25, డిసెంబర్ 2014, గురువారం

మనం "PK" సినిమా ఎందుకు చూడాలంటే ......



దారిన పోతున్న వ్యక్తెవరైనా
“ అయ్యా మీ తల మీద బూజు ఉంది “ అన్నాడనుకుందాం.
 దాని వెనుకే కొన్ని  ప్రతిస్పందనలుంటాయి. నా ఆలోచన సవ్యంగా ఉంటే వెంటనే తల తుడుచుకుని
“థాంక్ యూ” అంటాను. లేదంటే
”ఏ ....నీ షర్ట్ వెనక ఇంత ఆయిల్ మరక ఉంది .....దాన్ని చూసుకో ముందు ....నా తల సంగతి నీకెందుకు ?” అని గయ్యి మంటాను. లేదంటే
“ఏరా....నీ కంపెనీ షాంపూ ని ప్రమోట్ చేసుకోడం కోసం వెధవ ప్రయత్నాలు చేయకు ....నేనెప్పుడూ కుంకుడు కాయలతోనే తలంటుకుంటాను. ఎక్కడి నుండో షాంపూలు పట్టుకొచ్చి మా మీద బలవంతంగా రుద్దుతున్నారు .....అయినా నా తల మీద బూజుంటే నీకెందుకు ?...పేడ ఉంటే నీకెందుకు ?” అని కూడా గయ్యిమనొచ్చు.

                                  కాకపొతే ఈ మూడు సమాధానాలలో ఏది సవ్యమైనదో విజ్ఞులైన పాఠకులు కే తెలుసు. ఇంత ఎందుకు రాయవలసి వచ్చిందంటే ఈ మధ్యే వచ్చిన  “పీకే “ సినిమా మీద జనాలలో ఈ 3 రకాల ప్రతిస్పందనలూ కనబడుతున్నాయ్.
తమకు మోక్షం ప్రసాదించమనీ .....తమ ప్రయత్నాల వలన పరిష్కారసాధ్యం  కాని సమస్యలకు పరిష్కారం చూపమనీ  సాధారణంగా సామాన్య మానవులు భగవంతుడిని వేడుకుంటుంటారు. దానికొక మార్గం చూపించేదే మతం. ప్రతి మతమూ ఎవరో ఒకరు ప్రవక్తతో ప్రారంభం అవుతుంది(ఒక్క హిందూ మతమే దీనికి ఎక్సెప్షన్). వారు ప్రతిపాదించిన మార్గం ఆనాటి సమాజం లోని అనేకానేక ముఖ్య సమస్యలకు పరిష్కారం చూపించింది కాబట్టే సామాన్య జనం దాన్ని అవలంబించారు అంతేకాదు పరిశీలించి చూస్తే ఒక విషయం అర్ధం అవుతుంది ఇంచుమించు అన్ని మతాలూ ప్రారంభంలో  ఆనాటి పాలక వర్గాలకు వ్యతిరేకంగా పనిచేసినవే . కానీ కాలక్రమేణా పాలక వర్గాలకు జనాలలో వీటికున్న ఆదరణ అర్ధం కాకపోదు. అప్పుడు పాలక వర్గాలు ఈ కొత్త మతాలకు మారడం జరుగుతుంది ...ఎందుకంటే అది వారి మనుగడకు ముక్ఖ్యం కాబట్టి. ఆ తరువాతే అవి పాలక వర్గాల ప్రయోజనాల కోసమే ఎక్కువగా పని చేస్తాయి. సూక్ష్మంలో మతాల ప్రస్తానం ఇదే. (దీనికి మాత్రం హిందూ మతం ఎక్సెప్షన్ కాదు ....హిందూ మతంలో ఇది చాలా ముందు గానే ప్రారంభం అయ్యింది.). ఈనాటి రాజకీయ పార్టీలకు సిద్దాంతాల జోలికి పోని లంపెన్ సైన్యం కావాలి. దానికి అనుగుణంగానే నేటి యువతను లంపెన్ భావజాలంతో ఉంచడానికి మతాల సాయంతో పాలక వర్గాలు చేస్తున్నాయి. దీనికి ఇప్పుడు కొత్తగా మీడియా కూడా తన వంతు సాయం చేస్తోంది. ప్రశ్నించే శక్తిని హరించేయడంలోనే వాళ్ళందరి క్షేమం ఉంటుంది. దీనినర్ధం చేసుకోలేకపోతే మన యువత పైన నేనిచ్చిన మూడు ఉదాహరణలలో కొట్టుమిట్టాడుతుంటారు. అంతే కాదు మతం పేరు మీద అనవసరంగా జరుగుతున్న అట్టహాసాలని సంధించే ప్రశ్నలను తెలివిగా భగవంతుడి ఉనికికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంగా అమాయక జనాన్ని చాలా సుళువుగా నమ్మించేస్తున్నారు. పైగా ఈ ప్రశ్నలు అడుగుతున్న వారిని ఒకరి అభిముఖంగా ఒకరిని నిలబెట్టి వీరు చోద్యం చూస్తున్నారు. కాబట్టి తెలివైన యువత చేయవలసిన మొదటి పని ప్రశ్నించడం ....
ఇప్పుడు మనం PK సినిమా దగ్గరకు వస్తే .......ఈ సినిమా ద్వారా మధ్యలో ఉండే బ్రోకర్ ల వంటి స్వామీజీలను మన మధ్య నుండి గెంటేసే ప్రయత్నం చేసిన అమీర్ ఖాన్ అన్ని విధాలా అభినందనీయుడు. ఈ సినిమాలో ఎక్కడ కూడా భగవంతుని ఉనికిని ప్రశ్నించ లేదు. కాబట్టే ఈ సినిమా లోని విషయం మీద దాడి చేయలేని వారు ఈ సినిమాని విమర్శించడానికి అమీర్ ఖాన్ మతాన్ని వాడుకుంటున్నారు. “సత్యమేవ జయతే” లాంటి ప్రోగ్రాం ను,”పీప్లీ లైవ్ “ లాంటి సినిమాను  రూపొందించిన మనిషి లోని చైతన్యానికి ప్రేరణగా  మతాన్ని చూపించడానికి మన వాళ్ళు ఏ మాత్రం సిగ్గు పడడం లేదు.
రోజూ మనం నడుస్తున్న రోడ్ కి కూడా కొద్ది కాలానికి మరమ్మత్తులు చేయవలసి వస్తుంది. మరి ఎప్పుడో పుట్టిన మతానికి అవసరం ఉండదా ? జనం దగ్గరకి మతాన్ని తీసుకు రావడానికి బమ్మెర పోతన లాంటి మహాకవులు ప్రయత్నం చేసినా దాన్ని పాలక వర్గాలు పట్టించు కోవు ....ప్రచారం చేయవు. నిజంగానే ఏ స్వామీజీ అయినా                                  
“గుడికొచ్చి ప్రార్ధన చేయడం కంటే సమాజానికి ఏదో ఒకటి చేయి ....అంటే వినాయక చవితి పందిళ్ళు వేయడం లాంటిది కాకుండా ......అవసరమైతే సిస్టం మొత్తాన్ని ఎదిరించి నిలబడు “ అని చెప్పగలరా ?.....
కాబట్టే కొన్నిటినైనా  ప్రశ్నించిన ఈ సినిమాని ఆహ్వానిద్దాం .......



19, డిసెంబర్ 2014, శుక్రవారం

ఒక ‘క్రింద’ ఉద్యోగి ఆవేదన (ఇది ఎవరినీ ఉద్దేశించి రాసినది కాదని మనవి )



