15, డిసెంబర్ 2013, ఆదివారం

నారద మహర్షికి కోపం వచ్చిన వేళ

అఖిలాండ కోటి బ్రహ్మాండ కోటి నాయకుడైన శ్రీ మహా విష్ణువు తన  భక్తుల కోరికలు ..... ఆకాంక్షలు ... ఒక సారి Random గా  check   చేద్దామని వైకుంఠమ్ వీడి గరుడ వాహనధారి యై భూమండలం వైపు సాగుతున్న తరుణం లో "నారాయణ .....నారాయణ ....." అంటూ నారాయణ నామ జపం చేస్తూ ఎదురొచ్చిన  నారద మహర్షికి తనే కార్యార్ధమై వెడలుచున్నాడో వివరించగా .....

" మహానుభావా ..... నేను కూడా భూమండలాన్ని పోయిన యుగంలో మాత్రమే  దర్శించాను .... శ్రీవారికి ఆగ్రహం రాదనుకుంటే ఈ దీనుడిని కూడా తమ తో రావడానికి అనుగ్రహించవలసిందిగా  విన్నవించ దలచుకున్నాను "

" మహర్షీ ..... అటులనే ..... కానీ సర్వత్సంగ పరిత్యాగులు ..... శాంతమూర్తులు .... అయిన తమరు ఏ పరిస్థితులలోనూ కోపతాపాల వంటి మానవ లక్షణాలకు గురికాకూడదు ..... పరుషమైన పదములు వాడి తమను తమరే కించపరచుకొరాదు . "

"ప్రభూ .... తమరు నా సహజ లక్షణాలకు వ్యతిరేకమైన విషయాల గురించి సంశయానికి గురవుతున్నారు ...నేను ఆగ్రహం తెప్పిస్తాను కాని ఆగ్రహించను. తమకీ దీనుడిపై ఏలనో ...... "

"లేదు .... లేదు నారదా ..... మానవుల ప్రవర్తన నీ  ఉహాతీతంగా ఉండే ప్రమాదం ఉంది ......  కించిత్ ఆశ్చర్యంతో కూడిన అయోమయానికి గురవుతావేమో నని ముందుగానే కాస్త హెచ్చరిక గా ..... "

"అవన్నీ తమరు నాకొదిలెయ్యండి ...... ప్రభూ ..... తమరు నాతో గడిపిన ఈ సమయానికే భూలోకంలో తరాలు మారిపోతున్నాయ్ ..... సుబ్బాయమ్మ లు .... సుబ్బలక్ష్మి లు గానూ .... ఆ తరువాత .... సునీత లు గానూ మారి పోతున్నారు . మరిక శ్రీవారు తాత్సారం చేయక గరుడ వాహనాన్ని అధిష్టిస్తే తమతో బాటు ఈ దీనుడు కూడా ఆసీనుడై  ఉత్కృష్ట మానవ  నాగరికత లో ఉన్న విలువలను అవలోకించి ..... పులకించెదను ."

"విలువలు ..... నీ ఖర్మ ...... పద మహర్షీ ....... "

గరుడ వాహనం భూమి ని సమీపించుచున్నది .

"మహర్షీ ..... ఒక్క విషయం ..... మనమంత మనం తలిస్తే తప్ప నరుల కంట మనం.... మన వాహనం వారి కంట పడం . కాబట్టి నిశ్చింతగా .. నిర్భయంగా నాతో వారి సమక్షం లోనే సంభాషించవచ్చు ..... అంతే కాదు మీరు తలచి నప్పుడు వారితో నా మాదిరిగానే నేరుగా సంభాషించవచ్చు . "

"మహాద్భాగ్యం ..... దేవా .... ధన్యుణ్ణి ."

"ముందుగా మనం పూజాధిక కార్యక్రమాలు నిర్వహించే ఏదైనా గుడి వద్దకు వెళ్దాం. అలా అని పెద్ద తీర్ధాలకి కాదు. "
 కోలాహలంగా ఉన్న ఒక గుడి ముందు గరుత్మంతులవారు క్రిందకు దిగారు .

"కోలాహలంగానే ఉన్నది కాని నాకేదో అపశృతి ఉన్నట్లుగా అనిపిస్తోంది దేవా .... "

శ్రీ మహా విష్ణువల వారి చిద్విలాస దరహాసం నారదుల వారి కంగారుని రెట్టింపు చేసింది .

"జాగ్రత్తగా పరికించు మహర్షీ .... నేను రవ్వంత సేద దీరెదను "

ఠాక్కున ఆదిశేషుల వారు ప్రత్యక్షమయ్యారు .... తన కర్తవ్య నిర్వహణకు .

" ఒక్క నిముషం దేవా ..... ఇంతమంది పురోహితులు ..... పూజారులు ..... ఆ వృద్ద బ్రాహ్మణుడి పై  ఏల విరుచుకు పడుచున్నారో నాకు లేశ మైనా అవగతం కావడం లేదు ....పైగా వారంతా చాలా అపభ్రంశపు భాష వాడుతున్నారు ..... అతగాడు చేసిన నేరం .... వారి కేకల మధ్య నా చెవికెక్కడం లేదు ...."

