మా సుపుత్రుడితో కలసి యీ మధ్య ద్వారకా నగర్ వైపు వెళ్తుండగా వాడికి ఆకస్మాత్తుగా ఒక సందేహం వచ్చింది. మనం చేసే మంచి పనులు అప్పుడప్పుడు మన పీకకే చుట్టుకుంటాయనడానికి మంచి ఉదాహరణ నేను ..మా సుపుత్రుడే. మాయా బజార్ సినిమా చూపించినప్పుడు వాడికి అందులో ఉన్న మంచి మంచి డైలాగ్స్ వివరించి చెప్పడం జరిగింది. " శత్రు మిత్ర చరిత్ర జ్ఞానం కావాలి" అన్న డైలాగ్ అందులో ఒకటి. అప్పటి నుండీ మా వాడు తన ధర్మ సందేహాలతో చంపేస్తున్నాడు.
మా విశాఖ లో యీ మద్య చాలా చాలా కొత్త విగ్రహాలు వెలిశాయ్. కొత్తవి కావడం వలన కావచ్చు అవి తళ తళా మెరుస్తున్నాయి కూడా. వాటి పక్కనే ఉన్న పాత విగ్రహాలు వెలిసి పోయి ఉన్నట్టుగానే ఉన్నాయ్. అంతే కాదు సైజ్ లో కూడా అవి అంటే పాతవి చాలా చిన్నగానే ఉన్నాయ్. అంతవరకూ ఫరవాలేదు కానీ మా వాడు కొన్ని యక్ష ప్రశ్నలు అడిగి నన్ను చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాడు. వాటికి సూటిగా సమాధానం చెప్పడం నావలన కావడం లేదు కాబట్టి యీ పోస్ట్ చదువుతున్న పాఠక దేవుళ్ళు యెవరైనా సరైన సమాధానాలు చెప్పి నా బాధను కాస్త పంచుకొంటారని ఆశిస్తాను.
ఒక సెంటర్ లోని పార్క్ లో ఉన్న విగ్రహం పేరు అడిగాడు. అదేదో యీ మద్యే కాల ధర్మం చెందిన రాజకీయ నాయకుడిది కాబట్టి పేరు చెప్పాను. వాడికి వెంటనే పేరు చెప్పాను. "నాన్నా మరి యీ పేరు మా బుక్స్ లో ఎక్కడా లేదు అన్నాడు.
"ముందు ముందు యెక్కిస్తారేమోరా..." సమర్దించుకున్నాను.
" ఐతే ఆయన చేసిన కొన్ని మంచి పనులు చెప్పు"
పచ్చి వెలక్కాయ గొంతులో పడింది.
అంతే కాకుండా యెక్కువగా కనబడుతున్న ఒక దివంగత ముఖ్య మంత్రి విగ్రహాల గురించి కూడా అడిగాడు.
" నాన్నా మరి మన టీవీలో ..పేపర్లో వాళ్ళ అబ్బాయిని సీ.బీ.ఐ. విచారిస్తోందని అంటున్నారు కదా..."
"అవును...ఇంకా విచారణే కదరా...నేరం కొర్టులో ఋజువవ్వ లేదు కదా...." నా తెలివి తేటలకు నేనే మురిసిపోయాను.
"ఒక వేళ ౠజువైతే ..అవన్నీ కూల్చేస్తారా... ఐనా నాన్నా.. చిన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం పక్కన ఆయనకంత విగ్రహం పెడుతుంటే యెవ్వరూ యేమీ అనలేదా?"
చచ్చాను...యేమి చెప్పాలో తెలియలేదు. మళ్ళీ మా వాడే కొనసాగించాడు.
" మరి .....తాతయ్య.....ఆ తరువాత.........తాతయ్య మన వూరికి సర్పంచ్ లు గా చేసారని చెప్పావుగా..మరైతే వాళ్ళ విగ్రహాలు కూడా మన వూళ్ళో పెట్టేద్దాం...మన ఇంటి దగ్గర సెంటర్ ఖాళీగానే ఉందిగా...
అలా చేయకూడదని చెప్పలేకపొయ్యాను. అసలు నాదగ్గర సమాధానమే లేదుగా...అందరి లాగే నా చర్మం కూడా మందమైనదే...మహనీయులు ,చరిత్రను మలుపు తిప్పిన వారు..పోరాటాల్లో సర్వస్వం త్యాగం చేసినవారి చిన్న మట్టి కొట్టుకు పోయిన విగ్రహాల పక్కన బంగారపు రంగు పూతతో కొత్త విగ్రహాలు అలా వెలుస్తుంటే చూస్తూ నోరు విప్ప లేక పోయిన దౌర్భాగ్యుల్లో నేనూ ఒకడినే కదా.....
యేది యేమైనా మా వాడికి సహజంగా వచ్చిన తెలివితేటలు తగ్గించేయాలి..లేక పోతే చాలా ప్రమాదం. ఇలాంటి ప్రశ్నలు వాడి మనసులో పెరిగి పోతే ముందు ముందు వాడు బ్రతకడమే కష్టం. వాడి తెలివి తేటల్ని శుభ్రంగా తుడిచేసి .. ...చక్కగా మాంచి ఫౌండేషన్ కోర్స్ చెప్పే ......టెక్నో స్కూల్ లో పడెయ్యాలి.....
యెంతైనా నేనూ ఒక తండ్రినే కదా......