14, మే 2012, సోమవారం

పాముల్ని వదిలేద్దామా......


జీప్ అప్పటి వరకూ స్పీడ్ గా వచ్చింది. ట్రైన్ కు ఇంకా సరిపడినంత టైం ఉంది. ఫరవాలేదులే అనుకంటూ ఉన్నాను. సరిగ్గా కంచరపాలెం ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చి ఆగింది. అప్పుడప్పుడు అక్కడ ట్రాఫిక్ జాం అవ్వడం మామూలే కాబట్టి నేను ముందు పెద్దగా పట్టించుకోలేదు....కానీ ఎంత సేపటికీ ట్రాఫిక్ కదలడం లేదు. నేను ఇంకా కొన్ని జిరాక్స్ లు తీసుకోవలసినవి ఉన్నాయని గుర్తుకు వచ్చి కంగారు మొదలైంది. డ్రైవర్ ను చూడమన్నాను.
"ముందంతా మొత్తం ఆగి పోయి ఉంది సార్ అన్నాడు"


ఏమి చేయాలో పాలుబోవడం లేదు.దిగి ముందుకు నడిచినా ఎంత దూరంలో ఆటో దొరుకుతుందో తెలియదు.
ఏ కారణం చేతో తెలియదు కానీ ట్రాఫిక్ నెమ్మదిగా కదలడం ప్రారంభం అయ్యింది.ఊపిరి పీల్చుకున్నాను. బ్రిడ్జ్ ప్రారంభానికి వచ్చిన తరువాత ఆ ట్రాఫిక్ జాం కు కారణం కళ్ళారా చూసిన తరువాత కోపంతో ఒంట్లో నరాలన్నీ ఒకే సారి బిగుసుకు పోయినట్లయ్యింది.మొత్తం ట్రాఫిక్ అంతా సగం రోడ్ లో నుండి వెళ్ళుతోంది. మిగిలిన సగంలో రాత్రి అక్కడ పక్కనే ఉన్న మందిరం తాలూకు "పరస" (ఉత్తరాంధ్ర లో "తిరునాళ్ళు" అనే పదానికి బదులుగా వాడేది) సందర్భంగా నిర్వహించిన ప్రోగ్రాం తాలూకు వేదిక మిగిలిన సగాన్ని ఆక్రమించి ఉంది.ఎవ్వరూ ఇదేమిటి అని అడగడం లేదు. అలానే సర్దుకుని ఆ సగం రోడ్ లో నుండి సాగిపోతూనే ఉన్నారు. ఆ నడిచి పోతున్న శవాలలో నేనూ ఒకడినైనందుకు నా మీద నాకే అసహ్యం వేసింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి ...ఈ ట్రైన్ మిస్ ఐతే వేరే ట్రైన్ లేదు. తప్పనిసరిగా  గా రాంచీ వెళ్ళాల్సిన పరిస్థితి. మా అమ్మాయిని అక్కడ నుండి ఢిల్లీ తీసుకుని వెళ్ళాలి.చాలా కాలం క్రితం "విపుల" మాస పత్రిక లో చదివిన కధ గుర్తుకు వచ్చింది.శవాలను కాంట్రాక్ట్ కుదుర్చుకున్న ఒక వ్యక్తి తన కష్టమర్ కు బ్రతికి ఉన్న మనుషులను సప్లై చేసేస్తాడు. దానికి అతగాడి ఇచ్చిన రీజనింగ్ కూడా ఇదే. కళ్ళ ముందే జరుగుతున్న అత్యంత చిన్న  అవకతవకలను కూడా  పట్టించుకోలేని వీళ్ళను మనుషులుగా చూడడానికి అవసరమైన కారణాన్ని  చూపమంటాడు.


ప్రతి వీధి లోనూ జులాయి (లంపెన్) యువత ఉండడం సహజం. ఇంతకు ముందు వీళ్ళను ఎందుకూ పనికి రాని వారి గానే చూసే వారు. కానీ మారిన పరిస్థితులలో వీళ్ళే మన రాజకీయ వారసులుగా మారుతున్నారు. రోడ్ అంతా బ్లాక్ చేసి వేదిక వేసి దాని మీద ఏదో ఒక అసహ్య కరమైన ప్రోగ్రాం కండక్ట్ చేసే అంత బుద్ది హీనత  కాస్తంత జ్ఞానం ఉన్న వాళ్ళెవరికీ ఉండదు కదా....మరి అలాంటి ప్రోగ్రాం లు జరగక పోతే మన నాయకులకు ఫ్లెక్సీ లు తగిలించే చాన్స్ ఎక్కడ వస్తుంది? కాబట్టి ఒక వీధిలో కేవలం పది మంది ఆ లంపెన్ గ్ర్రూప్ ఉంటే చాలు కొన్ని వేల మంది తిరిగే రోడ్ ను బ్లాక్ చేయగలుగుతున్నారు.అంటే అన్ని వేలమందికీ వాళ్ళు అసౌకర్యం కలిగించగలుగుతున్నారు.జనం మాత్రం ఆల్టెర్నేటివ్ రోడ్  ఎక్కడ ఉందో వెదుక్కుంటూ తల వంచుకుని పోతూనే ఉంటారు.


ట్రైన్ ఐతే ఎక్కాను గానీ నా అలోచనా స్రవంతి ఆగలేదు. నాలుగు రోజుల ముందు కూడా  అనుకోకుండా ఇలాంటి ప్రోగ్రాం జరుగుతుండగా మా వాహనం స్లో అయ్యింది. వేదిక మీద యాంకర్ కు ఒంటి మీద స్పృహ ఉందా అన్న రీతిలో వాగుతుంది.జనం నుండి అనుకున్న స్పందన రాలేదు.


