13, జూన్ 2011, సోమవారం

నేటి ప్రేమలు ..రకాలు....మజిలీలు... ..



నేను కాలేజీ లో చదువుతున్న రోజుల్లో నా కొక స్నేహితుడుండే వాడు. బాగా కష్ట పడి చదివే వాడు. ఏ వ్యసనాలూ లేవు. అప్పట్లో నటుడు గా అనిపించుకోడానికి ఏ అర్హతలూ లేని ఒక ప్రముఖ నటుడి అభిమాన సంఘానికి కార్యదర్శి గా కూడా పని చేసినట్లు గా కూడా గుర్తు. నాతో అప్పుడప్పుడు బయటకు వస్తుండే వాడు. కానీ ఏ రోజు కూడా నేను నా తోటి మరి కొంత మంది ఏం మాట్లాడుకొంటున్నామో వాడికి ఎప్పుడూ పట్టేది కాదు. కాక పొతే నా ఆవేశ పూరిత మైన మాటలు వాడికి బాగా నచ్చుతూ ఉండేవేమో. కానీ ఎప్పుడూ వాడు నేను పాల్గొంటున్న కార్య క్రమాల వల్లతగ్గి పోతున్న నా మార్కుల గురించే బాధ పడుతూ ఉండే వాడు. ఆ రోజుల్లోనే నేను అప్పుడప్పుడు పాడు చేస్తున్న కాగితాలను జాగ్రత్త చేస్తుండే వాడు. బహుశా ఆ పని వాడి జీవితంలో వేరే ముఖ్యమైన సంఘటనకు దారి తీస్తుందని వాడేనాడూ ఊహించి కూడా ఉండడు. అక్కడికే వద్దాం. 

వాడి స్కూల్ క్లాస్మేట్ కుటుంబంతో వాడికి చిన్నప్పటి నుండీ సన్నిహిత సంబంధం ఉండేది. ఆ అబ్బాయి సోదరిని వీడు తెగ ప్రేమించడం కూడా కాలేజ్ రోజుల నుండే స్టార్ట్ చేసేడు. బహుశా ఆలోచనా స్థాయి లలో ఉండే తేడా ల వలన వీడు యెంత ప్రయత్నించినా ఆ అమ్మాయికి సన్నిహితుడుగా కూడా కాలేక పొయ్యాడు. ఇంతలో ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఆ తరువాత వీడు ఒక్క విషయం కనిపెట్టాడు. నేను పాడు చేస్తున్న కాగితాల లోని విషయాల గురించి ఆ అమ్మాయి ,మిగిలిన కుటుంబ సభ్యులు మాట్లాడుకొంటున్నారని. వెంటనే జాగ్రత్త పెట్టిన చెత్త ఆంతా వాళ్ళ కు చూపించాడు. బహుశా విషయ సారూప్యత వలన వాళ్లకు అవి బాగానే నచ్చి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకుని రమ్మని వీడికి చెప్పడం జరిగింది. కనీసం వీడిని ఎలివేట్ చేయడం కోసమైనా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. వాళ్ళందరితో మాట్లాడిన తరువాత వీడితో నిర్మొహమాటంగా ఒక విషయం చెప్పేసాను.

 " ఒరేయ్.....ప్లేన్ ఆఫ్ థింకింగ్ అనేది ఒకటి ఉంటుంది. మీ యిద్దరికీ అది ఏ మాత్రం మేచ్ కాదు. ఇక్కడ మంచి...చెడ్డ...అభ్యుదయం .....తిరోగమనం...గురించి నేను నీకు చెప్పినా తలకెక్కదు..."

 అన్నాను . అలాగే వాడి తలకెక్కలేదు సరి కదా.... వాడు వెంటనే సమాధానం మాత్రం చెప్పేసాడు. " లేదురా నేను కూడా మారుతున్నాను ....ఉదయాన్నే గుడికి వెళ్తున్నాను...నిన్ననే మీరు చదువుతున్న పుస్తకాలు కొన్ని కొన్నాను..." 

"గుడికి ఎందుకురా......" విస్తుపోతూ అడిగాను.

" ------ పేరిట అర్చన చేయిస్తున్నాను" కొంచెం సిగ్గు పడ్డాడు..మెలికలు కూడా తిరిగాడు.
పాపం వాడు మాత్రం ఏమి చేస్తాడు...అప్పుడే కాదు ఇప్పుడు కూడా....సినిమాల లో ( అలౌకిక ) ప్రేమ ప్రకటనకు ఇదొక మార్గం కదా....."

