29, సెప్టెంబర్ 2012, శనివారం

కనుమరుగైన / అవుతున్న పాత్రలు

"ఏరోయ్.....ఎప్పుడు వచ్చావ్..వూర్లోకి...."
బజార్లో తిరుగుతున్న నన్ను మా  బంధువు ఒకాయన పలకరించాడు.
"రెండు రోజులయ్యింది మావయ్యా...అక్క ఎలా ఉంది?
"అంతా బాగానే ఉన్నార్రా....నేను కూడా మీ నాన్నను కలసి చాలా రోజులయ్యింది..ఎలా ఉన్నాడు?"
గొంతులో పచ్చి వెలక్కాయ పడింది.ఏమీ మాట్లాడకుండా నిలుచున్నాను.
"మీ పెద్ద మావయ్యకు అంతగా బాగుండట్లేదు...యీ మద్యేమైనా వెళ్ళాడా?"
మళ్ళీ ఆయనే అడిగాడు.నా నుండి మాత్రం మరలా మౌనమే సమాధానంగా మిగిలింది.
అప్పుడాయనకు అనుమానమొచ్చింది.
"యేరా...మీ ఇంటికి వెళ్ళదం లేదా..?"
లేదన్నట్లుగా తల అడ్డంగా ఊపాను.
"మొత్తానికి చదుకొన్నోళ్ళూ లేనివాళ్ళూ ఒకేలా ఉన్నార్రా..బాబూ.."
"నా పొరబాటు ఏమీ లేదు మామయ్యా...మా అమ్మ..."
"సరేలేరా....రెండు రోజులు పొయ్యాక అమ్మాయి..నువ్వూ..మన వూరు రండి....లీవ్ ఉంది కదా..మన వాళ్ళందరనీ ఒక సారి చూసి నట్లుంటుంది"
ఉందన్నట్లు తల వూపాను.రెండు రోజుల తరువాత శ్రీమతి  తో కలసి బయలుదేరాను.
సాయంత్రం అయ్యింది.
"పద..అలా పొగాకు బారెన్ల దాకా వెళ్దాం"
ఆయనతో బయటకు నడిచాను.
"ఇప్పుడు చెప్పు...నీ ప్రాబ్లెం"
చెప్పడానికి ఉద్యుక్తుడనయ్యాను.కానీ నాకాయన చాన్స్ ఇవ్వ లేదు.
"నీ అలోచన అంతా న్యాయం  కావచ్చు కానీ నీ చిన్నప్పటి అంటే నెలల పిల్లాడిగా ఉన్నప్పటి సంగతి చెబుతాను.మీ పెద నాన్న చేసిన గొడవ వలన మీ తాతయ్య పోగానే పొలాన్ని పంపకాలు చేసేసారు.అందరికీ తలా కాస్త పొలం..కొంత అప్పూ వచ్చాయి. మిగిలిన వాళ్ళకు అంతగా ఇబ్బందేమీ లేదు కానీ..డిగ్రీ ఆఖర్లో ఉన్న మీ నాన్నకు అదనపు ఖర్చుగా నీవు.డబ్బుకు కటటలాడి పొయ్యేవాడు.ఎవరినీ వంద రూపాయల అప్పు అడగలేని గ్రామీణ అభిమానం.అలాంటప్పుడు ఒక రోజు నీకు తీవ్రంగా జ్వరం వచ్చింది.వేళ్ళాడి పోతున్నావ్. ఇంట్లో పైసా లేదు.మీ నాన్నకు యేమీ చేయాలో పాలుపోనప్పుడు నేను మీ ఇంటికి రావడం జరిగింది.మీ నాన్న కళ్ళలో నీళ్ళు ..దైన్యం.వెంటనే నిన్ను తీసుకొని కొత్తగా ప్రాక్టీస్  పెట్టిన నా స్నేహితుడి దగ్గరకు తీసుకెళ్ళి పరిస్థితి అంతా వివరించాను.నిజం చెప్పాలంటే అప్పటికి నేను కూడా స్టూడెంట్ నే కాబట్టి నా దగ్గర కూడా డబ్బులేమీ లేవు.నా స్నేహితుడు మాత్రం " అయ్యో డబ్బ్లున్నప్పుడే తీసుకొచ్చి ఇవ్వండి" అని మందులు కూడా ఇచ్చాడు.కాబట్టి పెద్ద వయసులో అందులోనూ ఒక కొత్త కుటుంబంతో నీ అనుబంధం పెరుగుతున్నప్పుడు వీళ్ళకు కాస్తంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ రావచ్చు...ఎంతైనా ఒక్కడివే కదా...."
ఆ తరువాత ఏమైందన్నది ఇక్కడ అప్రస్తుతం.
ఆ తరువాత మా తలిదండ్రులు యేదైనా విషయం లో కాస్త అన్యాయంగా మాట్లాడినా...ప్రవర్తించినా దానిని న్యాయాన్యాయాల దృక్కోణంతో చూడడం మానుకున్నాను.
ఆఫీస్ లో పై వాడు అన్యాయంగా మాట్లాడతాడు ..ఎదిరించగలుగుతున్నామా....పిల్లలకు పరీక్షలవుతుంటాయి..పక్కనున్న గుళ్ళోనో..మసీదులోనో..చర్చ్ లోనో లౌడ్ స్పీకర్ లు మ్రోగుతుంటాయి ఐనా మాట్లాడలేము. తలిదండ్రుల విషయంలో మాత్రం మనం ఆ సమ్యమనాన్ని ఎందుకు పాటించం...లోకువ కాబట్టి..

ఇటువంటిదే ఇంకొక సంఘటన గురించి చెబుతాను . మా అత్తవారిల్లు మా ఇంటి ఎదురుగానే ఉంటుంది. ఇలా అనడం కంటే మా ఎదురింట్లో ఉన్న అమ్మాయినే నేను చేసుకున్నాననడం బాగుంటుంది.మా మావ గారు వరసకు నా మేనమామే. వాళ్ళది చాలా కాలం ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం.దానికి అధినేతగా మా శ్రీమతి  నానమ్మే ఉండేది. ఆవిడకు మనుమలంటే వల్లమాలిన అభిమానం.వాళ్ళ మీద ఈగ వాలనిచ్చేది కాదు.అంత వరకూ ఐతే ఫరవాలేదు కానీ కాలేజ్ లో చదువుతున్న నాతో తన మనమరాళ్ళను అస్సలు మాట్లాడనిచ్చేది కాదు.మొదట్లో నేను పట్టించుకోకపోయినా తరువాత తరువాత నాలో హీరో కావాలనుకునే నా సంకల్పానికి  యీవిడ చాలా ప్రతిబంధకంగా మారడం నేనస్సలు సహించలేకపోయాను.ఇంటికెదురుగా ఉన్న ఇద్దరు మరదళ్ళు తన వెనక బడక  పోవడాన్ని అంధ్ర లో ఉన్న ఏ బావ కూడా క్షమించడు కాబట్టి నేను కూడా క్షమించ లేదు.యీ ప్రతిబంధకాన్ని ఎలా వదిలించుకోవాలో అలోచించిన నాకు మా పెద్ద బావ మరిది ఆపద్భందవుడిలా కనిపించాడు.అప్పట్లో వాళ్ళకు రెండు ఇళ్ళు ఉండేవి.ఒకటి మా ఇంటికి ఎదురుగా ఉండే ఇల్లు..మరొకటి పక్క వీధిలో ఉండేది...పైగా అది చాలా పెద్దది.మా ఇంటికెదురుగా ఇద్దరు మామయ్యలు ఉంటే పక్క వీధిలో ఉండే ఇంట్లో ఇంకొక మామయ్య ఉండేవాడు.కాబట్టి ఒక శుభోదయాన  వాడికి జ్ఞాన బోధ చేసాను.
" మీరందరూ..చదువుకుంటున్నారు...అక్కడ ఇల్లు ఖాళీ యే కాబట్టి మీ మామ్మను అక్కడ ఉండమనొచ్చు కదా..మీకు కొంత గోల తగ్గుతుంది .."
కొంచెం ఎక్కువగా మాట్లాడే ఆవిడ అలవాటుని నేను ఆ విధంగా కాష్ చేసుకున్నాను.నేను అన్నదే తడవుగా మా బావ మరిది వాళ్ళ నానమ్మ మీద విరుచుకు పడి పోయి ఆవిడ ఆ ఇంటికి మారిపొయ్యేలా చేసాడు.

పాపం ఆవిడ దారిన వెళ్తున్న ప్రతి వాళ్ళతోనూ వీడిని చిన్నప్పటి నుండీ ఎంత గారాబంతో పెంచిందో ఆఖరుకి ఆవిడను ఎలా పంపించాడో చెప్పి తెగ బాధపడిపోతూ ఉండేది.ఒక విధంగా అప్పట్లో అర్ధం కాలేదు కానీ ఇప్పుడు తలచుకుంటుంటే మాత్రం కొంచెం బాధ గానే ఉంటుంది.కాక పోతే తరువాత నేను ఆవిడ మనమరాలినే వివాహం చేసుకున్న తరువాత ఇవన్నీ ఆవిడ మర్చి పోయింది. మా అమ్మాయి చంటి పిల్ల గా ఉన్నప్పుడే ఎత్తుకుని ముద్దులాడుతూ
" ఇది బాబు కంటే నాలుగాకులు ఎక్కువే చదువుద్ది " అని అంటూ మురిసిపోయేది.

సెల్ ఫోన్ ల సంస్కృతి పెరిగిన తరువాత విజయా వారి సినిమాలు రిలీజ్   కు నోచుకోనట్లే యీ పాత్రలేవీ మునుముందు కనిపించవన్న బాధ ఆనాడు తెలియ లేదు తెలిసిన ఇప్పుడు పైనుంచి కురుస్తున్న కుళ్ళుని ఎలా అపాలో తెలియడం లేదు.

