29, ఆగస్టు 2014, శుక్రవారం

పదాలు పాతవే గాని అప్లికేషన్ మాత్రం ......

( దీనిలో ఉదఃరించిన ఘటనలు ఎవరినీ కించపరచాలని కాదని మనవి )



“ఏమోయ్....సింధూ కి లక్ష రూపాయల అప్పు కావాలంట ....”

టీ కప్పు చేతికిస్తూ శ్రీమతి  అడిగింది. 

“జీతమంతా ఏం చేస్తుంది ?”

“అది ఎవ్వరికీ చెప్పొద్దని ఒక విషయం చెప్పింది ....ఎవరో బాగా కావాల్సిన వాళ్ళే ....చాలా అర్జెంట్ .....నాలుగు రోజుల్లో ఇచ్చేస్తానంటే దీని సేవింగ్స్ అన్నీ అప్పిచ్చిందట “

“మరి .....”

“ఏముంది మిగిలినదంతా మామ్మూలే..... అతగాడు ఫోన్ ఎత్తడు ......ఒక వేళ ఎత్తినా .......ఎక్కడో ఎయిర్ పోర్ట్ లో నో ఏసీ కంపార్ట్మెంట్ లోనో ఉన్నానని చెబుతాడట.”

“ఇంతకూ ఎవరట?”

“అమ్మో ....ఆ విషయం మాత్రం చెప్పనంటుంది....వాళ్ళు మనకు బాగా కావాల్సిన వాళ్ళే ....బయటకు తెలిస్తే బాగుండదంటుంది. “

“మన వాళ్ళలో అలాంటి కుర్రాడెవరూ ఉన్నట్టు నాకనిపించడం లేదే .....”

“ అదీ అడిగాను ....అతగాడి శ్రీమతి దీని అసలు ఫ్రెండ్ .....కాకపొతే దీనికి స్కూల్ లోనో ఎక్కడో అతగాడు కొద్దిగా తెలుసు ....ఈ అమ్మాయిని చేసుకున్న తరువాత మరలా పాత  పరిచయాలు పునరిద్దరించుకున్నారు ...”

“ ఇంతకూ అతగాడు దీని దగ్గర అప్పు తీసుకున్న విషయం ఆ ఫ్రెండ్ కు తెలుసా ?”

“తెలుసట “

“సరేలే ..తన అకౌంట్ బెనిఫీసియరీస్ లో ఉంది .....ట్రాన్సఫర్ పెడతాను .....”

“వాళ్ళన్నయ్య పెళ్ళికి చాలా గ్రాండ్ గా కనిపించాలని ఇది ఎప్పటి నుండో కలలు కంటుంది .....కొంచెం ఎక్కువే ట్రాన్సఫర్ చెయ్ .....”

“చిత్తం “

పది రోజులు గడిచిన తరువాత వేరే పెళ్ళిలో బఫే దగ్గర కుర్చీలు లాక్కుని కూర్చున్నాం ....నేనూ ,సింధూ 

“ఇంతకూ నీ డబ్బులు తిరిగొచ్చాయా.....”

నవ్వి ఊరుకుంది 

“వాళ్ళాయన వలన నీవు ఇబ్బంది పడుతున్నావని నీ ఫ్రెండ్ కు తెలుసా ?”

“ఎందుకు తెలియదు ....అంతా తెలుసు ...జస్ట్ ఇంతకు ముందే కళ్యాణ మండపం పక్కనే వాళ్ళిద్దరూ కార్ ఆపి దిగారు ..”

“అరె...మరి పద.....నేను గట్టిగా అడిగేస్తాను “

“అందుకే పిన్ని మరీ మరీ చెప్పింది .....నిన్ను మాత్రం ఈ గొడవలోకి రానీయోద్దని ....అసలే కోపం ఎక్కువ అని “

“నీ అప్పు తీర్చకుండా కార్ వేసుకుని తిరుగుతున్నారా ..సిగ్గుండక్కరలా..?”

“గొప్ప వాడివే ...నా దగ్గర అప్పు తీసుకున్నదే కారు కొనడం కోసం .....”

“అప్పు చేసి కారా ......”

“పైగా కొన్నదేమీ ఎకానమీ మోడల్ కాదు ...సెడాన్ మోడల్ ....”

“ఆ .....వాళ్ళ ఒంట్లో రక్తమేనా ప్రవహిస్తుంటా?”

