13, ఏప్రిల్ 2014, ఆదివారం

నిండుగా నవ్వైనా లేని బ్రతుకు ..... ఛీ .....

టక ..... టక .....

ఛీ ... పొద్దున్నే చంపేస్తారు సెలవు రోజున కూడా .....

పాలు తెచ్చే పని లేదు ... శ్రీమతి , పుత్రరత్నం వూరెళ్ళారు కాబట్టి ..... ఆనందంగా రెస్ట్ తీసుకునే మూడ్ లో ఉండగా .....

టక ..... టక .....

తలుపు తీశాను ......

ఎదురుగా ఒక వెర్రి నవ్వు నవ్వుతూ ఒక యువకుడు ....

సార్ ..... మీరేమీ అనుకోక పోతే నాకు ఒక్క అయిదు నిముషాల టైం ఇవ్వండి .... మరలా వెర్రి నవ్వు ......

జాలి వేసింది .... లోపలికి రానిచ్చాను .

"మీకొక మంచి investment ప్లాన్ చెప్పొచ్చా సార్ ?"

"చెప్పు ..... " కసి గానే అన్నాను .

"సార్ .... మార్నింగ్ వాక్.....  సముద్రాన్ని చూస్తూ చేస్తుంటే థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా ..... "

"పగలంతా నా ఉద్యోగం ..... నడిచే ఉద్యోగమే ..... వేరే వాకింగ్ అవసరం లేదు ...... "

"అలా కాదు సార్ .... ఎటు చూసినా పచ్చదనం ఉండే పరిసరాలు ..... ఇంకా .... "

"అవసరం లేదు ... మా రైల్వే ట్రాక్ ఇళ్ళ మధ్య ఉండదు ..... పచ్చదనం మధ్యే ఉంటుంది . "

"నాకు ఒక్క చాన్స్ ఇవ్వండి సార్ ... మీరు ఎండలో పగలంతా తిరిగి వచ్చి మా .... హిల్స్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లోకి దిగి ..... "

"ఆగాగు .... సైట్ నుండి తిరిగొచ్చిన నా శరీరంతో స్విమ్మింగ్ పూల్ లోకి దిగాననుకో ..... ఆ నీళ్ళన్నీ కుళ్ళు కంపు కొడతాయ్ ..... అవన్నీ చెమటంటే తెలియని వాళ్ళకోసం ..... మా లాంటి వారి కోసం కాదమ్మా ...... "

"మీకింకో ఆప్షన్ ఉంది సార్ ...... మీరు ఇంటికెళ్ళి ఫ్రెష్ అయి స్విమ్మింగ్ పూల్ లోకి దిగొచ్చు ..... "

"నీవు చెప్పిన ఆప్షన్స్ .... మాకుండవ్ ..... మాకింటికి వచ్చిన తరువాత మా పెద్దాఫీసర్ లు పగలంతా చేసిన వర్క్ మీద రివ్యూస్ ....చేస్తారు తెలుసా ?"

"అదేంటి సార్ ..... వాళ్లకు ఫేమిలీస్ ఉండవా పాపం .... ?"

" ..... వాళ్లకు ఫ్యామిలీస్ ఉండవా .. వాళ్ళకు టేస్ట్  లు తెలియవా .....వాళ్ళు చిట్టు ,ఉలవలు మాత్రమె తినేవాళ్ళా ....... వాళ్ళు ఆఫీస్ టేబుల్స్ ని మాత్రమే ప్రేమిస్తారా? ..... లాంటి వెధవ ప్రశ్నలు వేయకు .... నీవు చెప్పాల్సింది చెప్పు చాలు "   

"మీ భాష చూస్తుంటే మీరు మీ ఉద్యోగంతో ఎంత విసిగి పోతున్నారో అర్ధం అవుతుంది సార్ " ఐనిస్టీన్ లెవెల్లో ఫీలింగ్స్ పెట్టి మరీ చెప్పాడు.

"అయితే .... "

" మీ ఇల్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటే  మీ శ్రమను మరిచి పోయి మీరు చాలా త్వరగా రిలాక్స్ అయిపోతారు సార్ ...... దానికోసమైనా మీరు మా ..... హిల్స్ లో ఫ్లాట్ బుక్ చేసుకుంటే ..... "

"ఆగాగు ..... మీ హిల్స్ ఇక్కడకెంత దూరం ?"

"నిజం చెప్పాలంటే కేవలం 30 కిలోమీటర్స్ ఉంటుంది."

" ఈ లోపుగానే చాలా పల్లెటూర్లు తగలుతాయి కదా ..... "

" అక్కడెక్కడైనా  ఏదైనా రైతు దగ్గర చిన్న ముక్క భూమి కొనుక్కుంటే నీ .... హిల్స్ లో ఉన్న రేటుకి మూడో వంతుకే రావొచ్చు  కదా ..... "

"కానీ సార్  మా ... హిల్స్ లో ఉండే మిగిలిన సౌకర్యాలు ...... క్లబ్ హౌస్ ..... "

"నేను ... నా కుటుంబం ....క్లబ్ హౌస్ లో ఏమి చేయాలి ?"

"అంటే .... మీరు వారం ....వారమ్ సినిమా చూడొచ్చు ..... "

"ఇప్పుడు చానల్స్ లో వస్తున్న సినిమాలు చాలకనా ...... నువ్వు నన్ను ఇన్ని అడుగుతున్నావు కదా ..... నిన్నొక్కటి అడగొచ్చా "

సిగ్గు పడ్డాడు

"అడగండి సార్ "

"నీవు ఎలా రిలాక్స్ అవుతావు "

"సార్ ..... మాదీ ఒక బ్రతుకేనా ..... ఏ ఉద్యోగమూ రాక ఇలాంటి పనికి ఒప్పుకుంటాం సార్ ..... నెలలో ఒక్కటి అమ్మగలిగినా గొప్పే ... తిరగటానికి ఖర్చులిస్తారు .... సెల్ బిల్లులు కడతారు ...... విసుక్కోకుండా సమాధానం చేప్పేవాళ్ళే తక్కువ ... రోజంతా తిరిగి రాత్రికి ఇంటికి చేరుకుంటాం ...... నానుండి ఆశాజనక సమాధానం రాదన్న భయంతో  అమ్మా నాన్నా ఏమీ అడగరు ..... నాలుగు మెతుకులు తిని కొద్ది సేపు టీవీ చూసి పడుకుంటాను. "

అతడి కళ్ళలో నీళ్ళు తిరిగాయేమోననిపించింది

"నీవేం చదివావ్ ... ?"

"నా లాంటి నిరుద్యోగులను మీరు వేరే అడగనవసరం లేదు సార్ ..... ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదవని వాడెవ్వడని అడగండి ....... "

"నీకు ఈ విధమైన సేల్స్ మాన్ ట్రైనింగ్ మీ కంపెనీ ఇస్తుంది కదా .... "

"అవును సార్ .... "

"మరి నీకు కూడా ఇలాంటి చోట ఒక ఫ్లాట్ ఉంటే పూర్తి సౌఖ్యంగా ఉంటుందనిపిస్తుందా ?"