నాకేమనాలో అర్ధం కాలేదు.

" సరేలే ....మాటలు ...చేతలు ....ఎప్పుడూ ఒక్కలా ఉండవు. మీ యిద్దరి కులాల కూడా ఒక్కటి కాదు కాబట్టి వెంటనే నీవు నీ అభిప్రాయం ప్రకటించేయకు....మొత్తానికి మోసం వస్తుంది." 
అన్నాను.
నేను ఆ రోజుల్లోనే రాచమల్లు రామచంద్రా రెడ్డి గారి " సారస్వత వివేచన " లో మహీధర రామ్మోహన రావు గారి "కొల్లాయి గట్టితేనేమి", "దేశ చరిత్రలు" లోని పాత్రల ద్వంద్వ ప్రవృత్తుల గురించి ఆయన రాసింది నేను కూడా ప్రాక్టికల్ గా అప్పటికే అనుభవించి ఉన్నాను.
మా వాడికి మాత్రం ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళ మాటల మీద బాగా నమ్మకం పెంచు కొన్నాడు కాబట్టి తన మనసులో ఉద్దేశ్యాన్ని వెళ్లగక్కే అవకాశం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు.ఒకసారి ఆ అమ్మాయి అమ్మ గారితో కలసి ఏదో ప్రయాణం చేస్తున్న సందర్భంలో వెళ్ళగక్కాడు కూడాను. వెంటనే ఆవిడ ఫీలింగ్స్ మారడమే కాకుండా ఆ తరువాత ఆ ఇంట్లో వీడికి మంచి నీళ్ళు కూడా దొరకడం మానేసాయ్. 

ఇక్కడ కులాల అంతరాలే కారణం కానక్కర లేదని నాకు తెలుసు. కానీ మా వాడికి అదేమీ యెక్క లేదు. అసలు ప్లేన్ ఆఫ్ థింకింగ్ అనేది ఒకటి ఉంటుందని వాడికేనాడు తట్ట లేదు. ఆ తరువాత వాడు " చచ్చి పోవాలని ఉంది"..లాంటి డైలాగులు చాలా చెప్పాడు ...కానీ నేను అంతగా పట్టించు కోలేదు. ఆ తరువాత వాడు కూడా పెద్దగా పట్టించుకోలేదు ఆ తరువాత మరో ౩౦ రోజుల్లోనే వాడు వేరొక అమ్మాయిని మరింత ఘాటుగా ప్రేమించడం మొదలు పెట్టాడు. ఇక్కొడక అదృష్టం ఏమిటంటే పది రోజుల పరిచయానికే ఆ అమ్మాయి మా వాడి విరహం భరించ లేక వీడు ఆవిడను వీడి వచ్చేటప్పుడు కన్నీరు మున్నీరు అయినట్లుగా వీడు చెప్పాడు. ఆ తరువాత కొద్ది రోజులకే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఉంటారనడం లో ఎలాంటి సందేహమూ ఉండనవసరం లేదనుకుంటాను. ఆ తరువాత వారి వైవాహిక జీవితం ఎమయ్యిందన్నది తరువాత తరువాత చెప్పుకుందాం. నేనిప్పుడు చెప్పిన సంగతి పంతొమ్మిది వందల ఎనభై దశకం మొదటి సగం లోనిది. అప్పటికింకా యువతరానికి కొంత నిబద్దత, సామాజిక స్పృహ లాంటివి ఉన్నాయి కాబట్టి ఇటువంటివి ఓటమిగా తీసుకొనే చెత్త లక్షణం లేదు కాబట్టి వాడు పీక కోయడం ,ఆసిడ్ పోయడం లాంటి వాటి గురించి ఆలోచన కూడా చేయలేదు. వాడే కాదు ఎవ్వరూ చేసే వారు కాదు.

