15, జూన్ 2014, ఆదివారం

కాబోతున్న గుళ్ళు ..... ఇప్పుడే మొక్కేస్తే కొంత పుణ్యం క్రెడిట్ లో పడిపోతుంది




" అటు చూడు "

మూర్తి నేను చూపిన వైపుకి తిరిగాడు.

"ఏముంది ?"

" ఫోటోలు తగిలించిన ఆ చెట్టు కనబడలేదా "

మేమిద్దరం విశాఖపట్టణం లోని న్యూకోలనీ సెంటర్ నుండి రైల్వే స్టేషన్ వైపు

వెళ్ళే రోడ్ లో ఎడమ వైపు ఉన్న ఈ చెట్టుకి సమీపం లో ఉన్నాం.

"అవును చాలా సార్లు చూసాను "

"ఇప్పుడింకా నయం ..... మూడు రోజుల ముందు వరకైతే ఇంకా చాలా ముందుకి ఆ ఫోటోలు పేర్చేసి ఉండేవి . "

"ఇంతకూ ఇది నాకెందుకు చూపిస్తున్నావ్ ?"

"ఏమో ...ఎవరు చూడొచ్చారు ..... కొద్ది సంవత్సరాలలో ఇది ఒక ప్రముఖ పుణ్యక్షేత్రమై కూర్చుంటుందేమో .... ?"

"ఎలా .... ఇంత  బిజీ రోడ్ లో ..... నీకేమైనా మతి పోయిందా ?

"చూడు బాబూ మన ఆసీల్ మెట్ట వినాయకుడి గుడి కూడా ఇలా సరదాగే ... ఎవరో షిప్పింగ్ కంపెనీ వాళ్ళు వాళ్ళ ఆఫీస్ వాస్తు కోసం గోడలో వినాయకుడి విగ్రహం పెడితే ఏర్పడిందే ..... అంతే  కాదు ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న గుళ్ళన్నీ  ఇంచుమించు ఇలానే ఏర్పడతాయ్ "

"ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయ్ ..... పార్టీలు కూడా మారుతూనే ఉన్నాయ్ .... కానీ ఈ విషయాల జోలికి ఎవరూ రారెందుకో ?

" చూడమ్మా .... గీటురాళ్ళు మారుతున్నాయ్ ..... నీవు చేసిన పని ప్రజలకు ఎంత మేలు చేస్తుందన్నది  secondary thing..... దాని వలన మనకు ఎన్ని వోట్లు పెరగ బోతున్నాయన్నదే సరి కొత్త గీటురాయి . రోడ్ కి అడ్డంగా వస్తుంది కదా అని ఏ గుడి మీద చేయి వేసినా నిప్పు రాజు కోవడం ఖాయం ..... ప్రజల కోసం ఒక వేళ  ఏ ప్రభుత్వం అన్నా అంత సాహసం  చేసినా నిప్పు రాజెయ్యడానికి  బోలెడన్ని చానళ్ళు రెడీ గా ఉంటాయ్ . రోడ్ కి అడ్డంగా ఎక్స్టెండ్ చేయబడి ఉన్న గుడి వలన ట్రాఫిక్ కు ఎంత అంతరాయం కలుగుతుందో చూపించడానికి ఎవడికీ సాహసం చాలదు  .....కానీ  "

"నీవు మరీ గురూ .. వాళ్లకు మాత్రం TRP రేటింగ్ అవసరం ఉండదా ఏమిటి ? కొన్ని విషయాలు ఎంత అవసరమైనవి అయినప్పటికీ  వాటిలో తలదూర్చకుండా ఉంటే క్షేమంగా ఉంటామని ప్రతి పాలక పక్షమూ భావిస్తూ ఉంటుంది. ఎవడిదో పెళ్లి అవుతూ ఉంటుంది ... రాత్రి 12 గంటల ముహూర్తం కావచ్చు ... తెల్లవారగట్ల 5. 00 గంటల ముహూర్తం కావొచ్చు ఇష్టం వచ్చినట్లు బాణసంచా కాల్చి నిద్రలు పాడు చేస్తున్నారా లేదా .... వీటినాపే  రూల్స్ లేవా ... అన్నీ ఉంటాయ్. నీవన్నట్లు సరైన గీటు రాళ్ళు ఉండే పార్టీలు వస్తే చాలు "



















8, జూన్ 2014, ఆదివారం

ఉనికి కాపాడుకునే కనీస IQ మన కమ్యూనిస్టులకు ఉంటుందా ....



"ఒరేయ్ ...... చిన్నా ఇలా రారా ...... "

 5 సంవత్సరాల చిన్నా వచ్చాడు.

"నిన్ను వీడు కొట్టడానికి వచ్చాడనుకో ...... ఏం చేస్తావ్ ?"

7 సంవత్సరాల టింకూను చూపించి అడిగాను

"ఇంటికెళ్ళి మా అన్నయ్యను తీసుకుని వస్తాను . "

" మరి వీడు కూడా కొట్టడానికి వస్తే ?"

