10, జులై 2013, బుధవారం

చిత్తగించవలెను



ఇద్దరూ ప్రమాద కారులే....ఇద్దరూ క్రూరులే....ఇద్దరి వల్లా దేశ భద్రతకు సమాజ భద్రతకు ప్రమాదమే......ఐనా చిన్న  పోలికల పట్టిక

 


టెర్రరిస్ట్
ఆర్ధిక నేరగాడు
ఇతడు తను నమ్మిన దాని కోసం మరణిస్తాడు
తను ..తన వాళ్ళు సుఖంగా ఉండడానికి మాత్రమే ఎంతటి నేరమైనా చేస్తాడు
ఇతడి ఆవేశం ప్రేరేపితం
అంతా తన స్వార్ధం కోసమే కాబట్టి చాలా ప్లాన్ డ్ గానూ ముందస్తు జాగ్రత్తతోనూ ఉంటాడు
నమ్మినదాని కోసం  చావడానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటాడు
తన స్వార్దం మాత్రమే తన సిద్దాంతం. వ్యవస్తను నట్టేట ముంచి 60-70 బెడ్ రూం భవంతుల్లో ఉంటారు.
ఏదో ఒక సిద్దాంతాన్ని అనుసరిస్తాడు.
తన సుఖమే..స్వార్ధమే  నేరానికైనా మూలం
క్రూరత్వం స్పష్టంగా పైకి కనబడుతుంది. కాబట్టి నటించే అవకాశం ఉండదు.
మేకవన్నె పులులు. అందుకనే త్వరగా ఫాక్షనిజం నుండి దీనికి మారుతున్నారు.
బాధితులు గుర్తించబడతారు కాబట్టి  శిక్షించడం సుళువు.
నిర్దిష్టమైన బాధితులు ఉండరు ...మొత్తం ఆర్ధిక వ్యవస్థే నెమ్మదిగా భ్రష్టు పట్టి పోయి మొత్తం అందరికీ ఒక్క సారే చీకటై పోతుంది. సమయానికి వీళ్ళు హాపీ గా విలాసవంతమైన దేశాల్లో ఉంటారు.
సాధారణంగా  ఏ రాజకీయ పార్టీ కూడా బహిరంగంగా సపోర్ట్ చేసే ధైర్యం చేయదు.
వీళ్ళు చాలా వరకూ ఏదో ఒక రాజకీయ పార్టీల అండదండలతొనే ఉంటారు. కనిమొళి   మరలా రాజ్య సభకు ఎన్నిక కావడానికి ఏదీ అడ్డు రాలేదు.
నేరం  చాలా త్వరగా ఋజువవుతుంది కాబట్టి   త్వరగా శిక్షించబడతాడు.
నేరాన్ని ఋజువు చేయడానికి కొన్ని వేల డాక్యుమెంట్స్ ని పరీక్షించాలి కాబట్టి శిక్ష  వేయడానికి చాలా సమయం పడుతుంది. అందువలనే ఇంచుమించు ఆర్ధిక నేరానికి శిక్ష  పడ్డ రాజకీయ వాది భారత దేశం లో లేడు.
నేరం స్పష్టంగా పైకి కనబడుతుంది కాబట్టి అందరి చేతా అసహ్యించుకోబడతాడు.
యేనాటికి కూడా ఆర్ధిక నేరాల తీవ్రత...దాని ప్రభావం విద్యావంతులే చాలా తేలికగా తీసుకుంటున్నారు.అందువలనే కసబ్ సిక్ష కోసం ఆవేశపడినంతగా కుంభకోణాల నిందితుల శిక్షల కోసం వూరేగింపులు కనబడవు.

7, జులై 2013, ఆదివారం

.ఓ మహర్షీ ..ఓ మహాత్మా.........

    నా చిన్నప్పుడు మా నాన్న గారు వీరవరం అనే గ్రామంలో మేష్టారి గా పని
చేస్తున్నప్పుడు ఆయన పక్క గ్రామమైన కడియం లో  తన స్నేహితుల  దగ్గరకు వెళ్ళినప్పుడుల్లా నన్ను కూడా తన సైకిల్ మీద కూర్చోపెట్టుకుని తీసుకుని వెళ్ళేవారు.కానీ వూరి ప్రారంభంలోనే ఉన్న లైబ్రరీ  లో నన్ను వదిలి వెళ్ళేవారు.ఆ విధంగా నాకు పుస్తకాలతో  స్నేహం ప్రారంభమయ్యింది. అదెలా పరిణమించిందంటే దొరికిన ప్రతి పుస్తకాన్నీ నమిలెయ్యడమే.. సరిగ్గా  తెలిసీ తెలియని వయసు లోనే నాకు మా తాతయ్య గారి ఇంట్లో ఒక పాత సినిమా పత్రిక దొరికింది. బహుశా దాని పేరూ అదే కావొచ్చు వేరే  ఏదైనా కూడా కావొచ్చు....కానీ దానిలో ఒక సమీక్ష కొనసాగింపు ఉంది. బహుశా  దానికి ముందు సంచికలో "పాండవ వనవాసం"  సినిమాలో అరణ్యవాసానికి  వెళ్తున్న సన్నివేశంలో  భీముని పాత్ర ధారి ఐన రామా రావు గారి నడక మీద  సునీత గారనే ఆవిడ దుమ్మెత్తి పోసారు.(అది వాస్తవమేనని ఇప్పుడు కూడా ఆ సినిమా చూస్తే అర్ధం అవుతుంది).ఇది నాకు అక్షరాలు  చదవడం వచ్చిన కొత్తలో చదివిన పుస్తకం.ఆ తరువాత సంచికలో ఆమె మీద చాలా మంది విమర్శలు గుప్పిస్తూ ఆ సినిమా సాధించిన బాక్సాఫీస్ విజయాన్ని  ప్రస్తావించారు. కానీ అప్పటికే మన వాళ్ళకు నిజాలను అంగీకరించగల సంస్కారం కంటే వెర్రితలలు వేసే వీరాభిమానం పెరిగి పోయి ఉండొచ్చు. నేను చదివిన సంచికలో ఆమె (సునీత గారు) ఒక్కటే సమాధానం ఇచ్చారు. అదే సంవత్సరంలో రిలీజ్ ఐన "సత్య హరిశ్చంద్ర" పెద్దగా విజయం సాధించక పోవచ్చు అంత మాత్రం చేత ఆ సినిమా బాగా లేదని అనలేమంటూ ఒక్క విషయం మాత్రం గట్టిగా చెప్పారు. అదేమంటే పాండవ వనవాసం సినిమా ని పొగడడం మాత్రం దిగజారుతున్న కళా ప్రమాణాలకు నిదర్సనమని. 