" అబ్బే......మీ వీధి లో కుర్రాళ్ళకు ఓపిక లేదండీ..."


అడ్డమైన బూతు డైలాగ్ లూ మాట్లాడుకుంటూ జనాలు ఆనందిస్తున్నారు. ఇదంతా ఒక గుడి ముందు ఆ అమ్మ వారి పరస సందర్భంగా ఏర్పాటు చేయబడ్డ ప్రోగ్రాం. వేదిక చుట్టూ నాయకుల ఫ్లెక్సీలు ...మాకు అరగంట పైగా లేట్ ..మాకే కాదు ఆ రోజు  గోపాలపట్నం నుండి ఎన్.యే.డీ జంక్షన్ వరకూ ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికీ అదే లేట్.
" ఆ వెనుక గ్రౌండ్ లో పెట్టుకో వచ్చు కదా ....యీ ట్రాఫిక్ సమస్యలు ఉండవు ....."


" ఊరుకోండి సార్...ఎక్కడో పెడితే ..యీ ఫ్లెక్సీ లు అన్నిటినీ ఎవరు చూస్తారు....ఇంకా ఇక్క్డ బెటర్ సార్...మొన్న అనకాపల్లి...యలమంచిలి మధ్య  సగం హై వే ని బ్లాక్ చేసి ..10000 వాట్ స్పీకర్స్ తో ప్రోగ్రాం పెట్టారు...ఆ రోజు హై వే లో ప్రయాణం చేసిన  వాళ్ళ ఖర్మ .....అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది సార్... " మా డ్రైవర్ నా విసుగుదలను పలచన చేయడానికి ప్రయత్నించాడు.


" మరి...అదే రోజు..అదే రోడ్ మీద యెవరైనా మినిష్టర్ లాంటి వాళ్ళు వస్తే...?"


మా డ్రైవర్ నన్ను చాలా జాలిగా చూసాడు.


"భలేవారు సార్...వాళ్ళకు పైసా ఖర్చవకుండా పోగైన జనం దొరికినట్లే కదా... ....
ఒక్కొక్క చోట ఉండే అది కొద్ది మంది వలన ఇంత మందికి బాధ....అంటే అతి కొద్ది మంది ఆర్గనైజెడ్ జనం పాములై చీమల్లాంటి జనాన్ని ప్రతి స్థాయి లోనూ పీడిస్తూనే ఉన్నారు. కాక పోతే యీ పాములు బయట నుండి రావడం లేదు. ఈ చీమల నుండే పుడుతున్నాయి.




యీ పాములు పరిమాణం దృష్ట్యా చిన్నవే.కానీ అత్యంత ప్రమాదం. ఎందుకంటే చీమల నుండి వేరు చేయడం కష్టం.మనకున్న అన్ని కళా రూపాలనూ తొక్కేసి చానల్స్ వాళ్ళు సృష్టిస్తున్న వికృత కళా రూపాలను మన సమాజమ్మీద రుద్దడానికి మార్గం సుగమం చేస్తానికి ఈ పాములు.  వీటి వెనుక ఉన్న పెద్ద పాములు డైరక్ట్ రంగం లోకి రాకుండా ఈ చిన్న పాములని వాడుకొంటాయి అంటే వీళ్ళు చెప్పిందే వేదం.....వీళ్ళు ప్రదర్సించేదే కళ అని జనం అంటే చీమలు నమ్మాల్సిన స్థితిలోకి సమాజాన్ని నెట్టడం కోసం పెద్ద పాములు వెనుక నుండి చేయవలసింది అంతా చేస్తారు.జనానికి ఒక ఆల్టెర్నేటివ్ అలోచనా విధానం లేకుండా చేస్తాయి. రంగులు వేరుగా ఉన్న ఈ పాములు ఒక దానికొకటి అల్టెర్నేటివ్ గా చూపించుకొంటుంటాయ్. చీమలు సహజంగానే ప్రస్తుతానికి వేరే గతి లేక వాటినే ప్రస్తుతం నమ్ముతారు కానీ యెల్లకాలం అలా నడవదని చరిత్ర చూస్తున్న అందరికీ తెలుసు.అలా రక రకాలుగా ఆలోచించుకొంటూ ప్రయాణం పూర్తి చేసి ఇంటికి వచ్చి 15 రోజులయ్యిందో లేదో తెలియదు కానీ పేపర్లో వార్త.......


విసుర్లు....వేళాకోళాలు.....సామెతలు ఇవన్నీ ప్రతి నాగరిక సమాజపు సంస్కృతి లోనూ అంతర్భాగంగా ఉంటాయి.అవి ఎంత విస్తృతంగా ఉంటే అంతగా ఆ సమాజంలో ప్రజాస్వామిక విలువలు వేళ్ళూనుకున్నాయని భావిస్తారు. చర్చిల్...  బెర్నార్డ్ షా ల మధ్య నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాలు.... మొదలైన వాటిని బ్రిటిష్ పౌరులు వారి సమాజ శైలికి ఉదాహరణగా చాలా గొప్పగా చూపించుకొంటారు. ఎదుటివారిని నొప్పించని వేళాకోళాలు అందరికీ ఆహ్లాదకరంగానే ఉంటాయి.....మరీ మూర్ఖులైతే తప్ప...కాబట్టే ఆనాటి మన ప్రజాస్వామిక విలువల యొక్క ఔన్నత్యాన్ని భావి తరాల వారికి చూపించడానికి ఎన్.సీ.యీ.ఆర్.టీ. వారు ఆ నాటి నాయకుల విశాల దృక్పధాన్ని పరిచయం చేయడానికి ఆనాటి మేటి కార్టూనిష్ట్ వేసిన కార్టూన్ ని ఒక టెక్స్ట్ బుక్ లో వేసినందుకు పార్లమెంట్ లో ఒక పార్టీ వారు రేపిన దుమారం సభ్య సమాజం లో ఉన్న వారందరినీ విస్తు పోయేలా చేయడమే కాకుండా అధికార పక్షం వారు కూడా ఓట్లు జారి పోకుండా ఎదుటి వారిని మించి పోయి చేసిన  ప్రకటనలూ .......... అందులోనూ చర్చించవలసిన అన్ని సమస్యలనూ పక్కన పెట్టి దీనినే ప్రధాన సమస్యగా పార్లమెంట్ ను నడిపిన తీరు........చీమల ఆలోచనలన్నీ చంపేయడానికి .........అసలు చీమలు ఆలోచనే చేయకుండా ఉండడానికి చేస్తున్న కృషి లా కనిపిస్తుంది. ఇప్పటికైనా ఆలోచించే చీమలు దండుగా కదుల్తాయా....లేకుంటే పాముల బుసల మధ్య..జీవచ్చవాలులా బ్రతికేస్తాయో చూద్దాం....నేనైతే బ్రతకలేనేమో అనిపిస్తుంది.

