21, ఆగస్టు 2011, ఆదివారం

భలే మంచి లాభసాటి ఉద్యమం ...

అబ్బ ....యెంత ఆనందం....ఒక మహా  ఉద్యమం మొదలవ్వ బోతోంది. చాలా సంతోషం. ఆన్నాహజారే ప్రారంబించిన ఉద్యమానికి మంచి ప్రోత్సాహం లభిస్తోంది. బహుశా  ఈ పదేళ్ళ కాలంలో ప్రజలు ఇలాంటి ఉద్యమాన్ని చూడలేదేమో. మీడియా కూడా మంచి ప్రచారాన్నిస్తోంది. వాళ్ళకు చాలా రోజుల వరకూ సెన్సేషన్ కోసం వెదుక్కోవలసిన అవసరం తప్పుతుంది.  ఈ  నేపధ్యంలో రెండు మూడు ఆత్మ హత్యలు జరిగినా ఆశ్చర్య పోనక్కరలేదు. లేదంటే  జరిగిన మరణాలన్నీ కూడా ఆత్మ హత్యలుగా మిగిలే అవకాశం కూడా యెక్కువే. చాలా మందికి ఇప్పటికే ఒక అవగాహన వచేసింది. ఈ ఉద్యమంలో పాల్గొంటే అరెస్ట్ లు లాంటివి జరిగే అవకాశం తక్కువే. జరిగినా కూడా దానివలన ప్రమాదం యెమీ ఉండదని కూడా అందరికీ తెలుసు ..అంతే కాదు అక్కడ కూడా మన పాండితీ ప్రకర్ష ప్రదర్శించొచ్చు..  ఆనంద పడ్డ స్టేషన్  స్టాఫ్ మనకు టీ లు సప్లయ్ చేసే అవకాశాలూ యెక్కువే.. యే విధంగా చూసినా చాలామందికి ఇది లాభసాటి ఉద్యమమే.
                   ఇది చాలా మందికి కోపం తెప్పించవచ్చు. కానీ మనం ఒక్క సారి కొన్ని విషయాలను సావధానంగా అవలోకిద్దాం. నేననుకోవడం ప్రకారం ఐతే చాలా మంది ఆ బిల్ ముసాయిదా కూడా చదివి ఉండరు. వూరేగింపులో పాల్గొని మాంచి ఆవేసం తో ఊగిపోతున్న కుర్రాడిని పిలిచి మనకేమి ఉపయోగమమ్మా యీ జనలోక్  పాల్ బిల్ వలన అని అడిగాను. ఆ కుర్రాడు తనకొచ్చిన యెస్.యెం.యెస్.  లో ఉన్న సారాంసాన్నాంతా చక్కగా చెప్పేసాడు.
 అప్పుడు అడిగాను..."నీవు చెప్పినదంతా బాగానే ఉంది కానీ నీవు చెప్పిన దానికి ..జన్ లోక్ పాల్ బిల్ కు సంబందం యేమిటి?"
" అదేంటి సార్...అందుకే కదా జన్ లోక్ పాల్ బిల్ తెస్తుంట"
నాకేమని చెప్పాలో అర్ధం కాలేదు.
ఒక్క సారి మనం మన దేశ పరిస్థితిని చూద్దాం. లెక్కల ప్రకారం మనం అభివృద్ది పధం లోనే ఉన్నాం. ఒక్క సారి గ్రామాల్లోకి వెళ్ళి వాస్తవాలు చూద్దాం. యెంత మంది రైతులు ఆనందంగా వ్యవసాయం చేస్తున్నారు? వ్యవసాయాధారిత పరిస్రమలు యేవైనా  మనగలిగి ఉన్నాయా.. కళ కళ లాడుతూ ఉండ వలసిన గోదావరి జిల్లాల లోని గ్రామాలు కూడా ఇప్పుడు యెలాంటి పరిస్థితి లో ఉన్నాయ్ ?