4, సెప్టెంబర్ 2012, మంగళవారం

సుపుత్రుడికి సున్నితమైన జ్ఞాన బోధ..మీరు కూడా చెయ్యాలని మనవి ..

  "వస్తాం సార్" కాంట్రాక్టర్లు వెళ్ళడానికి లేచి నిలబడ్డారు.
"మరి మా బిల్...." మరలా వాళ్ళే నసిగారు
" రేపు తప్పకుండా చూస్తానండీ... సండే కాబట్టి యీ రోజు మా అబ్బాయి సినిమా కు తీసుకెళ్ళమని తినేస్తున్నాడు " మర్యాదగా చెప్పాను.
"మాకు చెప్పరేమిటి సార్..టికెట్స్ తెప్పెంచేద్దుం కదండీ ..."
"అయ్యో ..ఫరవాలేదండీ ...రిలీజ్ అయ్యి చాలా రోజులయ్యింది ..కాబట్టి ఇబ్బందేమీ  ఉండదులెండి"

మొత్తానికి వాళ్ళను వదిలించుకొని సినిమాకి రెడీ అవడం మొదలు పెట్టాను.
"నాన్నా ....వాళ్ళు సినిమా టికెట్స్ పంపిస్తానన్నప్పుడు ఔననొచ్చు కదా...."
మా వాడికి కూడా యీ మధ్య కొద్దిగా తెలివి తేటలు పెరిగి పోతున్నాయి
"ఒరేయ్...ఒక వేళ బిల్ చేయడం కాస్త లేట్ అయ్యిందనుకో ..లో లోపల బండ బూతులు తిట్టుకుంటారు తెలుసా..."
ఆ...లో లోపలే కదా ఫరవాలేదులే నాన్నా...."
మా వాడు బాగా ముదిరి పోతున్నదనిపిస్తోంది.
" నేను పెద్ద వాడైన తరువాత సివిల్ ఇంజనీర్ నే అవుతాన్నాన్నా..."
అంటే వీడు కూడా అసలైన వారసుడు గా తయారయ్యే ఉద్దేశం పెంచుకుంటున్నాడన్న మాట..అమ్మో వీడికి అర్జెంట్ గా జ్ఞానోపదేశం చేయడం నా ప్రధమ కర్తవ్యంగా తోచింది.నాకు వచ్చిన సున్నితమైన భాష లోనే వాడికి కర్తవ్య బోధ మొదలు పెట్టాను.
" ఒరేయ్ ..పనికి మాలిన వెధవా..నీకు దేంట్లో ఆసక్తి ఉంటే దాంట్లో పరిజ్ఞానం  పెంచుకోవాలి తప్ప నన్ను బట్టి కాదు.సొంత తెలివి తేటలు లేని వాళ్ళు..వేరే వేరే విషయాల మీద యే మాత్రం అవగాహన ..ఆసక్తి  లేని వాళ్ళే నాన్నలను ఇమిటేట్ చేస్తారు.

ఐనా గాని ఒరేయ్ సన్నాసీ...నాకేదో కాస్త  ప్రభుత్వోద్యోగం దాని వలన సంక్రమించిన అధికారం ఏడ్చాయి కాబట్టి  నాతో అవసరం ఉన్న వాళ్ళు నన్ను కాస్త గౌరవించడం చూసిన వెంటనే నీకు వెధవ బుద్దులు..అంటే వాళ్ళను ఎలా ఉపయోగించోసుకోవచ్చో నన్న ఊహలు మనసులో పుట్టుకొచ్చేస్తున్నాయ్... అమ్మ ..నా కొడకా...నీతో ముందు ముందు చాలా జాగ్రత్తగా ఉండాలొరే...

ఇంజనీర్ అవ్వాలంటే కొన్ని విషయాల్లో ..ముఖ్యంగా..మేథమేటిక్స్ ...సైన్సెస్ లో మంచి పరిజ్ఞానం వగైరా ఉండాలి...అవన్నీ ఉన్నాయో లేదో చూసుకొని కదా...నీవు ఇంజనీర్ అవ్వాలని కలలు కనాలి. ఉదాహరణకు నీవు రాజకీయ నాయకుడివి కావాలనుకుంటే కనీసంగా సమాజం.... దాంట్లో ఉండే వైరుధ్యాలు,పొరలు,చరిత్ర కొంతైనా తెలిసి ఉండాలి...అంతే కాదు కొన్ని ప్రజా ఉద్యమాలలో ఐనా పాల్గొని ఉండాలి. అలాకాకుండా నీ వెనుక ఉన్న కులబలంతోనో ,ధన బలంతొనో అవుదామనుకుంటే మాత్రం నీ అంత లుచ్చా మాత్రం ఇంకొకడు ఉండడన్న మాట.అంతే కాదు ప్రజల సొమ్ము అంటే రైతుల భూములు...సహజ వనరులు..ఇవన్నీ ప్రజలవేనన్న కనీస స్పృహ ఉండాలి..అలా కాకుండా అవన్నీ ఎవడికో ధార పోసి ..నిన్ను రాష్ట్రానికి శాశ్వతంగా పట్టాభిషిక్తుడిని చేయడం లాంటి వెధ్వాలోచనలు  నాకు మాత్రం రావొరే. ఐనా నన్ను చూస్తున్నావు కదరా...ఆనందంగా మంచి పుస్తకాలు చదవడం,మంచి సంగీతాన్ని వినడం..మన లాంటి నలుగురికి వీలున్నంత సహాయం చేయడం..ఆనందంగా ఉన్నామా లేమా.యీ రోజు నీవు నీ వెనక ఎవడో ఉన్నాడని అడ్డకోలుగా ఏదో చేయొచ్చు...అవన్నీ నీవనుభవిస్తావన్న గారంటీ ఏమైనా ఉందా....నీ లాంటి ఎంత మంది వెధవలు జైల్ కు వెళ్ళున్నారో చూస్తున్నావు కదా....అందు చేత నీతిగా..సింపుల్  గా బ్రతకడం నేర్చుకో.ఒక వేళ వెధవ పనులు చేసి జైల్ కెళ్ళినా దేభ్యం మొహం వేసుకొని అలాగే ఉండు,అంతే గాక   ఎవరినో ఉద్దరించినట్టు రెండు వేళ్ళు పైకి లేపడం లాంటివి చేయడం..వెధవ నవ్వు నవ్వడం లాంటివి చేయకు. మళ్ళీ అలాంటివి ఫొటో లు తీసుకొని నీ దగ్గర స్కూల్లో చాక్లెట్ ఫ్రీ గా తినడం మరిగిన వెధవెవడైనా నిన్ను యే వివేకానందుడి వంటి వారితోనో పోలుస్తూ స్కూల్లో ఫ్లెక్సీలు పెట్టించేస్తాడు. అఫ్కోర్స్ మానవ జాతిలో పుట్టిన వాడు అలాంటి పనులు చేయడనుకో..కానీ ఏం చేస్తాం...అలాంటి వాళ్ళు కూడా ఎక్కువవుతున్నారు కదా.అసలు ఒక్క విషయం చెప్పొరే....నీవిచ్చే చాక్లెట్లు చూసి కాక నిజంగా నిన్ను చూసి నీ వెంట వచ్చే వాళ్ళు ఎంత మంది? నేనైతే ఏదో కష్టపడి  సివిల్ ఇంజనీర్ను అయ్యాను కాబట్టి ఏదో ఆ కాంట్రాక్టర్లు కొద్దిపాటి మర్యాదగా ఉన్నారనుకో...మరి ఏ ఒక్క మంచి లక్షణం  లేని నీవు కూడా జన్మంతా అలాంటి మర్యాదలు కావాలనుకున్నావు చూడు  అందుకు నిన్ను........ మన వైజాగ్ లో ఇప్పుడు పెద్దగా కనబడ్డం లేదు కానీ లేదంటే డ్రైనేజీల్లో తిరిగే పందుల తో తొక్కి చంపించేద్దామని ఉందొరే...నీవు ప్రహ్లాదుడంటి వాడివి కాదు కానీ నిన్ను చూసి మాత్రం నాకు హిరణ్య కశిపుడికొచ్చిన ఆవేశం వచ్చేస్తోంది.ఉన్న ఈ డబల్ బెడ్ రూం చాల్లేదు...హాల్లో మ్యూజిక్ సిస్టం లేదు..అది లేదు ..ఇది లేదు అని ఎప్పుడూ నసుగుతూ ఉంటావు.నీకంటూ చాన్సొస్తే   నన్ను మర్డర్ చేసేసి మీ అమ్మను కూడా తీసుకొని నా శ్రేయోభిలాషుల  దగ్గరికి వెళ్ళి అనాధలమై పోయామని చెప్పి చందాలు దండేసి వాటితో నీక్కావలిసిన వన్నీ కొనుక్కుని అనుభవించడానికేమీ జంకవొరే.మీ అమ్మకెలాగూ నీవంటే పిచ్చి గారం కాబట్టి నీవు వెధవ్వని తెలిసినా చచ్చినట్టు నీతో వస్తుంది.నేను ఇంత నెమ్మదిగా చెబుతుంటే అలా కునుపాట్లు పాడతావేంట్రా దున్న పోతా...