8, మే 2012, మంగళవారం

కళ...స్పందన....రికార్డులు


ప్రతి విషయం హేతుబద్దతకు నిలబడ లేక పోవచ్చు. కానీ కానీ కొన్ని అలా జరిగితేనే బాగుంటుందనిపిస్తుంది.దాంట్లో  చాలా విషయాలు మిళితమై ఉంటాయి. మా అమ్మాయి వాళ్ళ డాన్స్ స్కూల్ వారు నిర్వహించే   చాలా ప్రోగ్రాంస్ లో  చిన్న చిన్న పాత్రలు వేస్తూనే ఉండేది. 9 వ తరగతి నుండి అది ఒక్క సారే పొడుగు ఎదగడం వలన దానికి ఒకే సారి సీనియర్ అమ్మాయిలతో కలసి ప్రోగ్రాం  చేసే అదృష్టం కలిగింది. అంతవరకూ బాగానే ఉంది కానీ దానిని రిహార్సల్ నుండి తీసుకు రావడానికి చాలా సాయంత్రాలు /రాత్రులు అంటే ఇంచుమించు సాయంకాలాన్నుండి మొదలుపెట్టి  రాత్రి వరకూ వేచి ఉండాల్సి వచ్చేది. నిజం చెప్పాలంటే ఆ వేచి ఉంటంలోనే నా సైట్ వర్క్ వలన కలిగిన అలసట అంతా పోతూ ఉండేది. ఎం.వీ.పీ. కాలనీ లో సెక్టర్ .5 లో ఉండే ఆ నాట్య కళాశాల  లో నుండి మంద్రంగా వినిపించే పాటల వింటూ మానసికంగా పునరుత్తేజం పొందుతూ ఉండే వాడిని.ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఐన "బాలక్క" అని అందరూ పిలుచుకునే శ్రీమతి బాల గారి గురించి ప్రస్తుత కూచిపూడి నాట్య కుటుంబం లో తెలియని వారెవారూ ఉండరు.కానీ ఆవిడ ముక్కోపానికి భయపడని శిష్యులూ ఉండరు.అప్పుడప్పుడు నేను ఆ సంగీతంలో మునిగి ఉన్నప్పుడు " ఒసేవ్ ..నీహారికా.ఎక్కడ చూస్తున్నావే"  అన్న అరుపుకు మా అమ్మాయికంటే నేనె ఎక్కువ  భయపడే వాడిని. పాపం మా అమ్మాయి భయపడిందేమో నన్న బాధతో లోపలికి తొంగి చూస్తుండే వాడిని.


మొత్తానికి ప్రొగ్రాం అనుకున్న దాని కంటే బాగా జరిగింది. విశాఖ ఉత్సవ్ మొదటి రోజున జరిగిన మొట్ట మొదటగా జరిగిన ఆ ప్రోగ్రాం కి ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందన కరతాళ ధ్వనుల రూపంగా బయటకు వచ్చినప్పుడు మాకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. ప్రోగ్రాం అంతా అయిన తరువాత మా అమ్మాయిని మేము తీసుకు పోదామని నెమ్మదిగా స్టేజ్ దగ్గరికి నడిచి అదే విషయం బాలక్కకు చెప్పాం. ఆవిడ అంతెత్తున లేచి "ముందు అంతా ఇంటికి నడవండి"
ఆవిడ ఇంటికేనని అర్ధం అయ్యింది ఎందుకంటే ఆవిడ ఇల్లే నాట్య కళాశాల కాబట్టి . 
మరలా ఇప్పుడు ఆవిడ ఇంటి దగ్గర పనేంట్రా బాబూ అనుకుంటూ వాళ్ళింటి దారి పట్టాం కళాకారులంతా వేన్ లోనుండి దిగారు. బాలక్క హారతి వెలిగించింది. అందరి చుట్టూ తిప్పింది. ఏవో మంత్రాలు కూడా చదివినట్లు  గుర్తు.పెద్ద  గుమ్మిడి కాయ పట్టుకుని అందరి చుట్టూ తిప్పి నేలనేసి కొట్టింది. అదంతా దిష్టి పోవడం కోసమని అర్ధమయ్యింది. నిజం చెప్పాలంటే నాకు అటువంటి వాటి మీద నమ్మకం ఎంత మాత్రం లేదు.కానీ ఆవిడ చేసిన ఆ చిన్న కార్యక్రమం నాలో ఎటువంటి ఫీలింగ్స్ కలగ  చేసాయో నేనెప్పటికీ మాటలలో ఐతే చెప్పలేను. కొంత సేపు అలా ఉండి పోయాను. కళ్ళలో నుండి నీళ్ళు బయటకైతే రాలేదు కానీ....


