29, అక్టోబర్ 2013, మంగళవారం

మంచి .... చెడుల మీద మన భాష్యాలు

మంచి .... చెడుల మీద మన భాష్యాలు చాలా విచిత్రంగా ఉంటాయి . నిజంగా అంతరాత్మ వాణి అంటూ ఉంటారు ...... అది ఎంత మందికి ఉంటుందో నాకు తెలియదు .  ఒక చిన్న ఉదాహరణ చూద్దాం . మా పెళ్ళైన కొత్తలో మాతో చాలా దగ్గరగా మెసిలే అమ్మాయి ఎప్పుడూ వాళ్ళమ్మ గురించి మా దగ్గర వాపోతూ ఉండేది ఆవిడ పిసినారి తనం గురించి . అప్పటికి ఆ అమ్మాయి కాలేజ్ లో డిగ్రీ  చదువుతూ ఉండేది . ఆ తరువాత చాలా కొద్ది కాలానికే ఆ అమ్మాయి పెళ్లైంది . వాళ్ళమ్మ తను చేసిన వడ్డీ వ్యాపారం వల్ల నైతే నేమి .... జాగ్రత్త వల్లనైతే .... నేమి పోగైన డబ్బుతో ఆ అమ్మాయికి బోల్డు బంగారు నగలు వగైరా చేయించగలిగింది . ఇప్పుడు ..... పరిస్థితేమంటే ఈ అమ్మాయి సూది కొన్నా కూడా వాళ్ళమ్మతో "for your approval please..." అంటూ మాట్లాడుతుంది . ఒకప్పుడు తను అసహ్యించుకున్న పిసినారితనమే ఇప్పుడు తనకు లాభం చేసేసరికి అమ్మ కాస్తా బెల్లంగా మారింది . సినిమాకి వెళ్ళడానికో ...... మంచి బట్టలు కొనుక్కోడానికో అడ్డుపడిన తల్లి పిసినారితనం ఆ అమ్మాయిని బాధించింది కానీ తల్లి వసూలు చేస్తున్న అధిక వడ్డీలు ఎప్పుడూ బాధించ లేదు .

ఇప్పుడు మొత్తం సమాజంలో అధిక భాగం యొక్క మంచి చెడుల విచక్షణ పైన ఉదహరించిన అమ్మాయి ఆలోచనా విధానం లోనే ఉంది  కాబట్టే మొత్తం  సమాజాభివ్రుద్ది అన్న  కాన్సెప్ట్ నుండి రాజకీయ పార్టీలు అనవసర సబ్సిడీ ల వైపు వెళ్ళుతున్నారు .  సబ్సిడీలు క్రింది వారికి ఎంతవరకూ అందుతాయో తెలియదు కానీ అన్ని చోట్లా రాజకీయ దళారీలు మాత్రం బాగా తయారయ్యారు. ఇది రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రయ్యాక బాగా పెరిగింది . క్రింది చిత్రాన్ని చూడండి . 




ఇప్పుడు నిజాయితీపరుల ..... దేశ / రాష్ట్ర  అభివృద్దిని కోరుకునే వాళ్ళ ముఖ్య కర్తవ్యం  అనవసర సబ్సిడీల నిజ స్వరూపాన్ని బయట పెట్టడమే .... నా మాట మీద వివరణ కావాలంటే పక్కనున్న పుస్తకాన్ని చదవండి . 


26, అక్టోబర్ 2013, శనివారం

"మరెలా ..... "

మా మూర్తికి కొంత జ్ఞానోదయం కలగజేయాలన్న సత్సంకల్పమ్ కలిగి ఒక రోజు తనతో చెప్పుకుంటూ వచ్చాను .

"మా బంధువుల కుటుంబాల లోని ఒక కుటుంబం సంగతి నీకు విన్నవించదలుచుకున్నాను. ఆ కుటుంబ యజమాని చక్కగా మూడు పూటలా తాగుతాడు . ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడూ తాగుతూనే ఉంటాడు . అదృష్ట వశాత్తూ రియల్ ఎస్టేట్ మహర్దశ ఆ వూరికి కూడా చేరింది కాబట్టి ఉన్న భూమి విలువ బాగానే చేస్తుంది . ..... నిజమే మీకొచ్చిన సందేహమే నాకూ వచ్చింది. అంతలా తాగుతుంటే ఆయన శ్రీమతి ఏమి చేస్తుంది అని .. ? ఆవిడ బలహీనతలన్నీ మన వాడికి కొట్టిన పిండి . ఆవిడ గొడవ చేసిన వెంటనే మన వాడు ఆమెను చక్కగా బజారుకి తీసుకెళ్ళి బట్టల కొట్టుకి తీసుకెళ్ళి ముద్దు చేస్తాడు . ప్రస్తుతానికి వాళ్ళిద్దరూ అలా చిలకా గోరింకల లా గడిపేస్తున్నారు . రియల్ ఎస్టేట్ "ఢామ్ " అంటే ఎలా అనేది తరువాత సంగతి .... ప్రస్తుతానికి పని జరిగి పోతుంది కదా ..అని మన వాడు .... సిలుకు చీర చూసుకుని ఆవిడా అలా మురుసుకుంటున్నారు నెమ్మదిగా వాళ్ళకున్న భూమి చేజారిపోతుందన్న వాస్తవం తెలిసినా బలహీనతల వలన వచ్చిన ఉపేక్ష . పక్కనున్న రైతు కి అటువంటి అలవాట్లు లేవు కాబట్టి చాలా చిన్న ముక్క అమ్మి నెమ్మదిగా నలుగురి దగ్గరా అడ్వాన్సులు తీసుకుని బిల్డర్ అయ్యి నలుగురికి ఉపాధి కూడా కల్పించాడు .......  " ఇంకా చెప్పబోయాను .

"ఆగాగు..." గట్టిగా అరిచాడు మూర్తి .

"అదే ... అలా అరిచావ్ ... "విస్తుపోతూ అడిగాను

" చూడు బాస్ ... పాలకులని మొదటి ఫామిలీ లో ఎంజాయ్ చేస్తున్న యజమాని లాగా ... వోటర్ ని బలహీనతల పెళ్ళాం క్రింద పోల్చావ్ అంతేనా ?"
మూర్తి లోని ఎదుగుదల నాలో ఎంతో సంతోషాన్ని కలగ జేసే లోపులోనే మరలా గట్టిగా నవ్వి ....

"ఈ విషయం దారిన పోయే ప్రతి దానయ్య కూ తెలుసు . ఇంకొకటి చెప్పనా ... నీవనుకుంటున్నట్లు రెండో వాడి పద్దతిలో వెళ్తే పైకి వస్తామని తెలిసినా వాడి దారి లోకి వెళ్ళరు . నీ వూరి రోడ్ మోకాలి లోతు గుంటలు పడ్డా ఎవడూ అడగడు . వాడికి కావలిసిందల్లా కష్టపడ కుండా  ఫ్రీ గా వచ్చే తిండి గింజలు వగైరా ... అంతే ..."