అసలు సమస్య దగ్గరికి వద్దాం. ప్రేమించడమన్నది ఎప్పటి నుండి ఉన్నది .....అని అడిగితే మాత్రం సమాధానం అంత తేలిక కాదు. కాని వచ్చిన గొడవ ఏమిటంటే జీవితంలో అనేక రకాల ప్రేమలు ఉన్నప్పుడు మనకు దీని గురించే అంత ఆలోచన...ఎందుకు అనేదానికోసం ఆలోచిద్దాం. నిజమే చాలా ముఖ్య మైన విషయమే. కానీ పాత రోజులలో ఇది జీవితంలో ఒక భాగంగానే ఉండేది.కానీ మన సమాజం లోకి సినిమాలు చొచ్చుకుని వచ్చి అవే మన సంస్క్రుతీ పరమైన ఆలోచనలకు ఆహార్యాన్ని అందించడం ప్రారంభమైన నాటి నుండీ యౌవ్వనం అంకురించిన ప్రతి ఒక్కడికి ఇదే జీవిత పరమార్ధమై కూర్చుంటుంది. సినిమాలు మొదలైన తొలిదినాల్లో ఈ పరిస్థితి లేదు కావాలంటే చూడండి..మొదట పురాణాలు...ఆ తరువాత "రైతు బిడ్డ".."మళ్ళీ పెళ్లి" లాంటి అభ్యుదయ సినిమాలు ..ఆ తరువాత కూడా విజయా వారి షావుకారు...మిస్సమ్మ లాంటి కుటుంబ ...సునిశిత హాస్య సినిమాలు వచ్చాయి. కానే హీరోఇజం పెరిగిన తరువాత అతడి ఇమేజ్ పెంచడానికి ఈ ఒక్క అంశాన్ని మాత్రమె ప్రధానం చేసారు ఎందుకంటె మూడు గంటలు పొడిగించడానికి, అందమైన హీరోఇన్లను ఎక్స్పోస్ చేయడానికి వేరే ఏ సబ్జెక్ట్ కూడా అనువైనది కాదు.

 చాతుర్వర్ణ వ్యవస్థ రాజ్య మేలినంత కాలం వేరే ఎవ్వరికీ హీరో లుగా మారే ఆలోచనలే అంకురించేవి కాదు. స్వాతంత్రోద్యమ కాలంలో ఉద్యమం లోకి వెళ్ళిన వారికి హీరో ఇమేజ్ ఉండేది...కానీ రాను రాను సమాజంలో సమస్యలున్నప్పటికీ పోరాటాలు కరువయ్యాయి. పోరాడడానికి ధైర్యం..స్ఫూర్తి ..కరువయ్యాయి..సిద్దాంతిక వైఫల్యలూ తోడయ్యాయి. కానే ఉన్న విషయమేమిటంటే యౌవ్వనం లో ఉన్న ప్రతి ఒక్కడికీ హీరో అనిపించుకోవాలనే కోరిక అంతర్లీనంగా ఉంటుంది. దానికి ప్రతి ఒక్కడూ ఎంచుకొనే మార్గం ఏమిటంటే వీలైనంత వరకూ "ప్రేమించ బడేటట్టు " గా చెప్పుకో గలగడం దాని ద్వారా తన ఇగో ని సంతృప్తి పరచుకోవడం ఒక అలవాటుగా మారింది.

ఒక విషయం ఏమిటంటే మనిషి లో కోపం,అసూయ, అమాయకత్వం లాంటి ఒక లక్షణమే ప్రేమ కూడా. మిగిలిన ఏ విషయానికి స్పందించని యువకుడు ఎవడైనా కానీ తన విషయంలో కొంచెం ఎక్కువగా స్పందించడం చేయగానే అమ్మాయికి అనుమానం సహజంగానే వాడిది "ప్రకోపమే" కానీ ప్రేమ కాదని అర్ధం కావాలి. కానీ అలా జరగడం లేదు కారణమేమిటంటే మోసగింప బడే సగ భాగం లో ఉన్నామని చాలా మంది అమ్మాయిలకు ఈనాటికి కూడా అర్ధం కావడం లేదు. ఒక మంచి పుస్తకం కొని చదవలేని వాడు....ఏ సోషల్ కాజ్ కు స్పందించని వాడు...సమకాలీన సమాజం మీద..రాజకీయాల మీద కనీస అవగాహన లేని వాడు..వాడి ఇగో సంతృప్తి పరచుకోనడానికి మాతమే ఏదోలా ఎవరో నలుగురిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. అలా తన కు ప్రతిస్పందించిన మొదటి అమ్మాయికి తనకు మధ్య శరీరంలో కొత్తగా బయలుదేరి అల్లరి పెడుతున్న హార్మోన్ల ప్రభావం వలన ఏర్పడిన బందానికే "లవ్" లాంటి పేర్లు పెట్టేసు కొని దానిని సిద్దంతీకరించేసు కుంటున్నారు కొంత మంది అమ్మాయిలకు విషయం అర్ధం అవుతున్నా కూడా ఆఖరి వరకు ఉదాసీనత తో ఉండి ( లేదా ఏదో బకరా గాడు ) ఒకే సారి తృణీకారం చూపిచడం కూడా చేస్తున్నారు. బహుశా దాని వలన కూడా కొన్ని ఆసిడ్ దాడులు జరిగాయేమో నని అనిపిస్తోంది.