మొన్నేదో స్కూల్ నాటకంలో హీరో వేషం తగలెట్టావంట. ఎవడ్రా నీకా వేషం ఇచ్చింది. కాస్తంత రంగు...పొడుగూ..చాతీ..ఉంటే హీరో అయిపోడ్రా  గాడిదా. నటనంటే నాలుగు ఫైట్లు....నాలుగు స్టెప్పులూ...అది కార్పిస్తా...ఇది కార్పిస్తా లాంటి వెధవ డైలాగ్ లు కాదురా....పైగా నీకు ఉత్తమ నటుడి అవార్డ్ కూడా నట.ఇచ్చే వాళ్ళకు సిగ్గు లేక పోతే తీసుకొనడానికి నీకన్నా సిగ్గుగా లేదురా.నీ జన్మెట్టు కొని ఒక్క మంచి సినిమా చూసావురా."బైసికిల్ థీవ్స్" లాంటి గొప్ప విదేశీ  చిత్రాలు కాకపోవచ్చు..కనీసం "మనుషులు మారాలి"లాంటి మన భాషా చిత్రాలన్నా చూసావా.నీవు నటించిన నాటకం ఒక చెత్త అని నీకు తెలుసు.మరి అలాంటప్పుడు ఇంకా ఎంతో కొంత మంచి నాటకాలలో మంచి నటన చేసిన వాళ్ళను రికమండ్ చేయొచ్చు కదా...విత్తనాల కోసం లైన్ లో నిలబడి ..మరలా ఎరువుల  కోసం ఎండలో  చెప్పులరిగేలా తిరిగి ...రాత్రుళ్ళు నిద్ర లేకుండా పవర్ ఇచ్చినప్పుడే బోర్ నడిపి ..పంట పండిన తరువాత...కిట్టుబాటు ధర అస్సలు లేదని విచారంగా కూర్చున్నప్పుడు ..కాలేజ్ కెళ్ళిన కుమారుడొచ్చి " నాన్నా....యీ సంవత్సరం నుండి మన ఫీజులు మనమే కట్టుకోవాలి" అన్నప్పుడు...ఆ రైతు ముఖం ఎలాఉంటుందో ఒక్క సారి  నటించి చూపించు...నీవొక నటుడివని ఒప్పుకుంటాను.అంత వరకూ పెద్ద హీరోలా  నీ చాక్లెట్ బాచ్ చేత చప్పట్లు కొట్టించుకొంటే మాత్రం నిన్ను చెప్పుచ్చుక్కొట్టేయాలొరే....

 ఇంత సేపూ నీవు చెప్పింది విన్నాను కాబట్టి నాకు కే .ఏఫ్.సీ.నుండి చికెన్ మంచూరియా... గాడిద గుడ్డు తెచ్చి పెట్టు అంటే పళ్ళు రాలగొట్టేయగలనొరే.నువు తిన్న ప్రతి వంద కూ పది రూపాయలు ఎవడో విదేశీ  వాడు తింటాడన్న సంగతి నీకు తెలియక పోవచ్చు కానీ నాకు తెలుసు కాబట్టి ఏమోయ్..హాయిగా మాంచి ఉప్మా వండు..దానికి వరల్డ్ హెరిటేజ్ ఫుడ్ స్టేటస్ కూడా వచ్చింది. ఆ చికెన్లకు దేనికీ అలాంటిదేమీ లేదు.


అసలు ముందు యే విషయాన్నైనా  నాలా సున్నితంగా చెప్పడం నేర్చుకో చాలు.    

28, ఆగస్టు 2012, మంగళవారం

అరచెయ్యి కాలక ముందే.....

“యీ అమ్మాయే సార్…కొత్తగా జాయిన్ అయ్యింది..మీరే ట్రైనింగ్ ఇవ్వాలి”
సైట్ కు వెళ్ళగానే మా కాంట్రాక్టర్స్ కొత్తగా వచ్చిన ఆ అమ్మాయిని పరిచయం చేసారు. కొత్త గాబట్టి కొంచెం బెదురుగానే చూస్తోంది.
“ పేరేంటమ్మా..?”
“శాంతి  ..సార్”
“డిప్లొమా ఎప్పుడు పూర్తి చేసావు?”
“ఈ యేడే సార్”
రెండు రోజులకు బాగానే అలవాటయ్యింది. నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటీ అడిగి తెలుసుకోడం స్టార్ట్ చేసింది. ఆ అమ్మాయికి సంబందించిన కొన్ని విషయాలు కూడా తెలిసి కొంత ఆశ్చర్యం వేసింది.
ఆ అమ్మాయి ఆ ప్రాంతానికి  సంబందించినదే. మేము  ఆ ప్రాంతంలో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే సరికి అక్కడొక  రైల్వే గేట్  ఉండేది. యార్డ్ కు దగ్గరలో ఉండడం వలనో లేక అక్కడ రైల్వే లైన్ లో వాలు ఎక్కువగా ఉండడం వలనో తెలియదు కానీ అక్కడొక సారి గేట్ పడిందంటే కనీసం 20 నిముషాల వరకు గేట్ తెరిచే వారు కాదు. కాబట్టి ప్రతి బస్ కూడా గేట్ పడగానే ఆ టైం కనీసం ఉండడానికి మానసికంగా తయారైపొయ్యే వారు. ఆ విధంగా అక్కడొక చిన్న మార్కెట్ ప్లేస్ తయారయ్యింది. అక్కడ ముఖ్యంగా ఆ ప్రాంతంలో తయారయ్యే మామిడి తాండ్ర అమ్మడం నేను చూస్తుండే వాడిని. ఆ గేట్ కు అటూ ఇటూ చాలా షాప్స్ ఉండేవి. మా ప్రాజెక్ట్  పూర్తి కాకుండానే అక్కడ ఫ్లై ఓవర్  నిర్మించడం జరిగింది. ఆ తరువాత నెమ్మదిగా ఒక్కక్కటిగా అక్కడున్న షాప్స్ అన్నీ ఖాళీ అయిపొయ్యాయి. ఇదంతా ఎందుకు రాయవలసి వచ్చిందంటే ఆ అమ్మాయి కుటుంబానిదే అక్కడున్న వాటిలో మొదటి షాప్ అని ఆ అమ్మాయి ద్వారా తెలిసింది. అంతే కాదు  ఇంజనీరింగ్ లో  జాయిన్ అవ్వ వలసిన ఆ అమ్మాయి కూడా చదువు ఆపి యీ ఉద్యోగం లో చేరిపోయింది. నిర్వాసితులవ్వడం అంటే ఏమిటో దగ్గర నుండి చూసాను. డైరెక్ట్ గా ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు నిర్వాసితులయ్యే వాళ్ళకు ప్రభుత్వం నుండి  ఎంతో కొంత పరిహారం వస్తుంది  కానీ ఈ విధంగా నిర్వాసితు లయ్యే వాళ్ళకు యేముంటుంది?
నా ఉద్యోగం లోని జీత భత్యాల ను పక్కన బెడితే మిగిలిన చాలా విషయాలలో అదృష్ట వంతుడి గానే భావించుకుంటాను.  సమాజం లోని అన్ని పొరలలోని జీవితాలను….దగ్గర నుండి చూసే అదృష్టం కలగ చేసింది . దుర్భర దారిద్ర్యం ప్రజలని ఎంత బలహీనులను చేస్తుందో….ఆ బలహీనతల ను నాయకులు యెలా కాష్ చేకుంటారో నేను చదివిన వార్తల వలన కాకుండా  నేను చూసిన జీవితాల వలన కూడా తెలుసు కోగలిగాను.
ప్రొద్దుటి నుండీ రాత్రి వరకూ కోళ్ళ ఫారలలో కుక్కినట్టు ఏ.సీ.రూం లలో కుక్కి చెప్పే చదువులు చదివేసి ……. మంచి ఇంజనీరింగ్ కాలేజ్ లలో సీట్స్ తెచ్చేసుకొని  ఆ తరువాత రక రకాల పరీక్షల ద్వారా పెద్ద పెద్ద మేనేజ్మెంట్ కాలేజ్ లలో చదివేసి కార్పొరేట్ లీడర్లై పోతున్న వారికి…..సెలవుల్లో కూడా అమ్మ కో నాన్నకో ..ఆసరాగా ఉండడం కోసం ట్రైన్ లోనో …వేరొక చొటో మామిడి కాయలు అమ్ముతూనో లేక యెదో పని దొరికితే చాలు అనుకుంటూ పని లోకి వచ్చే వారినీ ఏక సమయంలో చూడగలిగాను.

ఒక సంఘటన ఇప్పటికీ మరీచి పోలేను. ఒక రోజు రీన్ ఫోర్స్మ్రెంట్ చెక్ చేయడం కోసం ఒక బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అక్కడే నిలబడి కాంక్రీట్ వర్క్ చూస్తున్నాను. అనుకోకుండా   ఇసుక మోస్తున్న కుర్రవాడిని చూసాను. గిల్లితే పాలు కారడం అంటే ఆ కుర్రాడిని చూస్తే తెలుస్తుంది.
“ యేరా బాబూ…స్కూల్ లేదా…” మామూలుగానే అడిగాను.
“ సెలవులు సార్”
సెలవుల గురించి కలలు గనే స్తోమత ఆ కుర్రాడికి లేదని అర్ధమయ్యింది. ఆ తరువాత కొద్ది రోజుల పాటు ఆ కుర్రాడిని రోజూ ఆ బ్రిడ్జ్  దగ్గర పని చేయడం చూసాను. ఛూసి చిన్నగా నవ్వ గానే సిగ్గుపడుతూ ఉండే వాడు.

 ఆ రోజు కూడా రోజూ లాగే ట్రైన్ దిగి స్టేషన్ బయటకు వచ్చాను. జీప్ రెడీ గానే ఉంది. ఎక్కే ముందు చూసాను….వెనుక సీట్లో ఆ కుర్రాడు ఉన్నాడు.
“యీ కుర్రాడు… వేరే బ్రిడ్జ్ దగ్గర పని చేస్తున్నాడు కదా..ఇటెందుకు తీసుకొచ్చావ్?”
డ్రైవర్ ను అడిగాను.
“ వాడిని హాస్పిటల్ కు తీసుకెళ్ళాలి సార్”
“ యేమయ్యింది”
“…..చైన్ లో వాడి వేళ్ళు ఉండిపోయాయి సార్”
అప్పుడు చూసాను వేళ్ళ వైపు. ఇంత లావు గుడ్డలు చుట్టి ఉన్నాయి.
“యెంత సేపయ్యింది?” గట్టిగా అరిచాను
“ అరగంట దాకా అయ్యుంటుంది సార్”
“ ముందు హాస్పిటల్ కు చావొచ్చు కదా…”ఉక్రోషం వచ్చేస్తోంది.
“మీరు చూస్తే కాని  కాంక్రీట్ స్టార్ట్ అవదు కదా అని ముందు మిమ్మల్ని తీసుకు రమ్మన్నారండి”
ఆ కుర్రాడి ముఖంలొకి చూడడానికి భయం లాంటిది వేసింది. అరగంటనుండీ ఆ బాధను దిగమింగుకుంటున్న అతడి ముఖాన్ని యెలా చూడాలో అర్ధం కాలేదు. అతడి దగ్గర నుండి యే శబ్దమూ రావడం లేదు . పైకి యేడవడానికి కూదా భయం.