“నాదొక చిన్న సందేహం సార్ ......మీరు అధికారి కాక ముందు , నేను నా ఉద్యోగం లోకి రాక ముందు మనిద్దరిలో సామాన్యంగా  గా  ఉన్న లక్షణం “మానవత్వమే” కదా .....కాని దాని గురించి కొంతైనా చింత లేకుండా మీలాంటోళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అర్ధం కాకుండా ఉంది .
మనం ఒక్కొక్క విషయం ఆలోచిద్దాం. పరిస్థితులు ఎంతగానో మారిపోయ్యాయి. కానీ వాటిని మీకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలో మీకు తెలుసు. మీకు మంచి జీతాలు ,సౌకర్యాలూ ఉంటాయి. మీకు వాటిని అందుబాటులోకి తెచ్చిన యంత్రాంగం పట్ల మీకు మా కంటే కృతజ్ఞతా భావం ఎక్కువగా ఉండడంలో సందేహమేమీ లేదు కానీ మీ కున్న నిబద్దత  అందరికీ ఉండాలని భావించడం న్యాయమా? మా కుటుంబాల పట్ల మాకు నిబద్దత ఉండకూడదా ....?
అసలు ఆ 8 గంటల పనిదినం కూడా ఎంత మంది మహనీయుల త్యాగఫలమో మీకు కొంతైనా తెలుసా ? అలాగే వారానికి ఒక రోజు సెలవు ఎందుకిచ్చారో ....దాని విలువెంతో మీకు తెలుసా ? అటువంటి సెలవుకి మమ్మల్ని దూరం చేస్తున్న మీకు నాగరికత ఉన్నట్టా లేనట్టా ? మాకు 8 గంటల పనిదినమే కదా. ఆ సమయంలో నిజాయితీగా ....నిబద్దతతో పనిచేయడమే కదా మీకు కావలిసింది. అంతకు మించి పని చేయడం అనేది మా ఇష్టాయిష్టాల బట్టి కదా ఉంటుంది. ఉదయాన కానీ .... వారంలో ఒక రోజు ఉదయం కానీ .....సాయంత్రం కానీ కనీసం కూరగాయలకైనా బయటకు వెళ్ళాలి కదా .....మాకు ప్రభుత్వం ఇచ్చే వాహనాలు కానీ ....మనుషులు కానీ ఉండరు కదా ......? దయుంచి ప్రభుత్వ వాహనాలు స్వంతానికి వాడడం లేదని ఆత్మవంచన చేసుకోవద్దు . అటువంటి వారి శాతం అతి కనీసంగా ఉన్నప్పుడు దానిని సున్నాగానే పరిగణించాలి.
మా పిల్లలు చదువుకుంటున్నప్పుడు వాళ్లకు ఆసరాగా ఉండవలసిన బాధ్యత మా మీద ఉండదా .....? కేవలం వాళ్లకు పుస్తకాలు కొనేసి కాలేజ్ ఫీజులు కట్టేస్తే మా బాధ్యత తీరిపోతుందా ? సమాజం లో పరిస్థితి అత్యంత అపసవ్యంగా ఉన్నప్పుడు వారిని ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్ద వలసిన నైతిక బాధ్యత మా పై ఉండదా ? వారికి విలాసవంతమైన జీవితాన్ని మేము అందుబాటులోకి తేలేక పోవచ్చు  కానీ మన ఆనందానికి అలాంటి జీవితం అవసరం లేదన్న విషయం వారికి అర్ధమయ్యేట్టు చేయగలిగితే వారికి కోట్ల రూపాయల సంపాదనల అవసరం ఉండదు కదా. అప్పుడు వారు నీతీ..... నిజాయితీలతో తృప్తిగా బ్రతక గలుగుతారు కదా. కొంత మంది భయం వలన కూడా నీతి ...నిజాయితీ లతో జీవిస్తారు కానీ చైతన్యం వలన వచ్చే సుగుణాలు మరింత విలువైనవి కావా ?
వాళ్ళు రేపు పరీక్షల ముందు హాల్ టికట్ వినాయకుడి విగ్రహం ముందు పెట్టి పూజ చేయిస్తానంటాడు. అవసరం లేదని చెబుతాను. అంటే దానర్ధం చర్చికి తీసుకెళ్ళి ప్రేయర్ చేయించాలని కాదని కూడా వాడికి అర్ధం కావాలి.... అంటే పరీక్షల లో విజయం కేవలం కఠోర శ్రమ ,దృఢ సంకల్పం వల్లనే సాధ్యపడుతుందనే విషయం ......అసలు జీవితంలో మరే విజయానికైనా ఇవే ప్రాధమిక అంశాలు అనే విషయం వాళ్లకు బోధపరచాలంటే మేము కూడా ఏదో పాఠం చెప్పినట్లు చెబితే పిల్లల తలకెక్కుతుందా ? ఎన్నో ఆసక్తి కరమైన ఉదాహరణలతో కదా వివరించాలి కదా. మహారాజు గారి రాణుల మధ్య తగాదాల వంటి రాజకీయాలు  .....తప్ప సామాన్యుల జీవితాల లోని విలువైన విషయాలను పట్టించుకోని మీడియా ఉన్న ఈ రోజుల్లో అటువంటి ఉదాహరణల ను వెదకాలంటే మేమెంత కష్టపడాలో మీ బోటి వారికి ఎప్పటికైనా అర్ధం అవుతుందా సార్ ?
టీ.బీ కి మందు కనిపెట్టిన నార్మన్ బెతూన్ కోట్లు సంపాదించాగలిగీ స్పానిష్ రిపబ్లిక్  పోరాటానికి ఎందుకు బాసటగా నిలిచాడు ....అక్కడ నుండి చైనా కమ్యూనిస్ట్ పార్టీ లాంగ్ మార్చ్ కు ఎలా వెళ్ళాడు ....ఒక పెన్సిలిన్ ఇంజక్షన్ లేక ఎలా చనిపోయాడు .....?ఎక్కడో అర్జెంటీనాలో పుట్టి మెడిసిన్ చదివి ....మెక్సికో మీదుగా క్యూబాకు చేరి అక్కడి విప్లవ విజయంతో సంతృప్తి చెందక మిగిలిన లాటిన్ అమెరికా ను విముక్తం చేయడానికి ప్రాణాలర్పించిన ‘చేగువేరా ‘ గురించిన నిజమైన వివరాలు చెప్పొద్దా సార్ ? లేదా అందరిలా ఆయన బొమ్మ వేసిన టీ షర్టు వేసుకుని తిరుగుతుంటే అదేదో ఫాషన్ లే అనుకుంటూ చైతన్యం లేని బ్రతుకు బ్రతకాలా ? అందరి దాకా ఎందుకు నోబెల్ ప్రైజ్ సంపాదించుకోగలిగిన మేధాశక్తి ఉన్న వాడని అందరి చేతా కొనియాడ బడ్డ బాలగోపాల్ గురించి .....అరిగిపోయిన చెప్పులతో ....చిరిగి పోయిన బట్టలతో ఆయన ఎందుకు తిరిగాడో చెప్పొద్దా ? వీరందరి ఆనందం గురించి అర్ధం చేసుకోలేక పొతే ....అర్ధం అయ్యేలా చెప్పక పొతే నేను విద్యావంతుడిగా లెక్క వేయబడతానా ? అంతే కాదు ఎలక్షన్ ఎలక్షన్ కి మధ్య మూడు పార్టీ లు మారిన వాళ్ళు తిరిగి గెలిచి మంత్రులెలా అవుతారన్న విషయం స్పష్టంగా విదీకరించక పొతే వాడు రాజకీయంగా చైతన్య వంతుడెలా అవుతాడు ?
మా ఖర్మ కొద్దీ మీ లాంటి ఉన్నతోద్యోగుల .....వ్యాపార వర్గాల సంస్కృతే మనకు అ(న)ధికార సంస్కృతిగా మిగిలింది. అలా మిగిలేట్టు చేయడంలో మీడియా చాలా చక్కని సహకారం అందించింది. వాళ్ళని ఏమని అనగలం ....వాళ్ళదీ వ్యాపారమే కదా ....ఒక పక్క రాజ్యమేలుతున్న కులరక్కసి .....గుడికి వచ్చి మొక్కులు తీర్చుకొండోహో....మీ పాపాలన్నీ ఫట్  అని నమ్మబలుకుతున్న మత సంస్కృతి .....14 సంవత్సరాలకే ప్రేమించి ....ప్రేమించబడక పోతే మనం హీరోలమే కాదని నమ్మిస్తున్న సినిమా సంస్కృతి .......వీటన్నిటి నుండీ నా వాళ్ళను రక్షించుకోడానికి నేను పడే మానసిక శ్రమ మీకు అర్ధం అవుతుందా .....రాత్రి పూట ఏదో సందర్భంలో రూట్స్ ( తెలుగులో ఏడు తరాలు ) నవల గురించి ...ఎలెక్స్  హేలీ గురించి నేను నా పిల్లలకు చెప్పే సమయంలో రాత్రి 8.00 గంటలకు కూడా మీ దగ్గర నుండి ఏదో చిన్న ఆఫీస్ విషయం గురించి ఫోన్ వస్తుంది. నాకున్న వ్యక్తిగత సమయాన్ని కూడా మీరు దురాక్రమణ చేసేస్తే ఎలా సార్ ?
ట్రైన్ లో ఏసీ కోచ్ లలో దాని maintenance గురించి మన అసెస్మెంట్ అడిగే ఫారం నింపమని ఇస్తారు . కానీ అటువంటి దేమీ ఏ డిపార్టుమెంటు లోనూ ఉండదు. ఒక అధికారి తన క్రింద పని చేసే వంద మందిని నరక యాతనకు గురి చేయగలుగుతున్నాడు. కానీ ఈ వంద మందీ అతడి తల మీద వెంట్రుక ముక్కను కదప లేరు. ఇదంతా మా ఖర్మ అని సరి పెట్టుకోవడం తప్ప .



1, డిసెంబర్ 2014, సోమవారం

తలిదండ్రులకు చిన్న విన్నపం .......





నేను చిన్నప్పుడు చదివిన తాడికొండ రెసిడెన్సియల్ స్కూల్ కు ప్రిన్సిపాల్ గా శ్రీమతి సుగుణ గారుండేవారు. సెలవులకి వచ్చిన విద్యార్ధులు తిరిగి వచ్చేటప్పుడు తినుబండారాలతో రావడం పరిపాటి. కానీ ఇది విద్యార్థుల్లో అసమానతలు పెంచుతుందనే ఉద్దేశ్యంతో ఆవిడ ఇవి పబ్లిక్ తినడాన్ని ఒప్పుకునే వారు కాదు. కనీసం విద్యార్థి దశలో అయినా అసమానతలు లేకుండా ఉండాలనే ఆవిడ ఆలోచనతో మేము ఆ రోజుల్లో అంత సమ్మతం కానప్పటికీ ఈ రోజున ఆమె ఆలోచనల విలువ అర్ధం అవుతుంది.
ఇప్పుడు చాలా కాలేజ్ లలో కాని స్కూళ్ళలో కానీ ఇటువంటి నిబంధనలేవీ కనబడవు. తమ బిడ్డ ల కళ్ళలో ఆనందం కనబడాలి అంతే......అది వారి తోటి వాళ్ళ మీద చూపే ప్రభావాలతో వాళ్లకు సంబంధం ఉండదు. ఒక క్లాసులో ఒక ధనిక విద్యార్ధి ఉంటాడనుకుందాం. అతగాడు తన బర్త్ డే కి చాలా ఖర్చు చేసి స్నేహితులందరికీ ఏదో ఒక విలాసవంతమైన హోటల్ లో పార్టీ అరేంజ్ చేస్తాడు. అటెండ్ అయిన స్నేహితులందరికీ వారి వారి బర్త్ డే లకు ఏదో విధంగా అంత స్థాయి కానప్పటికీ .....ఏదో ఒక మంచి హోటల్ లో పార్టీ యీయవలసిన అవసరం ఏర్పడుతుంది. కనీసం ఆయా తలిదండ్రులకి ...ఆనందం అనే విషయం మీద సరైన కాన్సెప్ట్ ఉంటే ఇంత చిన్న వయసులో ఉన్న పిల్లలకి ఇంత విలాసవంతమైన అలవాట్లు అవసరమా ......అనే మీమాంస వస్తుంది. పిల్లలను బాధ పెట్టలేని తలిదండ్రులు తమ అవసరాలను ఎక్కడో ఒక చోట తగ్గించుకొని పిల్లలకి ఈ పార్టీ బిల్లులు కట్టవలసిన పరిస్థితులు ఉండవచ్చు. దానిలో ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళకో .....హాస్పిటల్ అవసరం ఉన్నవాళ్ళకి మందులు తగ్గించవలసిన పరిస్థితులున్నా ఆశ్చర్య పోనవసరం లేదు .
మా దగ్గర ఒక పెయింటర్ పని చేస్తూ ఉంటాడు. చాలా బాధ్యత గా పని చేస్తాడు.  క్వాలిటీ లో కాంప్రమైజ్ ఉండదు. రోజంతా ఒక హెల్పర్ ను పెట్టుకుని దుమ్ముకొట్టుకుంటూ పనిచేస్తుంటాడు. అతడికి మా అపార్త్మెంట్లోనే ఒక పెయింటింగ్ పని ఇప్పించాం . ఒక రోజు నేను క్రిందికి దిగేసరికి ‘పల్సర్ 220 CC ‘బైక్ మీద అతడిని ఎవరో కుర్రాడు డ్రాప్ చేస్తున్నాడు. ఎంక్వైరీ చేస్తే తెలిసిందేమిటంటే ఆ కుర్రాడు ఈ పెయింటర్ కొడుకే. రాజశేఖర రెడ్డి గారి దయ వలన ఏర్పడిన తామర తుంపర లోనిదే ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇంజనీరింగ్ వెలగపెడుతున్నాడు. కాబట్టి అతగాడు కాలేజ్ కి వెళ్లి రావడానికి instalment లో ఇది కొనిచ్చాడు. ఇది విన్న వెంటనే నా మనసులో వెంటనే మెదిలిన ప్రశ్న ఏమిటంటే  ఒక వేళ పాపం ఈ పెయింటర్ రెండు మూడు నెలలు జబ్బు పడితే ఆ instalment ఆ కుర్రాడు ఎలా కడతాడు? చైన్ స్నాచింగ్ చేశా ....