" ఈ గుడి దర్శించుకుని బయటకు వచ్చు వారికి అతగాడు తను నమ్మిన తత్త్వం విపులీకరిస్తున్నాడట ..... అదీ వారి క్రోధానికి కారణం "

"ఏమా తత్త్వం దేవా ... "

" ప్రజలంతా పుణ్యం కోసం ..... మోక్షం ...కోసం ఇంత దూరం రానవసరం లేదు ...... కేవలం ఇది జీవితాల్లో ఒక క్రమ శిక్షణకు ....దోహదం చేస్తుంది అంతే "

"అతడి తాత్విక చింతన సరైనదేనే ...... పైగా అది శ్రామిక కవి అయిన పోతన చేత ఏనాడో మహాభాగవత గ్రంధంలో ... ఇందుగలడందు లేడనే ... పద్యం ద్వారా ఎప్పుడో ప్రాచుర్యమైనది ..... సత్యాన్ని నలుగురికీ బోధిస్తున్నందుకు .. సాక్షాత్తూ తమకు పూజాదిక కర్తవ్యాలు నిర్వర్తించే వారే దుర్భాషలాడుటయా .... ?"

"సత్యాసత్యాలతో వారికి సంబంధం అంతగా ఉండదు కానీ ఈ సత్యం ప్రజల మనసుల్లో స్థిర పడితే తమకు ముప్పు వచ్చునని వారి చింత "

"సత్యాన్ని మరుగున పరచి ప్రజలను మోక్ష మార్గం పేరు మీద మూర్ఖ మార్గం పట్టించడం పాపం కదా ప్రభూ ... "

"నిజం కావచ్చు మహర్షీ ..కానీ తమరిని  అబ్బుర పరిచే విషయాలు మున్ముందు ఇంకనూ ఉన్నవి కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలి మనం కాస్త ముందుకు సాగుదాం . "

ముందుకు సాగారు

"ఆగుము దేవా ... ఇదేదో భక్తుల ఊరేగింపు వలే ఉన్నది . కానీ వారి భక్తి గీతములు నాకు అర్ధం కాకుండా ఉన్నవి .... కాస్త వారి మాతృ భాష యందు నాకు ప్రవేశం కల్పించు వరము ప్రసాదించు దేవా .... "

"అనుగ్రహించితిని "

ఒక్క నిముషం పూర్తి కాకుండానే నారద మహర్షి ఆర్తనాదం మొదలయ్యింది

"అయ్యో ... అయ్యో .... ఈ అప్రాచ్యపు ...... అసందర్భపు ...... జంతువుల మధ్య శృంగారాన్ని వర్ణించే ఈ మదనష్టపు పాటను ... ఈ కార్తీక ఏకాదశి రోజు జరుగుతున్న ఊరేగింపులో గగుర్పాటు కలిగించే ధ్వనితో ..... మహా ప్రభూ నేనిక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను . ఇది భక్తి మార్గం ... మోక్ష మార్గం కాదు అని ఇక్కడుండే ధర్మ పరిరక్షక బృందాలు ..... పీఠాదిపతులూ ఈ పామర జనాన్ని సవ్య మార్గంలో నడిపే ప్రయత్నం చేయరా ?

" చేయరు "

"ఏల  ప్రభూ ?"

"అప్పుడు వీరంతా వారిని సేవించరనే భయంతో .... "

"అత్యంత గర్హనీయమైన విషయాన్ని చాలా తేలికగా సెలవిస్తున్నావు దేవా .... కనీసం ఆ పీఠాదిపతులకైనా మోక్షం కావాలి కదా .... ?"

"దాని కోసం వారి నమ్మకాలు వారికున్నాయ్ ..... కానీ అప్పుడప్పుడు ధర్మ వ్యాధుడు ..... కౌశికుల సంవాదం లాంటివి కొంతమంది చదివి మారే వారు కానీ ఇప్పుడు ఎవరి మనసులో ఉండే వికారాల ప్రకారం వారు పోతున్నారు . అసలు నాలోనే చాలా వికారాలు ఉన్నట్లు వారి నమ్మకం . "

"అయ్యో ... అయ్యో ..... ఘోరం ...... అపచారం ...... దేవా ...... "

"ఇప్పుడు నిన్నొక భక్తురాలి చెంతకు కొని పోతాను ..... అక్కడ ఆమెతో  మన నిజరూపo  తో సంభాషిద్దాం .... "

"మహద్భాగ్యం ... పదండి ప్రభూ ..."

వీరూహించినట్లుగానే ఆ భక్తురాలు పలుమార్లు కలయో నిజమో అర్ధం కాక సృహ తప్పి మరలా మెలకువలోకి రావడం జరిగింది .

"ఉండండి  ... ఈ అరటి పళ్ళూ .... కొబ్బరి చెక్కలూ ప్రతి రోజూ తినేవే .. .... మొన్నీ మధ్య మా వారు అధికారం లో ఉన్నప్పుడు బహుమతు లుగా వచ్చిన జీడి పప్పు అచ్చులు పెడతాను ..." అంటూ ఆవిడ లేవ బోతుంటే ఇరువురూ బలవంతంగా ఆపారు .

" చూడు ... అమ్మాయీ ..... ఈ మధ్య వరకూ అంటున్నావు ..... ఇప్పుడు మీ వారు అధికారం కోల్పోయారా ?"  నారద మునీంద్రుడే సంభాషణ ప్రారంభించాడు.

ఆమె కళ్ళు తుడుచుకున్నది .

"అంతా తెలిసే నన్ను అడుగుతారేమి స్వామీ ... "

" కానీ నీ నోటి వెంట ఈ విషయంలో నీ అంతర్మధనాన్ని కూడా తెలుసుకోవాలని కోరికగా ఉంది అమ్మాయీ .. "

"అడగండి స్వామీ ... "

"మీ వారు అధికారాన్ని కోల్పోయి చెరశాల పాలవడానికి కారణమేదని భావిస్తున్నావ్ ?"

"ఇంకేముంది స్వామీ ..... ఈ ఇంటిలోని వాస్తు దోషమే తప్ప మరేమీ కాదు "

"ఆంటే మీ వారు చేసిన అపరాధమేమీ లేదా ?"

"ఈ రోజుల్లో ఆ మాత్రం తప్పు చేయనివారేవరుంటారు ..... మీరు మరీ పెద్దదిగా చూస్తున్నారు గాని . తప్పు చేసిన వారందరినీ లోపలేయ్యాలంటే ఈ దేశాన్నే జైలు గా మార్చేయాలి " ఆమె నారదుల వారిని దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నించింది .

"అంటే అపరాధం చేసినా కూడా శిక్ష అనుభవించవలసిన అవసరం లేదని నీ ఉద్దేశ్యమా ?" ఎందుకో నారదుల వారి గొంతు లో తీవ్రత పెరిగింది .

"అదేమిటి స్వామీ అలా అంటారు ..... గుడి కడతామని ఇంటికి వచ్చిన వారందరికీ 10000 రూపాయలకు తక్కువ కాకుండా ఇస్తూనే ఉన్నాం ..... "ఆవిడ చాలా నిష్టూరంగా మాట్లాడింది . 

"మీ వారు సంపాదించిన దాంట్లో ఇది ఎన్నో వంతు ?"

"మీరలా అడగరాదు స్వామీ ..... " ఆమే మరి కాస్త దగ్గరికి వచ్చి 

"మొన్నీ మధ్యే  20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్వామి వారి చేతికి వజ్రాలు పొదిగిన కంకణం కూడా చేయించాం . అయినా స్వామి కరుణ లేకుండా మా వారిని అలానే వదిలేసారు "

నారదుల వారు ఆపాదమస్తకం ఆవేశంతో ఊగిపోవడం ప్రారంభించారు. 

"అంటే ... కోలా కంపెనీల వాళ్ళు వెయ్యి కోట్ల రూపాయలతో గుడి కట్టిస్తే ఏడాది మొత్తం ఎండలు కాయించాలన్నమాట. అసలు నిన్ను ...... " 

"ఆగు మహర్షీ ... తమ తపో బలాన్ని వృధా చేసుకోవద్దు " శ్రీ మహా విష్ణువుల వారు అడ్డు పడ్డారు

"ఛీ ... ఛీ ...... ఇదేమి ప్రజలు ప్రభూ ..... వీరి పాలకులు కూడా వీరినేమీ పట్టించుకోరా ...... "

"పిచ్చి నారదా .... యుగాల నుండి చూస్తున్నావ్ ...... పాలకులకు ప్రజలెంత మూర్ఖంగా ఉంటే పాలకులకంత లాభం . అధికార పతాకం ఏదైనా గాని పునాదుల నుండి మూర్ఖత్వాన్ని తొలగించే ప్రయత్నం చేయరు ..... పైగా ఈ విషయంలో ఏ మతమైనా కానీ .... మతాధిపతులు .... పాలకులు ఒకరికొకరు రక్షగా కూడా ఉంటారు . "

"మరి  నిజమైన భక్తులు ఉండరా ..... చాలా నిస్తేజంగా ఉన్నది . "

"నేనెప్పుడూ ఆశావాది గానే ఉండాలి మహర్షీ ..... నాకు నిస్తేజం ఆవహిస్తే లోకాలేమీ ఉండవు . ఎవరైతే ధర్మవ్యాదునిలా ఒకరికి అపకారం జరగకుండా తన కుటుంబ ..... సామాజిక భాద్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారో  వారే నా అసలైన భక్తులు. వారు  పూజలు ... పునస్కారాలు చేయనక్కర లేదు. వారు సంఖ్యలో గణనీయంగా ఉన్నారు కానీ చెట్టుకొకరు ... పుట్టకొకరుగా  ఉన్నారు. వారు నా అవసరం లేకుండానే ఈ లోకాన్ని మారుస్తారు."