    కానీ నిజాయితీగా ఆలోచిస్తే ఒక్క విషయం అర్ధం అవుతుంది....ప్రమాణాలు పడిపోలేదు సమాజంలో ఉన్నాయి కానీ వాటిమీద మీడియా అనే మబ్బు కమ్మేసింది.1992 వరకూ టీ.వీ లో ఒక్క చానల్ మాత్రమే ఉన్నప్పుడు ప్రోగ్రాంస్ మీద లెక్క లేనన్ని జోక్స్ ఉండేవి. దానిలో కొంత వాస్తవం ఉండొచ్చు. కానీ చిరస్మరణీయమైన సీరియల్స్ ఆ కాలంలో వచ్చినన్ని ఇప్పుడు అన్ని చానళ్ళు కలిపి చూసినా రావడం లేదు.నాకు గుర్తున్నంత వరకు 1992 లొ ప్రైవేట్ చానళ్ళు ప్రారంభమయ్యాయి.ముఖ్యంగా "యీ'  టీవీ స్టార్ట్ కాగానే చాలా మంది తెలుగు ప్రేక్షకులు యేవేవో వూహించుకున్నారు. అభ్యుదయ రచయితలు కూడా చాలామంది వెళ్ళారని చెప్పుకునే వారు. కానీ గోడకు కొట్టిన బంతుల్లా వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్లు వెనక్కు రావడానికి ఎంతో సమయం పట్ట లేదు.ఆ తరువాత పొడి పొడి మాటలు కూడా ఈ  టీవీ ద్వారా మహా కవిత్వంగా ప్రాచుర్యం పొందడానికి ఎంతో సమయం పట్ట లేదు.ఒక విధంగా చానల్ ఒకటి చేతిలో ఉంటే చాలు తిమ్మిని
బమ్మి చేయొచ్చన్న తెలివి తేటలను ప్రత్యర్ధులకి నేర్పింది శ్రీ రామోజీ రావు గారేనేమో..అలా మొదలైన తెలుగు మీడియా ప్రస్థానం మరింత లోతుల్లోకి దిగజారుతూనే ఉంది. న్యూస్ రిపోర్ట్ చేసే వారి మీద న్యూస్ తయారు చేసే వారి ఆధిపత్యం నడుస్తోంది.నిజాలను ప్రజలకు చెప్పే కంటే తాము చెప్పవలసిన దానికే మసి బూసి మారేడు కాయ చేసి యానిమేషన్ టెక్నిక్లతో  అసలు విషయాన్ని  మరుగున  పడేటట్లు చేస్తున్నారు.
    మనకు భ్రష్టు  పడుతున్న రెండు రంగాలు ఉన్నాయి. (వేరు కుళ్ళుతున్నప్పుడు కాండాలు ..కొమ్మలూ కుళ్ళడం  చాలా సహజం). దేన్నీ విడివిడిగా చూడలేం. ఒక రంగం భ్రష్టు పడుతున్నప్పుడు అదే రంగం సమాజానికి మార్గదర్శిగా   పనిచేసే  రోజులనాటి  విషయాలు పదే పదే చూపించడం ద్వారా కనీసం యీ తరాలకు కొంత మార్గ నిర్దేశకత్వం చేయడం జరుగుతుంది.మన పూర్వీకులు యెన్నెన్ని త్యాగాలు చేస్తే మనం యీనాడు యీ స్థితిలో  ఉన్నామో యీ తరాలకు చెప్ప వలసిన అవసరం లేదా....? పాఠకుల  సంఖ్య తగ్గి ప్రేక్షకుల సంఖ్య పెరుగుతున్నప్పుడు ఆ బాధ్యత మీడియా మీద ఉంటుంది. కానీ వారు పాటిస్తున్న విలువలకు ఉదాహరణ ఒకటి చెబుతాను. హైదరాబాద్ లో నగర శివార్లలో ఒక అమ్మాయి హత్యకు గురయ్యింది. చానల్ వాళ్ళందరూ చేరారు. పోలీస్ వారి చుట్టూ చేరారు. వాస్తవాలు కారణాల గురించి అడుగుతున్నారు. అంత వరకూ బాగానే ఉంది. మామ్మూలు ప్రశ్నలు అడిగితే టీ.ఆర్.పీ రేటింగ్ ఎందుకు పెరుగుతుంది? ఒక రిపోర్టర్ మరింత ఉత్సాహంగా అక్కడున్న పోలీస్ ఇన్స్పెక్టర్ ని " యీ హత్య జరగక ముందు యీ అమ్మాయి మీద అత్యాచారం లాంటిది జరిగి ఉంటుందని భావిస్తున్నారా...?" అని అడిగింది. దిగజారుడుకు ఇంతకంటే నిదర్శనం  అవసరం లేదనుకుంటున్నాను.
   
    45 సంవత్సరాల క్రితం నాటి ఆ విమర్శ యీ నాటికీ నాకు గుర్తుండి పోడానికి ఇప్పుడు వేరే కారణాలు చెప్పనక్కర లేదు.ఆనాటికే సూపర్   స్టార్ ఐన రామా రావు గారి నటన లో లోపాలను ఒక్క విమర్శకురాలు రాస్తే  ఒక చిన్న సినిమా పత్రిక ప్రచురించింది. దాని మీద చర్చ నడిచింది. కానీ ఇన్ని చానల్లలో అనేక చర్చలు జరుగుతున్నాయి....ఫలితం ఏమిటంటే మొత్తం సమాజంలో సిద్దాంతాలంటూ  ఏమీ లేవని ప్రజలు భావించుకునే స్థితికి దిగ జార్చారు.

"నీవెందుకు అలా వర్రీ ఐపోతావు...వ్యాపారం కోసం పెట్టుకున్న వాడు వాడి ప్రయోజనాలు చూసుకుంటాడు...అది సహజం కూడా. నీవు చెబుతున్న సినిమాలకు అవార్డ్ లు ఇస్తే ఆ చానళ్ళ టీ.ఆర్.పీ రేటింగ్ ఎక్కడి కెళ్తుందో నీకేమైనా తెలుసా..." ఒక రోజు మా మూర్తి నా మీద గయ్యి మన్నాడు.

"వాళ్ళిష్టం   వచ్చింది ప్రచారం చేసుకోమను మూర్తీ కానీ అదే ఆదర్శమన్నట్లు మాత్రం చెప్పవద్దను..... వాతావరణానికి హాని కలిగించేదేదీ వాడని ఆర్చిడ్ హోటల్ ను బ్రోతల్ పనులు కూడా నిరాటంకంగా చేయనిచ్చే హోటల్ ను ఒకే గాటన కట్టేస్తే .....ఏ విలువలూ  నేర్పకుండా కేవలం గారాబంతో పెంచి ...ఆ తరువాత పుటుక్కున ఏ ఫేస్ బుక్ లోనో పరిచయమైన వాడిని పెళ్ళి చెసెసుకుంటుంటే తలిదండ్రులు లబో దిబో మంటున్నారు. అప్పుడు కూడా విలువలు నేర్పని విషయాన్ని పరిగణన లోనికి తీసుకోలేక పోతున్నారు. ప్రేమకు కూడా ఒక పునాది ఉంటుంది. గాలిలో దానిని నిలబెట్టలేము. మనం పాటించే విలువలే దానికి పునాదిగా పనిచేస్తాయి. ఇదే సూత్రం సమాజానికి కూడా వర్తిస్తుంది. పోలీస్ డ్యూటీ దొంగని పట్టడం...అలాగే అది పేపర్ కావచ్చు ...చానల్ కావచ్చు ...కానీ ఓవరాల్ గా దానినుండి ఎక్కువగా ఆశించేది మాత్రం కాస్తో కూస్తో మార్గ దర్శకత్వమే.

    పల్లెలతో సహితంగా రోడ్లకడ్డంగా పందిళ్ళు వేసి "డాన్స్ బేబీ డాన్స్ " ప్రోగ్రాం లు పెట్టగలుగుతున్నారంటే అది మీడియా చలవేనంటే కాదనే వాళ్ళుండరేమో....రోడ్ల మీద డాన్స్ వేయాలంటే "జయ భేరి", "విప్రనారాయణ" పాటలు పనికి రావు కదా....ప్రజలు ఆదరించడమన్నది ఒక్కటే ఎప్పుడూ గీటు రాయి గా పనికి రాదు. యీ తరహా ప్రోగ్రాంస్ అన్నీ ప్రమోట్ చేసే వాళ్ళంతా
ప్రభుత్వం తరపునుండి అభ్యతరాలు లేక పోతే ఇంకా నీచాతి నీచమైన వ్యాపారాలు కూడా చేయడానికి వెనుకాడరేమో అనిపిస్తుంది.ఎందుకంటే వీళ్ళంతా పనిగట్టుకుని విలువలు ధ్వంసం చేస్తున్నారు.

    రూపాయి విలువ పడిపోడానికీ .....పేదవాడి జీవితానికీ సంబందం ఏమిటి...ఆర్ధిక నేరాగాళ్ళు క్రీం  మొత్తం మింగేస్తూ ..మెతుకులు విసిరి పేదలను....ఆర్ధిక వ్యవస్థనూ ఎలా భ్రష్టు పట్టిస్తున్నారు..లాంటి విషయాల కంటే  కొన్ని చిన్న చిన్న ముఠాలకు సంబందించిన  సినిమాల ఆడియో ఫంక్షన్ లు...విజయోత్సవాలు....నాగార్జున గారి గురించి అక్కినేని నాగేస్వర రావు గారి పొగడ్తలు...నాగ చైతన్య గురించి నాగార్జున గారి పొగడ్తలు ...అలాగే పేరు పేరునా చెప్పక పోయినప్పటికీ మిగిలిన సినిమాల కుటుంబాల వారు వారి వారి వారసుల గురించి చెప్పుకునే గొప్పలు.....వీటితో నిండి పోతోంది  చానళ్ళ టైం ......