ఈ మద్య వచ్చిన సినిమాలలో “వేదం “ సినిమాకి ఒక ఉన్నత స్థానం ఉంది. దాంట్లో స్పృశించిన సామాజిక అంశాలు వర్తమానానికి అత్యంత దగ్గరగా ఉంటాయి. ఆనందానికి నేటి యువత దృష్టిలో ఉన్న అర్ధం .....దానిని ఏదో విధంగా అందుబాటులోకి తెచ్చుకోవడానికి నేరం చేయడానికి వెరవని సామాజిక పరిస్థితులు ఒక పక్క చూపిస్తూనే ........నిజమైన ఆనందం అంటే అవగాహన చేసుకున్న యవత వలన సమాజం ఎంత లాభం పొందుతుందో .....స్పష్టంగా చూపించడంలో దర్శకుడు కృతకృత్యుడయ్యాడు. కాబట్టి ఆరోగ్యవంతమైన సమాజం కావాలనుకునే చేడ్ బాధ్యత గల తలిదండ్రులు తమ పిల్లలకు అసలైన ఆనందం అంటే ఏమిటో అర్ధం అయ్యేలా చేయగలుగుతారు. ఆ భాద్యత లేదనుకునేవాళ్ళు ఏమి చేస్తారో నాకు తెలియదు.

22, నవంబర్ 2014, శనివారం

మరి ఈ చెత్తను కూడా కాస్త శుభ్ర పరుద్దాం ......




1982 – 1988 మధ్య
మా వూరిలో రెండు మూడు సంవత్సరాలు బాల్ బాడ్మింటన్ టోర్నమెంట్ లు నిర్వహించేవాళ్ళం. సంక్రాంతి సమయం కాబట్టి వూరందరికీ హుషారుగా ఉండేది. మేము పని చేసేది వామ పక్ష విద్యార్ధి ఉద్యమాల్లో కాబట్టి సాయంకాలం ఊరంతా మా పాటలు పాడుతూ తిరగాలని నిర్ణయించుకున్నాం.
.......ఏం బ్రతుకులు మనైరో .......అమ్మల్లారా .....తల్లుల్లార......
పాట సాగుతోంది .
మావన్నీ మధ్య తరగతి రైతాంగ కుటుంబాలు ...
కొత్త ఉత్సాహం .....జనం ఉత్సాహంగా వింటున్నారు.
“ఒరేయ్ .....ఇలా వచ్చి ఇంకో రెండు పాటలు పాడండ్రా .....”
మా అమ్మన్న మామ్మ పిలిచింది.
“నీకీ పాటలు ఎందుకే .....నీ కొడుకులికి 30 ఎకరాలు సంపాదించి పెట్టావ్ కదా.... “
పాపం పగలు ....రాత్రీ .... కష్టపడి ఉమ్మడి కుటుంబాన్ని  సమర్ధంగా నిర్వహించి కేవలం పొదుపుతో ఆ ఆస్తి సంపాదించి పెట్టింది.
“నోర్ముయ్ రా ....కుక్కల కొడకా .....ఇలా వచ్చి పాడండి .....”
చనువుగా పిలిచింది.
ఈ ముసిల్దాన్ని వదలకూదదనుకున్నాం ......
“సాయి బాబయ్యో రారా .....”
మా సురేష్ హై పిచ్ లో అందుకున్నాడు.
కుర్రాళ్ళలో మంచి హుషారు వచ్చింది.
“ఒరేయ్ .....ఒరేయ్ మీకేం పోయ్యేకాలంరా......నోళ్ళు పోతాయ్.....”
అమ్మన్న మామ్మ లబోదిబో మంది ...
“ఇంకెప్పుడూ పిలవకే ......ముందు చందా ఇవ్వు ....”
నవ్వుతూ అడిగాను
“ఒక్క పైసా కూడా ఇవ్వను .....”
“సరే ఇంకో పాట సాయిబాబా మీద పాడేస్తాం.....”
“ఆగోరేయ్ .....”
మొలలో చీరలో దోపుకున్న సంచి బయటకు లాగి జాగ్రత్తగా పది సార్లు చెక్ చేసుకుని పది రూపాయలు ఇచ్చింది.
“మీ అమ్మతో చెప్తానుండేరోయ్.....ఇలా పోకిరీ పాటలు పాడుకుంటూ తిరిగితే పిల్లనెవ్వరూ ఇవ్వరు .......”
ఆవిడ మా ఆమ్మకు వరసకు పెద్దమ్మ అవుతుంది ...
“పోవే ముసిలీ .....నీ మనవరాలినే చేసుకుంటాను ......”
చుట్టూ చేరిన జనం ఘొల్లున నవ్వారు .....
(నిజంగా కూడా నేను ఆవిడ మనవరాలినే పెళ్ళి చేసుకున్నాను )
ఆటలు .....పాటలు .....చదువు .....ఉద్యమాలు .....ఇవి  ఆనాటి మా యౌవ్వనపు రోజులు ....
వినోదం ఉండేది ......
సినిమాలు చూసే వాళ్ళం ....కానీ ఉద్యమాల్లో పాల్గొనడం లో ఉండే ఆనందానికే ప్రాధాన్యం ఉండేది.
కాలేజ్ లో మందు కొట్టే వాళ్ళు అప్పుడూ ఉండే వారు .....ఆడ పిల్లలని టీజ్ చేయడం అప్పుడూ ఉండేది .....కానీ ఈ సంస్కృతికి పూర్తి భిన్నమైన సంస్కృతి ఉన్న బలమైన సమూహం ఉండేది. కొంతమందైనా కారల్ మార్క్స్ దగ్గరనుండి .....బెర్ట్రాండ్ రస్సెల్ మీదుగా ప్రయాణం చేసే వాళ్ళు ఉండే వారు. సిద్దాంతాల చర్చలు ఉండేవి. రెండు భిన్నమైన సంస్కృతుల వలన ప్రత్యామ్నాయం అనేది ఎప్పుడూ సిద్దంగా ఉండేది.
*********
వర్తమానానికి వద్దాం.....
కాలేజ్ నుండి ఇంటికి వచ్చి స్టూడెంట్ టీవీ ఆన్ చేస్తాడు. సాధారణంగా సినిమాయో ...క్రికెట్టో....చూస్తాడు ....
మధ్యలో AD తప్పదు. కారు చక్కగా లడక్ లోని రోడ్ మీద జారుతుంటుంది .....అబ్బాయి సుతారంగా డ్రైవ్ చేస్తుంటాడు ....పక్కనున్న అమ్మాయి ముంగురులు ....సారీ ...AC కాబట్టి గాలికి ఎగరవ్. కానీ గ్లాసెస్ లో నుండి బయట ఉన్న అద్భుత ప్రకృతి సౌందర్యం కనబడుతూ ఉంటుంది .....ఆ కారులో ప్రయాణం ఎంత సౌకర్యమో AD వస్తుంది ......
టీవీ బోరుకొట్టినప్పుడు కంప్యూటర్ లో నెట్ లోకి వెళ్లి పేస్ బుక్ లో కి వెళ్తాడు. తనకి కావలిసిన పేజీలు  ....అప్ లోడ్స్ చూసుకుంటాడు . ఆ తరువాత ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సంగీత ప్రపంచం లోకి వెళ్లి పోతాడు .....
తమ నిజ జీవితానికి అందని చోట ఆనందం కోసం వెదుకులాట. ఇంచుమించు అది దొరకనిదే అని తెలుసు ......ఊహలతో ఆనందం ......ఫ్రస్ట్రేషన్ .....
ప్రశ్నించడం ......ఉద్యమించడం .....లేని జీవితంలో నిజమైన ఆనందం ఉండదని అర్ధమయ్యేట్టు చేయలేని కుటుంబ .....సామాజిక పరిస్థితులు .......
ఆనందం కోసం NET ను ఆశ్రయించినప్పుడు ......విరివిగా దొరికే పోర్నో సైట్స్ .....బలహీన మనస్కులని మరింత బలహీన పరిచే  వేల అవకాశాలు ....దాని వలన పెరుగుతున్న నేరాలు .....
ఎంత నేరం చేసినా ఫరవాలేదు .......దానికి పరిష్కృతం మా దగ్గర ఉందని ప్రజలని మనస్ఫూర్తిగా నమ్మించగలిగిన మందిరాలు ....ప్రార్ధనలు ......
అద్భుతం కదా.......
నేరం చేయించే పరిస్థితులు .....తిరిగి చాలా సులభంగా....చౌకగా ..... దానినుండి మానసికంగా అయినా బయట పడేసే మార్గాలు ......మరి నేరాలు ఎందుకాగాలి ?
ఈ ఘనమైన సామాజిక నేపధ్యాన్ని యువతరానికి వారి ముందుతరం అందిస్తోంది .......
మరి ఈ చెత్తను కూడా కాస్త శుభ్ర పరుద్దాం ......


