30, మే 2013, గురువారం

నిజాయితీ కెరటం కావాలి...

మా మూర్తి నాతో వాదించడంలో గొప్ప ఆనందాన్ని పొందుతాడు. అవేవో గొప్ప గొప్ప విషయాలనుకొంటే పొరబాటే. చాలా చిన్న చిన్న విషయాలనే కావాలని పొడిగిస్తుంటాడు.

"బంగారు లేడి ఉండదు కదా..." ఒక రోజు సడన్ గా అడిగాడు.

" వెండిది...రాగిది...కూడా ఎక్కడా ఉండదు"

"ఏ యుగాల్లో కూడా ఉంది ఉండదు కదా..."

"అందులో ఏ విధమైన సందేహమూ ఉంచుకోకు"

" ఆ విషయం ఒక మహారాజు కూతురు సీతా దేవికి తెలియదా...?"

" సరేలే  ..అందుకేగా రామాయణం జరిగింది"

" అది కాదు సహజత్వానికి ...దూరంగా ఉన్నప్పుడు దాంట్లో ఏదో తిరకాసుందన్న విషయాన్ని ముందుగా ఎందుకు గ్రహించలేదంటావ్"

"లక్స్మణుడు చెప్పాడుగా....ఇదోదో మోసమని...ఐనా నీకు అదంతా ఎందుకు దానివలన రావణ సంహారం    జరిగి లోక కల్యాణం జరిగింది కదా. పైగా మానవ జన్మ లో లక్ష్మీ దేవి పుట్టింది కాబట్టి సహజంగా  మానవ స్త్రీలకుండే లక్షణాలు  ఉండాలి కదా"


"సరేలే పురాణ స్త్రీల  సంగతి వదిలేద్దాం...మన ఇళ్ళ లో స్త్రీల విషయానికి వద్దాం...నీ చొక్కా వాషింగ్ మెషీన్ లో వేసే ముందు మీ శ్రీమతి నీ జేబూలు చెక్ చేస్తుందా...."

"సహజంగానే....ఇలాంటివాటిలో ఆమె చాలా జాగ్రత్తగా ఉంటుంది....తను స్ట్రిక్ట్ ఫైనాన్స్  మేనేజర్...కాష్ బాలన్స్ మొదలైనవన్నీ ఖచ్చితంగా అడుగుతుంది......"

"తక్కువ వస్తే సరే..అడుగుతారు..ఒక వేళ నీ పాకెట్ లో ఎక్కువ కాష్ ఉంటే ...."

"అమ్మో అప్పుడు మరీ జాగ్రత్తగా అడుగుతుంది....ఎందుకంటే ఆ కాష్ నేనెవరి  దగ్గరో తీసుకున్నట్లే కదా...ఒక వేళ నేను ఎక్కువ అరువు తీసుకుని కొంత ఖర్చు పెట్టేసి..మిగిలింది ఉంచానేమో....బాకీలు లాంటివి ఉంచడం ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు.అంతే కాదు ఎవరి దగ్గర తీసుకున్నాను..ఎందుకు తీసుకున్నాను లాంటివన్నీ అడిగి జాగ్రత్తగా జ్ణాపకం పెట్టుకుంటుంది...కరెక్ట్  గా చెప్పాలంటే ఆవిడ బ్రెయిన్  లో ఒక మినీ టేలీ పేకేజ్  ఉంటుంది"

"ఇంచుమించు మా శ్రీమతి కూడా అలానే ఉంటుంది....అంటే భార్యలంతా ఇలానే ఉంటారంటావా...."

"అలా ఉంటేనే కదా....సంసారాలు కాస్త సుఖంగా ఉండేది...మనకు ఇంత ఆదాయముంది....ఇంత ఖర్చుంది అని వాళ్ళకు ముందు గానే చెప్పేస్తే మిగిలిందంతా వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు...ఐనా ఇదంతా ఎందుకు అడుగుతున్నావ్...పనేమీ లేదా ...ఎస్టిమేట్స్ అన్నీ చేసేసావా..."గయ్యిమన్నాను

"అలా కాదు బాస్..... మొన్నొక వార్త పేపర్ లో చూసినప్పటి నుండీ గుండె చెరువై పొతోంది...పాపం ఒకావిడ ...తన అమాయుకుడైన భర్తను అన్యాయంగా జైల్లో పెట్టి హింసుస్తున్న..."

"మెలో...డ్రామా తగ్గించి అసలు విషయానికి రా"

"పాపం ... ఒక పోలీస్ ఉన్నతాధికారి దగ్గరికి వెళ్ళి....ఆయనకు పిల్లా జెల్లా లేరా అని కూడా అడిగింది"

"ఆహా...." లాప్ టాప్ లొ తయారు చేస్తున్న డ్రాయింగ్ మీదే నా దృష్టంతా  ఉంది.

"ఆవిడ భర్తను అంతా కలిసి కేసుల్లో ఇరికించారట...సంవత్సర కాలం నుండీ పిల్లలు నాన్నను చూడనే లేదంట...."

" పాపం.." మూర్తి తో నాకు మామ్మూలే కాబట్టి నేను పెద్దగా స్పందించ లేదు.

"మరీ నీకు సామాజిక స్పృహ లేకుండా పోతోంది ప్రసాదూ...బెల్లం కొట్టే రాయిలా అలా కదలకుండా ఉంటావేంటి..."

"చూడు బాబూ....నాకు చాలా పని ఉంది నన్ను వదిలి పెట్టు....ఒక వేళ ఆవిడ మాటలకు పోలీస్ అధికార్లు కరగక పోతే...జ్యుడీషియరీ ఉంది...పెద్ద పెద్ద జడ్జీలు ఉన్నారు...."

"పూర్తిగా  వినిపించికోవేం...ఆవిడ కోర్ట్ లొనే అడిగింది."

" సారీ.....చాలా ముఖ్యమైన వార్తని ఎవరైనా అంటేనే గాని యీ మద్య నేను పేపర్ చూడ్డం లేదు.....ఇంతకూ ఆ పోలీస్ అధికారి బోనులో ఉండగానే ఆవిడ అలా అడిగిందా...ఏమని అడిగింది ఇంతకూ..."

" ఆ పోలీస్ అధికారి బోనులో లేడు ఐనా పాపం ఈవిడ ఒక సారి మనస్సాక్షిని పరిశీలుంచుకోమని  ఆ అధికారిని కోరింది. అలా చేస్తే ఆవిడ భర్త యే తప్పు చేయాలేదని ఆ పోలీస్ అధికారికి అనిపిస్తుందంట..."

"చీ...ఆవిడను చూసి మన శ్రీమతులు చాలా నేర్చుకోవాలి కదా...భర్తంటే ఎంత నమ్మకం....ఇంతకూ ఆమెభర్త మీద ఎవరికి అంత కక్ష  ఉంది పాపం ?"

మూర్తి ఒక పెద్ద లిస్ట్ చెప్పాడు.

"నీవు ఎప్పుడో వచ్చిన కలిసుందాం రా అనే సినిమా చూసావా.....దానిలో తన వారి నుండి  తప్పిపోయిన ఒక కుర్రాడిని ఒక పోలీస్ కానిస్టేబుల్ పలకరించేసరికి ఆ కుర్రాడు ...మా తాతయ్య,నానమ్మ,అమ్మ......అంతా తప్పిపోయారంకుల్ అంటాడు.అలాంటి కాకమ్మ కబుర్లు నా దగ్గర ఇంకెప్పుడూ చెప్పకు.....ఇప్పుడే అనుకున్నాం...100 రూపాయలు యెక్కువ వచ్చినా ...తగ్గినా మన భార్యలు గయ్యిమంటరని....పాపం ....రెండు మూడు సంవత్సరాలలొనే ఉన్నదానికి వందల రెట్లలో ఆస్తులు పెరుగుతుంటే....ఇదంతా ఎలా వస్తుందని అడగని   సాధ్వీమణి  ఆమె ఐతే అయ్యొండొచ్చు ....కానీ  మిగిలిన వారంతా మరీ చెవిలో పూవులు పెట్టుకుని లేరు కదా.....

1978 లో ఎమెర్జన్సీ లో జరిగిన ఘోరాలు ఎన్నో పేపర్లో వచ్చినా కూదా ...శ్రీమతి  గాంధీ   ప్రజలముందుకు వచ్చి....మగ నాయకులంతా నన్నొక్క ఆడదాన్ని చేసి అణగ దొక్కాలని చూస్తున్నారరని కన్నీరు కార్చగానే మన వాళ్ళంతా ఆ పార్టీకి వోట్లు గుద్దేసారు. ఆ ట్రిక్ మరలా ఒక సారి ట్రై చేస్తున్నారేమో..."