యీ సంఘటన జరిగిన కొద్ది రోజులకే ఆ నాటి మన ముఖ్య మంత్రి వర్యులు హెలికాప్టర్ దుర్ఘటన లో చని పోవడం …..చనిపోయినట్టు  కన్ ఫర్మ్ కాగానే ఒక గంట కూడా ఓపిక పట్ట లేని విధంగా యువ రాజా వారు సిమ్హాసనం అధిష్టించడానికి పడిన కంగారు….అది దక్కక పోయే సరికి యేదోలా తాపత్రయపడుతూ వెలువరిస్తున్న రాజకీయ తాపం…..అన్నీ పక్క పక్కనే చూసాను.నిజం చెప్పాలంటే ఆ తరువాతే నాకు కొన్ని విషయాల మీద ఆసక్తి పెరిగింది. నాకొచ్చిన సందేహాల గురించి చెప్పాలంటే ఒక రోజున నేను మా కేంప్ ఆఫీస్ దగ్గర మేస్తున్న కోళ్ళను చూస్తుండగా కలిగిన సందేహాన్నే ముందుగా చెప్పుకోవాలి. ఒక కోడి పుంజు ఒక చిన్న పుల్ల ముక్కను పట్టుకుని కిందకూ మీదకూ ఎగరేస్తూ మిగిలిన పెట్టలను ఆకర్షించడానికి  ప్రయత్నిస్తుంది.ఆ పుల్లముక్కను పెద్ద కీటకంగా చూపించడానికి శత విధాలా ప్రయత్నిస్తోంది.నెమ్మదిగా దాని చుట్టూ నాలుగైదు కోడి పెట్టలు చేరాయి. ఇది  ఆ పుల్లముక్క మాట వదిలేసి వాటితో రొమన్స్ మొదలు పెట్టింది. ఇక్కడ నాకు కలిగిన సందేహమే చాలా ముఖ్యమైనది కూడా. అదేమిటంటే ఆ చుట్టూ చేరిన కోడి పెట్టలకు అది పుల్లేనని తెలిసే ఉంటుందని.తండ్రి చనిపోయిన వెంటనే ఆ పదవి కోసం శత విధాలా ప్రయత్నించి అది దక్క లేదన్న ఉక్రోషంతో సొంత కుంపటి పెట్టుకొని వూరూరా తిరుగుతూ నేను పైన చెప్పిన విధంగానే (కోడి పుంజు తరహాలో) ప్రజలను ఆకర్షించడానికి నానా పాట్లూ  పడుతున్న ఆ పుత్ర రత్నం సెలవిచ్చేదేమంటే తన తండ్రి గారి హయాంలో ప్రారంభించిన సంక్షేమ పధకాలు యీ ప్రభుత్వం  నిర్వీర్య పరుస్తోందని …కాబట్టి తన నెత్తి మీద కిరీటం పెట్టేస్తే అవన్నీ యధావిధిగా కొనసాగిస్తానని. ఆది పదే పదే విన్న తరువాత నాకనిపించింది అసలు యీ సంక్షేమ పధకాల అసలు రంగు యేమై ఉంటుందా అని.కొన్ని ఉదాహరణలు చూద్దాం. యీ మధ్యే పేపర్లో చూసేంత వరకూ యెవరికీ తట్టని విషయం యేమిటంటే పేదవారికీ వెనుకపడిన వర్గాల వారికీ ప్రభుత్వమే  ఫీజులు కట్టి  చాలావరకూ రాజకీయ నాయకులకు సంబందించిన  ఇంజనీరింగ్ కాలేజ్ లలో చదివించడం కంటే ప్రభుత్వమే  తన కాలేజ్ లు పెంచుకోడం మంచిదని  మన నాయకులకి తెలియదా….ఎవరి సంక్షేమం కోసం యీ ఫీజుల పధకం మొదలయ్యిందో బుర్రలో గుంజున్న వాడికల్లా అర్ధం అవుతుంది. ఇంత మంది ఇంజనీర్లకు  ఉద్యోగాలు ఉన్నాయా…లేనప్పుడు ప్రజల సొమ్ము ఎవరికి ఉపయోగ పడినట్లు…..పోనీ వీళ్ళకు విదేశాల్లో  ఉద్యోగం వచ్చే స్థాయిలో యీ ప్రైవేట్ కాలేజ్ లు విద్యా బోధన చేస్తాయా……మరి ఇలాంటి పధకాలు నిరుపయోగమని ప్రతి పక్షాలు ఎందుకు అనవు….కొన్ని కాలేజ్ లు వాళ్ళవి కూడా ఉంటాయి కాబట్టి. ఓక్క సారి ఏదైనా గ్రామానికి వెళ్ళి ప్రభుత్వ కాలేజ్ లలో ఉచితంగా చదివిన విద్యార్ధులలో ఎంత మంది ఉద్యోగాల లో ఉన్నారో….కానీ వాళ్ళ ఫీజులు ప్రజల డబ్బులతో కట్ట బడ్డాయి.మార్కెట్ ఎకానమీ గురించి తెలియక పోయినా ….ఇది ఎవరి సంక్షేమం కోసం పెట్టారో సులభంగానే అర్ధమవుతుంది. కానీ  మనందరిదీ కోడిపెట్టల జాతి కదా……ఎవరి స్వార్ధం వారిదే…..కాని మనలోని స్వార్ధం వలన వచ్చిన  ఫలితాన్ని కొంత మందే అనుభవిస్తున్నారు..….దుష్ఫలితాన్ని  మాత్రం కోట్లాది మంది అనుభవిస్తూనే ఉన్నారు.
మనమంతాకోడిపెట్టలమే నని నాయకులు ఎలా భావిస్తారో ఇంకొక చిన్న ఉదాహరణ చూద్దాం. సామాన్య ప్రజానీకానికి తెలియక పోవచ్చు కానీ ఛంద్ర బాబు లాంటి  నాయకుడికి  వాన్ పిక్   ఒప్పందం గురించి  తెలియకుండా  ఉంటుందంటే ఎవరైనా నమ్మగలరా..? ఒక వేళ తెలియదంటే ఆయన ప్రతిపక్ష నాయకుడి హోదాకు తగుతాడా..? మరి అన్నీ అయిన తరువాత ఇప్పుడు పాద యాత్ర చేయడంలో ఉన్న అర్ధం ఏమిటో ….
చానల్స్ లో అనేకానేక విషయాల గురించి గంటల కొద్దీ రాజకీయ పార్టీల ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా  గమనిస్తే అవన్నీ ఎవరో మహారాజు గారి భార్యల మధ్య జరిగే ఆధి పత్య పోరు లా ఉంటుంది . 1999 నుండీ నేను వైజాగ్  లోనే ఉన్నాను.మేము వెళ్ళిన  కొత్తలో  వచ్చిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేయాలనుకున్న ఒక కాంగ్రెస్ నాయకుడిని తీసుకుని మా దగ్గర బంధువు మా ఇంటికి వచ్చాడు,వైజాగ్  లోనే అప్పుడు ఉన్న ఒక కింగ్ మేకర్ గారి రికమండేషన్ కోసం. వచ్చినాయనను  ఎందుకో కాజువల్ గానే అడిగాను.
“ఇప్పుడు భారత దేశంలోనే ఉన్న నాయకులందరి లోకీ వరల్డ్ బేంక్ కు ఐకాన్ గా చంద్ర బాబు గారున్నారు……కాబట్టి  ఆయనకు అల్టర్నేటివ్ మీ పార్టీ  యేమి చెబుతుంది?..నిజంగా చెప్పాలంటే వామ పక్షాలే ప్రపంచీకరణను వ్యతిరేకిస్తున్నాయ్…..మరి మీరు వాళ్ళతో జతగట్టి…ఎలెక్షన్ ల లోకి వెళ్తారా….”
“ మీరడిగిన ప్రశ్నలకు సమాధానాలు మా నాయకులకు తెలియవండి బాబూ…..”
కానీ నిజం చెప్పాలంటే  పెద్ద నాయకులకు అప్పటికే కోడి పుంజు ..పెట్టల గేం ఆడడం అలవాటై పోయింది. వాళ్ళకు అన్నీ తెలుసు. 1982 లో విజయవాడ లో కృష్ణా  నదీ తీరాన జరిగిన సీ.పీ.యెం. పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి సభలు జరిగాయి. అప్పటికే ఆ నగర కార్పొరేషన్ కమ్యూనిస్ట్ పార్టీల చేతులలో ఉంది. ఖమ్మం  జిల్లాలో చాలా లోకల్ బాడీ లకు వామ పక్షాల అభ్యర్ధులు యెన్నికయ్యారు. కాంగ్రెస్ పరిపాలన….ముఖ్య మంత్రుల మార్పిడి తో జనం ఆ పార్టీ మీద పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. ఇది సహజంగానే కొంతమందికి మింగుడు పడ లేదు. అందులో ముఖ్యులు ఆనాటికీ….యీనాటికీ కూడా అత్యధిక సర్క్యులేషన్ కలిగిన  “యీనాడు” పత్రికాధిపతి…శ్రీ రామోజీ రావు.