                యీ నాడు మనకున్న అతి ముఖ్య మైన సమస్య అదేనని కూడా చాలా మందికి తెలుసు. మరి దీనికి జన్ లోక్ పాల్ బిల్ కు యేమైనా సంబంధం ఉందా....ఇదొక్కటేనా.. ...రగులుతున్న సమస్యలు యెన్ని లేవు? వాటి కోసం యే చర్చా జరగదు...జరిగినా మనం పట్టించుకొం. ఒక్క సారి అంధ్ర జ్యోతి లో  శ్రీ  రామఛంద్రగుహ  రాసిన ఒక ఆర్టికల్ లోని ఒక్క వాక్యం ఇక్కడ రాయడం చాలా అవసరం అని నేను భావిస్తున్నాను. " నాగ్పూర్ లో లేక్మీ కంపెనీ వాల్ళు పెట్టిన ఫేషన్ షో కవర్ చేయడానికి 140 మందికి పైగా జర్నలిస్టులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. కానీ యీ చుట్టు పక్కలే జరిగిన లెక్కలేనన్ని రైతుల ఆత్మ హత్యలు కవర్ చేయడానికి 6 గురు  జర్నలిస్టులు కూడా  లేరు. " యీనాడు ప్రతీదీ మార్కెట్ వస్తువైనట్లుగానే  ఉద్యమాలు కూడా మీడియా కు మర్కెట్ ను తెచ్చి పెడతాయి. అందుకే వాళ్ళు చాలా సెలెక్టివ్  గా ఉంటారు. మార్కెట్   కాని ఉద్యమం వాళ్ళకు అవసరం ఉండదు. మరి యిదొక్కటే మార్కెట్ సరుకుగా మీడియా యెందుకు యెంచుకుందో ఒక్క సారి మనసు పెట్టి అలోచిద్దాం.
1. యీ ఉద్యమం లో పాలు పంచుకొనే వారికి యెలాంటి భయం ఉండదని మనం ముందుగానే అనుకున్నాం. కాబత్తి సహజం గానే పట్టణ మధ్య తరగతి ప్రజలు దీనిలో గరంటీ గా పాలుపంచుకొంటారు. నగరాల్లో జరిగే ఉద్యమాలను మాత్రమే అసలైన ప్రజా ఉద్యమాలుగా భావించే నేటి పరిస్థితులలో దీనికి మాంచి గిరాకీ ఉంటుందని మీడియా పెద్దలకు బాగానే తెలుసు.
2. ప్రెస్సర్ కుకర్ లా ఉన్న నేటి సమాజం లో కొంత ప్రెసర్ ని యేదో రూపం లో బయటకు పంపడం అధికార పీఠాలలో ఉన్న వారికి చాలా అవసరం. అందుకు యేదో ఒక ప్రమాద రహిత ఉద్యమానికి అన్ని వైపుల నుండీ మద్దతు అవసరం. లేదంటే యీ ప్రెసర్ వలన జనం అంతా భిన్న రూపాలు ..అంటే ఆ పీఠాలు కదిలించే ఉద్యమాలలోకి మళ్ళుతారు. యీ భావజాలాన్ని కాపాడుకొంటూ పై పై మెరుగులకే మీడియా ఇస్టపద్డుతుంది కాని పునాదుల మార్పంటే వాటికి కూడా భయమే....
యీ మధ్య పేపర్ చూస్తున్న వారికందరికీ ఒక్క విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇంతకు ముందు యెక్కువగా ఆకలి చావులు ఉండేవి.కానీ యీ మధ్య కాలంలో అవి రైతుల ఆత్మ హత్యలుగా మార్పు చెందాయి. కేవలం వ్యవసాయాన్ని ఒక వృత్తిగా స్వీకరించిన పాపానికి అనేక వేల మంది రైతుల ఆత్మ హత్యలు దేశంలో జరుగుతున్నప్పుడు మన స్పందన యేమిటి? మీడియా వారు చూపిన శ్రద్ద యేపాటిది?
చాలా కాలం క్రితమే మా వూరిలో జరుగుతున్న మార్పులు  చూసి యేదో మనకు తెలియకుండానే రైతులను నెమ్మదిగా యీ వృత్తి నుండి ద్దొరం చేసే పరిస్థితులు యేర్పడుతున్నాయేమోనని అనిపించేది. మా వూరు రాజమండ్రి పట్టణానికి అతి సమీపంగా ఉందే గ్రామం. నేను చదువుకుంటున్న రోజుల లోనే  పట్టణాన్నుండి బంగారం వ్యాపారస్తులు ,బట్టల వ్యాపారస్తులు మా వూరిలో భూములు   కొంటున్నప్పుడు నాకు అనిపించేది...మన రైతులు ఒక్కరు కూడా పట్టణాల్లో ఆస్తులు యేవీ కొనలేకపోతున్నారు..కానీ ఆస్తుల విలువ లెక్క గడితే పొలాల విలువా ఆయా వ్యాపారస్తుల పెట్టుబడులకన్నా అనేక రెట్లు యెక్కువగానే ఉండేవి. నేను ఆర్ధిక శాస్త్ర విధ్యార్ధిని కాదు కానీ యేదో తెలియని సమీకరణాలు రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని అర్ధం అయ్యేది.