ఇదేమిటి .... మూర్తి నాకు జ్ఞానోదయం కలిగిస్తున్నాడు అనుకుంటూనే సందేహం ఒకటి నివృత్తి చేసుకోవాలనుకున్నాను .

"మరి అలా జరుగుతుంటే మొదటి వాడి కుటుంబం నాశనం అయినట్లుగా మన ఆర్ధిక వ్యవస్థ ..... "

"నీతో వచ్చిన చిక్కే ప్రసాదూ .... ప్రతిదీ లోతుల్లోకి వెళ్లి ఆలోచించోద్దంటే వినవ్ . ఎవరికీ అంత ఓపికల్లేవ్ .....  .... హేపీ గా ఉద్యోగం చేసుకుని ... ఇంటికి వచ్చి టీవీ లలో దూరడం తప్ప .... నీకింకొక విషయం చెప్పనా .... మొదటి వాడిలా విలాసంగా బ్రతికే వాడు తన లాంటి నలుగురిని కలుపుకుని తను తాగే మందే .. అంటే అంత  ఖరీదైనది కాదనుకో .... నలుగురికీ అలవాటు చేసి  వాళ్ళ వోట్లతో గెలిచి రెండో వాడిలా కష్టపడే వాడిని నయానా... భయానా  బెదిరించి.....  "

"ఆగాగు నాకేదో సాఫ్ట్ వేర్ కంపెనీ గుర్తుకు వస్తోంది "  నాకేదో పోలిక కనిపించి అన్నాను .

"సరేలే .... ఇంకా చాలా దొరకొచ్చు ...... పూర్తిగా విను .... అలా వచ్చిన డబ్బుతో ఒక మంచి బాకా కొనుక్కుని .... జనాలను ముందు నుండీ సబ్సిడీ /ఫ్రీ  ల గారడీ లో ముంచి ఎలక్షన్ రోజున నిజమైన మత్తులో ముంచితే చాలు విజయం తధ్యం అనే సిద్దాంతం తోనే కొన్ని పార్టీలుంటుంటే ..... "

"మరి మన పారిశ్రామిక పురోగతి ..... "

"అదే మరి ... నిన్ను అలాంటి గ్రాంధికం మాట్లాడ వద్దన్నానా ..... "

"మరి .... మిగిలిన పార్టీలు .... "

"అందరికీ తప్పడం లేదు ..... అనవసర సబ్సిడీ ల వల్ల అనర్దాలు చెప్పి చేతులారా ఓటమి తెచ్చుకునే వెర్రి వాళ్ళెవరూ ఉండరు . యధా ... రాజా ..తధా  ప్రజా  కాదు బాబూ .. ఆ రోజులు పోయాయి ... ఇప్పుడు యదా ప్రజా ...తధా రాజా ... "

"మరెలా ..... "

"వెళ్లి మీ బోసు బాబు కి మాథ్స్ చెప్పుకో .... ఏదో టాలెంట్ టెస్ట్ రాసుకుంటాడు . " మూర్తి జ్ఞానోదయాన్ని ముగించాడు .

నేను మాత్రం "ఎలా ..... " అనుకుంటూ ముందుకు నడుస్తూనే ఉన్నాను .... ఎప్పటికైనా నా వెనుక కొంతమందైనా చేరతారనే ఆశతో .....

( తూర్పు గోదావరి జిల్లాలో కొత్తగా రిక్రూట్ అయిన కానిస్టేబుల్స్ 1600 మందిలో 610 మంది ఈ మధ్యే బయటకు వచ్చిన ఇంజనీర్స్ అన్న వార్త విన్న తరువాత కలిగిన స్పందన )




20, అక్టోబర్ 2013, ఆదివారం

( వయస్సు ఉడిగిన ఉడతల )... భీకర పోరాటం ....

                         ఆ గుడిసె పక్క నుండి వెళ్ళుతున్నప్పుడు మాత్రమే  వినిపించే అంత మంద్ర స్వరంతో లోపల ఎవరో ఇద్దరు కేకలు వేసుకుంటున్నారు . స్వరాన్ని బట్టి చూస్తే  ఇద్దరూ  వృద్దుల లా ఉన్నారు .  జాగ్రత్తగా వింటే వాళ్ళు ఏదో విషయం మీద వాగ్యుద్ధం చేసుకుంటున్నారని అర్ధమయ్యింది . దారిన పోయే ఒక దానయ్యను అడిగాను వారి గురించి .
" ఆ .... మీ పని మీరు చూసుకోండి ..... సారూ ... "
"అది కాదయ్యా ...పాపం  పెద్ద వాళ్ళ లా ఉన్నారు వాళ్ళలా గట్టిగా వాడులాడుకుంటుంటే పట్టించుకోనట్టు వెళ్లి పొతే ఏం బాగుంటుంది .....?"
"మీరు ఈ వూరికి కొత్తలా ఉన్నారు ..... మాకైతే ఇది రోజూ అలవాటైందే ........ "
"అంటే "
"ఒకప్పుడు వాళ్ళిద్దరూ బలమైన వాళ్ళే ....బాగా బతికినా వాళ్ళే .....చాలా మంచి వాళ్ళు, పద్దతైన వాళ్ళే . జనం కూడా వాళ్ళెనెకే ఉండేవారు .  ఒక సారి ఇద్దరికీ తగువయ్యింది .....  విడిపోయ్యారు ...... ఆ తరువాత వాళ్లిద్దరూ వాళ్ళ వాళ్ళ వాదనలు కరెక్ట్ అని నిరూపించుకునేందుకు అడ్డ మైన వాళ్ళతో  జత కట్టేవారు . జనానికి నెమ్మదిగా వీళ్ళిద్దరి కంటే ఆ  అడ్డమైన వాళ్ళే నయమనిపించారు . ఎందుకంటే ఈ ఇద్దరూ  ఎవరితో ఎప్పుడు ఎందుకు జతకడతారో అర్దమయ్యీది కాదు . జనం ఈళ్ళని ఎప్పుడో వదిలేసారు . అయినా వీళ్ళిద్దరూ వాదించుకోడం మానలేదు . ఎల్లండి బాబూ మీకేదైనా పనుంటే చూసుకోండి " అనేసి దానయ్య కూడా వెళ్లిపొయ్యాడు .