11, నవంబర్ 2014, మంగళవారం

కధలోని పాత్రలన్నీ కల్పితాలే ..... ఒక్క ఆవేదనలు తప్ప ....





(ఈ క్రింది కధలోని పాత్రలన్నీ కల్పితాలే ..... ఒక్క ఆవేదనలు తప్ప ..... )

రాజమండ్రి .... 

హోటల్ రివర్ బే ..... 

సూట్ నం . 203

కిటికీలలో నుండి గోదావరి ని చూస్తూ కూర్చుంటే కలిగే ఆనందాన్ని అనుభవించాలి కానీ వర్ణించడం కష్టం .... 

******


“ఏమిటీ..... మళ్ళీ చెప్పు .....”
నిర్మాత గారు కుర్చీ లో నుండి ముందుకు వంగారు
రచయితకు  హుషారు పెరిగింది. అసలే కొత్త నిర్మాత...... చెప్పిందల్లా వింటాడని నమ్మకం....
“అవును సార్ అంతా సూపర్ వెరైటీ .....మన టేకింగే స్పెషల్ ......ప్రేక్షకులు కుర్చీలకతుక్కుని లేవరు....”
“ఆ సీను మళ్ళీ చెప్పు “
“ హీరో కి జలుబు చేస్తుంది ......హీరోయిన్ ని ఎత్తుకుని  వెళ్ళడానికి విలన్ మనుషులు వస్తారు . హీరోకి ఆవేశం వస్తుంది . జలుబు కూడా ఉంది కదా ......గట్టిగా ముక్కు చీదుతాడు. ఆ చీమిడి లోని ఫోర్స్  భూమిని చీల్చేస్తుంది .....బీటలు వారేట్టు చేస్తుంది .....ఆ బీటల్లోనుండి నీరు పైకి తన్నుకు వచ్చి కరక్టుగా ఒక మంచి పారాబోలిక్ షేప్ లో హీరోయిన్ పై పడుతుంది  హీరోయిన్ ఈ విచిత్రాన్ని జీర్ణించుకునే లోపు లోనే మొత్తం తడిచి పోయి కలల్లోకి వెళ్ళి పోతుంది .....పాట .....”
“మరి రౌడీ లు .....”
“వాళ్ళు కూడా మన ప్రేక్షకుల్లాగే వెర్రి వాళ్ళే కదా ...... పాట పూర్తయ్యే వరకూ ఫైటింగ్ మొదలు పెట్టరు. అయినా డ్రీమ్ సీక్వెన్స్ తరువాత డైరక్ట్ గా ఫైట్ సీను బాగోదు కాబట్టి సింపుల్ గా హీరో రిమోట్ తో సుమోలు పేల్చేసి రౌడీలను బెదరగోట్టేస్తాడన్న మాట “
నిర్మాత ఫీలింగ్స్ పెద్ద్డగా మారలేదు.
ఇంకా ఇంప్రెస్ చెయ్యాలన్న నిర్ణయానికొచ్చి రచయిత ....
“ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది సార్ .....”
నిర్మాత ముందుకు వంగాడు.
“పారిపోతున్న రౌడీలలో ఒకడిని చూసి హీరో షాకవుతాడు. అతడి చిన్నతనంలో చని పోయిన అతగాడి మావయ్య పోలికలు ఆ రౌడీలో స్పష్టంగా ఉంటాయి. అంటే తన మావయ్య మళ్ళీ పుట్టినట్లు హీరో కి అర్ధం అయిపోతుంది.”
“అయితే ....?”
నిర్మాత అడిగాడు. రచయితకు  హుషారు పెరిగి పోయింది.
“చూసారా .....మీకు కూడా క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఆ రౌడీ బట్టలన్నీ మట్టిగొట్టుకుని పోయుంటాయ్. వెంటనే హీరో తన షర్టు విప్పి ఆ రౌడీ కి ఇచ్చేస్తాడన్న మాట. చూసారా సార్ ఒకే షాట్ కి రెండు పిట్టలు. ఈ విధంగా మనం హీరో సిక్స్ పాక్ బాడీ చూపించేస్తాం. ప్రేక్షకుల్ని సెంటిమెంట్ తోనూ  కొడతామన్న మాట.”
“ఫాంట్ కూడా విప్పేసి ఇచ్చేయొచ్చు కదా .....”
నిర్మాత సీరియస్ గా అంటున్నాడో.... వేళాకోళంగా అంటున్నాడో ....రచయిత కు  బోధపడలేదు.  తిరిగి నిర్మాతే మాట్లాడడం ప్రారంభించేడు.
“నేను సినిమా తీయాలనుకుంటున్నానని ఒక్క మాట చెప్పగానే ఈ వెధవ తిన్నగా నీకు ఫోన్ చేసేసేడు.....”
పక్కనే ఉన్న స్టూడెంట్ లాంటి కుర్రాడిని చూపించి అన్నాడు.
రచయిత  కంగారు పడ్డాడు.
“సార్ ...సబ్జక్టు కావాలంటే మార్చుకోవచ్చు ....నా దగ్గర సోషియో ఫాంటసీస్ ....సైంటిఫిక్ ఫిక్ షన్స్ చాలానే ఉన్నాయి ....”
“నీవు నన్ను పూర్తిగా చెప్పనీయ్ ..... నాకూ ఒక కొడుకున్నాడు కానీ వాడిని హీరోని చేద్దామని నేను అనుకోడం లేదు ...వాడు చదువుకున్నాడు ...అమెరికాలో మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు .....ఒక విధంగా సినిమాకి పెట్టుబడి పరోక్షంగా వాడిదే..... ”
“అయితే మన అమెరికా షూటింగ్ అంతా బాబే చూసుకుంటాడన్న మాట “
“కొంచెం నేను చెప్పేది పూర్తయ్యే వరకూ మాట్లాడకు ....మా అబ్బాయి దీంట్లో ఎక్కడా తలదూర్చడు....రెండో విషయం ఏమిటంటే  కధ ఇంకా నిర్ణయం కాలేదు ...లోకేషన్స్ ఎలా నిర్ణయించేస్తున్నారు?“
“లోకేషన్స్ దేముందిలే సార్ .....అయితే కధ మీద ముందు కూర్చుందాం .....”
“కానీ మీరు చెప్పిన నికృష్టపు ఫార్ములా కధలు నాకొద్దు “
రచయితకు కొంచెం ఇగో దెబ్బతింది. కానీ పైకి కనబడనీయ లేదు.
“సార్ ఫీల్డ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ......”
“ఆహా కంగారు పడొద్దు ....నేను మీ టేలెంట్ ను ఏ మాత్రం చిన్న చూపు చూడడం లేదు. కానీ మీరు కధ మీద కూర్చునే ముందు నా గోల కాస్త వినాలి “
“ఎంత మాట .....చెప్పండి “ రచయిత కూల్ అయ్యాడు
“మాది ఈ ఊరే .....అంటే ఇది మరీ ఇంత పెద్దది కాక ముందు నుండీ ఇక్కడే ఉంటున్నాను. జాంపేట కూరగాయల మార్కెట్ లో నాకొక దుకాణం ఉండేది. అదేదో పెద్ద దుకాణమేమీ కాదు విస్తరాకుల దగ్గరనుండి ఉల్లిపాయల వరకూ అన్నీ అమ్మే వాడిని. బ్రతుకు ఈడుస్తానికి సరిపోయేది. అప్పుడు నాకో స్నేహితుడు ఉండేవాడు. వాడు మెయిన్ బజార్ లో జట్టు కార్మికుల సంఘానికి నాయకుడిగా ఉండే వాడు. ఎందుకో తెలియదు వాడి మాటలు నాకు వేరే ప్రపంచం గురించి కలలు కనేలా చేసేది. కష్టపడినదానిని బట్టి వేతనం .....కావలిసిన చదువు ...కులాలు ..మతాలు లేని ప్రపంచం .......వాడి తో బాటు చాలా సమావేశాలకు వెళ్ళే వాడిని. ఇదంతా నేను యువకుడిగా ఉన్నప్పుడు ....
                                  ఆ  తరువాత పెళ్ళయ్యింది. కొడుకు పుట్టాడు. వాడు పుట్టిన కొద్ది రోజులకే భార్య గర్భసంచి కి వచ్చిన జబ్బు వలన ఇక పిల్లలు పుట్టరని నిర్ణయం అయ్యింది. హాస్పిటల్స్ కి భారీ ఖర్చులు పెట్టుకోగల స్తోమత లేదు కానీ ఏదో గండం గడిచి బయట పడ్డాం. అంతకు ముందు నేనెప్పుడైనా బయటకు వెళితే తను షాపులో కూర్చునేది. రెండు మూడు సంవత్సరాలు చాలా ఒడి దుడుకులు పడ్డాం. జీవితం ఒక గాడిన పడుతుందనుకునే సరికి మా వాడు చెప్పిన మాటలు నన్ను చాలా కృంగదీశాయి. మిత్రుల కింద ఉండవలసిన వాళ్ళే శత్రువుల కంటే దారుణంగా పగ వాళ్ళ లా కొట్టుకునే వారు. నెమ్మదిగా నా షాపు ....కుటుంబమే జీవితం అయిపోయాయి. మా వాడి సాంగత్యం వలన కొన్న పుస్తకాలు మాత్రం   అడపా దడపా కొని చదువుతూనే ఉండేవాడిని. నా అదృష్టం కొద్దీ నా వలన నా కొడుక్కీ ఆ అలవాటు వచ్చింది. వాడు మంచి కాలేజ్ నుండే ఇంజనీరింగ్ చేసాడు. మా స్నేహితుడు పని చేస్తున్న పార్టీ వాళ్ళే 80 ల మొదటి అర్ధ భాగంలో బెంగాల్ లో అధికారం లో ఉండే వారు. వాళ్ళ ద్వారా కలకత్తా లో stastical institute లో కంప్యూటర్ సైన్స్ లో PG కోర్స్ వచ్చిందని తెలిసింది. అదృష్టం కొద్దీ వీడికి అక్కడ సీటు దొరికింది. ఒక విధంగా అది మా జీవితాలను మార్చి వేసింది. అమెరికా లో ఒక software company లో మంచి ఉద్యోగం వచ్చింది. కొద్ది కాలం లోనే అప్పులు తీర్చేసి మిగులు లో పడ్డాం. ఆ తరువాత మా వాడు పంపుతున్న డబ్బుతో ఒక మంచి వ్యవసాయ భూమి కొనాలనుకుని సిటీ కి 8,9 కిలోమీటర్లలో రైల్వే ట్రాక్ ఆవలగా ఉండే గ్రామాల్లో చౌకగానే భూములు కొంటూ వచ్చాను. 90 లలో వచ్చిన స్వర్ణ చతుర్భుజి పధకం మరలా నా జీవితాన్ని మార్చి వేసింది . బోర్ గానీ కొట్టిస్తున్నానా ..... ?"
నిర్మాత చెప్పడం ఆపాడు . 
"అయ్యో లేదు సార్ .... చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. మరొక వెంకటేష్ కామత్ ను చూస్తున్నట్లు గా ఉంది. "
టీ లు వచ్చాయి. 
నిర్మాత కొనసాగించాడు 
"మా భూములున్న వూరికి .... నగరానికి మధ్య ఫ్లై ఓవర్ ప్రారంభమవగానే నేను కొన్న భూములన్నీ రేట్లు పెరగడం ప్రారంభమయ్యింది. అది పూర్తయ్యేసరికి నిజంగానే ధరలు చుక్కల్నంటాయ్. నిజమే పెద్దగా నా ప్రమేయం లేకుండానే నేను డబ్బున్నవాడినయ్యాను. కానీ జీవితంలో ఏదో తెలియని వెలితి. మంచి జనాలకు దూరమయ్యానన్న ఫీలింగ్. పచ్చడి మెతుకులు తిన్నా ..... ఆనందంగా టీలు తాగుతూ .... మంచి  మార్పు కోసం ఏదో ఒకటి చేస్తూ బ్రతికిన ఆ జీవితాన్ని మరిచి పోలేకుండా ఉన్నాను. 90 ల తరువాత వచ్చిన మార్పులకనుగుణంగా తమ వ్యూహాలను మార్చుకోలేని ఈ దేశపు మార్క్సిస్ట్ పార్టీలు ఉనికి కోల్పోవడం ప్రారంభమయ్యింది. ఇక కళా రూపాల సంగతి చెప్పనక్కర లేదు. 
                            ఇక్కడ ముఖ్యంగా నా భార్య గురించి చెప్పుకోవాలి. తన ఆరోగ్యం బాగున్నంత వరకూ తను కూడా అప్పుడప్పుడు నాతొ బాటు తిరుగుతూనే ఉండేది. మా షాపు దగ్గర నలుగురూ మాట్లాడుకుంటుంటే శ్రద్దగానే వినేది. అలాగే మా అబ్బాయి ఇక్కడి సాంస్కృతిక కాలుష్యం గురించి రోజూ తిడుతూనే ఉంటాడు. అందరం కలిసే ఈ నిర్ణయానికి వచ్చాం. నిజానికి కొంతమంది మహానుభావులు ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి కృషి చేస్తూనే ఉన్నారు. మా  వంతు ప్రయత్నం కూడా మేము చేద్దామని మిమ్మల్ని పిలిపించాను. మిమ్మల్నే పిలవడానికి కూడా కారణం ఉంది. పని పట్ల మీకొక అంకిత భావం ఉంది. ఈ సినిమా ప్రజల దగ్గరకు వెళ్ళాలంటే మీలాంటి రచయిత అలాగే దర్శకుల అవసరం నాకుంది. ప్రజలు చూడక పొతే దానికున్న ప్రయోజనం నెరవేరినట్లు కాదు. 
ఒక్క సినిమాతో కాలుష్యమంతా పోతుందని గాని ఒక సారి ఎర్ర జెండా ఎగిరేస్తే వాటంతటవే అన్ని సమస్యలూ పరిష్కారం  అయిపోతాయి అనే నమ్మకాలు మాత్రం లేవులే . ప్రేక్షకుల ఆలోచనలో చిన్నపాటి కుదుపు తెప్పించగలిగితే చాలు. ఆనందంగా గడపడానికి ఒక చిన్నపాటి పోరాట మార్గం ఒక ప్రత్యామ్నాయ మార్గమని యువతకు కొంతైనా అర్ధం కావాలి . నా ప్రతిపాదనలన్నీ నచ్చితే మనం అగ్రిమెంట్ రాసుకుందాం. లేదంటే మీ సమయం వృధా చేసినందుకు క్షమించండి. "
నిర్మాత ఆగాడు. 
రచయిత కుర్చీ లో నుండి లేచాడు. నిర్మాత దగ్గరగా వెళ్ళాడు. ఆయన రెండు చేతులూ తన కళ్ళకద్దుకున్నాడు. తడైన తన చేతులను చూసుకుని నిర్మాత కంగారు పడ్డాడు. 
"ఇదేంటి బాబూ ..... ?"
"సార్ .... నన్ను కుళ్ళు లో నుండి లాగుతున్నారు సార్ ..... మీతో అగ్రిమెంటేమిటి సార్ ..... ఈ సినిమా కు నాకు ఒక్క పైసా కూడా వద్దు. ఈ సినిమా కోసం నా సర్వశక్తులూ ధారపోస్తాను. దీంట్లో మీకే సందేహం వద్దు. 
                      ఎలాంటి వాళ్ళతో బ్రతుకుతున్నాను సార్ ...... ఛీ .... ఛీ .... ఆలోచిస్తుంటే రోత పుడుతుంది. ప్రభుత్వాల దగ్గరనుండి భూములు పొంది ..... ఇంకా ఆక్రమణలు కూడా చేసేవాళ్ళు  ..... అంతే  కాకుండా ఈ ప్రజలు సినిమాలు హిట్ చేసినండువల్లే  కోట్ల రూపాయలు ఆర్జించి కూడా ఇంకా వారసులని మాత్రమే హీరో లను చేసే ప్రయత్నంలో ఉన్న నిర్మాతలు ..... హీరోలు ........ ఛీ ...చీ .... నిజంగా ఈ కుళ్ళు లోకి ... రొచ్చు లోకి పన్నీరులా ప్రవేశించారు సార్ ..... మీకు అండగా మనస్పూర్తిగా ఉంటాను ..... నిజం సార్ ..... "
"నీ కళ్ళే నీ పట్టుదలను చూపిస్తున్నాయి .... "
నిర్మాత ఆదరంగా రచయిత చేయి పట్టుకున్నాడు.    
                           