    సమాజంలో ఉంటున్న ప్రతి వారికీ సుఖంగా బ్రతకాలనే కోరిక సహజం. కానీ దాని కోసం యేమి చేయాలో కూడా స్పష్టత కావాలి కదా... మనకు సినిమాల ఆడియో ఫంక్షన్ లు ముఖ్యమా.....మన పిల్లలకు ఉద్యోగాలు ముఖ్యమా... ఉద్యోగాలు ముఖ్యం అయినప్పుడు
అవెందుకు రావడం లేదు....రావాలంటే పారిశ్రామిక అభివృద్ది కావాలి...కావడం లేదంటే కారణాలు ఏమిటి....మనం కడుతున్న టాక్స్ లు ఎక్కడికి వెళుతున్నాయి. కాగ్ రిపోర్ట్ ప్రకారం ఒక్క జల యజ్ఞం ప్రాజెక్ట్ లోనే 22000కోట్ల ప్రజా ధనం వృధా అయ్యింది.దీనికి కారణం ఎవెరు? కొన్ని విషయాల గురించి అనవసరమైన వాదోపవాదాలు అనవసరం.అలాగే  యీ.డీ.  డిపార్ట్మెంట్ కొన్ని కోట్ల  రూపాయలను రికవర్ చేసింది.అది ఖరారైన వార్తే కదా... దాని మీద వాదోప వాదాలు ఎందుకు. అది ప్రచారం చేసి వదిలేయడానికి బదులు దాని మీద స్టూడియోలలో గంటల తరబడి చర్చలు ఎందుకు..?  ప్రజలను తప్పు దోవ పట్టించడానికి తప్ప.

    ఇప్పుడున్న మీడియా మీద ప్రజలకున్న అభిప్రాయం తెలియాలంటే నాకెదురైన ఒక యదార్ధ ఘటనను ఇక్కడ చెప్పాలి. మా కాంట్రాక్టర్స్ దగ్గర ఇంజనీర్ గా పనిచేస్తున్న అమ్మాయి ఆత్మ హత్య చేసుకుందని ఉదయాన్నే ఫోన్ వచ్చి ఆ వూరు పరిగెట్టాం. అది విజయనగరానికి ఆనుకుని వున్న చిన్న పల్లెటూరు.అయినప్పటికీ త్వరగానే చేరాం.అప్పటికే శవాన్ని తీసుకెళ్ళి కాల్చేసారు.
పెద్దవాళ్ళను కలిసి కారణాలు.అడిగాము. కడుపునొప్పితో చనిపోయిందన్నారు.ఎందుకో మాకు నమ్మ బుద్ది కాక ఆ అమ్మాయి కుటంబీకులని తరచి తరచి అడిగాం.ఆ అమ్మాయి బాబాయ్ అనుకుంటా మమ్మలని పక్కకు తీసుకెళ్ళాడు.

"సార్ మీరంతా ఆ అమ్మాయిని మీలో ఒకరిగా చూసుకున్నారు.మీ దగ్గర అబద్దం ఆడడం మహా పాపం.నిజానికి తను ఆత్మ హత్య చేసుకుంది...చానల్ వాళ్ళకు తెలిసి నానా విధంగా ప్రచారం చేస్తారని ఉదయాన్నే శవాన్ని తీసుకెళ్ళి పోయాం సార్..మీలో ఒకమ్మాయిని కడసారి చూసే అవకాశం లేకుండా చేసాం.యేమీ అనుకోకండి సార్" అంటూ బావురు మన్నాడు.

యీ విషయం ఒక వార్తగా ప్రచారం చేయడంలో తప్పేమీ లేదు...నేను మొదట్లో చెప్పినట్లు యే న్యూస్ ఐటం లేనప్పుడు ఇటువంటి సంఘటనల ఆధారంగా న్యూస్ అల్లబడుతోంది.  మన కొంప ముంచుతున్న విషయాల పట్ల నిర్లిప్తత యేర్పడేటట్లు చేయడం లో కూడా మీడియా తన వంతు పాత్ర తను చక్కగా పోషిస్తోంది. ఒక టెర్రరిస్ట్ తుపాకీ లోని బుల్లెట్ల వలన కొంత మంది అప్పటికప్పుడు చనిపోతారు. ఆ వార్త ప్రచారం చేయడంలో ఉన్న శ్రద్ద ఆర్ధిక నేరగాళ్ళ గురించి ఆ నేరాల ఫలితాల గురించి ఉండదు.ఏక్సిడెంట్ అయ్యి చనిపోడానికి ....కాన్సర్ తో గాని యెయిడ్స్ తో కాని కృశించి  చని పోడానికి ఉన్న తేడా  లాంటిదే ఇది కూడాను. ఆర్ధిక నేరాల వలన సమాజం నెమ్మదిగా నిర్వీర్య మవుతుంది. చని పోతున్నట్లు పేషెంట్ కు అర్ధమయ్యేసరికి కంట్రోల్  అతడి చేతుల్లో లేకుండా పోతుంది.  ఎందుకంటే చాలా వరకూ యీ నేరగాళ్ళంతా  ఏదో ఒక రాజకీయ పార్టీ వారు అయి ఉంటారు. నిజంగా ప్రజలను చైతన్య వంతులను చేసే బాధ్యత మీడియా తీసుకుని ఉంటే 2జీ రాజా తీహార్ జైల్ నుండి చెన్నై రాగానే అంత స్వాగతం లభించి ఉండేది కాదు.అమెరికా లో యీ మద్యే శిక్ష  విధించబడిన రజత్ గుప్తా కేస్ ఒక్క సారి చూడండి. అతడి ప్రాసిక్యూషన్ పట్టిన సమయమెంతో కూడా చూడండి.
               ఇక్కడి డబ్బు విదేశాలకు ప్రయాణం చేసి మరొకరి ద్వారా ఇక్కడి కంపెనీ లలో పెట్టు బడి పెట్టబడిగా మారింది.అంటే ఇది యెన్నెన్నో దారుల్లో ప్రయాణించిందని అర్ధమవుతోంది. కొన్ని దేశాల్లో ఉండే మాఫియా సహకారాలు కూడా దీనికి లభించి ఉండొచ్చు. యీ విషయాల మీద ఎన్ని చానళ్ళు దృష్టి పెడుతున్నాయో తెలియదు.

    ఇక్కడొక చిన్న విషయం నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఎన్నెన్నో సమస్యల మీద ఎన్నో కోణాల్లో రాయబడిన సాహిత్యం మనకు ఉంది. వాటిని సీరియల్స్ గా తీసే ఔన్నత్యం మన చానళ్ళకు లేదు కానీ ఒక హిందీ విజయవంతమైన సీరియల్ ని తెలుగులో అనువదించారు. సామాజిక చైతన్యం కొన్ని జీవితాలను యెలా మారుస్తుందో చూపించిన ఆ సీరియల్ చక్కగా విజయవంతమయ్యింది. కాబట్టి ఇక్కడ అర్ధం చేసుకోవలసింది ఏమిటంటే ప్రేక్షకుల చైతన్యం కంటే చానళ్ళ వాళ్ళ స్థాయి చాలా తక్కువని.

    మా మూర్తికి అన్నీ విచిత్రమైన సందేహాలొస్తాయని ఇంతకు ముందు విన్నవించుకున్నాను.
" మన రూల్స్ కాస్త రిలాక్స్ చేసి కసబ్ కు కూడా చానల్ ...పత్రిక పెట్టుకునే చాన్సిచ్చి చూడవలిసింది బాస్....అలాగే అతడి కుటుంబ సభ్యులను కూడా పాదయాత్రలకు అనుమతిస్తే పాపం వాళ్ళు కూడా మా వాడు చాలా అమాయుకుడు కోర్ట్ లే అన్యాయంగా శిక్ష  విధించింది అని  ప్రచారం చేసుకుంటుంటే కొత్తగా పదవుల్లోకి రావాలనుకునే వాళ్ళు వాళ్ళకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు తగిల్స్తుంటే పిచ్చి వెధవల్లా మనం చూస్తూ ఉండేవాళ్ళం కదా.....  " అంటుంటాడు 
                  యీ క్రింది లింక్ లోని ఆర్టికల్ చదివితే మూర్తి ఏమంటాడో...



http://www.mediacrooks.com/2012/01/medias-mask-of-morality.html#.UdmW4q54g3t

30, మే 2013, గురువారం

నిజాయితీ కెరటం కావాలి...

