21, ఆగస్టు 2011, ఆదివారం

భలే మంచి లాభసాటి ఉద్యమం ...

అబ్బ ....యెంత ఆనందం....ఒక మహా  ఉద్యమం మొదలవ్వ బోతోంది. చాలా సంతోషం. ఆన్నాహజారే ప్రారంబించిన ఉద్యమానికి మంచి ప్రోత్సాహం లభిస్తోంది. బహుశా  ఈ పదేళ్ళ కాలంలో ప్రజలు ఇలాంటి ఉద్యమాన్ని చూడలేదేమో. మీడియా కూడా మంచి ప్రచారాన్నిస్తోంది. వాళ్ళకు చాలా రోజుల వరకూ సెన్సేషన్ కోసం వెదుక్కోవలసిన అవసరం తప్పుతుంది.  ఈ  నేపధ్యంలో రెండు మూడు ఆత్మ హత్యలు జరిగినా ఆశ్చర్య పోనక్కరలేదు. లేదంటే  జరిగిన మరణాలన్నీ కూడా ఆత్మ హత్యలుగా మిగిలే అవకాశం కూడా యెక్కువే. చాలా మందికి ఇప్పటికే ఒక అవగాహన వచేసింది. ఈ ఉద్యమంలో పాల్గొంటే అరెస్ట్ లు లాంటివి జరిగే అవకాశం తక్కువే. జరిగినా కూడా దానివలన ప్రమాదం యెమీ ఉండదని కూడా అందరికీ తెలుసు ..అంతే కాదు అక్కడ కూడా మన పాండితీ ప్రకర్ష ప్రదర్శించొచ్చు..  ఆనంద పడ్డ స్టేషన్  స్టాఫ్ మనకు టీ లు సప్లయ్ చేసే అవకాశాలూ యెక్కువే.. యే విధంగా చూసినా చాలామందికి ఇది లాభసాటి ఉద్యమమే.
                   ఇది చాలా మందికి కోపం తెప్పించవచ్చు. కానీ మనం ఒక్క సారి కొన్ని విషయాలను సావధానంగా అవలోకిద్దాం. నేననుకోవడం ప్రకారం ఐతే చాలా మంది ఆ బిల్ ముసాయిదా కూడా చదివి ఉండరు. వూరేగింపులో పాల్గొని మాంచి ఆవేసం తో ఊగిపోతున్న కుర్రాడిని పిలిచి మనకేమి ఉపయోగమమ్మా యీ జనలోక్  పాల్ బిల్ వలన అని అడిగాను. ఆ కుర్రాడు తనకొచ్చిన యెస్.యెం.యెస్.  లో ఉన్న సారాంసాన్నాంతా చక్కగా చెప్పేసాడు.
 అప్పుడు అడిగాను..."నీవు చెప్పినదంతా బాగానే ఉంది కానీ నీవు చెప్పిన దానికి ..జన్ లోక్ పాల్ బిల్ కు సంబందం యేమిటి?"
" అదేంటి సార్...అందుకే కదా జన్ లోక్ పాల్ బిల్ తెస్తుంట"
నాకేమని చెప్పాలో అర్ధం కాలేదు.
ఒక్క సారి మనం మన దేశ పరిస్థితిని చూద్దాం. లెక్కల ప్రకారం మనం అభివృద్ది పధం లోనే ఉన్నాం. ఒక్క సారి గ్రామాల్లోకి వెళ్ళి వాస్తవాలు చూద్దాం. యెంత మంది రైతులు ఆనందంగా వ్యవసాయం చేస్తున్నారు? వ్యవసాయాధారిత పరిస్రమలు యేవైనా  మనగలిగి ఉన్నాయా.. కళ కళ లాడుతూ ఉండ వలసిన గోదావరి జిల్లాల లోని గ్రామాలు కూడా ఇప్పుడు యెలాంటి పరిస్థితి లో ఉన్నాయ్ ?


                యీ నాడు మనకున్న అతి ముఖ్య మైన సమస్య అదేనని కూడా చాలా మందికి తెలుసు. మరి దీనికి జన్ లోక్ పాల్ బిల్ కు యేమైనా సంబంధం ఉందా....ఇదొక్కటేనా.. ...రగులుతున్న సమస్యలు యెన్ని లేవు? వాటి కోసం యే చర్చా జరగదు...జరిగినా మనం పట్టించుకొం. ఒక్క సారి అంధ్ర జ్యోతి లో  శ్రీ  రామఛంద్రగుహ  రాసిన ఒక ఆర్టికల్ లోని ఒక్క వాక్యం ఇక్కడ రాయడం చాలా అవసరం అని నేను భావిస్తున్నాను. " నాగ్పూర్ లో లేక్మీ కంపెనీ వాల్ళు పెట్టిన ఫేషన్ షో కవర్ చేయడానికి 140 మందికి పైగా జర్నలిస్టులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. కానీ యీ చుట్టు పక్కలే జరిగిన లెక్కలేనన్ని రైతుల ఆత్మ హత్యలు కవర్ చేయడానికి 6 గురు  జర్నలిస్టులు కూడా  లేరు. " యీనాడు ప్రతీదీ మార్కెట్ వస్తువైనట్లుగానే  ఉద్యమాలు కూడా మీడియా కు మర్కెట్ ను తెచ్చి పెడతాయి. అందుకే వాళ్ళు చాలా సెలెక్టివ్  గా ఉంటారు. మార్కెట్   కాని ఉద్యమం వాళ్ళకు అవసరం ఉండదు. మరి యిదొక్కటే మార్కెట్ సరుకుగా మీడియా యెందుకు యెంచుకుందో ఒక్క సారి మనసు పెట్టి అలోచిద్దాం.
1. యీ ఉద్యమం లో పాలు పంచుకొనే వారికి యెలాంటి భయం ఉండదని మనం ముందుగానే అనుకున్నాం. కాబత్తి సహజం గానే పట్టణ మధ్య తరగతి ప్రజలు దీనిలో గరంటీ గా పాలుపంచుకొంటారు. నగరాల్లో జరిగే ఉద్యమాలను మాత్రమే అసలైన ప్రజా ఉద్యమాలుగా భావించే నేటి పరిస్థితులలో దీనికి మాంచి గిరాకీ ఉంటుందని మీడియా పెద్దలకు బాగానే తెలుసు.
2. ప్రెస్సర్ కుకర్ లా ఉన్న నేటి సమాజం లో కొంత ప్రెసర్ ని యేదో రూపం లో బయటకు పంపడం అధికార పీఠాలలో ఉన్న వారికి చాలా అవసరం. అందుకు యేదో ఒక ప్రమాద రహిత ఉద్యమానికి అన్ని వైపుల నుండీ మద్దతు అవసరం. లేదంటే యీ ప్రెసర్ వలన జనం అంతా భిన్న రూపాలు ..అంటే ఆ పీఠాలు కదిలించే ఉద్యమాలలోకి మళ్ళుతారు. యీ భావజాలాన్ని కాపాడుకొంటూ పై పై మెరుగులకే మీడియా ఇస్టపద్డుతుంది కాని పునాదుల మార్పంటే వాటికి కూడా భయమే....
యీ మధ్య పేపర్ చూస్తున్న వారికందరికీ ఒక్క విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇంతకు ముందు యెక్కువగా ఆకలి చావులు ఉండేవి.కానీ యీ మధ్య కాలంలో అవి రైతుల ఆత్మ హత్యలుగా మార్పు చెందాయి. కేవలం వ్యవసాయాన్ని ఒక వృత్తిగా స్వీకరించిన పాపానికి అనేక వేల మంది రైతుల ఆత్మ హత్యలు దేశంలో జరుగుతున్నప్పుడు మన స్పందన యేమిటి? మీడియా వారు చూపిన శ్రద్ద యేపాటిది?
చాలా కాలం క్రితమే మా వూరిలో జరుగుతున్న మార్పులు  చూసి యేదో మనకు తెలియకుండానే రైతులను నెమ్మదిగా యీ వృత్తి నుండి ద్దొరం చేసే పరిస్థితులు యేర్పడుతున్నాయేమోనని అనిపించేది. మా వూరు రాజమండ్రి పట్టణానికి అతి సమీపంగా ఉందే గ్రామం. నేను చదువుకుంటున్న రోజుల లోనే  పట్టణాన్నుండి బంగారం వ్యాపారస్తులు ,బట్టల వ్యాపారస్తులు మా వూరిలో భూములు   కొంటున్నప్పుడు నాకు అనిపించేది...మన రైతులు ఒక్కరు కూడా పట్టణాల్లో ఆస్తులు యేవీ కొనలేకపోతున్నారు..కానీ ఆస్తుల విలువ లెక్క గడితే పొలాల విలువా ఆయా వ్యాపారస్తుల పెట్టుబడులకన్నా అనేక రెట్లు యెక్కువగానే ఉండేవి. నేను ఆర్ధిక శాస్త్ర విధ్యార్ధిని కాదు కానీ యేదో తెలియని సమీకరణాలు రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని అర్ధం అయ్యేది.
యేమాత్రం ఆర్ధిక శాస్త్ర  జ్ఞానం లేని నాకే ఆ మాత్రం అర్ధం అయ్యినప్పుడు మనకున్న మేధావులెందరికో యీ విషయం అర్ధం అయ్యే ఉంతుంది. కానీ పరిస్థితులు ఆత్మహత్యలకు దారి తీసినా రాజధాని వీధులలో యే రైతూ ఊరేగింపు తీయలేకపోయాడు కాబట్టి అది భారత దేశపు సమస్యగా మన మీడియా  గానీ యీ రోజు ఊరేగింపులు తీస్తున్న వర్గాలకు గానీ పట్టలేదు.
ఒక సమస్య మీద పోరాడడం తప్పు కాదు ఆ పోరాటాన్ని సమర్ధించడం పొరబాటు కాదు కానీ పొలాలు వదిలి పారిపోతున్న రైతుల గురించి  అలోచించడం ముఖ్యమా....లేక ప్రధాన మంత్రిని లోక్పాల్ పరిధి లోకి తేవడం ముఖ్యమా..అనేది విజ్ఞులే అలొచించుకోవాలి.
ఆ నాడు జాతీయోద్యమం మొదలైనప్పుడు కూడా మనం దేని కోసం పోరాడుతున్నామన్నది ఆ పోరాటం  లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ ఒక అవగాహన ఉండాలని...కేవలం రాజకీయ స్వాతంత్రయం వలనే మన సమస్యలు తీరి పోవనీ...పోరాడ  వలసిన అంశాలు  ఇంకా అనేకం ఉన్నాయని ఆనాటి మేధావులు కూడా నొక్కి వక్కాణించారు.  అది యీ  నాటికీ కూడా మనం పట్టించుకోము. కేవలం మనకు విలన్లు ప్రధానమంత్రి..జుడీషియరీ  యేనా ....ఇంకెవరూ కాదా....అసలు మన చుట్టూ ఉన్నవారి  పాత్రా...దానికి మన ప్రతిస్పందనలూ..ఒక్క సారి చూద్దాం.....
ఒక సారి విజయవాడ రైల్వే స్టేషన్  అప్పర్ క్లాస్ వెయిటింగ్  రూం లో కూర్చుని  ఉన్నాను. రాత్రి 12 గంటలు దాటి ఉండవచ్చు..వస్తున్నవారి వివరాలు..రిజిస్టర్  లో రాయడానికి ఒక అటెండెర్  ఉంటారు. సాధారణంగా యిది కూర్చుని చేసే ఉద్యోగమే కాబట్టి స్త్రీలనే అక్కడ కూర్చో బెట్టదం జరుగుతుంది. ఒక వ్యక్తి సుమారు 40 సం. ల వయస్సు ఉండవచ్చు..తన కుమారుడితో.. ప్రవేశించడం  జరిగింది.. ఆవిడ వివరాలు అడిగింది. అతడిది జనరల్ టికెట్ కావడంతో ఆవిడ మర్యాదగా ఆయనను జనరల్ వెయిటింగ్  హాల్ కు వెళ్ళమని చెప్పింది. అతడు వినకుండా అక్కడే కూర్చున్నాడు..ఆవిడ అడుగుతుంటే "ఉండమ్మా...రిజర్వేషన్ చేయించుకొంటాం.".అంటూ దబాయిస్తున్నాడే కానీ అక్కడ నుండి మాత్రం కదల లేదు. జనం అంతా చూస్తున్నారు...కానీ యెవ్వరూ మాట్లాడడం లేదు. కానీ ఒక తోటి రైల్వే ఉద్యోగిని కాబట్టి యిది చూస్తూ ఊరుకోడం నా వాల్ల కాలేదు..తగిన శాస్తి జరిపించాను అది అంత ప్రధానం కాదు. కానీ   ఇక్కడ నేను చెప్ప దలుచుకున్న దేమిటంటే బాధ్యత గల పౌరుడిగా   మన వంతు కర్తవ్యాన్ని కొంతైనా మనం చేయం....." అన్నా హజారే ..జిందాబాద్..అంటూ.."గొంతు చించుకుంటాం...  కానీ కనీసం ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ ఉన్నా కూడా ధీమాగా ముదుకు పొయిన వాడిని నాలుగు పీకుదాం..అని మాత్రం అలోచించం. రిస్క్ యెవరిక్కావాలండీ...ఇదీ మన దౌర్భాగ్యపు పరిస్థితి..


                  ఇది మనకు ప్రతిదినం అనేక చోట్ల యెదురయ్యే దృశ్యమే ....కానీ మనది అతి మందమైన చర్మం కాబట్టి  ఇవన్నీ మనకు సాధారణమైనవి గానే కనిపిస్తాయి. ప్రస్తుతం పెందుర్తి గ్రామం నుండి  వైజాగ్ రైల్వే స్టేషన్  మరియు బస్ కాంప్లెక్స్ వరకు BRTS రోడ్ ఇంచుమించు పూర్తి కావస్తోంది. దీనివలన కొన్ని లక్షల మంది ప్రయాణీకులు యెంతగానో లాభపడతారు. ఆ రోద్ లో ప్రయానించే వాళ్ళకు ఒక చోట యీ పని లో బ్రేక్ కనబడుతుంది. వేపగుంట అనె సెంటెర్ కు ముందు రెండు చిన్న చిన్న మందిరాలు ఉంతాయి. వాటిని చూస్తే అవి యీ మధ్యనే అంటే 20 సం. లోపులొనే కట్టినవని అర్ధం అవుతుంది. ఇంతమంది ప్రయాణీకులు లాభపడతారని తెలిసినా ఆ మందిరాలను యెవ్వరూ కదప లేక పొతున్నారు. మందిరాలకి ..మానవత్వానికి దూరం సహజంగానే యెక్కువగానే ఉంటుంది కానీ అధికారులు....యువకులు ..ప్రజాసంఘాలు...మరి సో కాల్డ్ మీడియా యేమి చేస్తుందో తెలియదు. మరి అన్నా హజారే ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ వూరేగడం కంటే ఇటువంటివి ముఖ్యమని యెందుకు అనిపించడం లేదు. నేను ఒక్క వైజాగ్ లో రోజూ గమనిస్తున్న ఒక్క సమస్య గురించి ప్రస్తావించాను. మరి వెదికితే ప్రతి చోటా ఇటువంటివి యెన్నో ఉంటాయి. కానీ అవి మన దృస్టికి కనబడవు. కారణమైతే  నాకు ఒక్కటే కనబడుతుంది. మనమంతా ఒక అధీకృత భావజాలానికి అతీతంగా అలోచించడానికి ...యేదైనా ఆచరించడానికి వెనికాడుతూనే ఉంటాం. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. మధ్య తరగతి నుండి వచ్చిన విధ్యార్ధులకు సినిమాలు ,షికార్ల కంటే కూడా ఒక ఉద్యోగం, కుటుంబానికి తగినంత ఆసరాగా నిలబడడం తక్షణ అవసరం. కానీ కాలేజ్ లలో అది అధీకృత భావజాలం కాదు. నేను చదివిన తణుకు అప్పటికింకా గ్రామమే...అందులో ఉన్న మా కాలేజ్ ఆవూరికి గొప్పదే కాబట్టి కొత్త సినిమాకు అడిగినన్ని టికెట్స్ ఇవ్వలేదని గొడవకు బయలు దేరితే నా వెనుక వంద మంది పైగానే చేరేవారు. కానీ "ఉద్యోగమైనా...చూపండి లేదా జైల్లో ఐనా పెట్టండి " అన్న స్లోగన్ తో ఊరేగింపుకు బయలుదరినప్పుడు అందులో మా స్నేహితులం నలుగురిమే ఉన్నాము. పైగా ఆ రోజు బజార్ లో మాకు యెదురు వచ్చిన మా కాలేజ్ మేట్స్ మమ్మలని వింతగా  చూసారో లేదో తెలియదు కానీ మా మనసులో ఫీలింగ్స్ అలానే ఉన్నాయ్. ఐతే కాస్తో కూస్తో మొండి తనం ఉంది కాబట్టి..మేము చేస్తున్న పని మాకే కాకుండా పదిమందికీ మంచి చేస్తుందన్న అచంచల విస్వాసం ఉంది కాబట్టి మేము మా ప్రయాణాన్ని కొనసాగించాం.. మా భావజాలమే అక్కడ అధీకృత  భావజాలంగా నడిచేలా చేయగలిగాం.
టీవీలు....ఇంటర్నెట్ ..అంతకంటే దరిద్రమైన సెల్ ఫోన్ లు యువత ను సామాజిక బంధాల నుండే కాకా, సామాజిక అవసరాలను, సామాజిక సిద్దాంతాలను పట్టించుకోడం పూర్తిగా మానేసారు కాబట్టి కేవలం  రేటింగ్స్  కోసం గడ్డి తినే చానల్స్ వారు చాప క్రింద నీరులా ప్రవహింపచేస్తున్న మాయాజాలం లో పడకండి. మీరు అన్నా హజారే లా ఇక్కడ యేదైనా చేస్తే వారు కవర్ చేయరు. మీరందరూ కలసి ఊరేగింపులు తీస్తేనే వాళ్ళు కవర్ చేస్తారు. యెందుకంటే వాళ్ళకు యెప్పుడూ ఒక మార్కెట్ విలువ ఉండే వస్తువు కావాలి. మీరు ఊరేగింపులు తీస్తే అక్కడ ధిల్లీలో దీక్ష చేస్తున్న వారి మార్కెట్ విలువ ఇతోధికంగా పెరుగుతుంది. కాబట్టి మీరే అన్న హజారే లా ఉండాలో...లేక అన్నా హజారే కోసం ఊరేగింపులు చేసేవారిగా ఉంటారో మీరే తేల్చుకోండి.


అనుకున్నట్లుగానే అంతా సుఖాంతం అయ్యింది. ఒక్క సారి ప్రభుత్వం ప్రకటించిన లోక్ పాల్ ముసాయిదా ను ,అన్నా హజారే ప్రతిపాదించిన ముసాయిదా ను కూలంకషంగా ఒక్క సారి పరిశీలించండి. నాకైతే రాణీ గారు సన్నజాజుల బదులు మల్లెలు తెచ్చిన రాజా వారి మీద అలిగిన చందాన అంపించింది. దాని కోసం ఇంత హంగామా చేయడం అవసరమా....యేమో తెలియదు. నాకైతే మాత్రం అనేకానేక సమస్యల వలయం లో ఉన్న మనం యీ ఒక్క సమస్యనే జాతీయ సమస్య గా చేయడం వలన అసలు సమస్యలు పక్క దారి పడుతున్నాయేమో అనిపిస్తుంది. యేది యేమైనా అన్నా నిమ్మరసం తాగేసారు కాబట్టి నాకు మాత్రం కొంత ఉపసమనం కలిగింది. యెందుకంటే నిన్ననే ఒక నటీమణి  తన వీపు మీద అన్నా టాటూ వెయించుకొని పత్రికలకు ఫోజిచ్చింది. ఆయన ఇంకా ఇదే దీక్షలో కొనసాగుతుంటే ఇంకా మిగిలిన వారు ఇంకెక్కడ ఆ టాటూ లు పొడిపించుకుంటారో అన్న టెన్షన్ తో చచ్చి ఉండేవాడిని. ఒకసారి మంచి మార్కెట్ కు యెక్కిన దేనినీ మన వాళ్ళు వదలరని  తెలుసు కదా.. 
ఇందాకనే జే.పీ ఒక ఇంటర్వ్యూ లో ఒక మాట చెప్పడం విన్నాను. అందరిలో మార్పు కోసం తపన, పోరాడే పటిమ ఉంటేనే యే ఉద్యమమన్నా ముందుకు వెళ్ళతాయే తప్ప యే ఒక్కరి మీదో ఆధార పడి ఐతే కాదు. ఒక సారి యేదైనా పేరు వచ్చిన గుడికి వెళ్ళి చూడండి. యేదో ఒక అడ్డ దారిలో (వీ.ఐ. పీ కోటా, స్పెషల్ దర్శనాలు కూడా యీ కోవలోకే వస్తాయి) దేవుడిని దర్శించుకుందామనే తపన, అంటే కనీసం అక్కడ కూడా మనం యెంతో కొంత న్యాయాన్ని పాటిద్దామని ప్రయత్నించం. దేవుడి దగ్గరే అడ్డదారులు అంగీకారం అయినప్పుడు మిగిలిన చోట్ల అదే దారిలో వెళ్ళడానికి మనమెందుకు ప్రయత్నించం. అంతేకాదు నీవు తలనీలాలు సమర్పించుకొంటేనే సర్వ పాపహరణం జరుగుతుందని నమ్మడంలో యెన్ని ప్రమాదాలో ఒక్కసారి చూద్దాం. నీవు పాపం చేసావంటే సమాజం లో యెవరి కో నీ వలన అన్యాయమో..అపకారమో జరిగి ఉంటుంది. దానికి పరిహారం యేమిటంటే తిరిగి నీ వలన నష్త పోయిన వారిని యేదోలా ఆదుకోవడం..లేదా అది వీలు కాక పోతే అవసరం లో ఉన్న మరొకరికైనా సాయం చేయడం. ఇదే హేతుబద్దమైనదని విజ్ఞులెవరైనా ఒప్పుకుంటారనే భావిస్తున్నాను. కానీ దీనిని కాకుండా గుడికి వచ్చి తలనీలాలు ..అర్పించుకోడం..లాంటివి చేయడం వలన యెవరికి లాభం...నాకేమని అనిపిస్తుందంటే దీంట్లో ఉన్న ఒకే ఒక సౌలభ్యం వలన ప్రజలు యీ పద్దతిని అమోదించేసారని. అదేమిటంటే నీవు అపచారమో ..లేక అన్యాయమో చేసినట్టు యెవరికీ తెలియకుండానే నీ పాప పరిహారం జరిగిపోతుంది...యీ పద్దతిలో. అందుకు యీ గుళ్ళ చుట్టూ మహాత్యాల కధలు సృష్టించబడ్డాయి ...వాటినే నమ్ముకుంటూ మనం మాత్రం సమాజాన్ని అధోగతిలోకి నెట్టుతూనే ఉన్నాం.


మనమెంత పాపమో లేక అన్యాయమో చేసినా  కూడా దాని  పరిహారం సమాజానికి యే మాత్రం జవాబుదారీ తనం వహించకుండానే జరిగిపోతోంది...ఆహా యెంత గొప్ప సౌలభ్యం..యీ విధమైన సౌలభ్యం మిగిలిన మతాలలో ఉందో లేదో తెలియదు కానీ యీ విధమైన సామాజిక, తాత్విక చింతన ఖచ్చితంగా మనను ఖచ్చితంగా పాతాళానికి గెంటుతూనే ఉంది. పుణ్య సాధనకు గుడికి వెళ్ళి పూజలు చేసే వారిని, తల నీలాలు అర్పించుకునే వారిని నేను యే మాత్రం ఆక్షేపించను యెందుకంటే అది వారు నమ్మిన ధర్మం లో భాగం.


ఒక సారి మా అమ్మాయి ఇంటర్మీడియేట్ పరీక్షలు ప్రారంభానికి ముందు హాల్ టికెట్స్  గుడికి తీసుకెళ్ళి పూజ చేయిస్తున్నారు నాన్నా  నేను కూడా వెళ్తాను అన్నది. ణేను ఒక్క విషయం తనకు అర్ధం అయ్యేలా చెప్పాను. మార్కులకి పూజకు సంబందం పెట్టకు ..నీకు వేరే వారి అక్రమాల వలన అన్యాయం జరగకుండా చూడమని మాత్రం ప్రార్దించు. ఇంకొక విషయం యేమిటంటే అక్రమం జరిగ్తుందని ఒక వేళ నీకు తెలిస్తే దాని నివారణకు మార్గం దేవుడిని అడగకు. పోరాడడం మన పని. ఒక విషయం నాకు అర్ధం కాని దేమిటంటే మనం మన తలిదండ్రుల మీద భారం తగ్గించాలంటే వాళ్ళు చేస్తున్న పనిలో  భాగస్వాములవుతాం. అదే విధంగా మనం నిజంగా భగవంతుడిని పూజించాడం కంటే ఆయన చేయవలసిన పనిలో భాగస్వాములమైతేనే ఆయన సంతోషిస్తాడని అనిపిస్తుంది. కాబట్టే ప్రజల నుండి వసూలు చేసిన సొమ్ముతో గుడి కట్టిన రామ దాసు కంటే ఆ విధంగా చేసిన ఆయనను జైలులో వేసిన తానీషాయే గొప్పవాడిగా  కనిపిస్తాడు.
యీ క్రింది మెయిల్ ఇప్పటికే చాలా మందికి వచ్చి ఉంటుంది ..మరి పోరాటం యెలా మొదలవుద్దో చూద్దాం.
     


        








14, ఆగస్టు 2011, ఆదివారం

నా అందమైన కల -సాఫల్యం

నాకొక అందమైన కల ఉండేది . ఏమో కొంత మంది పిచ్చి కల అని కూడా అంటారేమో..... 

ఒక చక్కటి కాలనీ ..అంటే అది కాలనీ లా ఉండ కూడదు. ఒక చక్కటి తోటలో ఇళ్ళు పేర్చి నట్లుగా ఉండాలి. ఆ ఇళ్ళుకూడా భారీ కాంక్రీట్ భవనాలు కాదు. అవసరానికి సరి పడా ..హోం అనే పదానికి పర్యాయపదం గా ఉండాలి. ఇంటి చుట్టూచక్కటి చెట్లు...విరిబూస్తున్న పూవులు...చెట్లకు కాస్తున్న పళ్ళు.... ఆకు కూరలు ఒక పక్కన...కాయ గూరలు ఒకపక్కన...కార్లు అన్నీ కాలనీ బయటే పార్కింగ్ ...ఒక్క నడవలేని స్థితి లో ఉన్న వారికే కారుతో కాలనీ లోకి ప్రవేశించేసౌకర్యం .....కాలనీ లో తిరగడానికి కాలి నడకే సాధనంగా ఉండాలి..లేకుంటే సైకిల్ .... 



ఇంతేనా...ఇంకా చాలా ఉంది ....ఎవ్వరూ ...రెండో అంతస్తు మించి కట్ట కూడదు. ఆ కాలనీ లో పవర్ అనేది  ప్రాబ్లం గా ఉండకూడదు. కిచెన్ వేస్ట్ దగ్గర నుండి ప్రతి డిస్పోసబుల్ మెటీరియల్ బయో గాస్ ఉత్పాదనకు వినియోగించాలి. మంచినీళ్ళతయారీ ..అంతా...సోలార్ సిస్టం తో నడవాలి. నీళ్లన్నీ వృధా కాకుండా రీ సైకిల్ చేసి మొక్కలకోసం వాడాలి. సర్ఫేస్ నీరు    తప్ప గ్రౌండ్ వాటర్ జోలికి వెళ్ల కూడదు. ముఖ్యమైన విషయం ప్లాస్టిక్ వస్తువేదీ కాలనీ లో కనబడ కూడదు. పిచ్చిబాగా తలకెక్కిందనుకుంటున్నారు కదా...లేదు ఇంకా మోకాలి దగ్గరే ఉంది.... 
ఏ.సి. వాడితే కాలనీ లో గాలి వేడెక్కే అవకాశం ఉంది కాబట్టి వాటి పైన నిషేధం ఎలాగూ ఉంటుంది. మరి వేసవి తాపాన్నితట్టుకోడం ఎలా...దానికి కూడా సమాధానం ఉంది...గ్రీన్ హౌస్ కాన్సెప్ట్ తో .....స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ,కొచ్చిన్ వారుసూచించిన విధంగా గాలి వెలుతురూ ..ధారాళంగా వచ్చే విధంగా ....కేవిటీ గోడలు మరియు పైకప్పు వేసి..ఆ పైన ఇటుకముక్కలు ..సున్నం కలిపి..ఒక పొరగా వేసి..దాని పై న సూర్య రశ్మి లోని రేడియేషన్ ని తగ్గించగల తెల్లటి రిఫ్లెక్టింగ్ టైల్స్వేసుకుంటే నిస్సందేహంగా ఇంట్లో ౩౦ డిగ్రీలు మించి వేడి ఉండదు. వేడి తక్కువగా ఉన్నప్పుడు ఒక మామూలు ఫ్యాన్సహాయంతో ఉక్క పోతను తట్టుకోవచ్చు. పిచ్చి నడుము దాకా...వచ్చింది కదా......మిగిలింది చూద్దాం.
కాలనీ లో ఏ మతానికీ సంబందించిన ప్రోగ్రామ్స్ జరగ కూడదు. లో లోపల ఏ మతాన్ని అభిమానించినా బయట మాత్రంఒకే కామన్ మతం. మానవతా వాదం. మైక్ గోల అనేది ఉండ కూడదు. మరీ అంత మూర్ఖత్వమా....అనుకుంటున్నారా...మతానికి సంబందించని....ఒక గొప్ప కళాకారులకి మాత్రం అందరి అనుమతితోప్రోగ్రాం ఎరేంజ్ చేయవచ్చు...దానికోసం చక్కని ఆడియో సౌకర్యం ఉండే ధియేటర్ ఉండాలి. దానికి ఆనుకొనే ఒక చక్కటిలైబ్రరీ ఉండాలి. దానిలో చక్కటి పుస్తకాలతో బాటు.. అనేక ఉచిత"ఈ "బుక్స్ చదువుకొని డౌన్ లోడ్ చేసుకొనేసదుపాయం..(రుసుము వసూలుతోనే ..) ఉండాలి. లైబ్రరీ కి వచ్చినా రాక పోయినా ...దానికి అయ్యే ఖర్చు మాత్రంఅందరి మీదా పడుతుంది. ప్రతి నెలా ఒక రోజు ప్రపంచ గతిని మార్చి వేసిన మహనీయుల పుస్తకాల మీద చర్చ లుఉంటాయి. ఉత్తమ ఉపన్యాసకుడికి పుస్తక బహుమతి లాంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా కాలనీ వాసులుఅందరూ భరించాలి. అంతే కాదు బయట ప్రదర్శితం కాని ఉత్తమోత్తమ చలన చిత్రాలను కూడా కాలనీ వాసులకి అందుబాటులో ఉంచాలి. 

 వయో బేధం లేకుండా అందరికీ  శారీరక వ్యాయామాలు చేసే సదుపాయం ఉండాలి. తక్కువ ఖర్చుతోనే ఉల్లాస్సాన్నిచ్చే  వాలీ బాల్, బాడ్మింటన్ లాంటి క్రీడలకు ప్రత్యేక ప్లే గ్రౌండ్ ఉండాలి.
 నేనేమన్నా ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నానేమో తెలియదు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద  రియల్ ఎస్టేట్ వెంచర్స్ యొక్క ప్రకటనలు ఒక్క సారి చూస్తే నావేమీ గొంతెమ్మ కోర్కెలు కావని సులువుగా ఎవరికైనా అర్దం అవుతుంది. క్లబ్ హౌస్ ..జిమ్...స్విమ్మింగ్ ఫూల్స్ ఒకటేమిటి మనలను ఫూల్స్ చేసే సమస్తం అందులో కనబడతాయి. ఈ ఏడ్స్ చూస్తున్నప్పుడు నాకేదో వెలితి ఉన్నట్లుగా అనిపించేది. ఇవన్నీ ఆ యా కాలనీ వాసులని ఆత్మీయంగా ఉంచుతాయా...ఎవరి మానసిక ప్రపంచంలో వారిని బ్రతికేలా చేస్తాయా....అలోచించి నాకంటే తెలివైన వారు చర్చిస్తే బాగుంటుంది. 
   నేనెప్పుడు సెలవులకి వూరికి వెళ్ళినా మా నాన్న గారు.."ఏమిటోరా ...జనం ఎవరూ కలవడం లేదు..ఏమీ తోచుబడి కావడం లేదు " అంటూనే ఉంటారు. మరి ఇంట్లో టీవి తో సహా అన్ని సదుపాయాలూ ఉన్నాయి. నాకర్దమైన విషయం ఏమిటంటే మనం టీవీ లో ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా చూడొచ్చు. అంటే మనం కేవలం ప్రేక్షకుడి గానే మిగిలిపోతాం.మన ఆలోచనలన్నీ మన లోనే ఇమిడి పోతుంటాయి. సమాజం లో అసలు ఇబ్బంది అక్కడే కనిపిస్తుంది. మామూలుగా ఉండవలసిన సోషల్ interaction  ఉండడం లేదు. కేవలం కొన్ని స్పెషల్ ఫంక్షన్ లోనే కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కాస్త సమయం లోనే లేని పోని భేషజాలు ప్రదర్సిస్తున్నాం. ఇదంతా చూసి చూసి....నాలో పైన చెప్పిన కల ప్రారంభమైంది. 
 దీని గురించి అలోచిస్తున్నప్పుడే అనుకోకుండా మా మామయ్య తన మనసులో ఉద్దేశ్యం చెప్పాడు. గనులు తవ్వడం పూర్తవ్వగా మిగిలి పొయిన గోతులలొ మంచి మట్టి నింపగా ఇంచు మించు నాలుగు యెకరాల ఖాళీ స్థలం యెర్పడిందనీ..దానిలో యేదైనా నేచురోపతి కి సంబందించిన ఆశ్రమమేదైనా కట్టాలనున్నదని చెప్పాడు . నాకెందుకో ఇది జరిగే పనేనా అనిపించింది. కానీ తనే పది సార్లు ఫోన్ చేసేసరికి నెమ్మదిగా ఒక్కొక్కటీ డిజైన్  చేయడం ప్రారంభించాను. ప్రారంభించిన కొద్ది రోజులకి బ్రోచర్  వేయడం జరిగింది.దానిని చూస్తే నా కలలు కొన్నైనా నెరవేరే  సూచనలున్నాయని మీరే ఒప్పుకుంటారు. 

పైనున్న బొమ్మ బ్రోచర్ మొదటి పేజ్ . యీ క్రింది పేజ్ యోగా హాల్ కి సంబందించినది. దీనిలో మొదటి అంతస్తు అన్ని హంగులతోనూ పూర్తికావస్తోంది. పక్కన ఇచ్చిన సమాచారం 100% వాస్తవం.
యీ దిగువన ఇచ్చింది పేషెంట్స్ కు ఇచ్చే గదుల సముదాయం. యీ భవన నిర్మాణం పూర్తయ్యింది.
  అంతే కాకుండా నేను కలలు గన్న గ్రీన్ హౌస్  కాన్సెప్ట్ 
తో కట్టబోయే కాటేజ్ లు కొద్ది రొజుల్లోనే రూపు దిద్దుకోబొతున్నాయి. అనతి కాలం లోనే  యే విధమైన యే.సీ. లు వాడకుండానే మనం చల్లగా ఇంటిని ఉంచగలమని చూపిస్తున్నాము.  వాటి నమూనా  నమూనా క్రింద ఇస్తున్నాను.








నా కలలలో చాల భాగం ఇక్కడ నిజ రూపం దాల్చనున్నాయి. వాటితో బాటు మనకు అవసరమైన ఆయుర్వేద మొక్కలతో ఒక పూర్తి స్థాయి పార్క్  డిజైన్ చేయడం జరిగింది. ఆ మొక్కలన్నీ కూడా జైపూర్ (ఒడిషా) నుండి ఉపలభ్యం కానున్నాయి. వాటి మీద నుండి వచ్చే గాలి కూడా మానవ శరీరానికి  స్వాంతన చేకూరుస్తుంది.
మానసికంగా ఉల్లసం కలిగించడానికి చక్కటి లేండ్ స్కేపింగ్ దిజైన్ చేయబడింది. యీ మొత్తం పనిలో సంకేతికతలో  (టెక్నికల్)    ముఖ్య భూమిక నిర్వర్తించగలిగినందుకు నా కలలే కాకుండా నా జీవితం కూడా సాఫల్యం చెందుతుందని మనసారా నమ్ముతున్నాను. యెందుకంతే మల్తీ స్పెషాలిటీ పేరుతో జరుగుతున్న దొపిడీ కి వ్యతిరేకంగా నా వంతు పాత్ర నేను నిర్వర్తించగలుగుతున్నాను.
యీ మహత్తర ఆశ్రమం 99% దసరా పవిత్ర దినం నుండి ప్రారంభం కావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

యీ ఆశ్రమం  చుట్టూ ఉన్న భూమి చక్కటి కాలనీ  కట్టడానికి యెంతో అనువుగా ఉంతుంది. స్నేహితులు ...ఆప్తులు సహకరిస్తే ...పచ్చటి చెట్లు.... ..రంగు రంగుల పూవులు.....పక్షుల కిలకిలలు.... పిల్లల ఆట  పాటలు...నడి వయస్సు వారి ఆత్మీత తో కూడుకున్న పలకరింపులు...సమాజానికి మార్గ దర్సకత్వం వహించేవారి చర్చలకు కేంద్రంగా....చర్చలే కాదు కార్యాచరణకు  కూడా కేంద్రంగా ..కృత్రిమత్వం అనేది కనుచూపులో లేకుండా ..హేతుబద్దమైన  సాంప్రదాయ  సాంస్కృతిక కార్యకలాపాల నిలయంగా ..పరిసరాలు  చూడ గానే ..."అందమె ఆనందం ..." అనే మధుర గీతాన్ని పెదవుల పైకి తెచ్చే విధంగా ..ఒక కాలనీ నిర్మిచాలని ఉన్నది. అది అందరికీ నచ్చక పోవచ్చు కానీ మహా మానవతా సువాసనలు జీవిత చరమాంకం వరకూ ఆఘ్రాణించాలనుకునే వారికి పూర్తి అనువుగా ఐతే ఉండగలుగుతుంది.

చివరిగా చిరునవ్వుతో ముగిస్తాను. నా అలోచన అంతా విన్న మా బావ మరిది ఒకరు " ఇంతకూ ఆ కాలనీ కి యే పేరు పెడతావు బావా ?" అని అడిగేడు.
"థింకర్స్ కాలనీ అని పెడితే యెలా ఉంటుంది ?" అన్నాను.
" వూరుకో బావా...హేపీ గా డ్రింకర్స్ కాలనీ అని పెట్టు ...నెల రొజుల్లో ప్లాట్స్  అన్నీ నేనే అమ్మించేస్తాను" అన్నాడు
నిజమేనేమో...

4, జులై 2011, సోమవారం

చెక్ బిఫోర్ హెల్ప్.

విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి పలాస వెళ్ళే ఈ ఎం యు బయలు దేరింది . బయలుదేరే స్టేషన్ లో అయితేనే సీట్ దొరికేబళ్ళల్లో ఆ బండి కూడా ఒకటి. మర్రిపాలెం తరువాత దాంట్లో నిలబడడానికి కూడా చోటు ఉండదు. ప్రతి రోజూ కాకపోయినా అప్పుడప్పుడు ఆ బండి ఎక్కడం నాకు అలవాటే. ఇద్దరు కూర్చునే సీట్లో కూర్చుని న్యూస్ పేపర్ తిరగెయ్యడం మొదలు పెట్టాను. బండి మర్రిపాలెం వచ్చింది. జనం పెట్టెల్లో కూరుకోడం ప్రారంభం అయ్యింది. అప్పటికే నాపక్కన ఒక కుర్రాడు కూర్చుని ఉన్నాడు. ఒక వ్యక్తి సుమారుగా ముప్పై సంవత్సరాల వయస్సు ఉండొచ్చు. నుదుటిమీద బొట్టు పెట్టు కున్నాడు...ముఖానికి ఫేస్ పౌడర్ కూడా రాసినట్టు తెలుస్తూనే ఉంది. సరే అతని ముఖంతో నాకేమీసంబంధం లేదు కానీ బోగీ లోకి ఎక్కీ ఎక్కకుండానే నా సీట్ దగ్గరకు వచ్చి " ఇది ముగ్గురు కూర్చునే సీట్ కదా ...జరగండి.." అన్నాడు.
అనుమానమొచ్చి ఒక్క సారి సీట్ వంక చూసుకున్నాను. ఇద్దరు కూర్చునే సీటే. నాకు ఎందుకో అతని దబాయింపుధోరణి నచ్చ లేదు.
"చూడండి..ఇది ఇద్దరు కూర్చునే సీటే.." అన్నాను.
అతడు ప్రయత్నం మానలేదు ." ఐతే నే ఎదుటి సీట్లో ముగ్గురు ఉన్నారుగా.." అన్నాడు.
"మిస్టర్ అది వాళ్ళ ఇష్టం..నేను జరగను" భీష్మించేసాను.
అతడు సణుగుడు మొదలు పెట్టాడు. " అంతేనండి జనాల్లో హెల్ప్ చేసే స్వభావమే ఉండట్లేదండీ..మీరేకూర్చోండి..హాయిగా కూర్చోండి.."
నేను పట్టించు కోలేదు.
పక్కనున్న కుర్రవాడిని అడిగాను నెమ్మదిగా " ఎక్కడ దిగుతావమ్మా..."
"పక్కనే సార్ ..కొత్తవలసలో దిగిపోతాను.."
నెమ్మదిగా నాకే వినబడేటంత నెమ్మదిగా అన్నాడు.
బండి సింహాచలం స్టేషన్ కు వచ్చింది.
ఒక ముసలి దంపతులు ఎక్కారు.
పక్కకు జరిగి " మీరిద్దరూ కొంచెం సర్దుకు కూర్చోండి ..పక్క స్టేషన్ లో ఈ కుర్రాడు దిగిపోతాడు ..అప్పుడు మీరురిలాక్సేడ్ గా కూర్చోచ్చు .. " అన్నాను.
వాళ్ళిద్దరూ బోల్డు సంతోష పడి పొయ్యారు.
"ఒరేయ్..ఎవరికి సహాయం చెయ్యాలో చూసుకొని చెయ్యడం నేర్చుకోండి ..అంకుల్ ని చూసి " అని
ఎదుటి సీట్లో కూర్చున్నావిడ పిల్లలకు చెప్పడం నేను దిగేటప్పుడు
విన్నాను.
ఆ మధ్య వచ్చిన "వేదం " సినిమా లొ బ్రహ్మానందానికి ఒక మంచి పాత్ర ఇచ్చారు. ఒక వేశ్య అడిగిన ప్రశ్నకు అతడు సమాజానికి చేస్తున్న సహాయాల గురించి వివరిస్తాడు. " హాస్పిటల్ లొ ఆపిల్ పంచడం.... " ఇంకా అలాంటివి. నిజంగా చెప్పాలంటే ఆ పాత్ర చాలా సజీవ పాత్రే. మా వీధిలొ మా అపార్ట్మెంట్ దగ్గరే ఒక ఆటో స్టాండ్ ఉంది. వాళ్ళు దసరా ఉత్సవాలు చేస్తూ ఉంటారు. ఒక సారి నేను సెల్లార్ లొ బండి తీస్తుండగా ఒక పక్కనె భారీ యెత్తున జరుగుతున్న వంట యేర్పాట్లను చూసి ఆశ్చర్య పొయ్యాను. చాలా భారీ యెర్పాట్లే. వాచ్ మన్ ని పిలిచి అడిగాను.
"సార్....అన్న సంతర్పణ వంటలు ....ఆటో స్టాండ్ వాళ్ళవే ...యేదో మన సెంటర్ వాల్లే కదా అని" నీళ్ళు నమిలాడు.
నా సందేహం అతడికి అర్దం కాలేదని నాకు అర్దమయ్యింది.
" మరి యీ బిర్యానీ వాసనలు యేమిటి?"
అప్పుడె ఆ స్టాండ్ లొ ఆటో అతడొకదు అక్కడికి వచ్చి నా ధర్మ సందేహాన్ని తీర్చాడు.
"సారూ పాత రోజులు కావు మరి.. యీ మాత్రం లేక పొతె సంతర్పనకు జనం రారు ..జనం రాకపొతే..ఇంతా చేసి...మరి ఉపయోగం యేటి?"
పక్కనే అంటించి ఉన్న పోస్టర్ లొ నుండి స్పాన్సర్ చేసిన నాయకుడి ముఖం నన్ను చూసి నవ్వుతున్నట్లుగా అనిపించింది. వాడు యీ పెట్టుబడి యెందుకు పెడుతున్నాడో నాకైతే తెలుసు. కానీ యీ ఆటొ వాళ్ళకు వాళ్ళు అన్నార్తులకు హెల్ప్ చేస్తున్నారో ...లేక ఆ నాయకుడికి పరోక్షంగా హెల్ప్ చేస్తున్నారో అర్దమయ్యేదెప్పుడో తెలియడం లేదు.
1996 లొ అనుకుంటా.. కోనసీమ లొ భయంకరమైన తుఫాన్ వచ్చింది. మొత్తం కోనసీమ అంత అతాకుతలమై పోయినత్లుగా వార్తలు అన్నిట్లోనూ వచ్చాయి. ఆ రొజుల్లోనే మా రైల్వే ప్రోజెక్ట్ కు ఇండియా లోనే ఉత్తమమైన ప్రోజెక్ట్ గా అవార్డ్ వచ్చి 100000 రూపాయల నగదు బహుమతి కూడా ప్రకటించారు. డానికి విజయవాద లోని వస్త్ర వ్యాపారులు కూదా తమ వంతు సహాయ సహకారాలు అందజేయడంతో ఒక లారీ నిండా దుప్పట్లు వగైరాలు నింపుకొని కోనసీమ లోనే ఉన్న మా బంధువుల వూరికి వెళ్ళాం. మెము అక్కడికి వెళ్ళిన తరువాత అర్దం చేసుకున్నదేమిటంటే అక్కడ మొత్తం వ్యవసాయ పనులు ఆగిపొయ్యాయి. మొత్తం పని చెయవలసిన కూలీలంతా రోద్ మీదే హాయిగా వేచి ఉండి అందుకుంటున్న సామగ్రి విలువ వాళ్ళకు వచ్చే దినసరి వేతనం కంటే యెక్కువ గా ఉంటోంది. అప్పుడె నాకు ఒక సత్యం అర్దమైంది. యే సహాయం కూడా సామాజికోత్పత్తికి దోహద పడేలా ఉండాలి. ఉత్పత్తి యొక్క ఫలితం యెవరి జేబుల్లోకి వెళ్తుందనేది వేరే కోణం లో ఆలోచించవలసిన విషయం. భారతదేశం లోని రాజకీయవాదులకు అభివ్రుద్ది పధకాలకంటే కూడా సంక్షేమ పధకాలంటేనే మోజు యెందుకో నాకు ఒక స్పష్టమైన ఆలోచననిచ్చింది. ఒకడు కాలు పోయి అంగవిహీనత్వంతో రోడ్ పక్కన అడుక్కుంటుంటే నిజంగా వాడిని బాగు చేయాలుకునే వాడు వాడికి మిగిలిన రెండు చేతులతో చేయగల పనిని చూపిస్తాడు. వాడిని అడుక్కునే వాడి కిందే చూడాలనుకునే వాడు వాడికి 10 రూపాయలు దానం చేసి పోతాడు. అభివ్రుద్దికి..సంక్షెమానికి గల తెడా చాలా సూక్ష్మమైంది. ఇది అర్దం చెసుకోలేని వాళ్ళు పిల్లల పెంపకంలో కూడా పొరబాట్లు చేసే అవకాశాలు చాలా యెక్కువ.
మితిమీరిన నిబద్దతను కూదా ఒక విధమైన అర్దం లేని సహాయం క్రిందే పరిగణించవచ్చు. ఏ విషయమైనా జీవితంలో తక్షణ ఫలితాలనివ్వవు. యీ రొజు నీవు నాటిన విత్తనం యే ఫలితాన్నిస్తుందో తెలుసుకుంటానికి ఖచ్చితంగా కొంత వెచి చూడవలసి వస్తుంది. ఒక చిన్న ఉదాహరణతో ప్రారంభిద్దాం. నాకు తెలిసిన ఒక అమ్మాయి భయంకరమైన పిసినారితనం తో బ్రతికే కుటుంబంలో పుట్టి పెరిగింది. కొన్ని పరిస్థితులు తారుమారు కావడం వలన అనుకోకుండా ఆ అమ్మాయి ఒక ధనిక రైతు కుటుంబానికి కోడలయ్యింది. అదంతా తన భర్త ..అత్తవారి సౌహార్ద్రత వల్లనే జరిగిందని తను మనసారా నమ్మింది. అది నిజం కాదని తెలిసిన నాలాంటి వాళ్ళు ఆ అమ్మాయి దృఖ్పధాన్ని మార్చడానికి విఫల యత్నం చేసాం. తరువాత తన ఖర్మ అని వదిలేసాం. ఆ అమ్మాయి ఎంతో దూరం నుండి మేము వచ్చినప్పుడు కూడా తన భర్త శృంగార జీవితానికి భంగం వాటిల్లుతుందని 9.00 గంటలు కాక ముందే మమ్మల్ని నిర్మొహమాటంగా పొమ్మనేది, త్వరగా పడుకోవాలనే వంకతో.
అప్పట్లొనే నేనొక విషయాన్ని గమనించాను. వాళ్ళకున్న మిగులులో చాలా భాగం ఆయన ఖర్చులుకే పొయ్యేది. అది నాకేదో అసంబద్దంగానే అనిపించి చెప్పి చూసాను కూడా. అప్పుడప్పుడు కొనే చీరలను చూసుకుని మాత్రం యీవిడ మురిసిపొయ్యెది కానీ యీ అసంబద్ద పంపిణీ గురించి అలోచించేది కాదు. ఆఖరికి సంతానం చదువుల గురించి ఖర్చు చెయవలసిన డబ్బు కూడా తన భర్త ఖర్చుల కోసం వాడుకున్నప్పుడు కూడా ఆమె ప్రతిఘటించలేదు. యీ వాతావరణం మొత్తానికి సంతానంలో యే విధమైన దృఖ్పధాన్ని పెంచాయంటే మన సుఖాన్ని గురించి మనం అలోచించుకోవాలి కాని అది మొత్తం మీద కుటుంబానికి ఎలాంటి నస్టాన్ని కలుగచేస్తుందనేది పట్టించుకోవడమే మానేసారు.
మన దేశ పరిస్థితికి యీ ఆలోచనకు కొంత సారూప్యత కనిపిస్తుంది. మితిమీరిన విశ్వాసంతో చేసే సహాయాలు కూడా చాలా వరకూ ఇలాంటి ఫలితాలనే ఇస్తాయ్. సహాయం చేసే లక్షణమే కరువవుతున్న యీ రోజుల్లో (పైన చెప్పిన "వేదం" సినిమా లోని బ్రహ్మానందాన్ని పోలిన రాజకీయ వాదులను లెక్కలోకి తీసుకోకూడదు). అందువలన సహాయం చేస్తున్నది సరైన పనికే అని నిర్ధారించు కోడం చాలా అవసరం. ఆడిగారు కదా అని అందరికీ "వినాయక చవితి" "దసరా" పందిళ్ళకు చందాలిచ్చి వాళ్ళు వేసిన పందిళ్ళ వల్ల ట్రాఫిక్ కదలక తిట్టుకొనే జనాన్ని చాలా మందిని ఇక్కడ చూస్తూ ఉంటాను.
మనకు కొన్ని విశ్వాసాలుండవచ్చు. అందరికీ అవే ఉండాలని కోరుకోవడం మూర్ఖత్వం అవుతుందని చాలామందికి తెలియదు. అలాగే యెవరి జీవితమైనా (కుటుంబ,వ్యక్తిగత) వారి వారి భౌతిక పరిస్థితుల వలన యేర్పడిన అలోచనల వలనే వస్తాయన్న వాస్తవాన్ని విస్మరించి తనకున్న విశ్వాసాలకు భిన్నంగా నదిచే వారి మీద దుమ్మెత్తి పోయడానికి కూడా యీ " హెల్ప్' లేదా "గైడింగ్" అనే పదాలను బాగా వాడుకొంటుంటారు. నేను పైన చెప్పిన అమ్మాయి ఇంటికే ఒక సారి చుట్టపు చూపుగా వెళ్ళాను. ఆ ఇంట్లోకి ప్రవెశించడం తోనే ఆవిడ ఆకస్మాత్తుగా
" యేంటి పక్కింట్లోనికి చూసుకుంతూ వస్తున్నావ్?" అని అడిగింది.
నెను కొన్ని సంగతులు అప్పటికే విని ఉండడం వలన యాదాలాపంగానే అడిగాను
"యెందుకలా అడుగుతున్నావు?"అన్నాను
"యెమీ..లేదు..మా ఇంటికి వచ్చే వాళ్ళంతా ..ఆ ఇంటి వైపు చూసుకుంటూ వస్తారులే.." వేళాకోళంగా అన్నది.
" యీ విషయాన్ని మీ అన్నా ..తమ్ముళ్ళకు కూడా చెప్పి హెచ్చరించినట్లున్నావ్?" కొంచెం కోపంగానే అన్నాను.
"అవును బాబూ...లేకపోతే ...అందరికీ పెళ్ళిల్ళు కానక్కరలేదా..."
నాకు కోపం నసాళ్ళాన్నంటింది
" ఆవిడను నేను చూడ లేదు....కానీ నాకంతా తెలుసు. బుద్ది లేని తలిదంద్రులు వాళ్ళ అవసరం కోసం కని ...ఒక వెధవకు అంట గట్టి చేయిదులుపుకున్నారు...కట్టుకున్న వెధవ..వెనుకా ముందూ అలోచించుకోకుండా తీర్చుకున్న వాంచల వలన ..ముగ్గురు పిల్లలు పుట్టారు....వాడి వలన పైసా ఆదాయం లేదు. కన్న పాపానికి ఆ పసి పిల్లలను యేదోలా బ్రతికించుకోవాలి. కానీ ఆమెకు వేరే దారి తెలియదు. ఆవిడ చేస్తున్న పని మంచిది కాకపోవచ్చు.. పెద్దలు సంపాదించి ఇచ్చింది తింటూ ఖాళీగా కూర్చుని..గంటల తరబడి చీరల గురించి ..నగల గురించి సొల్లు చెప్పుకొనే బదులు నీలాంటి ఆడవాళ్ళు ఆమె మీద రాళ్ళు వేసే బదులు ఆవిడకు యెదైనా దారి చూపించండి. అసలు నా దృష్టిలో ఆవిడ మీలో చాలా మంది కంటే పతివ్రతే..."
ఆవిడకు పెద్దగా పట్టలేదు...అది వేరే విషయం.
చాలా సార్లు మనం చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా పెద్ద విషయాల గురించి మాట్లాడతాము. ఎంతో మందికి ఇబ్బంది కలిగించే పని కొంత మంది వలన అవుతున్నా సరే నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంటాం. నేను పైన చెప్పిన ట్రైన్ లోనే ఒక సారి ప్రయాణం మొదలుపెట్టాను. నేను కూర్చున్న కంపార్ట్మెంట్ అంతా ఒకే చోటికి వెళ్ళే ప్రయాణీకులతో నిండి ఉంది. అంతవరకూ ఇబ్బంది లేదు కానీ ట్రైన్ బయలుదేరక ముందే ఒకతను " హలో...మైక్ ..టెస్టింగ్" అంటూ మైక్ ఆన్ చేసాడు. నాకేదో అనుమానం తోస్తూనే ఉంది. అయినా నాకెందుకులే అనుకుంటూ పేపర్ లో దూరి పొయ్యాను. ట్రైన్ బయలు దేరింది. మైక్ పట్టుకున్న వేరే అతడు తెలుగు లాంటి భాషలో ఉపన్యాసం మొదలు పెట్టాడు. అది తెలుగే కానీ బాగా అలవాటు పడితే కాని దానిని అర్ధం చేసుకోవడం కష్టమే. ఆయన ఒక మతం గురించి ఉపన్యాసం మొదలుపెట్టాడు. భరించడం కష్టంగానే ఉంది. నాకైతే ఏ మతం పట్లా ప్రత్యేకించి ద్వేషం ..అభిమానం లేవు. కానీ ఒక పబ్లిక్ ప్లేస్ లో అనేక మతస్తుల మద్య ...ఒకే మతస్తుల గోల ఏంటి ..నా పక్కన కూర్చున్న అతడిని అడిగాను
" చూడు బాబూ మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు?"
" దేవుని సేవకు..." క్లుప్తంగా చెప్పాడు.
" ఇది దేవుని సేవా..?"
అతడు కోపంగా చూసాడు.
నేను లేచి మైక్ పట్టుకున్న అతడి దగ్గరికి వెళ్లి సౌమ్యంగా చెప్పాను.
" మీరు మైక్ కట్టేయండి"
"మీరవరండీ ..అడగడానికి...ఇంట మంది లో మీ ఒక్కరికే డిస్టర్ బెంసా ..."
ముగింపుని అతడే కొని తెచ్చుకున్నాడు.
జనం అంతా అప్పటి వరకూ ఉగ్గ బెట్టుకుని చూస్తున్న వాళ్ళ కందరికీ ఈ సమాధానం కారం రాసి నట్లుగా అనిపించింది..
ఆ తరువాత వాళ్ళు మైక్ కట్టక తప్ప లేదు.
సమాజం లో మనం చేయగలిగింది మనం చేస్తే చాలు చాలా ఉపయోగం చేసినట్లే. అన్నదానాలు..ఇతరత్రాలు..పేపర్లో వేయించుకొనే దురద ఉన్న వాళ్లకి ...రాజకీయాల్లోకి వెళ్ళాలను కొనే బ్రోకర్ గాళ్ళకి పనికి వస్తాయి.
కొన్ని కొన్ని సహాయాలు ఎవరికి....... ఎందుకు......అనేది చేసే వాళ్లకు కూడా ఒక అంచనా ఉండదేమో అనిపిస్తుంది. ఉదాహరణకు నేను గత కొద్ది కాలంగా మా ప్రాజెక్ట్ నడుస్తున్న ఏరియా లో జరుగుతున్న "పనికి ఆహార "పధకాన్ని గమనిస్తూనే ఉన్నాను. ఉదయం పది గంటలకు పని లోకి వెళ్ళిన శ్రామికులు మధ్యాహ్నం తిరక్కుండానే ఇళ్ళకు వచ్చేస్తుంటారు. కనీసం ఇచ్చిన జీతానికి పని చేయించు కోలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం ఈ పధకం పెట్టింది ఎందుకో అర్ధం కాదు. పైగా ఆ సీజన్ లో వ్యవసాయ పనులు కూడా బాగానే ఉంటాయి. రైతులకు పనివాళ్ళు దొరకక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ రెండు విషయాలు స్పష్టంగా కనబడుతాయి. ఒకటి పూర్తి శ్రమను వినియోగించుకోకుండానే వాళ్ళ కోసం ప్రజా ధనాన్ని వెచ్చిస్తున్నాం. అదే సమయం లో శ్రామికులు లేక వ్యవసాయ ఉత్పత్తి దెబ్బ తింటోంది. నేను గమనించిన మరో విషయం ఏమిటంటే ఈ పనికి ఆహార పధకం స్కీం నడుస్తున్న రోజుల్లో వైన్ షాప్స్ ఫుల్ కలక్షన్లతో ఉంటాయి. అంటే మొత్తానికి మొత్తానికి ప్రజా ధనం ఎక్కడకు ప్రవహిస్తుందో అర్ధం అవుతుంది. కేవలం సంక్షేమ పధకాలకు జనాలు అలవాటు పడేలా చేస్తున్నారు. ఎవరైనా పూనుకొని ప్రభుత్వాలు అభివృద్ధి పధకాలకు యెంత ఖర్చు చేస్తున్నారు...సంక్షేమ పధకాలకు యెంత ఖర్చు పెడుతున్నాయి..లాంటి లెక్కలు తీసి ఈ విధంగా జరుగుతూ ఉంటే చివరికి నష్ట పోయే దెవరు? లాంటి విషయాలు ప్రజలకు అర్ధం అయ్యే విధంగా లెక్కలు తయారు చేస్తే బాగుంటుంది. అసలు ప్రతి సంవత్సరం ఎక్షైజ్ ఆదాయం ఎందుకిలా పెరిగిపోతుంది....ప్రజల ఆదాయ వనరులు పెద్దగా పెరగకుండా అనేది ఎవరూ పట్టించుకోవడం లేదు. చదువుకున్న వాళ్ళు..చదువుకుంటున్న వాళ్ళు ఇలాంటి విషయాల మీద ప్రజలను చైతన్య వంతులని చేస్తే వాళ్ళ వంతు కర్తవ్యం వాళ్ళు నిర్వర్తించి నట్లవుతుంది అంతే గాని ఐ పీ ఎల్ మాచ్ స్టాటిస్టిక్స్ ..కాదు ఈనాడు కావలిసింది.

మనం సహాయం చేయడం వలన ఏదైనా సమస్య సంపూర్ణంగా సమసి పోతుందా లేదా అని కూడా చూసుకొంటూ ఉండాలి. ఉదాహరణకు ఒక మేన్ హోల్ చోక్ అయ్యి ఆ చెత్తంతా రోడ్ మీదకు పొర్లు తున్నప్పుడు కేవలం దానిని మాత్రం శుభ్రం చేస్తే లాభం ఉండదు. ఆ మేన్ హోల్ ఎందుకు చోక్ అయ్యిందో చూసి దానిని నిర్మూలించే వరకూ ఆ సమస్య పరిష్కారం కాదన్న వాస్తవాన్ని నీవు చాలా ముందుగానే గ్రహించడం చాలా అవసరం. లేదంటే నీ శ్రమ చాలా వేస్ట్ అవుతుంది. వీధి గూండాలుగా ఉన్న వాళ్ళు ,బ్రోకర్ గా ఉన్నవాళ్ళు ..కొంత ఖాళీ టైం ఉండి నెమ్మదిగా రాజకీయ వాదులుగా మారి పదవులు వెలగ పెట్టి అతి లగ్సరీ జీవితం అనుభవిస్తున్నప్పుడు మనకేమీ చీమ కుట్టినట్టుగా అనిపించదు. పేపర్లో స్విస్ బాంక్ ఖాతాలను చూసి ఆవేశం తెచ్చేసు కుంటాం. వాటికి వ్యతిరేకంగా ఏదైనా ర్యాలీ జరిగితే వెళ్ళం. వాటంతట అవే జరగాలని ఆశిస్తూ ఉంటాం. మన యొక్క ఉదాసీనత వలనే స్విస్ బాంక్ లోకి ఈ ధన ప్రవాహం జరిగిందనేది వాస్తవం కాదా..? అంటే పోరాటం మన ఉదాసీనత మీద కూడా చెయ్యాలి కాదా..కానీ ఇక్కడితో ఆగకండి. అసలు ఇంత ఉదాసీనత ఏర్పడటానికి వెనుక ఉన్న మన సాంస్క్రతిక ,తాత్విక మూలాలు ఏమిటి? ఒక్క సారి మన పురాణ గాధలు చూడండి. మనం చేసిన ప్రతి తప్పు పనినీ ఏదోలా సమర్ధించుకోనే అవకాశాలు కోకొల్లలు. మన తాత్విక మూలాలు అర్ధం చేసుకుని వ్యాఖ్యానించిన ఆనాటి మేధావులని విదేశీ తొత్తులుగా చూసాం. క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాల నుండి నేటి వరకూ ఉన్న ఆలోచనలన్నిటినీ మనం పొరలుగా మన దగ్గరే ఉంచేసుకుంటాం. అవసరమైనప్పుడు ఏ పొర మనకు వీలుగా ఉంటుందో ఆ పొర లోకి ఇమిడి పోతాం. పెళ్లి రోజు వచ్చిందనుకోండి. ఉదయాన్నే దేవుడి గుడికి వెళ్తాం. ఎందుకైనా మంచిదని ఎవరికీ కోపం తెప్పించ కుండా ఇద్దరు ముగ్గురి దేవుళ్ళ గుళ్ళకి వెళ్తాం. ఏ విషయం మీదా పరి పూర్ణమైన నమ్మకం ఉండదు. మాకు బంధువులైన కుటుంబాలు కొన్ని ఉన్నాయ్. వాటిలో ఆడవాళ్ళను చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు రెండే పనులు చేస్తారు. ఒకటి పేకాట ఆడతారు. లేకుంటే సాయి బాబా భజనలు చేస్తారు. మధ్యలో మరే ఏక్టివిటీస్ ఉండవు. ఎన్ని పొరల అంతరం..... ప్రతి మనిషి లోనూ లేదా సమాజం లోనూ మెటీరియలిస్టిక్ , ఐడియలిస్టిక్ భావజాలం ఏదో కొంత శాతం కలిసే ఉంటాయి..కానీ ఆ విభజన రేఖ చాలా స్పష్టంగా కనబడుతుంది....కానీ ఇక్కడ ఈ పొరల మాయ వలన ఆ రేఖలో ఉన్న గజిబిజి మరెక్కడా ఉండదేమో..ఇదంతా ఎందుకు రాయవలసి వస్తుందంటే నీవు దేనినైనా గెంటే అవసరం ఉన్నప్పుడు నీ క్రింద నేల గట్టిగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే నీవు అప్లయ్ చేసిన ఫోర్స్ ఎటువైపు వెల్లుతున్నదనేది నీకే అర్ధం కాదు. ఉదాహరణకు నల్ల డబ్బు కి వ్యతిరేకంగా చాలా మంది ఉద్యమాలు మొదలుపెడుతున్నారు. నీకు సరైన దృక్పధం లేక పోతే ఒక సామాజిక కార్య కర్త వెనుక వెళ్ళడం మానేసి ....యోగా నేర్పడానికి ఒకే క్లాసు లో ముందు వరసకు వెనుక వరసకు వేరు వేరు రేట్లు పెట్టి ఇంకా రక రకాలుగా ఆనతి కాలంలో వేల కోట్ల రూపాయలు సంపాదించిన బాబా వెనుక వెళ్ళే ప్రమాదం ఉంటుంది. ఇక్కడొక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. శారీరక ఆరోగ్యానికి యోగా చెయ్యడం మంచిది. కానీ మొత్తమ్మీద ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. అది స్పష్టంగా ఉండే నీ తాత్విక దృక్పధం మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి అనవసరమైన పొరలన్నీ తొలగించి..నీకు..నీ కుటంబానికి ... ప్రస్తుత సమాజం లో అధిక శాతం మందికి ఉపయోగ పడగలిగే భావజాలాన్ని పెంచే పొరలను మాత్రమే ఉంచుకొవాలి. పురాణాల ప్రభావం వలన మన హేతుబద్ద  అలోచన లొ కూడా కొన్ని కొన్ని సార్లు బ్లాక్స్ యేర్పడతాయి. చిన్న ఉదాహరణ చూద్దాం. సినిమా లలో ఒక హీరోయిన్ ను విలన్ టీజ్ చేస్తుంటే మనకు సహజంగానే అతడి మీద కోపం వస్తుంది.  కానీ అదే పనిని హీరో చేస్తే మనకు ఆ కోపం రాదు. యెందుకంటే  మనం మానసికంగా హీరో పక్షంలో ఉంటాం. అంటే ఒకే పనిని ఇరువురు వ్యక్తులు చేస్తే వారిరువురి మీదా మనకు ఒకే రక మైన ఫీలింగ్స్ రావడం లేదు. సమాజంలో కూడా యిది అనేక రకాలుగా ప్రభావం చూపిస్తుంది. మనం ఒక విషయాన్ని ,సపోర్ట్   చేసేటప్పుదు కానీ ...వ్యతిరేకించేటప్పుదు కానీ యీ బ్లాక్స్ లేకుండా చూసు కోవడం చాలా ముఖ్యం.
అదే మాదిరిగా మనం హెల్ప్..అనో..సానుభూతి అనో మనం చేసే  కొన్ని అలోచనలు తరతరాల నుండీ స్త్రీ జాతికి శాపం  అయ్యి కూర్చుంటుంటే దానిని దిశ మర్చే విధంగా యెవరూ చూడడం లేదు. యేదో ఒక సాధారణ సినిమా ను తీసుకుందాం. దానిలో కధ ప్రకారం ఒక అమ్మాయి మీద యెవడో వెధవ  అఘాయిత్యం చేయబోతాడు. ఆ అమ్మాయి తనను రక్షించు కొనే ప్రయత్నం లో అతడి ప్రయత్నాన్ని తీవ్ర స్థాయి  లోనే ప్రతిఘటిస్తుంది. షరా మామ్మూలుగా హీరో రంగ ప్రవేశం చేసి వాడిని తన్ని తగిలేస్తాడు. ఆ అమ్మాయి  కృతజ్ఞతగా "నా మానాన్ని కాపాడావు..థాంక్స్ " లాంటి డైలాగ్స్ చెబుతుంది. మనం వినేసి ఆనందించేస్తాం. ఇక్కడ గమనించవలసిన విషయం యేమిటంటే ప్రతిఘటించే  ప్రయత్నంలో ఆ అమ్మాయి ఒళ్ళంతా గాయాలైనా పెద్దగా అఘాయిత్యం జరగలేదనే మనం భావిస్తాం.  కానీ దురదృష్ట వశాత్తూ ఆ ఒక్క శరీర   భాగం మీద అఘాయిత్యం జరగ్గానే సర్వస్వం కోల్పోయినట్లుగా ఆ అమ్మాయి..సమాజం....భావించేసి సహాయానికి కంకణం కట్టుకుని తయారైపోతారు. అసలు "శీలం"... "మానం" అనే పదాలకు అర్దం తీసిన వాళ్ళని వురి తీసినా తప్పు లేదని నా అభిప్రాయం. మానం అనేది ఒక వస్తువు గా చేసి కొల్పోతే తిరిగి పొందలేమన్న వికృత అలోచన మీద మరింత విస్తృత చర్చ జరిగితే బాగుంటుంది.        


29, మే 2011, ఆదివారం

ఇలాగూ బతకొచ్చు

చదివే ముందు ఒక చిన్న విన్నపం ....సి అనేది ఒక ఉదాహరణ గానే తీసుకున్నాను కానీ .సి లు వాడే వారందరినీ విమర్శించాలని మాత్రం కాదని అర్ధం చేసుకోగలరు...

"
చూడమ్మా..హరి బాబూ....అక్కడెవరో...చేపలు పడుతున్నలున్నారు....." బ్రిడ్జ్ దగ్గర నుండి దూరంగా చేపలుపడుతున్న వాళ్ళను చూసి అడిగాను.
నేను అన్నదే తడవుగా మా సూపర్వైజర్ హరి బాబు రెచ్చి పొయ్యాడు.
"అవును సార్... నిజంగానే ...పట్టేస్తున్నారు...నా కొడుకులు'
నా ఉద్దేశ్యం అతనికి అర్ధం కాలేదని నాకు అర్ధమయ్యింది.
" చూడు వాళ్ళు పట్టుకుంటే పట్టు కొనియ్యి ..కానీ ఒక్క సారి వాళ్ళని ఇటు పిలు ..కొంచెం మాట్లాడాలి..." వాళ్ళతో నేనేడీల్ చేస్తే బాగుంటుందని అనిపిచ్చింది.
పట్టిన చేపల బుట్టలతో వాళ్ళు వచ్చారు.
" చూడండి బాబూ మీ దగ్గర ఏమేం ఉన్నాయి....'
వాళ్ళు భయం భయం గానే ఒక ఖాళీ సిమెంట్ సంచి మీద మొత్తం ఓంపారు.
ఫ్రెష్ గా పట్టినవి కాబట్టి మిల మిల మెరుస్తున్నాయి.
" పెద్దవి ఏమీ పడ నేదు బాబూ"
సంజాయిషీ గానో ....మీకు పనికి రావట్టుగా అన్నారు
కానీ నిజానికి నాకు కావలిసింది అలాంటివే.....సెలవులుకి వచ్చిన మా అమ్మాయికి వాటి కూర చాలా ఇష్టం.

" సరేలే కానీ ఇవన్నీ ఎంతకిస్తారు ..'
వాళ్ళు ఇద్దరూ ముఖ ముఖ ముఖాలు చూసు కొంటున్నారు
" నూట యాభై ఇప్పించండి బాబూ..."
" అమ్మ నాకొడకల్లారా...రైల్వే ఏరియా లో చేపలు పట్టేసి రైల్వే సార్ కే అమేస్తార్రా...' మళ్ళీ మా హరి బాబు కేకలు
నీళ్ళు ....జలచరాలు వాళ్ళవేనని ఇతడికి ఎప్పటికీ అర్ధం కాదని నాకు తెలుసు.
' రెండు కేజీలు ఉంటాయి కాబట్టి ...వంద రూపాయలు ఇస్తాను..."
మా హరి బాబు కి తృప్తి గా లేదు
" సరేలే శుభ్రంగా చేసేసి వెళ్లి పొండి..." ఎంతో కొంత గిల్లిన తృప్తి..పక్క పొలం లో మిరప కాయలు ,టమాటో పంటలు ఉన్నాయి ...వాటిని కూడా తెచ్చి కూర వండేయమని అడగనందుకు సంతోషం కలిగినా అలా వండుకు తింటే యెంత బాగుంటుందని అనిపించింది . చక్కగా పారుతున్న నీరు...చెట్లు...వేడి వేడి అన్నం ..దాని లోకి చేపల కూర....
అసలు మనకు సరిగ్గా మనసు ఉంటె ఎక్కడైనా తృప్తిగా ఉండొచ్చు ..చిన్న పాటి ఆదాయం ఉండాలి గానీ అనిపిచ్చింది..of course కొత్త మోడల్ కార్ల గురించి ...బాలే దీవి లో ఉండే అందాల గురించి అహర్నిశం చర్చించే నా స్నేహితులందరికీ నాది పిచ్చి ప్రేలాపన కిందే అనిపిస్తుంది..
చాలా మందికి అసలు సమస్య అర్ధం కాదు. ఎవరైనా సరే వారికి దేని వలన ఆనందం కలుగుతుందన్న విషయాన్ని సరిగా తెలుసుకో లేక ఎక్కడెక్కడో దేనికోసమో దేవులాడుతుంటారు.కాక పొతే డబ్బుంటే చాలు సుఖం ఉంటుందన్న సిద్దాంతం మాత్రం కామన్ గా అందరిలో వ్యవస్థీకృత మై పోయింది. అసలు అది యెంత వరకు అవసరం ..దాన్ని సంపాదించడానికి మనం ఎన్నుకున్న మార్గాన్ని బట్టే మన సుఖ సంతోషాలు ఉంటాయన్న వాస్తవం చాలా మందికి అర్ధం కాదు.
అందరూ ఇలా ఆలోచిస్తే ఉత్పత్తి అవుతున్న వస్తువులు ఎవరు కొంటారు?..
.నా ఆలోచనా పరిధిని మరి కొంత పెంచుదామని పిస్తోంది..
అసలు మన కొంటున్న వినిమయ వస్తువులు అందరికీ అవసరమే...
కొన్ని వస్తువుల ఉత్పాదనకి ..వాటి వినిమయానికి ...వాటిలో వుండే వైరుధ్యాల గురించి కొంత ఆలోచిద్దాం. రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒక వినిమయ వస్తువుగా అందరూ కొంటున్న .సి గురించి ఒక్క సారి ఆలోచిద్దాం. వేడిని తట్టుకో లేక మనం దీనిని కోనేస్తున్నాం. కానీ అది మన గది లో వేడిని తగ్గిస్తుంది కానీ వాతావరణం లో వేడిని పెంచుతుందా లేదా...అంటే డబ్బులుండి .సి. కొనగలిగే వారి వేడిని అది కొన లేని పేద జనం భరిస్తున్నారన్న మాటే కదా . అంతే కాదు..అవి రిలీజ్ చేసే ఫ్లోరో కార్బన్ కణాల మాటేంటి? దాని వలన నాశనం అవుతున్న ఓజోన్ కణాల వలన వస్తున్న రేడియేషన్ ఫలితాలు ఎవరు భరిస్తున్నారు...ఇవన్నీ ప్రభుత్వాలకు తెలియవా..
నేననేది ఒక్కటే డబ్బున్న వారికి దానిని అనుభవించే హక్కు ఉంది . కానీ దాని వలన వేరే వాళ్ళను ఇబ్బంది పెట్టె అధికారం వాళ్లకు ఎవరిస్తున్నారు? నేను రాసింది ఒక్క ఇంకా చాలా విషయాలకు వర్తిస్తుంది. అకారణంగా కార్లలో కూడా మితిమీరిన . సి. లు వాడడం ఫ్యాషన్ అయి కూర్చుంది. మనం శరీరానికి ...మనసుకి కష్టం వోర్చుకొనే శక్తిని దూరం చేస్తున్నాం. పట్టణాల్లో వృధా చేస్తున్న ఎలెక్ట్రిక్ పవర్ ను పల్లెలకు మళ్ళించాలేమో.... అసలు ఒక ఏ.సి కి ఎన్ని లైట్స్ వెలుగుతాయి? పల్లెల్లో పూర్తి పవర్ సప్లయ్ వుంటే వాళ్ళలో సాగిన వాళ్ళు ..పట్టణాలకు వలస పోయే ఆలోచనలు చేయరేమో...మొత్తానికి వ్యవస్థంతా ఎలా తయారయ్యిందంటే నీకు డబ్బుంటే చాలు ... కష్టం లేకుండా బ్రతికేయ వచ్చు. అందుకే మార్గంలో అయినా సరే డబ్బు సంపాదించడమే అందరి ధ్యేయమై కూర్చుంది. అలా కాకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ పద్ధతులకి పెద్ద పీట వేస్తె ప్రజలు కొంత వరకైనా పాటిస్తారేమో ...కనీసం ప్రభుత్వ అధికార భవనాలు...అధికార్ల నివాస,విశ్రాంతి భవనాలైనా ప్రత్యామ్నాయ పద్దతులలో( గ్రీన్ హౌస్ కాన్సెప్ట్ ) నిర్మించి ...సి. అవసరం లేకుండా సహజ సిద్ద మైన చల్ల ధనంతో ఆనందంగా ఉండొచ్చు అని నిరూపించ వచ్చు. ముందు నిజాయితీ విధానాలు అమలు పరిచే వారిలో వుండాలి. ఇవన్నీ అమలు పరిస్తే వాళ్లకు .సి లు ఉండవు కదా...
మన దేశం అనేక మతాల ..జాతుల...వర్గాల..పొరల మిశ్రమమని అందరికీ తెలుసు. రోడ్ మీద కార్ లో వెళ్ళే వాడికి సైకిల్ మీద వెళ్ళే వాడు అడ్డు వచ్చినంత మాత్రాన కోపం తెచ్చేసు కోవలసిన అవసరం లేదనీ...అందరికీ రోడ్ మీద హక్కు ఉందనీ ...ఎదుటి వాడు తప్పు దారిలో వెల్లితేనే నీకు అడిగే హక్కు ఉంటుందని గుర్తించాలి. కాస్త సర్దుకు పోయే స్వభావం ఉంటే అంతా సుఖంగా గడపొచ్చనే వాస్తవాన్ని పిల్లలకు ఎవరూ నేర్పరు
సరి కదా ఎదురుగా ఘోరాతి ఘోరమైన అన్యాయాలు జరుగుతున్నా నీకెందుకు అన్నట్లుగా తప్పించుకునో...వదిలించుకు రమ్మనో చెబుతారు.
అందుకే పిల్లలను ఒక ఖచ్చితమైన ఐడియాలజీ తో పెంచడం చాలా అవసరం. ఒక ఖచ్చిత మైన ఐడియాలజీ వున్న వాడికి ఫ్రెండ్స్ ని వెదుక్కో వలసిన అవసరం వుండదు. ఆ ఐడియాలజీ తో మ్యాచ్ అయ్యే వాళ్ళు సహజంగా ఫ్రెండ్స్ అయి పోతూ ఉంటారు. ఏ ఐడియాలజీ లేని వాళ్లకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు కానీ ఆ
ఫ్రెండ్ షిప్ కు బలమైన పునాది ఉండదు. " నీ వలన ఎవ్వరూ ఇబ్బంది పడకుండా చెక్ చేసుకో చాలు" అని చిన్నప్పటి నుండీ పిల్లలకు అలవాటు చేయండి చాలు..వాడు ఖచ్చితంగా మంచి పౌరుడు గా తయారౌతాడు. కానీ ఇప్పుడు తలిదండ్రులకు తమ పిల్లలకు మంచి పౌరులుగానో..మంచి వ్యక్తిత్వం వున్న వాళ్లుగానో తయారవ్వక పోయినా ....మంచి సంపాదనా పరులుగా తయారైతే చాలు. చాలా సున్నితమైన విషయాలను భావి తరాల వారికి అర్ధమయ్యేలా చేయడంలో ఇప్పుడున్న జెనరేషన్ ఫెయిల్ అవుతున్నదనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎనభై సంవత్సరాల క్రితమే చలం లాంటి మహోన్నత రచయితలు తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసినా మనం ఎక్కడకు వెళ్తున్నామో తెలియడం లేదు. లేదంటే ఒక ఐఐఎం విద్యార్ధి తన భార్యను అనుమానించి హత్య చేయడమేమిటి...? అంటే ఆ తలిదండ్రులు కేవలం ఆదాయాన్నిచ్చే చదువుకి మాత్రమె ప్రాదాన్యాన్నిచ్చేరన్న మాట...ఇదొక ఉదాహరణ మాత్రమె..శీలం అంటే ఏమిటి..దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి....అసలు జీవితంలో ఇలాంటి విషయాలను .....సామాజిక ..భౌతిక ..పరిస్తితులకు అన్వయించి ఎలా అర్ధం చేసుకోవాలి....ఎప్పు డైనా ఎక్కడైనా చర్చిస్తామా...పోనీ చర్చించిన పుస్తకాలను పిల్లలకు అందు బాటులో పెడతామా....ఎక్కడైనా ఫంక్షన్ ఐతే చాలు..లేటెస్ట్ ఫాషన్ డిజైన్స్ ఉన్న బట్టలు వేసుకున్నారా...లేదా అని చూస్తాం...వాళ్ళ భావజాలం లేదా ఐడియాలజీ ఇప్పుడున్న సామాజిక అవసరాలకు అనుగుణంగా ఉన్నదా లేదా...అని మాత్రం చూడం. జరగరానిది ఏదైనా జరిగినప్పుడు మాత్రం నెత్తీ ..నోరూ కొట్టుకుంటూ గగ్గోలు పెట్టేస్తాం.
జీవితం లోని గోల్స్ ని యిరవై ఐదేళ్ళకే పరిమితం చేసుకుంటున్నాం. మిగిలిన ఏభై ఏళ్ళ సంగతి ఎక్కడా మన జీవిత ఎజెండా లో ఉండదు. అందు వలనే ఆనందానికి, విలాసానికి తేడా తెలియకుండా పోతోంది. విలాసంగా బ్రతకడమే ..ఆనందంగా బ్రతకడం క్రింద లెక్క పెట్టుకుంటున్నారు. అందువలనే మనం ఆనందంగా ఉన్నామని పది మందికీ తెలియాలంటే మనకో మంచి కార్ ... ఆడవాళ్ళ మెడ నిండా నగలు..పట్టు చీరల ధగ దగలు మొదలైనవన్నీ ఉండాలి. అలా కాకుండా ఉదయాన్నే మీ వూరి చివర ఉండే పొలాల పక్కనో ..చెరువు పక్కనో..చిన్న ఇయర్ ఫోన్ లో శివకుమార్ శర్మ గారి జలతరంగిణి వాద్యాన్నో..ఎల్లా వెంకటేశ్వర్లు గారి మృదంగ వాద్యాన్నో వింటుంటే అది యెంత మంచి అనుభూతి నిస్తుందో చెబితే ...నేను పిచ్చి వెధవనై పోనూ....పెదవి చివరి నుండి మాత్రమె వచ్చే మాటలను ...నటనతో మాత్రమె రప్పించే దొంగ నవరస హావ భావాలను చూసి...చూసి...ఎండిన మనసు మీద మొన్న చిన్న పన్నీరు జల్లు కురిసింది..డెబ్భై రెండు సంవత్సరాల తమ్ముడిని సాగనంపడానికి ..మే నెల ఎండలో భుజమ్మీద తుండైనా లేకుండా మిట్ట మద్ద్యాహ్నం ఎండలో నడుచుకుంటూ రోడ్ వరకూ వచ్చిన ఎనభై సంవత్సరాల వృద్దుడిని చూసినప్పుడు....
తమ్ముడు .మా నాన్న గారు....అన్న మా పెద నాన్న.. ఆశ్చర్యంగా చూస్తున్న మా అమ్మాయికి చెప్పాలనుకున్నాను." మనసులో ఆర్ద్రత అనేది ఉన్నప్పుడు ఈ ఎండలు...వానలు శరీరాన్ని పెద్దగా బాధించవు....అది కోల్పోయాం కాబట్టే శారీరక సుఖాలకు బానిసలం " అని కానీ దాని ముఖం చూస్తె ఆ విషయాన్ని అప్పటికే అర్ధం చేసుకుందని నాకనిపిచ్చింది..
జీవితానికి "ఉత్తేజం" అనేది చాలా అవసరం అనేది మన అందరం మరచి పోయి చాలా రోజులయ్యింది. జీవితానికి ఒక్కొక్క వయస్సులో ఒక్కొక్క విషయం ఉత్తేజాన్నిస్తుంది. అన్ని వయస్సుల వారికి ఒకే విషయం ఉత్తేజం ఇస్తుందని గారంటీ ఏమీ లేదు. అనేకానేక విషయాలు మనలో ఘర్షణ సృస్టిస్తాయి. పాత భావాల స్థానం లో కొత్త భావాలు పుట్టుకొస్తాయి. ఇది సమాజం లో కూడా నిరంతరం సాగే ప్రక్రియ. ఇది లేని చోట జడత్వం ఆవహిస్తుంది. అప్పుడు మనిషి జీవన్మ్రుతుడవుతాడు. ఇప్పుడు ఎక్కువ మంది అదే స్థాయిలో ఉన్నారు. అది కప్పి పుచ్చు కోడానికి జరుగు తున్నవే అర్ధం పర్ధం లేని ఫంక్షన్ లు. మనం ఆహ్వానిస్తున్న గెస్ట్ లలో నిత్యం యెంత మందితో మనం మాట్లాడ గలుగుతున్నాం.నాకు తెలిసిన కొన్ని ఫంక్షన్ లలో వచ్చిన గెస్ట్ లలో పది శాతం మందితో మాత్రమే జీవితంలో ఒక్క సారైనా మాట్లాడిన హోస్ట్ లు ఉన్నారు. అసలు పెళ్లి అంటే యెంత కళాత్మకంగా ..తమకు బాగా కావలిసిన వాళ్ళతో మాత్రమే కలసి ఆ మధురమైన అనుభూతులు మిగుల్చుకుంటూ జీవితాంతం గుర్తుంచుకోవసిన కార్యక్రమమని అందరికీ తెలుసు. కానీ అక్కడ నిజంగా మనసు పెట్టి చూసే వాళ్లకి చీదరించు కొనేవే తప్ప ...ఆనందించేవి ఏవీ ఉండవు. మనకు మంత్రాలు అర్ధం కావు...అయినా వందల సార్లు వింటూనే ఉంటాం. వాటి మీద పూర్తి నమ్మకం ఆ చదివే పంతులు గారికే ఉండవు. అయినా మనం వాటినే పాటిస్తాం. కనీసం వాటిని శ్రావ్యంగా అయినా ఉచ్చరించడానికి ప్రయత్నం చేయడం మానేశారు.

15, ఏప్రిల్ 2011, శుక్రవారం

నీ ( మన) కేం కావాలి......

" సార్ ....నందూ ని ఉదయమే హాస్పిటల్ కి తీసుకెళ్ళారు ..."

నా ప్రాజెక్ట్ సైట్ కి రాగానే కాంట్రాక్టర్ దగ్గర పని చేసే సూపర్వైజర్ చెప్పాడు.

" అరె ..నిన్నంతా బాగానే ఉన్నాడుగా.. సరే ..ఎలా ఉన్నాడో కనుక్కుని చెప్పండి" అంటూ జీప్ ఎక్కాను.కానీ రెండు కిలోమీటర్లు వెళ్లక ముందే ఫోన్ వచ్చింది....ముందు నమ్మ లేక పొయ్యాను..

" అసలెలా జరిగింది? "

"ఏమో సార్ నిన్న రాత్రి కూడా నైట్ వర్క్ చేసాడు..పని చేస్తుండగా కడుపు నెప్పి వచ్చి వాళ్ళ క్యాంపు కి వెళ్లి పొయ్యాడు.."

" ఎలా ..ఆ రాత్రి ఎవరు డ్రాప్ చేసారు...?'

" నడిచే వెళ్ళాడు సార్ "

" అంత చీకటిలో ఇంచు మించు రెండు కిలో మీటర్లు ఆ కడుపు నెప్పితో ఒక్కడూ నడిచి వెళ్ళాడా....మరి రాత్రి వర్క్ చేయించిన సూపర్వైజర్ ఏమయ్యాడు?"

" అతడు రానని ముందే చెప్పాడు సార్ "

జరిగింది నెమ్మదిగా అర్ధం అవ్వ సాగింది ..ఒక బాధ్యత వహించే వ్యక్తీ లేకుండానే వాళ్ళని తెల్ల వారే సరికి కాంక్రీట్ వర్క్ కి రెడీ చేయడం కోసం రాత్రి పనికి పురమాయించారు...పగలంతా మండే ఎండలో కస్టపడి కూడా అదనపు పని చేయడం వలన వచ్చే డబ్బు కోసం రాత్రి పనికి సిద్ద పడి ఉంటాడు. మొత్తానికి రాత్రి ఆరోగ్యం లో తేడా వచ్చి ఆకస్మికంగా చనిపొయ్యాడు.

మిగిలిన గ్రూప్ లో వాళ్ళను వివరాలు కనుక్కున్నాను ...మెదడు లో నరాలు చిట్లి రక్తం బయటకు స్రవిస్తున్నట్లు గా అనిపించింది. అతడు కుటుంబం లో ఒక్కడే కొడుకు. ఆరుగురు అక్కా చెల్లెళ్ళు. నలుగురికి తన శ్రమ తోనే పెళ్ళిళ్ళు చేసాడు. తనకి కూడా ఈ మద్యనే పెళ్లి అయ్యింది. భార్య గర్భవతి. ఐదవ తోబుట్టువు కి కూడా పెళ్లి కుదిరింది. కట్నం ఇచ్చేసాడు కానీ పెళ్లి ఖర్చులకే ఇంకా పైకం పూర్తిగా సమకూరక రెండు రోజుల ముందే వూరు వెళ్ళిపో వలసిన వాడు కొద్దిగా అదనపు పని చేసుకుని డబ్బు చేత పట్టుకుని వెళ్దామని ఉండి పని చేసుకుంటుండగా......అసలైన ఇంకొక విషయం ఏమిటంటే అతడు మూడు నాలుగు రోజుల నుండీ కడుపు నెప్పితో బాధ పడుతూనే పనికి వస్తున్నాడు. ఫైనల్ గా తెలిసిందేమిటంటే అపెండిక్స్ బ్లాస్ట్ అయ్యి బాడీ ఆంతా విషపూరితమై చని పొయ్యాడు. అంబులెన్సు లో శవం కదలి పోగానే నిలబడ లేక కుర్చీలో కూల బడ్డాను. టీ తెచ్చి ఇచ్చారు...తాగాలని పించ లేదు. కళ్ళ లో ఉబికి వస్తున్న నీటిని ఆపుకోడం కష్టంగా ఉంది.

ఒక సంవత్సరం నుండీ మా బ్రిడ్జెస్ లో సెంటేరింగ్, బార్ బెండింగ్ చేయడానికి జార్ఖండ్ నుండి వచ్చిన గ్రూప్ లో తన పనితనంతో అందరి మన్నన పొంది వర్కర్ స్థాయి నుండి నెమ్మదిగా పైకి ఎదిగిన వాడు. అసలు ఆ గ్రూప్ ను చూసి చాలా ఆశ్చర్య పోతూ ఉండే వాడిని. కొత్తగా వేస్తున్న ట్రాక్ పక్కన ఒక పూరి పాకలో ఉంటారు. దానికి తలుపులు గట్రా ఏమీ ఉండవు. వేళకి ఏదో తినేస్తూ అలా పని చేస్తూ ఉంటారు. కాస్త సంపాదించు కోగానే ఊరికి వెళ్ళడానికి చూస్తూ ఉంటారు. హిందీ చాలా స్పష్టంగా మాట్లాడ గలగడం వలన కావొచ్చు వాళ్ళంతా నాతో కబుర్లు చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటారు.కదిలిస్తే చాలు వాళ్ళ వూరి విశేషాలు యెంత ఆనందంగా చెబుతారంటే వాళ్ళ ముఖాల్లో వెలుగు నిండి పోతూ ఉంటుంది.

వాళ్ళను చూస్తే నేను ఎప్పుడో చూసిన " బాగ్ బహాదూర్ ' అనే సినిమా గుర్తుకు వస్తూ వుంటుంది. ఒక గ్రామీణ యువకుడు బొంబాయి లో పని చేస్తూ ఉంటాడు. ఉండేది బొంబాయి లో అయినా మనసు ఆలోచనలు మాత్రం అతడి గ్రామం చుట్టూనే తిరుగుతూ ఉంటాయ్. అందులోనూ ఆ గ్రామంలో జరిగే చిన్న పండగ మీదే అతడి మనసు లగ్నమై ఉంటుంది. ఆ పండుగ రోజుల్లో అతడి పులి వేషమే ఆ గ్రామానికి పెద్ద వినోదం. అతడి పులి వేషాన్ని చూడడానికి విరగ బడి వచ్చే ఆ జనాన్ని చూస్తె కలిగే ఆనందమే అతడి మిగిలిన సంవత్సరానికి ఊపిరి పోస్తుందన వచ్చు. రోజులన్నీఒకేలా ఉండవు కాబట్టి అభివృద్ధి అనేది ఆపలేనిది కాబట్టి ఆ వూరికి కూడా ఒక సంవత్సరం పండగకు ఒక సర్కస్ కంపెనీ వస్తుంది. అందరూ దాన్ని చూడడానికి విరగబడతారు కానీ ఇతడి పులి వేషాన్ని ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే ఆ సర్కస్ కంపెనీ లో నిజం పులి ఉంటుంది. ఒక సారి ఈ యువకుడికి ఆ సర్కస్ మేనేజర్ నా దగ్గర నిజమైన పులే ఉండగా నీ పులి వేషాన్ని ఎవడు చూస్తాడని అంటూ ఎద్దేవా చేస్తాడు. కానీ ఇతదికున్న ఆలోచనా ప్రపంచంలో ఆ గ్రామానికి ఇతడే పులి . రెండో పులి ఉండటానికి వీల్లేదు. ఒక రోజు ఎవరూ చూడకుండా ఆ పులి డెన్ లోకి దూరి దానిని చాలెంజ్ చేస్తాడు. మిగిలినదేమీ దర్శకుడు మనకు చూపించడు కానీ పులి తన పని ముగించి నాలుకతో మూతి నాక్కుంటూ వచ్చి దాని కనువుగా పడుకోడం చూపిస్తాడు.
ఈ సినిమా మీద వివరంగా మరొక్క సారి రాస్తాను ఎందుకంటే అది అంత చిన్న విషయం కాదు. ఆ సినిమా గురించి ఆలోచిస్తుంటే ఇప్పుడనిపిస్తోంది దానికి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డ్ ఇవ్వడం యెంత సరైన నిర్ణయమో..(దానికి పందోనిమిమిది వందల తొంబై ఒకటి లో జాతీయ ఉత్తమ చిత్రం అవార్డ్ వచ్చింది)

కానీ ఇక్కడ సందర్భం ఏమిటంటే ప్రతి మనిషి శారీరకంగా జీవన అవసరాల కోసం ఎక్కడ ఎలాంటి పనైనా చేయనీ ..కానీ అతడి మానసిక ప్రపంచం మాత్రం అతడి సాస్కృతిక పునాడులున్న చోటే తిరుగుతూ ఉంటుంది. జీవితావసరాల కోసం ఉన్న ప్రాంతం యొక్క సంస్కృతి లో పూర్తిగా ఇమడలేక ..తన పునాదులకు సుదూరంగా ఉంటూ కాలం గడిపే వీరిలో నిరతరంగా అంతర్లీనంగా సంఘర్షణ ఉంటూనే ఉంటుంది. అందులోనూ పరిస్థితులు కొంత భిన్నంగా మారుతున్నప్పుడు కూడా వీరు తిరిగి తమ పునాదుల వైపుకు చూడడానికి ,రావడానికి ధైర్యం చేయలేరు.....దానికి చాలా కారణాలు ఉంటాయి. వీరు అందుకొంటున్న ఆర్ధిక ఫలాలు వీరిని నిరంతరంగా ఊరిస్తూ ఉంటాయి.అందులోనూ అమెరికా లాంటి చోట ఉండే వాళ్ళలో నిరంతరంగా ఈ సాంస్కృతిక పునాడులకి , ఆర్ధిక ఫలాల మధ్య నిరంతర మానసిక ఘర్షణ నడుస్తూనే ఉంటుంది. ఇక్కడొక చిన్న వెసులు బాటు ఏమిటంటే నగరాల్లో పుట్టి కేవలం ఆ కల్చర్ కే అలవాటు పడిన వారికి పెద్దగా సాంస్కృతిక పునాదులు ఉండవు కాబట్టి వాళ్లకు ఎక్కడున్నా పెద్దగా ఇబ్బందులు ఉండవు కానీ గ్రామీణ ప్రాంతాల లో పెరిగి ఒక బలమైన కుటుంబ , సాంస్కృతిక పునాదులు ఉన్నవాళ్ళకి మాత్రమె ఈ ఇబ్బంది ఉంటుంది .
అభివృద్ధి అనేది ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల బట్టి చూడకూడదు.అవన్నీ నిజాలే కానీ ఆ అభివృద్ధి ఫలాలు ఎవరికి అందుతున్నాయి ....అన్నదే ముఖ్యమైన ప్రశ్న. ఒక పక్క ఐపియల్ ధగ ధగలు మరొక పక్క విద్యుత్ కొరతతో చీకట్లో విల విల లాడుతున్న గ్రామాలు. ఒక పక్క రైతుల ఆత్మ హత్యలు ,ఒక పక్క రోజు రోజుకీ మార్కెట్ లోకి దిగుతున్న లక్సరీ మోడల్ కారులు , నాలుగు వేల కోట్ల ముఖేష్ అంబానీ గారి భవంతి ....ఫుట్ పాత్ ల మీద తలదాచుకొనే లక్షల జనం.....దీనిని మనం నిజమైన అభివ్రుది అని అందామా....
ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. చట్ట బద్దత కు న్యాయ బద్దత కు మధ్య వుండే తేడా ను చాలా మంది అర్ధం చేసుకోరు. ప్రస్తుతానికి టాక్స్ కట్టి సంపాదించేదంతా చట్ట బద్దమైనదే. కానీ న్యాయ బద్దమైనదో కాదో మీ అందరికీ తెలుసు.రాను రాను ఈ రెండిటి మద్య తేడా పెరిగిపోతోంది. మహానుభావుడు " అన్నా హజారే " దీక్షకు కూర్చుని చేసింది చాలా అద్భుతమైన పనే కానీ తన ఉద్యమాన్ని చట్టం నుండి తప్పించుకొనే వాళ్ళతో బాటు చట్టం యొక్క లొసుగుల మీద కూడా గురి పెట్ట వలసి ఉంది.

ఈ సందర్భంలో నేనొక చిన్న ఉదాహరణ ఇస్తాను. అనుకోకుండా ఒక దూరపు బంధువు నా వయస్సాయనతో కలసి ప్రయాణం చేస్తూ...నాకు కుందేల్లంటే చాలా ఇష్టం అన్నాను. అప్పటికే వాటిని పెంచుతూ ఉండడం వలన అవి చూసే అమాయకపు చూపులు ....వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని నేను ఆ మాట అన్నాను . ఆయన కూడా....."నాకు కూడా చాలా ఇష్టం ..వాటి ముఖాన్ని కాస్సేపు నీళ్ళలో ముంచి ఉంచేస్తే త్వరగా చస్తుంది.హ్యాపీ గా వండుకుని తినొచ్చు...." నా ఫీలింగ్స్ గురించి వేరే చెప్పనవసరం లేదనుకుంటా...
ఒకప్పటి సమాజానికీ ఇప్పటి సమాజానికీ ...మా ఇద్దరి ఆలోచనల మధ్య ఉండే తేడా ఉంది. అందరితో కలసి ఆనందంగా ఉంటూ ..కష్ట పడుతూ ఫలాలను కూడా ..ఇంచు మించు గా అందరికీ అందించాలనే తపన తో ఉండే వాళ్ళు ఎక్కువగానే ఉండే వారు. అలా ఉండ గలగడమే గొప్పగా భావించేవారు. ఇప్పుడు మారిన పరిస్థితులకు గల కారణాలను వివరించే ముందు నా చిన్న నాటి సంఘటనను గుర్తుకు తెచ్చుకోవడం చాలా అవసరం. మా నాన్న గారి చిన్నక్క వాళ్ళది పెద్ద కుటుంబం. మా మామయ్య చాలా కష్ట జీవి. వాళ్లకు తొమ్మిది మంది సంతానం. ఇల్లంతా ఆ రోజుల్లో పిల్లా పాపలతో కల కల లాడుతూ ఉండేది. మధ్య తరగతి రైతాంగ కుటుంబం కాబట్టి దేనికీ లోటు కనబడేది కాదు. నేను సెలవుల్లో అక్కడ ఉన్నప్పుడు మా మూడవ బావకు అంటే వారి మూడవ అబ్బాయికి ఒక దూరపు బంధువు ఒక పెళ్లి సంబంధం తీసుకుని వచ్చాడు. కొంత సేపు విన్న తరువాత మా మావయ్య ....... " ఏరా....మొన్న మనోళ్ళ పెళ్లి లోనే మీ పిల్లను చూసాను...కళ గా ఉందిరా...ఎవరిదో సంబంధం ఎందుకురా....నీ కూతురిని మా ఇంటికి పంపడం ఇష్టమా.... కాదా చెప్పు." అనగానే ఆ పేద రైతుకు నోట మాట రాలేదు. మరలా మా మామయ్యే " మీ అక్కయ్య తో(అంటే మా అత్తయ్యే) అన్నీ మాట్లాడి..పంతులు గారికి కబురు పంపు.." అనేసి తువాలు భుజాన వేసుకుని పొలం వెళ్లి పొయ్యాడు. ఆనాడు నాకు ఆ సంఘటన పెద్దగా ఏమీ అనిపించలేదు కానీ .....ఈ రోజు అటువంటి సంఘటనల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాను. ఆ ఉదాత్తత ....నిస్వార్డం....నిజంగా ఎదురైతే...కన్నీళ్లు ఆపుకోవడం కష్టం అవుతుందేమో.....

మనిషి లో ఆలోచనలు నిజాయితీగా ఉన్నప్పుడు ప్రపంచమంతా తనదిగానే అనిపిస్తుంది...ఆలోచనలకు...ఆచరణకు మధ్య దూరం పెరుగుతున్నప్పుడు మాత్రమె ఆత్మ న్యూనత కు లోనవ్వుతాడు.అది పైకి కనిపించ కుండా ఉండేందుకే తను కూడా ఒక పెద్ద గ్రూప్ లోనే ఉన్నానని తనకు తానూ నమ్మించు కొనడానికి కొన్ని మార్గాలు వెతుక్కుంటాడు.అందులో ప్రధానమైనదే ఈ నాడు చాలా పాపులర్ అవుతున్న కులాల వారీ పిక్నిక్ లు. ఆడంబరాలే ఆదర్సమై విరాజిల్లుతున్న వినూత్న ప్రదర్శనా స్థలాలు.అక్కడ అన్ని రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి .బాగా మిక్స్ అయ్యే వుంటాయి. హాస్టల్ తాలూకు సెప్టిక్ ట్యాంక్ లీక్ ఐన వాసనలో హైడ్రోజెన్ సల్ఫిడ్ గ్యాస్ కలిసినట్లు. ఒక్క సారి అందరి ముఖాల లోకి పరికించి చూడండి ...ఎక్కడైనా ఆప్యాయత...అనురాగం...వాత్సల్యం...లాంటి ఫీలింగ్స్ ఉంటాయేమో......నిజంగా ఈ విధమైన జీవితం అందరికీ ఆనందాన్నిస్తుందా...ఖచ్చితంగా ఇవ్వదు. మరెందుకు.....అంటే వేరే ఏమీ...కాదు..సరైన,బలమైన ఆల్టర్నేటివ్ కనబడడం లేదు కాబట్టి.అది ఒక్క రోజులో నిర్మాణం అవ్వదు. ఉదాహరణకు మా శ్రీమతి ని ఏదైనా పెళ్లి ఫంక్షన్ కు సింపుల్ గా ఉండే కాటన్ చీర ,మెళ్ళో ఒక సింపుల్ చైన్ తో రమ్మంటాను . కానీ ధైర్యం చేయదు. తనను తప్పు పట్టనవసరం లేదు. ఎందుకంటే లోకం రీతికి భిన్నంగా వెళ్ళడానికి ధైర్యం ఒక్క సారిగా రాదు. అదే మేము ఒక పదిమంది దగ్గర బంధువులం కలసి ఈ నిర్ణయం తీసుకుని అమలు చేయొచ్చు. ఒక్క సారి అలోచించి చూడండి. ఆడంబరాలు ఉండవు. అప్పుడు పెద్దగా డబ్బు సంపాదించే అవసరం ఉండదు. సంపాదించే వాళ్ళ మీద ఒత్తిడి ఉండదు. అందరూ శాంతి గా ఉండే జీవితాన్ని కోరుకునే వాళ్ళు ఉన్నప్పుడు అందుకు భిన్నంగా ఉండే వాళ్ళు సమాజంనుండి వేరై పోతారు..మార్పు ఒక్క రోజులో రాదు..కానీ ప్రయత్నం మాత్రం ఎక్కడో ఒక చోట ప్రారంభం కావాలి కదా...
అసలు నాకు ఇంకో ఆలోచన కూడా వస్తోంది.ఇప్పుడు కాలేజ్ లలో ఉండే అమ్మాయిలలో అధిక శాతం ..ఆకస్మాత్తుగా ..మాకు కార్లలో ..తిప్పే వాళ్ళు ...ఖరీదైన రెస్టారెంట్స్ లో తిప్పే వాళ్ళు వద్దు..వాళ్ళ ముఖాలు కూడా చూడం...హజారే వెంట తిరగ గలిగే వాళ్ళు..( కనీసం మిగులు సమయాల్లో ) , జే.పీ.ని ఆదర్శం చేసుకో గలిగిన వాళ్ళ తోనే మా స్నేహం..అని నిర్ణయాలు తీసుకున్నారనుకోండి..ఇక చూడండి నా సామి రంగా....కొంత మంది ప్రభుడ్డులు మహాత్ముని లా కొల్లాయి (చిన్న పంచె లాంటిది) కట్టుకుని కాలేజ్ లకు వచ్చేస్తారేమో...

మా నాన్న గారు నాకు ఎనిమిదవ తరగతి లో ఉండగా అనుకుంటా క్లిక్ -౩ కెమెరా కొని ఇచ్చారు. అప్పట్లో అది కొంత ఖరీదైన అలవాటే కానీ వ్యూ ఫైండర్ లో నుండి ప్రకృతి ని చూడడం అలవాటై పోయింది. మేము ఉన్న ప్రాంతమైన రాజవొమ్మంగి గ్రామం లోఉంటున్న ఉద్యోగస్తుల కుటుంబాలు అన్నీ కలసి పిక్నిక్ లకు వెళ్తుండే వాళ్ళం. ఇప్పుడున్నటువంటి పిక్నిక్ లు కాదు. అందరూ కలసి అక్కడే వంట వండు కోవాలి. ఆడ మగ తేడా లేకుండా ఎవరికి వచ్చిన పని వారు చేయాలి. కులాల ఆలోచనే లేదు. చక్కగా కలసి పోగలగడమే ప్రధాన అర్హత . ఒక సమిష్టి భావనతో ఆనందంగా ఎలా ఉండొచ్చు అనేది ఆ రోజుల్లో నాకు తెలిసింది. నాకు లైబ్రరీ లో గంటల తరబడి గడుపుతూ పుస్తకాలతో స్నేహం చేయగలిగితే జీవితంలో యెంత ఆనందంగా (చాలా తక్కువ ఖర్చు తో ) ఉండొచ్చో అర్దమైనదీ కూడా అక్కడే. ఈ నాటికీ నా ఈ అలవాట్లనే మా పిల్లలకి కూడా సంక్రమింప చేయడం వలననే మేము ఆర్ధికంగా కూడా ఏ భారం లేకుండా , తృప్తిగా గడుపుతున్న విషయాన్ని నా స్నేహితులు ఇప్పుడు గ్రహిస్తున్నారు.
కాబట్టి దిశా నిర్దేశం అనేది చాలా ముఖ్యం. మనం మధ్య తరగతి లో ఉన్నప్పుడు మన ఆలోచనలు దానికి అనుగుణంగా ఉండేటట్టు చేసుక్డం వలన జీవితం చాలా తేలిగ్గా గడపొచ్చు అనేది నా అభిప్రాయం. పేపర్లో ఏదైనా లక్సరీ కార్ తాలూకు యాడ్ చూసి పిల్లలు దాని గురించి చర్చిస్తున్నప్పుడు మనం వారిని తెలివిగా వారించడం మానేసి మనం కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి పోయి ఇంకా ఏమేమి ఉంటే కారులో మరింత బాగుంటుందో చెబితే .....పాపం పిల్లలు ....అవే కలలు కంటారు. అలా కాకుండా ఒక మంచి పుస్తకం గురించి..ఒక గొప్ప చారిత్రిక సంఘటన గురించి...ఒక గొప్ప నాయకుడి యొక్క చారిత్రక పాత్ర గురించి ..ఆ స్థానానికి అతడు ఎదిగిన తీరు గురించి...మనం పిల్లలకు చెప్పగలిగితే వచ్చే ఫలితాలు ఖచ్చితంగా చాలా మెరుగ్గా ఉంటాయని చెప్పగలను. అంతేకాదు వూరి చివరలో ఉన్న పొలాల పచ్చదనం లో ఉన్న అందం ...దానిని చూడడం వలన వచ్చే ఆనందం మనం మన పిల్లలకు అర్ధమయ్యేలా చెప్పడంలో సఫలీక్రుతులమవుతున్నామా.. ... ఎక్కడెక్కడి వాటి గురించో అనవసరంగా చెప్పేస్తూ ఉంటాం. ఆర్ధిక వనరులు పెరగడం వలన ఈ మధ్య కాలంలో బయటకు టూర్లకు వెళ్ళాలన్న కాన్సెప్ట్ పెరిగిన మాట వాస్తవమే కానీ అక్కడకు వెళ్లి మంచి మంచి ఫోటోస్ తీసుకుని మన చుట్టు పక్కల వాళ్లకు ప్రదర్శించడం లో చూపెడుతున్న తాపత్రయం ఆయా ప్రదేశాల యొక్క విసిష్థత అర్ధం చేసుకోడంలో చూపించ గలిగితే మన యాత్రలకు అర్ధం ఉంటుంది. అందం అనేది మన మనసులో ఉంటుంది కానీ ,బయట కాదు అనే విషయం చాలా మందికి ఈ నాటికీ అర్ధం కాదు. కాబట్టి ఈ మానసిక సౌదర్యాన్ని పెంచే సాధనాలైన బుక్ రీడింగ్ , సంగీతం వినడం ( సినిమా సంగీతం కాకుండా..) , సామాజిక సేవా కార్య క్రమాల్లో పాల్గొనడం లాంటివి అలవాటు చేస్తే..చాలు ....వీటిల్లో ఉండే ఆనందం ..తృప్తి మన మీదే కాకుండా మన పిల్లల మీద కూడా ఆర్ధిక పరమైన ఒత్తిడులు లేకుండా చేయగలుగుతుంది. దానితో జీవితం చాలా వరకూ సాఫీ గా సాగి పోతుంది. మధ్య తరగతి లో ఉండి ..వేరే వేరే పిచ్చి కలల సాఫల్యం కోసం డబ్బు అవసరమై ...దాని కోసం ఒత్తిడులకు లోనయ్యే బదులు ఈ విధమైన జీవితం మంచిది కదా....
నా మట్టుకు నాకు ....ఆకలి లేకుండా స్టార్ హోటల్ లోతిన్న భోజనం కంటే ఆకలిగా ఉన్నప్పుడు ..ఇంట్లో వేడి వేడి అన్నం లో మాగాయి పచ్చడి లో గానుగు నూనె వేసుకుని తినడమే ...చాలా ఆనందాన్నిస్తుంది. అంతే కాదు ఎక్కడికో బోలెడంత ఖర్చు పెట్టుకుని తిరగడంలో కొంత ఆనందాన్ని పొంది ఉండ వచ్చు కానీ నేను కడుతున్న బ్రిడ్జ్ చెక్ చేసుకుంటూ ....ఆ బ్రిడ్జ్ లో నుండి పారుతున్న నీట్లో ఆనందంగా ఈదుతున్న చేప పిల్లలను చూస్తూ చాలా ఆనందిస్తుంటాను. అలాగే నీరెండలో నేను వేయిస్తున్న ఫార్మేషన్ కు అటు ఇటు ఉండే తోటల పచ్చదనాన్ని ...వాటి మీద వాలే పిట్టలు చేసే ధ్వనులను ఆస్వాదిస్తుంటాను.
ఇది చదివిన నా మిత్రులు కొంత మంది ఎవరి పిచ్చి వారికి ఆనందం అని అనుకుంటారని నేను అనుకోడంలో తప్పేమీ...లేదేమో....