..అధికార వర్గం అనేది ఒక ప్రత్యేక వర్గం అనీ….దాంట్లో వ్యాపార, పారిశ్రామిక,భూస్వామ్య వర్గాలకు చెందిన వారు మాత్రమే తిష్ఠ వేసుకుని ఉంటారనీ….ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వీరి  ప్రయోజనాలు  మాత్రం చెక్కు చెదరవనీ… సామాన్య ప్రజలు గ్రహించడానికి టైం పడుతుంది. కొత్తగా పుట్టుకొచ్చి కొన్ని ఆర్ధిక ప్రయోజనాలు అధికార బలంతో సాధించడం  లాంటివి జరిగినప్పుడు జరుగుతున్న ఘర్షణలు మాత్రమే పేపర్ల కెక్కుతాయన్న విషయం చాలా మంది విద్యావంతులకు కూడా అర్ధం కాదు. దిగజారుడు తనం పెరిగి పోయింది కాబట్టి కులాల ఈక్వేషన్స్ తీసి కొంత మందిని నాయకులుగా మారుస్తున్నా కూడా అంతిమంగా ఆర్ఢిక ప్రయోజనాలే   నిర్ణాయక పాత్ర వహిస్తాయని అర్ధం కాని జనం మొత్తం 3 రూపాయలతో పేపర్ చదివేసి మహాజ్ఞానుల్లా ఏదో ఒక పార్టీ  కి తలను తాకట్టు నిజాలను గ్రహించక కొట్టుకొంటూ ఉంటారు. దీంట్లో మీడియా కుట్ర కూడా తక్కువేమీ కాదు. ఏ పత్రిక తిరగేసినా ఎవరో ఒకరి మీద బురద జల్లుడే. నిజాలను వెలికి తీయడం మంచిదే…కానీ అసలు సమాజంలో మంచి అనేది ఎప్పుడూ…ఎక్కడా లేదనే విధంగా రాయడం వలన ప్రజలకు పూర్తిగా వ్యవస్థ  మీద నమ్మకం పోతుంది. ఒక విధంగా అధికార వర్గాలకు కావలిసింది కూడా ఇదే. అయోమయ స్థితిలో ప్రజలను ఉంచడం వలన ఉద్యమాలు వచ్చే ప్రమాదం నుండి తప్పించు కోవచ్చు. 
నాకు గుర్తున్న రెండు సంఘటనలను ఇక్కడ ఉటంకిస్తాను. దానిని  బట్టి కడుపు కాలిన సామాన్య జనం చేస్తున్న ఉద్యమాలకు,అధికార పంపకంలో వారి వారి మధ్యన తగువులు వచ్చి చేసే ఉద్యమాలకు ఉండే  ప్రతి చర్య ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. 90 దశకం  ప్రారంభంలో అనుకుంటా నెల్లిమర్ల జూట్ మిల్లు కార్మికులు యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేసారు. చిలికి చిలికి పెద్దదై రైల్ రోకోకు దిగారు. కాల్పులు జరిగి నలుగురు కార్మికులు చనిపోయారు. ఆ తరువాత కొద్ది కాలానికి తెలుగు దేశం పార్టీ రెండు ముక్కలుగా చీలి నప్పుడు రాజమండ్రి  లో ఎం.ఎల్.యే గారి ( అప్పుడు ఆయన రామా రావు గారి వెంట ఉన్నారు) అనుయూయులు పదిమంది కూడా ఉండరు ..కానీ ఎక్స్ ప్రెస్స్ రైళ్ళను యే ఆటంకం లేకుండా ఆపేయగలిగారు.రెండు చోట్లా జరిగింది రైల్ రోకోనే….కాన నాయకత్వం వేరు….ఉద్యమ లక్షణాలు వేరు. అందుకనే రాజు గారి భార్యల మధ్య జరిగే  కలహాలు మన కున్న ప్రధాన సమస్య కాదు. రాజు గారిని…వారి వంధిమాగతులను……వారి కొమ్ము కాసే వాళ్ళను…కాపలాకాసే కుక్కలను  తరిమి కొడితేనే అందరం సుఖపడతాం.

27, ఆగస్టు 2012, సోమవారం

కుళ్ళుతున్న సినిమా ....


                 చాలా కాలానికి కాస్త ఖాళీ దొరికిందికదాని ఆనందంగా మాస్నేహితుడింటికి ఒక రౌండ్  వేద్దామని మా వాడితో సహా బయలుదేరాను. నేను మాస్నేహితుడు ఏదోకుటుంబవిషయాలు చర్చించుకొంటున్నాం. మా సుపుత్రుడికి  టైంపాస్ కాక టీవీ ఆన్ చేసాడు. యేదో  అవార్డుల ఫంక్షన్ చూపిస్తున్నారు. ముందు నేను అంతగా పట్టించుకోలేదు…..కానీ మధ్య మధ్యలో కొన్ని సినిమా సన్నివేశాలు  చూపిస్తుంటే మా దృష్టి కూడా అటు పెట్టక తప్పింది కాదు. గత   సంవత్సరం వచ్చిన సినిమాల్లో వివిధ అంశాలకు సంబందించి ఉత్తమ ప్రదర్శన చేసిన నటులు,టెక్నీషియన్లకు అవార్డ్స్ ఇస్తున్నారు.” దూకుడు”  చిత్రం చాలా అవార్డులు గెలుచుకుంది. ఆ సినిమా నేను కూడా చూసాను. హాస్య సన్నివేశాలు ఆకట్టు కొన్నాయి తప్ప మిగిలిందంతా అత్యంత సాధారణ చిత్రమే. కాకపోతే ఆనందించవలసిన విషయమేమిటంటే వెకిలితనంతో కూడిన హాస్యం  ….అసభ్యతల జోలికి వెళ్ళలేదు. ఆ ఒక్క మెరిట్ ఉన్నందుకు ఇన్ని అవార్డులా….అని అలోచనల్లో ఉండగానే ఆకస్మాత్తుగా  ఇంకొక సినిమా గుర్తుకు వచ్చింది. ఇంచుమించు  యీ సినిమాకి కొద్ది ముందు వెనకల్లో  "పిల్ల జమీందార్"  అనే సినిమా చూసాను. ఆ సినిమా మా ఇంటిల్లి పాదికీ బాగా నచ్చింది. ఈ   మధ్య కాలంలో ఆ మాత్రం పాజిటివ్ దృక్పధాన్ని …మానవతా విలువలను హైలైట్ చేసిన సినిమా యేదీ కనబడలేదు,ఒక్క రెండు సినిమాలు” గమ్యం”,”వేదం” తప్ప ,పైగా  అవి కూడా ఒక్క దర్శకుడివే…..  
                       ఈ మధ్యే ఒక కొత్త వాదం వినబడతోంది.ఎక్కువ ప్రజాదరణ పొందినదే ఉత్తమ చిత్రమని. ఆ  విధంగా చూసినా పిల్ల జమీందార్ సినిమా సాధించిందేమీ తక్కువ విజయమేమీ కాదు. అతి తక్కువ బడ్జెట్ తో నిర్మాతలకు టెన్షన్ లేకుండా చిత్రాన్ని తీసి విజయవంతం చేయడం  మాటలు కాదు. ఇన్ని మంచి లక్షనాలున్న ఆ సినిమాకు ఒక్క అవార్డూ రాకపోవడానికి ఉన్న కారణాన్ని  విశ్లేషించవలసిన అవసరం ఉందనిపించింది. ఫిల్ల జమీందార్ సినిమాలో  హీరో పుట్టింది జమిందారీ  వంశంలో  అయినా  కూడా పరిస్థితుల వలన ఒక గ్రామంలో ఉన్న కాలేజ్ లోకి వచ్చి పడతాడు. ఆంతవరకైతే ఫరవాలేదు..కానీ అతడు ఆ పల్లెలో సాహస కృత్యాలేమీ చేయకుండానే కొన్ని మంచి పనులు చేయడం ద్వారా తోటి వారి మనసులు గెలుచుకుంటాడు. ఒక్కడే వెళ్ళి 100 మందిని మట్టు పెట్టే సీను ఒక్కటీ లేదు. ఒక విచిత్రం ఏమిటంటే సినిమాలో ప్రత్యేకించి విలన్ కారక్టర్ లేదు. కాబట్టి ఫైట్ సీన్ కు అవకాశమే లేదు. హీరోయిన్ కూడా ఇతడి ఆరడుగుల విగ్రహాన్ని కాక ఇతడి మంచితనాన్ని చూసి ప్రేమించడం మొదలు పెడుతుంది. హీరో ఆఖర్న ఒక ఎడ్ల బండి ఎక్కి వస్తుంటాడు. ఏ విధంగా చూసినా ఇది భిన్న పోకడలు గల సినిమా. మరి ఇటువంటి చిత్రానికి ఏదైనా  అవార్డ్ ఇస్తే కొంపలు ములగవా…..పైగా హీరో కి(నిజ జీవితంలో కూడ) యే వారసత్వ సంపదా లేదు.
               ఒక గుంపు లేదా కొన్ని గుంపుల ఆధీనంలో తెలుగు చలన చిత్ర రంగం ,మీడియాలు ఉన్నాయి. సినిమాలు వాళ్ళే తీయాలి….వాటి తాలూకు ప్రచారాలు వాళ్ళకే వాటాలుండే చానళ్ళలో ఊదరగొట్టేస్తూ ఉంటే చచ్చినట్లు మనం వాటినే చూడాలి. వీళ్ళను వీళ్ళే పొగుడుకుంటారు…సన్మానాలు చేసేసుకుంటారు…..ఇంటర్వ్యూలు చేసేసుకుంటుంటారు. ఒక్క సారి జాగ్రత్తగా చూస్తే  యీ రంగం లో ఉన్న వారసత్వపు చెత్త మరే రంగం లోనూ కనబడదు. మరి ఆ సినిమాలు హిట్టవుతున్నాయి కదా అని కొంతమంది అమాయకులంటారు. మిగిలిన అన్ని సాంకేతిక  విలువలూ,నటులూ అత్యున్నత శ్రేణికి  చెందిన వారైనప్పుడు యీ ఒక్క చెత్తనూ ఏదోలా భరిస్తారు.                            అందులోనూ ఇప్పుడు మీడియా వారు…పారిశ్రామిక వేత్తలు (ఈనాడు-రిలయెన్స్) మరింతగా దగ్గరవుతున్న తరుణంలో సామాన్యుడిని హీరోగా వాళ్ళు ఎలా భరిస్తారు.  న్యూస్ ఇటం కోసమే సామాన్యులు కానీ వాళ్ళే  నాయకత్వానికి వస్తామంటే ఎలా……సమాజానికి శతృవులుగా  మాఫియాలను,రాజకీయ నాయకులను చూపించడం చాలా సుళువు….కానీ మన సంకుచిత అలోచనా విధానమే మనకు నిజమైన శతృవని మనకు తెలిసిపోతే…..అమ్మో….
                                    ఒక విధంగా రాజకీయ రంగంలో జరుగుతున్నదే ఇక్కడ జరుగుతుందనిపిస్తోంది. ఏ పార్టీ ఐనా సామాన్యుడికి సీటిచ్చే స్థితిలో ఉన్నాయా….(కొత్తగా వచ్చిన లోక్ సత్తా….సోదిలో లేని వామ పక్షాలు తప్ప ).కుళ్ళడం ప్రారంభమైనప్పుడు అది  ఒక చోట నుండి అన్ని వైపులకీ ప్రవహిస్తూనే ఉంటుంది. కానీ   నిజం తెలుసుకున్న జనం తిరగబడినప్పుడు యీ పేక మేడలన్నీ నేలమట్టమవ్వక తప్పవు. వీళ్ళు కట్టుకున్న సౌధాలన్నీ పైకే బలంగా ఉంతాయి …ఎందుకంటే వీళ్ళలో వీళ్ళకు పడక  భూమి లోపల ఒకళ్ళకింద ఒకళ్ళు బొరియలు తవ్వుకుంటారు కాబట్టి.