"బాసూ....నీ ఉక్రోషాన్ని తగ్గించుకో..లేదంటే ఎవరో ఒకళ్ళు నీ కాళ్ళు విరగ్గొట్టడం ఖాయం"

" మంచిదే బాస్....ఒక ఉద్యమంతో అరెస్ట్ అయి..జైల్లో పెట్టబడి నప్పుడు వాళ్ళ సిద్దాంతాల కోసం మేము కూడా వాళ్ళ వెనుకే ఉండేవాళ్ళం. కానీ  యీ పార్టీ సిద్దంతం ఏమిటి...అధికార సంపాదన...జైల్లో పెట్టబడడానికి కారణం ఏమిటి...ఒకటా రెండా....నీకొక సంగతి నేను చెప్పనక్కర లేదనుకో....మనం ఒక కాంట్రాక్టర్ కు కావాలని ఎక్కువ గాని ..తక్కువ గాని బిల్ చస్తే వెంటనే చార్జ్ షీట్ ఇస్తారు. ఉద్యోగానికి ఎసరు కూడా వస్తుంది. మరి ఒక పార్లమెంట్ మెంబర్ ను అకారణంగా జైల్ లో ఉంచి తమకు ముప్పు తెచ్చుకొనే జడ్జీలు...అధికార్లు ఉంటారా...ఒక పక్క నిజంగా అలా లొంగి పోయిన అధికార్లు వూసలు లెక్క పెడుతున్నారు. మంత్రులు పదవులు కోల్పోతున్నారు.యీ విషయాలన్నీ పేపర్లలో వస్తూనే ఉన్నాయి.అవన్నీ అబద్దమే అన్నట్లుగా ఇలా కోర్ట్ సన్ని వేసాలు క్రియేట్ చేయడం.....

నేను కాలేజ్ చేరిన కొత్తలోనే కొన్ని సార్లు ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడు మా నాన్న గారు తాతయ్య బాగా తిట్టారు.ఎందుకంటే అప్పటికే నిజాయితీగా స్వాతంత్రొద్యమంలో పాల్గొని అన్నీ పోగొట్టుకొని దీనంగా బ్రతుకుతున్న వారి జీవితాలను చూసి.అన్ని విషయాల్లో నిజాయితీగా ఉండమని  మాత్రం చెప్పేవారు.కానీ యీ రోజు నేను నా పిల్లలకు నిజాయితీగా బ్రతకమని చెప్పాలంటే భయం వేస్తోంది.నేర పూరిత అభియోగాల మీద జైల్లో పెట్టబడి..సంవత్సర కాలం నుండీ బెయిల్  కూడా నిరాకరించబడిన వాడి వెనుక ఇంత మంది సమీకృతులవడం ఆశ్చర్యంగా ఉంది మూర్తీ....భయం వేస్తోంది..నా పిల్లలకు ..మోసం చేయడం తప్పు....ఒకళ్ళకు అన్యాయం చేయడం  తప్పు....కష్టపడు ..వచ్చిన దానితో తృప్తిగా ఉండు లాంటివి నేర్పి తప్పు చేస్తున్నానేమోనన్న ఫీలింగ్ వచ్చేస్తోంది....మొన్నటి వరకూ సిద్దంతాలు లేని పార్టీలు పాలించేతున్నాయనే బాధ పడే వాడిని ఇప్పుడు నేరస్తుల ముఠాలు పాలిస్తాయేమోనని భయం వేసిపోతోంది" నా శరీరం కంపించడం చూసి మూర్తి దగ్గరకు వచ్చి భుజమ్మీద చేయి వేసి చెప్పాడు

"ఇప్పుడు నీవొక్కడివే కావొచ్చు..చూస్తూ ఉండు నీతో నడవడానికి చాలామంది తయారవుతారు...రొచ్చు ఎల్లకాలం సుఖాన్నివ్వదు. అవసరం కోసమే కొంతకాలం దానిని భరిస్తారు...కొంతకాలం ఓపిక పట్టు...మన విశాఖ సముద్ర కెరటంలా మంచి నీరు వచ్చి యీ రొచ్చును ఆనవాలు కూడా లేకుండా  తుడిచిపెట్టేస్తుంది. "

26, మే 2013, ఆదివారం

జనజీవన స్రవంతి.....?


కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసాను. ఎదురుగా ఒక యువకుడు. మాంచి హుషారుగా ఉన్నాడు.

" సార్...ప్రసాద్ గారు......"


" అవును నేనే....."మీరెవరన్నట్లు  చూసాను.


"లోపలికి రావచ్చా సార్" 


చొరవగా లోపలికి వచ్చాడు.


"ఆశ్చర్య పోకండి సార్...నన్ను మీ ఫ్రెండ్---- పంపించారు"


వాడెందుకు పంపాడో నాకర్ధం కాలేదు.


"అంతగా అలోచించకండి సార్....మీ గురించి మీ ఫ్రెండ్ కరెక్ట్ గానే చెప్పారు"
అప్పుడే నా గురించి ఒక అంచనాకు  ఎలా వచ్చాడబ్బా అనిపించింది.
మరలా అతడే కొనసాగించాడు.


మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారటగా?"


ఉలిక్కి పడ్డాను


అమ్మాయికి సంబందాలొస్తున్నాయని వాడితో అన్నాను కానీ మా అవసరంగా వాడికి చెప్పిన గుర్తేమీ రాలేదు నాకు. అదే విషయం ఆ యువకుడికి చెప్పాను.


" మీకు ఆ ఉదేశ్యం అయితే లేదు సార్...కానీ నేను చెప్పింది వింటే మాత్రం ఇప్పుడే ఆ ఏర్పాట్లు చెయ్యమంటారు" 


"ఏ యేర్పాట్లు..." నాకంతా పజిల్ గా అనిపించింది...అసలు ఆకలే లేదన్న వాడికి తిండి తినమని బలవంత పెడుతున్నట్లు గా అనిపించింది. అందుకే అడిగాను.


"ఇంతకీ మీరెవరు?"


" భలే అడిగారు సార్..నా గురించి అడిగారంటే ఖచ్చితంగా నేను చెప్పేది వింటారు..అడిగారు కాబట్టి చెబుతున్నాను...మాది యీ టౌన్ లో కల్లా నం.1 ఈవెంట్ మేనేజింగ్ కంపెనీ. నేను దానిలో ఎగ్జిక్యూటివ్  ని" 


" కానీ మా ఇంట్లో ఇప్పుడేమీ ఫంక్షన్..గానీ ఈవెంట్ గానీ లేదే..." 


మీరెందుకొచ్చారన్నట్లు అడిగాను.

"ఉండక పోవచ్చు సార్.....నేను మీకు ఒక విషయం చెబుతాను అప్పుడు మీకు ఎలాంటి సందేహాలూ రావు.ఆకలి బాగా వేస్తుందనుకోండి....మీ అంత మీరే ఇంటికి వెళ్తారు లేదా హోటల్ కోసం వెదుక్కుంటారు. మరి ఇప్పుడు  పెరుగుతున్న మాల్స్ కు వెళ్ళి చూడండి....షాపింగ్ చేసిన తరువాత మిమ్మలని ఆకలున్నా లేకపోయినా లోపలికి వచ్చేలా చేస్తున్నాయా లేదా అక్కడి ఫుడ్ కోర్ట్ లు ....అలాగే మేమూ కూడా .."


"నాకర్దం కాలేదు"  అదే మాట పైకి కూడా అన్నాను.


"అవసరం ఉన్నవాడికి కావలిసింది సప్లై చేయడమన్నది పాత టెక్నిక్ ....కానీ లేని అవసరాన్ని సృష్టిచడమే కొత్త టెక్నిక్. ఉదాహరణకు మీకు మరో రెండు సంవత్సరాలకు కారు కొనే అవసరం పడొచ్చనుకోండి ...మీ చేత ఇప్పుడే అది కొనిపించగలగడమే కొత్త సేల్స్ టెక్నిక్. "


"అది సరే మాకు నీవు చెప్పే టెక్నిక్ లకు సంబందం ఏమిటి?"
"మీ ఫ్రెండ్ ద్వారా మాకు మీ ఇంట్లో రెండు మూడు సంవత్సరాలలో పెళ్ళి చేయవలసిన అమ్మాయి ఉందని తెలిసింది. కాబట్టి మా కంపెనీ ఈవెంట్ మేనేజ్ మెంట్ లొ కొన్ని విన్నూత్న పద్దతులు తో మార్కెట్ లో దూసుకు పోతోంది దాంట్లో కొన్ని మీకు చెబితే ఆ కొత్త దనానికి మీరే ఎప్పుడో చేయవలసిన పెళ్ళి వెంటనే చేయాలనుకుంటారు."