"మొదట్లో ఎప్పుడో ఒకప్పుడు అలాంటిది ఉండేది ...... నిజాలు కళ్ళ ముందు కనబడుతుంటే అంతలా అనిపించడం లేదు "

"ఏమిటవి ... ?"

"ఇంతకుముందు సేల్ చేసిన వెంచర్ ఎందుకో స్పీడ్ గా పూర్తయి మొత్తం ఆక్యుపై అయిపొయింది ......అన్నీ ఖరీదైన ఇళ్ళే ..... కానీ సార్ ఎవరో గాని వాళ్ళ అమ్మానాన్నలను తేలేదు సార్ ...... ఎవరో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళను తప్పితే మా అమ్మా ..... నాన్నల వంటి వాళ్ళను అసలు  తీసుకు రాలేదు సార్ ..... నాకే అనిపించింది .... నిజంగా నాకిక్కడ ఫ్లాట్ ఉన్నా కూడా మా అమ్మా నాన్నలను ఇక్కడకు తీసుకు రాలేమోనని ....... "

ఒక్క ఐదు నిముషాలు అంటూ కిచెన్ లోకి నడిచాను .

రెండు టీ కప్పులతో వచ్చి అతగాడికొకటిచ్చాను.

"నిజానికి కొంత దగ్గరగా వచ్చావ్...... టీ తాగు "

"మాకు మా వూరిలో నాలుగెకరాల పొలం ఉండేది సార్ ...... ఫ్రీ గా ఇంజనీరింగ్ సీట్ వచ్చింది కదా అని జాయిన్ అయిపోయాను ..... లాప్టాప్ లాంటి ఖర్చులకి రెండెకరాలు అమ్మేసారు .... ఇక్కడికే వచ్చేసి ఒక కాలనీ లో కూరగాయల దుకాణం నడుపుతున్నారు. నాకు బాధగా ఉంటోంది సార్  మా వూరిలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు మాట్లాడడానికి ఉండే వారు . ఇక్కడ వాళ్లకు ఉండడానికి చాలా ఇబ్బందిగా ఉంటోంది "

"చూసావా నీవే చెబుతున్నావ్ ..... పెద్దగా డబ్బు లేక పోయినా వాళ్ళు వాళ్ళ స్థానం లో ఉన్నప్పుడు రిలాక్స్ గా ఉండే వారని .... "

"భలే వారు సార్ ..... మా వాళ్ళైతే అక్కడే పుట్టి పెరిగారు కాబట్టి .... "

"నీకొక సంగతి తెలుసా ...... మాది కూడా ఒక పల్లెటూరే ....... అక్కడ మా నాన్న ...... అమ్మ ..... ఉన్నారు. మా పిల్లలు మొన్న మొన్నటి వరకూ వాళ్ళ తాతయ్య పక్కన చేరి మంచి కధలు చెప్పమని అడిగే వారు. వీళ్ళు కాలేజ్ లకు రాక పోతే ఇంకా అడుగుతూనే ఉండే వారేమో ...... ఆ కధల ఎఫెక్ట్ తదుపరి జీవితంలో ఎంత ఉంటుందో నాకు తెలుసు. వంద "ఈ టెక్నో" స్కూళ్ళు కలిసి చెప్పింది వాటి కాలి గోటికి సరి పోవు. 

"కరెక్టే గాని ... ఉల్లాసాన్నిచ్చే పరిసరాలు ..... "

"నీకదే చెప్పబోతున్నాను ..... ఉల్లాసాన్నిచ్చే పరిసరాలను ఎంజాయ్ చెయ్యాలంటే ముందు నీ మనసు అందుకు అనువుగా ఉండాలి. "

"నాకు సరిగా అర్ధం కాలేదు సార్ "

" చూడు మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఉదయాన్నే  తూర్పు గోదావరి లో వేమగిరి నుండి రావులపాలెం వరకూ బస్ లో వెళుతూ అటూ ఇటూ చూసుకుంటూ వెళ్ళు ఆ పూల తోటలు ఎంతందంగా ఉంటాయో ....... అదే కుళ్ళి పోయిన మనసు తో శ్రీనగర్  లోని మొఘల్ గార్డెన్స్ లో కూర్చున్నా ఉల్లాసం ఉండదు ..... ఆ తేడా తెలుసుకో .... "

"మనసు ప్రశాంతంగా ఉంచుకోడానికి మీరేమి చేస్తారు ... ?"

"నీకెదురుగా ఏముంది ?"

"కప్ బోర్డ్ "

"దాంట్లో ఏమున్నాయి ?'

"ఏవేవో పుస్తకాలు .... "

"లోపల కప్ బోర్డ్ లలో కూడా ఇవే ఉంటాయ్. సెల్లార్ లో నా పార్కింగ్ ప్లేస్ లో టూ వీలర్ ఉంటుంది. దానిమీదే మేము తిరిగేది. పగలంతా ఉద్యోగంలో కష్టపడడం ..... ఇంటికొచ్చి ఏవైనా software మీద పని చేయడం ..... పుస్తకాలు చదవడం ....... మంచి మ్యూజిక్ వినడం ..... బంగారం మాట ఎత్తగానే శ్రీమతి మీద గయ్యి మనడం . నిద్ర రాగానే ఆ laptop పక్కకు నెట్టి సోఫాలో దిండు కిందకు లాక్కుని పడుకోడం ...... మా పిల్లలూ అంతే ..... ఇలా అడ్డదిడ్డంగా సామానంతా వదిలేసి పడకేసినందుకు తిట్టుకుంటూ .... మా శ్రీమతీ అలానే .  ఖాళీ ...లీవ్ కలిసొస్తే మంచి ప్రదేశాలకు వెళ్ళడం ......అంతే  "

"మరి ఫ్రెండ్స్ ..... బంధువులూ ..... "

"ఉన్నారు .... హంగూ ఆర్భాటాలు చేయకుండా ..... వీలయినంత వరకూ నలుగురికీ సహాయం చేయాలనుకునే మనస్తత్వం ఉన్న వారందరితోనూ .... మంచి సంబందాలు మైంటైన్ చేస్తాం .... "

"మరి కుళ్ళుతోన్న మనస్సులకు మంచి ఉదాహరణలు కూడా మీరే చెప్పాలి సార్ "

"ఇంకోసారి టీ అడగవు కదా ..... ?"