14, మే 2012, సోమవారం

పాముల్ని వదిలేద్దామా......


జీప్ అప్పటి వరకూ స్పీడ్ గా వచ్చింది. ట్రైన్ కు ఇంకా సరిపడినంత టైం ఉంది. ఫరవాలేదులే అనుకంటూ ఉన్నాను. సరిగ్గా కంచరపాలెం ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చి ఆగింది. అప్పుడప్పుడు అక్కడ ట్రాఫిక్ జాం అవ్వడం మామూలే కాబట్టి నేను ముందు పెద్దగా పట్టించుకోలేదు....కానీ ఎంత సేపటికీ ట్రాఫిక్ కదలడం లేదు. నేను ఇంకా కొన్ని జిరాక్స్ లు తీసుకోవలసినవి ఉన్నాయని గుర్తుకు వచ్చి కంగారు మొదలైంది. డ్రైవర్ ను చూడమన్నాను.
"ముందంతా మొత్తం ఆగి పోయి ఉంది సార్ అన్నాడు"


ఏమి చేయాలో పాలుబోవడం లేదు.దిగి ముందుకు నడిచినా ఎంత దూరంలో ఆటో దొరుకుతుందో తెలియదు.
ఏ కారణం చేతో తెలియదు కానీ ట్రాఫిక్ నెమ్మదిగా కదలడం ప్రారంభం అయ్యింది.ఊపిరి పీల్చుకున్నాను. బ్రిడ్జ్ ప్రారంభానికి వచ్చిన తరువాత ఆ ట్రాఫిక్ జాం కు కారణం కళ్ళారా చూసిన తరువాత కోపంతో ఒంట్లో నరాలన్నీ ఒకే సారి బిగుసుకు పోయినట్లయ్యింది.మొత్తం ట్రాఫిక్ అంతా సగం రోడ్ లో నుండి వెళ్ళుతోంది. మిగిలిన సగంలో రాత్రి అక్కడ పక్కనే ఉన్న మందిరం తాలూకు "పరస" (ఉత్తరాంధ్ర లో "తిరునాళ్ళు" అనే పదానికి బదులుగా వాడేది) సందర్భంగా నిర్వహించిన ప్రోగ్రాం తాలూకు వేదిక మిగిలిన సగాన్ని ఆక్రమించి ఉంది.ఎవ్వరూ ఇదేమిటి అని అడగడం లేదు. అలానే సర్దుకుని ఆ సగం రోడ్ లో నుండి సాగిపోతూనే ఉన్నారు. ఆ నడిచి పోతున్న శవాలలో నేనూ ఒకడినైనందుకు నా మీద నాకే అసహ్యం వేసింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి ...ఈ ట్రైన్ మిస్ ఐతే వేరే ట్రైన్ లేదు. తప్పనిసరిగా  గా రాంచీ వెళ్ళాల్సిన పరిస్థితి. మా అమ్మాయిని అక్కడ నుండి ఢిల్లీ తీసుకుని వెళ్ళాలి.చాలా కాలం క్రితం "విపుల" మాస పత్రిక లో చదివిన కధ గుర్తుకు వచ్చింది.శవాలను కాంట్రాక్ట్ కుదుర్చుకున్న ఒక వ్యక్తి తన కష్టమర్ కు బ్రతికి ఉన్న మనుషులను సప్లై చేసేస్తాడు. దానికి అతగాడి ఇచ్చిన రీజనింగ్ కూడా ఇదే. కళ్ళ ముందే జరుగుతున్న అత్యంత చిన్న  అవకతవకలను కూడా  పట్టించుకోలేని వీళ్ళను మనుషులుగా చూడడానికి అవసరమైన కారణాన్ని  చూపమంటాడు.


ప్రతి వీధి లోనూ జులాయి (లంపెన్) యువత ఉండడం సహజం. ఇంతకు ముందు వీళ్ళను ఎందుకూ పనికి రాని వారి గానే చూసే వారు. కానీ మారిన పరిస్థితులలో వీళ్ళే మన రాజకీయ వారసులుగా మారుతున్నారు. రోడ్ అంతా బ్లాక్ చేసి వేదిక వేసి దాని మీద ఏదో ఒక అసహ్య కరమైన ప్రోగ్రాం కండక్ట్ చేసే అంత బుద్ది హీనత  కాస్తంత జ్ఞానం ఉన్న వాళ్ళెవరికీ ఉండదు కదా....మరి అలాంటి ప్రోగ్రాం లు జరగక పోతే మన నాయకులకు ఫ్లెక్సీ లు తగిలించే చాన్స్ ఎక్కడ వస్తుంది? కాబట్టి ఒక వీధిలో కేవలం పది మంది ఆ లంపెన్ గ్ర్రూప్ ఉంటే చాలు కొన్ని వేల మంది తిరిగే రోడ్ ను బ్లాక్ చేయగలుగుతున్నారు.అంటే అన్ని వేలమందికీ వాళ్ళు అసౌకర్యం కలిగించగలుగుతున్నారు.జనం మాత్రం ఆల్టెర్నేటివ్ రోడ్  ఎక్కడ ఉందో వెదుక్కుంటూ తల వంచుకుని పోతూనే ఉంటారు.


ట్రైన్ ఐతే ఎక్కాను గానీ నా అలోచనా స్రవంతి ఆగలేదు. నాలుగు రోజుల ముందు కూడా  అనుకోకుండా ఇలాంటి ప్రోగ్రాం జరుగుతుండగా మా వాహనం స్లో అయ్యింది. వేదిక మీద యాంకర్ కు ఒంటి మీద స్పృహ ఉందా అన్న రీతిలో వాగుతుంది.జనం నుండి అనుకున్న స్పందన రాలేదు.


" అబ్బే......మీ వీధి లో కుర్రాళ్ళకు ఓపిక లేదండీ..."


అడ్డమైన బూతు డైలాగ్ లూ మాట్లాడుకుంటూ జనాలు ఆనందిస్తున్నారు. ఇదంతా ఒక గుడి ముందు ఆ అమ్మ వారి పరస సందర్భంగా ఏర్పాటు చేయబడ్డ ప్రోగ్రాం. వేదిక చుట్టూ నాయకుల ఫ్లెక్సీలు ...మాకు అరగంట పైగా లేట్ ..మాకే కాదు ఆ రోజు  గోపాలపట్నం నుండి ఎన్.యే.డీ జంక్షన్ వరకూ ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికీ అదే లేట్.
" ఆ వెనుక గ్రౌండ్ లో పెట్టుకో వచ్చు కదా ....యీ ట్రాఫిక్ సమస్యలు ఉండవు ....."


" ఊరుకోండి సార్...ఎక్కడో పెడితే ..యీ ఫ్లెక్సీ లు అన్నిటినీ ఎవరు చూస్తారు....ఇంకా ఇక్క్డ బెటర్ సార్...మొన్న అనకాపల్లి...యలమంచిలి మధ్య  సగం హై వే ని బ్లాక్ చేసి ..10000 వాట్ స్పీకర్స్ తో ప్రోగ్రాం పెట్టారు...ఆ రోజు హై వే లో ప్రయాణం చేసిన  వాళ్ళ ఖర్మ .....అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది సార్... " మా డ్రైవర్ నా విసుగుదలను పలచన చేయడానికి ప్రయత్నించాడు.


" మరి...అదే రోజు..అదే రోడ్ మీద యెవరైనా మినిష్టర్ లాంటి వాళ్ళు వస్తే...?"


మా డ్రైవర్ నన్ను చాలా జాలిగా చూసాడు.