కళలో ఉండే మనుషులలో ఎన్నెన్ని ఫీలింగ్స్ ఏ స్థాయి లో కలగ చేస్తుందో ఆ రోజులో అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను.ఆ స్పందన అనుభవించిన వారికే అది తెలుస్తుంది. ఇది నిజమైన కళ యొక్క ప్రతిస్పందన అని నిస్సందేహంగా చెప్పొచ్చు. 


 కానీ ఈ మధ్య కాలంలో "కళ" అనే పదానికి చాలా నిర్వచనాలు వచ్చాయి.కొత్త నిర్వచనాలలో స్పందన అనేదాని కంటే అది సృష్టించే రికార్డ్ ల మీదే ఎక్కువ దృష్టి ఉంటోంది. ఐనా ఫరవాలేదులే ...ఏదో ఒక విధంగా మన కళళను ప్రపంచ వ్యాప్తం చేస్తున్నారన్న ఆనందం మిగలాలన్నా కూడా ఆ..యా.. ప్రోగ్రాంస్ నిర్వహించేటప్పుడు ఆ రంగాలలో లబ్ద ప్రతిష్ఠులుగా ఉన్న వారిని ఎక్కువగా వేదికల పై ఆశీనులయ్యేటట్లు చేస్తే కొంత ఆనందంగా ఉంటుంది. అలా కాకుండా మూడు  సంవత్సరాల క్రితం నిర్వహించిన "అన్నమయ్య లక్ష గళార్చన " కార్యక్రమమానికి ఆహ్వానించబడిన సినీ ప్రముఖులు మన కళామ తల్లికి ఎలాంటి సేవలు చేసారో....వారిని చూస్తే ఏ కళలు గుర్తుకు వస్తాయో ఆ కార్యక్రమ నిర్వాహకులకి తెలియదని అనుకోలేము. నాకర్ధమయ్యిందేమిటంటే  వాళ్ళ కార్యక్రమానికి వచ్చే ప్రచారం వాళ్ళకి ముఖ్యం . రెండు సంవత్సరాల క్రితం నిర్వహించిన "కూచిపూడి మహా బృంద నాట్యం " నిజంగా కూచిపూడి నాట్యానికి యే విధంగా ఉపయోగపడుతుందో నాకు అర్ధం కాలేదు. కొన్ని వేల మంది కేవలం ఒక చోట చేరి చేతులు ఊపితే అది నాట్యమవుతుందేమో నాకు తెలియదు.ఎలా ఐతేనే రెండూ గిన్నిస్ బుక్ లోకి ఎక్కేసాయి. అంటే అవి సృష్టించే ఆనందం ..స్పందనలు...ఇవన్నీ అర్ధం లేనివిగా మారిపోతున్నాయ్. రికార్డులు పరంగా మన సంస్థ వార్తల్లోకి ఎక్కేస్తే చాలు...మనం మన వంతు గా కళామ తల్లికి మన వంతు సేవ చేసేసి నట్లే....


బహుసా అందువలనేనేమో మా విశాఖ లో రోడ్ లు బ్లాక్ చేసి నిర్వహించే ప్రోగ్రాం  బేనర్స్ నిండా కళాకారుల పేర్లు రాసి పక్కన " డేన్స్ బేబీ డేన్స్ ఫేం" ...ఇంకేదో ఫేం ..అని గొప్పగా రాయగలుగుతున్నారు. నిర్వహించే వాళ్ళకి మాత్రమే ప్రచారం రావాలనుకునే ప్రోగ్రాంస్ అన్నీ ఒక్కటే...వాశి లో తేడా ఉండదు...రాశి లో తప్ప. 

5, మే 2012, శనివారం

నమ్మకం కలిగించు....జగమంతా వెలుగు నింపు..


టూ వీలర్ వెనక్కు తిప్పాను.ఎందుకో మా శ్రీమతికి చెప్పలేదు. రైతు బజార్ నుండి 200 మీటర్ల దూరం వచ్చి ఉంటాం.సంచుల నిండా కూరగాయలు కొనేసాం.ఐనా వెనక్కు ఎందుకు తిప్పానో మా శ్రీమతి కి అర్ధం కాలేదు.టూ వీలర్ పార్క్ చేసి తిన్నగా అంతకు ముందు కూరగాయలు కొన్న ఒక షాప్ దగ్గరికి నడిచి జేబు లో నుండి రెండు రూపాయల నాణెం తీసి అతనికి ఇచ్చాను.ఆ రైతు ముఖం లో ఆనందం.

" ఓస్ యీ మాత్రానికేనా....తరువాత వచ్చినప్పుడు ఇచ్చేసి ఉండే వాళ్ళం కదా.."
శ్రీమతి మెత్తగా విసుక్కుంది.


జరిగిన దాని గురించి పెద్దగా వివరించనవసరం లేదు సింపుల్ గా చెప్పాలంటే ఆ రైతు దగ్గర కూర గాయలు కొన్నప్పుడు 2 రూపాయల చిల్లర తక్కువ వచ్చింది.
" అన్నీ కొనుక్కున్న తరువాత యీయండి బాబూ" రైతుకు బేరం వదలడం ఇష్టం లేదు. అది జరిగిన తరువాత కూర గాయలైతే కొనేసాం కానీ ఆ 2 రూపాయలూ ఇవ్వడం మరిచి పొయ్యాం.


ఆలోచిస్తే యెవరికైనా సరే నిజంగానే తరువాత ఇవ్వొచ్చు అనే అనిపిస్తుంది. కానీ ఒక వేళ అది మనం మరిచిపోతే .......


