25, మార్చి 2014, మంగళవారం

శత్రువుని సూటిగా ఎదుర్కొనే నాయకుడే కావాలి .... స్పష్టత లేని సిద్దాంతాలు కాదు .....

"అది కాదు కామ్రేడ్ ...... నీవు న్యూస్ సరిగా ఫాలో కావడం లేదనుకుంటా ...... "

"......... "

"మనం చేయలేని పని ఇతగాడు చేస్తున్నాడు ..... అసలు ఎవరి మీదకైతే తుపాకీ గురి పెట్టాలో వాళ్ళ మీద సూటిగా ఎక్కుపెడుతున్నాడు ..... "

"....... "

"మనం సరిగా ఎలక్షన్స్ ముందు మాత్రమే .... ఫ్రంట్ గురించి ఆలోచిస్తూ .... పరమ అవినీతి పరులుగా ముద్ర పడ్డ వాళ్ళతో సంకోచం లేకుండా జతకట్టేస్తాం .... మరీ సిగ్గులేకుండా .... "

"........... "

"వాటికి ఏవేవో సిద్దాంతాల మేకప్ వేసేస్తాం ... "

"......... "

"మన ముందు మతతత్వం ..... లంపెన్ పెట్టుబడిదారీ వర్గం కలగలసి పోయి మొత్తం వ్యవస్థను అడ్డగోలుగా తయారుచేస్తున్న నేటి విపత్కర పరిస్థితులలో కూడా మన అన్నదమ్ముల లాంటి వారితో కలసి  మన కుటుంబాన్ని బలంగా చేసికొని .... ఆ తరువాతే అదీ కూడా అవసరమైతేనే ..... మిగిలినవారి తో  జతకట్టాల్సి నప్పుడు  ..... చిన్న చిన్న వంకలు చూపించి అనవసర రాద్దాంతాలతో మన వాళ్ళతో కయ్యానికి కాలుదువ్వే మిమ్మల్ని చూస్తుంటే  నాకు మీ నిజాయితీ మీద అనుమానం కలుగుతోంది కామ్రేడ్ ....... "

".......... "

"మీరు జతగట్టాలనుకుంటున్న వారిలో మతతత్వాన్ని .... వారి ప్రతినిధులని ఇతడి కంటే ఎదుర్కున్న వాళ్లెవరైనా ఉంటే చూపించండి ... సంతోషిస్తాను. మన కంటే కూడా మన శత్రువులని అతడే సూటిగా ఎదుర్కుంటున్నాడుగా...."

" ........... "

"మన పాత పెద్ద నాయకులు మొదటి పార్లమెంట్ కు ప్రతిపక్ష నాయకుని హోదాలో ఒక సైకిల్ మీద ఫైళ్ళను మోసుకుని పార్లమెంట్ కు వచ్చారని ఈనాటికీ ఘనంగా చెప్పుకుంటాం ... మరి అంత సింపుల్ గానే ఉంటున్న ఈ నాయకుడు మన జతగాడుగా ఎందుకు కన్పించడం లేదు ? జనాలు అసహ్యించుకుంటారని రిపోర్ట్స్ వెళ్ళిన తరువాత విరమించుకున్నాం గానీ లేక పోతే ఒక అవినీతి పరుడు గా ముద్ర పడ్డ ఒక ఫ్యాక్షనిస్ట్ కుటుంబాన్నుండి వచ్చిన వాడితో జత కట్టడానికి సిద్ద పడిపొయ్యామ్ ..... కానీ కేవలం ఉద్యమం ద్వారా నాయకులైన వాళ్ళను మనం కలుపుకోగాలుగుతున్నామా .... ?"

"............. "


"గెలవాలనుకుంటున్న పార్టీ కి గెలుపు గుర్రాలు కావాలి ....... అధికారమే పరమావధిగా ఉన్న వాళ్లకు గెలిచే అవకాశం ఉండే పార్టీ కావాలి ..... ఇది తప్ప వేరే సిద్దాంతం లేని ప్రస్తుత పరిస్థితులలో పెద్ద పెద్ద సిద్దాంతాలు చెప్పి అనవసర కన్ఫ్యూజన్ సృష్టించడం కంటే ప్రజల భాష మాత్రమే మాట్లాడుతున్న అతడి భాష మనకు వినసొంపుగా లేదా ..... ? వ్యక్తులుగా కాక గుంపులు గుంపులుగా దూరిపొతున్నారు .... పార్టీల పేర్లు మారుతున్నాయి తప్ప అధికారం అక్కడే ఉంటుందన్న వాస్తవాన్ని చూస్తూ కూడా మనం కూడా దానిలోనే భాగస్తులం కావాలనుకుంటున్నాం "