మా మూర్తి నాతో వాదించడంలో గొప్ప ఆనందాన్ని పొందుతాడు. అవేవో గొప్ప గొప్ప విషయాలనుకొంటే పొరబాటే. చాలా చిన్న చిన్న విషయాలనే కావాలని పొడిగిస్తుంటాడు.

"బంగారు లేడి ఉండదు కదా..." ఒక రోజు సడన్ గా అడిగాడు.

" వెండిది...రాగిది...కూడా ఎక్కడా ఉండదు"

"ఏ యుగాల్లో కూడా ఉంది ఉండదు కదా..."

"అందులో ఏ విధమైన సందేహమూ ఉంచుకోకు"

" ఆ విషయం ఒక మహారాజు కూతురు సీతా దేవికి తెలియదా...?"

" సరేలే  ..అందుకేగా రామాయణం జరిగింది"

" అది కాదు సహజత్వానికి ...దూరంగా ఉన్నప్పుడు దాంట్లో ఏదో తిరకాసుందన్న విషయాన్ని ముందుగా ఎందుకు గ్రహించలేదంటావ్"

"లక్స్మణుడు చెప్పాడుగా....ఇదోదో మోసమని...ఐనా నీకు అదంతా ఎందుకు దానివలన రావణ సంహారం    జరిగి లోక కల్యాణం జరిగింది కదా. పైగా మానవ జన్మ లో లక్ష్మీ దేవి పుట్టింది కాబట్టి సహజంగా  మానవ స్త్రీలకుండే లక్షణాలు  ఉండాలి కదా"


"సరేలే పురాణ స్త్రీల  సంగతి వదిలేద్దాం...మన ఇళ్ళ లో స్త్రీల విషయానికి వద్దాం...నీ చొక్కా వాషింగ్ మెషీన్ లో వేసే ముందు మీ శ్రీమతి నీ జేబూలు చెక్ చేస్తుందా...."

"సహజంగానే....ఇలాంటివాటిలో ఆమె చాలా జాగ్రత్తగా ఉంటుంది....తను స్ట్రిక్ట్ ఫైనాన్స్  మేనేజర్...కాష్ బాలన్స్ మొదలైనవన్నీ ఖచ్చితంగా అడుగుతుంది......"

"తక్కువ వస్తే సరే..అడుగుతారు..ఒక వేళ నీ పాకెట్ లో ఎక్కువ కాష్ ఉంటే ...."

"అమ్మో అప్పుడు మరీ జాగ్రత్తగా అడుగుతుంది....ఎందుకంటే ఆ కాష్ నేనెవరి  దగ్గరో తీసుకున్నట్లే కదా...ఒక వేళ నేను ఎక్కువ అరువు తీసుకుని కొంత ఖర్చు పెట్టేసి..మిగిలింది ఉంచానేమో....బాకీలు లాంటివి ఉంచడం ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు.అంతే కాదు ఎవరి దగ్గర తీసుకున్నాను..ఎందుకు తీసుకున్నాను లాంటివన్నీ అడిగి జాగ్రత్తగా జ్ణాపకం పెట్టుకుంటుంది...కరెక్ట్  గా చెప్పాలంటే ఆవిడ బ్రెయిన్  లో ఒక మినీ టేలీ పేకేజ్  ఉంటుంది"

"ఇంచుమించు మా శ్రీమతి కూడా అలానే ఉంటుంది....అంటే భార్యలంతా ఇలానే ఉంటారంటావా...."

"అలా ఉంటేనే కదా....సంసారాలు కాస్త సుఖంగా ఉండేది...మనకు ఇంత ఆదాయముంది....ఇంత ఖర్చుంది అని వాళ్ళకు ముందు గానే చెప్పేస్తే మిగిలిందంతా వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు...ఐనా ఇదంతా ఎందుకు అడుగుతున్నావ్...పనేమీ లేదా ...ఎస్టిమేట్స్ అన్నీ చేసేసావా..."గయ్యిమన్నాను

"అలా కాదు బాస్..... మొన్నొక వార్త పేపర్ లో చూసినప్పటి నుండీ గుండె చెరువై పొతోంది...పాపం ఒకావిడ ...తన అమాయుకుడైన భర్తను అన్యాయంగా జైల్లో పెట్టి హింసుస్తున్న..."

"మెలో...డ్రామా తగ్గించి అసలు విషయానికి రా"

"పాపం ... ఒక పోలీస్ ఉన్నతాధికారి దగ్గరికి వెళ్ళి....ఆయనకు పిల్లా జెల్లా లేరా అని కూడా అడిగింది"

"ఆహా...." లాప్ టాప్ లొ తయారు చేస్తున్న డ్రాయింగ్ మీదే నా దృష్టంతా  ఉంది.

"ఆవిడ భర్తను అంతా కలిసి కేసుల్లో ఇరికించారట...సంవత్సర కాలం నుండీ పిల్లలు నాన్నను చూడనే లేదంట...."

" పాపం.." మూర్తి తో నాకు మామ్మూలే కాబట్టి నేను పెద్దగా స్పందించ లేదు.

"మరీ నీకు సామాజిక స్పృహ లేకుండా పోతోంది ప్రసాదూ...బెల్లం కొట్టే రాయిలా అలా కదలకుండా ఉంటావేంటి..."

"చూడు బాబూ....నాకు చాలా పని ఉంది నన్ను వదిలి పెట్టు....ఒక వేళ ఆవిడ మాటలకు పోలీస్ అధికార్లు కరగక పోతే...జ్యుడీషియరీ ఉంది...పెద్ద పెద్ద జడ్జీలు ఉన్నారు...."

"పూర్తిగా  వినిపించికోవేం...ఆవిడ కోర్ట్ లొనే అడిగింది."

" సారీ.....చాలా ముఖ్యమైన వార్తని ఎవరైనా అంటేనే గాని యీ మద్య నేను పేపర్ చూడ్డం లేదు.....ఇంతకూ ఆ పోలీస్ అధికారి బోనులో ఉండగానే ఆవిడ అలా అడిగిందా...ఏమని అడిగింది ఇంతకూ..."

" ఆ పోలీస్ అధికారి బోనులో లేడు ఐనా పాపం ఈవిడ ఒక సారి మనస్సాక్షిని పరిశీలుంచుకోమని  ఆ అధికారిని కోరింది. అలా చేస్తే ఆవిడ భర్త యే తప్పు చేయాలేదని ఆ పోలీస్ అధికారికి అనిపిస్తుందంట..."

"చీ...ఆవిడను చూసి మన శ్రీమతులు చాలా నేర్చుకోవాలి కదా...భర్తంటే ఎంత నమ్మకం....ఇంతకూ ఆమెభర్త మీద ఎవరికి అంత కక్ష  ఉంది పాపం ?"

మూర్తి ఒక పెద్ద లిస్ట్ చెప్పాడు.

"నీవు ఎప్పుడో వచ్చిన కలిసుందాం రా అనే సినిమా చూసావా.....దానిలో తన వారి నుండి  తప్పిపోయిన ఒక కుర్రాడిని ఒక పోలీస్ కానిస్టేబుల్ పలకరించేసరికి ఆ కుర్రాడు ...మా తాతయ్య,నానమ్మ,అమ్మ......అంతా తప్పిపోయారంకుల్ అంటాడు.అలాంటి కాకమ్మ కబుర్లు నా దగ్గర ఇంకెప్పుడూ చెప్పకు.....ఇప్పుడే అనుకున్నాం...100 రూపాయలు యెక్కువ వచ్చినా ...తగ్గినా మన భార్యలు గయ్యిమంటరని....పాపం ....రెండు మూడు సంవత్సరాలలొనే ఉన్నదానికి వందల రెట్లలో ఆస్తులు పెరుగుతుంటే....ఇదంతా ఎలా వస్తుందని అడగని   సాధ్వీమణి  ఆమె ఐతే అయ్యొండొచ్చు ....కానీ  మిగిలిన వారంతా మరీ చెవిలో పూవులు పెట్టుకుని లేరు కదా.....