యేమాత్రం ఆర్ధిక శాస్త్ర  జ్ఞానం లేని నాకే ఆ మాత్రం అర్ధం అయ్యినప్పుడు మనకున్న మేధావులెందరికో యీ విషయం అర్ధం అయ్యే ఉంతుంది. కానీ పరిస్థితులు ఆత్మహత్యలకు దారి తీసినా రాజధాని వీధులలో యే రైతూ ఊరేగింపు తీయలేకపోయాడు కాబట్టి అది భారత దేశపు సమస్యగా మన మీడియా  గానీ యీ రోజు ఊరేగింపులు తీస్తున్న వర్గాలకు గానీ పట్టలేదు.
ఒక సమస్య మీద పోరాడడం తప్పు కాదు ఆ పోరాటాన్ని సమర్ధించడం పొరబాటు కాదు కానీ పొలాలు వదిలి పారిపోతున్న రైతుల గురించి  అలోచించడం ముఖ్యమా....లేక ప్రధాన మంత్రిని లోక్పాల్ పరిధి లోకి తేవడం ముఖ్యమా..అనేది విజ్ఞులే అలొచించుకోవాలి.
ఆ నాడు జాతీయోద్యమం మొదలైనప్పుడు కూడా మనం దేని కోసం పోరాడుతున్నామన్నది ఆ పోరాటం  లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ ఒక అవగాహన ఉండాలని...కేవలం రాజకీయ స్వాతంత్రయం వలనే మన సమస్యలు తీరి పోవనీ...పోరాడ  వలసిన అంశాలు  ఇంకా అనేకం ఉన్నాయని ఆనాటి మేధావులు కూడా నొక్కి వక్కాణించారు.  అది యీ  నాటికీ కూడా మనం పట్టించుకోము. కేవలం మనకు విలన్లు ప్రధానమంత్రి..జుడీషియరీ  యేనా ....ఇంకెవరూ కాదా....అసలు మన చుట్టూ ఉన్నవారి  పాత్రా...దానికి మన ప్రతిస్పందనలూ..ఒక్క సారి చూద్దాం.....
ఒక సారి విజయవాడ రైల్వే స్టేషన్  అప్పర్ క్లాస్ వెయిటింగ్  రూం లో కూర్చుని  ఉన్నాను. రాత్రి 12 గంటలు దాటి ఉండవచ్చు..వస్తున్నవారి వివరాలు..రిజిస్టర్  లో రాయడానికి ఒక అటెండెర్  ఉంటారు. సాధారణంగా యిది కూర్చుని చేసే ఉద్యోగమే కాబట్టి స్త్రీలనే అక్కడ కూర్చో బెట్టదం జరుగుతుంది. ఒక వ్యక్తి సుమారు 40 సం. ల వయస్సు ఉండవచ్చు..తన కుమారుడితో.. ప్రవేశించడం  జరిగింది.. ఆవిడ వివరాలు అడిగింది. అతడిది జనరల్ టికెట్ కావడంతో ఆవిడ మర్యాదగా ఆయనను జనరల్ వెయిటింగ్  హాల్ కు వెళ్ళమని చెప్పింది. అతడు వినకుండా అక్కడే కూర్చున్నాడు..ఆవిడ అడుగుతుంటే "ఉండమ్మా...రిజర్వేషన్ చేయించుకొంటాం.".అంటూ దబాయిస్తున్నాడే కానీ అక్కడ నుండి మాత్రం కదల లేదు. జనం అంతా చూస్తున్నారు...కానీ యెవ్వరూ మాట్లాడడం లేదు. కానీ ఒక తోటి రైల్వే ఉద్యోగిని కాబట్టి యిది చూస్తూ ఊరుకోడం నా వాల్ల కాలేదు..తగిన శాస్తి జరిపించాను అది అంత ప్రధానం కాదు. కానీ   ఇక్కడ నేను చెప్ప దలుచుకున్న దేమిటంటే బాధ్యత గల పౌరుడిగా   మన వంతు కర్తవ్యాన్ని కొంతైనా మనం చేయం....." అన్నా హజారే ..జిందాబాద్..అంటూ.."గొంతు చించుకుంటాం...  కానీ కనీసం ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ ఉన్నా కూడా ధీమాగా ముదుకు పొయిన వాడిని నాలుగు పీకుదాం..అని మాత్రం అలోచించం. రిస్క్ యెవరిక్కావాలండీ...ఇదీ మన దౌర్భాగ్యపు పరిస్థితి..