పక్కనే ఉన్న 9 సంవత్సరాల రాము ని చూపించి అడిగాను.

"నేనేమీ ఊరుకోను ...... మా మామయ్య గారి సురేష్ బావను తీసుకుని వస్తాను ....మా  పక్కింట్లోనే కదా ఉంటారు "

"శభాష్ .... నీవెళ్ళి ఆడుకోరా చిన్నా ....."

"ఎందుకలా అడిగావు? "

పక్కనే ఉన్న మూర్తి అడిగాడు

"వీడి IQ మన కమ్యూనిస్టు పార్టీ నాయకుల IQ కంటే ఎక్కువా కాదా అని "

"ఏం అర్ధం అయ్యింది ?"

"నిస్సందేహంగా చాలా ఎక్కువ "

"ఎలా తెలిసింది ?"

"మొత్తం కార్పొరేట్ శక్తులన్నీ ఎప్పుడూ లేని విధంగా ఏకమయ్యి  ఎదురు లేని అధికారంలోకి వస్తున్నారని తెలిసి కూడా వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకున్నారు తప్ప ..... కనీసం ఏకాభిప్రాయానికి రావడానికి ఒక్క ప్రయత్నం చేయలేక పొయ్యారు . "

"ఏకాభిప్రాయానికి వస్తే గెలిచి ఉండేవారా ?"

" నా మొఖం ...... కనీసం ఒకే జెండా క్రిందకు వచ్చి ..... పూర్తి సైద్దాంతిక నిజాయితీ ఉండే లోకసత్తా వంటి పార్టీ లతో కలసి పూర్తి స్థాయిలో ప్రజా పోరాటాలు అవి కూడా అర్ధవంతమైనవాటిలో పాలు పంచుకుంటుంటే ఉనికి నిలబడుతుంది . "

"అంటే ఇప్పుడు అధికారం లోకి వచ్చిన పార్టీల మీద నీకు పూర్తి నమ్మకం లేదా ?"

"నమ్మకాల కంటే నిజాల మీద ఆధారపడడం నాకు అలవాటు ........ "

"అంటే ..... "

"చాలా మంచి మంచి సిద్దాంతాలతో .... విప్లవం ద్వారా అధికారం లోకి వచ్చిన పార్టీలు కూడా ప్రత్యామ్నాయ విధానాలు, సిద్దాంతాలు ...... లేక   మొత్తం దేశ ఆర్ధిక వ్యవస్థను సంక్షోభం లోకి నెట్టడం చరిత్రలో చాలా చూసాం ..... "

"అలాంటప్పుడు మరలా నేరగాళ్ళ ముఠాలు ప్రత్యమ్నాయం  మేమే అంటూ ముందుకు వచ్చేస్తారేమో ...... "

"అందుకే మంచి బలమైన  ప్రత్యామ్నాయం కూడా ప్రజలే తయారు చేసుకోవాలి ..... అప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ ఆరోగ్యం గా ఉంటుంది ...... నిజానికిది కమ్యూనిస్టుల మూల సూత్రాల లోనే ఉంది ..... "

" మరి ..... ఏ విధానాలు మనకు బాగుంటాయంటావ్ ?"

"నాకు నచ్చిన చైనా సామెత చెబుతాను విను ..... పిల్లి ఎలుకలను పట్టే పని చేసున్నంత సేపు అది తెల్లదా .... నల్లదా అనే విషయాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఇక్కడ కూడా అంతే. మన వాళ్ళ కోర్కెలు చాలా చిన్నవి. కాస్త నిజాయితీ ఉంటే చాలు .... వారికుండే చిన్న చిన్న కోర్కెలు తీర్చడం పెద్ద కష్టం కాబోదు . బలమైన ప్రత్యామ్నాయం ఉంటే .... అధికార పార్టీలోకి దూరి పోయి తమ పబ్బం గడుపుకోవాలనుకునే వృత్తి  రాజకీయ నాయకుల ఆటలు  కూడా సాగవ్ . నీవు అన్నట్లుగా నేరగాళ్ళ ముఠాలు మరలా రాజకీయ ప్రత్యామ్నాయం గా ఎదిగే  అవకాశం  కూడా ఉండదు "





7, జూన్ 2014, శనివారం

తెలివైన వ్యాపారాత్మక నివాళి ... "మనం "



ఆ మధ్యనెప్పుడో మా మేనల్లుడు తను తీయాలనుకుంటున్న సినిమా ట్రైలర్  నాకు పంపించాడు. ఒక అమ్మాయి నడుచుకుంటూ మెట్లెక్కుతూ ఉంటుంది. ఎవడో ఒక యువకుడు లెన్స్ జూమ్ చేస్తూ ఆ అమ్మాయినే తెగ చూసేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి మెట్లెక్కుతూ ఉంటుంది ..... ఆ యువకుడు జూమ్ చేస్తూ చూస్తూనే ఉంటాడు. కొంత సేపటికి మన మీద దయతలచి ఒక్క డైలాగ్ ఉంటుంది .....