" లేదు ... సార్ .... "

"జాగ్రత్తగా విను .... నీవు గత ఎనిమిదేళ్లుగా ఇక్కడే అంటే మీ వూరికి దూరంగానే ఉన్నావు . అనుకోకుండా ఏదో కలిసొచ్చి మీ నాన్న గారు మీ నియోజకవర్గం M.L.A. అయిపోయ్యారనుకుందాం. వెంటనే నీవక్కడ వాలి పోతావన్న మాట. అంతే కాకుండా నియోజకవర్గ కాంట్రాక్టులు మొదలైన అన్ని విషయాల్లోనూ వీలు పెట్టేసి లక్షలు మూటగట్టేస్తావ్. అనుకోకుండా మీ నాన్న పెద్ద జబ్బు చేసి మూల పడిపోతాడనుకుందాం. పార్టీ నీకు టిక్కట్టు ఇవ్వలేదనుకుందాం. నీకు టెన్షన్ స్టార్ట్ అవ్వుద్ది .... నీవే ఇండిపెండెంట్ గా పోటీ చేసేద్దామనుకుంటావ్. ఈ లోపులో నీవు చేసిన దొంగ పనులు మీద కేసులు మొదలై పోతాయ్. పేపర్లోళ్ళు ... కోర్టులు .... నీకు నిద్ర లేకుండా చేస్తూనే ఉంటారు.  అయ్యలారా ....... మా నాన్న... జబ్బుతో మూల పడి పోయినా ... జాలి చూపలేదయ్యా ... పార్టీ వాళ్ళు .... అంటూ నీవు జనాల్లో పడతావ్ .... ఎందుకంటే నీకు ఏదో పదవి లేక పోతే  జీవితాంతం వూసలు లెక్క పెడుతూనే ఉండాలి. టెన్షన్ తో లో లోపల చస్తూనే దొంగ నవ్వుతో బయట తిరగాలి .... రోజూ టీవీ లో కూడా చూస్తున్నావు కదా ...... ఇది కుళ్ళుతోన్న మనసుకి ఉదాహరణ . 
                             అలాంటి ఎదవ బ్రతుకు కావాలా ..... ?ఏదో కష్టపడి GATE exam కోసం కష్టపడి ఒక మంచి రాంక్ సంపాదించుకుని ఉద్యోగమో .....M. Tech సీటో సంపాదించుకుని ... నాలా సింపుల్ గా బ్రతికితే బాగుంటుందో ... నీవే ఆలోచించుకో ....."

"మనిషి అనిపించుకునేందుకు వీలు లేని నీచ ... నికృష్ట ...... దౌర్భాగ్యుడెవడైనా అయితే తప్ప ..... మీ దారిలోనే బ్రతకడమే సుఖం కదా సార్ .... "

" శభాష్ ..... ఇంకొక రౌండ్ టీ తాగుదాం ...... "












10, ఏప్రిల్ 2014, గురువారం

కన్నీళ్లు .... సామాన్యులకుంటాయ్ .... అవి లేని రాక్షసులను సమాజంనుండి .... ఏరేద్దాం ..... లేదంటే మనమే ఏరయ్యబడతాం ....

మొదట అంతగా పట్టించుకోలేదు కానీ మా శ్రీమతి బాధ పడలేక  "కలర్స్"  ఛానల్  లో వస్తున్న " బాలికా వధు " సీరియల్ చూడడం మొదలు పెట్టాను. కాస్తో కూస్తో చాలా ఎపిసోడ్స్ లో మానవీయ కోణాన్ని కాస్త మంచిగానే ఆవిష్కరిస్తున్నందువలన చూడడం కొనసాగించాను. ఈ రోజు , నిన్న ఎపిసోడ్స్ చూసిన వారికి వేరే కోణం కూడా స్ఫురించి ఉండొచ్చు . ఒక వ్యక్తి జైలు జీవితం అనుభవిస్తుండగానే అతడి కుమారుడు కూడా హత్యా నేరం మీద అదే జైలుకి తీసుకుని రాబడతాడు. హతాశుడైన ఆ తండ్రి కొడుకుని దండించబోతే ఆ కుమారుడే తిరిగి తండ్రి ని కొట్టి "నీవు సరిగా ఉంటే నా బ్రతుకెందుకిలా ఉంటుంది ?" అని అడుగుతాడు. తెల్లారేసరికి ఆ తండ్రి ఖైదీ చనిపోతాడు. ఇదంతా ప్రత్యక్షంగా చూసిన వేరే ఖైదీ కి జీవితం మీద ఉండే దృక్పధం మారుతుంది. తన కుమారుడికి సరైన జీవితం అందజేస్తున్న తనను వదిలేసిన భార్యను ..... ఆమెను పునర్వివాహం చేసుకున్న వ్యక్తిని మనసారా అభినందిస్తాడు. అంతే కాకుండా తను అలా కావడానికి కారణభూతులైన తలిదండ్రులను అసహ్యించుకోవడం ప్రారంభిస్తాడు. 

ఇదంతా చాలా బాగుంది. కానీ ఇది సామాన్యుల కధ. కానీ కొంత మంది అసమాన్యులు ...... అన్నిటికీ అతీతులు ఉంటారు . వీరి కుటుంబాలలో తండ్రీ ... కొడుకులు జైలులో తారసపడే అవకాశం త్రుటి లో తప్పి పోయింది. సరే వీరిని జైలులో సంవత్సరాల తరబడి ఉంచినా కూడా వీరిలో మార్పు వస్తుందని ఆశించినవాడంత వెర్రిబాగులువాడు మరెవ్వరూ ఉండరు. ఎందుకంటే వీరికి జైలులోనే సకల సౌకర్యాలు అమరుతాయ్. సామాన్యులతో సహజీవనం చేస్తేనే కదా .... వాళ్ళ కష్ట సుఖాలపై అవగాహన ఏర్పడుతుంది. కానీ వీరికి ఆ అవకాశం  ఉండదు. ఆ మాత్రం మనసు ఉంటే తన కుటుంబ స్వార్ధం కోసం బలై పోయి కోర్టుల చుట్టూ .... జైళ్లకు చుట్టాల వల్లే తిరుగుతున్న అధికారులు పట్ల కాస్తంత సానుభూతి కూడా ఉండదు .  అసలు వీళ్ళ దృష్టిలో చట్టం .... నేరం ..... అంటూ ఉండవు . అక్రమ సంపాదన .... తన కులస్తులలో మెజారిటీ ..... తను నమ్మిన మతంలో మెజారిటీ ...... తన వైపే ఉన్నారనే నమ్మకం .......

అసలు ఈ విధమైన వాళ్ళు ఒక ఎత్తయితే ...... వీళ్ళను తలపై మోస్తున్న వాళ్ళను ఏమి చేయాలో ప్రజలే ఆలోచించాలి. 

"అయ్యా ..... క్విడ్ ప్రో ..... జరిగిందని నిరూపణ జరిగింది కదా ..... "

"ఆ ..... అధికారంలో ఉన్న వాళ్ళు ఆ మాత్రం చేయరా ..... మీరు మరీను " ఒక పెద్ద మనిషి సమాధానం . 

"అయ్యా ..... enforcement వారు జప్తులు కూడా చేసారు ...... "

"అంతే కదా ...... నిజంగా నేరం ఐతే జైల్లోనే పెట్టే వారు కదా ..... " ఒక వీర భక్తుడి సమర్ధన. 