1978 లో ఎమెర్జన్సీ లో జరిగిన ఘోరాలు ఎన్నో పేపర్లో వచ్చినా కూదా ...శ్రీమతి  గాంధీ   ప్రజలముందుకు వచ్చి....మగ నాయకులంతా నన్నొక్క ఆడదాన్ని చేసి అణగ దొక్కాలని చూస్తున్నారరని కన్నీరు కార్చగానే మన వాళ్ళంతా ఆ పార్టీకి వోట్లు గుద్దేసారు. ఆ ట్రిక్ మరలా ఒక సారి ట్రై చేస్తున్నారేమో..."

"బాసూ....నీ ఉక్రోషాన్ని తగ్గించుకో..లేదంటే ఎవరో ఒకళ్ళు నీ కాళ్ళు విరగ్గొట్టడం ఖాయం"

" మంచిదే బాస్....ఒక ఉద్యమంతో అరెస్ట్ అయి..జైల్లో పెట్టబడి నప్పుడు వాళ్ళ సిద్దాంతాల కోసం మేము కూడా వాళ్ళ వెనుకే ఉండేవాళ్ళం. కానీ  యీ పార్టీ సిద్దంతం ఏమిటి...అధికార సంపాదన...జైల్లో పెట్టబడడానికి కారణం ఏమిటి...ఒకటా రెండా....నీకొక సంగతి నేను చెప్పనక్కర లేదనుకో....మనం ఒక కాంట్రాక్టర్ కు కావాలని ఎక్కువ గాని ..తక్కువ గాని బిల్ చస్తే వెంటనే చార్జ్ షీట్ ఇస్తారు. ఉద్యోగానికి ఎసరు కూడా వస్తుంది. మరి ఒక పార్లమెంట్ మెంబర్ ను అకారణంగా జైల్ లో ఉంచి తమకు ముప్పు తెచ్చుకొనే జడ్జీలు...అధికార్లు ఉంటారా...ఒక పక్క నిజంగా అలా లొంగి పోయిన అధికార్లు వూసలు లెక్క పెడుతున్నారు. మంత్రులు పదవులు కోల్పోతున్నారు.యీ విషయాలన్నీ పేపర్లలో వస్తూనే ఉన్నాయి.అవన్నీ అబద్దమే అన్నట్లుగా ఇలా కోర్ట్ సన్ని వేసాలు క్రియేట్ చేయడం.....

నేను కాలేజ్ చేరిన కొత్తలోనే కొన్ని సార్లు ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడు మా నాన్న గారు తాతయ్య బాగా తిట్టారు.ఎందుకంటే అప్పటికే నిజాయితీగా స్వాతంత్రొద్యమంలో పాల్గొని అన్నీ పోగొట్టుకొని దీనంగా బ్రతుకుతున్న వారి జీవితాలను చూసి.అన్ని విషయాల్లో నిజాయితీగా ఉండమని  మాత్రం చెప్పేవారు.కానీ యీ రోజు నేను నా పిల్లలకు నిజాయితీగా బ్రతకమని చెప్పాలంటే భయం వేస్తోంది.నేర పూరిత అభియోగాల మీద జైల్లో పెట్టబడి..సంవత్సర కాలం నుండీ బెయిల్  కూడా నిరాకరించబడిన వాడి వెనుక ఇంత మంది సమీకృతులవడం ఆశ్చర్యంగా ఉంది మూర్తీ....భయం వేస్తోంది..నా పిల్లలకు ..మోసం చేయడం తప్పు....ఒకళ్ళకు అన్యాయం చేయడం  తప్పు....కష్టపడు ..వచ్చిన దానితో తృప్తిగా ఉండు లాంటివి నేర్పి తప్పు చేస్తున్నానేమోనన్న ఫీలింగ్ వచ్చేస్తోంది....మొన్నటి వరకూ సిద్దంతాలు లేని పార్టీలు పాలించేతున్నాయనే బాధ పడే వాడిని ఇప్పుడు నేరస్తుల ముఠాలు పాలిస్తాయేమోనని భయం వేసిపోతోంది" నా శరీరం కంపించడం చూసి మూర్తి దగ్గరకు వచ్చి భుజమ్మీద చేయి వేసి చెప్పాడు

"ఇప్పుడు నీవొక్కడివే కావొచ్చు..చూస్తూ ఉండు నీతో నడవడానికి చాలామంది తయారవుతారు...రొచ్చు ఎల్లకాలం సుఖాన్నివ్వదు. అవసరం కోసమే కొంతకాలం దానిని భరిస్తారు...కొంతకాలం ఓపిక పట్టు...మన విశాఖ సముద్ర కెరటంలా మంచి నీరు వచ్చి యీ రొచ్చును ఆనవాలు కూడా లేకుండా  తుడిచిపెట్టేస్తుంది. "

26, మే 2013, ఆదివారం

జనజీవన స్రవంతి.....?


కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసాను. ఎదురుగా ఒక యువకుడు. మాంచి హుషారుగా ఉన్నాడు.

" సార్...ప్రసాద్ గారు......"


" అవును నేనే....."మీరెవరన్నట్లు  చూసాను.


"లోపలికి రావచ్చా సార్" 


చొరవగా లోపలికి వచ్చాడు.


"ఆశ్చర్య పోకండి సార్...నన్ను మీ ఫ్రెండ్---- పంపించారు"


వాడెందుకు పంపాడో నాకర్ధం కాలేదు.


"అంతగా అలోచించకండి సార్....మీ గురించి మీ ఫ్రెండ్ కరెక్ట్ గానే చెప్పారు"
అప్పుడే నా గురించి ఒక అంచనాకు  ఎలా వచ్చాడబ్బా అనిపించింది.
మరలా అతడే కొనసాగించాడు.


మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారటగా?"


ఉలిక్కి పడ్డాను


అమ్మాయికి సంబందాలొస్తున్నాయని వాడితో అన్నాను కానీ మా అవసరంగా వాడికి చెప్పిన గుర్తేమీ రాలేదు నాకు. అదే విషయం ఆ యువకుడికి చెప్పాను.


" మీకు ఆ ఉదేశ్యం అయితే లేదు సార్...కానీ నేను చెప్పింది వింటే మాత్రం ఇప్పుడే ఆ ఏర్పాట్లు చెయ్యమంటారు" 


"ఏ యేర్పాట్లు..." నాకంతా పజిల్ గా అనిపించింది...అసలు ఆకలే లేదన్న వాడికి తిండి తినమని బలవంత పెడుతున్నట్లు గా అనిపించింది. అందుకే అడిగాను.


"ఇంతకీ మీరెవరు?"


" భలే అడిగారు సార్..నా గురించి అడిగారంటే ఖచ్చితంగా నేను చెప్పేది వింటారు..అడిగారు కాబట్టి చెబుతున్నాను...మాది యీ టౌన్ లో కల్లా నం.1 ఈవెంట్ మేనేజింగ్ కంపెనీ. నేను దానిలో ఎగ్జిక్యూటివ్  ని" 


" కానీ మా ఇంట్లో ఇప్పుడేమీ ఫంక్షన్..గానీ ఈవెంట్ గానీ లేదే..." 


మీరెందుకొచ్చారన్నట్లు అడిగాను.

"ఉండక పోవచ్చు సార్.....నేను మీకు ఒక విషయం చెబుతాను అప్పుడు మీకు ఎలాంటి సందేహాలూ రావు.ఆకలి బాగా వేస్తుందనుకోండి....మీ అంత మీరే ఇంటికి వెళ్తారు లేదా హోటల్ కోసం వెదుక్కుంటారు. మరి ఇప్పుడు  పెరుగుతున్న మాల్స్ కు వెళ్ళి చూడండి....షాపింగ్ చేసిన తరువాత మిమ్మలని ఆకలున్నా లేకపోయినా లోపలికి వచ్చేలా చేస్తున్నాయా లేదా అక్కడి ఫుడ్ కోర్ట్ లు ....అలాగే మేమూ కూడా .."


"నాకర్దం కాలేదు"  అదే మాట పైకి కూడా అన్నాను.