                             పైది చదివిన వారికి ఇది ఏదో సారూప్యత కోసమే రాసానని చాలా మందికి అర్ధం అయ్యే ఉంటుంది . నిజమే ... జరిగిన విషయాలు తెలుసు . జరుగుతున్నది అర్ధం అవుతూనే ఉంది . జరగబోయ్యేది తెలుస్తూనే ఉంది . నేను యువకుడిగా ఉన్నప్పుడు నాకు పూర్తి మనోబలం ... జవసత్వాలు ఇచ్చిన (మూల ) సిద్దాంతాన్ని అవలంబిస్తున్న పార్టీలు పది ముక్కలై .... మొత్తంమీద ప్రజలకు దూరమై ఇప్పుడు తమ ఉనికికే ముప్పు ఏర్పడుతున్నప్పుడు కూడా అతి చిన్న విషయానికి ... వీధికెక్కి రాద్దాంతం చేసుకుంటున్న వీళ్ళు రాబోయే తరాలకు మిగిల్చే వారసత్వం ఏమిటో నా బోటి సామాన్యులకు బోధపడకుండా ఉంది .

                             విప్లవ సిద్దాంతంతో అడివి బాట పట్టిన వారి గురించి నాకు తెలిసింది తక్కువ . కాబట్టి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉంచిన కమ్యూనిస్ట్ పార్టీల గురించే నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను  .  1977 లో వచ్చిన జనతా ప్రభుత్వం  1979 వచ్చే సరికల్లా కూలి పోవడానికల్లా వారిలో వచ్చిన లుకలుక లే కారణమని అమాయకులనుకోవచ్చు కానీ పూర్తిగా మెటీరియలిస్టిక్ గా ఉండే వీళ్ళేలా  అనుకున్నారో నాకు ఇప్పటికీ అర్ధం కాదు . అప్పటికే సాంప్రదాయ పారిశ్రామిక వేత్తలను  అధిగమించి ముందుకు పోవడానికి అడ్డ దారులు వెదుక్కుంటున్న లంపెన్ పారిశ్రామిక వర్గం వీరి కళ్ళబడలేదా ? బహుశా మార్క్సిజం లో దీని గురించి ప్రస్తావన లేదని దీని గురించి పట్టించుకోలేదేమో పాపం . భారత ఆర్ధిక వ్యవస్థకు ,రాజకీయ ... సామాజిక వ్యవస్థలకు  దీనివలన కలగ బోయే కీడు తెలిసీ కూడా వీళ్ళు ఐక్యంగా ఆ తరువాత ఎలక్షన్స్ లో ఉండ లేక పొయ్యారు . అప్పట్లో జరిగిన ఆర్ధిక అవకతవకలను ఒక R.S.S.సానుభూతి పరుడైన మేధావి పట్టించుకున్నట్లుగా వీళ్ళు పట్టించుకోలేక పొయ్యారు .


                          ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే . కనీసం ఉమ్మడిగా ఉన్నప్పుడు బలంగా ఉన్న ప్రదేశాల్లో కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు భౌతిక దాడులు చేసుకోడమే  కాకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ చేసుకుని పూర్తి గా వీరి సిద్దాంతానికి ... వ్యతిరేకంగా ఉండే వాళ్ళని చక్కగా గెలిపించి ప్రజలకు రాజకీయ వినోదాన్ని పంచారు .

                         సోషలిజం అనేది ఒక రాజకీయ సిద్దాంతం మాత్రమే కాదు ... ఒక ఉత్కృష్ట  మానవతా  భావన.... దానిని చేరుకోడానికి రాజకీయ పోరాటమే కాకుండా సామాజిక ... సాంస్కృతిక రంగాల్లో ఎంతో పోరాటం చేయవలసి ఉంటుందని తెలిసీ కూడా ఏ మాత్రం సిద్దాంత సారూప్యత లేని తోకలుగా మిగిలి అన్ని రంగాల్లోనూ ఉనికిని కోల్పోతున్న దయనీయ స్థితి లో కూడా వీధి పోరాటాలు మాన లేదు . ఒక ముఖ్యమంత్రి తన స్వప్రయోజనాలకోసం వేలాది ఎకరాల భూమిని పందేరం చేస్తున్నప్పుడు చేసిన పోరాటం కంటే  వీరిద్దరూ ఒకరి పై ఒకరు బురదజల్లు కోడానికే భాష ను గొంతుకలను ఎక్కువ వాడుతున్నట్టున్నారు . వీరు ఒక విషయం గమనించారో లేదో తెలియదు కానీ వీరు ఏదైనా పోరాటం చేసినప్పుడు పెద్దగా పట్టించుకోని పత్రికలు వీరు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగ గానే వీరి నాయకులు ఉచ్చరించిన ప్రతి పదం పొల్లు పోకుండా వేస్తున్నారు .

                         ఈ క్రింద ఉన్న మాప్ ను ఒక సారి చూడండి . నేను ఇంతకు ముందు వేరొక పోస్ట్ లో వాడినదే . 






                   వేలకొద్దీ ప్రయాణం చేసే రోడ్ లో ఉన్న ఈ ప్రార్ధనా మందిరాల గురించి ఇప్పుడు మరొక సారి ప్రస్తావించవలసి వచ్చింది . 1981-82 ల లో తణుకు పట్టణం లో చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ కళాశాల ముందు భాగం లో ఉన్న దేవాలయ భూమిని వేలం వేయాలనుకున్నప్పుడు దాని వెనుక ఎవరున్నదీ తెలిసి కూడా ప్రజలను చైతన్య వంతులని చేసి దానిని తిప్పి కొట్టిన విద్యార్ధి లోకం లో నేనూ ఒకడినై నందుకు నాకు ఈ రోజుకీ గర్వంగా అనిపిస్తుంది. కానీ రోజూ వేల మందిని ఇబ్బందుల పాలు చేస్తున్న ఈ ప్రార్ధనా మందిరాల ఆక్రమణ లకు వ్యతిరేకంగా ఇప్పుడున్న ఏ రాజకీయ పార్టీ ముందుకు రాలేదు . ప్రతి ఒక్కరికీ వోట్ల లెక్కే .  పిల్లి కాదు ..... పులి లాంటి మత .... కుల .. గ్రూపు ... రాజకీయాల మెడలో గంట కట్టాలి .

                          ఈ నాడు నేనొక మధ్య తరగతి ఉద్యోగస్తుడను .... నాకు అన్యాయం అనిపించిన ప్రతి విషయానికి వ్యతిరేకంగా నేను పోరాడలేను . కానీ ఈ పని కొంత వరకూ ఆనాడు చైతన్యంతో ఉండే విద్యార్ధి సమాఖ్యలు చేసేవి . మరి ఈ నాడు ఎందుకు అవన్నీ వెనక్కు పోతున్నాయి? నేరస్తుల ప్రపంచం నెమ్మదిగా మొత్తం సమాజాన్ని ..... ఆర్ధిక వ్యవస్థనే కాక అన్ని వ్యవస్థలను కబ్జా చేస్తున్నప్పుడు ఐక్యంగా ఈ పరిస్థితిని ఎదుర్కోవలసిన చైతన్యవంతులు ముక్కలు ముక్కలుగా విడిపోవడం ఎవరికి లాభం చేకూరుస్తుందో ఈ పార్టీల నాయకులకు తెలియదా ? సెక్యులరిజం పేరు మీద కేంద్రప్రభుత్వానికి ..... నేరస్తుల ముఠాలకు ఊడిగం చేసే వారిని అక్కున చేర్చుకుంటే ప్రజల విశ్వసనీయతను కోల్పోతామని తెలియదా? "వీరిద్దరూ ఐక్యంగా ఉన్న తరువాత కదా మిగిలిన సెక్యులర్ పార్టీ లతో చెలిమి చేయాలి" అని ప్రతి సామాన్యుడూ అనుకుంటాడు ఒక్క ఈ పార్టీల నాయకులు తప్ప .