"అయ్యా .... కనీసం అభివృద్ధి సూచీలనైనా పరిగణనలోనికి తీసుందాం .... "

"మీరెన్నైనా చెప్పండి .... 2004 నుండీ కాస్తంత లీజర్ గా ఉద్యోగాలు చేసుకుంటున్నాం ..... కావాలనుకున్నప్పుడు వెళ్తున్నాం ...... కావాలనుకున్నప్పుడు వచ్చేస్తున్నాం ..... అంతకు ముందు కరెక్ట్ టైం కు వెళ్ళలేక చచ్చేవాళ్ళం"
రిటైర్మెంట్ రేపో మాపో అన్నట్టు గా ఉన్న మహిళా మణి వ్యాఖ్య. ఆవిడ చేతిలో ఒక మత గ్రంధం కూడా ఉంది. 

పైన వాళ్ళు మాట్లాడిన మాటలు సమాజానికి .... మొత్తంగా మానవతకే ద్రోహమని మాట్లాడిన వాళ్లకు తెలియదా ? కానీ మత .... కుల గజ్జి తో నిండిన ఈ మూర్ఖులకు మానవత్వం కంటే తమ నాయకుడి తాత్విక దృక్ఫధమే అంటే "అవకాసమున్నంత వరకూ దోచుకో ...... అవకాశం లేని వాళ్ళు మాత్రమే నీతి కబుర్లు చెబుతారు " అనేది నరనరానా నిండి ఉంటుంది. ఈ భావన సమాజం అంతా పాకిపోతే సమాజం ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయంతో వొళ్ళు గగుర్పాటుకు గురౌతోంది. అంటే ఒక విధంగా ఈ విధమైన మాటలు మాట్లాడే వాళ్ళ మనసు రాక్షసత్వం నిండి ఉంటుంది. కాబట్టి ఒక తేలునో ..... పామునో చూస్తే మీలో ఏ ఫీలింగ్స్ ఏర్పడతాయో ..... దానికి మీరు ఎలా స్పందిస్తారో ... అలానే ఈ వ్యక్తులను చూసినప్పుడు స్పందించండి. వీళ్ళను ఉపేక్షిస్తే విషపురుగులను మన మధ్యే తిరగడానికి మనం ఒప్పుకున్నట్లే .... మన సర్వనాశనానికి మనమే మార్గం వేసుకున్నట్లు .... 

ఈ పురుగులు గుంపులుగా ఉంటాయ్ .... అయినా భయపడకండి ...... పాముని ... పామని చూపించిన వెంటనే ప్రజలు తమ పని తాము చేస్తారు. 2014 లోనే వీళ్ళ నాయకుడిని రేపిస్ట్ లు ... హత్యలు చేసిన వాళ్ళను ఉంచిన సెల్ లో వీళ్ళ నాయకుడిని చూసి పండగ చేసుకుందాం. 





"

25, మార్చి 2014, మంగళవారం

శత్రువుని సూటిగా ఎదుర్కొనే నాయకుడే కావాలి .... స్పష్టత లేని సిద్దాంతాలు కాదు .....

"అది కాదు కామ్రేడ్ ...... నీవు న్యూస్ సరిగా ఫాలో కావడం లేదనుకుంటా ...... "

"......... "

"మనం చేయలేని పని ఇతగాడు చేస్తున్నాడు ..... అసలు ఎవరి మీదకైతే తుపాకీ గురి పెట్టాలో వాళ్ళ మీద సూటిగా ఎక్కుపెడుతున్నాడు ..... "

"....... "

"మనం సరిగా ఎలక్షన్స్ ముందు మాత్రమే .... ఫ్రంట్ గురించి ఆలోచిస్తూ .... పరమ అవినీతి పరులుగా ముద్ర పడ్డ వాళ్ళతో సంకోచం లేకుండా జతకట్టేస్తాం .... మరీ సిగ్గులేకుండా .... "

"........... "

"వాటికి ఏవేవో సిద్దాంతాల మేకప్ వేసేస్తాం ... "

"......... "

"మన ముందు మతతత్వం ..... లంపెన్ పెట్టుబడిదారీ వర్గం కలగలసి పోయి మొత్తం వ్యవస్థను అడ్డగోలుగా తయారుచేస్తున్న నేటి విపత్కర పరిస్థితులలో కూడా మన అన్నదమ్ముల లాంటి వారితో కలసి  మన కుటుంబాన్ని బలంగా చేసికొని .... ఆ తరువాతే అదీ కూడా అవసరమైతేనే ..... మిగిలినవారి తో  జతకట్టాల్సి నప్పుడు  ..... చిన్న చిన్న వంకలు చూపించి అనవసర రాద్దాంతాలతో మన వాళ్ళతో కయ్యానికి కాలుదువ్వే మిమ్మల్ని చూస్తుంటే  నాకు మీ నిజాయితీ మీద అనుమానం కలుగుతోంది కామ్రేడ్ ....... "

".......... "

"మీరు జతగట్టాలనుకుంటున్న వారిలో మతతత్వాన్ని .... వారి ప్రతినిధులని ఇతడి కంటే ఎదుర్కున్న వాళ్లెవరైనా ఉంటే చూపించండి ... సంతోషిస్తాను. మన కంటే కూడా మన శత్రువులని అతడే సూటిగా ఎదుర్కుంటున్నాడుగా...."

" ........... "

"మన పాత పెద్ద నాయకులు మొదటి పార్లమెంట్ కు ప్రతిపక్ష నాయకుని హోదాలో ఒక సైకిల్ మీద ఫైళ్ళను మోసుకుని పార్లమెంట్ కు వచ్చారని ఈనాటికీ ఘనంగా చెప్పుకుంటాం ... మరి అంత సింపుల్ గానే ఉంటున్న ఈ నాయకుడు మన జతగాడుగా ఎందుకు కన్పించడం లేదు ? జనాలు అసహ్యించుకుంటారని రిపోర్ట్స్ వెళ్ళిన తరువాత విరమించుకున్నాం గానీ లేక పోతే ఒక అవినీతి పరుడు గా ముద్ర పడ్డ ఒక ఫ్యాక్షనిస్ట్ కుటుంబాన్నుండి వచ్చిన వాడితో జత కట్టడానికి సిద్ద పడిపొయ్యామ్ ..... కానీ కేవలం ఉద్యమం ద్వారా నాయకులైన వాళ్ళను మనం కలుపుకోగాలుగుతున్నామా .... ?"