27, అక్టోబర్ 2014, సోమవారం

ఇదీ ఒక రకమైన ప్రేమే .... ఈ నాడిదే గైడింగ్ ......



"హాయ్ అంకుల్ .. "

"రామ్మా .... చాలా కాలం అయ్యింది నిన్ను చూసి ..... "

"నీకు తెలియందేముంది అంకుల్ ..... సాఫ్ట్ వేర్ కంపెనీల గురించి ...... "

"అవునమ్మా ..... మనం ఈ సర్వీసెస్ రంగం మీదే ఆధారపడడం నుండి ఎప్పుడు బయట పడతామో .....ఇంతకూ  ఇలా ఉరుమూ.  . మెరుపూ  లేని తుఫాన్ లా ఇలా  సడన్  గా వచ్చావంటే ఏదో కారణం  ఉండే ఉంటుంది "

"బాగానే guess  చేసారంకుల్ ..... "

"మరిక ఆలస్యమెందుకు సస్పెన్స్ విప్పేయ్....."

"అదే అంకుల్ ..... ఆ విషయం చెప్పగానే డాడీ మిమ్మల్ని ఒక సారి కలవమన్నారు ..... "

నిజంగా నవ్వు వచ్చింది

"ఏం కొంప ముంచావ్ ...?"

"కొంప ముంచ లేదంకుల్ .....కొంప ఏర్పరుచుకుంటున్నాను......"

"వెరీ గుడ్ .....నాన్న మీద భారం దించేసావ్....."

"డాడీ అన్నీ విన్నారు .....ఒక సారి మీకు కూడా చెప్పమన్నారు "

మా కుమార్ గాడికి కాలేజ్ రోజులనుండీ ఉన్న అలవాటే ఇది ......

"ఇంతకూ అబ్బాయి ఎవరు ....లాంటి ప్రశ్నలు అడగను లే ....సాధారణంగా నీ కొలీగ్ అయినా అయ్యుండాలి లేదా ఒకప్పటి నీ క్లాస్ మేట్ అయ్యుండాలి ..అంతేనా "

"కరెక్టే అంకుల్ ...."

"మరి అబ్బాయి ఫ్యామిలీ బేక్ గ్రౌండ్ మొత్తం తెలుసుకున్నావా .....?"

"తెలుసు అంకుల్ .....వాళ్ళ డాడీ వరంగల్ లో సెటిల్ అయ్యారు .....ఎప్పటి నుండో రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉండడం వలన బాగానే సంపాదించారు ....ఒక్కడే కొడుకు ...."

"అమ్మ.....?"

"ఆవిడ హౌస్ వైఫ్ అంతే ....."

"కుర్రాడు మంచి టేస్ట్  లు ఉన్న వాడేనా ?"