అది ఆ రైతుకు పెద్ద నష్టం కాక పోవచ్చు కానీ అటువంటి సంఘటనలు రెండు మూడు జరిగితే ఆ రైతుకు మనుషుల మీద నమ్మకం పోతుంది.అతడు తోటి వారిని నమ్మడం మానేస్తాడు. అంటే తనుండే సమాజం మీద నమ్మకం పోతుంది. మనుషుల్లో ఎక్కువ మంది మోసగాళ్ళే అన్న నమ్మకం అతడిలో పెరిగి పోవచ్చు. చుట్టూ ఉన్నవాళ్ళంతా ఎలాగూ మోసగాళ్ళే గనుక తను కూడా ఎంతో కొంత మోసం చేయడం లో తప్పేముంది అనే ఆలోచన కూడా అతడిలో కలగొచ్చు.అంతా మోసగాళ్ళే కాబట్టి ఎలక్షన్లలో తనకు ఎక్కువ ఎవరి వల్లనైతే లాభం కనబడితే వాళ్ళకే ఓటెయ్యొచ్చు. ఆ విధంగా కొంత మంది అయోగ్యులు కూడా ప్రభువులుగా మారే క్రమానికి ఇతడు కూడా తన వంతు  సాయం చేసిన వాడవ్వొచ్చు.
పైదంతా చదివిన వారికి ఇదంతా చాదస్తంగా అనిపించొచ్చు. నాకు కూడా అలాగే అనిపించేదేమో  యీ మద్య కాలంలో జరిగిన  కొన్ని పరిణామాలు...నిన్న ట్రైన్ లో నడిచిన సంబాషణ జరగక పోతే. 


సంఘటన దగ్గరికి వస్తే గనుల మాఫియా లో అరోపణలు ఎదుర్కొంటున్న పక్క రాష్ట్రానికి ఒక మాజీ మంత్రివర్యుల వారి శిష్య గణం లొ ప్రముఖుడు (యీయన కూడా ఒక మాజీ మంత్రి వర్యులే) ఆ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలో 50000 పై చిలుకు  ఓట్ల ఆధిక్యతతో తిరిగి ఎన్నికయ్యారు. దీనిని అంత తేలికగా ఎలా తీసుకొంటున్నారో నాకు అర్దం కాదు.  


నిన్న ట్రైన్ లో యెక్కి కూర్చున్న కొంత సేపటికి నా ఎదురుగా కూర్చున్న ఒక పెద్దాయన చదవడానికి తన దగ్గరున్న డైలీ న్యూస్ పేపర్ ఇవ్వ బోయాడు.
"వద్దులెండి..నేను ఇంట్లో ____ పేపర్ చదివేసాను" సున్నితంగా తిరస్కరించాను. పైగా నేను చదుతున్న పుస్తకం కూడా  అప్పటికి చేతిలోనే ఉంది.
"అయ్యో ..నీవు చదివిన పేపర్ లో చాలా విషయాలకు కౌంటర్ దీంట్లో ఉంటుంది బాబూ" ఆయన వదిలేలా కనిపించలేదు. పుస్తకం మూసేసాను. 


"నేను పేపర్ వార్తల కోసమే చదువుతాను..ప్రచారాల కోసం కౌంటర్ల కోసం చదవనండీ..."


నేను కూడా ఒకప్పుడు అలాగే చదివే వాడిని బాబూ....కానీ యీ మద్య పేపర్లు చదువుతుంటే ప్రపంచం మొత్తం మోసం తోనే నిండి ఉందనిపిస్తోంది ...అందుకే సరదాగా అన్నీ చదివేస్తున్నాను."


" మరి మీరు రేపు ఎలక్షన్ల లో ఓటు వేయాలంటే యేంచేస్తారు" నాకు కూడా ఆయనతో మాట్లాడడం సరదాగానే అనిపించింది.


" యేముంది బాబూ...నిలబడ్డ వాళ్ళలో యెవరు తక్కువ మోసగాడైతే వాడికి వేస్తాను" 


ఆయన మాటల్లో నిజాయితీ ఐతే ఉంది.కానీ మోసగాళ్ళు రాజకీయ వ్యవస్థ జనం ఊహల్లోకి కూడా రావడం లేదన్న వాస్తవం నాలో ఎందుకో భయొత్పాతాన్ని కలగజేస్తోంది. ఒక వేళ ఇదే మొత్తం సమాజం యొక్క రాజకీయ ..తాత్విక చింతనగా మారితే...ఆలోచించదానికే భయంగా అనిపించింది. నేను పెద్దగా యేమీ చేయలేక పోయినప్పటికీ నా చుట్టూ ఉన్న వాళ్ళలో తిరిగి తోటి  మనుషుల మీద నమ్మకం కుదురుకొనడానికి యేమి చేస్తే బాగుంటుందో అలోచుస్తూ నా స్టేషన్ లో దిగాను.         
              

3, మే 2012, గురువారం

మత్తు వదలరా.....ఐ.పీ.ఎల్...మత్తు....




