30, జనవరి 2014, గురువారం

సరి కొత్త "మోసగాళ్ళకు మోసగాడు "

                                "కనబడవు కానీ నీలో చాలా దుర్మార్గపు ఆలోచనలు చాలా ఉంటాయి " శ్రీమతి గట్టిగా వక్కాణించి మరీ చెప్పింది చాలా సార్లు . నిన్న నాలో కలిగిన ఆలోచనలు చూసి మొదటి సారిగా అది నిజమేమోనన్న సందేహం కలగడం ప్రారంభమయ్యింది . నిన్న(అనగా 29-1-14) ఉదయం ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్ 7 వ పేజీలో పడిన వార్త చదవగానే సదరు "మద్దూరి వెంకటరమణా రెడ్డి " మీద కోపం రావలసింది పోయి "భలే .... భలే "అనిపించింది. పైకి చెబితే మా శ్రీమతి వెంటనే సైక్రియాటిస్ట్ అపాయింట్మెంట్ తీసేసుకుంటుందేమోనన్న భయం కూడా వేసింది . దయుంచి మీరుకూడా ఆ పేజీలో క్రింద సగంలో ఉన్న "శ్రీవారి సేవా టికెట్లు కావాలా ?.... నా అకౌంట్ లో డబ్బులేయండి " అన్న శీర్షికతో పడిన వార్త ఒక్క సారి చదివి ఎవరికైనా కూడా నాలో కలిగిన ఫీలింగ్స్ కలిగితే నాకు కాస్త తెలియజేయ ప్రార్ధన. లేదంటే నిజంగా నాలో ఏదో మానసిక లోపం ఉందేమోనన్న సందేహం పట్టి పీడిస్తుంది .

                           నిజంగా చెప్పాలంటే అ వార్తలో పెద్ద విశేషమేమీ లేదు . సదరు మద్దూరి వెంకట రమణా రెడ్డి తానొక ఉన్నతాధికారిగా నటించి జనంతో బాటు కొంత మంది స్వామీజీ లను కూడా  ఉదయాస్తమయ సేవలకు టికెట్స్ ఇప్పించ గలనని నమ్మించి డబ్బులు కొట్టేసాడు .  ఇక్కడ చిన్న విషయమేమిటంటే సామాన్య జనానికి కొన్ని భ్రమలు ఉండొచ్చు ..... కానీ స్వాములకు కూడానా ? వీళ్ళకు తామొక డొంక దారిలో వెళ్లి ఏదో ఒక సేవ కు టికెట్ సంపాదించడమంటే ఒక అర్హుడిని పక్కన పెడుతున్నామని కాని ..... అది పాపానికే దారి తీస్తుందన్న ఆలోచనే కలగదా ? బహుశా వీళ్ళ మనస్సులో ఉన్న ledger ప్రకారం సేవ వలన వచ్చిన పుణ్యం లో నుండి ఒక అర్హుడిని పక్కకు పెట్టిన పాపాన్ని తీసి వేస్తే  ఇంకా పుణ్యమే మిగిలి ఉంటుందన్న లెక్కలేమైనా ఉంటాయా ? అంటే ఇక్కడ కూడా కొన్ని వ్యాపార సూత్రాలు పాటించాలా ..... ? అప్పుడు కానీ మన అకౌంట్ లో పుణ్యం మిగలదా ? అసలు అన్నిటికన్నా పెద్ద సందేహమేమిటంటే ఇలాంటి డొంక/దొంగ  మార్గాల ద్వారా వచ్చి సేవలు చేసి .... దర్శనాలు చేసే వాళ్లకు పుణ్యం వచ్చేస్తే అది నిజంగానే భగవద్దర్సనమ్ అవుతుందా ?
....

అమ్మో నా ఆలోచనలను శ్రీమతి పసిగట్టేస్తే నేను తినే భోజనంలో మత్తు మందు కలిపేసి అంబులెన్స్ కు ఫోన్ చేసేయగలదు . ఇక ఆపేయడం మంచిది .