"అంటే ..... ప్రత్యేకించి టేస్ట్  లంటూ ఈ రోజుల్లో ఏముంటున్నాయంకుల్ .... ?"

నిజమేలే అనుకున్నాను .

"పుస్తకాలు చదవడం ..... లాంటివి చేస్తాడా .... ?"

"అంత టైం  ఎక్కడ ఉంటుందంకుల్ ..... ?"

"అదేంటమ్మా .... మరి రిలాక్సేషన్ ..... "

"ఫ్రెండ్స్ తో చాటింగ్ ..... వీడియో గేమ్స్ ఆడుతుంటాడు .....కాలేజ్ లో చాలా కష్టపడ్డాడు కదా అంకుల్ .... పుస్తకాలు ముట్టుకోడం మానేసాడు ...  "

"మ్యూజిక్ .... లాంటివేమన్నా ..... "

"భలే పిచ్చి అంకుల్ ..... ఒక్క సారి ఆఫీస్ నుండి బయటకు వచ్చాడంటే చెవిలో యియర్ ఫోన్స్  ఉండాల్సిందే ..... "

"ఏ సంగీతం వింటుంటాడేమిటి ?"

"అలాంటిదేమీ లేదంకుల్ ..... కొత్తవి ఏవోచ్చినా  డౌన్ లోడ్ చేసుకుని వింటూనే ఉంటాడు "

"మిగిలిన అలవాట్లు ..... "

"చాలా సిస్టమేటిక్ అంకుల్ ..... ఉదయాన్నే జాగింగ్ చేస్తాడు ..... స్నానం చేసి ఇంచుమించు ప్రతి రోజూ గుడికి వెళ్తాడు .... తన పని తప్ప వేరే ధ్యాసలేవీ ఉండవు ..... "

"సినిమాలు చూస్తాడా ...... ?"

"టైం పాస్ కోసం అప్పుడప్పుడు ..... వాటి గురించి పెద్ద సీరియస్ గా పట్టించుకోడు "

"  'షాహిద్' అంతకు ముందు 'పీప్లి లైవ్' లాంటి  సినిమాలు  చూసాడా ..... ?"

"అదేంటంకుల్  ఎవరికీ తెలియని సినిమాల గురించి అడుగుతున్నారు ?"

"పోనీ కనీసం 'ఆకాశమంత' , 'ఆ నలుగురూ ', 'పిల్ల జమీందార్', లాంటివి చూసాడా ?

"చూసే ఉంటాడు .... వాటి గురించి ఎప్పుడూ మాట్లాడ లేదు "

" o.k.  మరి మీరిద్దరూ కలిసినప్పుడు దేని గురించి మాట్లాడుకుంటారు ?"

"చాలా విషయాలు మాట్లాడుకుంటాం ...... మారేజ్ చేసుకున్న తరువాత చేసుకోవలసిన టాక్స్ సేవింగ్ గురించి .... ఏ ఏరియా లో ఫ్లాట్ కొంటే  బాగుంటుందో ..... దాని రీ సేల్  గురించి ..... ఇంటీరియర్ గురించి ..... అసలు ఈ మధ్యనైతే ఫ్లిప్ కార్ట్ ,అమెజాన్ ,స్నాప్ డీల్  లాంటి ఈ బిజినెస్ సైట్స్ లో వస్తున్న డీల్స్  గురించి ..... లంచ్ టైం  లో కూడా గంట గంటకీ వస్తున్న డీల్స్ గురించి ...... "

చాలా ఎగ్జైటింగ్  గానే చెబుతూనే ఉంది  .

" గోల్స్ ఏమైనా సెట్ చేసుకున్నారా ?"

"మారేజ్ నాటికి తను సీనియర్ మేనేజ్ మెంట్ పొజిషన్ లోకి రావాలని అనుకుంటున్నాడు ...."

"ఇక వేరే ఏమీ లేవా .... "ఈయనకు  పొలిటికల్ లింక్స్ గానీ థాట్స్ గానీ  ఉన్నాయా ..... ?"

"ఇతగాడికి రాజకీయాలంటే  మహా చిరాకు ...... ఆంధ్రా ... తెలంగాణా ఎందుకు విడిపోవాలో .... లేదా కలిసుండాలో కూడా పట్టించుకోడు. అతడి కెరీర్ కు సంబందించనిదేదీ పట్టించుకోడు "

"అతడి ఫ్యామిలీ లో అంటే నాన్న గారు కూడా ...... "

"వాళ్ళూ కూడా అంతే ...... ఎప్పుడో వాళ్ళ తాతయ్య గారు అప్పుడెప్పుడో తెలంగాణా లో జరిగిన గొడవల్లో పాల్గొన్నారట .... ఆ తరువాత పల్లెటూరు వదిలి వరంగల్ వచ్చేశారట. ఆ తరువాత వీళ్ళ నాన్నగారు బిజినెస్ లో ..... బాగానే సంపాదించారు"

నాకొక్క సారి చలసాని ప్రసాదరావు గారి "ఇలా మిగిలేం " మనసులో మెదిలింది.

"సాధారణంగా చాలా వరకూ అభిప్రాయాలు match అయితేనే కదా మేరేజ్ proposal వస్తుంది. మీ ఇద్దరి ఏ అభిప్రాయాలు అంతగా మ్యాచ్ అయ్యాయి ? ఏమీ అనుకోకు......  మా బాచ్ లో second Generation లో మొదటి పెళ్లి నీదే ..... అందువల్లే కొంచెం లోతుకెళ్ళి అడుగుతున్నాను "

"ఏముందంకుల్ .... ఒక చోట ఉద్యోగం చేస్తున్నాం. ఇద్దరం సంపాదిస్తున్నాం. పూర్వ పరిచయం కూడా ఉంది. చూడడానికి బాగానే ఉంటాడు. మార్కెటింగ్ చేసేటప్పుడు చాలా ఓపిగ్గా ఉంటాడు. పైగా నాకంటే కూడా ఎక్కువ వెరైటీస్ చెక్ చేస్తూ గైడ్ చేస్తూ ఉంటాడు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువే. సినిమాల్లో బ్రహ్మానందం లాంటి వాళ్ళ యాక్షన్  కి పడీ పడీ నవ్వుతాడు....టాక్స్ సేవింగ్ గురించి చాలా మందికి భలే సలహాలు ఇస్తాడు తెలుసా ...  "

"అబ్బా ..... కానీ ఇంకొక చిన్న విషయం ..... నీలో అతగాడు ఏదైనా ప్రత్యేకత చూసాడా ?"

"చాలా చెబుతాడు .... నా ఫ్రేంక్ నెస్ ..... కలుపుగోలు తనం ..... ఇంకా ... ఇంకా .... "

"మీరు తీసుకోబోయే ఫ్లాట్ లో మంచి లైబ్రెరీ మైంటైన్ చేయండి "

"ఎందుకంకుల్ ..... ఒక అమెజాన్ కిన్డిల్ కొనుక్కుంటే చాలు కదా ..... "

"కానీ  బీరువాల్లో ఉండే గొప్ప పుస్తకాలు  ఇంటికే హుందాతనాన్ని తెచ్చి పెడతాయి కదా ..... "

" కరెక్టే .... మంచి సౌండ్ సిస్టం .... విడియో .... తీసుకోవాలి .... పైగా ఆ తరువాత అవకాశం బట్టి మంచి గేడెడ్ కమ్యూనిటీ లోకి మారిపోతాం ..... "

"బాగుందమ్మా ..... ఆల్ ది బెస్ట్ .... 

"థాంక్ యూ అంకుల్ "




**************

అనుకున్నట్లుగానే సాయంత్రం కాగానే కుమార్ ఫోన్ చేసాడు. 

"ఏరా ఎలా ఉన్నాడనిపిస్తోంది ... "

"ఫరవాలేదురా మిస్టర్ పెర్ఫెక్ట్ "

"అలా కాదు కానీ ..... మనసులో ఉన్న విషయం కరెక్ట్ గా చెప్పు "

"తమను గట్టిగా ప్రేమించుకుంటూ ఎదుటి వాళ్ళను ప్రేమిస్తున్నారు ..... "

"ఇది ప్రేమించే లక్షణమేనని  అనుకోవాలా ?"

"ఒరేయ్ మారుతున్న జెనరేషన్ గురించి ఆలోచించు .  మీ అమ్మాయి పుట్టిన సంవత్సరమే మన ఆర్ధిక  సరళీకరణ ప్రారంభమయ్యింది. మన పిల్లలను కార్పోరేట్ స్కూళ్ళలో మాత్రమే చదివించవలసిన పరిస్థితిలోకి నెట్ట బడ్డామ్ . పిల్లల భవిష్యత్తుని రిస్క్ చేయలేని పరిస్థితి. మరి వాళ్ళు ఎలా మౌల్డ్  చేస్తారో తెలియదా ? నీకు ఇంకొక విషయం చెబితే ఆశ్చర్య పోతావ్ . ఒక ఐఐఎం లో చదివిన యువకుడు మా దగ్గర ఒక కాంట్రాక్ట్ తీసుకున్నాడు . ఒక ఆదివారం పని పెట్టుకొనడానికి పర్మిషన్ అడిగాడు. చదువుకున్న కాంట్రాక్టర్ ని ప్రోత్సహిద్దామని సరేనన్నాను . కానీ ఆ తరువాత .... మూడవ వారం కూడా అడిగాడు. కాస్త గట్టిగా టేకిల్ చేయక  తప్పలేదు. అంటే ఐఐఎం  చదివిన వాళ్ళు కూడా ఇలా తయారై వస్తుంటే .... ఇక మామ్మూలు కార్పోరేట్ కాలేజ్ ల సంగతి ..... ఎక్కువగా ఆలోచించడం అనవసరం. "

"ఒరేయ్ ..... నేను ........ జీనా హైతో మర్నా సీఖో ..... అన్న లెవెల్లో మాట్లాడడం లేదు. కనీసం ..... పావన నవ జీవన బృందావన నిర్మాత ...... కోసమే ఆలోచించాన్రా ..... "

"కాదనడం లేదు .... కానీ ఎలా దొరుకుతారు ?   ప్రతి విషయాన్నీ  పశ్నించే  హేతుబద్ద  దృక్పధం  శతాబ్దాల మూర్ఖత్వాలకు  ఒక ప్రత్యామ్నాయ తాత్విక దృక్పధంగా  సమాజంలో రూపు దిద్దుకుంటున్న సమయంలో  ఏదో మొత్తం సాధించేసినట్లుగా వంద ముక్కలయ్యి వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని  ప్రజలు అసలు ఆ ఆలోచన జోలికే వెళ్ళడాన్ని  అసహ్యించుకునే విధంగా తయారు చేసిన మన కమ్యూనిస్ట్ నాయకమ్మన్యులను ఏమనాలి ? కేవలం పొత్తుల ద్వారా నాలుగు సీట్లు సంపాదించ గలిగి అధికారంలో పాలు పంచేసుకుంటే మొత్తం ప్రజల తాత్విక దృక్పధాన్ని మార్చేయగలమనుకుంటూ ప్రజలను తప్పు దారి పట్టించిన వీళ్ళు చేసిన కుట్ర భారత దేశంలో జరిగిన మరే కుట్రకూ తీసిపోదు . 