                  ఇది మనకు ప్రతిదినం అనేక చోట్ల యెదురయ్యే దృశ్యమే ....కానీ మనది అతి మందమైన చర్మం కాబట్టి  ఇవన్నీ మనకు సాధారణమైనవి గానే కనిపిస్తాయి. ప్రస్తుతం పెందుర్తి గ్రామం నుండి  వైజాగ్ రైల్వే స్టేషన్  మరియు బస్ కాంప్లెక్స్ వరకు BRTS రోడ్ ఇంచుమించు పూర్తి కావస్తోంది. దీనివలన కొన్ని లక్షల మంది ప్రయాణీకులు యెంతగానో లాభపడతారు. ఆ రోద్ లో ప్రయానించే వాళ్ళకు ఒక చోట యీ పని లో బ్రేక్ కనబడుతుంది. వేపగుంట అనె సెంటెర్ కు ముందు రెండు చిన్న చిన్న మందిరాలు ఉంతాయి. వాటిని చూస్తే అవి యీ మధ్యనే అంటే 20 సం. లోపులొనే కట్టినవని అర్ధం అవుతుంది. ఇంతమంది ప్రయాణీకులు లాభపడతారని తెలిసినా ఆ మందిరాలను యెవ్వరూ కదప లేక పొతున్నారు. మందిరాలకి ..మానవత్వానికి దూరం సహజంగానే యెక్కువగానే ఉంటుంది కానీ అధికారులు....యువకులు ..ప్రజాసంఘాలు...మరి సో కాల్డ్ మీడియా యేమి చేస్తుందో తెలియదు. మరి అన్నా హజారే ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ వూరేగడం కంటే ఇటువంటివి ముఖ్యమని యెందుకు అనిపించడం లేదు. నేను ఒక్క వైజాగ్ లో రోజూ గమనిస్తున్న ఒక్క సమస్య గురించి ప్రస్తావించాను. మరి వెదికితే ప్రతి చోటా ఇటువంటివి యెన్నో ఉంటాయి. కానీ అవి మన దృస్టికి కనబడవు. కారణమైతే  నాకు ఒక్కటే కనబడుతుంది. మనమంతా ఒక అధీకృత భావజాలానికి అతీతంగా అలోచించడానికి ...యేదైనా ఆచరించడానికి వెనికాడుతూనే ఉంటాం. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. మధ్య తరగతి నుండి వచ్చిన విధ్యార్ధులకు సినిమాలు ,షికార్ల కంటే కూడా ఒక ఉద్యోగం, కుటుంబానికి తగినంత ఆసరాగా నిలబడడం తక్షణ అవసరం. కానీ కాలేజ్ లలో అది అధీకృత భావజాలం కాదు. నేను చదివిన తణుకు అప్పటికింకా గ్రామమే...అందులో ఉన్న మా కాలేజ్ ఆవూరికి గొప్పదే కాబట్టి కొత్త సినిమాకు అడిగినన్ని టికెట్స్ ఇవ్వలేదని గొడవకు బయలు దేరితే నా వెనుక వంద మంది పైగానే చేరేవారు. కానీ "ఉద్యోగమైనా...చూపండి లేదా జైల్లో ఐనా పెట్టండి " అన్న స్లోగన్ తో ఊరేగింపుకు బయలుదరినప్పుడు అందులో మా స్నేహితులం నలుగురిమే ఉన్నాము. పైగా ఆ రోజు బజార్ లో మాకు యెదురు వచ్చిన మా కాలేజ్ మేట్స్ మమ్మలని వింతగా  చూసారో లేదో తెలియదు కానీ మా మనసులో ఫీలింగ్స్ అలానే ఉన్నాయ్. ఐతే కాస్తో కూస్తో మొండి తనం ఉంది కాబట్టి..మేము చేస్తున్న పని మాకే కాకుండా పదిమందికీ మంచి చేస్తుందన్న అచంచల విస్వాసం ఉంది కాబట్టి మేము మా ప్రయాణాన్ని కొనసాగించాం.. మా భావజాలమే అక్కడ అధీకృత  భావజాలంగా నడిచేలా చేయగలిగాం.
టీవీలు....ఇంటర్నెట్ ..అంతకంటే దరిద్రమైన సెల్ ఫోన్ లు యువత ను సామాజిక బంధాల నుండే కాకా, సామాజిక అవసరాలను, సామాజిక సిద్దాంతాలను పట్టించుకోడం పూర్తిగా మానేసారు కాబట్టి కేవలం  రేటింగ్స్  కోసం గడ్డి తినే చానల్స్ వారు చాప క్రింద నీరులా ప్రవహింపచేస్తున్న మాయాజాలం లో పడకండి. మీరు అన్నా హజారే లా ఇక్కడ యేదైనా చేస్తే వారు కవర్ చేయరు. మీరందరూ కలసి ఊరేగింపులు తీస్తేనే వాళ్ళు కవర్ చేస్తారు. యెందుకంటే వాళ్ళకు యెప్పుడూ ఒక మార్కెట్ విలువ ఉండే వస్తువు కావాలి. మీరు ఊరేగింపులు తీస్తే అక్కడ ధిల్లీలో దీక్ష చేస్తున్న వారి మార్కెట్ విలువ ఇతోధికంగా పెరుగుతుంది. కాబట్టి మీరే అన్న హజారే లా ఉండాలో...లేక అన్నా హజారే కోసం ఊరేగింపులు చేసేవారిగా ఉంటారో మీరే తేల్చుకోండి.