                       ఉధృతంగా వర్షం పడుతున్నప్పుడు ముందు తడవకుండా ఉండడానికి గొడుగు వెదుక్కుంటాం  కానీ వర్షం రావడానికి కల కారణాలను ..... వర్షం వలన రాబోయే ఉపద్రవాల గురించి చర్చిస్తూ కూర్చోం . ముందు మనకు నీడ దొరికిన తరువాత అవన్నీ చర్చిస్తాం . కాకపొతే అది మనబోటి సామాన్యులు చేసే పని . కమ్యూనిస్ట్ పార్టీల నాయకుల ఆలోచనలు విభిన్నంగా ఉండొచ్చు . 1964 లో భారత దేశ పరిస్థితికి .. నేటి పరిస్థితికి అన్ని విషయాలలోనూ చాలా తేడా ఉంది .  అప్పటి పరిస్థితులు చీలికకు దారి తీసి ఉండొచ్చు . కాని ఈ నాటి పరిస్థితులలో జాతీయ సంపత్తిని దోచుకునే స్థాయికి ఎదిగిన నేరమయ ప్రపంచాన్ని పెకలించక పోతే భారతదేశ జనాభా మొత్తం నేరగాళ్ళ పడగ నీడల్లో బిక్కు బిక్కు మంటూ బ్రతకవలసిన ఆవశ్యకత కలుగుతుందని అర్ధం కావడం లేదా ? లేదా దీనికి కూడా మార్క్సిస్ట్ గ్రంధాలను రిఫర్ చెయ్యాలా? ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఐక్యతా రాగం కాకుండా యుద్ద భేరీలు మ్రోగిస్తే మాత్రం ఇది భారత రాజకీయ చరిత్రలో అది ఒక పెద్ద కుట్రగానే భావించ వలసి వస్తుంది .

16, అక్టోబర్ 2013, బుధవారం

...........నుండి మనలను....మన పిల్లలను మనమే రక్షించుకుందాం...

"బాసూ మనందరం చాలా వేస్ట్ గాళ్ళం ..." సడన్ గా మా మూర్తి నా దగ్గర వాపోయాడు.

"నీవు చెప్పేదాంట్లో నిజాన్ని నేనేమీ కాదనను గానీ నీకు ఆ విషయం ఇప్పుడే ఎందుకు మనసులో నుంది బయటకు వచ్చింది?"

"నిన్న ఒక సినిమా చూసాను బాసూ...దాంట్లో హీరో ఒక విషయం తన వాళ్ళతో డిస్కస్ చేయడానికి మొత్తం స్టేషన్ అంతా ఖాళీ చేయిస్తాడు తెలుసా..?"

"అదే...పక్కన రెస్టారెంట్స్ లాంటివి లేవా..?

"అదే చెబుతున్నాను.....మనమైతే బస్ కాంప్లెక్స్ ఐనా ఫరవాలేదు.....రైల్వే ప్లాట్ఫార్మ్  ఐనా ఫరవాలేదు మాట్లాడేసుకుంటాం......కాని కోటీశ్వరులు  అలా కాదుట .....రైల్వే స్టేషన్లు,ఎయిర్ పోర్ట్లు ఖాళీ చేయించి మాట్లాడుకుంటారుట....."

"చూడమ్మా....ప్రేక్షకులకు కావలసింది అదే....నీ లాంటి నాలాంటి వేస్టు గాళ్ళ గురించి ఎందుకు?"

" అంటే మన లాంటి వాళ్ళ ఫీలింగ్స్  కు విలువే ఉండదంటావా?"

"అసలు మనకు ఫీలింగ్స్ ఉన్నాయంటావా.......?

మూర్తి ఉలిక్కి పడ్డాడు.

"అదెమిటి బాస్ అలా అనేసావ్....ఫీలింగ్సే లేకపొతే యీ సంసారాలు...పిల్లలు..."

"నేను మాట్లాడేది హార్మోన్ల ప్రకోపం వలన వచ్చిన ఫీలింగ్స్....మన సంతానం కోసం వచ్చిన ఫీలింగ్స్ కాదు..."

"మరి...."

"నిజంగా చెప్పాలంటే నా మనసులో ఉన్నది సరిగ్గా చెప్ప లేక పోతున్నాను మూర్తీ.....యీ మద్య వచ్చిన కొన్ని సినిమాల లోని సన్నివేశాలను చెబుతాను..ఆ  సన్నివేశాలు చూసిన తరువాత నీకు ఏ ఫీలింగ్స్ కలిగాయో చెప్పు. 

1.అమ్మ చెప్పింది సినిమాలో ఆఖరున దేశం గర్వించదగ్గ  మేధావులను రక్షించడానికి తన కొడుకును బలిదానం యీయ వలసి వచ్చినప్పుడు ఆ తల్లి పడిన వేదన....ఆతరువాత తను చనిపోబోతున్నట్లు ఆ కుర్రాడికి ముందే తెలుసన్న సంగతి మనకు తెలిసిన తరువాత.....

2. పిల్ల జమిందార్ సినిమా లో నిజమైన ఆనందమంటే ఏమిటో అర్ధం చేసుకున్న హీరోను  అతని తోటి వాళ్ళు రిసీవ్ చెసుకున్న విధానం....ముఖ్యంగా సమాజంలోకి ఒదిగేకొద్దీ అతడిపై తోటి వారి స్పందన...

3. అనుకోకుండా ఒక రోజు సినిమాలో గంజాయి తాగుతూ పిచ్చి వాడిలా ఉన్న వాడు గొప్పా బాబా గా మారి ఎంత సులభంగా తన శిష్యుల లాంటి వాళ్ళను హత్యలు చేడానికి కూడా ప్రేరేపించగలడో  చూసినప్పుడు....

4. పంజరాల్లో పెట్టి చదివించబడిన వారు కెరీర్ లో పైకి ఎగ బ్రాకినప్పటికీ ....ఓటమి అంటే వారికి ఉన్న భయం....వారెన్నటికీ నిజమైన హీరోలు కాలేరని నాటుకునేలా  చెప్పిన గోదావరి సినిమా చూసినప్పుడు ......."