“ఇందాకే చూసాను దాని నడుముకి వడ్డాణం కూడా ఉంది “

“ ఎప్పుడో అర్జున్ సినిమా చూసినప్పుడు ప్రకాష్ రాజ్ ...సరిత జంట అన్యోన్యత చూసి ఇలాంటి అన్యోన్యత కూడా ఉంటుందా ....అని ఆశ్చర్యపోయాను ...కానీ ఇప్పుడర్దమవుతోంది ....అవి సజీవ పాత్రలేనని ....”

“నిజమే ....”

“మరి సింధూ .....చిన్న సందేహం ....నీకూ నాకూ జెనరేషన్ గేప్ ఉందనుకో ............వీళ్ళంతా ఇన్ని తప్పులు చేస్తున్నా గిల్టీ కాన్షస్ అనేది ఫీల్ కారా “

“ఇప్పడే కదా ...అర్జున్ సినిమా గురించి చెప్పావు. ఆ సినిమాలో సరిత పాత్ర లో పాతివ్రత్యానికేమైనా లోటు కనిపించిందా ..... సూటిగా అడుగుతున్నానని ఏమీ కంగారు పడకు “

“అంటే ఆ విషయానికి ప్రాధాన్యత ఉండవలసిన పాత్ర కాదు కదా అది ....”

“కరెక్టే .....కానీ ఇప్పుడున్న అన్యోన్యతల్లో ఎక్కువ భాగం అలాంటివే ....”

“నిజమేలే ఇలాంటి వాళ్ళను శీలవతులు గా కూడా పరిగణించ కూడదేమో ..... “

“అదేంటి రెండూ ఒకటి కాదా ?”

“ఎలా అవుతుంది .....మొగుడు ఎలాంటి పని చేసినా ...ఎలాంటి వాడనే వాటితో నిమిత్తం లేకుండా అతడినే నమ్ముకుని ఉండడం పాతివ్రత్య లక్షణం ......కానీ శీలం అనేది ఎవరితోనూ సంబధం లేని వ్యక్తిగత లక్షణం .....”

నాకు సరిగా అర్ధం కావడం లేదు చిన్నాన్నా.....”

“ తమకు ఆనందమిస్తుందనుకుంటున్న ఆడంబరాల కోసం తన వారిని .....సమాజం లోని తన తోటి వారిని ఏ మాత్రం సంకోచం .... లేకుండా బాధ పెట్టడానికి ఆలోచించని స్త్రీ లను నేను శీలవతులుగా పరిగణించను. ప్రస్తావన స్త్రీల గురించి కాబట్టి వాళ్ళ గురించే మాట్లాడతాను  “

“అంటే......”

“ నీ సందేహం నాకు తెలుసు .... తన ఆడంబరాల కోసం టాక్సులు ఎగవేత కు ప్రోత్సహించే ప్రతి స్త్రీ కూడా ఇదే కోవలోకి వస్తారు .....అంతే కాదు ....అనేక అక్రమాల ద్వారా వేల కోట్లు తన భర్త ఆర్జిస్తున్నాడని తెలిసి కూడా ఉపేక్షా భావంతో ఉండే స్త్రీలు కూడా ఇదే కోవలోనికొస్తారు. “

“అయ్య బాబోయ్ .....ఇంత ఆవేశమా ?”

“ఒక్క విషయం ఆలోచించు .....ఇదే పార్టీ కి  తెలియకుండా  ఒక సెక్స్ వర్కర్ ఆహ్వానించబడి ఆమె నా కుటుంబ పోషణకు నాకు వేరే దారి లేదు అని చెప్పినా ఆమెను తన తోటి స్త్రీ గా చూడగలరా ఇక్కడి స్త్రీ లెవవరైనా.......”

“అసలు నీకు ఈ ఆడంబరాలంటే ఎందుకంత కోపం .......”

“ నిజం చెప్పాలంటే ...నేను ఆడంబరాలను పట్టించుకోను .....కానీ విలువలు నానాటికీ దిగజారడానికి అవి ఒక కారణంగా మారుతున్నప్పుడే నాకు ఏవగింపు ప్రారంభమయ్యింది “

“నీ మీదకు చెప్పులు .....రాళ్ళు రావడం ఖాయం .....”

“సిద్దంగానే ఉన్నాను .....”