                      ఇంకొక చిన్న విషయం చూడు. చాలా మంది అంటూ ఉంటారు. ... ఇంకెక్కడి కమ్యూనిస్ట్ పార్టీలండీ ..... అవెక్కడున్నాయ్ ..... అని . అది నిజమే కావొచ్చు. కానీ ఒక్కటి చూడు ..... ఇప్పుడున్న ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే రోడ్ ని ఆక్రమించి కట్టిన ఏ ప్రార్ధనా మందిరాన్ని  అయినా సరే అక్రమ కట్టడమని పబ్లిక్ గా డిక్లేర్ చేయమను. అంటే ఇవన్నీ బేసిగ్గా ఒకదానికొకటి ప్రత్యామ్నాయం ఎంత మాత్రం కాదు. ఒక రాజకీయ ... తాత్విక ప్రత్యామ్నాయమే లేని సమాజంలో పెరిగిన మన పిల్లలు ఇంతకంటే గొప్పగా తయారయ్యే అవకాశం లేదు. మీ అమ్మాయిది కూడా ఒక రకమైన ప్రేమే అని నమ్ముకుని ఒప్పేసుకో. నీవనుకున్నట్లు సమాజాన్ని ..... చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రేమించగల వాళ్ళు దొరకాలంటే చాలా కష్టం. ధైర్యం ఉంటే వేచి ఉండు "










24, సెప్టెంబర్ 2014, బుధవారం

జబ్బు తగ్గించే మార్గాలు మీరూ sugest చేయొచ్చు ...




"చెప్పండి .... ఏమిటి ప్రాబ్లెమ్ ?"

"అంటే ..... మీరు నమ్ముతారో లేదో ..... అని ..... "

"ఫరవాలేదు ...ప్రతి రోజూ అనేక సమస్యలతో  పేషెంట్స్ వస్తూనే ఉంటారు .... మీరు చెప్పొచ్చు .... "

"ఏమీ లేదు డాక్టర్ .... మా అమ్మాయి ఒక వింత ప్రాబ్లెమ్ తో బాధపడుతోంది . తనకి వడ్డాణాలు కట్లపాముల లాగా ..... మెడలో వేసుకునే ఏ హారమైనా సరే నాగుపాము లాగా కనిపిస్తున్నాయంట .... "

"అందుకు మీ అమ్మాయేమైనా బాధపడుతుందా .... ?"

"లేదండీ ..... ఆ జబ్బు వలన మాకు ఇబ్బందిగా ఉంది సార్ "

"జబ్బు మీ అమ్మాయి కంటే మీకు ఎక్కువగా ఉన్నట్లుంది "

"అదేంటి డాక్టర్ ..... "

"మీ అమ్మాయికి ఏదో సైకలాజికల్ ప్రాబ్లెమ్ వలన నగలు వేసుకోవడం మానేసింది ..... సరే ..... మీకెందుకు ఇబ్బంది ?"

"అదేంటి డాక్టర్ ...... ఫంక్షన్స్ కు నగానట్రా లేకుండా బోసి మెడతో వస్తుంటే ..... మాకు కాక ఎవరికి ...... "

"ఓహ్ ..... అదా ...... సరే .... మీరు బయటకు వెళ్లి ఆమెను లోపలికి పంపించండి "


అమ్మాయి లోపలికి వెళ్ళి  వచ్చింది 

అమ్మా ... నాన్నల వంక నవ్వుతూ చూసింది ..... 

వాళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు 

"మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మన్నారు ..... "

అమ్మాయి చెప్పింది 


" కంగారు పడవలసిందేమీ లేదు ..... అమ్మాయికి మానవత్వమనే  జబ్బు బయటకు వస్తోంది  "

"అదేంటి డాక్టర్ ?"

"చెప్పానుగా ..... ఈ జబ్బు ఎంతో కొంత లోలోపల ఎంతో కొంత అందరికీ ఉంటుంది ...... కొంత మందికి అసలు ఉండకపోవచ్చు కూడా మీ అమ్మాయికి ఆ లక్షణాలు ఎక్కవగా బయటకు వస్తున్నాయంతే .... నిజానికి మనందరం  సహజత్వానికి దూరంగా ఉన్నాం కాబట్టి  మనకు ఆ లక్షణాలు అసహజంగా కనిపిస్తున్నాయంతే "

"మా కేమీ అర్ధం కావడం లేదు డాక్టర్ గారూ ...... "

"బహుశా .... ఇంకా కొన్ని విషయాలు  మాట్లాడుతూ ఉండాలే  .... గుళ్ళోకి వెళ్ళి పూజలు పునస్కారాలు చేసే బదులు టాక్స్ లు కరెక్ట్ గా  కడదాం ..... అసలు మనకున్న కారుల్లో పెట్రోల్ కారే వాడదాం ..... డీజిల్ సబ్సీడీ  మీద వచ్చేది ..... ఇలాగే  కదా మాట్లాడుతుంట....... "

"కరెక్ట్ గా ఇలాగే మాట్లాడుతుంది డాక్టర్ గారూ ...... ప్రమాదమేమీ లేదు కదా ...... ?"

"బాగా ముదర లేదు కాబట్టి ప్రస్తుతానికి ప్రమాదం లేదు ..... నిజానికి ఈ జబ్బు మీ స్థాయి లో ఉన్న కుటుంబ సభ్యులకు రాకూడదు ...... కొన్ని ప్రికాషన్స్ తో జబ్బుని నయం చేయొచ్చు ...... "

"టైం ఎక్కువ పడుతుందా డాక్టర్ గారూ ..... " 

" అబ్బే ..... నేను చెప్పినవి కరెక్ట్ గా చేస్తే చాలు ..... ఎవరి బుర్రైనా ఇట్టే  బూజు పట్టి పోతుంది ..... ఫస్ట్ కొన్ని చానళ్ళలో వస్తున్న సీరియల్స్ చూపించండి ..... మంచి కి చెడుకి  ఉన్న క్లారిటీ  తుడిచిపెట్టుకుని పోతుంది .... ఆ క్లారిటీ ఉంటే  చాలా ప్రమాదం ..... ముఖ్యంగా హేతుబద్దంగా అసలు ఆలోచించనీయ కూడదు ....  .... అప్పుడు మీరు చెప్పినట్లే వింటుంది ..... అంతకూ తగ్గక పోయినా కంగారు పడొద్దు ..... ఫేస్ బుక్ లో తనదేదో ఒక ఫోటో అప్ లోడ్ చేసి ఎంతమంది like లు పెట్టారో చూసుకోవడం లాంటివి అలవాటు చేద్దాం ..... ఇక మీ అమ్మాయికి ఆలోచించుకొనే టైం ఉండదు ..... ఇంకా తగ్గక పోతే  అప్పుడే ఆలోచిద్దాం ..... "











22, సెప్టెంబర్ 2014, సోమవారం

నాకు తెలియని సమాధానం ..... ఎవరైనా చెబితే సంతోషం .....



















"ఎవరు నాన్నా పై నున్న వాళ్ళు ...... ఏం చేస్తున్నారు ?" సుపుత్రుడు అడిగాడు

వీడికింత లోక జ్ఞానం తగ్గినందుకు ఒకింత బాధ .... కోపం కలిసిన ఫీలింగ్ వచ్చింది .

"అంత పెద్ద నటులు ... రాజకీయ నాయకుడు ..... పీఠాదిపతులని పట్టుకుని ఎవరాళ్ళు అని అడుగుతావేంట్రా .... ?

"సరేలే కానీ వాళ్ళంతా ఏం చేస్తున్నారు ?"

"పేపర్ చదవరా వెధవా తాటికాయలంత అక్షరాలతో రాసారు ..... పుట్టిన రోజు వేడుకల గురించి ..... "

"బాగుంది ...... ఈ సారి నా పుట్టిన రోజుకి కూడా పిలుద్దాం "

"ఏడ్చినట్లుంది ..... నీ పుట్టిన రోజుకి .... నా పుట్టిన రోజుకి వచ్చే అంత చిన్న వాళ్ళలా కనబడుతున్నారా వాళ్ళు ..... ఏదో ఆయన పెద్దవాడు కాబట్టి  ఇంతమంది పోగుబడ్డారు "

"సరేలే ....ఉత్తి రోజులలో ఈ స్వామీజీలు ఏం చేస్తూ ఉంటారు ?"

"ఒరేయ్ .... వారంతా హిందూ ధర్మ పరిరక్షకులురా ..... "

"అంటే .... ?"

"అంటే .... మన మతానికి సంబందించిన కార్యక్రమాలు నిర్వహించడం ..... మనమతం లోని గొప్పదనం  గురించి నీ లాంటి పామరులకి చెప్పడం ..... "

"ఆగాగు ..... అంటే మన వినాయక నిమజ్జనానికి రమ్మంటే కూడా వస్తారా ..... ?"