"నిజమే బాస్ ....నిజంగా కళ్ళనీళ్ళు పెట్టించేవీ.....అలోచింపజేసేవే....."

"ఐతే....నీకు ఫీలింగ్స్ ఉన్నట్లే....నీవు మన మీడియా వాళ్ళ కంటే చాలా బెటరే..."

"యెలా.."

" పైన చెప్పిన సినిమాల గురించి మీడియాలో రావలసిన ప్రచారం వచ్చిందా...?

"బాసూ...మీడియా సంగతి పక్కన పెట్టు...ఇటువంటి సన్నివేశాలు చూసిన తరువాత కూడా ఒక మనిషిలో స్పందన లేక పోతే....."

"వాడిలో మానవత్వం పాలు తగ్గిందనో... లేదనో అర్దం చేసుకోవాలంతే....."

"మన పాసింజర్ ట్రైన్లో కాలేజ్ కుర్రాళ్ళు కానీ వేరే యువకులు కానీ యీ సినిమాల గురించి మాట్లాడుకోడం చూడ లేదు..."

"నీవన్నది 100% కరెక్టే....అలా వాళ్ళు మాట్లాడుకోపోవడం లో మన పాత్ర అంటే తలిదండ్రుల పాత్ర లేదా..."

" నెవెక్కడెక్కడో లంకె పెడుతున్నావ్"

" పైపైకి అంతా అలానే ఉంటుంది. ఒక బాగా హిట్టైన సినిమాలోని విషయం గురించి మాట్లాడుకుందాం.ఆ సినిమాలో యదావిధిగానే ఒక విలన్ ఉంటాడు...వాడిని సహజంగానే ప్రజలు కానీ పోలీసులు  కానీ ఏమీ చేయలెక పొతుంటారు..కానీ అనుకోని పరిస్థితులలో హీరో ఆ విలన్ ను అతడి అనుచరులను తరిమి తరిమి చంపుతాడు...చంపిన తరువాత అతడికి పాలాభిషేకం చేయడం ద్వారా మనకున్న మత వ్యవస్థ అంగీకారాన్ని....అతడి చేతిని కళ్ళకద్దుకోడం ద్వారా రాజ్యం యొక్క అంగీకారాన్ని ఒకే సమయంలో చక్కగా చూపించారు.ఆ సినిమాలో ఆ సన్నివేశాన్ని  అత్యంత ఉద్రేక భరితంగా చూపించడం వలనే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యిందన్న సంగతి అందరికీ తెలిసిందే.వ్యక్తిగత సామర్ధ్యం...బలం...ముందు మనకున్న వ్యవస్థలన్నీ మోకరిల్లినట్లు చూపించిన  సినిమాకి
సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడం మరింక యే మోకరింపో ప్రజలెంత మంది గ్రహిచగలరు?. పైన చెప్పిన సినిమాల లోని సన్ని వేశాలు....యీ సినిమా లోని సన్నివేశం  పోల్చి చూడు...యువకులను ఏది ఉద్రేక పరుస్తుందో చూడు. ఎక్కడో బెంగాల్ లో దసరా చందాలు బలవంతంగా వసూలు చేసేవారని వినేవాళ్ళం.కానీ పల్లెటూరులోనుండి వెళ్ళుతున్న ప్రభుత్వ వాహనం లో ఉన్న వాళ్ళ పైకి  వినాయక చవితి చందా ఇవ్వ లేదని రాళ్ళి విసిరే స్థాయికి మన కుర్రవాళ్ళు ఎందుకు ఎదిగి పోయారంటావ్? మరి వాళ్ళు మంచి మాట్లాడుకోవడం లేదని మనం బాధ పడడం లో అర్ధం ఉందా..?"

"నీవింత ఆవేశంగా చెప్పేవు గానీ మనం అలవాటు చేస్తే మాత్రం పిల్లలు వింటారంటావా....మా పాప ఇంకా చిన్నదనుకో..."

"అందులో సందేహం లేదు మూర్తీ...మా పిల్లలిద్దరూ...యీ రొజుకి కూడా మిస్సమ్మ....అప్పుచేసి పప్పు కూదు...లాంటి సినిమాలను ఎంజాయ్  చేస్తూనే ఉంటారు..ఆయా సినిమాల్లో నిక్షిప్తంగా ఉన్న సందేశాన్ని వాళ్ళు అర్ధంచేసుకుంటేనే కదా వాళ్ళు ఎంజాయ్  చేయగలిగేది"

"మరి మీడియాలో కొద్దిగా అన్న  యీ విషయాల మీద డిస్కషన్ పెట్టొచ్చుగా..."

"మాది ఇండియాలోనే గొప్ప మేనేజ్మెంట్ కోర్స్ చెప్పే కాలేజ్ అని రోజూ యాడ్ వేసే ఒక గొప్ప పేపర్ వాళ్ళు అదే కాలేజ్ సంబందించిన నిజాలను వేయలేక పోయారు....వాళ్ళిచ్చే యాడ్  లొ పోతాయని...యీ విషయం నెట్ లో నిజాలను తెలుసుకున్న వారందరికీ తెలుసు  నేను యీ విషయం ఎందుకు చెబుతున్నానంటే చానళ్ళు ...పేపర్లూ పెట్టింది లాభాల కోసం  కానీ దేశ సేవ కొసం కాదు.నీవు చెప్పిన సినిమాల గురించి చెబితే వీళ్ళకు కాసులు రాలవు."

"మరి ప్రభుత్వం...."

"భలే అడిగావ్ మూర్తీ....ఇక్కడ కూడా చిన్న ఉదాహరణ చెప్పక తప్పదు. పుల్లెల గోపీచంద్...సుషీల్ కుమార్  ల గురించి తెలుసుగా ...

"తెలుసు" 

"యెం తెలుసు...."

"మంచి క్రీడాకారులు...."

"ఇంకా...."

"వ్యక్తిగతాలు నాకు అంతా తెలియదు..."

"అన్నిటికన్నా ముఖ్యమైనది నీకు కూడా తెలియదన్న మాట...ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ప్రోడక్ట్స్ తాలూకు యాడ్స్ లో నటించడానికి ఒప్పుకోలేనందువలన వాళ్ళు కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయారు తెలుసా....మరి మన కుర్రాళ్ళకు ఆరాధ్య దైవాలుగా క్రికెట్ ప్లేయర్స్ ఉండాలా...వీరిద్దరూ ఉండాలా"

"నిజంగా నాకు కూడా యీ విషయాలు తెలియవ్ బాస్"

"అంతే మరి...ప్రజల కోసం త్యాగాల చేసిన వారి ఔన్నత్యం ప్రభుత్వం తగినంతగా గుర్తించి...ప్రచారం కల్పించిందా...?