ఎందుకో నాక్కూడా కాస్త ఇంటరెస్టింగ్ గా ఆనిపించించింది. ఆ యువకుడిని చెప్పనిచ్చాను. 


"పెళ్ళి అనేది పెద్ద ఫంక్షన్.... కానీ దాని ముందుగా కొన్ని పిల్ల  ఫంక్షన్ లు కూడా ఉంటాయి. మన తయారీ అంత అక్కడ నుండి ఉండాలి. అవి సక్సెస్ అయితే పెద్ద ఫంక్షన్ సక్సెస్ అవుతుంది. అంతే కదా సార్..అసలు ముందుగానే మనం కొత్తదనంతో అదరగొట్టేస్తే మగ పెళ్ళి వారు మానసికంగా మనకు దాసోహమై పోతారు.ఒక్కసారి మాయా బజార్ సినిమా గుర్తుకు తెచ్చుకోండి. "


బాగానే చెప్పాడనిపించింది.


"అందుకు మనం కొన్ని కొత్త పద్దతులలో వెళ్ళాలి."


" మాంచి డెకొరేషన్ ల మీద....వంటల మీదా మా వాళ్ళు చాలా రకాల ప్రయోగాలు చేసారు...ఇంక కొత్తగా చేయడానికేమీ మిగల లేదనుకుంటా....." నా మనసులో మాట చెప్పాను.


" చూశారా మీరు కూదా మా కంపెనీ ని తక్కువగా అంచనా వేస్తున్నారు...ఎవరి దృష్టీ వెళ్ళని చోట  మేము చొచ్చుకు పోయి వినూత్న పద్దతులు ఆవిష్కరిస్తాం"


గ్రాంధికం కొంత ఎక్కువైందనిపించినప్పటికీ టాపిక్ మధ్యలో అంతరాయమెందుకని కొనసాగనిచ్చాను.


"సాధారణంగా అన్నీ ముందే మాట్లాడుకున్న తరువాత పెళ్ళికూతురింటికి నిశ్చయ తాంబూలాలు యీయడానికి లేదా పుచ్చుకొనదానికి వరుడి తరుపువారు మీ ఇంటికి వస్తారు ..అవునా...."
ThumbnailThumbnailThumbnail
"మామ్మూలే కదా.."

"ఇక్కడే మనం కొంత వెరైటీ చూపిస్తాం. పెళ్ళి కొడుకుతో బాటు అతడి ఫ్రెండ్స్ మరో పది మంది వస్తారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి మన చిన్న స్వయంవరం సీను సృష్టిస్తామన్న మాట. మీ అమ్మాయి కోసం చాలా మంది పోటీ బడితే అందులో కల్లా యోగ్యుడిని అమ్మాయి  వరించినట్లన్న  మాట"


"అదెలా కుదురుతుంది..పాత రోజుల్లో అయితే యేదో ఒక పరీక్ష పెట్టే వారు...గెలిచిన వాడికి అమ్మాయినిచ్చే వారు....."


" చూసారా....పరీక్ష పెట్టే వారని మీరే అనేసారు..గొడవే లేదు..మనం కూడా అదే చేస్తాం"


"వూరుకోవయ్యా బాబూ....అబ్బాయిని ముందుగానే ఖాయ  పరుచుకుంటాం కదా. కొంపదీసి యీ పరీక్షలో ఇంకెవడైనా  ఎక్కువ మార్కులు తెచ్చేసుకుంటే...."


"మా వాడు మరీ ముక్కు సూటిగా పోతాడు....వాడితో నీవు పడ  లేవని మీ ఫ్రెండ్ కరెక్ట్ గానే చెప్పారు సార్.....అంతే కాకుండా మీరు మరీ పాత తరం వారు కూడా సార్....పరీక్ష ఎవరెలా రాసినా మన అల్లుడి గారికే కదా ఫస్ట్ వచ్చేది...అంతా  మాచ్  ఫిక్సింగే కదా....."


"అంతా ఫిక్స్ అయిన తరువాత యీ టెస్ట్ లు పెట్టడం ..ఇవన్నీ యేమి బాగుంటుంది "


మీకెలా చెప్పాలో తెలియడం లేదు. చాలా మాచ్ లు ఫిక్స్ అవుతాయని చూసే వాళ్ళకు తెలియదా.....అయినా చూడ్డం లేదా....ఇప్పుడంతా బాగుందా ..లేదా అనే కాన్సెప్ట్ కాదండీ బాబూ...వెరైటీగా ఉందా .....లేదా....అంతే..."


నిజమే అనిపించింది. మా శ్రీమతి..మిగిలిన ఆడవాళ్ళతో  బజారుకి వెళ్ళినప్పుడు "కొత్త వెరైటీలు యేమొచ్చాయో చూపించండి" అనడం చాలా సార్లు విన్నాను.


" అసలు యే పరీక్ష పెడతాం" అడిగాను.


"ఏముంది సార్.....నీవు ఆఫీస్ నుండి ఆలశ్యంగా వచ్చావని మీ శ్రీమతి  అలిగితే నీ రియాక్షన్ ఎలా ఉంటుంది....రెందు పేజీలలో రాయండి  అని దూరంగా కూర్చో పెట్టి అందరికీ తెల్లకాగితాలిస్తాం"


"ఎలాగూ ఫిక్స్ అయ్యిందే కదా అని మిగిలిన వాళ్ళు ఏదో చెత్తంతా రాస్తారేమో...."


"అలాగేమీ ఉండదు సార్...ప్రతివాడూ చాన్స్ ఇస్తే తన తెలివికి పదును పెట్టాలనే చూస్తాడు. ఉదాహరణకు మిమ్మల్నే అడిగితే  యేమి రాస్తారో చెప్పండి" 


" ఇప్పటి దాకా టార్గెట్స్ పూర్తవలేదని బాస్ తో చీవాట్లు తిని ఇంటికి వస్తే ......నీ వెధవ కోపమొకటా వెళ్ళెహే...." అని కసిరేస్తాను. 


ఆ కుర్రాడు వంటగది వైపు జాలిగా చూసాడు.


"మీరు పెద్దవారై పొయ్యారు కాబట్టి అలా అన్నారు కానీ కుర్రాళ్ళు అలా అనరులెండి"


పాపం సాఫ్ట్ వేర్ కంపెనీ ల లో పని చేసే వారితో   యీ కుర్రాడికి అనుభవం కాలేదనుకున్నాను. 


"ఆ తరువాతేమి చేస్తారు"


"యేముంది సార్.......వాళ్ళు రాసిచ్చిన పేపర్స్ దిద్దిస్తాం.....పెళ్ళికొడుకు ఫస్ట్ వచ్చాడని అనౌన్స్ చేయిస్తాం. ఇక్కడే మాలో ఉన్న వెరైటీ   చూపిస్తాం. పరీక్ష రాసే వాళ్ళందరికీ మంచి మంచి టేబుల్స్  అరేంజ్ చేస్తాం. వాటిమీద అందమైన పూల గుత్తులు....స్వీట్స్....అల్పాహారాలు.....ఇంకా వెరైటీ  కోసం చికెన్ జాయింట్లు.. ...అబ్బో చూసే వారికి నిజమైన స్వయంవరం అన్న ఫీలింగ్ వచ్చేస్తుందన్న మాట.."


"అబ్బో ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్న పనేనే ..."


" అస్సలు కాదు...మేమెప్పుడూ మా కష్టమర్లను ఇబ్బందులకు గురిచేయం....ఇవన్నీ మీరు ఒరిజినల్ యేమాత్రం కొనక్కరలేదు. అవన్నీ ఒరిజినల్ కంటే బాగుండే ప్లాస్టిక్ వే  మేము సప్లై చేస్తాం..."


"హమ్మయ్య బ్రతికించారు..లేదంటే మా వాడు ఆ చికెన్ జాయింట్ల వైపే కక్కుర్తిగా చూస్తుండిపోతాడు...వధువు తమ్ముడినన్న సంగతి కూడా మరిచి......ఇంతకూ పరీక్ష సంగతేమిటి?"


" మీ బంధువులలో  ఉన్న ఒక అందమైన అమ్మాయి ..అందరి ముందుకూ వస్తుంది....ముద్దుగా ఉన్న చిన్న కుర్రాడు గానీ పాప గానీ ఆమెకు ఒక సీల్డ్ కవర్ ఇస్తారు.ఆవిడ  దానిని సుతారంగా ఓపెన్ చేసి విన్నర్ పేరు ప్రకటిస్తుంది. మిగిలిన వారంతా యీలలు చప్పట్లతో దానికి ఆమోదం చెబుతారన్న మాట."