బాగా ఎండగా ఉంది. రోజూ కూర్చున్నట్లే అదే మామిడి చెట్టు క్రింద కూర్చుని మాట్లాడుకుంటున్నాం.ఒక విధంగా చెప్పాలంటే మాట్లాడుకుంటూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం.ఎవరో మోకాలి క్రింద ఫాంట్ పై ఎవరో తట్టినట్ట్లుగా అనిపించింది. టేబుల్ క్రింద చూస్తే ఒక కోడిపిల్ల...ఫాంట్ మీద యేదో పురుగు పాకి ఉంటుంది. దాని ఆహారాన్ని అది సంగ్రహించే ప్రయత్నం చేసింది. అవి పుట్టినప్పటి నుండీ మా సైట్ ఆఫీస్ లోనే పెరిగాయి కాబట్టి మరీ మనుషులంటే భయపడకుండా ఉండడం నేర్చుకున్నాయి.ఇవన్నీ చిన్నగా ఉన్నప్పుడు వీటిని చూస్తుంటే ఎప్పుడైనా ఉండే టెన్షన్స్ అన్నీ పోతుండేవి. మరీ ముఖ్యంగా యేదైనా  చెట్టు నీడన ఇవి చేరి మట్టిని కొద్దిగా తొలిచి తల్లి కోడి పడుకుని ఉంటే దాని మీదకు ఎక్కి ఇవి ఆడే ఆటలు....వాటిని కొద్దిగా తన భాషలో  గదమాయించే  తల్లి కోడి...సహజత్వానికి దూరమవుతున్న మనకు మరలా సహజత్వం లోకి జారుతున్నప్పుడు కలిగే  ఆనందం...అంతే కాదు మా వంటావిడ బియ్యం చెరుగుతున్నప్పుడు కిచ కిచ లాడుతూ అవి చుట్టూ చేరడం పైగా ఆ చిన్ని చిన్ని నూకలు తినడడానికి కూడా అవి వాటి బుల్లి బుల్లి కాళ్ళతో నేలను దువ్వడం అవి వాటి సహజత్వం లోకి ఎంత త్వరగా ఇమిడిపోతాయో చూస్తుంటే ముచ్చట వేసేది పైగా మనకు లేనిది అవి అనుభవించేస్తున్నందుకు అసూయ కూడా కలిగేది.


నా ఖర్మ కొద్దీ నేను రోజూ యీ కోడి పిల్లలతో ఆనందపడుతున్నప్పుడే మా విశాఖకు ఐ.పీ.ఎల్. మాచ్ లు వచ్చాయి.మొదటి నుండీ ఐ.పీ.ఎల్. నేపధ్యాన్ని చూస్తే నాకు పాత కాలం నాటి రోమన్ సామ్రాజ్యం ఉచ్చ స్థితి లో ఉన్నప్పుడు అంటే వాళ్ళు బానిసలను పూర్తిగా వాడుకోగల స్థితి లో ఉన్నప్పుడు కొంత మంది సెలెక్టెడ్ బానిసలను బాగా మేపి వాళ్ళ మధ్య కుస్తీ పోటీలు పెట్టి వాళ్ళలో ఒకడు చనిపోయే వరకూ ఆ పోటీని పెట్టి ..తిలకించి ఆ నాటి ఉన్నత వర్గాల వారు పొందే  లాంటి ఆనందాన్ని మనం పొందుతున్నామేమో అనిపించేది.ఎవరో కొంతమంది కోటీశ్వరులు ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసుకుని కొంతమంది ఆటగాళ్ళను అద్దెకు తీసుకుని ఆడిస్తుంటే వాటిని చూసి మనం ముచ్చట పడిపోతున్నాం.కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కొంత మంది ఆటగాళ్ళను కొని టీం లు తయారు చేసి ఆడిస్తుంటే మనం గంటల తరబడి రోజూ మాచ్ లు చూడడమే కాకుండా మరునాడు లోకల్ ట్రైన్ లోనో మరే విధంగానో ఉద్యోగానికి వెళ్తూ కూడా ఆ మాచ్ స్టాటిస్టిక్స్ మాట్లాడుకొంటాం.కొంత మంది యూరోప్ లో ఫుట్ బాల్ లీగ్ లకు దీనికి పోలిక  తెస్తున్నారు.  శతాబ్దాల తరబడి ఆసియా,ఆఫ్రికా దేశాలను దోచుకుని...దోచుకుంటూ ఎంతో ఆర్ధికాభివృద్ది లో ఉన్న వాళ్ళ ఆనందాలకు  ..మనకూ పోలికా...?

అంతవరకూ బాగానే ఉంది కానీ మాకు కాంప్లిమెంటరీ పాస్ లు దొరకడంతో మా వాడిని తీసుకుని వెళ్ళడానికైనా నేను ఒక ఐ.పీ.ఎల్. మాచ్ కు వెళ్ళక తప్ప లేదు. ఆ ఎరేంజ్ మెంట్ అంతా క్రికెట్ మాచ్ కు తక్కువగానూ,డెవలప్ చేసిన రికార్డింగ్  డాన్స్ కు ఎక్కువగానూ  ఉన్నట్లుగా అనిపించింది. నిజంగా చెప్పాలంటే క్రికెట్ కు మించి వేరే ఏదో ఆశించే  వాళ్ళతో స్టేడియం నిండిందని అనిపించింది. చాలా మందికి క్రికెట్ బేసిక్స్ తెలియవు. టీవీల్లో రోజూ చూపిస్తున్నారు కాబట్టి అందులోనూ చీర్ గర్ల్స్  సగం సగం దుస్తులతో కనువిందు చేస్తున్నారు కాబట్టి అక్కడికి  వెళ్ళిన వారికి ఏదో ఆనందం దొరికి పోతుందన్న భ్రమ లో వచ్చిన వాళ్ళు ప్రతి సిక్స్ కు ,ఫోర్ కు కుర్చీల మీదకు ఎక్కి డాన్స్ లు చేస్తుంటే వీళ్ళంతా క్రికెట్ కు వీరాభిమానులుగా చూపిస్తూ చానల్స్ టీ.ఆర్.పీ రేటింగ్ పెంచుకుంటుంటే ......ఈ దేశం లో కేవలం సర్వీసెస్ సెక్టార్ వలన మాత్రమే మన అభివృద్ది రేట్ నిలబడిందన్న నిజం....అది యే మాత్రం శాశ్వతం కాదన్న నిజం...మాన్యుఫేక్చరింగ్ రంగం లో మనం తిరోగమనం లో ఉన్నామన్న నిజం......ఇప్పుడున్న ఇంజినీరింగ్ విద్యార్ధులలో కేవలం 3% మందికే ఉద్యోగాలున్నాయన్న నిజం.....మరి ఐనా కూడా ప్రభుత్వం ఎవరి వృద్ది కోసమో  ఇన్ని ఇంజినీరింగ్ కాలేజ్ లకు అనుమతి ఇస్తుందన్న వాస్తవం.....అసలు ఈ మద్య కాలంలో ఎన్నికైన అసెంబ్లీ సభ్యులకు ...చాలా మందికి ఈ కాలేజ్ లు ఎందుకున్నాయన్న ప్రశ్న....ఇంకా ఇటువంటి కొన్ని వేల ప్రశ్నలు మన ముందు నృత్యం చేస్తున్నా కూడా ఇవన్నీ  మనకు అలోచించుకొనే ఓపిక....టైం....ఉండవు...ఉన్నా మనకేమీ పట్టనట్టు ఆనందంగా కాలక్షేపం చేయడానికి..... యువతరానికి మత్తు జల్లి వాళ్ళని నిర్వీర్యం చేయడానికే ఈ ఐ.పీ.ఎల్.పనికి వస్తుందన్న వాస్తవం కనీసం తలిదండ్రులు....అందులోనూ...బయటకు రావడానికే జడిసే మధ్య తరగతి తలిదండ్ర్రులు..గ్రహిస్తే.....పనీ పాటా లేకుండా ఇటువంటి పోస్ట్ లు రాసే నా లాంటి వాడు కొంత ఆనంద పడతాడు. 