"ఇంకానయంలే బీచ్ లో శివలింగా లకు పూజ చేసి పుట్టిన రోజున నటీ నటులతో ఫొటోలు దిగే వాళ్ళకు డాక్టరేట్ లు ఇచ్చే యూనివర్సిటీ  ల పెద్దలకు  వీళ్ళు గుర్తుకు వస్తారో లేదో తెలియదు."

"శభాష్ ...ఆలశ్యంగా అన్నా బాగా చెప్పావ్...మనం ఒక భయంకరమైన సుడిగుండం మధ్యలో ఉన్నాం మూర్తీ...సమాజానికి చెడు చేసే వాటి పట్ల ప్రభుత్వానికి ఉదాసీనత.... అది మన జీవన విధానమనో....చాలా సహజమనో మీడియా చూపిస్తుంది. విభిన్న ఆలోచనా ధోరణితో  తీసిన సినిమాల పట్ల ఉదాసీనత అసలలాంటిదేమీ అవసరమే లేదనే భావన ప్రజలకు కలిగేంత కుట్ర తో కూడిన ఉదాసీనత....ఇవన్నీ తట్టుకుని ఒకటీ అరా సినిమాలు వచ్చినా వాటికి ధియేటర్లే దొరకవు...కోట్ల విలువైన భూమిని తేరగా ప్రభుత్వం నుండి తీసుకుని వారసులందరినీ రంగం లోకి దింపేస్తారు. వారు తీసిన ఎన్ని సినిమాలకు జాతీయ అవార్డులు వచ్చాయి? నిర్మాతలా...లేక బినామీలా తెలియని దుస్థితి వేరే వైపు ....వాళ్ళకు తెలిసిన చిన్న ప్రపంచాన్నే రూపాలు మార్చి పదే పదే చూపిస్తుంటే అవి తప్ప వేరేవి దొరకని దౌర్భాగ్య  స్థితిలో ఉన్నాడీ రోజు తెలుగు ప్రేక్షకుడు...."  

                              మనమే....మనం స్లాబ్ వేసే ముందు ఫార్మ్ వర్క్ ఎలా చెక్ చేస్తామో....మన పిల్లల యాటిట్యూడ్ ఎలా ఉందో చెక్ చేసుకుంటూ ఉండాలి. అది సరిగ్గా ఉన్నప్పుడు వాళ్ళెక్కడ ఉన్నా ఏం చేసినా ఆనందంగా ఉంటారు. నీకర్దం అయ్యేలా చెప్పాలంటే ఎం.ఐ.టీ లో చదివి మైక్రోసాఫ్ట్ లో చేస్తూ  ...హార్వర్డ్ లో చదివి మెకిన్సీ లో చేస్తూ...రియల్ ఎస్టేట్ లో పెట్టుబడుల గురించి ఇండియా లో పెద్దలతో రోజూ మాట్లాడి లెక్కలు వేసుకునే వాడికంటే   ...సైకిల్  వేసుకెళ్ళి స్కూల్లో...కాలేజ్ లో..   శ్రావ్యంగా అర్ధయుతంగా ... ఇందుగలడందులేదనే... పద్యం  యొక్క భావాన్ని..... దాని లోని  హేతుబద్దతను చెప్పగలిగినవాడు ధన్యుడు...ఆనందంగా బ్రతికే వాడు..భరత మాత ముద్దు బిడ్డడు అవుతాడు.కనీసం దేశం కోసం మంచి నాయకులను తయారు చేసిన వాదవుతాడు.   



(తాడికొండ స్కూల్లో మమ్మలని అత్యంత ప్రభావితం చేసిన విల్సన్ రావు మాష్టారి పాదాలకు నమస్కరిస్తూ.....)

11, అక్టోబర్ 2013, శుక్రవారం

మంచి పుస్తకాలు ....... బ్రతికే కళ

" నేను ఎకనామిక్స్ ఎందుకు చదవాలి నాన్నా ...... ?

సుపుత్రుడు ప్రశ్నించాడు . నేను కొంచెం బిజీ గానే ఉన్నాను .

"మొత్తానికి ఏదో ఒకటి చదవాలి కదా ... "

"కానీ అదే ఎందుకు చదవమంటున్నావ్ ... "

ఇప్పడే చెప్పాలి అన్నట్టుగా అడిగాడు .

బుర్ర పైకి ఎత్తక తప్ప లేదు .

"పోయిన వారం ఉల్లి పాయలు ఏ రేటు లో కొన్నావ్ ?"

"కిలో 60 రూపాయలు . "

"నిన్నెంత ?"

"కిలో 48 రూపాయలు "

"ఎందుకంత తేడా ... ?"

"పోయిన వారమంతా సమైక్యాంద్ర సమ్మె కదా .... "

"అయితే ... "

"బస్సులు అదీ తిరగ లేదు కదా .... "

"ఉల్లిపాయలు బస్సుల మీద ట్రాన్స్ పోర్ట్ అవుతాయా ?

"కాదనుకో .... "

"ఓరి పనికిమాలిన వెధవా ... చాలా మంది నీలానే ఉంటారు . ప్రతి విషయానికి పై పై నే ఆలోచించి ఏదో ఒక కారణాన్ని ఆపాదించేసుకుంటారు తప్ప లోతు ల్లోకి వెళ్లి ఆలోచించరు . ఇప్పుడు నీవు చెప్పిన సమాధానం లో పాక్షికంగా నిజం ఉండొచ్చు . కానీ నీవు అంత  ఆలోచించలేదని నాకు తెలుసు "

"సరేలే .... ఎకనామిక్స్ చదివితే ఇవన్నీ తెలుస్తాయా ..."

"ఖచ్చితంగా ఇవే అని చెప్పలేను కానీ ప్రస్తుత పరిస్థితుల గురించి వీటి నేపధ్యం గురించి నీవు బాగా అర్ధం చేసుకోగాలుగుతావ్ . "

"నాన్నా .... మరి ..... ఎకనామిక్స్ చదివితే మంచి ఉద్యోగం రాదేమో .... ?"

అమ్మ ....నా కొడకా ..... అని మనసులోనే అనుకున్నాను .

"ఫరవాలేదు ..... సమాజం మీద మంచి అవగాహన తో మంచి పౌరుడిగా బ్రతుకుదువు గాని .... "

"సరైన ఉద్యోగం లేక పొతే ఎలా ..... "

ఎందుకో నాకు నేను చిన్నప్పుడు చదివిన తాడికొండ స్కూల్ లో పని చేసిన సి . ఎస్ . రావు మాస్టారు గుర్తుకు వచ్చారు . ప్రిన్సిపాల్ తో కొద్ది కమ్యూనికేషన్ గేప్ వలన ఆయన ఆకస్మాత్తుగా రిజైన్ చేసారు . ఆయన వెళ్ళే ముందు జరిగిన మీటింగ్ లో ఆయన
ఒకటే చెప్పారు.