"భలేవారు సార్...వాళ్ళకు పైసా ఖర్చవకుండా పోగైన జనం దొరికినట్లే కదా... ....
ఒక్కొక్క చోట ఉండే అది కొద్ది మంది వలన ఇంత మందికి బాధ....అంటే అతి కొద్ది మంది ఆర్గనైజెడ్ జనం పాములై చీమల్లాంటి జనాన్ని ప్రతి స్థాయి లోనూ పీడిస్తూనే ఉన్నారు. కాక పోతే యీ పాములు బయట నుండి రావడం లేదు. ఈ చీమల నుండే పుడుతున్నాయి.




యీ పాములు పరిమాణం దృష్ట్యా చిన్నవే.కానీ అత్యంత ప్రమాదం. ఎందుకంటే చీమల నుండి వేరు చేయడం కష్టం.మనకున్న అన్ని కళా రూపాలనూ తొక్కేసి చానల్స్ వాళ్ళు సృష్టిస్తున్న వికృత కళా రూపాలను మన సమాజమ్మీద రుద్దడానికి మార్గం సుగమం చేస్తానికి ఈ పాములు.  వీటి వెనుక ఉన్న పెద్ద పాములు డైరక్ట్ రంగం లోకి రాకుండా ఈ చిన్న పాములని వాడుకొంటాయి అంటే వీళ్ళు చెప్పిందే వేదం.....వీళ్ళు ప్రదర్సించేదే కళ అని జనం అంటే చీమలు నమ్మాల్సిన స్థితిలోకి సమాజాన్ని నెట్టడం కోసం పెద్ద పాములు వెనుక నుండి చేయవలసింది అంతా చేస్తారు.జనానికి ఒక ఆల్టెర్నేటివ్ అలోచనా విధానం లేకుండా చేస్తాయి. రంగులు వేరుగా ఉన్న ఈ పాములు ఒక దానికొకటి అల్టెర్నేటివ్ గా చూపించుకొంటుంటాయ్. చీమలు సహజంగానే ప్రస్తుతానికి వేరే గతి లేక వాటినే ప్రస్తుతం నమ్ముతారు కానీ యెల్లకాలం అలా నడవదని చరిత్ర చూస్తున్న అందరికీ తెలుసు.అలా రక రకాలుగా ఆలోచించుకొంటూ ప్రయాణం పూర్తి చేసి ఇంటికి వచ్చి 15 రోజులయ్యిందో లేదో తెలియదు కానీ పేపర్లో వార్త.......


విసుర్లు....వేళాకోళాలు.....సామెతలు ఇవన్నీ ప్రతి నాగరిక సమాజపు సంస్కృతి లోనూ అంతర్భాగంగా ఉంటాయి.అవి ఎంత విస్తృతంగా ఉంటే అంతగా ఆ సమాజంలో ప్రజాస్వామిక విలువలు వేళ్ళూనుకున్నాయని భావిస్తారు. చర్చిల్...  బెర్నార్డ్ షా ల మధ్య నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాలు.... మొదలైన వాటిని బ్రిటిష్ పౌరులు వారి సమాజ శైలికి ఉదాహరణగా చాలా గొప్పగా చూపించుకొంటారు. ఎదుటివారిని నొప్పించని వేళాకోళాలు అందరికీ ఆహ్లాదకరంగానే ఉంటాయి.....మరీ మూర్ఖులైతే తప్ప...కాబట్టే ఆనాటి మన ప్రజాస్వామిక విలువల యొక్క ఔన్నత్యాన్ని భావి తరాల వారికి చూపించడానికి ఎన్.సీ.యీ.ఆర్.టీ. వారు ఆ నాటి నాయకుల విశాల దృక్పధాన్ని పరిచయం చేయడానికి ఆనాటి మేటి కార్టూనిష్ట్ వేసిన కార్టూన్ ని ఒక టెక్స్ట్ బుక్ లో వేసినందుకు పార్లమెంట్ లో ఒక పార్టీ వారు రేపిన దుమారం సభ్య సమాజం లో ఉన్న వారందరినీ విస్తు పోయేలా చేయడమే కాకుండా అధికార పక్షం వారు కూడా ఓట్లు జారి పోకుండా ఎదుటి వారిని మించి పోయి చేసిన  ప్రకటనలూ .......... అందులోనూ చర్చించవలసిన అన్ని సమస్యలనూ పక్కన పెట్టి దీనినే ప్రధాన సమస్యగా పార్లమెంట్ ను నడిపిన తీరు........చీమల ఆలోచనలన్నీ చంపేయడానికి .........అసలు చీమలు ఆలోచనే చేయకుండా ఉండడానికి చేస్తున్న కృషి లా కనిపిస్తుంది. ఇప్పటికైనా ఆలోచించే చీమలు దండుగా కదుల్తాయా....లేకుంటే పాముల బుసల మధ్య..జీవచ్చవాలులా బ్రతికేస్తాయో చూద్దాం....నేనైతే బ్రతకలేనేమో అనిపిస్తుంది.

8, మే 2012, మంగళవారం

కళ...స్పందన....రికార్డులు


ప్రతి విషయం హేతుబద్దతకు నిలబడ లేక పోవచ్చు. కానీ కానీ కొన్ని అలా జరిగితేనే బాగుంటుందనిపిస్తుంది.దాంట్లో  చాలా విషయాలు మిళితమై ఉంటాయి. మా అమ్మాయి వాళ్ళ డాన్స్ స్కూల్ వారు నిర్వహించే   చాలా ప్రోగ్రాంస్ లో  చిన్న చిన్న పాత్రలు వేస్తూనే ఉండేది. 9 వ తరగతి నుండి అది ఒక్క సారే పొడుగు ఎదగడం వలన దానికి ఒకే సారి సీనియర్ అమ్మాయిలతో కలసి ప్రోగ్రాం  చేసే అదృష్టం కలిగింది. అంతవరకూ బాగానే ఉంది కానీ దానిని రిహార్సల్ నుండి తీసుకు రావడానికి చాలా సాయంత్రాలు /రాత్రులు అంటే ఇంచుమించు సాయంకాలాన్నుండి మొదలుపెట్టి  రాత్రి వరకూ వేచి ఉండాల్సి వచ్చేది. నిజం చెప్పాలంటే ఆ వేచి ఉంటంలోనే నా సైట్ వర్క్ వలన కలిగిన అలసట అంతా పోతూ ఉండేది. ఎం.వీ.పీ. కాలనీ లో సెక్టర్ .5 లో ఉండే ఆ నాట్య కళాశాల  లో నుండి మంద్రంగా వినిపించే పాటల వింటూ మానసికంగా పునరుత్తేజం పొందుతూ ఉండే వాడిని.ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఐన "బాలక్క" అని అందరూ పిలుచుకునే శ్రీమతి బాల గారి గురించి ప్రస్తుత కూచిపూడి నాట్య కుటుంబం లో తెలియని వారెవారూ ఉండరు.కానీ ఆవిడ ముక్కోపానికి భయపడని శిష్యులూ ఉండరు.అప్పుడప్పుడు నేను ఆ సంగీతంలో మునిగి ఉన్నప్పుడు " ఒసేవ్ ..నీహారికా.ఎక్కడ చూస్తున్నావే"  అన్న అరుపుకు మా అమ్మాయికంటే నేనె ఎక్కువ  భయపడే వాడిని. పాపం మా అమ్మాయి భయపడిందేమో నన్న బాధతో లోపలికి తొంగి చూస్తుండే వాడిని.


మొత్తానికి ప్రొగ్రాం అనుకున్న దాని కంటే బాగా జరిగింది. విశాఖ ఉత్సవ్ మొదటి రోజున జరిగిన మొట్ట మొదటగా జరిగిన ఆ ప్రోగ్రాం కి ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందన కరతాళ ధ్వనుల రూపంగా బయటకు వచ్చినప్పుడు మాకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. ప్రోగ్రాం అంతా అయిన తరువాత మా అమ్మాయిని మేము తీసుకు పోదామని నెమ్మదిగా స్టేజ్ దగ్గరికి నడిచి అదే విషయం బాలక్కకు చెప్పాం. ఆవిడ అంతెత్తున లేచి "ముందు అంతా ఇంటికి నడవండి"
ఆవిడ ఇంటికేనని అర్ధం అయ్యింది ఎందుకంటే ఆవిడ ఇల్లే నాట్య కళాశాల కాబట్టి . 
మరలా ఇప్పుడు ఆవిడ ఇంటి దగ్గర పనేంట్రా బాబూ అనుకుంటూ వాళ్ళింటి దారి పట్టాం కళాకారులంతా వేన్ లోనుండి దిగారు. బాలక్క హారతి వెలిగించింది. అందరి చుట్టూ తిప్పింది. ఏవో మంత్రాలు కూడా చదివినట్లు  గుర్తు.పెద్ద  గుమ్మిడి కాయ పట్టుకుని అందరి చుట్టూ తిప్పి నేలనేసి కొట్టింది. అదంతా దిష్టి పోవడం కోసమని అర్ధమయ్యింది. నిజం చెప్పాలంటే నాకు అటువంటి వాటి మీద నమ్మకం ఎంత మాత్రం లేదు.కానీ ఆవిడ చేసిన ఆ చిన్న కార్యక్రమం నాలో ఎటువంటి ఫీలింగ్స్ కలగ  చేసాయో నేనెప్పటికీ మాటలలో ఐతే చెప్పలేను. కొంత సేపు అలా ఉండి పోయాను. కళ్ళలో నుండి నీళ్ళు బయటకైతే రాలేదు కానీ....


కళలో ఉండే మనుషులలో ఎన్నెన్ని ఫీలింగ్స్ ఏ స్థాయి లో కలగ చేస్తుందో ఆ రోజులో అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను.ఆ స్పందన అనుభవించిన వారికే అది తెలుస్తుంది. ఇది నిజమైన కళ యొక్క ప్రతిస్పందన అని నిస్సందేహంగా చెప్పొచ్చు. 


