30, జనవరి 2015, శుక్రవారం

స్మార్ట్ సిటీ అయితే మాత్రమేటి ?




నాల్రోజులుగా చిట్టి నాయుడు కి కంటి మీద కునుకు లేదు. కునుకు పట్టినా అన్నీ పీడకలలు ....
నాలుగో రోజున దిగాడు అప్పలనాయుడు.
నాల్రోజుల ముందు చిట్టి నాయుడు కి ఈ రోజు చిట్టి నాయుడు కి ఉన్న తేడా చూసి అప్పలనాయుడు భయపడి పోయాడు.
“ఇదేంట్రా చిట్టీ ....ప్రొబీసన్ వచ్చేత్తందని తెలిసినప్పుడు కూడా నువ్ బెదర లేదు. పైగా నాల్రోజులకే ఒరిస్సా నుండి సరుకు దింపేసి లచ్చల్లచ్చలు నొల్లేసేవ్.... మరిదేంట్రా....జబ్బు చేసిన కోడి పెట్టలాగైపోయేవ్....అసలు సంగతేటో చెప్పరా బాబూ ....నేనున్నానుగా .....”
“అదికాదు మాయ్యా.....పేపర్ చూత్తన్నావా ....?”
“ఏవుందేటి ......రోజూ ఉండే కొత్త పధకాలే కదా ....మన కొంపకేటైనా నిప్పంటుకునే సంగతులేటీ లేవు కదా ......?”
“మన కొంపక్కాదు.....డైరక్ట్ గా మనకే నిప్పంటుకునేలా ఉంది “
“నాకైతే అలాంటిదేమీ అగపడ లేదు కానీ ....చెప్పేది సరిగ్గా చెప్పరా బాబూ .....”
“మన విశాఖపట్నం స్మార్ట్ సిటీ అవుతాదట.....”
“మంచిదే కదా ....”
“రోడ్లన్నీ కరెక్ట్ గా ఉంటాయట ....మెట్రో రైలు వత్తాదట.....”
“రానీయ్రా ....మంచిదే కదా ....”
“మరదే ....నీకు తెలంది(తెలియనిది).......ఇప్పుడయ్యన్నీ వచ్చేత్తే మన వినాయక చవితి పందిళ్ళు ....దసరా పందిళ్ళు ....పైడితల్లమ్మ సంబరాలు ....యియ్యన్నీ ఎక్కడ చేత్తావ్....నీ రాజకీయం ఏటవుతాది ...?”
అప్పలనాయుడు పకాల్న నవ్వి ఆగి పోలేదు .....అరగంట నవ్వేడు. ఆపిన తరువాత మొదలెట్టేడు ...
“ ఒరేయ్ చిట్టీ .....పదేళ్ళ నుండీ కార్పొరేటర్ గా ఈ మాత్రం తెలీకుండా గెలిచేత్తానేట్రా . ఉప్పుడు నీ వయసెంత్రా?”
సమాధానానికీ....వయసుకీ సంబధం చిట్టి నాయుడు కి అర్ధం కాలేదు. అప్రస్తుత ప్రసంగంలా అనిపించింది.
“నలభై  అయిదు ....”
“ నీ పదిహేనోళ్ళ
 వయసప్పుడు కిలో రెండ్రూపాయల కి బియ్యం ఇత్తామని అప్పుడే పెట్టిన పార్టీ చెప్పేత్తే ఓట్లన్నీ దానికే గుద్దేసి అధికారం లోకి తెచ్చేసేరు. అంత కంటే పాత పార్టీలు ఇంతకంటే గొప్ప గొప్పయ్యే వాగ్దానాలు సేసేరు కానీ అవెప్పుడవుతాయన్న గారంటీ ప్రజల్లో ఎప్పుడూ లేదు. అసలాళ్ళు చెప్పే దానికీ మనీది చర్చి లో పాస్టరు గారు బైబిల్ సంగతులు సెప్పేదానికీ తేడా ఉండేది కాదంటే నమ్ము ....”
చిట్టి నాయుడు ముఖంలో పెద్ద  ప్రశ్నార్ధకం కనిపించేసరికి అప్పలనాయుడు కాసేపు ఆగి  సిగరెట్ వెలిగించి గట్టిగా దమ్ము పీల్చి వదిలి మళ్ళీ మొదలు పెట్టాడు.
“చిట్టీ  ....మరిప్పుడు కూడా రెండ్రూపాయలకే బియ్యం అన్నావనుకో జనాలు చేస్ అంటారు ....అలా అని పాత పధకాలు అలాగే ఉంచాలి. రెండ్రూపాయలకి కిలో బియ్యం మొదలు పెట్టినప్పుడు నీ ఇంట్లో కనీసం బ్లాక్ అండ్ వైట్  టీవీ ఉందా?”
లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు చిట్టి నాయుడు.
“మరిప్పుడు కలర్ టీవీ లేని ఇల్లు ఉందా ?”
మళ్ళీ తల అడ్డంగా ఊపాడు చిట్టి నాయుడు.