 "మా కుటుంబ వృత్తి వడ్రంగి పని ... నాకు వేరే ఉద్యోగం దొరికే వరకూ ఆ పని చేసుకుని బ్రతగ గలను  కానీ ఇష్టం లేని చోట ఒక్క నిముషం కూడా ఉండ లేను ."

ఇది గుర్తుకు రాగానే మా వాడితో అదే చెప్పాను .

"కాబట్టి నీవు మోటార్ సైకిల్ మీద తిరగ గలిగే ఉద్యోగం సంపాదించుకుంటే చాలు . "

"నాన్నా ... "

మా వాడు అరిచిన అరుపుకు కాస్సేపు నా గుండె ఆగిపోయిందేమో అనుకున్నాను .

"మోటార్ సైకిల్ ఏమిటి ..... నాన్నా ... "

వాడు అరిచాడు కానీ నిజానికి 10 వ తరగతి చదువుతున్నా వాడి లో ఎక్కువ భాగం బాల్యం పాలే ఎక్కువ . మనకు నచ్చే జీవిత దశను
 కొంత పొడిగించడం మంచిదేనని నా ఉద్దేశ్యం . అంటే మెదడు లేకుండా చేయమని కాదు కానీ అనవసరమయిన ఒత్తిడి తో బాల్యాన్ని కుదించేయడమంటే వాళ్లకు ద్రోహం చేయడమేనని నా ఉద్దేశ్యం .

నేనెప్పుడూ ఆశావాదిని . రోజులెప్పుడూ ఒకేలా ఉండవని నా నమ్మకం . మన దేశ రాజకీయాల నడిపిస్తున్న అసలైన ఆర్ధిక శక్తుల నిజ స్వరూపాలను బయట పెట్టి సిద్దాంతాల ప్రాతిపదిక మీదే మాట్లాడే నాయకులనే జనం నమ్ముతారని అనిపిస్తోంది . భారత దేశ రాజకీయాల మీద లంపెన్ పెట్టుబడి దారీ వర్గానికి పట్టు ఎలా బిగిసిందో అర్ధం చేసుకోగలిగితే నేటి ఈ పరిస్థితి అర్ధం అవుతుంది . ఇంతకూ చాలా మందికి ఈ లంపెన్ పెట్టుబడిదారులంటే అర్ధం కాదు .  నిజానికి వాటి నిర్వచనాలకు వెళ్ళడం కంటే వారి లక్షణాలబట్టి చెబితే ఉత్తమం . నిజమైన పెట్టుబడి దారులు తనున్న సమాజావసరాలకి పెద్ద పీట వేస్తారు . అంతే గాని విలాసాలకు కాదు . దేశం నిండా ఉన్న టాటా .... బిర్లా ల విద్యాలయాలు .. పరిశోధనా శాలలు ఈ నిజాన్ని విసదీకరిస్తాయ్ . కానీ ముంబై లో వెలిసిన అత్యాధునిక రాజభవనాలు 70 వ దశకం ఆఖరు నుండి కొనసాగుతున్న కొత్త రూపం సంతరించుకున్న పెట్టుబడిదారీ విధానానికి దర్పణం పడతాయ్ . అడ్డదారులతో పైకి ఎదిగిన పెట్టుబడిదారీ వర్గాలు ఇదే అసలైన  విధానమని ప్రజలను నమ్మించి మభ్య పెట్టడానికి ఏ మాత్రం వెనకాడడం లేదు . పుట్టుక లోనే అనేకానేక కుంభ కోణా ల ఆవాసంగా మారిన I.P.L. ను ప్రమోట్ చేసిన వారిని ఒక్క సారి గమనించండి . దీనికి తన వంతుగా కాకుండా శాయశక్తులా తన సహాయ సహకారాలను మన మీడియా అందిస్తోంది . నేను చెప్పేది I.P.L మాచ్ గురించి కాదు . సరికొత్తగా పుట్టుకొస్తున్న లంపెన్ వర్గాలను అధికారం లోకి తేవడానికి ఇవి నిర్విరామంగా కృషి చేస్తూనే ఉన్నాయి .


నిజాయితీ పరులు......  మేధావులని పేరు తెచ్చుకున్న వారిని ఏదో నామ మాత్రంగా తమ చానళ్ళ లో చూపించిన వారు ..... నేర విచారణ మద్య లో ఉన్న ( ముఖ్య విషయం ఏమిటంటే నేరారోపణలను కోర్ట్ కొట్టేయ లేదు . ). సదరు నాయకుడి జైలు నుండి మొదలైన బెయిల్  యాత్ర చాలా ఛానళ్లలో  లైవ్ టెలి కాస్ట్ కాబడిందంటే అది కేవలం ఈ రాష్ట్రంలో నిజాయితీ మీద ... క్రింద నుండి పైకి ..... పై నుండి క్రిందికి వ్యాపించిన లంపెన్ ఆలోచనా ధోరణి విజయమే అని చెప్పొచ్చు.

1. వయసు పైబడిన స్త్రీ నెమ్మదిగా ట్రైన్ లో నుండి దిగుతూండ గానే దున్న పోతులా ఉన్న యువకుడు ఆవిడను గెంటుకుంటూ సీటు కోసం లోపలికి దూరి పోతాడు . "ఇదేమిటి" అని అడిగితే తన సీట్లో హాయిగా కూర్చుని చెవిలో యియర్ ఫోన్స్ పెట్టుకుని నీవంక కూడా చూడడు . 2. వన్ వే లో రాంగ్ రూట్ లో వచ్చి నిన్ను గుద్దేసి అదే స్పీడ్ లో నవ్వుకుంటూ సాగి పొతాడు . 3.. గుడి లో క్యూ లో నించున్న వారి పక్కగా ముందుకు పోయి పూజారి గారికి తన కొబ్బరికాయ ఇచ్చి దణ్ణం పెట్టేసి "ఆఫీస్ కు టైం అయిపోతోంది " అనేసి ప్రసాదం తీసుకుని హాయిగా వెళ్లి పోతాడు .

                    ఇలా రాసుకుంటూ పొతే కొన్ని వందల ఉదాహరణలు రాసుకుంటూ పోవచ్చు . దీనంతిటినీ ఒక నాయకుడి పేరు మీదే ..... జం అని పెట్టేస్తే బాగుంటుందేమో .

                      మాంచి ఇంజనీరింగ్ చదివేస్తే భేషైన ఉద్యోగం గారంటీ అవ్వొచ్చు కానీ అనేకానేక జటిలమయిన విషయాలు అర్ధం చేసుకొనడానికి ఎకనామిక్స్ మంచి సాధన మవుతుందని నా నమ్మకమ్. ..... ఇక ఉద్యోగ విషయానికొస్తే  మాకు పెద్ద లిచ్చిన నాలుగెకరాల పంట భూమి ..... మంచి ఇల్లు ఉన్నాయి .... మంచి పుస్తకాలు .... మోటార్ సైకిల్ తో బ్రతికే కళను మావాడికి నేను నేర్పగలిగితే చాలు.. వాడు అందరికంటే ఆనందంగా ఉంటాడు .
.










