22, ఫిబ్రవరి 2012, బుధవారం

నా కొత్త ఆహ్వాన ..సన్మాన పద్దతులు(సీక్రెట్)

...నేను యెప్పుడైనా    ఇవెంట్ మేనేజర్  గా ఉద్యోగం చేయాల్సి వస్తే కొన్ని కొన్ని ఇన్నొవేటివ్   పద్దతులతో జనాలను యెలా ఆశ్చర్య చకితులను చేయాలా అని అలోచిస్తుండేవాడిని. అప్పట్లో  నాకున్న బ్రిలియేంట్ అయిడియాలలో ఒకటి యేమిటంటే యేదైనా పెళ్ళిలో అకాశం నుండి వధూవరులను దేవతలు దీవిస్తున్నట్లుగా  పైనుండి పూలవాన కురిపించే యేర్పాటు చేస్తే అమోఘంగా ఉంటుందేమోనని....ఆసలు ఇలాంటి  గొప్ప..గొప్ప అయిడియాలు నాకే యెందుకు వస్తాయోనని మురిసి పోవడం కూడా జరుగుతుండేది. కానీ అంతటి భారీ వివాహ మహోత్సవాన్ని నిర్వహించే అదృష్టం  నాకు ఇంకా కలగ లేదు కాబట్టి నా కలల్లోని యీ  మహోన్నత ఘట్టాన్ని ప్రజలు వీక్షించే రోజు  ఇంకెప్పుడా అని అప్పుడప్పుడు  కొద్దిగా చింతించడం కూడా యెక్కువైన యీ తరుణంలో ఇంత త్వరగా నా యీ కోరిక తీరినందుకు నాకు చాలా సంతోషం కలిగింది. యీ మద్యనే కొత్తగా  మా జిల్లా నుండి మంత్రివర్యులైన ఒక రాజకీయ నాయకునికి ఘనాతి ఘనమైన ఆహ్వానం పలకటానికి హెలికాప్టర్ నుండి  పూల వాన కురిపించారని తెలిసి ఆ మహత్తర దృశ్యాన్ని కనులారా చూచి తరించలేక పోయినందుకు కొద్దిగా బాధ పడ్డాను కూడాను . నా ఇన్నొవేటివ్  అయిడియాను నాకంటే ముందుగానే ప్రపంచానికి చూపించినందుకు ఒకింత అసూయ కలిగినా నాలాంటి బ్రిలియంట్ లకు ఇది మంచి సీజన్ లా కనబడుతుంది. అకాశాన్నుండి  పువ్వులు కురిపించేకంటే మంచి ఇన్నొవేటివ్ ఐడియా మనసులోకి తొంగి చూస్తోంది. ఒకసారి షార్ లో  ఉన్న నా ఫ్రెండ్ కి ఫోన్ చేయ్యాలి. అయ్యయ్యో నా ఐడియా ఇలా బయట పడిపోతుందేమిటి ? నేనసలే రాజకీయ పామరుణ్ణి. పెద్దగా సామాజిక శాస్త్రాలు    చదువుకున్న వాడిని కూడా కాదు. అందుకే ఆ మంత్రివర్యులకు యెందుకింత ఘనమైన ఆహ్వానాన్ని పలికెరో కనుక్కుందామని ఆ ఆహ్వాన కార్యక్రమానికి వెళ్ళి వచ్చిన కొంత మంది ఆఫీస్ సహచరులని కూడా అడిగాను కానీ నాకు సరియైన సమాధానం మాత్రం దొరక లేదు. నేను ముందే విన్న వించు కొన్నట్లుగా నాకు కొన్ని విషయాల పరిజ్ఞానం మరీ సున్నా. ఆయన యెదైనా రైతు సమస్యల మీద కానీ మరేదైనా సమస్యల మీద కానీ ఉద్యమాలలో పాల్గొన లేదని మాత్రం వాళ్ళు చెప్పుకుంటుండగా విన్నాను. యెన్నెన్నో ఉద్యమాలలో పాల్గొని కేవలం ప్రజా స్రేయస్సు కోసమే మంత్రి పదవి చేపట్టిన ధన్య జీవులెవ్వరికీ దక్కని ఆహ్వాన మర్యాదలు  వీళ్ళకు యెందుకు దక్కుతున్నాయన్న నా సందేహాన్ని నా స్నేహ వర్గంలో కొంత విజ్ఞుడని పేరున్న వాడిని అడిగాను.
" ఓరి  పిచ్చి మొహమా...వీళ్ళూ ప్రజా నాయకులే ..వారూ ప్రజా నాయకులే... కానీ యే ప్రజల నాయకులన్న విషయంలోనే అసలు విషయ ముంది." 
నాకు యే మాత్రం బోధపడ లేదు.
" మరి జనం వోట్లు వేసి గెలిపించారు కదరా..." నా సందేహాన్ని వ్యక్త పరిచాను.
" వోట్లు వేయక చస్తారా... యెవరో ఒకరికి వేయడమొక్కటే వాళ్ళకు తెలిసింది...సమాజం లో యే సిద్దాంతానికీ  విలువ లేదు. అసలు సిద్దాంత  మంటే యేమిటో  జనాలకు తెలియదు. పై వర్గాలకు కావసినది కూడా ఇదే..కులానికి సామాజిక వర్గం అని ముద్దు పేరు పెట్టారు. సిద్దాంత రాజకీయాలు పూర్తిగా అంతరించి పొయ్యాక ఇక రాజకీయాల్లో కులాల సమీకరణాలే  మిగులుతాయి. కాబట్టి ప్రతి నియోజక వర్గానికి ఒక్కొక్క ఒక్కొక్క సమీకరణం ఉంటుంది. మీడియా వారు కూడా కాండిడేట్స్ యే యే సామాజిక వర్గానికి చెందినవారో....ఆ వర్గం యొక్క వోట్స్ ఆ నియోజక వర్గంలో యెన్ని ఉన్నాయో చక్కగా అనాలిసిస్  లు రాస్తారు. ఒరేయ్ నీకివన్నీ అర్ధం కావు కానీ నన్ను వదిలి పెట్టు" అని వాడు వెళ్ళిపో బొయ్యాడు.
నేనంతగా ఓడిపొయ్యే రకం కాదు.
" మరైతే నేను రోదసీనుండి  పువ్వులు జల్లే కార్యక్రమాన్ని నేను ఒక వేళ అక్టోబర్ 2 న మన సెంటర్ లో ఉన్న గాంధీ విగ్రహంతో ప్రారంబిస్తాను.." నాలో దాచుకొన్న ఇన్నొవేటివ్  ఐడియా ను బయటకు కక్కానన్న బాధ మొదలవకుండానే వాడు నా మొహంలోకి విచిత్రంగా చూశాడు.
" ఒరేయ్...ఆయన యే బిజినెస్ మేన్ కు గాని....కాంట్రాక్టర్లకు గానీ యే హెల్ప్ కూడా చేయలేదు... చేయలేడు .మరి ఫండ్స్ యెక్కడ నుండి తెస్తావ్రా......ఇంకొక విషయం  కూడా చెబుతున్నాను ఆయన సామాజిక వర్గం కూడా పెద్ద సంఖ్య లో లేరు......అంతే కాదు మరే జాతీయ నాయకుడికీ నీవేమీ చేయలేవు. "
వాడింత చెప్పిన తరువాత కూడా నేను నా లోని కళ..వ్యాపారాన్ని...( నాలో ఉన్నదేమిటో నాకే తెలియదనుకొండి......) ఇంకా యెందుకు వేస్ట్ చేసుకుంటాను....మరలా ఎలక్షన్స్ ఎలానూ వస్తాయ్....అప్పుడైనా నాలోని కళా పురుషుడు బయటకు వచ్చి తీరుతాడు. యీ లోపులో మీ బుర్రలకు కూడా  పదును పెట్టండి.....యేదైనా సీజన్ లో నాలుగు రూపాయలు వెనుక వేసుకోవాలి.....
  