"............. "


"గెలవాలనుకుంటున్న పార్టీ కి గెలుపు గుర్రాలు కావాలి ....... అధికారమే పరమావధిగా ఉన్న వాళ్లకు గెలిచే అవకాశం ఉండే పార్టీ కావాలి ..... ఇది తప్ప వేరే సిద్దాంతం లేని ప్రస్తుత పరిస్థితులలో పెద్ద పెద్ద సిద్దాంతాలు చెప్పి అనవసర కన్ఫ్యూజన్ సృష్టించడం కంటే ప్రజల భాష మాత్రమే మాట్లాడుతున్న అతడి భాష మనకు వినసొంపుగా లేదా ..... ? వ్యక్తులుగా కాక గుంపులు గుంపులుగా దూరిపొతున్నారు .... పార్టీల పేర్లు మారుతున్నాయి తప్ప అధికారం అక్కడే ఉంటుందన్న వాస్తవాన్ని చూస్తూ కూడా మనం కూడా దానిలోనే భాగస్తులం కావాలనుకుంటున్నాం "

".......... "

"మీరు మాట్లాడరు కామ్రేడ్ .... మాట్లాడలేరు కామ్రేడ్ ..... ఒక్క విషయం చెప్పండి కామ్రేడ్ మనం అధికారం లోకి రాగానే ప్రజలంతా సోషలిస్ట్ భావజాలంలో మునిగి పోతారని మీరు నమ్ముతున్నారా ...... ?దానికి అవసరమైన పోరాటాలు ఎన్ని రంగాల్లో మనం చేస్తున్నాం ? అసలు అటువంటి ఆలోచనలైనా మనం చేస్తున్నామా ? ప్రజలకు మనం ఎప్పుడో దూరమైన వాస్తవాన్ని మనం గుర్తించం .... మన పూర్వీకులు సంపాదించిన పేరు ని వాడుకుంటూ దాని మీదే మనం స్వారీ చేస్తాం ..... "

"........... "

"సెలవ్ కామ్రేడ్ ....... నాకు చేతనైన పద్దతి లోనే  ప్రజల కోసం జరుగుతున్న ఉద్యమాలలో పాలుపంచుకోవాలని ఆశ ..... ఈ రోజు మేం కొద్ది మంది కావొచ్చు ..... కానీ నాకు  నమ్మకముంది .....స్పష్టత కొరవడిన సిద్దాంత బలం కంటే ...... శత్రువుని సూటిగా ఎదుర్కోగలిగే బాట పట్టిన వారి వెంటే జనం నడుస్తారు ..... "శత్రువుని సూటిగా ఎదుర్కొనే నాయకుడే కావాలి .... స్పష్టత లేని సిద్దాంతాలు కాదు ..... 





17, మార్చి 2014, సోమవారం

ఆధారం లేని నమ్మకం

అనుకోకుండా ఎండలు ఒకే సారి పెరిగి పోయాయ్ . 

పాపం ఇంత ఎండలో ఆ పెద్దతను ఎందుకు పని చేయవలసి వస్తుందో .... .    బ్రిడ్జ్ ల మీదా .... ట్రాక్ మీదా  నీట్  గా గుండ్రంగా మా రైల్వే స్టాండర్డ్స్ ప్రకారం  లెటరింగ్  చేయించవలసిన అవసరం కలిగినప్పుడు  ఆ పెయింటర్ ను నా దగ్గరకు పంపే ముందు నా కొలీగ్ చెప్పిన మాటలు నా మనసులో మెదులుతూనే ఉన్నాయి .

" మీ అవసరానికి తగ్గ మంచి పెయింటర్ ని పంపిస్తున్నాను ..... మన రైల్వే లోనే రిటైర్ అయ్యాడు . అతడికి ఏం చేయాలో కాస్త వివరించి చెప్పండి చాలు .... ఆ తరువాత మీరు హాపీ గా వేరే పనులకు మీ టైం కేటాయించుకోవచ్చు .  అక్షరాలైతే ముత్యాల్లా రాస్తాడు. కానీ ఒక్క ఇబ్బంది మాత్రం ఉంది .  అతగాడి అవసరం ఏమిటో తెలియదు కానీ పని జరుగుతున్నప్పుడు ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇచ్చేయాలి . "

అతగాడు పని ప్రారంభించిన రెండు రోజుల వరకూ అతగాడి ని కలవలేక పోయాను .  అతగాడు  మరీ అంత వయసు పై బడిన వాడని అనుకోలేదు .  ఏ అవసరాలు అతగాడిని ఇంకా పని చేయడానికి పురికొల్పుతున్నాయో ...... 

" మంచి నీళ్ళు తెచ్చుకున్నావా .... ?"

చూపించాడు 

"ఎక్కువ ఎండ ఉన్నప్పుడు ట్రాక్ మీద ఉండకు. ఏదైనా చెట్టు కింద గానీ .... బ్రిడ్జ్ క్రింద గానీ రెస్ట్ తీసుకో .... "
వెనక్కు తిరిగి రెండడుగులు వేసాను . మరలా అతగాడి దగ్గరకు వెళ్ళాను. 

"నీ దగ్గర మొబైల్ ఉందా.....? "

తలూపాడు . దాంట్లో నా నంబర్ ఫీడ్ చేయిచాను.  

"ఏదైనా అవసరం వస్తే వెంటనే ఫోన్ చేయి "

"అదేంటి సార్ .... మేమేలాగ ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాంగా .... " కాంట్రాక్టర్ సూపర్వైజర్ రాజు నవ్వాడు. 

"కరెక్టే రాజూ ...  మా అమ్మా ... నాన్నా మా వూరిలో ఉంటారని తెలుసుగా .... ఈ ఉద్యోగంలో ఆదివారం కూడా సెలవుండదు .... మా పిల్లలక్కూడా ఈ రెండు మూడు సంవత్సరాలు  కొంచెం ముఖ్యమైనవే.  ఒక షిప్ కెప్టైన్ గా ఆ భాద్యతలు కూడా సక్రమంగా నిర్వర్తించాలి.  గత రెండు మూడేళ్ళలో మా అమ్మా ... నాన్నలు   రెండు మూడు సార్లు మరణం అంచుల దాకా వెళ్ళారు. కానీ పక్కనే ఉన్న బంధువులు .... స్నేహితులు సమయానికి ఆదుకోబట్టి  ప్రమాదాలనుండి బయట పడ్డారు . కనీసం ఇక్కడ నా చుట్టుపక్కల ఉన్న పెద్ద వాళ్ళను నాకు అవకాశం ఉన్న మేరకు ఆదుకుంటే ..... అక్కడ నా తలిదండ్రులను ఎప్పటికీ ఎవరో ఒకరు అలానే ఆదుకుంటారని అనిపిస్తూ ఉంటుంది. ఈ నమ్మకానికి ఆధారం ఏమీ లేదు ....కేవలం నా ఫీలింగ్ అంతే ..... "



10, మార్చి 2014, సోమవారం

ఎప్పటికైనా...... తాతే ... కుర్రాడు



"అరే .... గోవిందు దుకాణం తెరిచాడే ..... "అనుకుంటూ బండి ఆపాను . 

"రండి సార్ ..... 10 రూపాయలదా ...... 15 రూపాయలదా ... 20 రూపాయలకు మూడా  ..... " గోవిందు మామూలు పాట పాడేసాడు 

"సరే కానీ నిన్నెక్కడకు పోయ్యావ్ ..... పైగా ..... దేవుడికి జుట్టిచ్చి నట్టున్నావ్ " నున్నగా మెరుస్తున్న గోవిందు గుండును చూస్తూ అడిగాను.