"మరీ ఆర్టిఫీసియల్ గా అనిపించట్లేదూ...."


"మీరు చాలా మారాలి సార్...జన జీవన స్రవంతి లోకి రావాలి...మీరు మరీ ఆడివిలో  ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు......ఒరిజినల్  అనేది ఇక ఉండదు సార్...అంతా ఆర్టిఫీసియల్లే ఉంటుంది.. దాన్ని ఎంజాయ్  చేయడం అలవాటు చేసుకోండి. లేదంటే సమాజానికి దూరమైపోతారు. మిగిలిన వారంతా మారిపొయ్యారన్న ఉద్దేశ్యంతోనే  కదా పెళ్ళిళ్ళలో కూడా కాడ్బరీ డైరీ  మిల్క్ చాక్లెట్లు తింటున్నట్లు చూపిస్తున్నారు. మీరేమో ఇంకా జిలేబీ...పరమాన్నం అంటూ కూర్చుంటే.....లాభం లేదు సార్.....సరే ఇంతకూ మన వాళ్ళంతా చప్పట్లు కొట్టగానే బయట రంగురంగుల బెలూన్లు గాలిలోకి వదలదం లాంటివి ఉంటాయి...ఎలా ఉంది సార్...."


నా అభిప్రాయం చెప్పేలోగానే అతడు తరువాతి ఘట్టానికి  వెళ్ళిపోయాడు.


" ఇక పెళ్ళి తంతు అందరికీ మరుపురాని అనుభవంగా మలచడంలో  మాకు పెట్టింది పేరు సార్"


నేను మద్యలో  మాట్లాద దలుచుకోలేదు. అంతా విన్న తరువాతే నా అభిప్రాయం చెప్పేయదలుచుకున్నాను.


"సహజంగా మగ పెళ్ళి వారు విడిదింట్లో  దిగడంతో పెళ్ళి తంతు ప్రారంభమైనట్లే....."


అవునన్నట్లుగా తలకాయ వూపాను.


"విడిదింట్లో పానకం మొదలైనవన్నీ మా ప్రత్యేకమైన పర్షియన్ గాజు గ్లాసులతో యెలాగూ వడ్డిస్తామనుకొండి......ఇదంతా మామ్మూలే....అసలు విషయం దీని తరువాతుంది.అబ్బాయి విడిదింటి నుండి పెళ్ళి మండపానికి తరలి వెళ్ళడానికి యేడుగుర్రాలు లాగే రధాన్ని ఏర్పాటు చేస్తామన్న మాట. "


"నిజంగా గుర్రాలు లాగే రధం ఉందా..." మద్యలో అడగక తప్పలేదు.


"కరెక్ట్ గా అడిగారు సార్..నిజంగా గుర్రాలు లాగావు ఒక  కార్ను ఆ విధంగా తయారు చేయించాం.డ్రైవర్ నెమ్మదిగా పోనిస్తుంటాడు...గుర్రాలు జుస్ట్ నడుస్తూ ఉంటాయంతే...."


"ఏడుగుర్రాలెందుకు...రెండు మూడు సరిపోతాయిగా...."


" మరదే చిరాకు ..ప్రతి దానికీ రీజనింగ్ అడుగుతారు....మీ అమ్మాయి బాగా చదివి మంచి ఉద్యోగం చేస్తుందని మీ ఫ్రెండ్ చెప్పాడు ..మరలాంటప్పుడు ఏదో గొప్ప సంబంధమే  తెస్తారుగా...అందుకే మీ కోసం యీ స్పెషల్ ఏర్పాటు....మన దేవుళ్ళను  కూడా సప్తాశ్వ  రధ మారూఢం....అని స్తోత్రం చేయడంలేదూ....అప్పుడు యెందుకు రాదు యీ సందేహం?...ఇంకొకటి వినండి సార్...వరుడి కి అటూ ఇటూ వేరే గుర్రాల మీద కూడా నలుగురు సైనికులు శిరస్త్రాణాలు  వగైరాలు ధరించి గుర్రాల మీదే ఫాలో అవుతుంటారు."


"ఆ....." నోరు వెళ్ళ బెట్టాను


" అంతే కాదు వరుడి చెంతే వింజామరలతో నలుగురు చెలికత్తెలు ఉంటారు"


"అంటే ఐ.పీ.ఎల్. లో  చీర్ గాల్స్ లాగా"


" మొత్తానికి నేను చెప్పేదంతా బాగానే కాచ్ చేస్తున్నారు" 


"మరి గుర్రాలు పాస్ పోయడం లాంటివి చేస్తే పెళ్ళికొడుకు బట్టలు పాడవుతాయేమో. ....రధం పెద్దది గానే ఉంటుందా?


"మీకా సందేహం అక్కరలేదు...అవన్నీ స్పెషల్ గడ్డితో పెంచబడ్డవి...ఎక్కడ పడితే అక్కడ  పాస్ పోయడం....లద్దె వేయడం చేయవు....."


"ఓహో...."


"వరుడు పెళ్ళి మండపం చేరుకోగానే  రధం నుండి దిగడం అంతా...క్లోస్డ్ సర్క్యూట్ టీ వీ లలో చూపిస్తూ ఉంటాం కాబట్టి వరుడు రధం నుండి పెళ్ళి మండపం దగ్గరకు వెళ్ళే వరకూ ఆహూతులందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. అంటే వాళ్ళంత వాళ్ళు కొట్టరు.మా వాళ్ళు  ముందుగా జనం లో కలసి పోయి చప్పట్లు కొట్టడం ప్రారంభిస్తారు. పెద్దగా ఏమీ ఆలోచించకుండా పక్క వాడు చేసినట్లు చేయడం అలవాటు కాబట్టి వచ్చిన వాళ్ళంతా చప్పట్లు కొట్టేస్తారు. చూసారా సార్...వూహించుకుంటుంటే ఎంత అద్భుతంగా ఉందో"


కానీ భోజనాలవ్వగానే చాలామంది వెళ్ళి పోతున్నారు... పెళ్ళి మండపం దగ్గర చప్పగా ఉంటోంది..."


"దానికీ మా దగ్గర విరుగుడు ఉంది. ఆడ వారు భోజనం చేసేటప్పుడు అందరికీ కూపన్లు అందజేస్తాం. పెళ్ళి అయిన తరువాత డ్రా తీసి గెలిచిన వారికి 25000 రూపాయల పట్టు చీర అని ప్రకటిస్తాం. ఇక చూస్కోండి ఎక్స్ట్రా కుర్చీలు వేయించ వలసిందే."


"ఇది కూడా ఫిక్సింగేనా...."


"చాలా తెలివైన వారు సార్ ....చిన్న హింట్ దొరికితే చాలు ప్రొసీడ్ అయిపోతారు  మనమిచ్చే పట్టు చీర కోసం అన్ని పట్టు చీరలు పెళ్ళి మండపం అంతా అటూ ఇటూ తిరుగుతుంటే రంగులతో...రెప రెప లతో హాల్ కళ కళ లాడి పోతుంది సార్..."


"కానీ ఇదంతా రక్తి కట్టాలంటే ఎంత మంది జనం ఉండాలంటావ్?"


" రెండు వేలకు పైనే ఉంటే బాగుంటుంది సార్..."


"నా మొబైల్ లో 200 ఎంట్రీస్  ఉన్నాయి.....అందులో మా సివిల్ ఇంజనీరింగ్ అవసరాల కోసం ఉన్న ఆర్టిజన్లు 20 మంది....ఇలాంటివన్నీ తీసేస్తే నాక్కావాసిన వాళ్ళు మహా ఉంటే 100 మంది కంటే ఎక్కువ ఉండరు. మా శ్రీమతి నేనూ ఒక వూరి  వాళ్ళమే కాబట్టి మా ఇద్దరి బంధువులూ చాలా వరకూ కామన్ గా ఉన్న వాళ్ళే....అలాగే మా అమ్మాయికి కావాల్సిన వాళ్ళు కూడా మరో 100 మంది వరకూ ఉంటారేమో...యీ 2000 మందిని యెలా పట్టుకు రాగలను."


"మీలా అలోచిస్తే మా లాంటి వాళ్ళు బిజినెస్ చేసింట్లే....మీరు మీ ఫ్రెండ్స్ పార్టీలకు వెళ్ళి నప్పుడు పరిచయం ఐన వాళ్ళుంటారు కదా.....అలా ఒక్కొక్క ఫ్రెండ్ ని కదిపితే నేను చెప్పిన సంఖ్యకు అదే చేరుతుంది"


" కానీ చాలా ఖర్చు కూడా అవుతుందే..."