13, ఫిబ్రవరి 2012, సోమవారం

అభ్యుదయమా....నీ చిరునామా చెప్పు

BRTS రోడ్  మీద జీప్ స్పీడ్ గా వెళ్తోంది. ముందు కూర్చున్న నాకు చాలా దూరం వరకూ రోడ్ కనబడుతోంది. విశాఖపట్నం  లో కొత్తగా వేసిన  యీ రోడ్ ట్రాఫిక్  రూల్స్ గురించి చాలా మందికి ఒక పట్టాన అర్ధం కాదు. మొత్తానికి  ట్రాఫిక్  సమస్యలు  కొంతవరకూ తీరిన ఆనందంలోనే జనం ఉన్నారు. ఏవేవో   ఆలోచనలకు బ్రేక్ వేస్తూ జీప్ షడన్ గా స్లో అయ్యింది. కొంచెం  ముందు మూగి ఉన్న జనం బట్టి అక్కడ ఏదో  సంఘటన జరిగిందనేది అర్ధం అయ్యింది. కొంచెం  ముందుకు  వెళ్ళాం. రోడ్ కు అడ్డంగా పడి ఉన్న శవం. మధ్య లేన్ లో నుండి లెఫ్ట్ లేన్ లోకొస్తుంటే వెనుకగా వస్తున్న సిటీ బస్ ఢీకొని అక్కడికక్కడే  చనిపొయ్యాడు  ఒక యువకుడు. విచిత్రం  యేమిటంటే యెవరిదీ రాంగ్ రూట్  కాదు. మరి  తప్పెలా జరిగింది? వింటే కొంత విచిత్రంగానే ఉంటుంది. ఆ యువకుడు రోడ్ క్రాస్ చేయడం ఆ బస్ డ్రైవర్  కనబడకుండా ఒక రాజకీయ నాయకుడికి స్వాగతం పలకడానికి వెలిసిన ఒక చోటా రాజకీయ నాయకుదు యేర్పాటు  చేసుకున్న ఫ్లెక్సీ  అడ్డం వచ్చింది. డ్రైవర్ జీప్ స్టార్ట్  చేసాడు. వద్దంటున్నా వినకుండా శవం పక్కగా
తీసుకుని వెళ్ళాడు. వయసు 20-25 సంవత్సరల  మద్య  ఉండొచ్చు. నూరేళ్ళూ నిండి పొయ్యాయి. మామూలు మరణం కాదు. తల పగిలి మెదడు రోడ్ మీద పడి ఉంది. ఛాలా సేపటి వరకూ మామూలు మనిషిని కాలేక పొయ్యాను. యెవరి స్వార్దం ఆ కుర్రాడిని చంపేసిందో అర్ధం కావడం లేదు. ఆ  రాజకీయ నాయకుడి నగరాగమనం యీ కుర్రాడి మరణానికి దారితీసిన ఈక్వేషన్స్ గురించి ఆలోచనలు ముసురుకున్నాయ్. ఒక  సారి నా చిన్న  నాటి రోజులు గుర్తుకు తెచ్చుకున్నాను. నాకు  ఊహ  వచ్చీ రాకుండా ఉన్నప్పుడు అంటే  1971 లో లోక్ సభ ఎలక్షన్స్ జరిగాయి. నాకేమీ అంత గుర్తు లేదు కానీ మేమప్పుడు రాజమండ్రి  సమీపంలోని ఒక గ్రామమైన వీరవరం లో ఉండే వాళ్ళం. రాజకీయ  ప్రభంజనాల గురించి యే మాత్రం తెలియని వయసు. వూరిలోని భూస్వాములూ….దళితులూ కూడా ఇందిరా గాంధీ పక్షాన ఉండడం నాకు  బాగా గుర్తుంది. యెందుకంటే నా క్లాస్ లో వీరికి సంబందించిన ఇద్దరూ ఉండేవారు. మరి వీరికి ప్రతి పక్షంగా  కొంత మంది దేవాంగుల పిల్లలు ఉందే వారు. వాళ్ళ ఇళ్ళ  మీద ఎర్ర జండాలు ఎగురుతూ ఉండేవి. వాళ్ళ నాన్నలు చేనేత పని చేస్తుండే వారు. నేనెక్కువగా వాళ్ళతోనే ఉండే  వాడిని.  ఆ  రోజుల్లో గాలిపటాలికి  వాళ్ళే ఉచితంగా దారపు కండెలు ఇస్తుండేవారు. నాకు గుర్తున్న మొదటి  రాజకీయ సభ ఆ ఎలక్షన్లో కామ్రేడ్ చిట్టూరి ప్రభాకర చౌదరి   గారు మాట్లాడిందే .  తన కాంగ్రెస్ ప్రత్యర్ధి అయిన కపిళేశ్వరపురం   జమీందారీ వంశస్తుడైన   పట్టాభి రామారావు గారి మీద నిప్పులు కురిపిస్తూంటే చేనేత కార్మికులు మాటి మాటికి చప్పట్లు కొట్టడమొక్కటే నాకు గుర్తుంది. ఆ  తరువాత మరలా తాడికొండ స్కూల్ లో మా టీచర్స్ అలహాబాద్   హై కోర్ట్ తీర్పు గురించి  మాట్లాడు కొంటుంటే ఏదో ఒక అపూర్వ సంఘటన జరిగిందని అర్ధం అయ్యింది. ఆ తరువాత కొద్దికాలానికే ఎమెర్జన్సీ డిక్లేర్  అవడం …దాని గురించి చాలా గొప్పగా చెప్పుకోడం వింటుండే వాడిని. భారత దేశం అంతా ఒక విన్నూత్నమైన   క్రమ శిక్షన  వచ్చేస్తోందని మాకు
 మీటింగ్స్  పెట్టి మరీ చెబుతుండేవారు. నాకు అప్పటికి అంతగా రాజకీయ పరిజ్ఞానం లేదు కానీ తాడికొండ స్కూల్ లో మాకు ఇంగ్లీష్ సబ్జక్ట్ కు విల్సన్ రావు గారనే మేస్టారు ఉండే వారు. టెంత్ క్లాస్ లో మాకు "ది  చేంజింగ్ వరల్డ్ " అనే పాఠం ఉండేది. అది బహుశా నాలుగు పేజీల లెసన్ అన్నట్లు గుర్తు. కానీ ఆ పాఠాన్ని ఆయన పది రోజుల పైనే చెప్పినట్లు గుర్తు. ఎక్కడెక్కడివో  ఉదాహరణలు తీసుకుంటూ అసలు ప్రపంచం ఎందుకు మారుతుందో ఆయన చెప్పిన తీరు మాపై చూపిన ప్రభావాన్ని  గురించి సింపుల్ గా చెప్పడం కష్టం.( ఆయన గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక్క విషయం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోడం చాలా అవసరం. ఆయన అదే టెక్స్ట్  బుక్  లో ఉన్న రవీంద్రుడి " ది హోం కమింగ్ " పాఠాన్ని చెబుతుంటే ఇంటికి దూరంగా ఉన్న మేమంతా కంట తడి పెట్టామనడంలో  అతిశయోక్తి యేమీ లేదు. ) సరే ఇంతకూ అసలు విషయం యేమిటంటే మూడు సంవత్సరాలు జైల్ లో ఉన్నట్టుగా  ఉన్న నాకు అవకాశం దొరికినప్పుడల్లా  సినిమాలు  చూడ్డం అలవాటు అయ్యింది. సినిమాకు ముందు తప్పనిసరిగా న్యుఎస్ రీల్ వేసే వారు. అందులో అప్పటి ప్రధాని ఐన స్రీమతి గాంధీని ,ఆమె కనిష్ట పుత్రుడైన సంజయ్ గాంధీని ఆకాసానికెత్తే తీరు నాకు ఎందుకో నచ్చేది కాదు. కారణం ఇదమిద్దంగా యీనాటికి కూడా చెప్ప లేను. అందుకే జనతా పార్టీ అధికారంలోకి రావడం ఎందుకో చాలా ఆనందాన్ని కలిగించింది. ఆ తరువాత ఎమర్జన్సీ లో జరిగిన వాటి గురించి పేపర్ లో చదివి ఆవేశం తెచ్చు కొనే వాడిని. ఆ వయసుకి ..నేను పెరిగిన పరిస్థితులకీ అంతకు మించిన రాజకీయ అవగాహన ఉండే అవకాశం లేదు. ఆ తరువాత జరిగిన సంఘటనలు..... మార్పులు చూస్తుంటే యేమీ అర్ధం కాక తల పగిలి పోతూ ఉండేది. ఇంతకు ముందు ఒక పోస్ట్ లో రాసి  నట్లుగా "జాబ్ అయినా చూపండి ..లేదా జైల్ లో అయినా పెట్టండి"  అనే స్లోగన్ నన్ను ఒక వూరేగింపులో పాల్గొనడానికి పురికొల్పింది. అంతకు ముందు సాహిత్యంలో భాగంగా "అమ్మ" నవల చదవడం జరిగింది కానీ యీ వూరేగింపు నన్ను ఒక సైద్దాంతిక రాజకీయాల పరిచయం కలిగించింది. విస్తృతంగా పాల్గొన నప్పటికీ ఎంతో కొంత చతన్యం  ఉన్న యువకుడిగా మాత్రం నన్ను నేను మలచు కొనడానికి ప్రయత్నం మొదలయ్యింది. 1977-80 జనతా పార్టీ  కాలం పోటెత్తిన రాజకీయ చైతన్యంతో ప్రారంభం అయ్యి కుళ్ళు కంపు కొట్టేతంటగా  దిగజారిన విలువలతో అంతం అయ్యింది. మొట్టమొదటి సైద్దాంతిక సందేహం నాకు 1980 పార్లమెంట్ ఎలక్షన్స్ లోనే వచ్చింది. అప్పట్లో సీ.పీ.ఐ. పార్టీ చరణ్ సింగ్ నేతృత్వంలోని గ్రూప్ ను సమర్ధిస్తే ...సీ.పీ.యం  పార్టీ మొరార్జీ నేతృత్వం లోని  జనతా పార్టీ తో కలసి పోటీ చేసింది. నిజంగానే నేనొక రాజకీయ పామరుడనే అప్పటికి. నాకు వచ్చిన సందేహం యేమిటంటే లోక్దళ్ ..జనతా పార్టీలతో ఉన్న భావ  సారూప్యత కన్నా...యీ రెండు కమ్యూనిస్ట్ పార్టీల మధ్య భావ సారూప్యత యెక్కువా కాదా అని.... సైద్దాంతిక నిబద్దత లేని పార్టీ  ల గురించి నేను మాట్లాడడం లేదు. కానె ఎంతో కొంత నిబద్దత ఉందని నమ్మిన కార్యకర్తల..ప్రజల మనసుల్లో కూడా ఒక గందరగోళాన్ని నింపారు. నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. నేనప్పుడు అప్పుడప్పుడు మా కాలేజ్ దగ్గరలో ఉన్న  సీ.పీ.ఐ. ఆఫీస్ కు వెళ్తుండే వాడిని. ఒక సారి అక్కడ  జాతీయ బూర్జువా ..ప్రాంతీయ లేదా పెట్టీ బూర్జువా అన్న పదాల మీద  వివరణ ఇస్తూ అక్కడ ఉన్న నాయకులు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో కాంగ్రెస్ ను జాతీయ బూర్జువా పార్టీగాను..మిగిలిన వారిని పెట్టీ బూర్జువా పార్టీల గానూ గుర్తించాలని ముగించారు. ఆ తరువాత కొద్దికాలానికే అక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయి. తణుకు  మున్సిపాలిటీ కి  అప్పటి కాంగ్రెస్ యెం. పీ. అయిన చిట్టూరి సుబ్బా రావు గారి నేతృత్వం లో ఒక గ్రూప్ ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన శ్రీ  ముళ్ళపూడి హరిస్చంద్ర ప్రసాద్ నాయకత్వం లో ఒక గ్రూప్ పోటీకి దిగాయి. అప్పటికి సీ.పీ.ఐ. పాటీ రాజకీయ అవగాహన మేరకు వారు హరిస్చంద్ర ప్రసాద్ తో కలసి పోటీ  చేయాలి...కానీ అందుకు విరుద్దంగా జరిగింది. కారణమడిగితే యీ టౌన్ కి ఆయన పెద్ద బూర్జువా ...చిట్టూరి సుబ్బా రావు గారు చిన్న బూర్జువా అన్నారు. ఇలాంటి హాస్యాస్పదమైన నిర్ణయాల ఫలితమే యీ రోజు యే సిద్దంతమూ లేని ...అవకాశవాద...దిగజారుడు పార్టీల తోకలుగా కమ్యూనిస్ట్ పార్టీలు మిగిలి పోవలసి వచ్చింది.  కమ్మ్యూనిస్ట్ పార్టీ ల రాజకీయ సిద్దాంతాన్ని ఆ  రోజుల్లో అందరూ 100% సమర్ధించక పోవచ్చు..కానీ నమ్మిన సిద్దంతమంటూ ఒకటి ఉన్న పార్టీలు గా గుర్తించే వారు.  నా యీ సందేహాలు చదివిన పార్టీ నాయకులు..సమర్ధకులు...నాకొక పెద్ద సైద్దంతిక వ్యాసాన్ని పంపవచ్చు. కానీ వారు దృస్తిలో పెట్టుకోవలసింది......ఒక అతి సాధారణ పౌరిడికి అర్ధం అయ్యె రాజకీయ పరిభాషనే ఉపయోగించి చెప్పండి.బిల్గేట్స్ ని బిల్ క్లింటన్ ను భుజాన వేసుకుని తిరిగిన చంద్ర బాబు కాంగ్రెస్ కంటే యే విధంగా వామ పక్షానికి దగ్గరో నాకు అర్ధం కాదు. అంతే కాదు అధికారం కోసం అత్యంత దివాళా కోరు పనులని చేసిన కాంగ్రెస్ తో జత కట్టడానికి యీ వామ పక్షాలు సంకోచించ లేదు. అలా అంటే మత తత్వానికి అడ్డు కట్ట వేయడానికంటారు. కానీ "షాబాను మచ్చ ...బాబ్రీమసీదు కూల్చి వేత పత్ల ఉపేక్షభావం..లాంటివి...ఆ పార్టీని మతతత్వ పార్టీ ల కంటే తక్కువగా యెలా చూడగలరో అర్ధం కాదు. అంతకన్న దారుణమైన విషయమేమిటంటే 1989 అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు వారు వూరూరా గాంధీ,నెహ్రూ విగ్రహాల పక్కనే వారు  ప్రతిస్టించిన విగ్రహాన్ని చూస్తే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అసలు నైజం అర్ధం వుతుంది. తమ పర్టీ నాయకుల విగ్రహాలను ప్రతిస్టిచడం తప్పు కాకపోవచ్చు...కానీ అవి యెవరి పక్కన ప్రతిష్టిస్తున్నామన్నది కూడా ముఖ్యం కాదా......
1950 ల నాటి పత్రికలు  ఒక్క సారి అర్చీవ్స్ కెళ్ళి  తిరగెయ్యండి. ఒక్క చోట కూడా " సామాజిక వర్గం " అన్న పదం కన బదదు. యీ నాదు పంచాయితీ వార్డ్ మెంబెర్ ఎలెక్షన్స్ కు కూడా మెడియా వారు సామాజిక వర్గాల విస్లేషన అందిస్తారు. యీ అలోచన తప్పు అని చెప్పరు సరి కదా...దానికి ఆహార్యాన్ని అంద జేస్తారు. యెవరి ప్రయోజనాలు వారివి. యీ పరిస్థితి చూస్తుంటే మొన్ననే వచ్చిన "రాజన్న" చిత్రంలోని పాట పదే పదే వినాలనిపిస్తొంది. ఆ పాటలో రచయిత "యెగిరిపోవె..యాడికైనా..." అని అర్ధిస్తాదు. కానీ మనం ఇక్కడే ఉందాలి కదా....గదులలో కూర్చుని ....మనకెందుకులే అనుకుంటున్న అభ్యుదయ మేధావి వర్గమంత.....వీధులొకి కదలాల్సిన సమయం వచ్చింది. ళేకుంటే మరేమీ ఇక మిగలదు. మన సిద్దాంత వాదోపవాదాలు వినిపించాలంటే కనీసం మనం బ్రతికి ఉందాలి కదా.......అన్నీ ఒక్క సారి పక్కన పెట్టి ముందు యీ కుళ్ళును కడిగి ఆ తరువాత వచ్చే మంచి వాతావరణంలో తీరిగ్గా వాదించుకొందాం. 

5, జనవరి 2012, గురువారం

పెదనాన్న..కొన్ని జ్ఞాపకాలు

             సగోత్రీయులం  అందరం గోదావరి గట్టుకి వెళ్ళాం పిండ ప్రదానం చేయడానికి. కార్యక్రమం  జరుగుతూ ఉంది. కాకులకోసం చూస్తున్నారు. మా పెదనాన్న గారి జీవితం ముగిసి కొద్ది రోజులే అయ్యింది. ఎందుకో  తెలియదు ఇంతకు ముందు మరీ అంత విచారం ఉండేది కాదు కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆ తరంలో ఒక్కక్కరూ రాలి పోతుంటే వ్యక్తులు శాశ్వతంగా  దూరమైన బాధకు  మించి వేరే బాధ నన్ను చుట్టు ముట్టేస్తుంది. నాకు ఊహ తెలిసిన తొలి రోజుల లోనే ఆయనకు పెరాలసిస్ వచ్చింది. పల్లెటూరు కావడం వలనా….వెనుకబడిన కుటుంబం కావడం వలనా….ఆయనకు సకాలం లో వైద్యం ఐతే అంద లేదు. దాని  బాధ ఆయన జీవితాంతం పడ్డాడు. ఎంతో కష్టపడే  అలవాటున్న ఆయన దానికి దూరం కావడం తో మానసికంగా చాలా కృంగి  పొయ్యాడు.కానీ ఆయనతో పాటు మా పెద్దమ్మ జీవితం మొత్తం జైల్ జీవితం అయిపోయింది.  గత 40 సంవత్సరాలలో ఆవిడ  వేరే యెక్కడికీ రావడం చూడ లేదు. యెవరో పలకరించడంతో ఆలోచనా స్రవంతి కి బ్రేక్ పడింది......

                  మొత్తానికి  కాకులు వచ్చాయి. 40 యేళ్ళ నుండీ వీధి దాటి యెరుగని ఆయన కు పెద్ద గా యే కోర్కెలూ ఉండే అవకాశాలు ఉండవు. గతం అంతా యెదో సినిమా రీల్ లా మెదిలింది. ఒకసారి తాడికొండ ఆశ్రమ పాఠశాలకు వెళ్ళాక ఆయనను చూడడానికి వెళ్ళే టైం దొరికేది కాదు. నాన్న  గారు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు…ఎప్పుడు కలిసినా పెదనాన్న “ఆడు…ఆడు…” అని సైగ చేసి అడుకుతున్నాడురా…అని. ఆయనకు  అంతకు మించి మాటలు వీలయ్యేవి కాదు. నా  మీద అభిమానం ఉండటానికి కారణం కూడా ఆయనకు మగ పిల్లలు లేకపోవడం ఒక కారణం కావచ్చు. నిజం చెప్పాలంటే ఆయన తన తోటి వారినందరినీ ఆప్యాయంగా చూసుకొనేవాడు. నాకైతే నాకు తలపాగా చుట్టి బయటకు తీసుకెళ్ళడం చూచాయగా గుర్తుంది. .........మరలా కర్మకాండ తంతులొకి  ప్రవేశించాం.  గడ్డాలు..మీసాలు తీయడం  ప్రారంభమైంది. కానీసం చావులో ఐనా అంతా కలవడం ….ఆ కర్మకాండలు పూర్తయి  ఆత్మ స్వర్గం చేరిందని నమ్మకం కలిగే వరకూ సగోత్రీయులందరూ ఆ బాధలో కూడా ఉండడం……ఇవన్నీ ఆచార పరంగా వచ్చినా ఎంత ఆలోచనతో పెద్ద వాళ్ళు  ముందు చూపుతో ఇలాంటివి పెట్టారో అనిపిస్తుంది. చాలా సంవత్సరాల తరువాత నావారినందరినీ  చూసాను.  చదువు అయిన  వెంటనే ఉద్యోగం ….దాంట్లో యాంత్రికంగా ఇమిడి పోవడం ..జీవితంలో యేదైనా సాధిస్తున్నామో…కోల్పోతున్నామో…అలోచించుకొనే వ్యవధి కూడా ఉండని జీవితం……పరుగులు….అంతా పరిగెత్తుతున్నప్పుడు మనం కూడా పరిగెడితేనే సాపేక్షంగా మన స్థానం  నిలబడుతుందన్న…ఫీలింగ్……..చాలాకాలం తరువాత  యేదో ఒకటి ఆలోచించే టైం దొరికింది. మరలా  ఒక సారి పెద నాన్న గుర్తుకు వచ్చాడు. ఆయన హాస్పిటల్ లో ఆఖరి రోజులలో ఉన్నాడని కబురు తెలిసింది. హాస్పిటల్ కి వెళ్ళాం. మన  లో లేడని చాలా మంది ముందుగానే చెప్పడం వలన ఆయనను చూస్తే చాలని అనుకుంటూ వెళ్ళాను. రిసెప్షన్ లోనే చెప్పేసేరు ..ఆయన భోజనం మానేసి 15 రోజులయ్యిందని. అలానే పైకి వెళ్ళాను. కూడా ఉన్న నాన్న గారితో మాట్లాడుతున్నాను. మా మాటలు వినబడి ఆయన దిగ్గున లేచి కూర్చోవడం ఆయనకోసం ఉంచబడ్డ మనిషి ని ఎంత ఆశ్చర్యానికి  గురి చేసిందో చూసిన వాళ్ళకే అర్దం అవుతుంది. లేచిన మనిషి ఒక్కసారి  భోరున యేడ్చేశాడు. యేనాడూ ఆయన నోరు విప్ప లేని పరిస్థితి .... మరి చరమాంకంలో దేనికోసం అంతలా విలపించాడో ఈనాటికీ నాకు అర్దం కాలేదు. అలా ఆయనను చూసిన తరువాత మరలా కొంత కాలం తన జీవితాన్ని పొడిగించగలడనిపించింది. నా అలోచననే 2 రోజుల తరువాత మా నాన్న గారు తన ఫోన్ తో ఖాయం కూడా చేసారు. కానీ అంతలోనే యీ ముగింపు.
                        ఆయనేమీ గొప్ప వ్యక్తిగా చూడబడాలని కోరుకోలేదు. పొలం వెళ్ళడం మానివేసినప్పటి నుండీ ఇంటికెదురుగా ఉన్న గానుగ చెట్టు చుట్టూ కట్టిన చప్టాయే ఆయనకు శాశ్వత కాలక్షేప వేదిక అయ్యింది. ఆయనతో  పాటు మిగిలిన ఆ తరంలోని అన్నదమ్ములు(పెదనాన్న..చిన్నాన్నల కుమారులు) కబుర్లు వినడమే ఆయనకుండే ఒకానొక్క కాలక్షేపం. యెప్పుడైనా వస్తుండే మమ్మలని అంత దూరం నుండే చూసేసరికి ఆయన ముఖంలో కనబడే వెలుగుని చూడడం నాకు చాలా ఇష్టం గా ఉండేది. అటువంటి వెలుగులు బహుశా యిక ముందు తరాల  లోని వారు చూడలేకపోవచ్చు.డిజిటల్ కెమేరా కొన్న కొత్తలో ఒక సారి ఆ వూరు వెళ్ళి ఆయనకు చాలా ఫొటోస్ తీయడం జరిగింది. అత్యంత బాధాకరమైన విషయం యేమిటంటే ఆ ఫొటోస్ నేను బేక్ అప్ చేయకముందే ఆ కెమేరాను అరువు తీసుకున్న వాళ్ళు అవసరం లేక పోయినా వాటిని మొత్తం తీసేసారు.
                     ఒక్క విషయం ఖచ్చితంగా అనిపించింది..ఇంకా అనిపిస్తూనే  ఉంటుంది.." నా మనుషులు ..నా వాళ్ళు నాకు కావాలి....అని ఆలోచించే..తరాలకు...నా వస్తువులతో ....నా కాలక్షేపం నాకుందిలే అనుకునే తరాలకు  మధ్య  ఉన్న సంధి యుగంలో ఉన్నామని .............

1, డిసెంబర్ 2011, గురువారం

కుళ్ళుని కడగడం ప్రారంభిద్దామా....

పారిభాషిక పద కోశం లో కొన్ని పదాలకు అర్ధాలు యేమున్నాయో తెలియదు  కానీ వాడుకలో మాత్రం కొన్ని పదాల అర్ధాలు అనూహ్యంగా మారి పోతున్నాయి. కొన్ని పదాల అర్దం యేమిటో నాకిప్పటికీ అగమ్య గోచరంగా ఉంటుంది.  అందులో ముఖ్యమైనది "శీలం" అనే పదం. వాడుకలో ఈ పదానికి ఉన్న అర్దం వినడానికే యేవగింపుగా ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క "నడవడి" ఇత్యాది లక్షణాలను  వివరించే ఈ పదం ఈనాడు కేవలం సమాజానికి (ఇది కూడా మొత్తం గా వర్తించక పోవచ్చు) ఆమోదమయ్యే రీతిలో   స్త్రీ యొక్క శారీరక ఉపయోగాన్ని నిర్దేశించే  ఉపయోగార్దం లో వాడుతున్నారు. నేను ఇప్పటికీ అనుకున్నంత స్పష్టంగా  నా భావాన్ని వ్యక్తీకరించ లేకపొయ్యాను.ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవలసింది ఏమిటంటే స్త్రీలు కూడా అదే భావజాలంలో కొట్టుకు పోవడం. ఉద్యోగం చేసుకుంటున్న ఒక విద్యాధికురాలు తన స్నేహితురాలితో  మాట్లాడిన మాటలు  నా చెవినబడడం కాకతాళీయమే ఐనప్పటికీ ఆ మాటలు  మనం అంటున్న "మారిన అర్ధాల" గురించి చెబుతాయి." నేను చాలా లక్కీ తెలుసా ...ఆ టైం  కి ఎవరో వచ్చి తలుపు తట్టారు సో ఐ వస్ సేవ్డ్" మరి ఆవిడ తరహా మిగిలిన వారి గురించి   నేను ఇంతకు మించి వేరే వివరించదలుచుకోలేదు.
  ఇంతకు ముందు కూడా నా వేరే పోస్ట్  లో ఇదే విషయాన్ని కొంత వివరించాను. యీ పదాల అర్దాలు మరలా ఎప్పుడు మారతాయో చూడాలి. ఈ రోజు జైళ్ళలోకి నెట్ట బడుతున్న రాజకీయ నాయకుల ,అధికారుల భార్యలకు రోజు రోజు కీ ఇంట్లోకి ఎక్కడి  నుండి ధనం ప్రవహిస్తుందో తెలియదా......ఎంతో కొంత తమ భర్తలు చట్టానికి,సమాజానికి అతీతమైన రీతుల్లో ఈ ధనార్జన చేస్తున్నారని. ఐనా సమాజం వారినందరినీ శీలవతులుగానే పరిగణిస్తుంది. ( ఒక వేళ వీళ్ళు చెబుతున్నా ఆ భర్తలు వినక పోతే ...ఆ భార్యలను విమర్శించడం తగదు కానీ జరుగుతున్న చాలా పరిణామాలు ఆ విధంగా లేవు.) అక్కడి వరకూ అక్కర లేదు యీ రోజు కాలేజ్ నుంది బయటకు వస్తున్న విద్యార్ధి నెవరినైనా సరే ఈ " శీలం  అంటే ఏమిటి?"  అని ప్రశ్నించండి  అప్పుడు మీకే అర్ధం అవుతుంది మన కాబోయే నాయకులు..మేధావులకున్న  సామాజిక అవగాహన. ఎంత మంది తలిదండ్రులు తమ పిల్లలకు 50 సంవత్సరాల అజెండాను ఇస్తున్నారు? ఇచ్చిన అజెండా కేవలం 25 సంవత్సరాల వరకే. ఆ తరువాత గడపవలసిన జీవితం పట్ల అవగాహన....అంతా అగమ్య గోచరం. మంచి అంటే ఏమిటో వివరించే కొలమానాలు అసలు ఉన్నాయా? నిజంగా అంత అజెండా తో పిల్లలని పెంచితే సాఫ్ట్ వేర్ లాంటి రంగాలలో మాంచి మాంచి ఉద్యోగాలలో ఉన్న యువకులు వాళ్ళ తలిదండ్రులని యేవో సామాజిక కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేసి ఉండే వారు. వాళ్ళు సంపాదించేది చాలక ఆ డబ్బు ఇక్కడికి పంపి దానితో తన వాళ్ళతో రియల్   ఎస్టేట్ వ్యాపారాలు చేయిస్తున్నారు.   

ఒక చిన్న విషయంతో ప్రారంభిద్దాం. మా అక్కయ్య పాలెం మెయిన్  రోడ్ లో వెళ్తున్న ప్రతివారూ ఒక చోట రోడ్ లో కొంత భాగాన్ని ఆక్రమిస్తూ  అడ్డంగా కట్టిన రంగురంగుల గుడ్డలను చూసే ఉంటారు. నాకు కూడా కొంత కాలం వరకూ అర్దం కాలేదు. తరువాత అర్దం అయ్యిదేమిటంటే ఆ స్థలాని ఆక్రమించుకొని కొంత మంది సత్య సాయి బాబా భజనలు చేస్తున్నారు. వారి ఆక్రమణ వలన కొన్ని వేల మంది వెళ్ళే  రోడ్ లో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుంది. ఐనా యెవరూ అడగరు. ఆ భజనలు చేసే కొద్ది మందికీ వారి నమ్మకాలే ప్రధానం కాని సమాజం లో తోటి వారి ఇబ్బందులు వారికి అక్కరలేదు. కొంత మందికి వారి నమ్మకాలే ముఖ్యమైనప్పుడు  మరికొంత మందికి వారి అవసరాలే ముఖ్యమై కూర్చుంటాయి. ఉల్లంఘన పట్ల ఒక సారి ప్రారంభమైన ఉదాశీనత దేనికైనా దారి తీయొచ్చు. ప్రతి ఒక్కరూ ఈ తమ చుట్టూ జరుగుతున్న  చిన్న అన్యాయాల  గురించి మాట్లాడుకోరు. ఎక్కడో  దూరంగా ఉండే రాజకీయ వాది గురించో లేక ఒక ఉన్నతాధికారి గురించో మాట్లాడుకొంటారు.  ఎందుకంటే అప్పుడు  మన చేయగలిగింది యేమీ ఉండదు. యే అన్న హజారే యో ముందుకు తేబడితే హాయిగా అతడి టోటో  లు వేయించుకొంటూ ఫోటోస్ దిగవచ్చు. "అయ్యా పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా  ఊరేగింపు తీద్దాం " అంటే చందా ఈయని  వార్డ్ స్థాయి  నాయకులు తమ అవసరాల కోసం వినాయక చవితి పందిళ్ళు వేయించి పెట్టుకుంటున్న కటౌట్లను చూస్తూనే ఉంటాం కానీ మన ఈ ఉదాశీనతనే పై వాళ్ళు బాగా కనిబెడుతున్నారన్న వాస్తవాన్ని మనం విస్మరిస్తున్నాం. క్రింద స్థాయిలో  ప్రశ్నిచడం  ప్రారంబించగానే పై వాడు కూడా కొద్దిగా భయపడతాదని  మనం ఎప్పుడూ మరవ కూడదు. 
క్యూ ఖచ్చితంగా పాటించే సంస్కారం మన అందరిలో ఉన్నప్పుడు ప్రవేశ ద్వారం దగ్గర కాపలా వాడి అవసరం ఏమిటి? మనం సరిగ్గా ఉండక ఎవడో పనికి మాలిన వాడికి కాపలా పేరుతో మన జుట్టు అందిస్తున్నాం. లోపం మన లోనే ఉంది. విలన్లు ఎక్కడో ఉండరు. మన మధ్యే ఉంటారు. సిమెంట్ దొంగతనం చేసి శివలింగాలను పూజ చేస్తున్న వారిని కళా పోషకులుగా ...రాజకీయ నాయకులిగా కీర్తిస్తూ వెలసిన కటౌట్లను ఆనందంగా చూడడం తప్ప మరేమీ చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో  ఉన్న మనందరం విలన్లమే.
సినిమా తీసినంత సుళువుగా  రాజకీయ పార్టీ పెట్టి జిల్లా వారీగా ఫైల్యూర్ సినిమాని ముందుగానే అమ్మేసినట్లు  పార్టీని  కూడా అమ్మేసిన ఒక మాజీ హీరో  గారి పుత్ర రత్నం యొక్క వివాహ నిశ్చితార్ధ వేడుకలని రెండు మూడు చానళ్ళు చాలా సేపటి నుండీ లైవ్ కవరేజ్ ఇస్తున్నాయ్. రైతుల ఆత్మ హత్యల లైవ్ కవరేజ్ తో కూడా టీ.ఆర్.పీ. రేటింగ్స్ ఎలా పెంచుకోవచ్చో యీ మధ్యే విడుదలైన ఒక హిందీ సినిమాలో చూపించారు. యీ రోజు కూడా నలుగురు అన్న దాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అవి కూడా లైవ్ కవరేజ్ ఇచ్చే అలోచన కలిగితే బాగుండును. మరెవరైనా ప్రముఖ రాజకీయ నాయకుడు పైకి పోతే ఇవన్నీ ఆయన అకౌంట్ లోకి పోయి..చక్కగా ఎవరో ఒకరు వీళ్ళందరినీ ఓదార్చడానికి వచ్చి ఉండేవారు కదా అనిపిస్తుంది. ఈ కుళ్ళంతా కడగడానికి ఎన్ని చీపుళ్ళు కావాలో....కానీ కడగడం తప్పదు. ఉప్పెన పైకెగసే రోజు దగ్గర లోనే ఉంది.....మనం చూస్తుండగానే కుళ్ళంతా సమూలంగా తుడిచి పెట్టుకు పోతుంది. ఒక్క విషయం ఏమిటంటే ఉప్పెన దానంత అది రాదు. మనందరం దానిలో భాగస్తులైతేనే వస్తుంది.

23, నవంబర్ 2011, బుధవారం

జరుగుతున్నదాంట్లో మన పాత్ర లేదా......

ఒక తప్పు ఒక వ్యక్తి వలన జరిగితే దానిని కేవలం వ్యక్తిగతంగా తీసుకోవచ్చు అంతే కాకుండా అది యాదృచ్చికంగా జరిగిందని కూడా భావించవచ్చు. కానీ అదే పొరబాటు  అవకాశం  దొరికిన ప్రతి వారూ చేస్తుంటే    అది మన సమాజానికున్న అధీకృత  భావజాలంలో ఉన్న పెద్ద లోపంగా భావించవలసి వస్తుంది. ఇదంతా జనం అందరికీ అర్ధం కావడం లేదా అంటే ఖచ్చితంగా అర్ధం అవుతుందనే చెప్పవచ్చు. చిన్న చిన్న వాటికి కూడా మనకు మనమే " యెం చేస్తాం ..అంతా చేస్తున్నారు" అని మనకు మనమే సర్ది చెప్పేసుకుంటుంటే ఇక కుళ్ళు యెప్పటికైనా అంతం అవుతుందా అని యెవరూ అలోచించదం లేదు. మొత్తంగా భావి తరాలకు కుళ్ళు మాత్రమే నిండి ఉన్న వాతావరణాన్ని , సంస్చృతిని ఇవ్వబోతున్నామన్న వాస్తవాన్ని గుర్తించి కూడా దీనిని అంతం చెయక పోతే నష్టం యేమిటిలే  అన్నంత ఉదాసీనతతో అంతా సరి పెట్టేసుకుంటున్నారనిపిస్తోంది. కొన్ని కొన్ని మనం సమర్ధించడానికి కూడా మనం సిగ్గు పడడం లేదు. మొన్నొక రోజు ట్రైన్ లో కూర్చుని ఒక న్యూస్ పేపర్ చదువుతున్నాను. దానిలో ఒక దివంగత ముఖ్య మంతి గారి తనయుడి మీద ముసురు కొంటున్న సీ.బీ.ఐ. కేసుల తాలూకు  న్యూస్ పెద్దగా ఉంది. పక్కన కూర్చున్న పెద్ద మనిషి యేదో పూనకం వచ్చి నట్టుగా " యీ పేపర్ ఎడిటర్ ఒకప్పుడు సైకిల్  మీద తిరిగిన వాడేనటండీ...పెద్ద ఇప్పుడు నీతిమంతుడులా రాస్తున్నాడు...." నేనడ్డుకుని కాస్త కటువుగా మాట్లాడక పోతే అతడి వాగ్ధాటి ఇంకా సాగేదే. మీడియా అంతా నిష్పాక్షికంగా ఉన్నదని నేనెప్పుడూ అనను కానీ అది అలా తయారవ్వడానికి గాని,అసలు పరిస్థితి ఇంత దిగజారడానికి మనం యెంత వరకూ కారణం అవుతున్నాం అనేది యెవరూ ఆలోచించరు. యెదుటి వాళ్ళు కాస్త బలమైన సమూహం (ఆర్గనైజ్డ్) అనిపిస్తే చాలు మనం దాని జోలికి యెంత మాత్రం పోము. ఆ విధంగానే యీ దేశం లో అతి చిన్న సమూహాలు మొత్తం జనాభాలో 70% ఉన్న రైతాంగాన్ని మోసం చేయగలుగుతున్నారు.
ఆ వివరాలలోకి మరొక్క సారి వెళదాం. కింద ఉన్న చిత్రాన్ని చూడండి.
యీ అపార్ట్మెంట్ ముందు ఒక వాహనదారుడు ప్రతి రోజూ తన వాహనాన్ని పార్క్ చేసుకునే వాడు. మొదట  ఆ అపార్ట్మెంట్ కు సంబందించిన  ఒకరు ఆ వాహనదారుడికి మర్యాదగా చెప్పి చూసాడు. కానీ ఫలితం కలగలేదు. కానీ అపార్ట్మెంట్ లోని  వారందరూ కదిలే సరికి యేకాకి ఐన ఆ వాహనదారుడు దానిని అక్కడ నుండి తీసేసాడు. 

యీ క్రింద చిత్రాన్ని చూడండి.

రోడ్ కొంచెం సన్నగా కనబడుతున్నా ఎంతో రద్దీగా ఉన్న రోడ్ మధ్యలో షామియనా...భోజనాలు.(ఇది కూడా ఆ అపార్ట్మెంట్ పక్కనే ఉన్న వీధే..) కనీసం వీధి మొదట్లో ఐనా  రోడ్ బ్లాక్ ఐనట్టు గా సూచన యేమీ ఉండదు. చచ్చినట్టు అక్కడిదాకా వచ్చిన వారు చచ్చి నట్టు వెనుకకు వెళ్ళాలి. కానీ యీ సారి చాలా అసౌకర్యం కలిగినా కూడా ఆ అపార్ట్మెంట్ లోని వారెవరూ అడగడానికి సాహసించలేదు. కారణం వేరే చెప్పనక్కర లేదు. యెదుటి వాళ్ళు మరింతగా ఆర్గనైజ్ అయిన వాళ్ళు. ఇప్పుడు మొత్తం ఇదే జరుగుతోంది. పబ్లిక్ ప్రోపర్టీ  అన్నది యెవరూ ముట్టుకో రానిది అన్న భావన స్థానంలో అందరూ వాడుకోగలిగినది  అన్న అర్ధం నెలకొంది. అది తిన్నగా యెవరికి బలం ఉంటే వాళ్ళు వాడుకొనే స్థాయికి తీసుకెళ్ళింది. అసలు పబ్లిక్ కి ఇబ్బంది కలిగే అన్నిటి మీదా తీవ్రమైన చర్యలు మొదటి నుండీ అమలయ్యి ఉంటే యీ భావజాలం ఇంత దారుణంగా వేళ్ళూనుకు పోయి ఉండకపోయేదేమో. ఒక సారి రోడ్ పై పొర ఐన టేక్  మరియు సీల్ కోట్ లు ధ్వసం ఐతే ఆ రోడ్ కి అవసాన కాలం దాపురించి  నట్టేనని అందరికీ తెలుసు. కానీ మన కళ్ళ ముందే కొంత మందికి ఆనందం.లాభం కలిగించే ప్రోగ్రాం లు జరపడం కోసం రోడ్  తవ్వేస్తున్నా మనం పట్టించుకోము సరి కదా ప్రభుత్వం రోడ్లు పట్టించు కోడం లేదని వాపోతాం.షిఫ్ట్ ద్యూటీలు ఉన్న నగరాల్లో ..తెల్లవారగట్ల వచ్చి పడుకుందాం అనుకున్న కార్మికులకి మైక్ లు లో నుండి వచ్చే ప్రార్ధనలు ఎంతో ఇబ్బంది కలిగిస్తాయని ప్రభుత్వానికి తెలియదా...? అసలు భగవన్నామ స్మరణకు అంత గోల అవసరమా...? నిశ్శబ్దం  ఒక పబ్లిక్ ప్రొపర్టీ వంటిది కాదా.....యెవడికి అవకాశం ఉంటే వాడు దానిని దోచేస్తున్నాడు. మరి సాక్షాత్తూ రాష్ట్ర అధినేతల బంధు...ఆశ్రిత  బృందాలను అడ్డుకోవడం అనేది చాలా దూరం లో ఉంది. మన బోటి సామాన్య  స్థాయిలో ఉన్న వాళ్ళకి   కనీసం రోడ్ మీద జరుగుతున్న   ప్రోగ్రాం పక్కన ఉంటున్న పెద్ద పెద్ద పోస్టర్ లను చూస్తే యీ కుళ్ళు యెక్కడి నుండి కడగాలో అర్ధం అవుతుంది. ప్రజల మూర్ఖత్వాన్ని వాడుకునే వాళ్ళ పని పట్టడమే  ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం.
కన్నూ మిన్నూ కనబడని రోజులలో చేసిందంతా యధేచ్చగా చేసి విచారణలెదుర్కుంటున్న యీ సమయంలో  ఒకరేమో చేతులు పైకి చూపించి "అన్నిటికీ భగవంతుడే...ఉన్నాడు" అంటుంటే  కొంతమంది మాత్రం యీ క్రింది విధంగా భగవత్ప్రదక్షిణాలు   చేస్తున్నారు.

పాపం భగవంతుడు దాక్కోడానికి యేదైనా చోటుందో లేదో...వీళ్ళందరికీ భవతుడంటే భయం ఉండొచ్చు..చట్టం అన్నా కూడా ఇప్పుడిప్పుడు కొంత భయం వచ్చి ఉండొచ్చు.. కానీ జనం ఉన్నారని భయ పడే స్థాయికి  మనం యెప్పుదు యెదుగుతామో.....ఆ రోజుల కోసం ఎదురు చూద్దాం.

18, నవంబర్ 2011, శుక్రవారం

నిజమైన ఆనందమంటే.....





నవంబర్ నెలలో  యేదైనా  చెట్టుకింద   కూర్చుని   పని  చేసుకునే  అవకాశం   కలగడం  ఒక  అదృష్టంగానే   భావిస్తాను నేను. వాతావరణ మార్పుల పుణ్యమా  అని నాలుగు నెలల వేసవి కాస్తా ఆరేడు నెలల వేసవి గా మారి పోయింది.  మధ్యలో  వర్షాకాలం వెళ్ళగానే కాసే నీరెండలో ప్రకృతిని ఆస్వాదిస్తూ పవర్ కనెక్షన్ బయట వరకూ తెచ్చుకుని పని చేస్తుంటే  పని చేస్తున్నామన్న భావనే ఉండదు. మా  అలమండ స్టేషన్  కు ఆనుకుని ఉన్న టేక్ ప్లాంటేషన్  లో లెవెల్స్ తీయవలసి ఉన్నదని నిన్ననే చెప్పాను. తీరా  చూస్తే టేక్ చెట్ల మద్య దట్టంగా చిన్న చిన్న పొదలు పెరిగి పోయి ఉన్నాయి.
“వాటిని తొలగించందే ఆ లెవెల్స్ తీయడం సాద్యం కాదు..ఏదో యేర్పాటు చేయండి”సైట్ ఇంజనీర్  కు చెప్పాను.
“అదెంత పని సార్…మా జంగ్లీ గాళ్ళు ఉన్నారు కదా…..”
వాళ్ళెవరన్నట్లు చూసాను.
వచ్చిన కుర్రాళ్ళను చూడగానే నవ్వు వచ్చింది. వాళ్ళు ట్రక్స్ మీద క్లీనర్స్ గా పని చేస్తుంటారు. ఒరిస్సా  నుండి వచ్చారు. మొదట నుండీ వాళ్ళను చూస్తుంటే తెలియని ముచ్చట వేస్తుండేది. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. ముందు  అన్నయ్య పనిలో చేరాడు. కొద్ది  రోజులకు తమ్ముడు చేరాడు. ఛిన్న వాడు వచ్చిన రోజు వెంటనే పనిలోకి దిగలేదు. రెండు మూడు సార్లు ఆ రోజు వాళ్ళ కేంప్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు కేంప్ ముందు కూర్చుని బిక్కు బిక్కు మంటూ చూస్తున్న వాడిని చూసి జాలి కూడా వేసింది. మద్యలో  వాళ్ళన్నయ్య క్లీనర్  గా పని చేస్తున్న ట్రక్ దూరంగా కనబడినప్పుడు వాడి కళ్ళు అటువైపే ఆత్రుతగా చూడడం గమనించాను. నెమ్మదిగా  చిన్న వాడు అలవాటు పడి పొయ్యాడు.
నాకెందుకో  వాళ్ళిద్దరినీ చూస్తున్నప్పుడు “ది గాడ్స్ మస్ట్ బి క్రేజీ” సినిమా గుర్తుకు వచ్చేది  మొదట్లో.
వాళ్ళిద్దరూ కొడవళ్ళు తీసుకున్నారు.
“ వాళ్ళు లారీ  క్లీనర్స్ …యీ పని చేయగలుగుతారా….” మనసులో  సందేహాన్ని బయటకు వెళ్ళగక్కేసాను.
“భలే వారు సార్…వాళ్ళ వూర్లో వాళ్ళు చేసే అసలు పని ఇదే సార్…వాళ్ళు గొర్రెలు మేపుకుంటానికి రోజూ తుప్పలు నరుకుతానే ఉంటారు.” మా సైట్ ఇంజనీర్  సుందర్ సామాధానం.
నేను  అలాగే చూస్తున్నాను.
వాళ్ళ చేతుల్లో కొడవళ్ళు నాట్యం  చేస్తున్నట్లుగా  అనిపించింది. ఆతి లాఘవంగా వేటు వేస్తుంటే నిముషాల మీద పొదలు ఖాళీ అవడం ప్రారంభమైంది.
మద్యలో  ఉన్న చింత చెట్లు చూడ గానే ప్రతి రోజూ  చింతకాయల కోసం రైతు బజారుకు తీసుకు వెళ్ళమంటున్న శ్రీమతి  గుర్తుకు వచ్చింది.
“  యీ పని పూర్తి కాగానే మన వాళ్ళతో కొద్దిగా చింత కాయలు కోయించ  గలరా?”
“అదెంత పని సార్..ఒరేయ్…….” మా సుందర్ వాళ్ళకు అదేశాలివ్వడం.….వాళ్ళు ఒక డొంకినీ (కర్రకు కట్టిన కొడవలి)తో చింతకాయలు రాల్చడం …నిముషాల మీద జరిగి పోయింది. రాలిన  చింత కాయలు యేరడం  మొదలు పెట్టే సరికి వీళ్ళకు పోటీగా ఒక ఇరవై మేకలు వచ్చి విందారగించడం మొదలు పెట్టాయి.వాటిని చూసి అన్నదమ్ములిద్దరూ మరలా పైకి పాకడమే కాకుండా పక్కనే ఉన్న వేప చిగుళ్ళు కూడా విరిచి వాటి విందుని సమాప్తి చేసారు. ఇదంతా  సమీపంలో చెట్టు నీడ లో కూర్చుని పని చేసుకుంటున్న  నాకు కనబడుతూనే ఉంది. మనసంతా  యెదో తెలియని ఆహ్లాదానికి..ఆనందానికి లోనయ్యింది. నాది  అసలైన ఆనందమో లేక టీవీల్లో కొన్ని కొన్ని.. అంటే  యేదో వైకుంఠ పాళీ మోడల్ లో ఆడుతున్న ఆటల్లో నిచ్చెన  తగిలినప్పుడు ఆ ఆడే వాళ్ళు వింత వింత కూతలతో ప్రకటించేది నిజమైన ఆనందమో నాకు అర్దం కాకుండా ఉంది. యెందుకంటే నాకు నా ఆనందం వలన నా నోట్లో నుండి యే వింత వింత ధ్వనులూ రాలేదు కాబట్టి నాది నిజమైన ఆనందం కాదేమోనని అనుమానంగా ఉంది. పాఠక మహాశయులే  నాకు సందేహ నివృత్తి చేయగలరని ఆశిస్తాను.
“అసలు ఇలాంటి పనికిమాలిన ఆనందాల వల్లేనమ్మా….యెక్కడికో వెళ్ళ వలసిన మీ ఆయన ఇలా జూనియర్ ఇంజనీర్  గా ఉండిపోయాడు…ఫరవాలేదులే యెంతో కొంత నయమే….పొద్దున్నే చద్దన్నం తినేసి  పుస్తకం పట్టుకుని యే చెట్టు కిందకో చేరి  పోయి …పక్షుల తోను..పశువుల తోనూ మాట్లాడుకుంటూ గడిపేస్తాడేమో నను కునే వాడిని…”
ఒకప్పటి నా బెంచ్ మేట్..ప్రస్తుతం రైల్వేలోనే  ఉన్నతాధికారి అయిన  సుబ్రమణ్యం  నా గురించి నా శ్రీమతితో  అన్న మాటలు  నన్ను పొగిడినట్లుగానే అనిపిస్తాయి నాకు.
ఫక్కనే ఉన్న చిత్రాలను ఒక్క సారి చూడండి. ఆ  అమాయక గిరిజన

 
బాలుడిని చూడండి. ప్రకృతి సౌందర్యానికి దర్పణం పట్టే ఆ కొండల పేర్పుని చూడండి. ఒరిస్సా  లోని ఒక ప్రాంతపు అందం ఇది. ఆ ప్రాంతపు పార్లమెంట్ మెంబర్  నాకు స్నేహితులు కావడం నా అదృష్టం.  యెందుకంటే ఆ ప్రాంతాన్ని నాకు పరిచయం చేసింది ఆయనే. నిజాయితీ  ఆయననింకా వీడ  లేదు కాబట్టి ఆ ప్రంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేద్దామని ఆయన ఆకాంక్ష. కానీ  ఆ తరువాత ఆ అమాయక బాలుడి  ముఖం వంటిది ఆ ప్రాంతం నుండి దూరం చేస్తామేమోనని నేను ఆయన ప్రయత్నాన్ని నిరుత్సాహ పరుస్తూనే వస్తున్నాను. రాబందుల  కళ్ళు ఆ ప్రాంతం మీద ఇంకా పడ లేదు. పడిన తరువాత నా శక్తి యే మూలకూ చాలదని నాకు తెలుసు.

9, నవంబర్ 2011, బుధవారం

ఏది ముఖ్యం...

నాకనేక సార్లు చాలా వింత వింత సందేహాలు వస్తూ ఉంటాయి. అసలు ఇలాంటి అనుమానాలు వస్తూండడం వలనే నన్ను పెళ్ళాడడానికి యెవరూ రాలేదనీ..అందువలనే ఇంటికెదురుగా ఉన్న తను దొరికి పోయానని మా శ్రీమతి తరచూ వాపోతూ ఉంటుంది. ఇంతకూ ప్రస్తుతం నాకొచ్చిన సందేహం యేమిటంటే ప్రకృతి లేదా సహజ వనరులు జాతీయ సంపత్తే కదా....అంటే నీరు,గాలి..ఇవన్నీ జాతీయ సంపత్తి అంటే ప్రజలందరికీ ఉపయోగపడ వలసినవి. మనం జల వనరులనే చూద్దాం. మనకున్న జల వనరుల వలన విద్యుదుత్పత్తి జరుగుతోంది. లేదంతే బొగ్గు అంటే అది కూడా సహజ భూగర్భ వనరులలే భాగమే కదా.... కనీ వాటి వినియోగం యెలా జరుగుతుందో ఇంతకు ముందు ఒక సారి వివరించాను. ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టాలంటే దాని నుండి తిరిగి యెంత పొందగలం అన్నది ముందుగా అంచనా వేస్తారు. కొద్దో ..గొప్పో నిర్మాణ/పారిశ్రామిక రంగాలలో పని చేసిన వారందరికీ యీ విషయం మీద కూలంకషమైన జ్ఞానం ఉంటుంది. కానీ మధ్యాహ్నం ఇళ్ళలో నిద్ర పొయ్యెందుకు వాడే విద్యుత్తు కి రిటర్న్ విలువ యెంత? మనకు అవసరానికి మించిన విద్యుదుత్పత్తి ఉన్నప్పుడు దానిని యెలా వాడుకొన్నా ఫరవాలేదు కానీ మన కనీస అవసరాలకు కూడా చాలీ చాలకుండా ఉన్నప్పుడు దానిని ఖచ్చితంగా పునరుత్పత్తికి పనికి వచ్చే పనులకి వాడాలి కానీ బిల్లు కడుతున్నారు కదా అని వృధాగా వాడడం ఎంత వరకూ సబబో విజ్ఞులు అలోచించాలి. పొలాలకి నీరు తోడడానికి వాడే పంపులకి విద్యుత్తు సరఫరా ముఖ్యమా...పట్టణాల లోని బెడ్ రూం యే.సీ. లకు సరఫరా ముఖ్యమా..? నాకొక సందేహం యేమిటంటే ముందు ముందు కార్పొరేట్ వ్యవసాయం వస్తే అంటే మన పొలాలన్నీ అంబానీలు..లేదా అటువంటి వారు పొలాల బాట పడితే యీ విద్యుత్ సరఫరా అప్పుడు కూడా ఇలానే ఉంటుందా?
ఒక్క సారి పల్లెలకు వెళ్ళి అక్కడి పరిస్థితులు చూడండి. వ్యవసాయానికి నీరు ఉండదు. పంపులకు విద్యుత్ సరఫరా ఉండదు. రైతుల పిల్లలకు చదవడానికి లైటు వెలగదు. ఇక కొంత కాలం గడిస్తే మా గ్రామాలు ఇలా ఉండేవి అని చెప్పే వీడియో  క్లిప్ లు మాత్రమే మిగులుతాయి. మా పూర్వీకులలో ఇంతటి ఉదాత్తత ఉండేది అని పెదాలతోనే చెప్పగలం. ఇక రాను రాను ఆ జ్ఞాపకాలు మనకు కళ్ళలో నీళ్ళు తెప్పించవు యెందుకంటే మన లో ఆ ఆర్ద్రత  మిగులుతుందని గారంటీ లేదు.