అనుకున్నట్లుగానే అంతా సుఖాంతం అయ్యింది. ఒక్క సారి ప్రభుత్వం ప్రకటించిన లోక్ పాల్ ముసాయిదా ను ,అన్నా హజారే ప్రతిపాదించిన ముసాయిదా ను కూలంకషంగా ఒక్క సారి పరిశీలించండి. నాకైతే రాణీ గారు సన్నజాజుల బదులు మల్లెలు తెచ్చిన రాజా వారి మీద అలిగిన చందాన అంపించింది. దాని కోసం ఇంత హంగామా చేయడం అవసరమా....యేమో తెలియదు. నాకైతే మాత్రం అనేకానేక సమస్యల వలయం లో ఉన్న మనం యీ ఒక్క సమస్యనే జాతీయ సమస్య గా చేయడం వలన అసలు సమస్యలు పక్క దారి పడుతున్నాయేమో అనిపిస్తుంది. యేది యేమైనా అన్నా నిమ్మరసం తాగేసారు కాబట్టి నాకు మాత్రం కొంత ఉపసమనం కలిగింది. యెందుకంటే నిన్ననే ఒక నటీమణి  తన వీపు మీద అన్నా టాటూ వెయించుకొని పత్రికలకు ఫోజిచ్చింది. ఆయన ఇంకా ఇదే దీక్షలో కొనసాగుతుంటే ఇంకా మిగిలిన వారు ఇంకెక్కడ ఆ టాటూ లు పొడిపించుకుంటారో అన్న టెన్షన్ తో చచ్చి ఉండేవాడిని. ఒకసారి మంచి మార్కెట్ కు యెక్కిన దేనినీ మన వాళ్ళు వదలరని  తెలుసు కదా.. 
ఇందాకనే జే.పీ ఒక ఇంటర్వ్యూ లో ఒక మాట చెప్పడం విన్నాను. అందరిలో మార్పు కోసం తపన, పోరాడే పటిమ ఉంటేనే యే ఉద్యమమన్నా ముందుకు వెళ్ళతాయే తప్ప యే ఒక్కరి మీదో ఆధార పడి ఐతే కాదు. ఒక సారి యేదైనా పేరు వచ్చిన గుడికి వెళ్ళి చూడండి. యేదో ఒక అడ్డ దారిలో (వీ.ఐ. పీ కోటా, స్పెషల్ దర్శనాలు కూడా యీ కోవలోకే వస్తాయి) దేవుడిని దర్శించుకుందామనే తపన, అంటే కనీసం అక్కడ కూడా మనం యెంతో కొంత న్యాయాన్ని పాటిద్దామని ప్రయత్నించం. దేవుడి దగ్గరే అడ్డదారులు అంగీకారం అయినప్పుడు మిగిలిన చోట్ల అదే దారిలో వెళ్ళడానికి మనమెందుకు ప్రయత్నించం. అంతేకాదు నీవు తలనీలాలు సమర్పించుకొంటేనే సర్వ పాపహరణం జరుగుతుందని నమ్మడంలో యెన్ని ప్రమాదాలో ఒక్కసారి చూద్దాం. నీవు పాపం చేసావంటే సమాజం లో యెవరి కో నీ వలన అన్యాయమో..అపకారమో జరిగి ఉంటుంది. దానికి పరిహారం యేమిటంటే తిరిగి నీ వలన నష్త పోయిన వారిని యేదోలా ఆదుకోవడం..లేదా అది వీలు కాక పోతే అవసరం లో ఉన్న మరొకరికైనా సాయం చేయడం. ఇదే హేతుబద్దమైనదని విజ్ఞులెవరైనా ఒప్పుకుంటారనే భావిస్తున్నాను. కానీ దీనిని కాకుండా గుడికి వచ్చి తలనీలాలు ..అర్పించుకోడం..లాంటివి చేయడం వలన యెవరికి లాభం...నాకేమని అనిపిస్తుందంటే దీంట్లో ఉన్న ఒకే ఒక సౌలభ్యం వలన ప్రజలు యీ పద్దతిని అమోదించేసారని. అదేమిటంటే నీవు అపచారమో ..లేక అన్యాయమో చేసినట్టు యెవరికీ తెలియకుండానే నీ పాప పరిహారం జరిగిపోతుంది...యీ పద్దతిలో. అందుకు యీ గుళ్ళ చుట్టూ మహాత్యాల కధలు సృష్టించబడ్డాయి ...వాటినే నమ్ముకుంటూ మనం మాత్రం సమాజాన్ని అధోగతిలోకి నెట్టుతూనే ఉన్నాం.