" మనసుకి నచ్చిందే చేయమని అందరూ  అంటారు ..... కానీ నా మనసు నా దగ్గర ఉంటే కదా ...... "

ఈ డైలాగ్ విన్న వెంటనే మన ప్రేమైక జీవులందరూ ఉబ్బి తబ్బిబ్బై పోతారని ఆ దర్శకుడి అంచనా అన్న మాట ..... 
ఏదో కుర్ర కుంకలందరూ కలసి ఏదో అఘోరిస్తున్నారు కాబట్టి వాళ్ళ అపరిపక్వ మనసులని కొద్దిగా అర్ధం చేసుకోవచ్చు. 
కానీ 70 వసంతాలు కళాకారుడిగా జీవించిన వ్యక్తి ఇంచు మించు ఆఖరి దశ లో తీసిన సినిమా కూడా ఇటువంటి అపరిపక్వతతో తీయడం చాలా శోచనీయం. స్వాతంత్ర్య పోరాటం సమయంలో   సినిమా రంగం లోనికి అడుగుపెట్టిన కళాకారుడికి ఇచ్చిన నివాళి ఇదైతే మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక్కడున్న ఇబ్బంది ఏమిటంటే ..... అలాంటి కధలను తయారు చెయ్యాలంటే చాలా  భూత ... వర్తమాన  సామాజిక  పరిణామం మీద అవగాహన ..... పరిపక్వత ...... నిజాయితీ  ..... లాంటి లక్షణాలున్న కళాకారుల  సమూహం కావాలి. కానీ ఇవన్నీ లేకుండానే ఏ పనికి మాలిన సబ్జెక్ట్ తో తీసినా హిట్ అయిపోయే పరిస్థితులలో విడుదల చేయడానికి సిద్దం చేయబడ్డ సినిమా కాబట్టి నిర్మాతలకు అంత రిస్క్ చేయవలసిన అవసరం లేకుండా పోయింది. 

ఇక్కడొక  ముఖ్యమైన విషయమేమిటంటే  సినిమా హిట్ అవుతుందన్న గారంటీ ఉన్నప్పుడు ఒక ఉదాత్తతతో నిండిన సినిమాను ప్లాన్ చేయొచ్చు ..... పైగా ఒక్క సినిమా ఫెయిల్ అయినంత మాత్రాన సర్వం కోల్పోయే ప్రమాదం కూడా లేని నిర్మాణ సంస్థ ....... అయినా అలాంటి ప్రయత్నం చేయరు. ఒక ఉదాత్తతతో నిండిన కధ అంటే దాంట్లో సమాజం లోని చాలా పొరలను స్పృశిం చవలసిన అవసరం ఉంటుంది ..... దానికి కనీసం అలాంటి పొరలంటూ ఉంటాయని సూత్రప్రాయంగా  అయినా తెలిసిన నటులు కావాలి. అలాంటప్పుడు ఒకే కుటుంబం లో(ఆగర్భ శ్రీమంతులు ) నుండి ఉద్భవించిన నటులు ఆ పాత్రలకు అతకకపోవచ్చు. కానీ ఒక గారంటీ గా విజయవంతమయ్యే  అవకాశమున్న సినిమా ద్వారా  తన వారసులని తారలుగా చేసే అవకాశాన్ని వ్యాపారాత్మకంగా విజయవంత మవుతున్న నిర్మాత ఎవరూ వదులుకోరు. ఈ విషయంలో నిర్మాతల వ్యాపార దక్షతను చాలా మెచ్చుకోవాల్సిందే. తండ్రికి కళాకారుడిగా ఉన్న ఇమేజ్ ని  తన వారసుల భవిష్యత్తుకి కరెక్ట్ గా వాడగలిగిన  నాగార్జున గారి వ్యాపార దక్షతకు  కార్పొరేట్  ప్రపంచం జేజేలు పలకొచ్చు ...... కానీ నిజంగా ఒక కళాకారుడికి ఇలాంటి సినిమాతో వీడ్కోలు పలకవలసి రావడం నిజంగా తెలుగు ప్రజల దౌర్భాగ్యం .

 ..... ఈ సినిమా బాగోలేదంటే తమ యొక్క "క్లాస్ " ను ఎదుటి వాళ్ళు తక్కువగా అంచనా వేస్తారన్న భ్రమలో చాలా మంది ప్రేక్షక దేముళ్ళు ఉన్నారు ..... వారిలో కొంతమందైనా కళ్ళు తెరవాలనే ఆశతో .....



                కేవలం ఫోటో పై ఉన్న కాప్షన్ కోసమైనా ఈ ఫోటో లను బ్లాగ్ లో ఉంచమని చాలా మంది అడిగారు .....