 కానీ ఈ మధ్య కాలంలో "కళ" అనే పదానికి చాలా నిర్వచనాలు వచ్చాయి.కొత్త నిర్వచనాలలో స్పందన అనేదాని కంటే అది సృష్టించే రికార్డ్ ల మీదే ఎక్కువ దృష్టి ఉంటోంది. ఐనా ఫరవాలేదులే ...ఏదో ఒక విధంగా మన కళళను ప్రపంచ వ్యాప్తం చేస్తున్నారన్న ఆనందం మిగలాలన్నా కూడా ఆ..యా.. ప్రోగ్రాంస్ నిర్వహించేటప్పుడు ఆ రంగాలలో లబ్ద ప్రతిష్ఠులుగా ఉన్న వారిని ఎక్కువగా వేదికల పై ఆశీనులయ్యేటట్లు చేస్తే కొంత ఆనందంగా ఉంటుంది. అలా కాకుండా మూడు  సంవత్సరాల క్రితం నిర్వహించిన "అన్నమయ్య లక్ష గళార్చన " కార్యక్రమమానికి ఆహ్వానించబడిన సినీ ప్రముఖులు మన కళామ తల్లికి ఎలాంటి సేవలు చేసారో....వారిని చూస్తే ఏ కళలు గుర్తుకు వస్తాయో ఆ కార్యక్రమ నిర్వాహకులకి తెలియదని అనుకోలేము. నాకర్ధమయ్యిందేమిటంటే  వాళ్ళ కార్యక్రమానికి వచ్చే ప్రచారం వాళ్ళకి ముఖ్యం . రెండు సంవత్సరాల క్రితం నిర్వహించిన "కూచిపూడి మహా బృంద నాట్యం " నిజంగా కూచిపూడి నాట్యానికి యే విధంగా ఉపయోగపడుతుందో నాకు అర్ధం కాలేదు. కొన్ని వేల మంది కేవలం ఒక చోట చేరి చేతులు ఊపితే అది నాట్యమవుతుందేమో నాకు తెలియదు.ఎలా ఐతేనే రెండూ గిన్నిస్ బుక్ లోకి ఎక్కేసాయి. అంటే అవి సృష్టించే ఆనందం ..స్పందనలు...ఇవన్నీ అర్ధం లేనివిగా మారిపోతున్నాయ్. రికార్డులు పరంగా మన సంస్థ వార్తల్లోకి ఎక్కేస్తే చాలు...మనం మన వంతు గా కళామ తల్లికి మన వంతు సేవ చేసేసి నట్లే....


బహుసా అందువలనేనేమో మా విశాఖ లో రోడ్ లు బ్లాక్ చేసి నిర్వహించే ప్రోగ్రాం  బేనర్స్ నిండా కళాకారుల పేర్లు రాసి పక్కన " డేన్స్ బేబీ డేన్స్ ఫేం" ...ఇంకేదో ఫేం ..అని గొప్పగా రాయగలుగుతున్నారు. నిర్వహించే వాళ్ళకి మాత్రమే ప్రచారం రావాలనుకునే ప్రోగ్రాంస్ అన్నీ ఒక్కటే...వాశి లో తేడా ఉండదు...రాశి లో తప్ప. 

5, మే 2012, శనివారం

నమ్మకం కలిగించు....జగమంతా వెలుగు నింపు..


టూ వీలర్ వెనక్కు తిప్పాను.ఎందుకో మా శ్రీమతికి చెప్పలేదు. రైతు బజార్ నుండి 200 మీటర్ల దూరం వచ్చి ఉంటాం.సంచుల నిండా కూరగాయలు కొనేసాం.ఐనా వెనక్కు ఎందుకు తిప్పానో మా శ్రీమతి కి అర్ధం కాలేదు.టూ వీలర్ పార్క్ చేసి తిన్నగా అంతకు ముందు కూరగాయలు కొన్న ఒక షాప్ దగ్గరికి నడిచి జేబు లో నుండి రెండు రూపాయల నాణెం తీసి అతనికి ఇచ్చాను.ఆ రైతు ముఖం లో ఆనందం.

" ఓస్ యీ మాత్రానికేనా....తరువాత వచ్చినప్పుడు ఇచ్చేసి ఉండే వాళ్ళం కదా.."
శ్రీమతి మెత్తగా విసుక్కుంది.


జరిగిన దాని గురించి పెద్దగా వివరించనవసరం లేదు సింపుల్ గా చెప్పాలంటే ఆ రైతు దగ్గర కూర గాయలు కొన్నప్పుడు 2 రూపాయల చిల్లర తక్కువ వచ్చింది.
" అన్నీ కొనుక్కున్న తరువాత యీయండి బాబూ" రైతుకు బేరం వదలడం ఇష్టం లేదు. అది జరిగిన తరువాత కూర గాయలైతే కొనేసాం కానీ ఆ 2 రూపాయలూ ఇవ్వడం మరిచి పొయ్యాం.


ఆలోచిస్తే యెవరికైనా సరే నిజంగానే తరువాత ఇవ్వొచ్చు అనే అనిపిస్తుంది. కానీ ఒక వేళ అది మనం మరిచిపోతే .......


అది ఆ రైతుకు పెద్ద నష్టం కాక పోవచ్చు కానీ అటువంటి సంఘటనలు రెండు మూడు జరిగితే ఆ రైతుకు మనుషుల మీద నమ్మకం పోతుంది.అతడు తోటి వారిని నమ్మడం మానేస్తాడు. అంటే తనుండే సమాజం మీద నమ్మకం పోతుంది. మనుషుల్లో ఎక్కువ మంది మోసగాళ్ళే అన్న నమ్మకం అతడిలో పెరిగి పోవచ్చు. చుట్టూ ఉన్నవాళ్ళంతా ఎలాగూ మోసగాళ్ళే గనుక తను కూడా ఎంతో కొంత మోసం చేయడం లో తప్పేముంది అనే ఆలోచన కూడా అతడిలో కలగొచ్చు.అంతా మోసగాళ్ళే కాబట్టి ఎలక్షన్లలో తనకు ఎక్కువ ఎవరి వల్లనైతే లాభం కనబడితే వాళ్ళకే ఓటెయ్యొచ్చు. ఆ విధంగా కొంత మంది అయోగ్యులు కూడా ప్రభువులుగా మారే క్రమానికి ఇతడు కూడా తన వంతు  సాయం చేసిన వాడవ్వొచ్చు.
పైదంతా చదివిన వారికి ఇదంతా చాదస్తంగా అనిపించొచ్చు. నాకు కూడా అలాగే అనిపించేదేమో  యీ మద్య కాలంలో జరిగిన  కొన్ని పరిణామాలు...నిన్న ట్రైన్ లో నడిచిన సంబాషణ జరగక పోతే. 


సంఘటన దగ్గరికి వస్తే గనుల మాఫియా లో అరోపణలు ఎదుర్కొంటున్న పక్క రాష్ట్రానికి ఒక మాజీ మంత్రివర్యుల వారి శిష్య గణం లొ ప్రముఖుడు (యీయన కూడా ఒక మాజీ మంత్రి వర్యులే) ఆ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలో 50000 పై చిలుకు  ఓట్ల ఆధిక్యతతో తిరిగి ఎన్నికయ్యారు. దీనిని అంత తేలికగా ఎలా తీసుకొంటున్నారో నాకు అర్దం కాదు.  


నిన్న ట్రైన్ లో యెక్కి కూర్చున్న కొంత సేపటికి నా ఎదురుగా కూర్చున్న ఒక పెద్దాయన చదవడానికి తన దగ్గరున్న డైలీ న్యూస్ పేపర్ ఇవ్వ బోయాడు.
"వద్దులెండి..నేను ఇంట్లో ____ పేపర్ చదివేసాను" సున్నితంగా తిరస్కరించాను. పైగా నేను చదుతున్న పుస్తకం కూడా  అప్పటికి చేతిలోనే ఉంది.
"అయ్యో ..నీవు చదివిన పేపర్ లో చాలా విషయాలకు కౌంటర్ దీంట్లో ఉంటుంది బాబూ" ఆయన వదిలేలా కనిపించలేదు. పుస్తకం మూసేసాను. 


"నేను పేపర్ వార్తల కోసమే చదువుతాను..ప్రచారాల కోసం కౌంటర్ల కోసం చదవనండీ..."


నేను కూడా ఒకప్పుడు అలాగే చదివే వాడిని బాబూ....కానీ యీ మద్య పేపర్లు చదువుతుంటే ప్రపంచం మొత్తం మోసం తోనే నిండి ఉందనిపిస్తోంది ...అందుకే సరదాగా అన్నీ చదివేస్తున్నాను."


" మరి మీరు రేపు ఎలక్షన్ల లో ఓటు వేయాలంటే యేంచేస్తారు" నాకు కూడా ఆయనతో మాట్లాడడం సరదాగానే అనిపించింది.


" యేముంది బాబూ...నిలబడ్డ వాళ్ళలో యెవరు తక్కువ మోసగాడైతే వాడికి వేస్తాను" 


ఆయన మాటల్లో నిజాయితీ ఐతే ఉంది.కానీ మోసగాళ్ళు రాజకీయ వ్యవస్థ జనం ఊహల్లోకి కూడా రావడం లేదన్న వాస్తవం నాలో ఎందుకో భయొత్పాతాన్ని కలగజేస్తోంది. ఒక వేళ ఇదే మొత్తం సమాజం యొక్క రాజకీయ ..తాత్విక చింతనగా మారితే...ఆలోచించదానికే భయంగా అనిపించింది. నేను పెద్దగా యేమీ చేయలేక పోయినప్పటికీ నా చుట్టూ ఉన్న వాళ్ళలో తిరిగి తోటి  మనుషుల మీద నమ్మకం కుదురుకొనడానికి యేమి చేస్తే బాగుంటుందో అలోచుస్తూ నా స్టేషన్ లో దిగాను.