నాకెందుకో చాలా చిరాకుగా అనిపిస్తోంది.


ఇంతలో ఆ యువకుడు మరింత  దగ్గరకు జరిగాడు.


" ఇంట్లో వాళ్ళకు కూడా తెలియనీయకండి సార్....మీరంటే ఉన్న ప్రత్యేకాభిమానం వల్ల ఒక మాంచి అయిడియా చెబుతాను......ఒకే చోట రెండు వేల వోట్లు....వచ్చే సంవత్సరం ఎలక్షన్స్...కాబట్టి ఏదో ఒక రాజకీయ పార్టీ ఫ్లెక్షీలకు పర్మిషన్ ఇద్దాం...మిగిలిన దంతా వాళ్ళే స్పాన్సర్ చేస్తారు. అందులోనూ కొత్తగా రంగం లోకి వచ్చిన పార్టీ ఒకటి ఎలాగూ ఉంది. వాళ్ళు ఎక్కడ అవాకాశం దొరికినా  ఫ్లెక్సీలు  పెట్టే చాన్స్ వదలడం లేదు.....పైగా వాళ్ళకో చానల్.....పత్రికా ఉన్నాయి....."


మెచ్చుకుంటానేమో అని ఒక్క నిముషం ఆగాడు. అంతకు ముందు వరకూ అరికాలిలో ఉన్న మంట తలకెక్కడం ప్రారంభమయ్యింది. అయినా తమాయించుకుని చెప్పడం మొదలు పెట్టాను.


" విజయా వారి జగదేక వీరుని కధ సినిమా చూసావా...."Thumbnail
Thumbnail
Thumbnail
"చూడలేదు సార్...విన్నాను...ఏదో హీరో నాలుగు లోకాల అమ్మాయిలను పెళ్ళాదతాడని...ఇంకా పాటలు బగుంటాయని..." 

"ఇవన్నీ కరెక్టే గాని యీ సినిమా ప్రారంభంలో రాజు తన కుమారుడి కోర్కెలు అంటే నీవన్న నాలుగు లోకాల రాకుమారీలను పెళ్ళి చేసుకోవలనే కోర్కె విని...ఆహా..నా కొడుకెంత గొప్ప వాడు అని ఆనందించడు....ముందు రాజ్యం విడిచి పొమ్మంటాడు...ఎందుకంటే కాబోయే రాజుకు ప్రజల క్షేమం గురించి అలోచనలుండాలి కానీ అమ్మాయిల గురించి కాదని . ఎందుకో గాని ఆ రోజుల్లో ఆ నీతి నాకు చాలా బాగా నచ్చేది. మరి దానికి పూర్తి వ్యతిరేకంగా తన సంతానం కోసం రాష్ట్రాన్ని మొత్తం ఇష్టం వచ్చినట్లు దోచుకోనిచ్చిన వాడి పేరు నా కుమార్తె పెళ్ళి లోనా....అసలు నీకు నేనెలా కనబడ్డాను. నేనూ విద్యార్ధిగా ఉన్నప్పుడు...ఆ తరువాత ఉద్యోగం లోనూ కూడా నాయకుడిగానే ఎదిగాను. ఎందుకంటే ఆనాడు పోరాటం నా అవసరం...నా అవసరమే ఉన్న వాళ్ళను ప్రోగు చేసి కొన్ని ఉద్యమాలు నడిపాను.అంతే గాని ఫ్లెక్సీలు పెట్టుకుని కాదు. పది సార్లు ...కింది నుండి ...పై కోర్ట్ వరకూ బెయిల్ నిరాకరించాయంటే నేరం చేసిన చాయలున్నాయి కాబట్టే నని అందరికీ తెలుసు ఐనా ఎంగిలి మెతుకుల కోసం కుక్కలు ఎగబడుతూనే ఉంటాయి. అలాంటి వాటిని నా గుమ్మం చాయలకే కాదు కాస్త నీతిగా బ్రతుకుతూ....  అన్నం తినేవాడెవ్వడూ రానివ్వడు. ఇంకేదైనా తినే వాళ్ళ గురించి నేను మాట్లాడను.
నీకు ఇంకొక విషయం కూడా చెబుతాను విను. నీకెదురుగా ఉన్న రేక్ లో ఉన్న పుస్తకాలు చూడు. సగం ఇంజనీరింగ్ ..మిగిలిన సగం వేరే వేరే..సబ్జక్ట్లవి. మొదటివి నా వృత్తికి న్యాయం చేయడానికైతే మిగిలినవి నా జీవితానికి ఒక పరమార్దాన్నిచ్చేవి.  మహా..మహులు రాసినవి.నేను చేసే  యే పనైనా నాకు ఉపయోగపడడం తో బాటు..నా తోటి వారెవ్వరికీ నష్టం కలగకుందా చూసే బాద్యత కూదా నాదే నన్న విధంగా అలోచించే వాళ్ళం. నా వాళ్ళంతా యేమి  తింటున్నామన్న దానికంటే ఎవరితో కలసి తింటున్నాం...ఎక్కడ తింటున్నామన్న  విషయాల గురించి ఆలోచించే వాళ్ళే. కరెక్ట్ గా చెప్పాలంటే ఆలాంటి వాళ్ళే మా వాళ్ళవుతారు..ఎందుకంటే నూటికి నూరు పాళ్ళూ మా అమ్మాయి నా లాంటిదే. మహోన్నత విద్యాలయాల్లో....చాలా కాలం గడిపి కూడా కాస్త కూడా సమాజాన్ని పట్టించుకోకుండా....జడత్వంతో బ్రతుకుతూ... ఒక రోజు రధం ఎక్కో.....గుర్రం ఎక్కో...ఏనుగు ఎక్కో...జయ  ధ్వానా లను విని మురిసి పోయే వాళ్ళను  మా ఇంటి ప్రాంగణం లోకి కూడా రానీయను. వరల్డ్ కప్ టోర్నమెంట్   లో ఎప్పుడో రొనాల్డినో కొట్టిన ఫ్రీ కిక్ నీనిక్కడ వాడక ముందే......."


ఆ యువకుడు ముందే వెళ్ళి పొయ్యాడు పాపం


**********************

నిన్న జరిగిన పెళ్ళిలో ఒక స్నేహితుడు "మీ అమ్మాయి పెళ్ళి  అంతా ఈవెంట్ మేనేజెర్ కి కాంట్రాక్ట్ కి ఇచ్చేద్దాం " అనగానే నా కళ్ళ ముందు కదలాడిన ఊహ
 

14, మే 2013, మంగళవారం

ప్రజలకోసం...ఒక్కసారి.....

