6, ఫిబ్రవరి 2011, ఆదివారం

శ్రీ మార్ని నారాయణ మూర్తి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్

నేను టెన్త్ తాడికొండ ఆశ్రమ స్కూల్ లో చదవడం వలన యేవో గేమ్స్ ఆడడం, వ్యాయామం చేయడం కొద్దిగా అలవాటే. మా వూరి నుండి రాజమండ్రి కాలేజీ కి సైకిల్ తొక్కుకుని వెళ్ళడం వ్యాయామం లేని లోటు తీరుస్తున్నప్పటికి గేమ్స్ మాత్రం ఊర్లో పెద్దగా ఆడేవాళ్ళు కారు. కొద్ది రోజులు బిళ్ళంగోడు ప్రయత్నించాము కానీ ఆటలో ఒకసారి బిళ్ళ కూరలు అమ్ముకునే వాడి కంట్లోకి దూసుకు పోవడంతో దానికి ఫుల్ స్టాప్ పడింది. అప్పుడు క్రికెట్ ఆడే ప్రయత్నం మొదలు పెట్టాం. అప్పుడు మేము బాట్ తాయారు చేసుకొనడం మొదలైనవి "లగాన్ " సినిమా కధను పోలి ఉంటాయి కానీ కొన్ని తేడా లు ఏమిటంటే మేము ఎవరినీ సవాలు చేయ లేదు. మొదట మాకు గ్రౌండ్ పెద్ద సమస్య అయ్యింది. వూరి చివర వున్న రాజు కొండ దిగువన స్థలం ఐతే వుంది కానీ దాని నిండా పొదలు నిండి ఉండేయి. కాబట్టి అప్పట్లో మేము ఒక నిర్ణయం తీసుకొన్నాం. రోజు ఆట ఐన తరువాత ఒక్క పొదనైనా తొలగించాలి. నిర్ణయం చాలా సంవత్సరాలు రెగ్యులర్ గా కాక పోయినప్పటికీ నడిచింది. ౧౯౮౪ నాటికి ఇంచుమించు వంద గజాల రెడిఅస్ తో ఉన్న అతి విశాల మైన గ్రౌండ్ తయారు అయ్యింది. ౧౯౮౬ లో అనుకుంటా డిస్ట్రిక్ట్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాలని అనుకొన్నాం. కానీ ప్రైజెస్ మిగిలిన ఖర్చులకి డబ్బులు ఎక్కడి నుండి సంపాదించాలి ? ఊరిలో క్రికెట్ మీద అట్టే సదభిప్రాయం లేదు. క్రీడలు చదువులో భాగమని నమ్మే విశాలత్వం ఇప్పటి లాగే అప్పుడు కూడా లేదు. కానీ టైం లో నిజంగా దేవత లా మా అమ్మమ్మ వరసైన శ్రీమతి యింగయమ్మ గారు మొత్తం ఖర్చు భరించడానికి సిద్దమయ్యారు. వెంటనే అప్పటికే దివంగతులైన మా తాతయ్య శ్రీ మార్నినారాయణ మూర్తి గారి పేరుతొ నిర్వహించిన టోర్నమెంట్ మా వూరి చరిత్ర లోనే ఒక మైలు రాయి వంటిది. తరువాత సంవత్సరం కూడా టోర్నమెంట్ దిగ్విజయంగా నిర్వహించాం. తరువాత ఉద్యోగ, వ్యాపార నిమిత్తం మా బాచ్ లో చాలా మంది వూరు వదిలేయడంతో సంప్రదాయం ఆగిపాయింది.
ఇక్కడొక ముఖ్యమైన ఆలోచించే రేకిత్తెంచే విషయం ఏమిటంటే ఎవరో ఒకరు మిస్ అయినంత మాత్రాన ఒక గొప్ప స్పూర్తి ఎందుకు ఆగిపూయిందనేది ఇప్పుడు చూద్దాం.

నిజం చెప్పాలంటే నాకు “ లగాన్ ' చూసిన తరువాత కొన్ని విషయాలు అర్ధం అయ్యాయి . మేము ఆ రోజుల్లో కేవలం మా కులం లో ఉన్న కుర్రాళ్ళతోనే టీం తయారు చేసుకోన్నాం. రైతాంగ కుటుంబాలకు చెందిన వీళ్ళు డబ్బు పెట్టుబడి పెట్టి ఆటలు ఆడే కల్చర్ కు ఎక్కువగా అలవాటు బడలెదు. నేను అప్పటికే జాబ్ లో ఉన్నాను కాబట్టి కొంత పెట్టుబడి పెడుతూ ఉండేవాడిని

ఆ తరువాతి కాలంలో నేను గమనించిందేమిటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్దిక వనరులు తక్కువ కాబట్టి తక్కువ ఖర్చు తో కూడుకున్న ఆటలే ఎక్కువ కాలం మనగలుగుతాయి . కబడ్డీ ,balbadmintan లు అందుకే గ్రామాల్లో చాలాకాలం ఆడారు .

ముత్యాల ముగ్గు సినిమా లో ముళ్ళపూడి వారు రావు గోపాల రావు ద్వారా మంచి సామెత ఒకటి చెప్పించారు . “వెనకటికొకడికి దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమంటే ….మా మేనమామ చెవులో వెంట్రుకలు మోలిపిచ్చు ….మిగిలింది నేను చూసు కుంటా నన్నాడట”. ఇది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే పంతోనిమిది వందల ఎనభై రెండు లో మనకు కలర్ టీవి ప్రసారాలు మొదలయ్యాయి . గ్రామీణ భారతంలోకి వస్తు వినిమయ కల్చర్ కి యిది తలుపులు తెరిచిందనవచ్చు . దాని ఫలితంగానే సమిష్టి కృషి తో గెలిచే ఆటలకు నెమ్మదిగా కాలం చెల్లిపోయింది . యువతరం ఇంట్లో కూర్చుని ఆనందించ గలిగే అవకాశాలు పెరిగాయి . పైగా క్రికెట్ బాల్ ఖర్చుకు ఐదు రూపాయలు ఇవ్వడానికి వొప్పుకోని కుటుంబ పెద్దలు టీవి సెట్స్ కొనడానికి అభ్యంతరం పెట్ట లెదు . టీవి లు ఇళ్ళల్లోకి వచ్చాయి . మనిషి బయటకు రావడం మానేసాడు .సమాజమ్మీద టీవీల ద్వారా కొత్త కల్చర్ పట్టు సాధించింది . అలా నాటబడిన విత్తనాల తాలూకు చెట్లు ఇప్పుడు కాయలు కాస్తున్నాయి.. వాటినుండి వస్తున్న దుర్వాసనకు మనమే ముక్కులు మూసుకుంటున్నాం .


4, ఫిబ్రవరి 2011, శుక్రవారం

సిటీ బస్సు -కల్చర్


ప్రతి ఊరికి కొన్ని కధలున్నట్లే అన్ని ప్రయాణ మాధ్యమాలలోను కొన్ని కధలు పుడతాయి,పెరుగుతాయి. కొన్ని అక్కడే ఆగిపోతాయి..మరి కొన్ని మాత్రం కొనసాగుతాయి. రాజమండ్రి లాంటి టౌన్ కి పక్కనే ఉన్నా గాని ౧౯౭౮ వరకు మాకు బస్ సౌకర్యం లేదు. మోటార్ సైకిల్ కొనే సామర్ధ్యం అప్పట్లో చాలా మందికి ఉండేది కాదు. పైగా మంచి స్కూటర్ కావాలంటే బుక్ చేసుకుని ఎదురు చూడవలసి వచ్చేది. ఎక్కువగా సైకిల్ మీదే ఆధార పడే వాళ్ళం. సిటీ బస్ ను మా వూరి సెంటర్ లో చూడ గానే మాకెంత ఆనందం కలిగిందంటే అదేదో దేవతల వరం వలన మాకు ప్రాప్తించినట్లుగా ఫీలయ్యాం. ఇదంతా మొదట్లో బాగానే వుండేది.
అసలు కధలన్నీ తరువాతే ప్రారంభం అయ్యాయి. రోజుల్లో ఇప్పుడున్న ట్రాఫిక్ ఉండేది కాదు. బస్ బొమ్మూరు సబ్ స్టేసన్ వదిలితే గాలిలో వచినట్లుగా వచ్చి మా ఊర్లో వాలేది. దానిని అల్లంత దూరంలోనే చూసే రోడ్ నుండి క్రిందకు దిగి పొయ్యే వాళ్ళం. ఇప్పుడున్న డబల్ రోడ్ కూడా కాదు అప్పుడు. రోడ్ కి సరిగా బెర్మ్స్ కూడా ఉండేవి కాదు. సైక్లిస్త్స్ ఇబ్బందులను బస్ డ్రైవర్స్ మాత్రం లెక్క చేసే వారు కాదు. రెండు మూడు సార్లు కింద పడ్డం కూడా జరిగింది. అప్పుడే కావలిసిన సంఘటన జరిగింది. ఒక కోమటాయన సైకిల్ నిండా సామాను కట్టుకుని రాజమండ్రి నుండి తిరిగొస్తున్నాడు. రాత్రి పది గంటల సమయం. చిమ్మ చీకటి.....జెట్ వేగంతోబస్ షావుకారుని రాసుకుంటూ పోయింది. పాపం ఆయన సైకిల్ కంట్రోల్ కాక రోడ్ పక్కన ఉన్నచిన్న చెరువులో పడ్డాడు.బస్ సెంటర్ లో ఆగింది. షావుకారు డ్రైవర్ తో కొంచెం స్పీడ్ తగ్గిస్తే తన సొమ్మేమీ పోదుగా అని అడిగాడు. డ్రైవర్ పొగరుగా తమ బస్ కు ఎక్కువ టాక్స్ కడుతున్నాం కాబట్టి రోడ్ అంతా తమదే అన్నట్లు మాట్లాడాడు. అదే టైం కు అక్కడ నిలబడి ఇదంతా చూస్తూ .. చుట్ట కాల్చుకుంటున్న ఒక పెద్ద మనిషికి సమాధానం తో చిర్రెత్తుకొచ్చింది. డ్రైవర్ ను గట్టిగా నిలదీశాడు. డ్రైవర్ మరీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. అసలే గ్రామస్తుల్లో ఉక్రోషం పేరుకు పోయి ఉందేమో ... పెద్ద మనిషి డ్రైవర్ ను పట్టుకుని రెండు తగల్నిచ్చాడు. డ్రైవర్ వెంటనే బస్ వేసుకుని రాజముండ్రి వెళ్ళిపొయ్యాడు. అప్పట్లో మోటార్ వర్కర్స్ యూనియన్ అంటే అందరికీ హడల్. కానీ ఊరంతా షావుకారికి సపోర్ట్ గా నిలబడింది. మొత్తం జనం అంతా అన్ని విభేదాలు మరిచిపోయి చేతికి దొరికిన ఆయుధంతో ఉపద్రవాన్నైనా ఎదుర్కొనడానికి సెంటర్ లో సిద్దంగా కూర్చున్నారు. నాలుగు బస్ తో యూనియన్ జనం వూరి మొదలు వరకు వచ్చారు కానీ పరిస్థితిని తెలుసుకుని వెనుకకు తిరిగి వెళ్లి పొయ్యారు. కానీ మరుసటి రోజు నుండి బస్ లు బంద్. మా మామయ్య శ్రీ మార్ని సత్యనారాయణ తదితరులు అప్పటి మా ఎమ్మెల్యే శ్రీ వెంకటస్వామి నాయుడు గారి సహకారంతో మా ఊరికి ఆర్టీసి బస్ లు తిరిగేటట్లు చేయగలిగారు. దాంతో యూనియన్ పెద్దలు రాజీకి వచ్చారు. డ్రైవర్ క్షమాపణతో కధ సుఖాన్తమయ్యింది.
ఇదంతా ఎందుకు రాసానంటే నాకు వూహ వచ్చిన తరువాత నేను చూస్తుండగా ఏదో విధంగా ఎవరో ఒకరి ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా జనం అంతా ఏకమయ్యి దానిని ఎదిరించి ఓడించిన మొదటి పోరాటం అది. అది నాకు జీవితానికి సరిపడిన ఇన్స్పిరేసన్ ఇచ్చింది
బస్సుల్లో ఫోజులు కొడుతూ ప్రయాణించిన ఎంతో మంది జీరోలుగా మిగిలిపోతే "ముగ్ద" అనే పదానికి నిర్వచనంగా నిలిచిన ఒకమ్మాయి మా గ్రామం నుండి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న మొదటి అమ్మాయి గా చరిత్రలోకి ఎక్కింది. అమ్మాయి ఎవరో కాదు...శ్రీమతి మాధవి మా మావయ్య కూతురే...

3, ఫిబ్రవరి 2011, గురువారం

సంక్రాంతి ముగ్గులు



ప్రతి ఒక్కరి లోనూ కళా పిపాస అనేది ఉంటుంది. కానీ అది బయటకు రావడానికి పరిస్టితులు కూడా అనుకులించాలి. ఇది స్త్రీల విషయంలో మరీను . అందులోను గ్రామీణ స్త్రీల విషయంలో ఐతే చెప్పనే అక్కర లేదు. వాళ్లకు ఆడంబరాలు ప్రదర్శించడానికి అవకాశాలు వస్తాయి కానీ కళలు ప్రదర్సిచడానికి మాత్రం అవకాశాలు రావు . మా ఊరిలో ఎలాంటి కమ్యూనిటీ భవనాలు లేవు . “కూచిపూడిపేరు విన్న వాళ్ళు కూడా ఉండే వారు కాదు కాబట్టి పాపం ఆడ పిల్లలు అంతా వాళ్ళకున్న కళా తృష్ణ అంతా ముగ్గుల మీదే చూపించే వారు . సంక్రాంతి సీజన్లో వీధిల్లో నడవడానికి కూడా ఖాళీ దొరికేది కాదు. ఏమాత్రం ముగ్గుల మీద కాలు వేసినా గయ్యి మనే వారు. అప్పటికింకా "గోగులు పూచే ...గోగులు కాచే..పాట పాత బడ లేదు ....కానీ పాట పాతబడుతుందా అసలు .....తెలుగు ప్రజలమంతా ఎంతో అదృష్టం చేసుకున్నాం కాబట్టి అటువంటి పాటలు వినగలుగుతున్నాం నిజమైన తెలుగు జాతి మనగలిగినంత వరకు పాటలు అజరామరంగా ఉంటాయి.
మరి ముగ్గుల మీద కాలు వెయ్యకుండా భోగి మంటలకు పోగేట్టిన పుల్లలు, దుంగలు మోసుకేల్లేది యెట్లా? దానికి మాత్రం కాస్త అనుమతి దొరికేది.
నాకు సంవత్సరం సరిగా గుర్తు లేదు కానీ సంవత్సరం మాత్రం మొత్తం కుర్రకారు అంతా మా వీర్రాఘవులు (వీరూ) నాయకత్వంలో కొత్త బాడ్మింటన్ కోర్ట్ వేద్దామని నిర్ణయించుకున్నాం. ఒక బాచ్ అంతా తవ్వడం, ట్రాక్టర్ లో లోడింగ్ చేస్తే మరొక బాచ్ అన్లోడింగ్, కోర్ట్ లో సమంగా పరచడం చేసాయి. మట్టి తవ్వడానికి వెళ్లినప్పుడే దుంగలు పోగుచేశారు కాబట్టి బాడ్మింటన్ కోర్ట్ దగ్గరే భోగి మంట కూడా వేసారు. సరిగ్గా తెల్లారే సరికల్లా తెల్లటి లైన్స్ తో కొత్త మట్టి సిగారించుకొన్న బాడ్మింటన్ కోర్ట్ అందం , మా కుర్రాళ్ళ ఆనందం మాటల్లో వర్ణించాలో అర్ధం కావడం లేదు. కానీ నిద్ర లేమి వల్లఅందరి కళ్ళల్లో మంటలు. అయినా సరే మా వీరూఒక సర్వీసు ను కట్ కొట్టి కోర్ట్ వదిలాడు.