ఆఖర్న ఒక్క విషయం అందులోనూ నాలో దాగున్న ఇన్నొవేటివ్ ఐడియా ను ఈ సందర్భంగా బయట పెట్టక పోతే మన కార్పొరేట్ ప్రపంచానికి ద్రోహం చసిన వాడనవుతాను. సమాజంలో  మారకపు విలువున్న ప్రతి వస్తువూ..సరుకే కాబట్టి....అందులోనూ కొంత యీ ఐడియాను సినిమా వాళ్ళు వాడుకున్నారు  కూడా కాబట్టి మరీ అంత గర్వ కారణమైనదేమీ కానప్పటికీ విన్నవించేస్తే కొంత మందికైనా మేలు చేసిన వాడనవుతానన్న తృప్తి ఉంటుంది. నేను రోజూ ట్రైన్ లో ప్రయాణం చేస్తుంటాను. పాపం కొంతమంది చప్పట్లు కొడుతూ అడుక్కొంటున్నారు. వారిని కించపరచడం నా ఉద్దేస్యం కాదని అందరికీ మనవి చేసుకుంటూ వారిని కూడా మన ఐ.పీ.ఎల్ వారు తగు విధంగా వాడుకోగలిగితే ..........వాట్..ఏ...బ్రిల్లియేంట్  ఐడియా...ఇప్పటికైనా నా ఇన్నొవేటివ్ నెస్ ను ప్రజలు గుర్తిస్తారని నమ్ముతాను.    

