1, మార్చి 2012, గురువారం

మెట్లమీది నుండి దొర్లుతున్న చెంబు.....



   ఇంటికి వచ్చి చెప్పులు విప్పానో.... లేదో భార్యామణి మొదలుపెట్టింది
" క్రింద ఫ్లాటావిడ  వచ్చింది నిన్ను కలవడానికి" 
కొత్తగా ఫ్లాట్ కొనుక్కుని వచ్చారు క్రింద ఒక ఫామిలీ  
"ఎందుకట?" కాజువల్ గానే అడిగాను
" వాళ్ళకేదో మొక్కుబడి ఉందట....వచ్చే సోమవారం కంచర పాలెం లోని పైడితల్లమ్మ  గుడి లో నుండి విగ్రహాన్ని వూరేగింపుగా మేళ తాళాలతో తీసుకుని వచ్చి కొంత సేపు ఇంట్లో  వుంచి కొంత సేపైన తరువాత సాగనంపుతారట" 
యీ విధమైన మ్రొక్కులు ఉంటాయని వినడం మొదటి సారి నాకు. కొంచెం అలసటగా ఉండడం వలన వెంటనే ఆ విషయం  గురించి ఆలోచించ లేక పొయ్యాను. వేడి వేడి టీ తాగి స్నానం చేసి వచ్చే సరికి సరికి టీవీ లో "చక్ దే" సినిమా చూస్తున్నాడు మా సుపుత్రుడు. మొత్తంగా కాక పొయినా ఆ సినిమా లోని చాలా సన్నివేశాలు నన్ను అనేకసార్లు టీవీ కి కట్టి పడేసాయ్. కాబట్టి సహజంగానే మరలా కొంత సేపు టీవీ కి అతుక్కుని పోయాను. 
" రేపు యెదో ఒకటి చెప్పాలి...పొద్దుటే ఆయన కూడా వస్తారట..." మా శ్రీమతి  మరలా ఆ విషయాన్ని  కదిపింది. దీనికి పెద్దగా ఆలోచించేదేముంటుంది. ఇలాంటి సమస్యలు ఇంతకు ముందు కూడా వచ్చాయి ....అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మిగిలిన వాళ్ళందరితో చర్చించి ఒక తీర్మానం కూడా చేయించగలిగాను. పైన అంతకు ముందే ఒక బెంగాలీ క్రిష్టియన్ ఫేమిలీ కూడా కొత్తగా వచ్చినప్పుడు ఇంట్లో ప్రేయర్ పెట్టుకోడంతో బాటు మైక్ పెట్టినప్పుడు వారికి సున్నితంగా వివరించి దానిని కట్టి వేయించడం జరిగింది. అలాగే ఒక సాయిబాబా భజన కూడాను...  
"కొత్తగా ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు లోకల్ గా పవర్ ఫుల్ ఫేమిలీ అంట..ఇక్కడంతా వాళ్ళ కమ్యూనిటీ యే నంట..."
చిన్న హెచ్చరిక లాంటిది చేసింది ... శ్రీమతి. 
నాకు యాదాలాపంగా యీ మధ్యనే చదివిన "గాంధీ అనంతర భారత దేశం (రామ చంద్ర గుహా)"  గుర్తుకు వచ్చింది. నిజానికి పరిమాణ రీత్యా ఆ నాడు రాజీవ్  గాంధీ కి వచ్చిన విపత్తుకి ...యీ నాడు మాకు వచ్చిన విపత్తు కి యే మాత్రం పొంతన లేక పోయినా మా యీ చిన్న ప్రపంచానికి ఇది కూడా ఒక సమస్య అవుతుందేమోనన్న హెచ్చరిక కనబడింది నాకు మా శ్రీమతి మాటల్లో. కొన్ని ఉప యెన్నికల్లో వోటమి వచ్చినంత మాత్రాన లోక్ సభ చరిత్ర లోనే అత్యంత సంఖ్యా బలం సాధించిన  చరిత్ర ఉన్న ఆయన "షాబాను" విడాకుల భృతి విషయంలో ఒక మైనారిటీ మతస్థుల లోని  చాందసులకు ఎలా లొంగి  పొయ్యేడో ...ఆ వెంటనే మెజారిటీ మతస్థుల వోట్ల కోసం ఆయన చేసిన పనులు.......అవన్నీ భారత దేశాన్ని యీ నాడు యే పరిస్థితికి దిగ జార్చాయో అంతా చూస్తూనే ఉన్నారు.