"సింహాచలం కొండకెళ్ళాను సార్ .... ఈ సంవత్సరం ఒక్కసారీ యెల్ల లేదు ...సరే 10 రూపాయల బొండాం కొట్టేత్తాను"

గోవిందు కొట్టిచ్చిన బొండాం అందుకున్నాను.

"ఇంత అర్జెంట్ గా కొండ కెందుకెళ్ళావ్ ...... ?"

"మార్చి నెలోచ్చేసింది .... ఒక్క సరైన ఎండ కాయలేదు ..... ఇలా అయితే నా యాపారం మూసుకోవాలిసిందే ...... "

"అమ్మ ..... నీ ..... అంటే నీ వ్యాపారం కోసం ఎండలు కాయించేయమని దేవుడికి అప్లికేషన్ పెట్టావన్న మాట ..... అదే  దారిలో ఇంకా చర్చి ..... మసీదుల క్కూడా వెళ్ళకపోయావా ...ఒక  పనై పోయి ఉండేది "

"సారూ .... మీరు నవ్వుతారని చెప్పలేదు .... నిజంగానే వెళ్లి ...... "

నిజంగానే నవ్వుకున్నాను 

"ఇంతకు ముందేమైనా చర్చి ... మసీదుల కెళ్లావా ?"

"లేదు సారూ ..... ఏదో యాపారం కోసం ..... "

" మరి ... వాళ్ళ పద్దతులు అవీ తెలుసా ?"

"అదేంటి సారూ ..... అంత ఎదవనా .... ఆళ్ళ లో ఉండే ఫ్రెండ్స్ తోనే కదా ఎల్తా ... ఆళ్లు ముందే అన్నీ చెప్పారు .... "

" మొత్తానికి ఎక్కడా వాళ్లకు అపచారం కలక్కుండా చూసుకున్నానంటావ్ ..... "

"అదేంటి సారూ ..... అంత కళ్ళు నెత్తికెక్కటానికి మా నాన్నేమన్నా గవర్నరా .... ముఖ్యమంత్రా ..... ?"

"అమ్మ .... గోవిందూ .... నువ్వూ రాజకీయాల్లోకి వచ్చేయొచ్చు .... చాలా విషయాలు తెలిసి పోతున్నాయ్ ... కానీ ఒక్కటేమిటంటే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న చాలా మంది కంటే నీకు కాస్త మంచి సంస్కారమే ఉంది . "

" సారూ ... మా తాత పోయి ... ఐదారేళ్లు అవుతోంది ..... ఆడు బతికినన్నాళ్ళూ ఏవేవో చెబుతూనే ఉండే వాడు ... ఎప్పుడూ .... అంతా అయిపోయిందిరా ... తలో ముక్కా అయిపోయ్యార్రా ... అని గొణుకుతూనే ఉండేవాడు ... ఆడు చెప్పే మాటలు సగం అర్దమయ్యేవి కావు "

"మీ తాతది ఈ వూరు కాదా ?"

"కాదు సారూ ....విజయనగరం జిల్లా .... ...... మా నాన్న పదేళ్ళప్పుడు అక్కడ పెద్ద పెద్ద గొడవలైనాయట ...... మా తాత ను కూడా పోలీసులు చంపేద్దురంట .... మొత్తానికి తప్పించుకుని ఇక్కడికొచ్చి పడ్డాడట .... అసలు మా తాతకు అలా తప్పించుకుని రావడం ఇష్టం లేదట ... అన్నీ బాగున్నప్పుడు తిరిగొద్దువు లే అంటూ అయినోళ్లంతా పంపేసారట సారూ ....."

"అబ్బో .. నీ వెనకాల కూడా చాలా రాజకీయ చరిత్రుంది .... ఏదైనా ఎలక్షన్ లో పోటీ చేయకపోయ్యావా .....? "

ఎందుకో తెలియదు .... గోవిందు ముఖం కందగడ్డలా మారిపోయింది. 

"సారూ ... మా అయ్య ఆక్సిడెంట్ లో చనిపోయిన తరువాత ఆడే నన్ను పెంచాడు. ఆడెలాటోడో   నాకు తెలుసు సారూ .... ఆళ్లూరిలో ఆడిని దేవుడిలా చూడడం నేను చూసాను సార్ .... జనం చూపించే నిజమైన ప్రేమ అక్కడే చూసాను సార్ ... ఆడేదో నమ్ముకున్నాడు .... బతుకంతా దానికతుక్కు పోయి ఉన్నాడు. నమ్మిన దాని కోసం ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. తన వాళ్ళను చచ్చే వరకూ గుర్తుకు తెచ్చుకుంటూనే ఉన్నాడు. ఈడి లాంటోళ్ళు ఎంతో మంది ఉన్నారనే వాడు. నా లాగే ఆళ్ళ తాలూకోళ్ళు కూడా గంజి తాగినా సుఖంగానే ఉంటారనే వాడు. సారూ .... దయుంచి మా తాత రాజకీయాలతో .... ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలను పోల్చొద్దు. ఆడి తరువాత కూడా ఆడు పని చేసిన పార్టీ ఉంది కానీ వంద ముక్కలైంది ..... ఏ ముక్క ఎక్కడికి పోతుందో తెలీకుండా ఉన్నందువల్ల మేమిలా ఉండిపోయాం ..... కానీ సారూ రోజులన్నీ ఒకేలా ఉండవ్ .... మంచి రోజులు రాకపోవు .... ఫ్రీ గా అదిత్తాం .... ఇదిత్తాం ... అని చెప్పే దొంగ మాటలు మా కొద్దు ... మాకు ఓపిక ఉంది ... మా కష్టానికి దారి చూపెడితే ..... మా బతుకులు మేం బతగ్గలం ....... సారూ నా సోదంతా ఓపిగ్గా విన్నారు.... ఇంకో బొండాం తాగండి .... దీనికి డబ్బులొద్దులెండి .... "
అప్పటికే గోవిందు అంతకు ముందిచ్చిన బొండాం లోని నీళ్ళు కళ్ళ లో నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్త్తున్నాయ్ ..... 






27, ఫిబ్రవరి 2014, గురువారం

...... కళలూ మావే ...... అధికారం మాదే ..... మీకు ఎక్కువ ఛాయిస్ ఉండనీయం ....