".......... "

"మీరు మాట్లాడరు కామ్రేడ్ .... మాట్లాడలేరు కామ్రేడ్ ..... ఒక్క విషయం చెప్పండి కామ్రేడ్ మనం అధికారం లోకి రాగానే ప్రజలంతా సోషలిస్ట్ భావజాలంలో మునిగి పోతారని మీరు నమ్ముతున్నారా ...... ?దానికి అవసరమైన పోరాటాలు ఎన్ని రంగాల్లో మనం చేస్తున్నాం ? అసలు అటువంటి ఆలోచనలైనా మనం చేస్తున్నామా ? ప్రజలకు మనం ఎప్పుడో దూరమైన వాస్తవాన్ని మనం గుర్తించం .... మన పూర్వీకులు సంపాదించిన పేరు ని వాడుకుంటూ దాని మీదే మనం స్వారీ చేస్తాం ..... "

"........... "

"సెలవ్ కామ్రేడ్ ....... నాకు చేతనైన పద్దతి లోనే  ప్రజల కోసం జరుగుతున్న ఉద్యమాలలో పాలుపంచుకోవాలని ఆశ ..... ఈ రోజు మేం కొద్ది మంది కావొచ్చు ..... కానీ నాకు  నమ్మకముంది .....స్పష్టత కొరవడిన సిద్దాంత బలం కంటే ...... శత్రువుని సూటిగా ఎదుర్కోగలిగే బాట పట్టిన వారి వెంటే జనం నడుస్తారు ..... "శత్రువుని సూటిగా ఎదుర్కొనే నాయకుడే కావాలి .... స్పష్టత లేని సిద్దాంతాలు కాదు ..... 





17, మార్చి 2014, సోమవారం

ఆధారం లేని నమ్మకం

అనుకోకుండా ఎండలు ఒకే సారి పెరిగి పోయాయ్ . 

పాపం ఇంత ఎండలో ఆ పెద్దతను ఎందుకు పని చేయవలసి వస్తుందో .... .    బ్రిడ్జ్ ల మీదా .... ట్రాక్ మీదా  నీట్  గా గుండ్రంగా మా రైల్వే స్టాండర్డ్స్ ప్రకారం  లెటరింగ్  చేయించవలసిన అవసరం కలిగినప్పుడు  ఆ పెయింటర్ ను నా దగ్గరకు పంపే ముందు నా కొలీగ్ చెప్పిన మాటలు నా మనసులో మెదులుతూనే ఉన్నాయి .

" మీ అవసరానికి తగ్గ మంచి పెయింటర్ ని పంపిస్తున్నాను ..... మన రైల్వే లోనే రిటైర్ అయ్యాడు . అతడికి ఏం చేయాలో కాస్త వివరించి చెప్పండి చాలు .... ఆ తరువాత మీరు హాపీ గా వేరే పనులకు మీ టైం కేటాయించుకోవచ్చు .  అక్షరాలైతే ముత్యాల్లా రాస్తాడు. కానీ ఒక్క ఇబ్బంది మాత్రం ఉంది .  అతగాడి అవసరం ఏమిటో తెలియదు కానీ పని జరుగుతున్నప్పుడు ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇచ్చేయాలి . "

అతగాడు పని ప్రారంభించిన రెండు రోజుల వరకూ అతగాడి ని కలవలేక పోయాను .  అతగాడు  మరీ అంత వయసు పై బడిన వాడని అనుకోలేదు .  ఏ అవసరాలు అతగాడిని ఇంకా పని చేయడానికి పురికొల్పుతున్నాయో ...... 

" మంచి నీళ్ళు తెచ్చుకున్నావా .... ?"

చూపించాడు 

"ఎక్కువ ఎండ ఉన్నప్పుడు ట్రాక్ మీద ఉండకు. ఏదైనా చెట్టు కింద గానీ .... బ్రిడ్జ్ క్రింద గానీ రెస్ట్ తీసుకో .... "
వెనక్కు తిరిగి రెండడుగులు వేసాను . మరలా అతగాడి దగ్గరకు వెళ్ళాను. 