"అవసరం ఉన్నవాడికి కావలిసింది సప్లై చేయడమన్నది పాత టెక్నిక్ ....కానీ లేని అవసరాన్ని సృష్టిచడమే కొత్త టెక్నిక్. ఉదాహరణకు మీకు మరో రెండు సంవత్సరాలకు కారు కొనే అవసరం పడొచ్చనుకోండి ...మీ చేత ఇప్పుడే అది కొనిపించగలగడమే కొత్త సేల్స్ టెక్నిక్. "


"అది సరే మాకు నీవు చెప్పే టెక్నిక్ లకు సంబందం ఏమిటి?"
"మీ ఫ్రెండ్ ద్వారా మాకు మీ ఇంట్లో రెండు మూడు సంవత్సరాలలో పెళ్ళి చేయవలసిన అమ్మాయి ఉందని తెలిసింది. కాబట్టి మా కంపెనీ ఈవెంట్ మేనేజ్ మెంట్ లొ కొన్ని విన్నూత్న పద్దతులు తో మార్కెట్ లో దూసుకు పోతోంది దాంట్లో కొన్ని మీకు చెబితే ఆ కొత్త దనానికి మీరే ఎప్పుడో చేయవలసిన పెళ్ళి వెంటనే చేయాలనుకుంటారు."


ఎందుకో నాక్కూడా కాస్త ఇంటరెస్టింగ్ గా ఆనిపించించింది. ఆ యువకుడిని చెప్పనిచ్చాను. 


"పెళ్ళి అనేది పెద్ద ఫంక్షన్.... కానీ దాని ముందుగా కొన్ని పిల్ల  ఫంక్షన్ లు కూడా ఉంటాయి. మన తయారీ అంత అక్కడ నుండి ఉండాలి. అవి సక్సెస్ అయితే పెద్ద ఫంక్షన్ సక్సెస్ అవుతుంది. అంతే కదా సార్..అసలు ముందుగానే మనం కొత్తదనంతో అదరగొట్టేస్తే మగ పెళ్ళి వారు మానసికంగా మనకు దాసోహమై పోతారు.ఒక్కసారి మాయా బజార్ సినిమా గుర్తుకు తెచ్చుకోండి. "


బాగానే చెప్పాడనిపించింది.


"అందుకు మనం కొన్ని కొత్త పద్దతులలో వెళ్ళాలి."


" మాంచి డెకొరేషన్ ల మీద....వంటల మీదా మా వాళ్ళు చాలా రకాల ప్రయోగాలు చేసారు...ఇంక కొత్తగా చేయడానికేమీ మిగల లేదనుకుంటా....." నా మనసులో మాట చెప్పాను.


" చూశారా మీరు కూదా మా కంపెనీ ని తక్కువగా అంచనా వేస్తున్నారు...ఎవరి దృష్టీ వెళ్ళని చోట  మేము చొచ్చుకు పోయి వినూత్న పద్దతులు ఆవిష్కరిస్తాం"


గ్రాంధికం కొంత ఎక్కువైందనిపించినప్పటికీ టాపిక్ మధ్యలో అంతరాయమెందుకని కొనసాగనిచ్చాను.


"సాధారణంగా అన్నీ ముందే మాట్లాడుకున్న తరువాత పెళ్ళికూతురింటికి నిశ్చయ తాంబూలాలు యీయడానికి లేదా పుచ్చుకొనదానికి వరుడి తరుపువారు మీ ఇంటికి వస్తారు ..అవునా...."
ThumbnailThumbnailThumbnail
"మామ్మూలే కదా.."

"ఇక్కడే మనం కొంత వెరైటీ చూపిస్తాం. పెళ్ళి కొడుకుతో బాటు అతడి ఫ్రెండ్స్ మరో పది మంది వస్తారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి మన చిన్న స్వయంవరం సీను సృష్టిస్తామన్న మాట. మీ అమ్మాయి కోసం చాలా మంది పోటీ బడితే అందులో కల్లా యోగ్యుడిని అమ్మాయి  వరించినట్లన్న  మాట"


"అదెలా కుదురుతుంది..పాత రోజుల్లో అయితే యేదో ఒక పరీక్ష పెట్టే వారు...గెలిచిన వాడికి అమ్మాయినిచ్చే వారు....."


" చూసారా....పరీక్ష పెట్టే వారని మీరే అనేసారు..గొడవే లేదు..మనం కూడా అదే చేస్తాం"


"వూరుకోవయ్యా బాబూ....అబ్బాయిని ముందుగానే ఖాయ  పరుచుకుంటాం కదా. కొంపదీసి యీ పరీక్షలో ఇంకెవడైనా  ఎక్కువ మార్కులు తెచ్చేసుకుంటే...."


"మా వాడు మరీ ముక్కు సూటిగా పోతాడు....వాడితో నీవు పడ  లేవని మీ ఫ్రెండ్ కరెక్ట్ గానే చెప్పారు సార్.....అంతే కాకుండా మీరు మరీ పాత తరం వారు కూడా సార్....పరీక్ష ఎవరెలా రాసినా మన అల్లుడి గారికే కదా ఫస్ట్ వచ్చేది...అంతా  మాచ్  ఫిక్సింగే కదా....."


"అంతా ఫిక్స్ అయిన తరువాత యీ టెస్ట్ లు పెట్టడం ..ఇవన్నీ యేమి బాగుంటుంది "


మీకెలా చెప్పాలో తెలియడం లేదు. చాలా మాచ్ లు ఫిక్స్ అవుతాయని చూసే వాళ్ళకు తెలియదా.....అయినా చూడ్డం లేదా....ఇప్పుడంతా బాగుందా ..లేదా అనే కాన్సెప్ట్ కాదండీ బాబూ...వెరైటీగా ఉందా .....లేదా....అంతే..."


నిజమే అనిపించింది. మా శ్రీమతి..మిగిలిన ఆడవాళ్ళతో  బజారుకి వెళ్ళినప్పుడు "కొత్త వెరైటీలు యేమొచ్చాయో చూపించండి" అనడం చాలా సార్లు విన్నాను.


" అసలు యే పరీక్ష పెడతాం" అడిగాను.


"ఏముంది సార్.....నీవు ఆఫీస్ నుండి ఆలశ్యంగా వచ్చావని మీ శ్రీమతి  అలిగితే నీ రియాక్షన్ ఎలా ఉంటుంది....రెందు పేజీలలో రాయండి  అని దూరంగా కూర్చో పెట్టి అందరికీ తెల్లకాగితాలిస్తాం"


"ఎలాగూ ఫిక్స్ అయ్యిందే కదా అని మిగిలిన వాళ్ళు ఏదో చెత్తంతా రాస్తారేమో...."


"అలాగేమీ ఉండదు సార్...ప్రతివాడూ చాన్స్ ఇస్తే తన తెలివికి పదును పెట్టాలనే చూస్తాడు. ఉదాహరణకు మిమ్మల్నే అడిగితే  యేమి రాస్తారో చెప్పండి" 


" ఇప్పటి దాకా టార్గెట్స్ పూర్తవలేదని బాస్ తో చీవాట్లు తిని ఇంటికి వస్తే ......నీ వెధవ కోపమొకటా వెళ్ళెహే...." అని కసిరేస్తాను. 


ఆ కుర్రాడు వంటగది వైపు జాలిగా చూసాడు.


"మీరు పెద్దవారై పొయ్యారు కాబట్టి అలా అన్నారు కానీ కుర్రాళ్ళు అలా అనరులెండి"


పాపం సాఫ్ట్ వేర్ కంపెనీ ల లో పని చేసే వారితో   యీ కుర్రాడికి అనుభవం కాలేదనుకున్నాను. 


"ఆ తరువాతేమి చేస్తారు"


"యేముంది సార్.......వాళ్ళు రాసిచ్చిన పేపర్స్ దిద్దిస్తాం.....పెళ్ళికొడుకు ఫస్ట్ వచ్చాడని అనౌన్స్ చేయిస్తాం. ఇక్కడే మాలో ఉన్న వెరైటీ   చూపిస్తాం. పరీక్ష రాసే వాళ్ళందరికీ మంచి మంచి టేబుల్స్  అరేంజ్ చేస్తాం. వాటిమీద అందమైన పూల గుత్తులు....స్వీట్స్....అల్పాహారాలు.....ఇంకా వెరైటీ  కోసం చికెన్ జాయింట్లు.. ...అబ్బో చూసే వారికి నిజమైన స్వయంవరం అన్న ఫీలింగ్ వచ్చేస్తుందన్న మాట.."


