bhale chepparu .. :)

    okati matram nijam ...maa yuvatha ki Jebu lo vunna 10 rupalaya viluva theliyali, aa 10 rupayala tho ne anadam ga vundochanni theliyali...alage aa 10 rupayalu sampadhinchdam kuda theliyali.
    mee nunchi mari konni sampadakeeyaalanu chadavaalni asisthu

    ..selavu

    రిప్లయితొలగించండి
  4. >>పప్పు చారు...దోసకాయ పచ్చడి తో తిన్నా మా అందరికీ ప్రవాహం లోని ప్రతి మలుపు లోని ఆనందమూ కావాలి. అన్ని రంగులూ ...వాటి కలయికా..విడిపోత ...కావాలి.అంతే గాని ఎప్పుడు ప్రారంభమైనదో...ఎప్పుడు పూర్తైపోయినదో తెలియని ప్రయాణం మాకొద్దు. పగలంతా ...వారం దినాలు పొలాల్లో...పరిశ్రమల్లో.. ..విద్యాలయాలలో...చెమటోడ్చి కష్టపడతాం.మాకు పైన చెప్పిన పాటి తిండి...కాస్తంత వినోదం...రోగమొస్తే చూసే హాస్పిటల్..మా రాబోయే తరాలకు కష్టపడే గుణం ఉంటే చాలు.. యీమాత్రం జీవితం ఉంటుందులే అనే భద్రత కల్పించండిచాలు అదే పదివేలు.... ఇప్పుడు రాజ్యమేలుతున్న దొరలందరికీ మొరపెట్టుకుంటున్నా. ..మిగిలినవన్నీ మీరే తీసుకొని అనుభవించండి. మా పొలాలకి కాస్తంత నీళ్ళిప్పించండి..మా పిల్లలు చదువుకొనేందుకు కాస్తంత కరెంట్ ఇప్పించండి. మిగిలినదంతా మీ ఏ.సీ. లకు సరదాలకు వాడుకోండి. మా భూము లాక్కొని నోట్లో మట్టి గొట్టొద్దు.చేతనైతే మేము మా పల్లెల్లో కాస్తంత తృప్తిగా బ్రతికేటట్లుగా చేయండి.

    పదునైన మాటలు

    రిప్లయితొలగించండి
  5. మంచి విశ్లేషణ.

    "మహా ప్రభువుల్లారా.....మా బ్రతుకులు మాకొదిలెయ్యండి..
    ...మిగిలినవన్నీ మీరే తీసుకొని అనుభవించండి."

    చివరికి ప్రజలని ఈ స్థితికి తీసుకువచ్చారు.

    రిప్లయితొలగించండి