మేము కాలేజ్ లో చేరిన కొత్తలో నే మహానుభావుడు ..మహా రచయిత "చలం " ఈ లోకాన్ని వీడడం జరిగింది. కాబట్టి ఏ పేపర్ తిరగేసినా ,పుస్తకం చూసినా ఆయన గురించి రాసిన వ్యాసాలు పుంఖాను పుంఖాలుగా వస్తుండేవి. అవన్నీ మా బృందం మీద చూపిన ప్రభావం ఆంతా ఇంతా కాదనే చెప్పాలి. నెమ్మదిగా ఆ పుస్తకాలన్నీ చదివి వాటి మీద చర్చించడం కూడా చేసే వాళ్ళం. ఆ తరువాత ఆయనే ఎక్కువ సార్లు ఉటంకించిన " బెర్ట్రాండ్ రస్సెల్ " రాసిన " మేర్రెజ్ అండ్ మోరల్స్" అనే పుస్తకం చదవడమే కాకుండా గంటల తరబడి లైబ్రరీ లో కూర్చుని అనేకానేక పేరాలను నోట్ చేసుకుని వస్తుందే వాళ్ళం. ఇక ఆ రోజుల్లోనే తెలుగు సాహిత్యం లో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించిన "బుచ్చి బాబు" రాసిన "చివరకు మిగిలేది " మాకీనాటికీ ముగియని చర్చా వేదిక లను మిగిల్చాయి. ఇవన్నీ కాకుండా పాల్గొంటున్న ఉద్యమాలు ..మాలో చాలా మందికి ప్రేమించే టైం లేకుండా చేసాయి..కానీ మాకొక మంచి అవగాహననిచ్చాయి అని చెప్పుకోడానికి ఈ నాటికీ గర్వ పడతాను.

అప్పట్లోనే మా అవగాహనకు పదును పెట్టే సంఘటన ఒకటి జరిగింది. నా స్నేహుతుడు ఒకరికి దొంగ తనంగా ఎదుటి వారి ఉత్తరాలు చదివే అలవాటు ఉండేది. మా కాలేజ్ జీవితం ముగిసిన కొద్ది రోజుల వరకూ మేము హాస్టల్ లో ఉన్నాం. ఒక రూం లోకి వెళ్ళిన ఆ ఫ్రెండ్ వెర్రి కేకలు విని మేమంతా పరుగెత్తాం. అతడి చేతిలో ఏదో లెటర్ ఉండి ( ఆ రూం లో ఉండే విద్యార్ధిది )...మనిషి వణుకుతున్నాడు. మేము కూడా చదివి ముందు నిర్విన్నులమై పొయ్యం. కానీ వెంటనే చేయవలసిన కర్తవ్యం గురించి అలోచించి ...ఆచరణకు ఉపక్రమించాం. ఆ లేఖను యధావిధిగా ఉంచేసాం. అంతట్లోనే దానిని రాసిన విద్యార్ధి వచ్చాడు. మేమంతా ఎమీఎరగనట్లుగా " ఎప్పుడు వెళ్తున్నవోయ్ " అని అడిగాం. ఏదో పొడిగా సమాధానం చెప్పాడు. మనిషి కంగారుగానే ఉన్నాడు. వేరొక స్నేహితుడు నెమ్మదిగా అతడి వెనుకగా చేరి ఒక్క సారిగా అతడి చేతులు మెలి తిప్పి పట్టుకున్నాడు . మిగిలిన వాళ్ళు అతడి జేబుల్లోని నిద్ర మాత్రలు లాక్కొన్నారు. విషయం నెమ్మదిగా అతడికి అర్ధమయ్యేలా చెప్పాం. కేవలం ముప్పై ఆరు సంవత్సరాల వయస్సు ఉన్న అతడి తల్లి ప్రవర్తన పట్ల అతడికున్న అపార్దాలను తొలగిస్తూ .....ఒక వేళ సమాజం ఆమోదించని సంబందాలు ఉన్నా కూడా దాని కోసం ఆత్మహత్యా ప్రయత్నం చేయడం అర్ధం లేని విషయమంటూ భిన్న సామాజిక నేపద్యాల గురించి ఎన్ని కోణాల్లో ఆలోచించాలో వివరించాం. అంటే కాకుండా అతడి మేన మామకు అతడిని క్షేమంగా అప్ప చెప్పాం. చాలా సంవత్సరాల తరువాత అతడే ఉన్నత స్థానానికి ఎదిగి హైదరాబాద్ లో కలసి నప్పుడు ఆప్యాయంగా వాటేసుకొని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నప్పుడు నాకు కలిగిన ఆనందాన్ని ఎలా వర్ణించగలను? ఇప్పుడైతే ఫ్రెండ్స్ సర్కిల్ ఆంతా కలసి ఆ తల్లి మీద ఆసిడ్ పోసే సలహా ఇచ్చి ఉండేవారేమో...(ఇక్కడొక చిన్న విషయం చెప్పాలి ......కాలేజ్ లో స్ట్రైక్ లు జరిగినప్పుడు ....స్టూడెంట్స్ యూనియన్ ...జిందాబాద్ ...అని అతగాడే గట్టిగా అరిచేవాడు ....అలా అరవడమే నాయకత్వలక్షణ మనే భావనలో ఉండేవాడు కూడా .... )