"అబ్బో ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్న పనేనే ..."


" అస్సలు కాదు...మేమెప్పుడూ మా కష్టమర్లను ఇబ్బందులకు గురిచేయం....ఇవన్నీ మీరు ఒరిజినల్ యేమాత్రం కొనక్కరలేదు. అవన్నీ ఒరిజినల్ కంటే బాగుండే ప్లాస్టిక్ వే  మేము సప్లై చేస్తాం..."


"హమ్మయ్య బ్రతికించారు..లేదంటే మా వాడు ఆ చికెన్ జాయింట్ల వైపే కక్కుర్తిగా చూస్తుండిపోతాడు...వధువు తమ్ముడినన్న సంగతి కూడా మరిచి......ఇంతకూ పరీక్ష సంగతేమిటి?"


" మీ బంధువులలో  ఉన్న ఒక అందమైన అమ్మాయి ..అందరి ముందుకూ వస్తుంది....ముద్దుగా ఉన్న చిన్న కుర్రాడు గానీ పాప గానీ ఆమెకు ఒక సీల్డ్ కవర్ ఇస్తారు.ఆవిడ  దానిని సుతారంగా ఓపెన్ చేసి విన్నర్ పేరు ప్రకటిస్తుంది. మిగిలిన వారంతా యీలలు చప్పట్లతో దానికి ఆమోదం చెబుతారన్న మాట."


"మరీ ఆర్టిఫీసియల్ గా అనిపించట్లేదూ...."


"మీరు చాలా మారాలి సార్...జన జీవన స్రవంతి లోకి రావాలి...మీరు మరీ ఆడివిలో  ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు......ఒరిజినల్  అనేది ఇక ఉండదు సార్...అంతా ఆర్టిఫీసియల్లే ఉంటుంది.. దాన్ని ఎంజాయ్  చేయడం అలవాటు చేసుకోండి. లేదంటే సమాజానికి దూరమైపోతారు. మిగిలిన వారంతా మారిపొయ్యారన్న ఉద్దేశ్యంతోనే  కదా పెళ్ళిళ్ళలో కూడా కాడ్బరీ డైరీ  మిల్క్ చాక్లెట్లు తింటున్నట్లు చూపిస్తున్నారు. మీరేమో ఇంకా జిలేబీ...పరమాన్నం అంటూ కూర్చుంటే.....లాభం లేదు సార్.....సరే ఇంతకూ మన వాళ్ళంతా చప్పట్లు కొట్టగానే బయట రంగురంగుల బెలూన్లు గాలిలోకి వదలదం లాంటివి ఉంటాయి...ఎలా ఉంది సార్...."


నా అభిప్రాయం చెప్పేలోగానే అతడు తరువాతి ఘట్టానికి  వెళ్ళిపోయాడు.


" ఇక పెళ్ళి తంతు అందరికీ మరుపురాని అనుభవంగా మలచడంలో  మాకు పెట్టింది పేరు సార్"


నేను మద్యలో  మాట్లాద దలుచుకోలేదు. అంతా విన్న తరువాతే నా అభిప్రాయం చెప్పేయదలుచుకున్నాను.


"సహజంగా మగ పెళ్ళి వారు విడిదింట్లో  దిగడంతో పెళ్ళి తంతు ప్రారంభమైనట్లే....."


అవునన్నట్లుగా తలకాయ వూపాను.


"విడిదింట్లో పానకం మొదలైనవన్నీ మా ప్రత్యేకమైన పర్షియన్ గాజు గ్లాసులతో యెలాగూ వడ్డిస్తామనుకొండి......ఇదంతా మామ్మూలే....అసలు విషయం దీని తరువాతుంది.అబ్బాయి విడిదింటి నుండి పెళ్ళి మండపానికి తరలి వెళ్ళడానికి యేడుగుర్రాలు లాగే రధాన్ని ఏర్పాటు చేస్తామన్న మాట. "


"నిజంగా గుర్రాలు లాగే రధం ఉందా..." మద్యలో అడగక తప్పలేదు.


"కరెక్ట్ గా అడిగారు సార్..నిజంగా గుర్రాలు లాగావు ఒక  కార్ను ఆ విధంగా తయారు చేయించాం.డ్రైవర్ నెమ్మదిగా పోనిస్తుంటాడు...గుర్రాలు జుస్ట్ నడుస్తూ ఉంటాయంతే...."


"ఏడుగుర్రాలెందుకు...రెండు మూడు సరిపోతాయిగా...."


" మరదే చిరాకు ..ప్రతి దానికీ రీజనింగ్ అడుగుతారు....మీ అమ్మాయి బాగా చదివి మంచి ఉద్యోగం చేస్తుందని మీ ఫ్రెండ్ చెప్పాడు ..మరలాంటప్పుడు ఏదో గొప్ప సంబంధమే  తెస్తారుగా...అందుకే మీ కోసం యీ స్పెషల్ ఏర్పాటు....మన దేవుళ్ళను  కూడా సప్తాశ్వ  రధ మారూఢం....అని స్తోత్రం చేయడంలేదూ....అప్పుడు యెందుకు రాదు యీ సందేహం?...ఇంకొకటి వినండి సార్...వరుడి కి అటూ ఇటూ వేరే గుర్రాల మీద కూడా నలుగురు సైనికులు శిరస్త్రాణాలు  వగైరాలు ధరించి గుర్రాల మీదే ఫాలో అవుతుంటారు."


"ఆ....." నోరు వెళ్ళ బెట్టాను


" అంతే కాదు వరుడి చెంతే వింజామరలతో నలుగురు చెలికత్తెలు ఉంటారు"


"అంటే ఐ.పీ.ఎల్. లో  చీర్ గాల్స్ లాగా"


" మొత్తానికి నేను చెప్పేదంతా బాగానే కాచ్ చేస్తున్నారు" 


"మరి గుర్రాలు పాస్ పోయడం లాంటివి చేస్తే పెళ్ళికొడుకు బట్టలు పాడవుతాయేమో. ....రధం పెద్దది గానే ఉంటుందా?


"మీకా సందేహం అక్కరలేదు...అవన్నీ స్పెషల్ గడ్డితో పెంచబడ్డవి...ఎక్కడ పడితే అక్కడ  పాస్ పోయడం....లద్దె వేయడం చేయవు....."


"ఓహో...."


"వరుడు పెళ్ళి మండపం చేరుకోగానే  రధం నుండి దిగడం అంతా...క్లోస్డ్ సర్క్యూట్ టీ వీ లలో చూపిస్తూ ఉంటాం కాబట్టి వరుడు రధం నుండి పెళ్ళి మండపం దగ్గరకు వెళ్ళే వరకూ ఆహూతులందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. అంటే వాళ్ళంత వాళ్ళు కొట్టరు.మా వాళ్ళు  ముందుగా జనం లో కలసి పోయి చప్పట్లు కొట్టడం ప్రారంభిస్తారు. పెద్దగా ఏమీ ఆలోచించకుండా పక్క వాడు చేసినట్లు చేయడం అలవాటు కాబట్టి వచ్చిన వాళ్ళంతా చప్పట్లు కొట్టేస్తారు. చూసారా సార్...వూహించుకుంటుంటే ఎంత అద్భుతంగా ఉందో"


కానీ భోజనాలవ్వగానే చాలామంది వెళ్ళి పోతున్నారు... పెళ్ళి మండపం దగ్గర చప్పగా ఉంటోంది..."


"దానికీ మా దగ్గర విరుగుడు ఉంది. ఆడ వారు భోజనం చేసేటప్పుడు అందరికీ కూపన్లు అందజేస్తాం. పెళ్ళి అయిన తరువాత డ్రా తీసి గెలిచిన వారికి 25000 రూపాయల పట్టు చీర అని ప్రకటిస్తాం. ఇక చూస్కోండి ఎక్స్ట్రా కుర్చీలు వేయించ వలసిందే."


"ఇది కూడా ఫిక్సింగేనా...."


"చాలా తెలివైన వారు సార్ ....చిన్న హింట్ దొరికితే చాలు ప్రొసీడ్ అయిపోతారు  మనమిచ్చే పట్టు చీర కోసం అన్ని పట్టు చీరలు పెళ్ళి మండపం అంతా అటూ ఇటూ తిరుగుతుంటే రంగులతో...రెప రెప లతో హాల్ కళ కళ లాడి పోతుంది సార్..."