మనమెంత పాపమో లేక అన్యాయమో చేసినా  కూడా దాని  పరిహారం సమాజానికి యే మాత్రం జవాబుదారీ తనం వహించకుండానే జరిగిపోతోంది...ఆహా యెంత గొప్ప సౌలభ్యం..యీ విధమైన సౌలభ్యం మిగిలిన మతాలలో ఉందో లేదో తెలియదు కానీ యీ విధమైన సామాజిక, తాత్విక చింతన ఖచ్చితంగా మనను ఖచ్చితంగా పాతాళానికి గెంటుతూనే ఉంది. పుణ్య సాధనకు గుడికి వెళ్ళి పూజలు చేసే వారిని, తల నీలాలు అర్పించుకునే వారిని నేను యే మాత్రం ఆక్షేపించను యెందుకంటే అది వారు నమ్మిన ధర్మం లో భాగం.


ఒక సారి మా అమ్మాయి ఇంటర్మీడియేట్ పరీక్షలు ప్రారంభానికి ముందు హాల్ టికెట్స్  గుడికి తీసుకెళ్ళి పూజ చేయిస్తున్నారు నాన్నా  నేను కూడా వెళ్తాను అన్నది. ణేను ఒక్క విషయం తనకు అర్ధం అయ్యేలా చెప్పాను. మార్కులకి పూజకు సంబందం పెట్టకు ..నీకు వేరే వారి అక్రమాల వలన అన్యాయం జరగకుండా చూడమని మాత్రం ప్రార్దించు. ఇంకొక విషయం యేమిటంటే అక్రమం జరిగ్తుందని ఒక వేళ నీకు తెలిస్తే దాని నివారణకు మార్గం దేవుడిని అడగకు. పోరాడడం మన పని. ఒక విషయం నాకు అర్ధం కాని దేమిటంటే మనం మన తలిదండ్రుల మీద భారం తగ్గించాలంటే వాళ్ళు చేస్తున్న పనిలో  భాగస్వాములవుతాం. అదే విధంగా మనం నిజంగా భగవంతుడిని పూజించాడం కంటే ఆయన చేయవలసిన పనిలో భాగస్వాములమైతేనే ఆయన సంతోషిస్తాడని అనిపిస్తుంది. కాబట్టే ప్రజల నుండి వసూలు చేసిన సొమ్ముతో గుడి కట్టిన రామ దాసు కంటే ఆ విధంగా చేసిన ఆయనను జైలులో వేసిన తానీషాయే గొప్పవాడిగా  కనిపిస్తాడు.
యీ క్రింది మెయిల్ ఇప్పటికే చాలా మందికి వచ్చి ఉంటుంది ..మరి పోరాటం యెలా మొదలవుద్దో చూద్దాం.
     


        








14, ఆగస్టు 2011, ఆదివారం

నా అందమైన కల -సాఫల్యం

నాకొక అందమైన కల ఉండేది . ఏమో కొంత మంది పిచ్చి కల అని కూడా అంటారేమో..... 

ఒక చక్కటి కాలనీ ..అంటే అది కాలనీ లా ఉండ కూడదు. ఒక చక్కటి తోటలో ఇళ్ళు పేర్చి నట్లుగా ఉండాలి. ఆ ఇళ్ళుకూడా భారీ కాంక్రీట్ భవనాలు కాదు. అవసరానికి సరి పడా ..హోం అనే పదానికి పర్యాయపదం గా ఉండాలి. ఇంటి చుట్టూచక్కటి చెట్లు...విరిబూస్తున్న పూవులు...చెట్లకు కాస్తున్న పళ్ళు.... ఆకు కూరలు ఒక పక్కన...కాయ గూరలు ఒకపక్కన...కార్లు అన్నీ కాలనీ బయటే పార్కింగ్ ...ఒక్క నడవలేని స్థితి లో ఉన్న వారికే కారుతో కాలనీ లోకి ప్రవేశించేసౌకర్యం .....కాలనీ లో తిరగడానికి కాలి నడకే సాధనంగా ఉండాలి..లేకుంటే సైకిల్ .... 



ఇంతేనా...ఇంకా చాలా ఉంది ....ఎవ్వరూ ...రెండో అంతస్తు మించి కట్ట కూడదు. ఆ కాలనీ లో పవర్ అనేది  ప్రాబ్లం గా ఉండకూడదు. కిచెన్ వేస్ట్ దగ్గర నుండి ప్రతి డిస్పోసబుల్ మెటీరియల్ బయో గాస్ ఉత్పాదనకు వినియోగించాలి. మంచినీళ్ళతయారీ ..అంతా...సోలార్ సిస్టం తో నడవాలి. నీళ్లన్నీ వృధా కాకుండా రీ సైకిల్ చేసి మొక్కలకోసం వాడాలి. సర్ఫేస్ నీరు    తప్ప గ్రౌండ్ వాటర్ జోలికి వెళ్ల కూడదు. ముఖ్యమైన విషయం ప్లాస్టిక్ వస్తువేదీ కాలనీ లో కనబడ కూడదు. పిచ్చిబాగా తలకెక్కిందనుకుంటున్నారు కదా...లేదు ఇంకా మోకాలి దగ్గరే ఉంది.... 
ఏ.సి. వాడితే కాలనీ లో గాలి వేడెక్కే అవకాశం ఉంది కాబట్టి వాటి పైన నిషేధం ఎలాగూ ఉంటుంది. మరి వేసవి తాపాన్నితట్టుకోడం ఎలా...దానికి కూడా సమాధానం ఉంది...గ్రీన్ హౌస్ కాన్సెప్ట్ తో .....స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ,కొచ్చిన్ వారుసూచించిన విధంగా గాలి వెలుతురూ ..ధారాళంగా వచ్చే విధంగా ....కేవిటీ గోడలు మరియు పైకప్పు వేసి..ఆ పైన ఇటుకముక్కలు ..సున్నం కలిపి..ఒక పొరగా వేసి..దాని పై న సూర్య రశ్మి లోని రేడియేషన్ ని తగ్గించగల తెల్లటి రిఫ్లెక్టింగ్ టైల్స్వేసుకుంటే నిస్సందేహంగా ఇంట్లో ౩౦ డిగ్రీలు మించి వేడి ఉండదు. వేడి తక్కువగా ఉన్నప్పుడు ఒక మామూలు ఫ్యాన్సహాయంతో ఉక్క పోతను తట్టుకోవచ్చు. పిచ్చి నడుము దాకా...వచ్చింది కదా......మిగిలింది చూద్దాం.
కాలనీ లో ఏ మతానికీ సంబందించిన ప్రోగ్రామ్స్ జరగ కూడదు. లో లోపల ఏ మతాన్ని అభిమానించినా బయట మాత్రంఒకే కామన్ మతం. మానవతా వాదం. మైక్ గోల అనేది ఉండ కూడదు. మరీ అంత మూర్ఖత్వమా....అనుకుంటున్నారా...మతానికి సంబందించని....ఒక గొప్ప కళాకారులకి మాత్రం అందరి అనుమతితోప్రోగ్రాం ఎరేంజ్ చేయవచ్చు...దానికోసం చక్కని ఆడియో సౌకర్యం ఉండే ధియేటర్ ఉండాలి. దానికి ఆనుకొనే ఒక చక్కటిలైబ్రరీ ఉండాలి. దానిలో చక్కటి పుస్తకాలతో బాటు.. అనేక ఉచిత"ఈ "బుక్స్ చదువుకొని డౌన్ లోడ్ చేసుకొనేసదుపాయం..(రుసుము వసూలుతోనే ..) ఉండాలి. లైబ్రరీ కి వచ్చినా రాక పోయినా ...దానికి అయ్యే ఖర్చు మాత్రంఅందరి మీదా పడుతుంది. ప్రతి నెలా ఒక రోజు ప్రపంచ గతిని మార్చి వేసిన మహనీయుల పుస్తకాల మీద చర్చ లుఉంటాయి. ఉత్తమ ఉపన్యాసకుడికి పుస్తక బహుమతి లాంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా కాలనీ వాసులుఅందరూ భరించాలి. అంతే కాదు బయట ప్రదర్శితం కాని ఉత్తమోత్తమ చలన చిత్రాలను కూడా కాలనీ వాసులకి అందుబాటులో ఉంచాలి. 