పూర్తిగా వ్యక్తిగత ప్రయోజనాలే ప్రధానమనుకునే స్థితి లో సమాజం ఉన్నదనుకొనే మనం కొన్ని చర్చలు చేద్దాం. మనకేం కావాలో తెలియాలంటే ప్రస్తుతం మనం ఏ సామాజిక పరిణామ దశ లో ఉన్నామో తెలియాలి . అసలు మనమంతా ఒకే ప్లేన్ లో ఉన్నామా .....లేమని అందరికీ తెలుసు. మరి అటువంటప్పుడు అందరి ప్రయోజనాలు, ఆశలు ఒకేలా ఎలా ఉంటాయ్? మరి అటువంటప్పుడు ఎవరు ..ఏ విధమైన నిర్ణయాలు తీసుకొంటే వారికి , వారి చుట్టూ ఉన్న వారికి ప్రయోజన కరంగా ఉంటుందో చూసుకోవాలి.

మన ప్రస్తుత సమాజం క్లిష్టమైన...సంధి దశలో ఉన్నది. స్వాతంత్రోద్యమంలో పాల్గొనే నాయకులకే స్వాతంత్రానంతర భారత దేశ సమాజం ఎలా ఉండాలన్న దాని మీద ఒక నిర్దిష్టమైన అభిప్రాయం లేదు. రాజకీయ పోరాటానికి ....సాంస్క్రుతిక పరిణామానికి మధ్య సరైన లింక్ లేకుండా పోయింది. చలం రచనలు...కుటుంబ రావు గారి "చదువు " లాంటి నవలలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తాయి. స్త్రీలు అనేక మంది ఉద్యమం లోకి వచ్చినప్పటికీ స్త్రీ పురుష సంబంధాల మీద ....సాంస్క్రుతిక పునరజ్జీవనం పట్ల పెద్దగా నాయకత్వం దృష్టి పెట్టలేదనేది నిర్వివాదాంశం. మన స్వాతంత్ర్య పోరాటం యావత్తూ నాయకుల మీద ఆధార పడి నడచిందే తప్ప ..సిద్దాంత బలం మీద కాదు. సమాజం యావత్తూ ఫ్యూడల్ భావజాలంలో ములిగి ఉన్నప్పుడు , పట్టణాల్లో సెమి ఫ్యూడల్ వాతావరణం ప్రవేశదశ లో ఉన్నప్పుడు మనకు స్వాతంత్ర్యం వచ్చింది. పునాదుల్లో ఉన్న భావజాలం ఇప్పటికీ ఇంచుమించు ఇదే కానీ దీనిమీద నియో రిచ్ కల్చర్ ..మళ్ళీ దాని పైన ఈ మధ్య దాని పైన గ్లోబలైజేషన్ పూత కూడా పూయడం జరుగుతోంది. పై వన్నీ పూతలే కాబట్టి మన స్వభావం..ప్రయోజనాలు మన ( కుటుంబ ) ప్రస్తుత సామాజిక దశ మీదే ఆధార పడి ఉంటాయి అంటే పునాది మీదే ఆధార పది ఉంటాయి.