"కానీ ఇదంతా రక్తి కట్టాలంటే ఎంత మంది జనం ఉండాలంటావ్?"


" రెండు వేలకు పైనే ఉంటే బాగుంటుంది సార్..."


"నా మొబైల్ లో 200 ఎంట్రీస్  ఉన్నాయి.....అందులో మా సివిల్ ఇంజనీరింగ్ అవసరాల కోసం ఉన్న ఆర్టిజన్లు 20 మంది....ఇలాంటివన్నీ తీసేస్తే నాక్కావాసిన వాళ్ళు మహా ఉంటే 100 మంది కంటే ఎక్కువ ఉండరు. మా శ్రీమతి నేనూ ఒక వూరి  వాళ్ళమే కాబట్టి మా ఇద్దరి బంధువులూ చాలా వరకూ కామన్ గా ఉన్న వాళ్ళే....అలాగే మా అమ్మాయికి కావాల్సిన వాళ్ళు కూడా మరో 100 మంది వరకూ ఉంటారేమో...యీ 2000 మందిని యెలా పట్టుకు రాగలను."


"మీలా అలోచిస్తే మా లాంటి వాళ్ళు బిజినెస్ చేసింట్లే....మీరు మీ ఫ్రెండ్స్ పార్టీలకు వెళ్ళి నప్పుడు పరిచయం ఐన వాళ్ళుంటారు కదా.....అలా ఒక్కొక్క ఫ్రెండ్ ని కదిపితే నేను చెప్పిన సంఖ్యకు అదే చేరుతుంది"


" కానీ చాలా ఖర్చు కూడా అవుతుందే..."


నాకెందుకో చాలా చిరాకుగా అనిపిస్తోంది.


ఇంతలో ఆ యువకుడు మరింత  దగ్గరకు జరిగాడు.


" ఇంట్లో వాళ్ళకు కూడా తెలియనీయకండి సార్....మీరంటే ఉన్న ప్రత్యేకాభిమానం వల్ల ఒక మాంచి అయిడియా చెబుతాను......ఒకే చోట రెండు వేల వోట్లు....వచ్చే సంవత్సరం ఎలక్షన్స్...కాబట్టి ఏదో ఒక రాజకీయ పార్టీ ఫ్లెక్షీలకు పర్మిషన్ ఇద్దాం...మిగిలిన దంతా వాళ్ళే స్పాన్సర్ చేస్తారు. అందులోనూ కొత్తగా రంగం లోకి వచ్చిన పార్టీ ఒకటి ఎలాగూ ఉంది. వాళ్ళు ఎక్కడ అవాకాశం దొరికినా  ఫ్లెక్సీలు  పెట్టే చాన్స్ వదలడం లేదు.....పైగా వాళ్ళకో చానల్.....పత్రికా ఉన్నాయి....."


మెచ్చుకుంటానేమో అని ఒక్క నిముషం ఆగాడు. అంతకు ముందు వరకూ అరికాలిలో ఉన్న మంట తలకెక్కడం ప్రారంభమయ్యింది. అయినా తమాయించుకుని చెప్పడం మొదలు పెట్టాను.


" విజయా వారి జగదేక వీరుని కధ సినిమా చూసావా...."Thumbnail
Thumbnail
Thumbnail
"చూడలేదు సార్...విన్నాను...ఏదో హీరో నాలుగు లోకాల అమ్మాయిలను పెళ్ళాదతాడని...ఇంకా పాటలు బగుంటాయని..." 

"ఇవన్నీ కరెక్టే గాని యీ సినిమా ప్రారంభంలో రాజు తన కుమారుడి కోర్కెలు అంటే నీవన్న నాలుగు లోకాల రాకుమారీలను పెళ్ళి చేసుకోవలనే కోర్కె విని...ఆహా..నా కొడుకెంత గొప్ప వాడు అని ఆనందించడు....ముందు రాజ్యం విడిచి పొమ్మంటాడు...ఎందుకంటే కాబోయే రాజుకు ప్రజల క్షేమం గురించి అలోచనలుండాలి కానీ అమ్మాయిల గురించి కాదని . ఎందుకో గాని ఆ రోజుల్లో ఆ నీతి నాకు చాలా బాగా నచ్చేది. మరి దానికి పూర్తి వ్యతిరేకంగా తన సంతానం కోసం రాష్ట్రాన్ని మొత్తం ఇష్టం వచ్చినట్లు దోచుకోనిచ్చిన వాడి పేరు నా కుమార్తె పెళ్ళి లోనా....అసలు నీకు నేనెలా కనబడ్డాను. నేనూ విద్యార్ధిగా ఉన్నప్పుడు...ఆ తరువాత ఉద్యోగం లోనూ కూడా నాయకుడిగానే ఎదిగాను. ఎందుకంటే ఆనాడు పోరాటం నా అవసరం...నా అవసరమే ఉన్న వాళ్ళను ప్రోగు చేసి కొన్ని ఉద్యమాలు నడిపాను.అంతే గాని ఫ్లెక్సీలు పెట్టుకుని కాదు. పది సార్లు ...కింది నుండి ...పై కోర్ట్ వరకూ బెయిల్ నిరాకరించాయంటే నేరం చేసిన చాయలున్నాయి కాబట్టే నని అందరికీ తెలుసు ఐనా ఎంగిలి మెతుకుల కోసం కుక్కలు ఎగబడుతూనే ఉంటాయి. అలాంటి వాటిని నా గుమ్మం చాయలకే కాదు కాస్త నీతిగా బ్రతుకుతూ....  అన్నం తినేవాడెవ్వడూ రానివ్వడు. ఇంకేదైనా తినే వాళ్ళ గురించి నేను మాట్లాడను.
నీకు ఇంకొక విషయం కూడా చెబుతాను విను. నీకెదురుగా ఉన్న రేక్ లో ఉన్న పుస్తకాలు చూడు. సగం ఇంజనీరింగ్ ..మిగిలిన సగం వేరే వేరే..సబ్జక్ట్లవి. మొదటివి నా వృత్తికి న్యాయం చేయడానికైతే మిగిలినవి నా జీవితానికి ఒక పరమార్దాన్నిచ్చేవి.  మహా..మహులు రాసినవి.నేను చేసే  యే పనైనా నాకు ఉపయోగపడడం తో బాటు..నా తోటి వారెవ్వరికీ నష్టం కలగకుందా చూసే బాద్యత కూదా నాదే నన్న విధంగా అలోచించే వాళ్ళం. నా వాళ్ళంతా యేమి  తింటున్నామన్న దానికంటే ఎవరితో కలసి తింటున్నాం...ఎక్కడ తింటున్నామన్న  విషయాల గురించి ఆలోచించే వాళ్ళే. కరెక్ట్ గా చెప్పాలంటే ఆలాంటి వాళ్ళే మా వాళ్ళవుతారు..ఎందుకంటే నూటికి నూరు పాళ్ళూ మా అమ్మాయి నా లాంటిదే. మహోన్నత విద్యాలయాల్లో....చాలా కాలం గడిపి కూడా కాస్త కూడా సమాజాన్ని పట్టించుకోకుండా....జడత్వంతో బ్రతుకుతూ... ఒక రోజు రధం ఎక్కో.....గుర్రం ఎక్కో...ఏనుగు ఎక్కో...జయ  ధ్వానా లను విని మురిసి పోయే వాళ్ళను  మా ఇంటి ప్రాంగణం లోకి కూడా రానీయను. వరల్డ్ కప్ టోర్నమెంట్   లో ఎప్పుడో రొనాల్డినో కొట్టిన ఫ్రీ కిక్ నీనిక్కడ వాడక ముందే......."


ఆ యువకుడు ముందే వెళ్ళి పొయ్యాడు పాపం


**********************

నిన్న జరిగిన పెళ్ళిలో ఒక స్నేహితుడు "మీ అమ్మాయి పెళ్ళి  అంతా ఈవెంట్ మేనేజెర్ కి కాంట్రాక్ట్ కి ఇచ్చేద్దాం " అనగానే నా కళ్ళ ముందు కదలాడిన ఊహ