శేఖర్  కమ్ముల దర్శకత్వం వహించిన "గోదావరి" సినిమా యీ మధ్య వచ్చిన ఒక మంచి సినిమా అని చెప్పవచ్చు.నూటికి నూరు శాతం యేకీభవించక పోవచ్చు కానీ ఆ సినిమాలో అతడు లేవనెత్తిన చాలా అంశాలు  ఆనందింప చేయడమే కాకుండా అలోచింప  జేస్తాయి. ఇంచు మించు ప్రతి ఫ్రేం కూడా చాలా జాగ్రత్తగా  చిత్రీకరించిందే. ఒక విధంగా దానిని యీ మద్య వచ్చిన ఒక దృశ్య కావ్యంగా చెప్పుకోవచ్చు.దాని మీద రివ్యూ రాయాలంటే చాలా పేజీలు పడుతుంది. ఆ సినిమా చూసిన వెంటనే ఐతే ఒక సందేహం నన్ను పట్టి పీడుస్తూ ఉండేది.ఏదో ఒకటి సమాజానికి చేసి చూపించే మంచి ఉద్దేశం ఉన్న హీరో ఆ దిశ  లో మొదటి మెట్టుగా యేదో ఒక రాజకీయ పార్టీ లో చేరదామనుకుంటాడు.ఇక్కడ కూడా దర్శకుడి యొక్క పరిణితి  మనకు కనబడుతుంది.హీరో ఒక రాజకీయ పార్టీ ని అప్రోచ్ అవుతాడు.అక్కడ తను ఇమడలేనని గ్రహించగానే  వేరొక రాజకీయ పార్టీని అప్రోచ్ అవుతాడు.గమనించవలసిన విషయమేమిటంటే రంగుల లోనో లేక పై పై న చిన్న తేడాలు తప్ప పెద్దగా తేడా లేని పార్టేలేనని    అవి రెండూ అని అన్యోపదేశంగా  దర్శకుడు బాగానే చెప్పాడనిపించింది.నిజంగా సిద్దాంతాలుండే పార్టీలైతే హీరో అంత సుళువుగా తన అభిప్రాయం మార్చుకోలేడు. అంతవరకూ చక్కగా దర్శకత్వం చేసిన దర్శకుడు అక్కడే చిన్న తప్పు చేశాడేమోనని సినిమా చూసిన కొత్తలో అనిపిస్తూ ఉండేది.సిద్దాంతాలు పెద్దగా లేని పార్టీల లో ఇమడలేక పోయిన హీరో కాస్తో కూస్తో సిద్దంతాలున్న పార్టీల గురించి ఎందుకు అలోచించ
లేకపోయాడన్నది అప్పట్లో నా మనసులో అర్ధం కాని ప్రశ్న గా ఉండేది.  శేఖర్  కమ్ములకు  మిగిలిన పార్టీల గురించి తెలియకుండా ఉంటుందంటే నమ్మలేము.ఎందుకంటే తను కాలేజ్ లొ చదివేనాటికి కూడా వామ పక్ష విద్యార్ధి సంస్థలు ఉండే ఉంటాయి.తెలిసి కూడా ఉపేక్ష్చించాడంటే వాటికి అంతగా ప్రాధాన్యత యీయవలసిన అవసరం లేదని అతడి భావనేమో అనిపిస్తుంది కూడా.కానీ కొన్ని విధాలుగా నా ప్రశ్నలకు నేనే జవాబులు కూడా వెదుక్కున్నాను. యెందుకంటే ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పవలసిన అవసరం కానీ సమయం కానీ శేఖర్ కమ్ముల  గారికి ఉండకపోవచ్చు. ఒక వేళ హీరో ప్రత్యామ్నాయ పార్టీ గురించి మాత్రమే అలోచిస్తే కొన్ని యెర్ర పార్టీలను ఎందుకు అప్రోచ్ కాలేదో అర్ధం కాదు. అసలు ఎర్ర పార్టీలను రాజకీయ పార్టీలు గా ఆయన ఎందుకు గుర్తించ లేదు? అలా చేయడం యాదృచ్చికమా లేదా కావాలనే జరిగిందా? యీ ప్రశ్నలకు నాకున్న పరిమితమైన జ్ఞానంతోనే సమాధానాలు వెదుక్కోవదం ప్రారంబించాను.