ఉదాహరణకు యువతీ యువకులు నియో రిచ్ క్లాసు అయ్యి పునాదులు అర్బన్ ప్రాంతానివయ్యి ఉంటే వాళ్ళకు పెద్దగా సాంస్కృతిక పునాదులు లేవన్నట్లే. కాబట్టి వాళ్ళు ఎవరితో అయినా అడ్జస్ట్ అవ్వగలుగుతారు ఒక్క సిద్దాంత పర మైన ఆలోచనలు ఉన్న వారితో తప్ప. వాళ్ళ తలిదండ్రులకి కూడా వీళ్ళ ఆర్ధిక పురోగతి తోనే సంబంధం కాబట్టి ఆ విషయంలో వాళ్ళను తృప్తి పరచ గలిగితే చాలు ఎవరికీ ఇబ్బందులు లేనట్టే. అలాగే సమాజ పరివర్తనం మీద కొంత అవగాహన ఉన్న కుటుంబ నేపద్యం ఉన్న యువతీ యువకులకు కూడా ఆ యా సిద్దాంతిక పునాది ఉంటుంది కాబట్టి ..ఏ పునాది లేని వాళ్ళను వీళ్ళు మానసికంగా దగ్గరకు రానీయరు కాబట్టి పైగా తమ పురోగతి ..సామాజిక పురోగతికి దోహద పడగలదనే విశ్వాసం వీళ్ళను ముందుకు నడిపిస్తుంటుంది ..కాబట్టి సాధారణంగా వీరి వలన కూడా ఎవరికీ ఏ ఇబ్బందీ ఉండదు. గ్రామీణ నేపద్యం ఉండి ..సెమీ ఫ్యూడల్ కుటుంబాలకు చెంది...ఏ విధమైన సామాజిక స్పృహ లేని యువతీ యువకులు మాత్రం జీవితంలో చాలా ముఖ్యమైన విషయాల్లో కేవలం టాస్ వేసి నిర్ణయాలు తీసుకుంటున్నారు. యౌవ్వనంలో మనం తీసుకున్న నిర్ణయాలు కేవలం విత్తనాల లాంటివని దాని ఫలాలు మాత్రం చాలా కాలం తరువాతే వస్తాయని అర్ధం చేసుకొనే సరికే జీవితం చేజారి పోతోంది. ముఖ్యంగా ఆ వయసులో పై పై న చూసే చాలా విషయాలు సాపేక్ష మైన వని అర్ధం చేసుకో లేక పోతున్నారు. అంటే నీకు బాగా ఆకలి వేసి నప్పుడు దొరికిన ఏ ఆహారాన్నైనా చాలా రుచిగా ఉన్నదనే అనుకొంటాం. కొంత సేపైన తరువాత కొంత ఆకలి తీరినప్పుడు వేరే మంచి ఆహారం కనబడ గానే ఈ తింటున్న ఆహారం అంతకు ముందున్నంత రుచిగా అనిపించదు. బలమైన సిద్దాంతిక నేపద్యం ఈ ఆహారాన్ని తీసుకునే క్రమాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అందువలనే ఏ సిద్దాంతిక పునాదులు లేని వాళ్ళు ..వాళ్ళ కుటుంబ సభ్యుల అభిప్రాయాలు పరిగణన లోనికి తీసుకోవడం శ్రేయస్కరం. ఎందుకంటే నిర్ణయం సమిష్టి ది కాబట్టి ....పైగా ఆ సభ్యులున్న పునాది మీదే నీవు కూడా ఇప్పటి వరకూ క్షేమంగా నిలబడ్డానని నమ్మకం నీకున్నది కాబట్టి. అలా కాకుండా నీ పునాది బలమైనది కాదు అని నీకు అనిపించినప్పుడు మాత్రం వేరే బలమైన పునాది ఉన్న వాళ్ళ వైపు వెళ్ళాలి కానీ పునాది ఏమిటో కూడా తెలియని స్థితి లో ఉన్న పునాది ని దూరం చేసుకోడం తెలివైన పని కాదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి