1, అక్టోబర్ 2013, మంగళవారం

మహాత్ములని తయారు చేద్దాం ........

                                                   పేజీల తరబడి మహాత్ముడి గురించి నాకంటే చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు . ఏమీ చదవకుండానే పిచ్చి వాగుడు వాగే వాళ్ళూ ఉన్నారు .  కానీ మహాత్ముడి లో ఉన్న ఒక గుణం లోపించి  ఈ  రోజు మొత్తం సమాజం తనకు తానే తన పీక ఎలా కోసుకుంటుందో ఒక్క సారి చూద్దాం . ఒక్క సారి  ఈ క్రింది డ్రాయింగ్  చూడండి .  

ఇది విశాఖపట్నం లోని ఒక ముఖ్యమైన ప్రాంతం . జాగ్రత్తగా పరికిస్తే  రెడ్ కలర్ తో హైలైట్ చేసిన రోడ్ కనబడుతుంది . ఆ రోడ్ ఏ .. ఏ ... ముఖ్యమైన రోడ్ల మద్య కనెక్టివిటీ  ఏర్పరుస్తుందో ... చూస్తే దాని ప్రాధాన్యం అర్ధమవుతుంది . 

ఈ రోడ్ వేయడానికి గల నేపధ్యం ఒక సారి చూద్దాం . NAD జంక్షన్ నుండి అక్కయ్యపాలెం సెంటర్  వరకూ దిగువ వైపు మర్రి పాలెం , కంచరపాలెం , అబిద్ నగర్ లాంటి కాలనీ లు ఉంటే ఎగువన మురళీ నగర్ , మాధవదార , కైలాసపురం , నరసింహ నగర్ లాంటి కాలనీ లు ఉన్నాయ్ . ఎగువన ఉన్న కాలనీ వాసులంతా జగదాంబ ......డాబా గార్డెన్స్ లాంటి ప్రాంతాలకు వెళ్ళాలంటే మాప్  లో చూపిన అక్కయ్యపాలెం రోడ్ మీదుగానే వెళ్ళాలి . ఒక్క సారి అక్కయ్య పాలెం రోడ్ వంక చూస్తే రోడ్ అంతా ఒకే వెడల్పులో ఉండదు . రెండు చోట్ల సన్నగా ఉంటుంది . సన్నగా ఉన్న చోట్ల రెండు మతాల వారి ప్రార్ధనా మందిరాలు కనబడతున్నాయి చూడండి . ఆ ప్రార్ధనా మందిరాలు పక్కన ఉన్న షాపు లను చూస్తే ఈ మందిరాలు ముందుకు వచ్చి నట్లుగా అర్ధమవుతుంది . నాకు నిజానిజాలు తెలియవు . కాకపొతే ఆ షాపు లు ఉన్న లైన్ ప్రకారం చూస్తే మాత్రం అవి ముందుకు వచ్చినట్లే అనిపిస్తుంది . నాకర్ధం కాని విషయం ఏమిటంటే దేవుడు ప్రజల పక్షం ఉంటాడా ...... ప్రజలకు శత్రువుగా ఉంటాడా ...... ఎవరైనా నాయకుడు పూనుకొని ప్రతి రోజూ వేల మంది ప్రయాణం చేసే ఈ రోడ్ ను వెడల్పు చేస్తారని ఎప్పటి నుండో చూస్తున్నాను . 

పైన చెప్పిన విషయం ఎప్పటికవుతుందో తెలియదు కానీ హై వే  కు సమాంతరం గా ఒక రోడ్ అభివృద్ధి చేద్దామనే  ఉద్దేశంతో కంచరపాలెం బ్రిడ్జ్ నుండి శంకర్ మఠ్ రోడ్ కు కలుపుతూ ఒక పెద్ద రోడ్ ను ప్లాన్ చేసారు . కానీ సర్వే చేస్తున్నప్పుడే అవాంతరాలు ....... ఆటంకాలు పరిగణన లోకి తీసుకున్న పిదపే ఏ పనైనా ప్రారంభిస్తారు . కానీ విచిత్రంగా నేను "?" మార్క్ చేసిన చిన్న ముక్క దగ్గర కొన్ని గుడిసెలు మాత్రం గత ఐదారు సంవత్సరాలుగా అలాగే ఉన్నాయి. ఒక వేళ ఆ గుడిసెలలో ఉన్న వారే ఆ స్థలాలకు హక్కు దార్లైతే ముందుగా వారి ఆమోద పత్రం ఖచ్చితంగా తీసుకోకుండా  ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా ప్రారంబించారు ? ఒక పెద్ద రోడ్ కు పక్కగా ఉండే ఫ్లాట్ కొనుక్కుంటే ముందు ముందు లాభ సాటి గా ఉంటుందని  లోన్ లు  తీసుకుని  కొనుక్కున్న మధ్య తరగతి ఉద్యోగ వ్యాపార వర్గాల వారు మొత్తానికి వెర్రి వెధవల్లా మిగిలారు. 

వోటు బాంక్ రాజకీయాలలో...... మత మౌడ్యం ..... అవకాశవాద  రాజకీయాల మద్య  సమిధలుగా మారుతున్న వాస్తవాన్ని ప్రజలు ఎప్పటికి గుర్తిస్తారో అర్ధం కాకుండా ఉంది .ఇక్కట్లు పడేదీ వారే .... ఈ మందిరాలను పక్కకు జరపకుండా అడ్డుపడేదీ వారే .... 

ఈ సందర్భం లోనే మహాత్ముడు నాకు గుర్తుకు వస్తున్నాడు . టికట్ ఉన్నప్పటికీ తనను బయటకు గెంటేసిన దౌర్జన్యాన్ని సహించలేక నే కదా ఒక సామాన్యుడి నుండి మహాత్ముడిగా మారాడు .  మన చుట్టూ జరుగుతున్న ఈ చిన్న చిన్న అన్యాలయాను పట్టించుకోని మనం "నిర్భయ్" కు సపోర్ట్ గా ఊరేగింపులు చేస్తాం . అవును మరి  ఈజీ గా .... ఏ మాత్రం రిస్క్ లేకుండా హీరో కావాలిగా ...... కనీసం మన అవసరాల కోసమైనా మనం కొద్దిగా స్పందించగలిగితే   ముందు ముందు కొంతమందైనా మహాత్ములు తయారయ్యే అవకాశం ఉంటుంది . 

మత మౌడ్యం ..... అవకాశవాద  రాజకీయాల మద్య       మహాత్ములని తయారు చేద్దాం ........ 

29, సెప్టెంబర్ 2013, ఆదివారం

మందు తిగి పోయింది పాపం.......

                              చెప్పేవాడికి వినేవాడు లోకువ......నేను చెబుతూ ఉంటాను ...మా బావమరిది వింటూ ఉంటాడు.బావ మరిది అంటే మా శ్రీమతికి అన్నే అని కాదు వాడు నాకు మేనమామ కొడుకే. కానీ ఇప్పుడు సీను రెవర్స్ లో ఉంది. అంటే వాడికేదో జ్ణానం ఒకే సారి పెరిగి పోయిందని కాదు. ప్రస్తుతం వాడి చేతులో గ్లాసు ఉంది..... దానిలో ద్రవం ఉంది.అదిస్తున్న బలం ఉంది. పక్కన వాడి చెల్లెలు వండిన పకోడీలు ఉన్న ప్లేటు ఉంది.

"సరేరా  మొత్తానికి నీవు చెప్పేదేమిటి" మా బావ మరిది మరలా అడిగాడు.

నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నేనెన్ని సార్లు చెప్పినా వాడి బుర్రకు అంతకంటే ఎక్కదని నాకెప్పుడో అర్దమయ్యింది.

"నీవన్నది కరెక్టే గాని మరీ "ఆ నలుగురూ" లో రాజెంద్ర ప్రసాద్ లా  నూటికీ కోటికీ ఒక్కడుంటాడు. పైగా మనిషన్నాకా యీ మాత్రం కళలుండాలి"

వాడి రెండు చేతులూ చూపించాడు. 

"ఆ మాత్రం కొద్దిగా నాకూ ఉన్నాయి కదరా..."

"యేంటి బాబూ...నీ పొట్టలో పోసినా ఒకటే ..డస్ట్ బిన్ లో పోసినా ఒకటే....ముఖంలొ కొంచెం ఫీలింగ్సన్నా   మారవ్..." 

తాగిన తరువాత ఎలా ఉండాలన్న విషయంలో వాడికి చాలా స్థిరాభిప్రాయాలున్నాయ్.

" మన చిన్నప్పుడు ఇద్దరం కలసి ఒక సైకిల్ మీద మన క్వారీ కాలవ గట్టు మీదుగా కడియం టూరింగ్ టాకీస్ లో సినిమా చూసొచ్చి బోల్డంత ఆనంద పడే వాళ్ళం....మరిప్పుడు మన అబ్బాయి గార్లకు అలా వెళ్ళమని చెప్పి చూడు...నిన్నూ నన్నూ కలిపి తొక్కేత్తారు.కాబట్టి మారిన కాలానికి తగ్గట్టుగా మనం కూడా మారాలి మరి"

సరేలే అన్నట్టుగా తల వూపి పక్కనున్న పుస్తకాన్ని నెమ్మదిగా అందుకో బోయాను.

" ఒరెయ్ బాబూ నీకో నమస్కారం ...అవి మాత్రం కాస్సేపు ముట్టుకోకురా బాబూ......" గట్టి గా అరిచాడు. తింటున్న పకోడీ గొంతులో అడ్డు పడుతుందేమోననుకున్నాను. కానీ మరింత ద్రవంతో దానిని లోనికి నొక్కేసాడు.

"సరేరా..... ఇప్పుడు నేనేం చేయాలి?" నెమ్మదిగా అడిగాను.

"అమ్మయ్య దారిలోకి వచ్చావురా బాబూ.....ఇప్పుడు వచ్చిన గొడవేమిటంటే నీ మాట తప్ప అది ఎవరి మాటా వినదు కాబట్టి నీవు ఊ..  అంటే అది కూడా ఊ...  అన్నట్లే.ఆ విధంగా చూస్తే అది నీ కంటే బెటెరే  అనొచ్చు నీవైతే ఎవరి మాటా వినవు కదా....."

"మొన్ననే మీ వాసు చిన్నాన్న ఇలానే ...ఏరా అమ్మాయికి పెళ్ళి సంబందాలు చూడవా  అని అడిగాడు..."

"మరేం చెప్పావ్..."

"రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి  మగవాళ్ళు .....చీరలు బంగారం...గురించి ఆడవాళ్ళు మాట్లాడని  కుటుంబం ఏదైనా ఉంటే అలాంటి కుటుంబంలో పెరిగిన కుర్రాడెవరైనా ఉంటే   చూడు "అన్నాను 

ఉలిక్కిపడ్డాడు.ఎందుకో నాకు తెలియదు. 

"ఏం చెప్పావురా...?"

మరలా అదే చెప్పాను.  

"బుజ్జీ నీవెళ్ళి ఒక ఆమ్లేట్  వేసి పట్రావే ....ఇవ్వాళ నా కోటా దాటడం ఖాయం....వీడెక్కడ దొరికేడే బాబూ నీకు...ప్రపంచంలో ఇలాంటి కండిషన్స్ ఎవడైనా పెడతాడా..."తన చెల్లెలి వంక చూసి చెప్పాదు.

"అంతే కాదొరే.... వాళ్ళకు కాస్త  చైతన్యం  కూడా ఉండాలి"

వాడు కాస్త రిలీఫ్ గా చూసాడు.

"అది ఫరవాలేదులేరా యీ రోజుల్లో రాజకీయాలగురించి తెలియని వాడెవ్వడులే.." 

"రాజకీయ చైతన్యం  అంటే నీకు నచ్చిన వార్తలు వేసే పేపర్ మొదటి నుండి చివరి వరకూ చదివేయడం కాదు..."

"చ...చ..అదేమీ కాదు...నేనున్నాననుకో...ఇంటిదగ్గర ఈనాడు...ఫాక్టరీలో...ఆంధ్ర  జ్యోతి ...పక్కింటి మాస్టరు గారింటి నుండి సాక్షి తెప్పించుకొని మరీ చదవుతాను.

"మరి ఒక్కటడుగుతాను చెప్పొరే...మన చిన్నప్పుడు మన వూరి కంసాలి భద్రం గరికి ఒక్క ఇల్లే ఉండేది...కానీ మనం పెద్దయ్యే సరికి వాళ్ళ కొడుకులుకు ఒక్కక్కళ్ళకూ ఒక్కొక్క మేడ కట్టించి ఇచ్చాడు...."

"అవును.."

"ఆ టైం లో మన రైతుల్లో ఎవరూ కూడా అంతంత  ఇళ్ళు వారసులందరికీ కట్టి ఇవ్వ లేదు"

"అవును"

"ఇప్పుడు మన వాళ్ళు వాళ్ళ దగ్గరకు కూడా కాకుండా ఆ మద్య కాలంలో  రాజమండ్రీ లో జెట్టీ జ్యూయలర్స్ లాంటి షాప్ లకు వెళ్ళేవారు.అవునా..."

" ఆ తరువాత నెమ్మదిగా మన వూల్లో అమ్మకానికి వచ్చిన పొలాలన్నీ...ఆ జ్యూయలరీ షాపుల వాళ్ళూ..బట్టల షాపుల వాళ్ళూ మాత్రమే కొన్నారు అవునా...." 

"అవును"

"అంటే ...మన రైతుల దగ్గర ఉంటున్న సేవింగ్స్  ఏదైనా ఉంటే అది నెమ్మదిగా ఎవరి దగ్గరకు వెళ్తోంది?"

"షాపుల వాళ్ళ దగ్గరికే...." 

"వాళ్ళేం చేసారు..?"

"ఏమి చేస్తారు .....లేఔట్  లు వేసారు" 

"మన పక్క వూరు వరకూ లెక్కేస్తే ఇంచు మించు 12000X500=6000000 చదరపు  మీటర్ల
వ్యవసాయిక భూమి ఉత్పాదన లేకుండా పడి ఉంది.అవునా...." 

"కాదని ఎందుకంటాను.."

"అంటే మన ఆడంబరాలు ...అలవాట్లు మనలనే మన భూముల నుండి దూరం చేస్తున్న పరిస్థితులుంటున్నప్పుడు మనం ఇంకా మారవలసిన అవసరం లేదంటావా....ఆ మాత్రం చైతన్యం   ఉన్న వాళ్ళతోనే మనం సంబందాలు పెంచుకునే అవసరం లేదంటావా....?"

వాడు గాల్లోకి చూస్తూ ఉండిపొయ్యాడు."చాలా కష్టం....చాలా కష్టం.." అంటూ రెండు మూడు సార్లు గొణిగాడు.

"అంటే బిజినెస్ చేసే కుటుంబాల లో సంబందాలు ఏవీ పనికి రావా...."

"అలా అని నేననను....నీకొక చిన్న ఉదాహరణ చెబుతాను...మనకుండే వాతావరణ పరిస్థితులలో గ్రీన్ హౌస్ కాన్సెప్ట్ తో ఇళ్ళు కట్టే ఆలోచన  చేయొచ్చు. మొదట్లో ఖర్చు ఎక్కువవ్వొచ్చు..కానీ ఏ.సీ.ల ఖర్చు తో పోలిస్తే...ఐదారు సంవత్సరాల లోనే ఆ మాత్రం సేవ్ అవుతుంది.వనరులు మిగులతాయ్....పర్యావరణానికి రక్షణ ......నా ఉద్దేశం ఏమిటంటే మనం చేసే ఏ పనైనా మనకు ఆదాయాన్ని ...ఆనందాన్ని యీయడంతో  బాటు ..సమాజానికి ఏ విధమైన హానీ చేయకుండా ఉండాలి.ఏ సమాజంలో  నీవు బిజినెస్ చేస్తున్నావో దాని బాగోగుల గురించి కూడా కాస్త ఆలొచించాలి. అంతే గాని...క్లబ్ హౌస్ అనీ...స్విమ్మింగ్ పూల్ అనీ....పవర్ వేస్ట్ చేసే సౌకర్యాల కంటే ఇది చాలా బెటర్ కదా..."

"ఒరేయ్....ఎక్కడో  అక్కడ కోచింగ్ తగలెట్టి  ఐ.ఐ.టీ...లోనో...బిట్స్ లోనో...ఎన్.ఐ.టీ లోనో చదివేసి....హాయిగా ఉద్యోగం చేస్తూ....నీవన్నావే...స్విమ్మింగ్ పూల్..క్లబ్ హౌస్ ఉన్న ఫ్లాట్ కొనుక్కుని ...ఒక మాంచి కార్ లో రోడ్ మీద సర్రున జారే విధంగా డ్రైవ్ చేస్తూ ..బ్రతకాలనుకునే కుర్రాడిని తేగలం కానీ.....ఈ చైతన్యం..అదీ ఉన్న వాడు  ఎక్కడ దొరుకుతాడ్రా బాబూ....చీ...చీ...బుర్ర పాడై  పోయింది ఇంకో క్వార్టర్ తెచ్చుకోవాలి....ఒరేయ్...నీ డిమాండ్లు అన్నీ ఇప్పుడే చెప్పు మళ్ళీ అవింకొక సారి చెప్పేవంటే తెచ్చిన క్వార్టర్ కూడా చాలదు....బుజ్జీ.....వీడూ..వీడికూతురూ...మొండోళ్ళే......కష్టాలన్నీ నీకూ...నాకే.....సర్లే నీవు ఆమ్లేట్  లో ఉల్లి పాయలు వేయడం మరిచి పోకు..." అంటూ బయటకు కదిలాడు.  

26, సెప్టెంబర్ 2013, గురువారం

ఇది న్యాయమేనా మాష్టారూ....?

                         పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగకు ఆనందంగా మా వూరు వెళ్తుండగా మా పాప ఫోన్ చేసి ఒక మంచి ఆనందకరమైన వార్త చెప్పింది. తనకు కాట్ ఎగ్జాం  లో 99.69 పెర్సెంటైల్ వచ్చిందని. అనుకోకుండా ఆ రోజు ఎల్.టీ.టీ ఎక్స్ప్రెస్ లో ఫస్ట్  క్లాస్ కంపార్ట్మెంట్ యెక్కాం. అంతకు ముందు ఏ.సీ. ఎక్కడమే తప్ప మా వాళ్ళు ఫస్ట్ క్లాస్ ఎప్పుడూ యెక్కి ఉండ లేదు.పైగా ఒక స్నేహితుని కుటుంబం అనుకోకుండా కలిసింది. ప్రయాణం చాలా ఆనందంగా సాగుతుండంగానే మా పాప ఆ వార్త చెప్పింది. మా వాళ్ళ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయ్. ఆ సమయం లోనే అనుకున్నాను మా వూరిలో కూడా ఏవో కొన్ని అందరికీ ఆనందాన్నిచ్చే పనులు చేయలని. మా బంధుజనం లోని కుర్రాళ్ళని అక్కడ నుండే కాంటాక్ట్ చేసాను.సరదాగా వాలీ బాల్ టోర్నమెంట్  పెడదామన్నారు. తక్కువ ఖర్చుతో కూడిన టోర్నమెంట్  కూడా అదే. వూళ్ళోకి దిగగానే ఆ ఏర్పాట్లలో పడ్డాను. మా కుర్రాళ్ళు చెప్పినదాని ప్రకారం ముందుగా ఎంపైర్లను వెదుక్కోవాలి.మా వూరి స్కూల్ డ్రిల్ మాస్టారి ఇంటికి వెళ్ళాం. అప్పుడే చూశాను  జీవన్ దాసు మేస్టారిని. వచ్చీ రాగానే పార్టిసిపేట్ చేస్తున్న టీం ల లిస్ట్ లు తీసుకుని ఒక చిన్న పిల్లాడిని పిలిచి ద్రా తీయిచేసారు.ఆ వెంటనే టోర్నమెంట్ షెడ్యూల్ కూడా చకా చకా తయారు చేసేశారు.  ఒక అనుభవజ్ఞుడైన టైలర్ గుడ్డను చకా చకా కట్  చేసి కుట్టడానికి రెడీ చేసిన తీరులో ఆయన ఆ టోర్నమెంట్ ఏర్పాట్లు చేసేసారు. ఎక్కువ మాట్లాడరు. ఆ ఏరియా లో ఉన్న డ్రిల్ మాస్టర్లందరికీ ఆయన గురుతుల్యులు. మొదటి రోజు ఏర్పాట్ల బిజీ లో ఉండడం వలన మేమిద్దరం మొదటి రోజున ఎక్కువగా మాట్లాడుకో లేదు. రెండో రోజు ఉదయం పూట ఆయన అందరికంటే ముందు వచ్చి టోర్నమెంట్  కోసం వేసిన షామియానా లో కూర్చున్నారు. అంతకు ముందు నేను చూసిన బ్రెజిల్...యూ.ఎస్. టీం ల మద్య జరిగిన ఒక మాచ్ గురించి మాట్లాడుతూ వాళ్ళు చేస్తున్న సర్వీస్ లా మన వాళ్ళు ఎందుకు ప్రాక్టీస్ చేయడం లేదని అడిగాను.

" చేసే వాళ్ళు  ఉంటారు సార్...మా వాడు చేసే వాడు" అన్నారు.

"అరే....మరి టొర్నమెంట్ కు  రాలేదే  "

మాస్టారు సెల్ ఫోన్ తీసారు.వాళ్ళబ్బాయికి ఫోన్ చేస్తున్నారేమో అనుకున్నాను. కానీ దాంట్లో ఫొటోస్ ఓపెన్ చేసి ఒక యువకుడి ఫొటో చూపించారు.

" వీడే సార్....మా వాడు" 

ఏదో అనుమానం మనసులో లీలగా మెదిలింది.

"అంటే...'

"లేడు సార్...నన్నిలా వదిలి వెళ్ళిపొయ్యాడు......నా కోరిక మేరకే వాడు మంచి వాలీ బాల్ ప్లేయర్ అయ్యాడు...డ్రిల్ మేస్టరుగా సెలెక్షన్ కూడా వచ్చింది.....నా ఖర్మ...లవ్ ఫైల్యూర్...వద్దని మేము అనలేదు... ఆ అమ్మాయి ఒప్పుకోలేదు....యీ అమ్మా ...నాన్నా...వాడికి గుర్తు రాలేదు.."  

అప్పుడు నాకర్ధమయ్యింది. మాష్టారు ఎందుకు ఆ ఆట  లో ములిగి పోయి ఉంటారో ..ఒక విధంగా ఆయన వాళ్ళబ్బాయి తో కలిసి ఉంటున్న ఆనందంలో ఉంటారేమో. 

ఆ రోజు సాయంత్రం మాస్టారు నన్ను పక్కకు పిలిచారు. 

" నాదో చిన్న రిక్వెస్ట్ సార్...."

మాస్టారి రెండు చేతులూ పట్టుకున్నాను.

" మీరు మాకెంతో సహాయం చేసారు....నా ఆనందాన్ని నేను ..మా వాళ్ళంతా పుట్టిన నా గ్రామానికి కొంతైనా పంచుదామనుకున్న నా అలోచనకు రూపాన్నిచ్చిందే మీరు. ఎవరికి ఏ గిఫ్ట్ లు కొనాలో చెప్పండి అన్నీ ఇప్పుడే కొనేద్దాం." మాస్టారు గిఫ్ట్ ల కోసం సంకోచిస్తున్నారేమో అనుకున్నాను.

"అలాంటిదేమీ లేదు మీరు యువకులుగా ఉన్నప్పుడు ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్  ఎలా కండక్ట్ చేసేవారో చాలా మంది చెప్పారు.....నాకు రేపు సాయంత్రం కొంచెం త్వరగా సెలవిప్పించాలి"

"అదేమిటి మాస్టారూ....రేపు సాయంత్రం ఘనంగా బహుమతి ప్రధానోత్సవం చేయాలనుకున్నాం కదా....'

" ఆ కార్యక్రమమే... కొంచెం త్వరగా ముగించేద్దామని...."

" మీ ఇష్టం మేస్టారూ.....మీకెలా బాగుంటుందో అలా చేయండి"  మేస్టారి మీదే పెట్టేసాను.  కానీ కారణం కనుక్కోవాలనిపించింది.అడిగేసాను.

" ఏమీ లేదు సార్....మా వాళ్ళంతా పార్టీ మారారు...ఏదో కొత్త పార్టీ పేరు మీద మా వీధిలో ముగ్గుల పోటీల లాంటివి పెడుతున్నారు...నేను దూరంగా ఉంటే బాగుండదు కదా...అని"

"ఓస్  అంతేనా...అలాగే కానిచ్చేద్దాం సార్"  మాస్టారిని ఆప్యాయంగా సాగనంపాను.

తరువాత రోజు అన్నీ సక్రమంగా ముగిసాయి.మాస్టారిని సాగనంపడానికి కొంతదూరం నడుచుకుంటూ వచ్చాను. 

ముందు రోజు రాత్రి నుండీ నా మనసులో మెదులుతున్న సందేహాన్ని అడుగుదామా లేదా అనే మీమాంసలో ఉన్నాను. ఒక సారి మాష్టారి ముఖంలోకి  చూసాను. చిరునవ్వుతో ఉన్నారు. 

"చాలా సహాయం చేసారు మాష్టారూ...వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా చేద్దాం సార్" మరొక  సారి కృతజ్ణతలు తెలియ జేసాను.

"  యీ రోజుల్లో తమకు కలిగిన సంతోషాన్ని నలుగురితో పంచుకోవాలనే వాళ్ళే ఉండరు సార్..అటువంటిది మీరు ఇంత కార్యక్రమాన్ని నెత్తిన వేసుకుంటే ఆ మాత్రం సాయం చేయడంలో ఏముంది సార్"

మాష్టారి  వినయం చూసి కాస్త ధైర్యం వచ్చింది.

"మాష్టారూ మూడు రోజులనుండీ మిమ్మలను చూస్తున్నాను...మీ మంచితనం అర్ధం అయ్యింది..కాబట్టే ఒక్క చిన్న ప్రశ్న అడుగుదామనుకుంటున్నాను. తప్పైతే క్షమించండి." 

"అయ్యో అదేమిటి సార్....అడగండి"

"ఏమీ లేదు మాష్టారూ....మనం ఒక కొత్త రాజకీయ పార్టీలోకి మారాలంటే  దాని విధానాలు పాత పార్టీ విధానాల కంటే మనకు సహాయ పడేవిగా ఉందాలి కదా....(నేను కావాలనే అభ్యుదయం అన్న మాట వాడ లేదు).అటువంటివేమన్నా మీకు స్పష్టంగా ఉన్నాయా...దయుంచి సంక్షేమ పధకాల గురించి మాత్రం చెప్పకండి. మరలా అదో పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది."

"అదేమీ నాకు తెలియదు సార్..ఇప్పటిదాకా మేమున్న పార్టీ ఇంతకు ముందులా లేదని యీ కొత్త పార్టీ లోకి మారిపొయ్యారు...నేను మాత్రం నలుగురితో బాటు...అంతే...."

" ఒక్క మాట సార్...నిజంగానే ఇప్పటి వరకూ ఉన్న పార్టీ ఇంతకు ముందులా లేదు...అలానే అనుకుందాం ..అలాంటప్పుడు..యీ కొత్త పార్టీ కంటే ముందే ఒక వివాద రహితుడు ..మేధావి గా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఒక పార్టీ పెట్టాడు కదా.....మరి దాని గురించి అలోచన కూడా చేయకుండా యీ కొత్త పార్టీ మీద ఇంత ప్రేమ ఏ ప్రాతిపదిక మీద పుట్టుకొస్తోంది?  ఆ ప్రాతిపదిక కరెక్టేనా.....మార్పు కావాలనుకున్నప్పుడు మంచి వాళ్ళనివదిలేసి అత్యంత వివాదాస్పదుడిగా ఉన్న వ్యక్తి వెనుక సమీకృతమవ్వడం మంచిదేనా? ఈ మార్పు మీకు గాని ..సమాజానికి గాని...వ్యవస్థకు గాని ఏమైనా  మేలు చేస్తుందా సార్?  ఇదే ప్రాతిపదికను ఎదుటి వాళ్ళు కూడా అనుసరించరా? పోనీ యీ కొత్త నాయకుడు  గతంలో ఉద్యమాలలో పని చేసాడా...ఏమైనా ఆర్ధిక వేత్తా....లేక ఏదైనా పర్యావరణ  ఉద్యమాల లాంటి వాటిలో పని చేసాడా....ఏదైనా ఒక్క ప్రత్యేకత చెప్పండి. ఇదంతా మీతో ఎందుకని అంటున్నానంటే మీ మంచితనం నాకు నచ్చింది...మీలాంటి వాళ్ళు అలోచిస్తే సమాజానికీ...వ్యవస్థకూ మంచి జరగొచ్చని ఆశ అంతే వేరే విధింగా  అర్ధం చేసుకోకండి " 

"ఎంత మాట సార్ ..కులాల పేరుతో బాడ్మింటన్ కోర్ట్ లు ఉన్నటువంటి ఈ గ్రామంలో మీ కాలేజ్ రోజుల్లోనే ఒకే బాడ్మింటన్ కోర్ట్ లో ఊరందరినీ ఆడించిన  మిమ్మలని తప్పుగా ఎలా అర్ధం చేసుకుంటాను  సార్.  కానీ ప్రస్తుతం  మీకు సమాధానం చెప్పలేను....ముందుగానే చెప్పాను అబ్బాయి పోయిన దగ్గరినుండీ ఒంటరిగా  ఉండలేక ...ఎప్పుడూ నలుగురి మద్యలో ఉండాలనే ఇన్ని వ్యాపకాలు పెట్టుకుంటున్నాను.ఎక్కువగా ఆలోచించి ..ఆ తరువాత వాదించితే ఆ నలుగురికీ దూరమైపోతానేమోనని భయం సార్..అంతే..టోర్నమెంట్  త్వరగా ముగించేసి మిమ్మలని బాధ పెట్టి ఉంటే  క్షమించండి".

మాష్టారి  చెయ్యి ఆప్యాయంగా నొక్కి సెలవు తీసుకున్నాను.  

24, సెప్టెంబర్ 2013, మంగళవారం

అబ్బ....జోకర్...ఆ వెంటనే లైఫ్....

........అబ్బ......మంచి కార్డ్ పడింది.....లైఫ్ లేకుండా గేం మొదలుపెట్టినప్పుడు మొదటంతా టెన్షనే...తరువాత ఒక్కొక్క ముక్క కలిసి వస్తున్నప్పుడు మాంచి రిలీఫ్ గా ఉంటుంది...ఇప్పుడు కాంగ్రెస్ అధినాయకత్వానిది అదే పరిస్థితి...

రాష్ట్రమంతా ఒక్క కాంగ్రెస్ దే అన్నట్లు ఒక నిర్ణయం ప్రజల మీదకు వదిలారు. కాబట్టి ఒక జోకర్ దొరికినట్లయ్యింది. తెలంగాణాలో టీ.ఆర్.ఏస్. తో కలసి సీట్లు పంచుకోవచ్చు.సమైక్యాంధ్ర కావాలంటూ ఇక్కడ  ప్రజలు ఆందోళనలు మొదలుపెట్టారు. వారికి కావలిసింది కూడా అదే....ఎందుకంటే ఇక్కడ గెలిచే పరిస్థితి ఎలాగూ లేదు. ప్రధాన ప్రతిపక్షం చేష్టలుడిగి నిలబడిన మహదవకాశాన్ని  చేజేతులా అంది పుచ్చుకున్నారు.లైఫ్ కోసం ఆట్టే శ్రమ పడలేదు.జగన్ ను వదిలి పెట్టి "షో" అన్నారు.

మా వాళ్ళు పొలాల్లో పేకాట ఆడుతున్నప్పుడు వాళ్ళకు ఉప్మాలు ..కాఫీలు అందించడానికి  ఎవరినైనా పన్లొ పెట్టుకుంటుంటారు. వీళ్ళకు పేకాట గురించి పెద్దగా తెలియదు ...ఆ ఆడే వాళ్ళలో  గెలిచినవాడు "షో " అని అరిచినప్పుడు వాళ్ళ అరుపులకు కేరింతలకు ..హావ భావ విన్యాసాలకు ..వీళ్ళు కూడా ఆనంద పడడం ఈ పనివాళ్ళకు నెమ్మదిగా అలవాటై పోతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రజల పరిస్థితి అదేనా....   

కొసమెరుపు... 

జగన్ బాబు ని కాస్త రెస్ట్ తీసుకోనిమ్మని చాకో మహాశయులు ప్రజలకు విజ్ణప్తి చేస్తున్నారు. పైగా జైలు లో ఎక్కువ కాలం ఎవరినీ ఉంచడౌంచడం కాంగెస్ కు ఇష్టం ఉండదంటున్నారు. 

...రానున్న దొంగల రాజ్యమా....వర్ధిల్లు...వర్ధిల్లు....  

28, ఆగస్టు 2013, బుధవారం

శ్రవణానందకరం........

"పుండాకోరెదవా.... .నీకు దీంట్లో దూరవలసిన పనేట్రా...."

గట్టిగా తిట్లు వినబడుతున్నాయి.......ఆడగొంతు....జనం మాత్రం బాగా మూగి ఉన్నారు. ముందు అంత పట్టించుకోలేదు...కానీ ఆ తిట్ల ప్రవాహంలో నుండి రెండు మూడు నాకు శ్రవణానందకరంగా వినబడ్డాయ్.

" ఒరేయ్ ...మా ఆయన బ్రతికున్నప్పుడు  మీ బాబు చేసిన ఎదవ పనులన్నీ పూసగుచ్చినట్టు చెప్పేవోడ్రా....అసలు మీ తాత ఇంజన్ లో బొగ్గేసే  ఉద్యోగం చేసే నాటినుండీ మీ బాబు బొగ్గు దొంగతనాలకు మరిగేడంట...."

మా రైల్వే మాటలు వినబడేసరికి నా క్యూరియాసిటీ మరీ పెరిగి పోయింది.మా అపార్ట్మెంట్ కు వెనకంతా ఎక్కువగా స్లమ్మ్  లాగే ఉంటుంది. అలా అని పూర్తిగా స్లమ్మ్  అని చెప్పలేం గానీ బాగా దిగువ మద్య తరగతి వారు ఉండే ఏరియా అని చెప్పవచ్చు.అక్కడొక మినీ బజార్ కూడా ఉండడంతో చిన్న చిన్న అవసరాల కోసం అటు వెళ్తూ ఉంటాం. అక్కడొక నెట్ సెంటర్ కూడా ఉండడంతో ప్రింటింగ్ పనుల కోసం ఆ రోడ్ లో చాలా సార్లు వెళ్తూ ఉంటాను.యీ రోజు కూడా అదే పని  మీద బయలు దేరే సరికి యీ సీను కనబడింది.జనాల మద్య ఉండే ఖాళీలలో నుండి చూసాను. ఒక పెద్దావిడ ...ఒక 35 సంవత్సరాల యువకుడిని పట్టుకుని ఝాడించేస్తోంది. కారణమేమిటని అక్కడే ఉన్న తెలిసిన ముఖాన్ని అడిగాను.

"ఇక్కడొక వీధి కుళాయి ఉంది కదా సార్...యీ మూడు వీధుల నుండీ ఆడాళ్ళంతా యీ కుళాయి దగ్గరకే రావాలి. కార్పొరేషన్ వాళ్ళు యీ మూడు వీధులలో ఆ చివర ఉండే వాళ్ళకు అందు బాటులో ఉండేందుకు వేరే కుళాయి వేయదానికి ప్రపోజల్ పెట్టి దీనినుండే డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటున్నారు.  కానీ యీ చివర ఉండే వాళ్ళనేదేమిటంతే ఇప్పటికే దీంట్లో పెద్దగా ప్రెజర్ లేదు....కాబట్టి మైన్ లైన్ నుండి డైరక్ట్ గా వేరే డిస్ట్రిబ్యూషన్ తీసుకోమనీ...."

"మరి ఆ పెద్దావిద అతగాడి మీద ఎందుకు విరుచుకు పడుతోంది?"

" ఆడు మాజీ కార్పొరేటర్ పైడితల్లి కొడుకు అప్పల్నాయుడు సారూ.....యీడి బాబు రైల్వే యార్డ్ లో దొంగ తనాలు చేసి చేసి ...బాగానే గడించాడు.ఎంత తాగినా కూడా బాగానే మిగిల్చాడు. అదృష్టం కలిసొచ్చి ఒక టెర్మ్ కార్పొరేటరై పొయ్యాడు. ఆఖరుకి మాత్రం లారీ కింద పడి కుక్క చావు చచ్చాడనుకోండి. యీడు అంటే యీ అప్పల్నాయుడు గాడు బాబు కంటే ఎదవ.నలుగురు చంచా గాళ్ళను వెంటేసుకొని పెద్ద లీడర్ లా ఫీలౌతాడు.మా యీదిలోనే యీ వినాయకుడి గుడి ఉంది...ఎప్పట్నుండో దీన్ని మైంటైన్  చేస్తున్న కమిటీ ఉంది....ఇంకా ఎంతో మంది చదువుకున్నోళ్ళు ..పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ గా ఉంటారు కాబట్టి బయట ఎప్పుడో గాని కనబడరు. దాంతో యీ యెదవే పెద్ద లీడర్ననుకుంటాడు."

చిన్న విషయం అదిగినందుకు ఎంత కధ చెప్పడ్రా బాబూ అనుకున్నాను. కానీ ఆ పెద్దావిడ మా రైల్వే కి సంబందించినదవటంతో కాస్సేపు ఆవిడ మాట్లాడేది విందామనుకున్నాను.

" ఒరేయ్....మా తగువులు మేము తీర్చుకోగలం....సగం రోజులు జైల్లో గడిపే నీలాంటి దగుల్బాజీ యెదవల పెద్దరికం మాకక్కర లేదు. అవసరమైతే ఇక్కడ ..అక్కడ కూడా నీళ్ళు వచ్చే విధంగా చేయగలిగిన ఇంజనీర్ బాబులు ఉంటారు. వాళ్ళని బ్రతిమాలుకుంటే పనవుద్ది గాని ఇందులో నీవు చేసేదేముందిరా....దీంట్లో తల దూర్చేసి పెద్ద లీడర్ వైపోదామనుకుంటున్నావేమో......అసలు నీ మీదున్న కేసులన్నిటికీ శిక్ష  పడితే నీవు ఇంకో జనమెత్తినా ఆ శిక్ష  పూర్తవదు. 

ఆయన ఇక్కడ రైల్వే  యూనియన్ సెక్రటరీ కింద ఉన్నప్పుడు  చాలా సార్లు అనే వారు...నీ బాబు లాంటి దొంగ నాయాళ్ళు లేక పోతే రైలు పట్టాలు బంగారపువి వేయొచ్చని. ఆయన నిజాయితీగా ఉద్యోగం చేసి....ఆ మాయదారి జబ్బుతో పొయ్యారు గానీ లేక పోతే నీ బతుకంతా ఇంకా బాగా బయటపెట్టేద్దుం. నా కొడుకులిద్దరూ కష్టపడి చదువుకొని నాన్న లాగే దూరంగా ఐనా నిజాయితీ గా బ్రతుకుతున్నారు. మా ఖర్మ కాలి నీలాంటి పనీ పాటా లేని పోరంబోకు ఎదవలు లీడర్ల లా వెలిగిపోతున్నారు.........అవునొరే మొన్నేదో పార్క్ స్థలాన్ని  కబ్జా చేయబోతే నిన్ను తీసుకెళ్ళి పోలీసులు స్టేషన్ లో పెడితే మన మెయిన్  రోడ్ వెడల్పు చేయాలని  పోలీస్ స్టేషన్ లొ నిరాహార దీక్ష చేసావంట...జనం ముఖమ్మీద ఉమ్మేస్తారని సిగ్గన్నా లేదురా....పైగా బెయిలిప్పిస్తే రాబోయే ఎలక్షన్ లో మీ వెనుకే ఉంటానని మన ఎమ్మెల్యే కి కూడా కబురు పంపావంట...ఒరెయ్ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను మన ఏరియా లో దొంగలెక్కువైపోతే నీలాంటెదవ  గెలుస్తాడు..నా నమ్మకం ఏటంటే ఇంకా నా లాంటి వాళ్ళు ..పైనున్న మా ఆయన లాంటి వాళ్ళే యెక్కువున్నారని "

ఆ ఝురి ఇంకా సాగుతూనే ఉంది. ఒక నిజాయితీ పరుడి జీవితాన్ని పంచుకొన్న ఆ పెద్దావిడ  నేరస్థులే  నాయకత్వ స్థానాలలోకి  ప్రాకటం జీర్ణించుకో  లేక తన ఆక్రోశాన్ని అలా వెలిబుస్తూనే ఉంది. నేను మాత్రం మాయాబజార్ లో ఘటోత్కచుడిలా

"ఆహా...ఎంత శ్రవణానందకరముగా...ఉన్నాయి" అనుకుంటూ ఒక రకమైన తాదాత్మ్యం లోకి వెళ్ళి పొయ్యాను.  అంతే కాదు రాష్ట్రమంతా వినబడేటంత సౌండ్ సిష్టం సంపాదించి మొత్తం అంతా కాక పోయినా  కనీసం సీమాంధ్ర ప్రజలకన్నా వినిపించాలనే కోరిక కలుగుతోంది.....ఎందుచేతో.....  

1, ఆగస్టు 2013, గురువారం

సత్తెమ్మ

సత్తెమ్మ నల్లగా ఉంటుంది. నగలుండవు. సైట్ లోకి వచ్చేటప్పటికి నెత్తిమీద తట్ట తోనో ...నీళ్ళు మోస్తున్న బిందెతోనో దర్శనమిస్తుంది. వాళ్ళాయన వెదుళ్ళు కొట్టుకొచ్చి  బుట్టలు లాంటివి అల్లుతూ ఉంటాడు.నాలుగు సంవత్సరాలుగా ఎప్పుడూ పని మానడం చూడ లేదు. మా ప్రాజెక్ట్ ప్రారంభ దస లో ఉండగా ఒక సారి కొత్తగా కట్టిన బ్రిడ్జ్ దగ్గరకి వెళ్ళేసరికి అక్కడ కాంక్రీట్ తడపవలసిన మనిషి కనబదక పొయ్యేసరికి అక్కడుండే సూపర్వైజర్ ని అడిగాను. 
 
" అయ్యో ఎంత మాట సార్...ఇప్పటివరకూ ఇక్కడే ఉండాలి " అతగాడి మాట పూర్తవాకుండానే తను గబా గబా వూరిలోనుండి వస్తోంది. అదే మొదటి సారి సత్తెమ్మను చూడడం.

"ఎక్కడికి పొయ్యావ్...సార్ నన్ను తిడుతున్నారు..." ఇంకా కేకలెయ్య బోతున్న సూపర్వైజర్ ను సున్నితంగా వారించాను. నెమ్మదిగా తనకర్ధమయ్యే రీతిలో కాంక్రీట్ కు క్యూరింగ్  ఎంత అవసరమో చెప్పాను.

 "ఎక్కడికీ ఎల్లనేదు బాబూ...పొద్దున్నొక సారి తడిపేసి ..అబ్బాయికి ఫీజుకి డబ్బులు తక్కువైతే సర్దడానికి వెళ్ళాను"

అప్పుడే తెలిసింది తనది ఒక షెడ్యూల్ తెగ అని...వాళ్ళబ్బాయి ఇంజర్నీరింగ్ డిప్లొమా చదువుతున్నాడని.

ఆ తరువాత కొద్ది రోజులకే వాళ్ళమ్మాయి గౌరిని కూడా కాంక్రీట్ మోస్తూ చూసాను. అప్పటికే ఆ అమ్మాయి ఇంటర్ పూర్తి చేసింది. సెలవులు కాబట్టి పని లోకి వచ్చింది.మామిడి తోటలు తప్ప మరేమీ పంటలు లేని ప్రాంతం వలననుకుంటా పని చేయడానికి దొరికిన చాన్స్ ను అక్కడి పిల్లలు వదులుకునే వారు కాదు. 

నాకు తెలిసున్నంత వరకూ తను మరలా ఆ పని అప్పజెప్పినప్పుడు  బద్దకించ లేదు. ఆ తరువాత మా రీచ్ లో ఒక పెద్ద బ్రిడ్జ్ వర్క్  దగ్గర పని చేయడం మొదలు పెట్టింది. వాళ్ళాయన అక్కడే వాచ్మెన్  గా చేరాడు. వర్క్ జరిగేటప్పుడు నీటిని సగం బ్రిడ్జ్ లోకి మళ్ళిస్తాం కాబట్టి రెండో పక్క వీళ్ళు  గుడిసె వేసుకుని ఉండేవారు. అప్పటికే మా అమ్మాయి ఇంజినీరింగ్  లో ఉంది.తను సెలవులకి వస్తుందంటే చాలు ఏదో ఒకటి ఇవ్వాలని తాపత్రయ పడుతూనే ఉండేది. దాంట్లో తేగలు...సపోటాలు....చాలా సార్లు మామిడి కాయలు ఉండేవి.

ప్రాజెక్ట్ ప్రారంభమయ్యి 2 సంవత్సరాలు గడిచిన తరువాత అనుకుంటా ఒక రోజు సడన్ గా
"బాబూ అమ్మాయికి పెళ్ళి చేసేద్దామనుకుంటున్నాం " అని చెప్పింది.

అప్పటికి వాళ్ళమ్మాయి గౌరి డిగ్రీ 1వ సంవత్సరంలో ఉంది.
 
"నీకు మతి గానీ పోయిందా శుభ్రంగా రెండేళ్ళాగితే దాని ఉద్యోగం అది చేసుకుంటూ నిన్ను కూడా చక్కగా చూసుకుంటుంది అలాంటి వెధవాలోచనలు మానెయ్..."చనువుగా కసిరేసాను.

పక్కనే వాళ్ళాయన బుట్టలల్లుతున్నాడు.స్పీడ్ గా కదులుతున్న అతడి వేళ్ళు చూస్తూ కూర్చున్నాను. బుట్ట తయరవ్వగానే ఒక సారి చుట్టూ తిప్పి చూసి తృప్తిగా తల పంకించాడు.డబ్బు తప్ప వేరే ఏదీ సంతృప్తి ఇవ్వదు అనేది కేవలం అపోహ మాత్రమే అనేదానికి వీళ్ళంతా ఉదాహరణులుగా కనిపిస్తారు. ఉదయాన్నే సైట్ కు వెళ్ళడం కోసం డ్రసప్ అయ్యి మెట్లు దిగి సెల్లార్ లోకి వచ్చేటప్పుడు తనే ఉతికి ఇస్త్రీ చేసిన బట్టల వంక ఒకలాంటి ఆనందంతో చూస్తాడు ..అక్కడే ఇస్త్రీ చేసుకుంటున్న మా అప్పారావు. టూ వీలర్ రోడ్ మీదకు వచ్చే సరికి ఎదురుగానే ఉన్న హైర్ కటింగ్  సెలూన్ లో పని హేసే కుర్రడు ఒక సారి నా జుట్టు వైపు చూసి తృప్తి పడతాడు....తను వేసిన కటింగ్ బాగానే ఉందనిపించి. కొత్త ట్రాక్ కోసం సర్వే చేస్తున్నప్పుడు సిగ్నల్ పడక ఆగిన గూడ్స్ ట్రైన్ వెనకాల ఉన్న గార్డ్ పెట్టెలో ఉన్న గార్డ్ ని పలకరించినప్పుడు "మనిద్దరం ఒకే కుటుంబంలో సభ్యులమన్నట్లు" గా అతడి పలకరింపు ...ఇవన్నీ అనందాన్నిచే విషయాలే.

ఆరు నెలల క్రితం సత్తెమ్మ మరలా బాధగా మా ఆఫీస్ కు వచ్చింది.

" అమ్మాయి పెళ్ళికి మహూర్తం పెట్టేసాం సార్"

తిట్టాను.

"మా కులపోళ్ళతో పడలేం సార్....అబ్బాయి మా మేనల్లుడే...బండి కొనుక్కోడానికి 60000 రూపాయలు   కూడా ఇచ్చేసాం"

ఆశ్చర్య  పోవడం నా వంతయ్యింది. పగలంతా ఎండలో వానలో కష్టపడే తను....కాబోయే అల్లుడి కోసం 60000....

కానీ పూర్తి అనార్గనైజ్డ్ రంగం లో ఉండే వీళ్ళు ముసలి తనం లో వచ్చే ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకోరా .....

పెల్ళికి వెళ్ళి తనకు పనికి వస్తాయన్నట్లుగా కొన్ని నోట్లు కవర్లో పెట్టి గిఫ్ట్ గా ఇచ్చాను.

నాలుగు రోజుల తరువాత ఒక సంచీ తెచ్చి సైట్ ఆఫీస్ లో పెట్టి వెళ్ళేటప్పుడు దీనిని మరిచి పోకండి బాబూ"

ఇంటికి వచ్చిన తరువాత సంచిలోనివన్నీ చూసి మా శ్రీమతి నోరు వెళ్ళ బెట్టింది. 9 అంగుళాల వ్యాసంతో ఉన్న పంచదార మిఠాయి ఉండ...అరిసెల దొంతర...ఇంకా ఏవేవో...

"నీకేమన్నా...మతి పోయిందా సత్తెమ్మా...." అంటూ ఆ తరువాత రోజు కోప్పడ్డాను.

" మీరందరి లాంటి  వోరు కాదు సారూ.....మా లాంటోళ్ళతో మాట్లాడతారు...ఆ ట్రాక్టర్ డ్రైవర్ తో మాట్లాడతారు....అల్ల దూళ్ళు కాసుకునే కుర్రాడితో మాట్లాడతారు.."

అవును ఐతే ...ఇవన్నీ నాకు ఆనందం కలిగించే విషయాలే....దీంట్లో నా గొప్పదనం ఏముందో నాకర్ధం కాలేదు. అదే మాట సత్తెమ్మతో కూడా చెప్పాను.

"బంగారం...చీరలు....మీలో ఉండాల్సిన  మృదుత్వాన్ని...మానవత్వాన్ని చంపేస్తున్నయ్" అని నా శ్రీమతికి చాలా సార్లు చెబుతాను కానీ నాది సరైన ప్రయత్నం కాదని అనిపిస్తూనే ఉంటుంది. కేవలం చీరలు..బంగారాల గురించి మాత్రమే కొనసాగించే బాంధవ్యాలు వీళ్ళకే మాత్రం తృప్తి ఇస్తుందో నాకైతే అర్ధం కాదు. వీళ్ళలో చాలా మంది పదివేల రూపాయల టాక్స్   నుండి రక్షించబడినందుకు 1116 రూపాయలు దేవుడికి సమర్పించుకుంటారు. ఉత్తుత్తినే సంవత్సరాల తరబడి మాట్లాడుకోరు. ఒకళ్ళనొకళ్ళు అసహ్యించు కొంటూ కూడా ప్రతి దినం మాట్లాడుకుంటారు. ఇటువంటి వాతావరణంలో పెరుగుతున్న పిల్లల మానసిక ఆరోగ్యం సవ్యంగా ఎలా ఉండగలదు?

కాంక్రీట్ పనులలవుతున్నప్పుడు మా దగ్గర పని చేసే ఆడవాళ్ళు కూడా కోడిపుంజుల్లా దెబ్బలాడుకుంటారు.కానీ అది అక్కడితో చెల్లు. మరునాడంతా మామూలే. ఎందుకంటే నాకనిపించే కారణం ఒక్కటే ...వాళ్ళు ఆశ పడడానికి...పొగొట్టు కొనడానికి వాళ్ళెవరి దగ్గరా ఏమీ ఉండదు.

అలాగే ఇంకొక సారి కూడా మాతో పాటు ప్రయాణం చేస్తున్న స్కూల్ టీచర్ ఒకావిడ ట్రైన్లోనే మామిడికాయలమ్ముతున్న అమ్మాయిని తొమ్మిదో తరగతిలో మార్కులెన్నని అడగడం చూసి ఆశ్చర్య  పొయ్యాను.