"ఒరేయోరేయ్ ..... నోరు అదుపులో పెట్టుకో .... వెధవా ..... బూతు పాటలు పెట్టుకుని .... దానికి పిచ్చి గంతులు వేసే మీ కుర్రకుంకల ఊరేగింపు కి ఈ మహానుభావులని రమ్మంటావా .... కళ్ళు పోతాయ్ .... ఆయనేదో రోజూ శివలింగాలకు పూజ చేసే పెద్దాయన పిలిచాడని వచ్చారు కానీ ...... "

"ఊరుకో నాన్నా ..... నేను కావాలంటే సంవత్సరం పాటు రోజూ బీచ్ కెళ్లి   ఇసుకతో శివలింగాలు చేసి ప్రతిష్టిస్తాను ..... మరి నా పుట్టిన రోజుకి ఎందుకు రారు ...... ? మన ఇంటికే కాదు ..... సాధారణంగా  ఏ పేదవాడి ఇంటికి కూడా వచ్చినట్టుగా నాకు తెలియదు ...... నువ్వన్నావు చూడు ..... బూతు పాటలని ..... ఆ వేదిక మీద ఉన్న వాళ్ళలో కూడా బూతు డైలాగుల తో సినిమాలు తీసిన వాళ్ళున్నారు ..... మరి ..... అంతే కాదు ..... ఈ బూతు పాటల వూరేగింపులని...... బలవంతపు చందా వసూళ్ళ ని వీళ్ళు ఖండించినట్లు కూడా నేనెక్కడా వినలేదు ..... ఒక వేళ నీకు తెలిస్తే నాకు చెప్పు .... సంతోషిస్తాను .... "





29, ఆగస్టు 2014, శుక్రవారం

పదాలు పాతవే గాని అప్లికేషన్ మాత్రం ......

( దీనిలో ఉదఃరించిన ఘటనలు ఎవరినీ కించపరచాలని కాదని మనవి )



“ఏమోయ్....సింధూ కి లక్ష రూపాయల అప్పు కావాలంట ....”

టీ కప్పు చేతికిస్తూ శ్రీమతి  అడిగింది. 

“జీతమంతా ఏం చేస్తుంది ?”

“అది ఎవ్వరికీ చెప్పొద్దని ఒక విషయం చెప్పింది ....ఎవరో బాగా కావాల్సిన వాళ్ళే ....చాలా అర్జెంట్ .....నాలుగు రోజుల్లో ఇచ్చేస్తానంటే దీని సేవింగ్స్ అన్నీ అప్పిచ్చిందట “

“మరి .....”

“ఏముంది మిగిలినదంతా మామ్మూలే..... అతగాడు ఫోన్ ఎత్తడు ......ఒక వేళ ఎత్తినా .......ఎక్కడో ఎయిర్ పోర్ట్ లో నో ఏసీ కంపార్ట్మెంట్ లోనో ఉన్నానని చెబుతాడట.”

“ఇంతకూ ఎవరట?”

“అమ్మో ....ఆ విషయం మాత్రం చెప్పనంటుంది....వాళ్ళు మనకు బాగా కావాల్సిన వాళ్ళే ....బయటకు తెలిస్తే బాగుండదంటుంది. “

“మన వాళ్ళలో అలాంటి కుర్రాడెవరూ ఉన్నట్టు నాకనిపించడం లేదే .....”

“ అదీ అడిగాను ....అతగాడి శ్రీమతి దీని అసలు ఫ్రెండ్ .....కాకపొతే దీనికి స్కూల్ లోనో ఎక్కడో అతగాడు కొద్దిగా తెలుసు ....ఈ అమ్మాయిని చేసుకున్న తరువాత మరలా పాత  పరిచయాలు పునరిద్దరించుకున్నారు ...”

“ ఇంతకూ అతగాడు దీని దగ్గర అప్పు తీసుకున్న విషయం ఆ ఫ్రెండ్ కు తెలుసా ?”

“తెలుసట “

“సరేలే ..తన అకౌంట్ బెనిఫీసియరీస్ లో ఉంది .....ట్రాన్సఫర్ పెడతాను .....”

“వాళ్ళన్నయ్య పెళ్ళికి చాలా గ్రాండ్ గా కనిపించాలని ఇది ఎప్పటి నుండో కలలు కంటుంది .....కొంచెం ఎక్కువే ట్రాన్సఫర్ చెయ్ .....”

“చిత్తం “

పది రోజులు గడిచిన తరువాత వేరే పెళ్ళిలో బఫే దగ్గర కుర్చీలు లాక్కుని కూర్చున్నాం ....నేనూ ,సింధూ 

“ఇంతకూ నీ డబ్బులు తిరిగొచ్చాయా.....”

నవ్వి ఊరుకుంది 

“వాళ్ళాయన వలన నీవు ఇబ్బంది పడుతున్నావని నీ ఫ్రెండ్ కు తెలుసా ?”

“ఎందుకు తెలియదు ....అంతా తెలుసు ...జస్ట్ ఇంతకు ముందే కళ్యాణ మండపం పక్కనే వాళ్ళిద్దరూ కార్ ఆపి దిగారు ..”

“అరె...మరి పద.....నేను గట్టిగా అడిగేస్తాను “

“అందుకే పిన్ని మరీ మరీ చెప్పింది .....నిన్ను మాత్రం ఈ గొడవలోకి రానీయోద్దని ....అసలే కోపం ఎక్కువ అని “

“నీ అప్పు తీర్చకుండా కార్ వేసుకుని తిరుగుతున్నారా ..సిగ్గుండక్కరలా..?”

“గొప్ప వాడివే ...నా దగ్గర అప్పు తీసుకున్నదే కారు కొనడం కోసం .....”

“అప్పు చేసి కారా ......”

“పైగా కొన్నదేమీ ఎకానమీ మోడల్ కాదు ...సెడాన్ మోడల్ ....”

“ఆ .....వాళ్ళ ఒంట్లో రక్తమేనా ప్రవహిస్తుంటా?”

“ఇందాకే చూసాను దాని నడుముకి వడ్డాణం కూడా ఉంది “

“ ఎప్పుడో అర్జున్ సినిమా చూసినప్పుడు ప్రకాష్ రాజ్ ...సరిత జంట అన్యోన్యత చూసి ఇలాంటి అన్యోన్యత కూడా ఉంటుందా ....అని ఆశ్చర్యపోయాను ...కానీ ఇప్పుడర్దమవుతోంది ....అవి సజీవ పాత్రలేనని ....”

“నిజమే ....”

“మరి సింధూ .....చిన్న సందేహం ....నీకూ నాకూ జెనరేషన్ గేప్ ఉందనుకో ............వీళ్ళంతా ఇన్ని తప్పులు చేస్తున్నా గిల్టీ కాన్షస్ అనేది ఫీల్ కారా “

“ఇప్పడే కదా ...అర్జున్ సినిమా గురించి చెప్పావు. ఆ సినిమాలో సరిత పాత్ర లో పాతివ్రత్యానికేమైనా లోటు కనిపించిందా ..... సూటిగా అడుగుతున్నానని ఏమీ కంగారు పడకు “

“అంటే ఆ విషయానికి ప్రాధాన్యత ఉండవలసిన పాత్ర కాదు కదా అది ....”

“కరెక్టే .....కానీ ఇప్పుడున్న అన్యోన్యతల్లో ఎక్కువ భాగం అలాంటివే ....”

“నిజమేలే ఇలాంటి వాళ్ళను శీలవతులు గా కూడా పరిగణించ కూడదేమో ..... “

“అదేంటి రెండూ ఒకటి కాదా ?”

“ఎలా అవుతుంది .....మొగుడు ఎలాంటి పని చేసినా ...ఎలాంటి వాడనే వాటితో నిమిత్తం లేకుండా అతడినే నమ్ముకుని ఉండడం పాతివ్రత్య లక్షణం ......కానీ శీలం అనేది ఎవరితోనూ సంబధం లేని వ్యక్తిగత లక్షణం .....”

నాకు సరిగా అర్ధం కావడం లేదు చిన్నాన్నా.....”

“ తమకు ఆనందమిస్తుందనుకుంటున్న ఆడంబరాల కోసం తన వారిని .....సమాజం లోని తన తోటి వారిని ఏ మాత్రం సంకోచం .... లేకుండా బాధ పెట్టడానికి ఆలోచించని స్త్రీ లను నేను శీలవతులుగా పరిగణించను. ప్రస్తావన స్త్రీల గురించి కాబట్టి వాళ్ళ గురించే మాట్లాడతాను  “

“అంటే......”

“ నీ సందేహం నాకు తెలుసు .... తన ఆడంబరాల కోసం టాక్సులు ఎగవేత కు ప్రోత్సహించే ప్రతి స్త్రీ కూడా ఇదే కోవలోకి వస్తారు .....అంతే కాదు ....అనేక అక్రమాల ద్వారా వేల కోట్లు తన భర్త ఆర్జిస్తున్నాడని తెలిసి కూడా ఉపేక్షా భావంతో ఉండే స్త్రీలు కూడా ఇదే కోవలోనికొస్తారు. “

“అయ్య బాబోయ్ .....ఇంత ఆవేశమా ?”

“ఒక్క విషయం ఆలోచించు .....ఇదే పార్టీ కి  తెలియకుండా  ఒక సెక్స్ వర్కర్ ఆహ్వానించబడి ఆమె నా కుటుంబ పోషణకు నాకు వేరే దారి లేదు అని చెప్పినా ఆమెను తన తోటి స్త్రీ గా చూడగలరా ఇక్కడి స్త్రీ లెవవరైనా.......”

“అసలు నీకు ఈ ఆడంబరాలంటే ఎందుకంత కోపం .......”

“ నిజం చెప్పాలంటే ...నేను ఆడంబరాలను పట్టించుకోను .....కానీ విలువలు నానాటికీ దిగజారడానికి అవి ఒక కారణంగా మారుతున్నప్పుడే నాకు ఏవగింపు ప్రారంభమయ్యింది “

“నీ మీదకు చెప్పులు .....రాళ్ళు రావడం ఖాయం .....”

“సిద్దంగానే ఉన్నాను .....”