"బాసూ ...."
లంచ్ అవర్ లో సరదాగా laptop లో ఏదో సినిమా పాట చూస్తున్న నన్ను కదిపాడు మూర్తి .
"చెప్పు " నాకు తెలుసు ఏదో తలనెప్పి విషయం కనిపెడతాడని .
"ఆ గ్రూప్ డాన్సు లో హీరో పక్కన డాన్సు వేస్తున్న వారిలో ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటావ్ ?"
"నీవడిగేది స్పష్టంగా లేదనుకుంటా "
"అది కాదు బాసూ .... వాళ్ళ లో టాలెంట్ ఉన్నవాళ్ళు ఉండరంటావా .... ?"
"ఉండొచ్చు .... "
"వాళ్ళు చాలా కాలం నుండి అనేకానేక గ్రూప్ డాన్సు లు చేసి ఉండొచ్చు కదా ..... "
"చాలా మంది హీరో ల తో చేసి ఉండొచ్చు కదా .... ?
"అబ్బా ... మూర్తీ చంపుకు తినక ... అసలు విషయం చెప్పమ్మా .... "
"అది కాదు బాసూ ..... మొదట్లో వీళ్ళ లో చాలా మందికి ఎప్పటికైనా ఏదో ఒక మంచి ఛాన్స్ వస్తుందనే ఆశ ఉండే ఉంటుంది కదా ...చాలా ఆశ తో camera లెన్స్ వంక చూస్తూ ఉంటారేమో కదా ?"
"ఉండి ఉంటారు .... "
"నిజాయితీగా కష్టపడి చిన్న చిన్న పాత్రలు ..... దొరికిన వన్నీ చేసి ఉంటారు కదా "
"సందేహం లేదు ... "
"వారిలో కొద్ది మందికైనా మంచి నటన ... రూపం ..... ఉండి ఉండొచ్చు కదా .... ?"
" చాలా మందికి ఉండొచ్చు "
" కొద్ది రోజులకే వాళ్లకు ....పాపం నిజాలన్నీ అర్ధం అయ్యి ఉంటాయి కదా ....?
"అంటే .... ?"
" హీరోలను చేసేవి .... పైవేవీ కాకుండా ఇంకా చాలా ఉంటాయని ..... పైన చెప్పిన లక్షణాలు ఏవీ లేక పోయినా  హీరో లు అయిపోతారని  వాళ్ళు అర్ధం చేసుకున్నాకా ఎలా ఫీలవుతారంటావ్ "
"నిజాలు అర్ధం చేసుకున్న తరువాత నిర్వేదం తో .... నిర్లిప్తతో ...... నిరుత్సాహం తో జీవితం అంతా గడిపేసి ఉండి ఉంటారు. "
"అదేంటి ... గడిపేసి ఉంటారంటావ్ ..... ఇప్పుడెవ్వరూ అలా అనుకోడం లేదా ?
"అలాంటి ఆశలు ఇప్పుడు కూడా పెట్టుకుని సినిమా రంగానికి వస్తే వాడంత వెర్రి వెధవ ఎవడూ ఉండడు ..... కేవలం ఆదాయం చాలని దిగువ మధ్య తరగతి కుర్రాళ్ళు వేరే అదనపు ఆదాయపు వనరు క్రింద ఈ గ్రూప్ డాన్సు ల లాంటి వాటిల్లో పాల్గొనాలి తప్ప భవిష్యత్తులో హీరో అవ్వొచ్చనే భ్రమలతో మాత్రం కాదు .మన తెలుగు సినీ రంగంలో హీరో అవ్వాలంటే ఆ నాలుగైదు కుటుంబాలలో పుట్టాలన్న వాస్తవం  నీకు ఇంకా తెలియక పోవచ్చు కానీ  తెలివైన కుర్రాళ్ళకు మొత్తం  తెలుసు ..... అంతే కాదు ఏదో ఒక దిక్కు మాలిన టీవీ ప్రోగ్రాం లో కనబడితే ఆ తరువాత ..... ఫేం ... అంటూ బేనర్ కట్టుకుని వినాయక చవితి పందిళ్ళ లో నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చు "
"అబ్బ ఏం చెప్పావ్ గురూ ..... పద టీ పోయిస్తాను "
laptop కట్టి బయటకు నడిచాం . 
"అంటే అవకాశాలు అన్నీ ఇలా కొద్దిమందే ఒడిసి పట్టేస్తుంటే కొత్త వారికి అవకాశాలు మాట దేవుడెరుగు ..... కొత్తదనంతో ఉండే సినిమాలు .... మనకెక్కడ దొరుకుతాయి ?"
"నీవెక్కడో ఉంటావు మూర్తీ ..... ఈ ఒక్క రంగమే నీకు కనిపిస్తుందా ..... ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని కుటుంబాలు ..... ఎప్పటి నుండో అధికారాన్ని ఒడిసి పట్టుకుంటుంటే ప్రజలకు ఏమైనా స్పందన ఉందా ... ?"
"అంటే ... ?"
"పద్దతులు మారుతున్నాయంతే మూర్తీ .... ఒకప్పుడు బలవంతుడు తనకు వోటు వేయించుకునే వాడు ..... కానీ ఇప్పుడు ...... తెలివిగా గెలిచే అవకాశాలు ఉండే పార్టీలోకి మారుతున్నారు. ప్రజలు ఇలాంటివి పట్టించుకోవడం లేదని వాళ్లకు ఎప్పుడో అర్ధం అయిపోయింది. ప్రజలు కూడా వీళ్ళ వలన ఒరిగేదీ ఏదీ పెద్దగా ఉండదనే నిర్వేదావస్థ లోకి జారి పోతున్నారు .... 5 సంవత్సరాలకొక సారి వచ్చే పండగ .... కాబట్టి ...పైగా ఆ నాలుగు రోజులు తమను పెద్ద పెద్ద వాళ్ళు పలకరిస్తారు కాబట్టి ... ఒక విధంగా పండగ రోజుల్లాగా .... ఇంకా చెప్పాలంటే ఇంకా బాగా .... చాలా వరకూ అన్నీ ఫ్రీ గా దొరుకుతాయి కాబట్టి .... ఎంజాయ్ చేస్తున్నారు ..... అసలు మన వైజాగ్ నే చూడు ..... గత నాలుగు ఎలక్షన్స్ చూడు .... పార్టీలు మారుతూ ఎంత చిద్విలాసంగా నాయకులు కూడా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ..... అక్కడ చచ్చినట్లు వాళ్ళు తీసిన సినిమాలే చూసినట్లు .... ఇక్కడ కూడా వీళ్ళలోనే ఎవరో ఒకరిని ఎన్నుకుని తీరాలి .....పద ... కంప్లేషణ్ డ్రాయింగ్ లు చెక్ చేయాలి "
"అదేంటి .... అంత సింపుల్ గా విషయాన్ని క్లోజ్ చేసేస్తావ్ ... ముందు ముందు ఈ దేశం ..... "
"నీకు .... గవర్నమెంట్ జాబ్ ఉంది .... నాకూ ఉంది .... కాబట్టి మన వరకూ ఏ ఇబ్బందీ లేదు ..... ఇక 1000 రూపాయలకు కావలిసిన పాటలు లోడ్ చేసిన సెల్ ఫోన్ మార్కెట్లో దొరుకుతోంది ....పైసాకు ఒక మెసేజ్ పంపించు కోవచ్చు .... ఇంజనీరింగ్ కోసం కొన్న laptop లో డేటా కార్డు ఉంటే చాలు ఫేస్ బుక్ లో కొత్త కొత్త ఫోటోస్ upload చేసి మరుసటి రోజునుండీ ఎన్ని లైక్ లు వచ్చాయో లెక్క పెట్టుకుంటూ టైం పాస్ చేసుకోవచ్చు ..... కాక పొతే ఒక్క ఆశ ఉంది మూర్తీ ... ఈ ఫేస్ బుక్ కి ... సోషల్ నెట్ వర్క్ కి బయట ఇంకా చాలా పెద్ద ప్రపంచం ఉంది ..... వీటిలో ఉన్న చెత్తతో ఎంజాయ్ చేయడం ..పాపం ... వాళ్లకు తెలియదు అవసరం......  వాళ్ళను నిజాల దగ్గరకు చేరుస్తుంది ..... అఫ్ కోర్స్ .... దాని కోసం నీవు .... నేను చేయవలసింది చేయడానికి సిద్దంగా ఉందాం ..... "

23, ఫిబ్రవరి 2014, ఆదివారం

తెగగొట్ట వలసిన అనైతిక బంధం......