1, అక్టోబర్ 2013, మంగళవారం

మహాత్ములని తయారు చేద్దాం ........

                                                   పేజీల తరబడి మహాత్ముడి గురించి నాకంటే చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు . ఏమీ చదవకుండానే పిచ్చి వాగుడు వాగే వాళ్ళూ ఉన్నారు .  కానీ మహాత్ముడి లో ఉన్న ఒక గుణం లోపించి  ఈ  రోజు మొత్తం సమాజం తనకు తానే తన పీక ఎలా కోసుకుంటుందో ఒక్క సారి చూద్దాం . ఒక్క సారి  ఈ క్రింది డ్రాయింగ్  చూడండి .  



ఇది విశాఖపట్నం లోని ఒక ముఖ్యమైన ప్రాంతం . జాగ్రత్తగా పరికిస్తే  రెడ్ కలర్ తో హైలైట్ చేసిన రోడ్ కనబడుతుంది . ఆ రోడ్ ఏ .. ఏ ... ముఖ్యమైన రోడ్ల మద్య కనెక్టివిటీ  ఏర్పరుస్తుందో ... చూస్తే దాని ప్రాధాన్యం అర్ధమవుతుంది . 

ఈ రోడ్ వేయడానికి గల నేపధ్యం ఒక సారి చూద్దాం . NAD జంక్షన్ నుండి అక్కయ్యపాలెం సెంటర్  వరకూ దిగువ వైపు మర్రి పాలెం , కంచరపాలెం , అబిద్ నగర్ లాంటి కాలనీ లు ఉంటే ఎగువన మురళీ నగర్ , మాధవదార , కైలాసపురం , నరసింహ నగర్ లాంటి కాలనీ లు ఉన్నాయ్ . ఎగువన ఉన్న కాలనీ వాసులంతా జగదాంబ ......డాబా గార్డెన్స్ లాంటి ప్రాంతాలకు వెళ్ళాలంటే మాప్  లో చూపిన అక్కయ్యపాలెం రోడ్ మీదుగానే వెళ్ళాలి . ఒక్క సారి అక్కయ్య పాలెం రోడ్ వంక చూస్తే రోడ్ అంతా ఒకే వెడల్పులో ఉండదు . రెండు చోట్ల సన్నగా ఉంటుంది . సన్నగా ఉన్న చోట్ల రెండు మతాల వారి ప్రార్ధనా మందిరాలు కనబడతున్నాయి చూడండి . ఆ ప్రార్ధనా మందిరాలు పక్కన ఉన్న షాపు లను చూస్తే ఈ మందిరాలు ముందుకు వచ్చి నట్లుగా అర్ధమవుతుంది . నాకు నిజానిజాలు తెలియవు . కాకపొతే ఆ షాపు లు ఉన్న లైన్ ప్రకారం చూస్తే మాత్రం అవి ముందుకు వచ్చినట్లే అనిపిస్తుంది . నాకర్ధం కాని విషయం ఏమిటంటే దేవుడు ప్రజల పక్షం ఉంటాడా ...... ప్రజలకు శత్రువుగా ఉంటాడా ...... ఎవరైనా నాయకుడు పూనుకొని ప్రతి రోజూ వేల మంది ప్రయాణం చేసే ఈ రోడ్ ను వెడల్పు చేస్తారని ఎప్పటి నుండో చూస్తున్నాను . 

పైన చెప్పిన విషయం ఎప్పటికవుతుందో తెలియదు కానీ హై వే  కు సమాంతరం గా ఒక రోడ్ అభివృద్ధి చేద్దామనే  ఉద్దేశంతో కంచరపాలెం బ్రిడ్జ్ నుండి శంకర్ మఠ్ రోడ్ కు కలుపుతూ ఒక పెద్ద రోడ్ ను ప్లాన్ చేసారు . కానీ సర్వే చేస్తున్నప్పుడే అవాంతరాలు ....... ఆటంకాలు పరిగణన లోకి తీసుకున్న పిదపే ఏ పనైనా ప్రారంభిస్తారు . కానీ విచిత్రంగా నేను "?" మార్క్ చేసిన చిన్న ముక్క దగ్గర కొన్ని గుడిసెలు మాత్రం గత ఐదారు సంవత్సరాలుగా అలాగే ఉన్నాయి. ఒక వేళ ఆ గుడిసెలలో ఉన్న వారే ఆ స్థలాలకు హక్కు దార్లైతే ముందుగా వారి ఆమోద పత్రం ఖచ్చితంగా తీసుకోకుండా  ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా ప్రారంబించారు ? ఒక పెద్ద రోడ్ కు పక్కగా ఉండే ఫ్లాట్ కొనుక్కుంటే ముందు ముందు లాభ సాటి గా ఉంటుందని  లోన్ లు  తీసుకుని  కొనుక్కున్న మధ్య తరగతి ఉద్యోగ వ్యాపార వర్గాల వారు మొత్తానికి వెర్రి వెధవల్లా మిగిలారు. 

వోటు బాంక్ రాజకీయాలలో...... మత మౌడ్యం ..... అవకాశవాద  రాజకీయాల మద్య  సమిధలుగా మారుతున్న వాస్తవాన్ని ప్రజలు ఎప్పటికి గుర్తిస్తారో అర్ధం కాకుండా ఉంది .ఇక్కట్లు పడేదీ వారే .... ఈ మందిరాలను పక్కకు జరపకుండా అడ్డుపడేదీ వారే .... 

ఈ సందర్భం లోనే మహాత్ముడు నాకు గుర్తుకు వస్తున్నాడు . టికట్ ఉన్నప్పటికీ తనను బయటకు గెంటేసిన దౌర్జన్యాన్ని సహించలేక నే కదా ఒక సామాన్యుడి నుండి మహాత్ముడిగా మారాడు .  మన చుట్టూ జరుగుతున్న ఈ చిన్న చిన్న అన్యాలయాను పట్టించుకోని మనం "నిర్భయ్" కు సపోర్ట్ గా ఊరేగింపులు చేస్తాం . అవును మరి  ఈజీ గా .... ఏ మాత్రం రిస్క్ లేకుండా హీరో కావాలిగా ...... కనీసం మన అవసరాల కోసమైనా మనం కొద్దిగా స్పందించగలిగితే   ముందు ముందు కొంతమందైనా మహాత్ములు తయారయ్యే అవకాశం ఉంటుంది . 

మత మౌడ్యం ..... అవకాశవాద  రాజకీయాల మద్య       మహాత్ములని తయారు చేద్దాం ........