“కాబట్టి ఉప్పుడు ప్రతీ ఓడికీ కొన్ని కలలుంటాయా ఉండవా ....కలలు గాల్లోంచి పుట్టవు కదా .....ఉప్పుడైతే టీవీల్లోంచి...సినిమా ల్లోంచి  కలలు పుడతాయి. మన సిటీలు కూడా రోడ్ పక్కన రెస్టారెంట్ లు ...గార్డెన్ లు ...జారిపోయే రోడ్లు ....నున్నటి కార్లు .....అబ్బో......మరలాంటి కలలు నిజం చెయ్యాలి కదా .....”
“అదేకదా మాయ్యా ...చిక్కంతా ....మరలాంటి రోడ్ల మీద మన పందిళ్ళు యైనిత్తారా...?”
“ఓరి చిట్టీ .......ముందీ రోడ్ అంటే నీ చిన్నప్పుడన్న మాట .....?”
“ఇదేటి అసలు తార్రోడ్డే ఉండేది కాదు ...మనోళ్ళ ఇళ్ళన్నీ అక్కడోటి ఇక్కడోటి ఇసిరేసినట్టుండేయి కదా “
“కదా ....మరి ఆ తరువాతేటయ్యింది”
“ఇది తార్రోడ్డయ్యింది......నలభై అడుగుల రోడ్డయ్యింది .....ఆ తరువాత ఇదిగో పదేళ్ళ బట్టీ .....ఎనభై అడుగుల రోడ్డయ్యింది . కానీ మాయ్యా ఒక మంచి పనయ్యింది ...రోడ్ వెడల్పయ్యేకొద్దీ కొన్ని స్థలాలు గవర్మెంట్ లాక్కుంది కాబట్టి రోడ్ కటూ ఇటూ మన వాళ్ళే అయ్యారు. “
“మరి రోడ్ మారి పొయ్యింది కాబట్టి మనవేటన్నా పందిళ్ళు మానేసేమేటి .....ఇయ్యేసే కదా నాయకులయింది .....మనవేటన్నా ఉద్యమాలు చేసేవేటి ...అసలీ రోజుల్లో ఎవడన్నా ఇంతే అనుకో ....”
“కానిప్పుడు ఇదేదో స్మార్ట్ సిటీ అంటున్నారు కదా .....”
“ఏదైనా ఒకటే ....అద్దం లా రోడ్డ్డుందని దానిమీద ఉమ్మేయ్ కుండా ఉంటావా .......వేరే గవర్మెంటేదైనా నీవూసిన ఉమ్మి నిన్నే తియ్య మంటాడని  బయ్యం ఉంటే తప్ప ....కానీ అలాటి గవర్మెంట్ ఎలాగూ రాదు . ఎందుకంటే ఏ పార్టీ యన్నా మనలాటోళ్ళ మీదే కదా బతుకుతుంట ......మన కేటీ బయ్యం లేదు మన పందిళ్ళు మనయ్యే....ఒకేల ఏ రిలయన్సోడో ఈ పైన ఆఫీసెట్టి ఈ పందిళ్ళు అడ్డుతగుల్తాయన్నా కూడా ఏటీ కాదు. ఎందుకంటే అప్పుడు మనం మన పందిట్లోకి ఏ స్వరూపానంద స్వామినో తెత్తామన్న మాట. అప్పుడు గవర్మెంట్ ఏటి సేత్తదో తెల్సా మన పందిళ్ళు పోకుండా పైనుండి ఫ్లయ్ ఓవర్ కట్టుకుంటాదన్న మాట  ”
“మరప్పుడు కొత్తగా వచ్చిన ఈ అపార్ట్ మెంట్లోళ్ళు ఏటీ సెయ్రా.....”
“ఆళ్లా ....భలే అడిగావొరే చిట్టీ ......ఆల్లేటి సేత్తారో తెలుసా ....మీవోడు రాసుకుంటున్నట్టు అదేదో ఫేస్ బుక్ లో ......ఛీ ..ఛీ యీళ్ళలో ఎప్పటికీ మార్పు రాదంటూ రాసుకుంటూ కూసుంటారు కానీ ..గుమ్మం దాటి బయటకైతే రారు ...ఇది మాత్రం గారంటీ ....కాబట్టి ఆళ్ళని నువ్ పట్టించుకోనక్కర్లేదు. సాధారణంగా ఈ మనుషులు రెండు రకాల పనులు సేత్తా ఉంటారన్న మాట. తప్పులు సాధారణంగా అందరూ సేత్తానే ఉంటారు. దొరక్క పోతే గుడికెళ్ళి హుండీలో దక్షినేసి పాపం పోయిందనుకుంటారు. దొరికి పోతే మన లాటోళ్ళ దగ్గరికొత్తారు. అంతే గాని తప్పులు చేయకుండా బ్రతకడానికి చూడరు. నువ్వే సూడు ....ఎసిడిటీ అంటూనే ఉంటావ్. ఆ గోవిందు దుకాణానికెళ్ళి సికెన్ పకోడీ తినేసి ఇంటికెళ్ళి డైజీన్ మింగేత్తల్లేదా ....కక్కుర్తి లేకుండా ఇంటికెళ్ళి ఆనప కాయ కూర తినేసి పడుకోచ్చు కదా .....సర్లే ఇంకే శంకలూ బుర్రలో ఎట్టుకోకుండా ఇంటికెళ్ళి శుభ్రంగా పడుకో .....”

ముగించాడు అప్పలనాయుడు ......