తాడికొండ ఆశ్రమ పాఠశాలలో  ( 1975-76) ఉన్నప్పుడు జరిగిన  సమావేశాలలో వక్తలు యెమర్జన్సీ పెట్టినప్పటినుండీ వచ్చిన మార్పులను తెగ పొగుడుతుంటే వినేవాళ్ళం కానీ యేమీ అర్ధం అయ్యేవి కావు.ఆ తరువాత కాలేజ్ కి వచ్చిన తరువాత జనతా పార్టీ అధికారం లోకి రావడం ...వూరిలో పెద్దవాళ్ళ మధ్య జరుగుతున్న చర్చలు ...పేపర్ లో పడిన వార్తలు చూసిన తరువాత నాకు కొంత రాజకీయ పరిజ్ణానం అబ్బిందని అనుకుంటూ ఉండే వాడిని.జనతా పార్టీ అధికారం లోకి వచ్చిన కొద్ది కాలానికే కాంగ్రెస్స్ రెండు ముక్కలు కావడం(అంతకు ముందొక సారి అయినట్లుగా కూడా ఆ తరువాతే తెలిసింది)..శ్రీమతి ఇందిరా గాంధీని పార్టీ నుండి బహిష్కరిస్తే ఆమె "ఇందిరా కాంగ్రెస్" పేరు మీద కొత్త పార్టీ పెట్టుకోడం జరిగింది. ఇదంతా ఎందుకు రాయవలసి వచ్చిందంటే ఆ సమయం లో జరిగిన రాజకీయ కుప్పి గంతులు నాకు చాలా ఆశ్చర్యాన్ని  కలుగ చేస్తూ ఉండేవి.కేంద్రంలో జనతా పార్టీ అధికారంలో ఉండగానే ఆంధ్ర,కర్ణాటక రాష్ట్రాల లో ఇందిరా కాంగ్రెస్ అధికారం లోకి వచ్చింది. అనతి కాలంలోనే "జనతా" ప్రయోగం విఫలమై కేంద్రంలో కూడా ఇందిరా కాంగ్రెస్ అధికారానికి చాలా సుళువుగా రాగలిగింది. నాకు జనతా పార్టీ పుట్టుక ..పతనానికి గల కారణాలు అప్పటికే బాగానే అర్ధం అయ్యాయి. ఎందుకంటే దానికేమీ ప్రత్యేక పరిశోధన  యేమీ అవసరం లేదు. అప్పుడప్పుదు న్యూస్ పేపర్ చదివితే చాలు.ఎవరైతే శ్రీమతి గాంధీని పార్టీ నుండి గెంటి  వేసారో  ఆ నాయకులంతా కూడా "అన్యధా శరణం నాస్తి...త్వమేవ శరణం మమ" అంటూ ఆవిడ పాదాల దగ్గర వాలి పోయారు.ఇంత పతనాన్ని చూస్తూ..... దీనికి ప్రత్యామ్నాయం ఉండదా....అని ఆలోచిస్తున్నప్పుడే గోడ మీద రాసిన "జాబ్  ఐనా చూపండి లేదా జైల్ లో ఐనా పెట్టండి " అనే స్లోగన్ మీద జరుప బోయే వూరేగింపుకు అందరినీ వచ్చి విజయవంతం చేయమన్న ఆహ్వానం.నేను ..కొద్ది పాటి స్నేహితులు దాంట్లో పాల్గొన్న తరువాత మొట్ట మొదటి సారిగా ఒక కమ్యూనిస్ట్  పార్టీ కార్యాలయం లోకి అడుగు పెట్టాం.అది తణుకు లోని సీ.పీ.ఐ. కార్యాలయం.ఆ తరువాత అక్కడికి వెళ్ళి చర్చల్లో పాల్గోడం మా దిన చర్య అయి పోయింది.అప్పటికే ముల్క్ రాజ్ ఆనంద్ రాసిన కూలీ  వగైరాలు చదివిన  నన్ను మూల సిద్దాంతాలు బాగానే ఆకర్షించాయి.యీ లోపులో మా వూరిలో నా గురుతుల్యులైన ఆచారి మాష్టారు ఉపాధ్యాయ సంఘాల(యూ.టీ.ఎఫ్) ద్వారా సీ.పీ.ఎం పార్టీ వైపు అడుగేసి సెలవులకి వచ్చిన మమ్మలని ప్రభావితం చేసేవారు.ఆయన ఆహ్వానం మీద మా వూరికి వచ్చి మాతోమాట్లాడిన వారిలో కృష్ణయ్య  ఒకరు.చెప్పేదంతా బాగానే ఉండెది గాని అంతకు కొద్ది కాలం ముందే జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లొ ఒక కమ్యూనిస్ట్ పార్టీ లోక్ దళ్ కు ఒక కమ్యూనిస్ట్  పార్టీ జనతా పార్టీకి ఎందుకు సపోర్ట్ చేసాయో అర్ధం అవలేదు దానికి అప్పటి రెండు పార్టీల నాయకుల దగ్గర నుండీ తృప్తికరమైన సమాధానం రాలేదు. ఎందుకంటే భావ సారూప్యత గల పార్టీలు అంటే ముందు రెండు కమ్యూనిస్ట్ పార్టీలు అవుతాయి కానీ జనతా ..లోక్ దల్ లు కావు.ఇవి రెండూ ఒక అంగీకారానికి వచ్చిన తరువాతే మిగిలిన యే పార్టీ తో ఐనా పెట్టుకొవాలి కదా అనేది నా సందేహం.నా సందేహానికి కేవలం వేద భాష లోనే(సామాన్యులకు అర్ధం కాని భాష) సమాధానం దొరికేది.తరువాతి కాలంలో నా కర్ధమయ్యిందేమిటంటే కనీస విలువలు లేని యీ "చెత్త"వెంట  వెళ్ళిన   తోకలను కూడా చెత్త కంటే హీనంగా ప్రజలు తిరస్కరించారు.అలా పోటీ చేసిన ప్రతి సారీ కూడా పైకి ఐక్యతా మంత్రం వల్లించినా కూడా ఒకళ్ళకొకళ్ళు ద్రోహం చేసుకోడం ఒక అలవాటుగా మారిపోయింది. మొదట్లో మాకు నేర్పిన పాఠాల సారాంశం ఎలా ఉండేదంటే " యీ భారత దేశం  అంతా టాటా...బిర్లాల వంటి బూర్జువాల చేతుల్లో ఉందనీ....వాళ్ళకు   అనుకూలంగానే ప్రభుత్వాలన్నీ వ్యవహరిస్తాయనీ సిద్దాంత రీత్యా రుజువులతో సహా చూపించే వారు.అది నిజమో కాదో వేరొక చర్చ అవుతుంది. కొన్ని వేల సంవత్సరాల పాటు కూపస్త  మండూకంలా ఉండి పోయిన హిందూ సమాజంలో ప్రజలకు ఉన్న ప్రధాన శత్రువులు టాటాలు ...బిర్లాలు మాత్రమే అన్నట్లుగా  ఉండేది. నెహ్రూ  ఉన్నంత కాలం కాంగ్రెస్ కు యెదో ఒక సిద్దంత బలం ఉండేది.ఆ తరువాత సిద్దాంతాలనేవి కనుమరుగవుతున్న దశ లో ఒక బలమైన సిద్దంతం
కల పార్టీ బలమైన ప్రత్యామ్నాయంగా తయారవ్వ వలసిన సమయంలో రెండు ముక్కలయ్యి ఆ తరువాత అనంతంగా ముక్కలొవ్వుతూనే ఉంది.నాయకత్వ స్థానంలో కూర్చుని యెన్నైనా సిద్దాంతాలు చెప్పవచ్చు...కానీ సామాన్యుడి దగ్గరకు వచ్చేసరికి వీళ్ళంతా ఒకళ్ళ నొకళ్ళు ఎందుకు
తిట్టుకుంటున్నారో...చంపుకుంటున్నారో అర్ధం కాని స్థితి.ఇప్పుడైతే గోడల మీద రాసే వాళ్ళు కూడా వాళ్ళకు కరువైపొయ్యారు కానీ 20 సంవత్సరాల క్రితం గోడల నిండా రాతలే.ఇప్పుడు ఆటోల వెనకాల ..కార్ల వెనకాల బైబిల్ సూక్తులెలా కనబడుతున్నాయో ఆ రోజుల్లో అన్ని స్లోగన్స్...మరిన్ని విద్యార్థి సంఘాల పేర్ల తో ఉండేవి.వీటన్నిటి మధ్య ఉండే తేడాలేమిటో యెవరైనా వివరించగలరా అనిపించేది.కొండంత శత్రువు ని యెదిరించడానికి మనకున్న బలం వేలెడంత.మరలా దానిని పది ముక్కలు చేస్తే లాభం ఎవరికుంటుందోనన్న చిన్న అలోచన నా లాంటి సామాన్యుడికుంటుంది గాని నాయకత్వ స్థానాల్లో ఉన్న మేధావులకి ఉండదేమో.
మొన్ననే మనందరినీ వీడిన చావెజ్ పార్టీ పేరు లో ఎక్కడా "కమ్యూనిస్ట్" అని ఉండదు.కానీ కాస్ట్రో చివరి వరకూ అతడిని అక్కున చేర్చుకునే ఉన్నాడు.ఇద్దరూ కలసి ళాటిన్ అమెరికా లో విపరీతమైన ప్రభావం చూపగలిగారన్నది నిర్వివాదాంశం.
నేను చదివిన అత్యుత్తమ సమీక్షలలో "రాగో"నవల మీద బాలగోపాల్ రాసింది ఒకటి.సోషలిజం అనేది కొన్ని పోరాటాలు చేసేసి అపేస్తే వచ్చేది  కాదని ఆయన అన్ని రుజువులతో చూపించాడు.అది కేవలం రాజకీయాధి కారం వలన వచ్చేది కాదు.అదొక జీవిత విధానం.రేసు లోకి లాగి ప్రజలను నిరంతరం పరుగులు పెట్టేలా చేస్తున్న పెట్టుబడిదారీ విధానానికి అదొక ప్రత్యామ్నయం. ఆది ఇప్పటి పరిస్థితులకి పనికి వస్తుందో రాదో అనేది ఇక్కడ చర్చనీయాంశం  కాదు.బ్రతకాలంటే  ఖచ్చితంగా రేసు లో ఉండాల్సిందే అని మాత్రమే నమ్ముతున్న నేటి యువతకు పదిమందీ కలసి పదిమంది కోసం అన్న సిద్దాంతం ఒకటి ఉందన్న సంగతి కూడా తెలియనంత దూరంగా వీళ్ళు జరిగిపొయ్యారు.  ఈ  ఘనత నిస్సంశయంగా    భారత దేశపు కమ్యూనిస్ట్ పార్టీలదే. మిగిలిన సిద్దంతాలు లేని పార్టీలతో రాజకీయాధికారాన్ని పంచుకోడానికి సిద్దపడిన కమ్యూనిస్ట్ పార్టీలు వాటిలో వేటితోనూ కలసి బలమైన సామాజిక  ఉద్యమాలు నిర్మించిన దాఖలాలు లేవు.భూస్వాముల భూములు లాక్కొని పేదలకు పంచవలసిన ప్రభుత్వం దానికి పూర్తి వ్యతిరేకంగా పేదల భూములను పెట్టుబడిదారులకి పంచిపెడుతుంటే కమ్యూనిస్ట్ లు చేసిన ఉద్యమాలు ఎన్ని? ప్రభుత్వం ఎలెక్ట్రిసిటీ చార్జ్ లు పెంచింది. నిజమే దాని ముందు జరిగిన విషయాలేమిటి? ఆర్ధిక నేరగాళ్ళకు వ్యతిరేకంగా వీళ్ళు చేసిన పోరాటాలేమిటి?  తన కుటుంబాన్ని పోషించుకోడానికి అడవికి వచ్చి డ్యూటీ చేసుకుంటున్న కానిస్టేబుల్ చేసిన ద్రోహం ఎక్కువో ..లేక పేద రైతుల భూములు పెట్టుబడి దారులకు కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించి వేల కోట్లు దిగ మింగిన వాళ్ళు చేసిన ద్రోహం ఎక్కువో అడవిలో అన్నలకు తెలియదా...కానిస్టేబుల్ అడవిలో దొరుకుతాడు కాబట్టి వర్గ శత్రువు.  మేము చదువుకున్న రోజుల్లో జరిగిన ఒక చిన్న సంఘటన నాకు ఇప్పటికీ బాగా గుర్తే. అప్పటికి మా కాలేజ్ లో స్టూడెంట్స్ ఫెడరేషన్ బలంగా ఉండేది. ఒక మంచి మా స్నేహితుల గ్రూప్ దానిని నడిపిస్తూ ఉండేది.  ఒక రోజు బయట నుండి ఒక యువకుడు మా కోసం వచ్చాడు.
"బ్రదర్...మిమ్మలని ఒక రిక్వెస్ట్ చేయడం కోసం వచ్చాను..."నసిగాడు.
"చెప్పండి ఫరవాలేదు" అభయం ఇచ్చేసాను
"మీ హాస్టల్ కుర్రాడొకడు మా సిస్టర్ ను రోజూ టీజ్  చేస్తున్నాడు..మొన్నొక రోజు సినిమా హాల్ లో వోణీ  కూడా పట్టుకుని లాగాడు"
" అలాగా...మరేం చేద్దాం"నవ్వుతూ అడిగాను.
"మీరు కొంచెం హెల్ప్ చేయాలి"
"అంటే మా వాడిని మేమే కొట్టాలా..."
" మాకేమి చేయాలో తెలియడం లేదు...మీ కాలేజ్ అంతా బాగా కలసి ఉంటారని టౌన్ లో అందరూ అంటుంటారు"
"చూడండి...మేము మా వాడిని ఏమీ చెయ్యం కానీ....తప్పు చేస్తున్నాడు  కాబట్టి వాడిమీద మీరేమన్నా యాక్షన్ తీసుకుంటే మేమేమీ వాడి తరుపున ఇన్వాల్వ్ కాము."
ఆ యువకుడు ఆ హింట్ చాలన్నట్లుగా ఆనందంగా వెళ్ళిపొయ్యాడు.కొద్ది రోజులకు చిరిగిన చొక్కాతో ,రక్తం వోడుస్తూ హాస్టల్ లోకి వస్తున్న మా హాస్టల్ మేట్ ని మేము చూసాం.టౌన్ లో నుండి వచ్చిన యువకుడు మాత్రం మా అభిమానిగా ఉండి మా మీటింగ్ లకి క్రమం తప్పకుండా వచ్చే వాడు.అప్పటి మా పరిణితి తక్కువే కానీ సిద్దాంతాల రచ్చ కంటే పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడానికే చూసే వాళ్ళం.ఉద్యమాలు ఉన్న చోట కులాలు ఉండవు. మతాలు ఉండవు.కేవలం వోట్ల సంపాదనే పరమావధి గా ఉండే పార్టీలకు సిద్దాంతాలున్నా వాటిని అమలులో పెట్టదానికి యీ వోట్ల సంపాదనే ప్రధాన అవరోధంగా ఉంటుంది.ఉదాహరణకు అన్ని పార్టీల మేనిఫిస్టోలు చూదంది. ఖచ్చితంగా అన్నిటిలోనూ "సెక్యులరిజం" పాటిస్తామని ఉంటుంది.దానర్ధం పూర్తి మత స్వేచ్చ ఉంటుందని.ఆచరణలో యేమి జరుగుతుందో అందరూ చూస్తున్నారు.నీ చేతిలో ఒక 20 వోట్లు వుంటే చాలు...నీ స్వేచ్చకు యెవడూ అడ్డం రాడు. నీవు రోడ్ తవ్వేసి పందిళ్ళు వేయొచ్చు...రోడ్ బ్లాక్ చేసి నీ ఫొటోలు  ఉన్న ఫ్లెక్షీలు నాలుగు తగిలించి నీవే నాయకుడవై పోవచ్చు.అంతే కాదు నీ చొరవను బట్టి నీకు కార్పొరేటర్ దగ్గరనుండి ఆ పై వరకూ యే పదవైనా దక్కే అవకాశం వస్తుంది. ఇదంతా యెలా జరుగుతుందని యెవడూ ఆశ్చర్య  పోవడం లేదు.ఇదంతా చాలా సహజమేనన్న రీతి లో వెల్లి పోతున్నారు.అంటే చట్టం మీద నమ్మకం గౌరవం ఉన్న వాడి మీద చట్టం మీద ఏ మాత్రం గౌరవం లేని వాడు పెత్తనం చేస్తున్నాడు. సిద్దాంత రాజకీయాలు లేని చోట వచ్చే  పరిణామం ఇదే.దీనికి కారణం ఒక ప్రత్యామ్నాయ సిద్దాంతం ..విధానాలు కల పార్టీ ఒక్కటీ లేక పోవడం కాదా.విశాఖపట్నం లో ఒక చిన్న నామినేటెడ్ పదవి పొందిన ఒక నాయకుడి వూరేగింపు వలన ట్రాఫిక్ జాం అయి ఎంత మంది విద్యార్థులు ఎగ్జాం   హాల్ కు వెళ్ళ లేకపొయ్యారో అన్ని పేపర్లూ రాసాయి. సోషలిజం అనేది ఒక సుదూర స్వప్నం కానీ ఇప్పటి మన బ్రతుకులు కాస్త స్థిమితంగా బ్రతడానికి అవసరమైన ఉద్యమాలు చేసే వాళ్ళు కూడా కరువైపోయారు.రాజకీయ పార్టీల జిమ్మిక్కులు ప్రజలకు అర్ధం కాక కాదు....ప్రత్యామ్నాయం లేక మాత్రమే వోపిక పడుతున్నారు. మా పక్కనున్న అనకాపల్లి పార్లమెంట్ సభ్యుల పార్టీ యేమిటో ఎవరూ స్పష్టంగా చెప్ప లేరు.ఢిల్లీలో  ఒక ప్రుభుత్వ అధికార అతిధి గృహంలో ఒక దళిత అధికారిపై మన శాసన సభ్యుడు చేయి చేసుకుంటాడు. కానీ కేసు ఉండదు.దళిత సంఘాల ఉద్యమాలు ఉండవు. పైపై ముసుగులు వేరు కానీ లో లోపల వీళ్ళంతా ఒకటే. ఒక బలమైన ప్రత్యామ్నాయ సిద్దాంతం కలిగిన పార్టీ ఎదురైనప్పుడు వీళ్ళంతా యేకమైపోతారనడానికి చరిత్ర లో ఎన్నో దాఖలాలు ఉన్నాయ్.