"నీ దగ్గర మొబైల్ ఉందా.....? "

తలూపాడు . దాంట్లో నా నంబర్ ఫీడ్ చేయిచాను.  

"ఏదైనా అవసరం వస్తే వెంటనే ఫోన్ చేయి "

"అదేంటి సార్ .... మేమేలాగ ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాంగా .... " కాంట్రాక్టర్ సూపర్వైజర్ రాజు నవ్వాడు. 

"కరెక్టే రాజూ ...  మా అమ్మా ... నాన్నా మా వూరిలో ఉంటారని తెలుసుగా .... ఈ ఉద్యోగంలో ఆదివారం కూడా సెలవుండదు .... మా పిల్లలక్కూడా ఈ రెండు మూడు సంవత్సరాలు  కొంచెం ముఖ్యమైనవే.  ఒక షిప్ కెప్టైన్ గా ఆ భాద్యతలు కూడా సక్రమంగా నిర్వర్తించాలి.  గత రెండు మూడేళ్ళలో మా అమ్మా ... నాన్నలు   రెండు మూడు సార్లు మరణం అంచుల దాకా వెళ్ళారు. కానీ పక్కనే ఉన్న బంధువులు .... స్నేహితులు సమయానికి ఆదుకోబట్టి  ప్రమాదాలనుండి బయట పడ్డారు . కనీసం ఇక్కడ నా చుట్టుపక్కల ఉన్న పెద్ద వాళ్ళను నాకు అవకాశం ఉన్న మేరకు ఆదుకుంటే ..... అక్కడ నా తలిదండ్రులను ఎప్పటికీ ఎవరో ఒకరు అలానే ఆదుకుంటారని అనిపిస్తూ ఉంటుంది. ఈ నమ్మకానికి ఆధారం ఏమీ లేదు ....కేవలం నా ఫీలింగ్ అంతే ..... "



10, మార్చి 2014, సోమవారం

ఎప్పటికైనా...... తాతే ... కుర్రాడు



"అరే .... గోవిందు దుకాణం తెరిచాడే ..... "అనుకుంటూ బండి ఆపాను . 

"రండి సార్ ..... 10 రూపాయలదా ...... 15 రూపాయలదా ... 20 రూపాయలకు మూడా  ..... " గోవిందు మామూలు పాట పాడేసాడు 

"సరే కానీ నిన్నెక్కడకు పోయ్యావ్ ..... పైగా ..... దేవుడికి జుట్టిచ్చి నట్టున్నావ్ " నున్నగా మెరుస్తున్న గోవిందు గుండును చూస్తూ అడిగాను.

"సింహాచలం కొండకెళ్ళాను సార్ .... ఈ సంవత్సరం ఒక్కసారీ యెల్ల లేదు ...సరే 10 రూపాయల బొండాం కొట్టేత్తాను"

గోవిందు కొట్టిచ్చిన బొండాం అందుకున్నాను.

"ఇంత అర్జెంట్ గా కొండ కెందుకెళ్ళావ్ ...... ?"

"మార్చి నెలోచ్చేసింది .... ఒక్క సరైన ఎండ కాయలేదు ..... ఇలా అయితే నా యాపారం మూసుకోవాలిసిందే ...... "

"అమ్మ ..... నీ ..... అంటే నీ వ్యాపారం కోసం ఎండలు కాయించేయమని దేవుడికి అప్లికేషన్ పెట్టావన్న మాట ..... అదే  దారిలో ఇంకా చర్చి ..... మసీదుల క్కూడా వెళ్ళకపోయావా ...ఒక  పనై పోయి ఉండేది "

"సారూ .... మీరు నవ్వుతారని చెప్పలేదు .... నిజంగానే వెళ్లి ...... "

నిజంగానే నవ్వుకున్నాను 

"ఇంతకు ముందేమైనా చర్చి ... మసీదుల కెళ్లావా ?"

"లేదు సారూ ..... ఏదో యాపారం కోసం ..... "

" మరి ... వాళ్ళ పద్దతులు అవీ తెలుసా ?"