1, మే 2012, మంగళవారం

వేరే ప్రపంచపు వాసనలు

స్థలం: వెయిటింగ్  హాల్ ,ఐ.ఐ.ఎం.కలకత్తా
పీ.జీ.డీ.యెం. కోర్స్ కు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయ్. అదృష్టమో... యేంటో తెలియడం లేదు....కార్పొరేట్ నాయకులను తయారు చేసే కార్ఖానా లోకి అడుగు పెట్ట గలిగాను ..మా అమ్మాయికొచ్చిన కాట్ స్కోర్ వలన.       
"అదేంటమ్మా....అలా బిగదీసుకుపోయి ఉన్నారేంటి..?
మా అమ్మాయిని అడిగాను..అక్కడకొచ్చిన యువతీ యువకులను చూసి....
"వూరుకో నాన్నా...మన తెలుగు వాళ్ళు కూడా ఉండొచ్చు ఇక్కడ .....టెన్షన్ వలన ముఖాలు అలానే ఉంటాయి.... "
"టెన్షన్ యెందుకమ్మా.....వీళ్ళడిగిన కట్ ఆఫ్ మార్కులకి బయట కూడా మంచి ఉద్యోగాలో....వేరే కాలేజ్ లలో గాని సీట్ దొరుకుతుంది కదా...,ఇంత గొప్పవి కాక పోయినా ఉద్యోగానికైతే ఢోకా ఉండదు కదా......."
"ఇప్పుడవన్నీ యెవరూ చూడరు నాన్నా...ఇక్కడ వచ్చే పేకేజ్ రేంజ్ వేరు."
నిజమేనేమో.....కాంపస్ల లోనే ఉద్యోగాల సెలెక్షన్ అంటేనే మా టైం లో పెద్ద ఆశ్చర్యం.
యే.సీ. బాగానే పని చేస్తుంది. అయినా చాలా మంది ముఖాలకు  చెమటలు  పడుతూనే ఉన్నాయి. మధ్యలో లేచి టాయిలెట్ కి వెళ్ళి వస్తున్నారు. ఇంటర్వ్యూ దగ్గర పడ్డ వారు సూట్ సరి చేసుకుంటున్నారు.
"నీవు కూడా సూట్ వేసుకోవలసింది పప్పీ ...."
శ్రీమతి మా అమ్మాయికి సలహా యీయబోయింది.
"వూరుకోమ్మా...బయట ఉక్క యెలా చంపేస్తుందో చూడు.. నా ఒంటికి యేది హాయి అనిపిస్తే అది వేసుకుంటాను...."
మా అమ్మాయి ఖయ్యిమంది.
నిజానికి ఆ మాటలో చాలా విలువుందనిపించింది. మనకు నచ్చినట్టుగా మనం ఉండడానికి మించిన ఆనందం ఏముంది ? హుందాతనానికి సూట్ వేసుకోవడమొక్కటేనా మార్గం? నిజానికి సూట్ వేసుకున్నందుకు ఒక్క మార్క్ యెక్కువ వేసినా అది ఆ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ బానిస బుద్దికి నిదర్శనం మాత్రమే అవుతుంది.
ఎందుకో నాకు ముందు నుండీ కొన్ని సందేహాలు ఉంటూ ఉండేవి.ఈ కాలేజ్ అంటే ఐ.ఐ.ఎం. లాంటి విద్యా సంస్థలు కార్పొరేట్ లీడర్లను మాత్రమే  తయారు చేస్తాయా... ? నిజమే 1500000 ఫీజ్ కట్టి సమాజానికి పనికి వచ్చే చదువు ఎందుకు చదవాలి?
ఇక్కడే ఇంకొక సందేహం కూడా వస్తుంది. సామాజిక ప్రయోజనాలు వ్యక్తిగత ప్రయోజనాలకు దూరంగా ఎందుకు ఉండాలి?
మా అమ్మాయికి ఫైనల్ సంవత్సరపు పరీక్షలు లాంటివి యెక్కువగా ఉండడంతో మంచి మంచి టాపిక్ పై ఆర్టికల్స్ కోసం నేను ఎక్కువగా చదివాను. మొత్తానికి మా అమ్మాయికి ఎలా ఉన్నా గానీ నా జ్ఞానాభివృద్దికి బాగా ఉపయోగపడింది.
అలా చదువుతున్నపుడే కొన్ని కొన్ని విచిత్రమైన విషయాలు కూడా తెలిసాయి. ముఖ్యంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లాంటి టాపిక్స్ గురించి చూస్తున్నప్పుడు హ్యూమన్ హేపీనెస్ ఇండెక్స్ అనేది ఒకటుందనీ.....దానిలో కూడా రాంక్స్ ఉంటాయనీ వాటికీ హ్యూమన్ డెవలప్మెంట్ లో ఇచ్చిన రాంక్స్ కు చాలా వత్యాసాలు ఉన్నాయనీ....
అంటే డెవలప్మెంట్ అనేది అన్ని వేళలా సంతోషాన్ని సృష్టించదని చాలా స్పష్టంగా అంకెలతో నిరూపితమయ్యింది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన పక్కనే ఉన్న చిన్న రాజ్యం భూటాన్ అత్యంత సంతోషంగా జీవించే దేశాల  జాబితాలో 8 వ రాంక్ లో ఉంటే అమెరికా 22వ రాంక్ కు పరిమిత మయ్యింది. మరి మనకు ఆనందం కావాలా....అభివృద్ది కావాలా...కొంతమందికే ఫలాలు దక్కే అభివృద్ది మనకు అవసరమా.....
అలాగే ఒక ఉత్తమమైన వ్యాపారమంటే ఏమిటి ......అనేదానికి నిదర్శనంగా నిలిచిన ఆర్చిడ్ హోటల్ దానిని ఆ స్థానంలోకి తెచ్చిన వెంకటేష్ కామత్ భారత వ్యాపార ప్రపంచానికి ..అలాగే  యావత్ ప్రపంచ  వ్యాపార సామ్రాజ్యాలకు అందించిన సందేశం ...అనేక విషయాల గురించి మా అమ్మాయి బాగా చదివింది కానీ వాటి మీద మా అమ్మాయినే కాదు ఆ రోజు ఇంటర్వ్యూ లో యెవరినీ అడగలేదు...మరొక రోజు ఎప్పుడైనా అడిగారేమో తెలియదు. అత్యుత్తమమైన మూడు కాలేజ్ ఇంటర్వ్యూలు చూసిన తరువాత నాకనిపించిందేమిటంటే ఆ ఇంటర్వ్యూల కెళ్ళే వాళ్ళు జ్ఞానాని కన్నా అదృష్టాన్ని నమ్ముకుని వెళ్తే ఉత్తమమని.
అక్కడ అటెండ్ అవుతున్న వాళ్ళని చూస్తే ఎందుకో గాని నాకు గోదావరి తీరంలో ఉన్న మా స్వంత వూరికి వెళ్ళినప్పుడు .."యేరా అబ్బాయి..ఇదేనా రావడం..అంటూ పలకరించే  మా నాన్న గారి అన్నదమ్ములు... ఎండని పడి వచ్చావ్..కాళ్ళు కడుక్కో ..భోజనం చేసేద్దువు కాని..అంటూ పీట వాల్చి పళ్ళెం పెట్టే మా పెద్దమ్మలు...పిన్నమ్మలు...మిగిలిన బంధువుల అప్యాయంతో కూడిన పలకరింపులు..వ్యవసాయాలు కిట్టక పోయినప్పటికీ యెండల్లో పడి పనిచేసి ఇంటికి వచ్చి భోజనం కానిచ్చి కాస్త నడుము వాల్చి ..లేచిన తరువాత తుండు భుజాన వేసుకుని పొలానికి పొయ్యే ఆ కర్మ యోగులు మనసులో మెదిలారు. వీళ్ళ స్థాయికి  వాళ్ళు ఏనాటికీ రాలేక పోవచ్చు.....
ఇంటర్వ్యూ పూర్తి చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న కాంటీన్ కు వెళ్ళి యేవేవో ఆర్డర్ చేస్తున్నారు. ఇంచుమించు అందరి చేతుల్లోనూ...సాండ్విచ్చెస్ ..కోలా బాటిల్స్... పక్కనే ఫ్రిజ్ లో పడి ఉన్న అమూల్ బటర్ మిల్క్ బాటిల్ ను పాకెట్స్ ను వెనక్కి పడేసి ఆ కాంటీన్ కుర్రాడు కోలా బాటిల్స్ ను ఫ్రిజ్ లో సర్దుతున్నాడు......మేము నెమ్మదిగా బయట పడ్డాం.