మరలా నా ఆలోచనలు మా ఫ్లాట్ సమస్య వైపు మరలాయి. నేను ఒక స్థిర నిర్ణయానికి వచ్చాను.  మొత్తానికి మా ఇరవై ఫ్లాట్స్ కి ఒక ఖచ్చితమైన రూల్స్ మైంటైన్ చేసి తీరాల్సిందే. యీ విషయమే అందరికీ చెప్పేస్తాను. ఒక వేళ లోకల్ వాళ్ళని మిగిలిన వాళ్ళు భయ పడితే వేరే నిర్ణయం మిగిలిన వాళ్ళనే చేయనిస్తాను. బయటి శక్తులకి భయపడి సిద్దాంతాల విషయంలో రాజీ పడి నేను న్యాయ విరుద్దమైన పనికి నేను సహకరించ లేను కాబట్టి నేను నా పదవికి వెంటనే రాజీనామా ఇవ్వడానికి కూడా నిర్ణయించుకున్నాను. ఇదేమైనా దేశ ప్రధాని  పదవి కాదుగా ....


మరలా పాత సంఘటనలన్నీ యెందుకో గుర్తుకు రావడం మొదలయ్యింది. బాబ్రీ మసీదు  కూల గొట్ట బడినప్పుడు మేము హైదరాబాద్ లోనే ఉన్నాం. కర సేవకులు దేశం నలు మూలల నుండీ కదులుతున్నారన్న వార్తలు ముందునుండీ ఉన్నాయి కాబట్టి కేంద్రం సరైన యేర్పాటులతోనే ఉంటుందని అందరం వూహిస్తూ ఉండే వాళ్ళం. బహుశా యీ దేశ జనాభాలో పాలకుల నిజాయితీ మీద నమ్మకం ఉన్న ప్రతి పౌరుడూ అలానే ఆలోచించి ఉంటాడు.  మొత్తానికి నిజాయితీ మీద నమ్మకమే దెబ్బతిన్నది. ప్రతి పక్షాల అమ్ముల పొదిలోనుండి ఒక ప్రధాన ఆయుధం నిరుపయోగం కానున్నదని పాలక పక్షం ....ఒక గొప్ప చారిత్రాత్మక కర్తవ్యాన్ని నిర్వర్తించిన  ఘనత (పైకి చెప్పక పోయినప్పటికీ ) తమకి ఉండిపోతుందని కీలక పాత్ర వహించిన ఘన మైన ఒక ప్రధాన ప్రతిపక్షం ...యెవరి ప్రయోజనాలు వారు వూహించుకొన్నారు. మిగిలిన మతాల పురాణాల గురించి నాకు అంతగా తెలియదు కానీ హిందువు అన్నవాడు ప్రతి ఒక్కరూ భాగవతాన్ని  విధిగా చదువుతారు. మాకు వూహ వచ్చేటప్పటికే కంఠస్థం  అయిన పద్యం "ఇందుగలడందు లేడని......" . బహుశా ఇది అన్ని భాషలలోనూ ఉంటుందనే అనుకుంటున్నాను. మరి అన్ని చోట్లా భగవంతున్నాడని నమ్మిన మతం లో పుట్టిన మనం (హిందువులం) పాలక వర్గాల కుట్రలకు బలవ్వడం యెంతవరకూ సబబు ? బాబ్రీ మసీదు కూల్చివేత నేపధ్యం లో జరిగిన గోద్రా ఘటన... తదనంతరం గుజరాత్ లో జరిగిన మారణ హోమం ఎవరి మూర్ఖత్వ ఫలితం? పోయిన నెల 27 తారీఖున హిందూ లో పడిన ఆర్టికల్ .....1984 లో ఢిల్లీ  లో  సిక్కుల ఊచ కోత కు సంబందించిన సాక్షుల  వీడియో రికార్డింగ్ లు ఒక్క సారి చూడండి. మన సమాజంలో మిగిలిన మానవతా శాతాన్ని కొలిచి చూపుతాయ్. ఒక కుటుంబంలో పెద్దన్న యెప్పుడూ సహనంతో మిగిలిన వారిని చక్క దిద్దుతాడు. అప్పుడే ఆ కుటుంబం పదిమందికీ ఆదర్శ వంత మవుతుంది. యీ ప్రపంచ దేశాలలో మనకొక గౌరవ స్థానం కావాలన్నా .......