ఇక్కద ప్రధానమైన విషయం ఇంకొకటేమిటంటే యీ మధ్య కాలంలో కావాలనే అధికార వర్గాలు ..తమకున్న విశ్వాస  పాత్రమైన మీడియా ..ప్రజలకు మిగిలిన ఒకే ఒక్క కళా రూపమైన సినిమా రంగం మొత్తం కలసి చాలా తెలివిగా జనాన్ని మోసగిస్తూనే ఉన్నారు.ఒక ప్రత్యామ్నాయ  జీవిత విధానాన్ని సూచించే వాటినన్నిటినీ తెలివిగా ఉపేక్షిస్తారు.అసలు అటువంటిదేదీ లేదన్నట్లుగానే ఉంటారు. రోజూ టీవీ చూస్తున్న వారికి రాష్ట్రంలో కేవలం నాలుగు రాజకీయ పార్టీలు మాత్రమే ఉన్నట్లుగా అనిపిస్తుంది.అనేకానేక నేరాల మీద జైల్ లో మగ్గుతున్న వారు స్థాపించిన పార్టీల  నుండి కూడా ప్రాతినిధ్యం  ఉంటుంది కానీ ఎన్నో ఉద్యమాలు నిర్మించి ఎన్నెన్నో త్యాగాలు చేసిన పార్టీల నుండి యే ప్రాధాన్యం ఉందదు. "దూకుడు సినిమాకు అవార్డుల పంటలు పండుతాయి.....పిల్ల జమీందార్...వోనమాలు లాంటి సినిమాలు చర్చకు కూడా నోచుకోవు. అంతే కాదు "గమ్యం "లాంటి సినిమా తీసి మానవత్వం...సేవా దృక్ఫధమే ప్రేమకు పరమావధి అంటూ ప్రేమకు ప్రత్యమ్నాయ నిర్వచనాన్ని ఇచ్చిన దర్శకుడు క్రిష్ ను కూడా చచ్చినట్లు తన దారి మార్చుకుని వ్యాపార సినిమాలు తీయవలసిన ఆగత్యం కల్పించింది యీ వ్యాపార ప్రపంచం.
"అయ్య...క్రిష్ గారూ...మీకొక మనవి...దయుంచి మీరు మనుషుల తరుపునే ఉండండి.."
నేను అంతిమంగా కూడా మరొక్క సారి చేసే విన్నపం ఇదే. టాటా ..భిర్లాల దోపిడీ గురించి నాకు తెలియదు కానీ ......సిద్దంతాల చర్చలతో ముక్కలు ముక్కలైన కమ్యూనిస్ట్ పార్టీల వలన సమాజానికి   జరిగిన నష్టమే ఎక్కువని నా అభిప్రాయం.  సిద్దాంతాల వాదోపవాదాల కంటే ముందు అసలు యే సిద్దాంతమూ లేని వాళ్ళ పని పడదాం.ఏ సిద్దంతమూ లేకుండా.....ఉద్యమాల నేపద్యాలు లేకుండా ...అడ్డదారిలో సంపదించిన డబ్బుతో నాలుగు ఫ్లెక్సీలు తగిలించుకుని నాయకులుగా చెలమణి అవుదామనుకుంటున్న హీనుల చేతుల్లో మన జీవితాలను...మన వారసుల జీవితాలను పెట్టొద్దు. నేరగాళ్ళు అని తెలిసి కూడా వాళ్ళిచ్చే  ఎంగుల మెతుకుల కోసం వెంపర్లాడుతూ రెండు మూడు కులాల లేదా మతాల వోట్ల లెక్కలతో ఏదోలా అధికారంలోకి వచ్చేటందుకు సిద్దపడుతున్న శునకాలను తిప్పి తిప్పి కొడదాం.కనీసం   చచ్చేటంత  వరకూ బ్రతకనిచ్చే యేర్పాట్లు చేసుకుందాం.లేదంతే రోజూ చావాలి."ఏదో ఒక తప్పు చేయకుండా యీ సమాజంలో బ్రతకలేము కాబట్టి తప్పు చేసిన వాడిని శిక్షించడం  ఎందుకులే" అన్న సూత్రీకరణ సమాజాన్ని మింగేయకుండా కాపాడండి.కాస్తో కూస్తో సిద్దాంతాలున్న వాళ్ళు...నిజాయితీ పరులు కలిసి ముందుకు వస్తే వారి వెంట నడవడానికి జనం సిద్దంగా ఉన్నారు. ఎందుకంటే భారత  ప్రజలు యే పార్టీని  నమ్మని స్థితిలో ఇప్పుడున్నట్లుగా ఎప్పుడూ లేరు.అప్పుడు నిజాయితీ పరులే లేరన్నుట్లుగా ప్రజలని వంచిస్తున్న మీడియాను తుంగలో తొక్కేద్దాం.