 వయో బేధం లేకుండా అందరికీ  శారీరక వ్యాయామాలు చేసే సదుపాయం ఉండాలి. తక్కువ ఖర్చుతోనే ఉల్లాస్సాన్నిచ్చే  వాలీ బాల్, బాడ్మింటన్ లాంటి క్రీడలకు ప్రత్యేక ప్లే గ్రౌండ్ ఉండాలి.
 నేనేమన్నా ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నానేమో తెలియదు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద  రియల్ ఎస్టేట్ వెంచర్స్ యొక్క ప్రకటనలు ఒక్క సారి చూస్తే నావేమీ గొంతెమ్మ కోర్కెలు కావని సులువుగా ఎవరికైనా అర్దం అవుతుంది. క్లబ్ హౌస్ ..జిమ్...స్విమ్మింగ్ ఫూల్స్ ఒకటేమిటి మనలను ఫూల్స్ చేసే సమస్తం అందులో కనబడతాయి. ఈ ఏడ్స్ చూస్తున్నప్పుడు నాకేదో వెలితి ఉన్నట్లుగా అనిపించేది. ఇవన్నీ ఆ యా కాలనీ వాసులని ఆత్మీయంగా ఉంచుతాయా...ఎవరి మానసిక ప్రపంచంలో వారిని బ్రతికేలా చేస్తాయా....అలోచించి నాకంటే తెలివైన వారు చర్చిస్తే బాగుంటుంది. 
   నేనెప్పుడు సెలవులకి వూరికి వెళ్ళినా మా నాన్న గారు.."ఏమిటోరా ...జనం ఎవరూ కలవడం లేదు..ఏమీ తోచుబడి కావడం లేదు " అంటూనే ఉంటారు. మరి ఇంట్లో టీవి తో సహా అన్ని సదుపాయాలూ ఉన్నాయి. నాకర్దమైన విషయం ఏమిటంటే మనం టీవీ లో ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా చూడొచ్చు. అంటే మనం కేవలం ప్రేక్షకుడి గానే మిగిలిపోతాం.మన ఆలోచనలన్నీ మన లోనే ఇమిడి పోతుంటాయి. సమాజం లో అసలు ఇబ్బంది అక్కడే కనిపిస్తుంది. మామూలుగా ఉండవలసిన సోషల్ interaction  ఉండడం లేదు. కేవలం కొన్ని స్పెషల్ ఫంక్షన్ లోనే కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కాస్త సమయం లోనే లేని పోని భేషజాలు ప్రదర్సిస్తున్నాం. ఇదంతా చూసి చూసి....నాలో పైన చెప్పిన కల ప్రారంభమైంది. 
 దీని గురించి అలోచిస్తున్నప్పుడే అనుకోకుండా మా మామయ్య తన మనసులో ఉద్దేశ్యం చెప్పాడు. గనులు తవ్వడం పూర్తవ్వగా మిగిలి పొయిన గోతులలొ మంచి మట్టి నింపగా ఇంచు మించు నాలుగు యెకరాల ఖాళీ స్థలం యెర్పడిందనీ..దానిలో యేదైనా నేచురోపతి కి సంబందించిన ఆశ్రమమేదైనా కట్టాలనున్నదని చెప్పాడు . నాకెందుకో ఇది జరిగే పనేనా అనిపించింది. కానీ తనే పది సార్లు ఫోన్ చేసేసరికి నెమ్మదిగా ఒక్కొక్కటీ డిజైన్  చేయడం ప్రారంభించాను. ప్రారంభించిన కొద్ది రోజులకి బ్రోచర్  వేయడం జరిగింది.దానిని చూస్తే నా కలలు కొన్నైనా నెరవేరే  సూచనలున్నాయని మీరే ఒప్పుకుంటారు. 