మనం ప్రశాంతంగా అభివృద్ది మార్గం లో నడవాలన్నా......మూర్ఖత్వం  ఉన్న వాళ్ళని మన మధ్య లో నుండి గెంటి వేయడం ఒక్కటే సరైన మార్గం. ఒక చిన్న ఉదాహరణని ఇక్కడ ప్రస్తావించడం తప్పని సరి . మా అపార్ట్మెంట్ ఒక కూడలి లో ఉంది. రెండువైపులకి ఒక ప్రధాన రహదారి...మిగిలిన రెండు వైపులకూ 20-30 అడుగుల రోడ్లు ఉంటాయ్. యీ 20-30 అడుగుల రోడ్లలో కూడా యెప్పుడూ చాలా ట్రాఫిక్ ఉంటుంది. మా పక్కనే ఉన్న ఇరుకు రోడ్ లో ఒక రోజు యేదో మార్కింగ్ చేయబడి ఉంది. మేము పెద్దగా పట్టించు కోలేదు. మరునాడే అక్కడ తవ్వడం ప్రారంభించ గానే మేమంతా వెళ్ళాం. ఆ తీస్తున్న గోతులు ట్రాఫిక్ కు పెద్ద అవరోధంగా మారాయి. మేము ఆ పనిని ఆపగానే ఒక ఆర్గనైజర్ల బృందం అక్కడ తయారయ్యింది.వాళ్ళు వివరించినదేమిటంటే ఆ వీధి లోపల ఒక గుడి ఉన్నదట . దాని ముఖద్వారం నిర్మాణం  చేయాలని వాళ్ళంతా సంకల్పించారట." మరి ట్రాఫిక్..." అని మేమడిగితే "మేమంతా మీకంటే ముందు నుండీ ఇక్కడ ఉంటున్నాం సార్...సమస్యలు మాకు కూడా తెలుసు..... దైవ కార్యానికి అడ్డు రాకండి..." అంటారు. మొత్తం మీద సమాజం యెలా తయారయ్యిందంటే..పై వర్గాల వారికి సమాజానికి యేమైనా చేయవలసిన అవసరం లేదు. దిగువ మధ్య తరగతి నుండి క్రింద వరకూ యేదైనా మంచి పని చేయడ మంటే వినాయక చవితి కి..దసరాకు  పందిళ్ళు వేయించి మైక్ సెట్లు పెట్టి ఆఖరి రోజున ఒక ఊరేగింపు జరపడం తో సరిపోతోంది. మొతానికి యీ మైకుల గోల లేని సౌండ్ ప్రూఫ్ కాలనీ లు.......యీ గోలతో సరిపెట్టుకొని  ..ఆనందించగలిగే స్థాయి వారి   కాలనీ లు గా నగరాలు విడి పోతూనే ఉన్నాయ్. ఇవేమీ యువతకు పట్టకుండా మీడియా...సినిమా వర్గాల వారు ...అందరికీ మించి కార్పొరేట్ స్కూల్/కాలేజ్ వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుంటారు.  ఒక ప్రాంతంలో ఒక మత ..కుల ఘర్షణ తలెత్తితే వాటి నివారణకు  తాము యెవరి పక్షం వహించాలనే దిశా నిర్దేశం నేటి యువతకు యెవరైనా యీయ గలుగుతున్నారా... ? 