"అదేంటి సారూ ..... అంత ఎదవనా .... ఆళ్ళ లో ఉండే ఫ్రెండ్స్ తోనే కదా ఎల్తా ... ఆళ్లు ముందే అన్నీ చెప్పారు .... "

" మొత్తానికి ఎక్కడా వాళ్లకు అపచారం కలక్కుండా చూసుకున్నానంటావ్ ..... "

"అదేంటి సారూ ..... అంత కళ్ళు నెత్తికెక్కటానికి మా నాన్నేమన్నా గవర్నరా .... ముఖ్యమంత్రా ..... ?"

"అమ్మ .... గోవిందూ .... నువ్వూ రాజకీయాల్లోకి వచ్చేయొచ్చు .... చాలా విషయాలు తెలిసి పోతున్నాయ్ ... కానీ ఒక్కటేమిటంటే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న చాలా మంది కంటే నీకు కాస్త మంచి సంస్కారమే ఉంది . "

" సారూ ... మా తాత పోయి ... ఐదారేళ్లు అవుతోంది ..... ఆడు బతికినన్నాళ్ళూ ఏవేవో చెబుతూనే ఉండే వాడు ... ఎప్పుడూ .... అంతా అయిపోయిందిరా ... తలో ముక్కా అయిపోయ్యార్రా ... అని గొణుకుతూనే ఉండేవాడు ... ఆడు చెప్పే మాటలు సగం అర్దమయ్యేవి కావు "

"మీ తాతది ఈ వూరు కాదా ?"

"కాదు సారూ ....విజయనగరం జిల్లా .... ...... మా నాన్న పదేళ్ళప్పుడు అక్కడ పెద్ద పెద్ద గొడవలైనాయట ...... మా తాత ను కూడా పోలీసులు చంపేద్దురంట .... మొత్తానికి తప్పించుకుని ఇక్కడికొచ్చి పడ్డాడట .... అసలు మా తాతకు అలా తప్పించుకుని రావడం ఇష్టం లేదట ... అన్నీ బాగున్నప్పుడు తిరిగొద్దువు లే అంటూ అయినోళ్లంతా పంపేసారట సారూ ....."

"అబ్బో .. నీ వెనకాల కూడా చాలా రాజకీయ చరిత్రుంది .... ఏదైనా ఎలక్షన్ లో పోటీ చేయకపోయ్యావా .....? "

ఎందుకో తెలియదు .... గోవిందు ముఖం కందగడ్డలా మారిపోయింది. 

"సారూ ... మా అయ్య ఆక్సిడెంట్ లో చనిపోయిన తరువాత ఆడే నన్ను పెంచాడు. ఆడెలాటోడో   నాకు తెలుసు సారూ .... ఆళ్లూరిలో ఆడిని దేవుడిలా చూడడం నేను చూసాను సార్ .... జనం చూపించే నిజమైన ప్రేమ అక్కడే చూసాను సార్ ... ఆడేదో నమ్ముకున్నాడు .... బతుకంతా దానికతుక్కు పోయి ఉన్నాడు. నమ్మిన దాని కోసం ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. తన వాళ్ళను చచ్చే వరకూ గుర్తుకు తెచ్చుకుంటూనే ఉన్నాడు. ఈడి లాంటోళ్ళు ఎంతో మంది ఉన్నారనే వాడు. నా లాగే ఆళ్ళ తాలూకోళ్ళు కూడా గంజి తాగినా సుఖంగానే ఉంటారనే వాడు. సారూ .... దయుంచి మా తాత రాజకీయాలతో .... ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలను పోల్చొద్దు. ఆడి తరువాత కూడా ఆడు పని చేసిన పార్టీ ఉంది కానీ వంద ముక్కలైంది ..... ఏ ముక్క ఎక్కడికి పోతుందో తెలీకుండా ఉన్నందువల్ల మేమిలా ఉండిపోయాం ..... కానీ సారూ రోజులన్నీ ఒకేలా ఉండవ్ .... మంచి రోజులు రాకపోవు .... ఫ్రీ గా అదిత్తాం .... ఇదిత్తాం ... అని చెప్పే దొంగ మాటలు మా కొద్దు ... మాకు ఓపిక ఉంది ... మా కష్టానికి దారి చూపెడితే ..... మా బతుకులు మేం బతగ్గలం ....... సారూ నా సోదంతా ఓపిగ్గా విన్నారు.... ఇంకో బొండాం తాగండి .... దీనికి డబ్బులొద్దులెండి .... "
అప్పటికే గోవిందు అంతకు ముందిచ్చిన బొండాం లోని నీళ్ళు కళ్ళ లో నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్త్తున్నాయ్ .....