నా చిన్ననాటి స్నేహితుడు యాగంటి వేంకటేశ్వర్లు ఒక మంచి జోక్ పంపించాడు .

Man was baptized and dipped in water 3 times. After the 3rd dip priest said " you are now baptized, the old one is gone, you are now a new creation, no more drinking of alcohol for you and your new name is James "
James went home, headed straight for the fridge, took out a beer and dipped it in water 3 times and said " you are a new creation now, the old one is gone and your new name is orange juice.


పై జోక్ ని తెలుగు లోకి అనువదిస్తే ఈ విధంగా ఉంటుంది . 


వ్యక్తి బాప్టిజం చేయబడి ....3 సార్లు నీటిలో ముంచబడ్డాడు. 3 వ డిప్ పూర్తయిన వెంటనే ....పూజారి "మీరు ఇప్పుడు పూర్తిగా మారిన మనిషి ....పాత అంతా పోయింది మీరు .....మద్యం నుండి పూర్తిగా దూరంగా ఉంటారు ..... మీ కొత్త పేరు జేమ్స్ .
జేమ్స్, తిన్నగా ఇంటికి వెళ్ళి ఫ్రిజ్ తెరిచి ఒక బీరు తీసుకుని 3 సార్లు నీటిలో ముంచి మరియు మీరు ఇప్పుడు కొత్తగా సృష్టించ బడ్డారు ...మీ గతం అంతా గతించింది మీ కొత్త పేరు నారింజ రసం అన్నాడు.


అతగాడు ఇది జోక్ గానే పంపించాడు కానీ ఇది ఇప్పుడు అన్ని మతాలలోను ..... ఇంచుమించుగా ఇదేగా నడుస్తుంది .ఈ నాటి మనదౌర్భాగ్యాల కు అవినీతి కారణమని అందరూ ఒప్పుకుంటారు (ఒక్క సి. పీ.ఎం పార్టీ వారు తప్ప .....వారి విప్లవ కార్యకలాపాలలో అవినీతి ముద్ర వేసుకున్న వాళ్ళూ తోడూ నీడగా ఉండొచ్చట ). కానీ అంత యధేచ్చగా అవినీతికి పాల్పడే మనస్తత్వం గాలి చొరబడినంత సుళువుగా ఎలా చొరబడిపోతోంది? దానికి తాత్విక భూమిక సమాజం లో ఏ ఆటంకమూ లేకుండా ఎవరు వ్యాప్తి చేయగలుగుతున్నారు ? కావాలని ఒక అరాచక వాతావరణం ఎవరి వలన ఏర్పడుతోంది ? ఏ  గ్రంథాల ల లోనూ రాయని వన్నీ ప్రజలమీద రుద్ది  సమాజంలో లంపెన్ సైన్యాన్ని తయారు చేసి సిద్దాంత రాజకీయాలు లేకుండా చేయడానికి ఏ శక్తులు కృషి చేస్తున్నాయ్ ? అన్ని వయసుల వారి లో ఇంత ఉదాసీన వైఖరి ఎలా వచ్చింది ? ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్యూన్ ఉద్యోగాలకు ....కానిస్టేబుల్ ఉద్యోగాలకు .....అవీ లేకుండా చేస్తున్నా చలనం లేకుండా ఎలా ఉండగలుగు తున్నారు? హేతు బద్దంగా ఆలోచించే శక్తి ని ప్రజలనుండి దూరం చేయడానికి యధావిధిగా కృషి చేస్తున్నదెవరు?
 నల్లదుస్తులు వేసుకుంటే ...ఇంత పుణ్యం ......ఎర్ర దుస్తులు వేసుకుంటే ఈ పుణ్యం ......ఇంకా కాన్వెంట్ స్కూళ్ళకు ఎన్ని యూనిఫారాలు ఉంటాయో ....భక్తికి కూడా అన్ని యూనిఫారాలు తయారు చేసి ప్రజలను నిజంగా భక్తి మార్గంలోకే ఈ పురోహిత వర్గాలు  మళ్ళిస్తున్నాయా .....? మూఢ భక్తి /మూర్ఖ భక్తి ని అధికారిక భక్తి మార్గంగా ఎవరు చలామణి చేయగలుగుతున్నారు ? సమాజం లో బలమైన సిద్దాంతాలు లేకుండా ఉండడం కేవలం అరాచక స్వార్ధపర శక్తులకే మేలు కలుగుతుందని తెలిసి కూడా ఆ పరిస్థితి నుండి సమాజాన్ని బ్రతికించడానికి ఏ రాజకీయ పార్టీ అయినా నిజాయితీ గా కృషి చేస్తుందా ....? అంటే అన్ని మతాలలోని పురోహిత వర్గాలు ఒక అరాచక తాత్విక పునాదిని సృష్టిస్తుంటే .......దానినుపయోగించుకుని అధికారం లోకి రావడానికి సిద్దాంతాలు అవసరం లేని అన్ని రాజకీయ పార్టీలు యధావిధిగా కృషి చేస్తునాయి .అందువలనే కదా ఒక పార్టీ అధికారం లోకి అర్ధం కాగానే చొక్కా మార్చినంత సుళువుగా వేరొక రాజకీయ పార్టీలోకి మారిపోతున్నారు.మారేటప్పుడు కూడా సైద్దాంతిక నిబద్దత లేని పార్టీలోకి మారతారు తప్ప  సిద్దాంతాలను అంటి పెట్టుకునే పార్టీల లోకి మాత్రం మారరు. అది పెద్ద తప్పేమీ కాదనే విధంగా మన తాత్విక దృక్పధాన్ని ఉంచడానికి మత వర్గాలు కృషి చేస్తూనే ఉంటాయి

నిజాయితీగా .....దేశానికీ ....సమాజానికీ ఏదైనా చేయాలనుకునే అభ్యుదయ వాదులు కానీ ...విప్లవకారులు కానీ  చేయవలసిన మొదటి పని ఈ అనైతిక బంధాన్ని తెగగొట్టడం.....అది చేయకుండా ముందుకు వెళ్తే మాత్రం పునాది లేకుండా భవనం నిర్మించడమే అవుతుంది.