పైనున్న బొమ్మ బ్రోచర్ మొదటి పేజ్ . యీ క్రింది పేజ్ యోగా హాల్ కి సంబందించినది. దీనిలో మొదటి అంతస్తు అన్ని హంగులతోనూ పూర్తికావస్తోంది. పక్కన ఇచ్చిన సమాచారం 100% వాస్తవం.
యీ దిగువన ఇచ్చింది పేషెంట్స్ కు ఇచ్చే గదుల సముదాయం. యీ భవన నిర్మాణం పూర్తయ్యింది.
  అంతే కాకుండా నేను కలలు గన్న గ్రీన్ హౌస్  కాన్సెప్ట్ 
తో కట్టబోయే కాటేజ్ లు కొద్ది రొజుల్లోనే రూపు దిద్దుకోబొతున్నాయి. అనతి కాలం లోనే  యే విధమైన యే.సీ. లు వాడకుండానే మనం చల్లగా ఇంటిని ఉంచగలమని చూపిస్తున్నాము.  వాటి నమూనా  నమూనా క్రింద ఇస్తున్నాను.








నా కలలలో చాల భాగం ఇక్కడ నిజ రూపం దాల్చనున్నాయి. వాటితో బాటు మనకు అవసరమైన ఆయుర్వేద మొక్కలతో ఒక పూర్తి స్థాయి పార్క్  డిజైన్ చేయడం జరిగింది. ఆ మొక్కలన్నీ కూడా జైపూర్ (ఒడిషా) నుండి ఉపలభ్యం కానున్నాయి. వాటి మీద నుండి వచ్చే గాలి కూడా మానవ శరీరానికి  స్వాంతన చేకూరుస్తుంది.
మానసికంగా ఉల్లసం కలిగించడానికి చక్కటి లేండ్ స్కేపింగ్ దిజైన్ చేయబడింది. యీ మొత్తం పనిలో సంకేతికతలో  (టెక్నికల్)    ముఖ్య భూమిక నిర్వర్తించగలిగినందుకు నా కలలే కాకుండా నా జీవితం కూడా సాఫల్యం చెందుతుందని మనసారా నమ్ముతున్నాను. యెందుకంతే మల్తీ స్పెషాలిటీ పేరుతో జరుగుతున్న దొపిడీ కి వ్యతిరేకంగా నా వంతు పాత్ర నేను నిర్వర్తించగలుగుతున్నాను.
యీ మహత్తర ఆశ్రమం 99% దసరా పవిత్ర దినం నుండి ప్రారంభం కావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

యీ ఆశ్రమం  చుట్టూ ఉన్న భూమి చక్కటి కాలనీ  కట్టడానికి యెంతో అనువుగా ఉంతుంది. స్నేహితులు ...ఆప్తులు సహకరిస్తే ...పచ్చటి చెట్లు.... ..రంగు రంగుల పూవులు.....పక్షుల కిలకిలలు.... పిల్లల ఆట  పాటలు...నడి వయస్సు వారి ఆత్మీత తో కూడుకున్న పలకరింపులు...సమాజానికి మార్గ దర్సకత్వం వహించేవారి చర్చలకు కేంద్రంగా....చర్చలే కాదు కార్యాచరణకు  కూడా కేంద్రంగా ..కృత్రిమత్వం అనేది కనుచూపులో లేకుండా ..హేతుబద్దమైన  సాంప్రదాయ  సాంస్కృతిక కార్యకలాపాల నిలయంగా ..పరిసరాలు  చూడ గానే ..."అందమె ఆనందం ..." అనే మధుర గీతాన్ని పెదవుల పైకి తెచ్చే విధంగా ..ఒక కాలనీ నిర్మిచాలని ఉన్నది. అది అందరికీ నచ్చక పోవచ్చు కానీ మహా మానవతా సువాసనలు జీవిత చరమాంకం వరకూ ఆఘ్రాణించాలనుకునే వారికి పూర్తి అనువుగా ఐతే ఉండగలుగుతుంది.

చివరిగా చిరునవ్వుతో ముగిస్తాను. నా అలోచన అంతా విన్న మా బావ మరిది ఒకరు " ఇంతకూ ఆ కాలనీ కి యే పేరు పెడతావు బావా ?" అని అడిగేడు.
"థింకర్స్ కాలనీ అని పెడితే యెలా ఉంటుంది ?" అన్నాను.
" వూరుకో బావా...హేపీ గా డ్రింకర్స్ కాలనీ అని పెట్టు ...నెల రొజుల్లో ప్లాట్స్  అన్నీ నేనే అమ్మించేస్తాను" అన్నాడు
నిజమేనేమో...