నా దురదృష్ట  వశాత్తూ లాల్ బహాదూర్ శాస్త్రి గారి గురించి పెదగా చదవ లేదు. ఒక విజన్ ఉన్న నాయకత్వం ..హుందా తనం నెహ్రూ తోనే అంతరించి పోయిందనుకో వచ్చు. విజన్ ఉన్న నాయకుడికీ లేని నాయకుడికీ ఉన్న ప్రధాన మైన తేడా యేమిటంటే విజన్ ఉన్న నాయకుడు తన సిద్దంతాలతో ప్రజలను..సమాజాన్ని ముందుకు నడిపిస్తాడు. విజన్ లేని వాడంటే  ప్రజలలో అణగారి పోతున్న మూర్ఖత్వాన్ని  పైకి లేపి తద్వారా వాళ్ళని ..సమాజాన్ని ...వెనక్కు నెట్టి తన ప్రయోజనాల తో ముందుకు పొయ్యే వాడు. 


ఒక సారి అనుకోకుండా బలవంతంగానే మా కులాం వాళ్ళు ఎరేంజ్ చేసిన వన భోజనానికి వెళ్ళ వలసి వచ్చింది. ఒక మంచి ఆశ్రమాన్ని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ గా నేను అక్కడ అందరికీ పరిచయం చేయబడ్డాను. నా చుట్టూ చేరిన వారందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసాను. మన కులాన్ని మన ఒక్కళ్ళమే ఒక చోట చేరి పొగుడు కొంటే పెద్ద ప్రయోజనమేమీ ఉండదు.... అదే మనమంతా యేదైనా మంచి పని చేస్తే మనలను మిగిలిన వాళ్ళు కూడా పొగుడుతారు. ఇది యెంత మందికి యెక్కిందో తెలియదు కానీ ఇదే విషయాన్ని మిగిలిన కులాల వాళ్ళందరూ పాటిస్తే.....అసలు కుల పోరాటాలు ఉంటాయంటారా.....? ఇదే సూత్రం అన్ని మతాల వారికీ కూడా వర్తిస్తే......
ఒక్క విషయం యేమిటంటే న్యాయంగా.....కాస్తో కూస్తో....మానవత్వంతో అలోచిస్తూ వ్యాపారం చేసే వారికి మత మూర్ఖత్వం అవసరం ఉండదు. అలా కాకుండా కేవలం నెం.1 గా వ్యాపారంలో   మాత్రమే ఎదగాలునుకునే వారికి ప్రజల  మూర్ఖత్వం ఆయుధంగా మారుతుంది. అది తెలివైన వారు...విజ్ఞులు...గమనించి ప్రజలను చైతన్యవంతులను చేయాలి.


 ఇవన్నీ  యేవీ  చేయకుండా ..కొంత మంది ఒక హోం గార్డ్ ను చంపో....పొట్ట పోసుకోడానికి....కుటుంబాన్ని పోషించికొడానికో...ఉద్యోగం చేస్తున్న పోలీస్ ను చంపో ....సమాజంలో విప్లవానికి మార్గం చేస్తున్నామని భావించుకునుంటే మాత్రం వాళ్ళ సిద్దాంతాన్ని నమ్మి బలై పోతున్న వారిని చూసి జాలి పడడం తప్ప చేయగలిగేదేమీ ఉండదు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి